Tuesday, February 1, 2011

చీపురు పట్టుకుని మా తాతయ్యగారి వాకిలి ఊడ్చిన ఒబామా!

చీపురు పట్టుకుని మా తాతయ్యగారి వాకిలి ఊడ్చిన ఒబామా!

అబ్బో! ఏమిటి నాయనా ఈ స్టేటుమెంటు? మళ్లీ ఏం తీర్థం పుచ్చుకొచ్చావ్?

తీర్థం పుచ్చుకోటమేమిటీ నిన్ను తగలెయ్య, నేనేమన్నా తాగుబోతుననుకున్నావురా?

తాగి మాట్లాడకపోతే మరి ఆ పైన స్టేటుమెంటు ఏమిటి? ప్రపంచాన్ని శాసించే ఒబామా, మీ తాతగారి వాకిలి ఊడవటమేమిటి?

అసలు మొదలెట్టనిస్తావా?

ఊం! చెప్పు! చెవులున్నాయిగా ? చస్తామా వినక!

సరే సంభాషణ వదిలేసి, ఉపోద్ఘాతం వదిలేసి సరాసరి కథలోకి - సాధారణంగా మనిషికొచ్చే కలల్లో 99.5 శాతం నిద్ర నుంచి లేస్తూనే పలక మీద తడిగుడ్డేసి తుడిచేసినట్టు సోదిలోకి రాకుండా ఎక్కడికో పరుగులెత్తుకుంటూ వెళ్లిపోతాయ్. మిగిలిన .5 శాతం కలల్లో .3 శాతం కలలు కొద్దిగా నిద్ర లేచాక కూడా కొద్దిగా గుర్తు ఉంటవి. అయితే ఆ "గుర్తు" మిగలడానికి, మిగుల్చుకోడానికి కొద్దిగా కష్టపడాలి. మిగిలిన .2 శాతం మటుకు కష్టపడనఖ్ఖరలేకుండా గుర్తు ఉంటాయి. ఇదీ నా థియరీ. ఈ నా థియరీకీ ఊతం స్వీయ అనుభవమైన నా కలలే - అవే నా అనుభవాలు. అలా .2 శాతంలోకి పడిపోయింది ఈరోజు పొద్దున్నే వచ్చిన కల.

ఇహ కలలోకి వచ్చేస్తూ -
పాత్రధారులు / కలలో కనపడ్డది వీరే:
అ) మూడు ఒంగోలు గిత్తలు
ఆ) సాయి రాం
ఇ) అమ్మమ్మ
ఈ) అమ్మ
ఉ) ఒబామా
ఊ) ఒబామా గారి పిల్లలు
ఋ) పిచ్చమ్మ గారి గేదెలు
ౠ) చీపురు కట్ట
ఎ) తాతయ్య అట్లాస్ సైకిలు

"భుజాన పుస్తకాల సంచీతో ఎనిమిదేళ్ల సాయిరాం (1 *) , శివాలయం పక్కనుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంటికి తిరిగే సందు చివర ఓ పశువుల కొట్టం. ఆ పశువుల కొట్టంలో సాయిరాంకి ఎంతో ఇష్టమైన ఒంగోలు గిత్తలు. ఆ గిత్తల్ని రోజూ నిమిరినట్టే నిమురుదామని కొట్టంలోకి సాయిరాం ప్రవేశం. అడుగుపెట్టటం ఆలస్యం ఆ మూడు గిత్తలు అమాంతంగా ఎవరెష్టు అంత ఎత్తుకు ఎదిగిపోతాయి (మాయాబజారు ఘటోత్కచుడిలా అన్నమాట!). అందులో ఒక గిత్త ఎవరెష్టు ఎత్తునుంచి తల కిందకు వంచి సాయిరాం భుజాన ఉన్న పుస్తకాల సంచీని నమలటానికి ప్రయత్నిస్తూ ఉండగా సాయిరాం పుస్తకాల సంచీని ఇవతలకు లాక్కుంటూ గిత్తను అదిలిస్తాడు. వేంఠనే గిత్త నుదురు మీద "శివ" అనే బంగారు అక్షరాలు మెరవటంతో సాయిరాం భయపడి ఓం నమశ్శివాయ అని ప్రార్థిస్తూ కొట్టం బయటకు పరిగెత్తుకుపోతాడు. 

ఇంటికి చేరి, అరుగుల మీద కూర్చుని పుస్తకాల సంచీ పక్కనబెట్టగానే, తెల్లచొక్కా నల్లపాంటుతో ఓ మనిషి, అదేనండీ ఒబామా - ఇద్దరు పిల్లలతో ప్రత్యక్షం. ప్రత్యక్షమవుతూనే అరుగు మీద ఓ పక్కగా, మూలకు నుంచోబెట్టిన చీపురు కట్టను తీసుకుని "అక్కయ్యను పట్టుకుని కాలితో తంతావా? నువ్వు ఈవేళ సూపర్ బవులు మాచు చూసేందుకు లేదు. రాఘవయ్యగారి ఇంటిముందు, ఇక్కడ కూర్చో ఇరవై నిముషాలు" అంటూ ఆ చీపురు కట్టతో తాతయ్యగారి (2 *) వీధి వాకిలి శుభ్రంగా ఊడ్చేసి, ఆ చిన్నపిల్లని తాతయ్య అట్లాస్ సైకిలు (2 *) పక్కన కూర్చోబెట్టి పెద్దమ్మాయిని తీసుకుని వెళ్లిపోతాడు. 

ఇంతలో సాయిరాం వాళ్ల ఇంటి సందులోనుంచి రోజూ వెళ్లే పిచ్చమ్మ గారి (3 *) గేదెల గుంపు ప్రత్యక్షం. వాటి మానాన అవి వెళ్లిపోకుండా తాతయ్య గారి ఇంటి వాకిలి ముందు, వాకిలికి అడ్డంగా కూర్చుని నెమరు వేస్తూ ఉంటాయి. ఒబామా వాళ్ల చిన్నపిల్ల గేదెల్ని చూసి భయపడిపోయి సాయిరాం భుజాల మీదకు ఎక్కేయ్యటం, సాయిరాం ఆ అమ్మాయి భుజాల మీదకెక్కగానే నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయి, బావి దగ్గర ఉన్న చప్టా మీద ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, భయపడకు, ఇక్కడే ఉండు అని చెప్పి వెనకనున్న పాక తలుపు తీయగానే భుజం మీద ఆరో నంబరు కాలువలో ఉతికిన బట్టల మూట వేసుకుని లోపలికి వస్తున్న అమ్మమ్మ. 

లోపలికి వస్తూనే, ఎలా తెలిసిందో ఇంటి ముందు గేదెలున్నాయని, ఏరా తాతయ్య గుళ్లోంచి వచ్చే వేళయ్యింది ఆ గేదెల్ని తరుము, అవి అక్కడినుంచి పోకపోతే తాతయ్య లోపలికి రావటానికి మధ్యలో దారి చెయ్యి, అలాగే తాతయ్య వచ్చాక ఆయన కాళ్లు చేతులు కడుక్కునేలోగా ఆయన సంచీలోనుంచి కొబ్బరి నీళ్లు తీసుకుని తాగు అని అంటుంది. ఇంతలో అమ్మ కేక - ఎక్కడున్నావురా? ఏం చెప్పారు ఈవేళ స్కూల్లో అని. "

ఆ కేకకు మెలకువ వచ్చేసింది. అదండీ ఈవేళ్టి కల సంగతి....పొల్లుపోకుండా ఎందుకు గుర్తుండిపోయిందో అర్థం కాలా కానీ, నిద్ర లేచాక ఇంకా చల్లపల్లి తాతయ్యగారి ఇంటి అరుగుల మీద కూర్చునే ఉన్నానన్న "ఫీలింగు"తో ఆఫీసుకు వచ్చేసా...

ఇహ ఈ కల గురించి నా "ఇంటర్ప్రిటేషన్స్" నాకున్నాయి కానీ, మీరేమని విశ్లేషిస్తారో చూడాలని ఇక్కడ ఇలా పోష్టు చెయ్యటమైనది....కలల స్పెషలిష్టు ఎవరన్నా ఉంటే వారి అభిప్రాయం పంచుకుంటే మరింత సంతోషం.....

స్థూలంగా - స్టార్ల (*) బాక్ గ్రవుండు ఇదీ:
2)మా తాతయ్య, అమ్మ వాళ్ల నాన్న - రాఘవయ్య గారు రోజు సైకిలు తొక్కుకుంటూ మోపిదేవి వెళ్లేవారు.  మధ్యాహ్నం పూట ఇంటికి వస్తూ పిల్లలకు ఓ మూతున్న మరచెంబులో కొబ్బరి నీళ్లు తీసుకొచ్చేవారు. తాతయ్య దాదాపు యాభై ఎనిమిది ఏళ్లు పూజారిగా సుబ్రహ్మణ్య స్వామిని సేవించుకున్నారు. ఆయన నాన్న అంటే పెదతాతయ్య యాభై ఏళ్లు అదే గుళ్లో స్వామిని సేవించుకున్నారు. ఇప్పుడు మావయ్య వంతు...
3) పిచ్చమ్మ గారని, ఒకావిడ తాతయ్య వాళ్ల ఇంటి వెనకాతల సందులో ఉండేవారు. పేద్ద పాడి ఉండేది వారికి. ఆ గేదెలు రోజూ మా ఇంటి సందులోనుంచే వెళ్లేవి - మేయడానికి కానీ, స్నానాలకు కానీ..

 చల్లపల్లిలో తాతగారి ఇల్లు ఈ క్రింది బొమ్మలో చూడవచ్చు...
"తాత" అని నల్లగా హైలైటు చేసిందే మా తాతయ్యగారి ఇల్లు 


మరి (1 * ) ఏది బాబూ?

ఓ - సాయిరాం ఆ ? బానే పట్టావే - అయితే పోష్టు మొత్తం చదివావన్నమాట. సాయిరాం అంటే నేనే! మా అమ్మమ్మ నన్ను ముద్దుగా పిల్చుకునే పేరు. ఆవిడ షిర్డీ సాయి భక్తురాలు... ఇప్పుడు తాతయ్య, అమ్మమ్మ ఇద్దరూ లేరు కానీ - వాళ్ల జ్ఞాపకాలు? ...

గిత్తలు, అట్లాసు సైకిలు, గేదెలు , ఒబామ, పిల్లలు, తాతయ్య , అమ్మమ్మ - ఇలా బొమ్మ లు నాకు వెయ్యటం రాదు కాబట్టి బతికిపోయారు కానీ, లేకుంటే అన్నీ వేసి చూపించేవాడినే....

(Post 418)

17 comments:

 1. కలలో వచ్చిన చిత్రపటాలు యాజ్ ఇట్ ఈజ్ గా బ్లాగుల్లోకి ఎక్కె రోజుల్ని తెచ్చినందుకు థాంక్సులు

  ReplyDelete
 2. గిత్తలు, అట్లాసు సైకిలు, గేదెలు , ఒబామ, పిల్లలు, తాతయ్య , అమ్మమ్మ - ఇలా బొమ్మ లు నాకు వెయ్యటం రాదు కాబట్టి బతికిపోయారు కానీ, లేకుంటే అన్నీ వేసి చూపించేవాడినే....
  మళ్ళీ థాంక్సులు

  ReplyDelete
 3. baga raasaru. naaku kooda kalalu vastayi and also gurtuntai. probably nidra ekkuvai vacche kalalu baga gurtuntayemo

  ReplyDelete
 4. బాగుందండయ్యా ఇదేదో.
  జపాన్ హోండా కంపెనీలో రోజూ పొద్దున్నే ఉద్యోగులు వస్తూనే వారికొచ్చిన కలల్ని ఇలా బొమ్మల్లో గీసి చూపెట్టాలట,ఒకవేళ వాళ్ళు గియ్యలేకపోతే వాళ్ళు చెప్తుంటే చిత్రకారులు చేత ఊహాచిత్రాల్ని గీయిస్తారట.ఆ తర్వాతా వాటిని పరిశోధించి సాధ్యాసాధ్యాలు నిర్ణయిస్తారని ఎక్కడో చదివినట్టు గుర్తు.

  ReplyDelete
 5. చాలా ఆసక్తికరంగా రాసారు. బాగుంది.

  ReplyDelete
 6. వంశీ గారూ,

  మన చల్లపల్లి ని మళ్ళీ కళ్ళముందు చూపించారు. నెనరులు.అలాగే రాజా గారి హై స్కూలు మొత్తం ఒక్కసారి చూపించండి, చదివిన గదులు మళ్ళి చూసుకుంటా. :) అన్నట్లు ఆ అవనిగడ్డ రోడ్డు ని కొంచం పొడిగించి మలుపు తిప్పితే పడమటి వీధి,అక్కడ బ్రహం గారి గుడి దగ్గర కుడి వైపుకు తిరిగి 1/2 మైలు వెళ్ళిటే పాగోలు గ్రామం, గుర్తుందా, అదే నా జన్మభూమి.

  నెనరులు
  నేనుసైతం (నరహరి)

  ReplyDelete
 7. రాజేంద్ర గారు - :) రోజుల్దేముంది లెండి - పటాలు ఉన్నా వస్తాయి, లేకపోయినా వస్తాయి. కల కనటం ముఖ్యం. గుర్తుపెట్టుకోటం మరింత ముఖ్యం. ఇటేపు వచ్చినందుకు, కామెంటినందుకు మీకే బోల్డు థాంకులు...

  రవి - మీరు అటు తెలుగులోనన్నా రాయండి, లేదా ఇటు ఇంగ్లీషులో అన్నా రాయండి. అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా రాస్తే నాబోటి వాళ్లతో తంటా. Theory ప్రకారం మీకు వస్తాయి and also గుర్తుంటాయి కాబట్టి, మీరు ఈ రెండిట్లో One అయ్యుంటారని ఘాట్టి నమ్మకం - కుంభకర్ణాస్ brother, నిద్రాదేవీస్ son. అయినా లెక్ఖ ప్రకారం మీ Name కు Sleepకు బద్ధవిరోధం ఉండాలే...అయినా You remember అన్నారు కాబట్టి Write చేసి పారెయ్యండి. We will సంతోషిస్తాం.

  శ్రీనివాస్ - బాగుందన్నందుకు టపా ధన్యం. ఆ హోండా కథ తెలియజేసి ఇబ్బందిలో పడేసారు. ఇప్పుడు మా ఊర్లో అలాటి కంపినీ ఏదన్నా ఉందేమో ఎతుక్కోవాలి ఇప్పుడు...

  నాగన్న - ఏ విధమైన ఆసక్తి కలిగిందో తెలియచెయ్యండి.

  నరహరి - పాగోలు జన్మస్థలమా! మా అమ్మవాళ్ల మేనమామ పాగోలులోనే ఉండేవారు. పాగోలు, కొక్కిలిగడ్డ ఇవ్వన్నీ అలా సాయంత్రాలపూట మా మావయ్యలతో పాటు సైకిళ్ల మీద తిరిగినవేగా! రాజావారి హైస్కూలు ఫోటోలు, కోట ఫోటోలు అన్నీ హైదరాబాదులో ఉండిపోయినాయి....ఈసారెళ్ళినప్పుడు తీసుకొచ్చి కథా కమామీషుతో ఓ టపా వేస్తా..అందాకా మీరు ఓపిక పట్టవలె....

  ReplyDelete
 8. బాగుంది కల. ఇంతకీ ఒబామా తెలుగులో మాట్లాడాడా ఇంగ్లీషులోనా?

  ReplyDelete
 9. ఎప్పుడు నేర్చుకున్నాడో తెలియదు కానీ ఒబామా మాట్లాడింది తెలుగులోనేనండి.

  ReplyDelete
 10. అయితే శెభాష్! అలాంటి కలగన్నందుకు మీకు మరో రెండు వీరతాళ్ళు :-)

  ReplyDelete
 11. మరి ఎలాగూ వచ్చాడు కదా అని ఒబామాకు పద్యాలు,కవితలు గట్రా వల్లెవేయించారా??

  ReplyDelete
 12. బలే కల...మీలాగే నాక్కూడా నా కలల్లో ఎప్పుడూ నేను పుట్టి పెరిగిన ఊరు,ఇల్లు మాత్రమే వస్తాయి. కల ఎలాంటిదైనా ప్రదేశం మాత్రం మా ఇల్లే.

  అంటే ఆ పాత తీపి జ్ఞాపకాలు మనసు లోతుల్లో పీఠం వేసుకు కూర్చున్నయన్నమాట....అవి లేకుండా మన ఉనికి లేదన్నమాట. ఇక ఒమాబా అంటారా...రోజూ చూస్తున్న, వింటున్న మొహం కదా అందుకే అది అలా అలా మీ మనసులోతుల్లోకి వెళ్ళి మీ జ్ఞాపకాల మధ్యలో ఇరుక్కుపోయిందేమో!

  ఒకసారి బాగా గుర్తు చేసుకోండి....మీ చిన్నతనంలో అలా మీ ఇల్లు ఊడుస్తూ మిమ్మల్ని ఎవరైనా బాగా తిట్టుంటారు :D

  ReplyDelete
 13. ఒక చిన్న సమాచారం కావాలి, ఇస్తారా?
  మీ బ్లాగులో పెట్టిన font పేరు, సైజు ఏమిటి? చదవడానికి బావుంది. అచ్చులో ఉన్న తెలుగు పుస్తకాలు చదువుకున్నట్టు ఉన్నాది.

  ReplyDelete
 14. చల్లపల్లి కోట విశేష౦ చెబుతారా :)

  ReplyDelete
 15. మౌళి - చల్లపల్లి (దేవరకోట) కోట, జమిందారీల విశేషాలు వెబ్సైటులో సంస్థానములు సెక్షన్లో చూడవచ్చు. మా తాతగారి దగ్గరినుంచి విన్న వివరాలు, అదీ-ఇదీ సెక్షన్లో జమీందారీలు అని ఉన్న బొమ్మ నొక్కి చూడవచ్చు.

  సౌమ్య - మీరొక్కరే కలకు కారణభూతం కనుక్కోడానికి ప్రయత్నించారు కాబట్టి, కామేశ్వర రావు గారు నాకు వేసిన వీరతాళ్లు మీకిచ్చేస్తున్నా. అయితే ఒకటే లోపమేమనగా - మీ ఆ కారణమూ, భూతమూ నాకెప్పుడూ ఎదురు కాలా....నా "ఇంటర్ప్రిటేషన్స్" గురించి రాయాలంటే ఓ పేద్ద పోష్టవుతుంది కాబట్టి, తీరిగ్గా తర్వాత....క్లుప్తంగా ఇప్పుడు
  అ) ఈ మధ్య గుళ్లో రుద్రపారాయణానికి వెళ్లినప్పుడు, అనగా ఓ రెండువారాలుగా వివిధ చీకాకుల వల్ల, మనసు శివయ్య మీద లగ్నం చెయ్యట్లా....అందుకు - ఓ తాపు తన్నడానికి నందిని పంపించాడు శివయ్య...
  ఆ) ఒబామా ఎందుకొచ్చాడో చూచాయగా తెలుసు కానీ, ఇక్కడ రాసేది కాదు.
  ఇ) కొబ్బరి నీళ్లు, అమ్మమ్మ ఎందుకొచ్చారంటే - కల వచ్చిన రోజు రాత్రి పడుకోబోయే ముందు మా ఆవిడ సేఫ్ వే అనే స్టోరులో కొబ్బరి నీళ్లు దొరికాయని ఓ నాలుగు టెట్రాపాకులు తీసుకొచ్చింది. ఆ కొబ్బరి నీళ్లేమో హవాయి కొబ్బరికాయలనుంచి తీయబడ్డాయని ఆ పాకుల మీద రాసుంది. చాలా దిక్కుమాలిన దరిద్రంలా ఉన్నాయి. చప్పున అమ్మమ్మ, తాతయ్య, కొబ్బరినీళ్లు గుర్తుకొచ్చాయి. అదే సంగతి కలలోకి వచ్చింది....
  ఇహ ఇంతటితో క్లుప్తమ్ సమాప్తం....

  జ్యోతి - ఒబామా ఉన్నది సరిగ్గా మూడు నిముషాలు. రెండు నిముషాలు ఊడవటమే సరిపోయింది. ఓ నిముషం చిన్నమ్మాయిని కూర్చోపెట్టటానికి, పెద్దమ్మాయిని తీసుకొనిపోటానికి సరిపోయింది. పద్యాలు, వల్లెలు అంటే ఆ చీపురు నా మీదే తిరగేసేవాడేమో! అయినా తెలుగులో మాట్లాడాడుగా అదే ఆనందం, పరమానందం...

  ReplyDelete
 16. వంశీ గారూ,

  మీకు అభ్యంతరం లేకుంటే, మీ మేనమామ గారి పేరు చెబుతారా? నాకు తెలిసే ఉంటారు. నా ఈమెయిలు కి అయినా తెలుపగలరు.

  -నరహరి

  ReplyDelete
 17. నరహరి గారూ

  మా మేనమామ కాదు, మా అమ్మవాళ్ల మేనమామ - ఆయన పేరు శ్రీ హేమాద్రి శేషయ్య...కాకుంటే వారు పాగోలులో నాలుగైదు సంవత్సరాలే ఉన్నారు...తరువాత పెదప్రోలులో నివాసం ఏర్పరచుకున్నారు

  ReplyDelete