Tuesday, February 15, 2011

కాపీలందు టివి.9 కాపీ వేరయా!

కాపీలందు టివి.9 కాపీ వేరయా!

వీరి విన్యాసాలకు, కాపీలకు, అక్నాలెడ్జిమెంటులు లేని ప్రసారాలకు చెయ్యెత్తి జై కొట్టవలెను.

సంగతి ఏమనగా - ఈ మధ్య అనగా 12వ తారికున కాబోలు Legendary Cinematographer Sri Marcus Bartley గారి గురించి ఒక కార్యక్రమం ప్రసారం చేసారుట. దాని సంబంధించిన వీడియో లింకులు ఇక్కడ

FYI - If Clicking on the above link does not work - copy the below text and paste it in your browser

http://www.gulte.com/videos/watchvideo.php?mantra-nagari--cinematographer-marcus-bartley&vid=10017

ప్రసారం చేసినందుకు సంతోషమే! ఐతే మార్కస్ వారికి సంబంధించిన సమాచారం, ఫోటోలతో సహా 80+ % ఈ మదీయ వెబ్సైటు నుంచి ఎత్తి అక్కడ ఆ వీడియోలో పోసారు.

కనీసం అక్నాలెడ్జిమెంటు ఇవ్వాలన్న ఒక నీతీ, నియమం లేకుంటే ఎట్లా అన్నది ప్రశ్న!!

ఓవర్ లుక్ అయిపోయినదన్న సమాధానం వస్తే అంతకన్నా "సంతోషకరమైన" వార్త ఈ ప్రపంచంలో లేదని తెలియచేసుకుంటూ.....ఫెయిర్ యూసేజ్ కిందకు వస్తుందన్న సమాధానం వస్తే - అబ్బో! మరింత సంతోషకరమైన వార్త అనీ తెలియచేసుకుంటూ....

శ్రీ మార్కస్ బార్ట్లే గారి వెబ్సైటు కోసం అడగగానే వారి గురించిన అపురూపమైన వీడియోలు, ఫోటోలు అందించిన పరుచూరి శ్రీనివాస్, "సినిమా సినిమా" కార్యక్రమ సారధి శ్రీ సాయిచంద్, మార్కస్ బార్ట్లే వారి కుమార్తె మార్సియా గారికి హృదయ పుర్వక కృతజ్ఞతలతో.....

ఇంతకీ ఏమిటంటావు నాయనా?

మీకు పబ్లిసిటీ కావాలా? వెబ్సైటుకు పబ్లిసిటీ కావాలా?

నాకు కాదు చిన్నారి - వెబ్సైటు కోసం అపురూపమైన సమాచారం అందించిన ఈ పై ముగ్గురి కష్టం కోసం ఓ నిముషం బాధ పడ్డానన్నమాట...

కొసమెరుపు: ఒకాయన ఎవరో నెట్టులోనుంచి వీడియోలు డవున్లోడు చేసుకునిన్నీ, ఇలాటి టి.వి కార్యక్రమాలూ అవీ రికార్డు చేసుకునిన్నీ 300 Rs కి హైదరాబాదులో అమ్ముకుంటున్నారన్నమాట కూడా వినపడింది. ఇహనేం! ఏక్ నిరంజన్!

Tuesday, February 8, 2011

క్రితం మూడువారాల్లో చదివిన పుస్తకాల జాబితా ఇదీ !!

జనవరి 22వ తారీకు నుంచి ఈవేల్టి దాకా - అనగా దాదాపు మూడువారాల్లో చదివిన పుస్తకాల జాబితా ఇదీ

(Jan 1st - 21st List is here - http://janatenugu.blogspot.com/2011/01/blog-post_21.html )

ఈ సారికి బోషాణంలోని తెలుగు పుస్తకాలొదిలేసి అందులోనే ఓ మూలకు బిక్కు బిక్కుమంటూ చూస్తూన్న ఆంగ్ల పుస్తకాల మీదకు మనసు పోయింది.ఏవిటి బాబూ? ఏం చదివావు?

ఇదిగో ఇవే
 • Religion And Culture - 1968 - Sri Sarvepalli Radhakrishnan - Orient Paperbacks
 • Recovery of Faith - 1955 - Sri Sarvepalli Radhakrishnan - Orient Paperbacks

సర్వేపల్లివారివే ఇతర పుస్తకాలు మరి కొన్ని -
 • The Present Crisis Of Faith, The Creative Life, Our Heritage, Towards A New World, Living With A Purpose, True Knowledge

సర్వేపల్లివారివి అయిపోయాక చదివినవి ఇవీ 
 • Patanjali Yogasutras - 1966 - Swami Vasantananda - Divine Life Society
 • Stories From The Mahabharata - Swami Sivananda - 1943
 • The Symbolism Of Hindu Gods And Rituals - A.Parthasarathy - 1983 - Vedanta Life Institute
 • Upanishads In Story aAnd Dialogue - R.R.Diwakar - 1981
 • Stories For The Innocent - Sri C.Rajagopalachari - 1982 - Bharatiya Vidya Bhavan
 • Uddhava Gita (The Last Message Of Srikrishna) - 1978


ఇవి కాక - క్రితంసారి హైదరాబాదు వచ్చినప్పుడు తెచ్చుకున్న పాకెట్ పుస్తకాలు ఓ నాలుగు...ఏవా? ఇవే - అప్పుడెప్పుడో మా బాబాయి తెచ్చివ్వగా నేను భద్రంగా మూడు దశాబ్దాల పాటు దాచుకున్న చిన్నప్పటి బంగారాలు.....

 1. Lew Wallaces's - Ben-Hur
 2. Howard Pyle's - The Merry Adventures Of Robinhood
 3. Mark Twain's - The Adventures Of Tom Sawyer
 4. James Fenimore Cooper's - The Last Of Mohicans

పాకెట్ పుస్తకాలంటే ఏదో అనుకునేరు - దిట్టమైనవే - 240 పేజీలు ఒక్కోటి...అయితే చిన్న సైజు పుస్తకాలవ్వటం వల్ల, నాలుగూ కలిపి రెండు రోజుల్లో ఐపోయినాయి.

రివ్యూలు గట్రా అడక్కండి....వీలున్నప్పుడు ఎప్పుడైనా తరువాత...ఇప్పటికి బొమ్మలు చూస్కోండి....

మరి ఈ కిందనున్న మూడు పుస్తకాలూ ఎవరికి?


వాల్యూం - 1 అసలు ఈ పుస్తకం అందులోని బొమ్మలు చూసి అప్పుడెప్పుడో ఓ 9 ఏళ్ల క్రితం కొన్నా.....కళ్లు చెదిరిపోయేలా ఉంటాయి, అద్భుతమే మాట అన్నమాట....వాల్యూం - 2, 3 ఈ మధ్యే కొన్నా. వాటిల్లోని బొమ్మలకు ఆ వాల్యూం - 1 లోని బొమ్మల కళ రాలేదు కానీ, ఫరవాలా....పిల్లలున్న ఇంట్లో ఉండాల్సిన పుస్తకాలు...

దిబ్బరొట్టి అబ్బాయి - విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైన అరుదైన ఆడియో

దిబ్బరొట్టి అబ్బాయి

ఒక పాత ఇంగ్లీషు కథ ఆధారంగా జేజిమావయ్య శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రూపొందించిన కథాపదం

ఇందులో
కథల మావయ్య : ఎం.చిత్తరంజన్
దిబ్బరొట్టి అబ్బాయి - కె.ఎ.కల్యాణి
అవ్వ - జి.అలకానంద
నక్క - కె.రామాచారి
ఆవు - ఎ.గిరిజ
గుర్రం - ఎ.సీతామహాలక్ష్మి
పొలం పనివాళ్లు - ఆర్.రాజ్యశ్రీ,ఎం.స్వరాజ్యలక్ష్మి

అవ్వ తయారు చేసిన దిబ్బరొట్టి అబ్బాయి ఇంట్లోంచి పారిపోతూంటే ఆ దిబ్బరొట్టి అబ్బాయిని పట్టుకోటానికి పడే పాట్లూ, ఆ దిబ్బరొట్టిని ఆపే/తినే ఆశతో ఆవు, గుర్రం, పొలంలో పనిచేసుకునే పనివాళ్లూ - వీళ్లు తమ ప్రయత్నంలో విఫలం కాగా, సఫలం అయిన నక్కగారి తెలివి మీరు ఆడియో విని తెలుసుకోవాల్సిందే!

అవ్వగా అలకానంద వాయిస్ ఓవర్ బ్రహ్మాండం.

విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైన ఈ అరుదైన ఆడియో అందించిన పరుచూరి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో!

ఎక్కడ వినవచ్చా? 

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పిల్లల పాటలు - ఆడియో " లింకు నొక్కి వినవచ్చు .

భవదీయుడు
వంశీ

Monday, February 7, 2011

మొయిలు మాటలతో - మొయిలీ గారూ !!

ఈనాడు అనే ఒకానొక పత్రికలోని వార్త హెడ్డింగు వగైరా వగైరా : 

కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం
అహ్మద్‌ పటేల్‌ ఒత్తిడితో అధికారికంగా ప్రకటించిన చిరు
పార్టీలో గౌరవానికి హామీ
అన్నీ తానై కాంగ్రెస్‌ను ఆయనే నడిపిస్తారన్న మొయిలీ

ఈరోజు మేడం గాంధీని కలిశా. రాష్ట్ర సమస్యలపై చర్చించా. మేం విలీనానికి సిద్ధమయ్యామా? లేదా? అని మీరంతా ఎదురు చూస్తున్నారు. అవును. మేం విలీనం కాబోతున్నాం. ఒక్కటి కావాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. చాలా సంతోషంగా ఉంది. మా పదవులకంటే ప్రజలకు ఏం మేలు జరుగుతుందన్నదే ముఖ్యం. మాకు ఏ పదవులు ఇస్తారన్న అంశాన్ని సోనియాకే వదిలిపెట్టాం. రాష్ట్ర అభ్యున్నతి కోసమే చేతులు కలిపాం
- చిరంజీవి
 

కాంగ్రెస్‌లో విలీనం కావాలని మేం ఆహ్వానించాం. ఈ రోజు నుంచి చిరంజీవి కాంగ్రెస్‌ కుటుంబంలో చేరారు. ఆయన ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలు, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆ సిద్ధాంతాలు కాంగ్రెస్‌కు చాలా దగ్గరగా ఉన్నాయి. అందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. మాకు చాలా ముఖ్యమైన నాయకుడొచ్చాడు. కలిసి పనిచేస్తాం. పార్టీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం. ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌కు అతిగొప్ప నాయకుడవుతాడని చెప్పడానికి సంతోషిస్తున్నాం.
- వీరప్ప మొయిలీ
 కలరు కోటింగు ఇచ్చినవాటి మీద నా అభిప్రాయం ఇక్కడ కొద్ది మాటల్లో పంచుకోటానికి ప్రయత్నిస్తాను. అవును కొద్ది మాటలే. నోరు పారేసుకోటం మా ఇంటా వంటా లేదు. 
 
భళా మొయిలీ గారూ, భళా !! భలే చెప్పారే మొయిలీ గారు.....
 
కడుపు, గుండె, బుర్ర నిండిపోయింది మీ మొయిలు మాటలతో! ఆ మొయిల్లో ఉన్న నీళ్లు ఎక్కడ, ఎప్పుడు కారతాయో తెలీదు కానీ, తెలుగు జాతి నుంచి మరో మహానుభావుడు జాతీయ కాంగ్రెస్సుకు "అతి" ముఖ్య నాయకుడు అవుతాడు అని మీ నోట్లోంచి ఊడిపడ్డ మాటలు ఎంతో మందికి సంతోషం కలిగించాయి........

అబ్బో! ఏం మాటలు, ఏం మాటలు! అదే అదే నరమాంసంలా ఎంత మంది కళ్లు తెరిపించారో . మాటల మాంత్రికుడు శ్రీ పింగళి వారి తర్వాత మీరే అన్న మా స్నేహితుడి మాటలు విని సిగ్గుతో చచ్చిపోయాను నిన్న. హయ్యారే పింగళి వారికి, వారి నామానికీ ఎంత దుర్గతి పట్టిందని. 

ఇంతవరకూ ఈ భూప్రపంచకంలో పింగళి వారంత వారు లేరని నేననుకుంటున్నాను. ఆ అనుకోలును వమ్ము చేసిన మీకు బోల్డు ధన్యవాదాలు.....ఇహ ఇంతకన్నా రాస్తే ......

ఇహ చిరంజీవి గారి పదవుల సంతో! ...ఊప్స్...సంగతో! ఇంతే సంగతులు చిత్తగించవలెను!


Thursday, February 3, 2011

అపురూపమైన జేజిమామయ్య పాటల ఆడియోలు కొన్ని! - 1960's

శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి స్వీయ రచన, స్వరకల్పనలో 60వ దశకంలో రూపుదిద్దుకున్న ఎంతో అపురూపమైన జేజిమామయ్య పాటల ఆడియోలు కొన్ని అందించారు పరుచూరి శ్రీనివాస్ గారు. నా సతాయింపును విసుక్కోకుండా భరించిన ఆయనకు వేల ధన్యవాదాలతో.

ఎక్కడ వినవచ్చా? 

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పిల్లల పాటలు - ఆడియో " లింకు నొక్కి వినవచ్చు .

ఈ జేజిమామయ్య పాటల్లో కొన్ని పాటల సాహిత్యం "చిన్నారులు" సెక్షన్లో, ఆ పేజీ చివర చూడవచ్చు. ఎప్పుడో 2006లో మా పెద్దమ్మ సుబ్బమ్మ గారిని అడిగి ఆవిడకు గుర్తున్నంతలో ఈ పాటల సాహిత్యం రాసుకుని ప్రచురించాను. కొన్ని తప్పులుండవచ్చు. తెలిసిన వారెవరైనా సరిదిద్దితే అమితమైన సంతోషం. దాదాపు ఐదేళ్ల తరువాత ఆడియోలు లభించటం మరింత ఆనందం.


నాకు బాగా నచ్చిన పాట చిట్టీ చిట్టీ రేగీపళ్లూ - ఎంతందంగా వర్ణించారో రజనీకాంతరావుగారు. ట్యూను కూడా అద్భుతం, బ్రహ్మాండం.అలా కళ్లు మూసుకుని ఈ ఆడియో వింటూ ఉంటే కళ్ల ముందు ఆ బోగి పళ్ల సీనంతా కనపడట్లా?

ఒక్కటే మాట - అద్భుతం....రజనీకాంతరావు మాష్టారు గారికి వేల వేల వందనాలు.


చిట్టీ చిట్టీ రేగిపళ్లు
చిట్టీ తలపై బోగీపళ్లు
ఎంతో చక్కని బోగీపళ్లు
ఎర్రా ఎర్రని రేగీపళ్లూ
చిట్టీ చిట్టీ రేగిపళ్లూ
చిట్టీ తలపై బోగీపళ్లు
ఎంతో చక్కని బోగీపళ్లు
ఎర్రా ఎర్రని రేగీపళ్లూ


ఘల్లూ ఘల్లున దమ్మీడీలు
జల్లుగ అల్లో నేరెడిపళ్లు
తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై
కలలూ ఘల్లున దమ్మీడీలు
జల్లుగ అల్లో నేరెడిపళ్లు
తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై


పెద్దల దీవనలెన్నో పూలై
ముద్దులు తీయా తీయని పళ్లై
తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై
పెద్దల దీవనలెన్నో పూలై
ముద్దులు తీయా తీయని పళ్లై
తళతళతళతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లీపోతై


పసుపూ గంధం అరటిపళ్లతో
మిసమిసలాడే పట్టుచీర్లతో
ముత్తైదువులా గాజులసడిలో
ఎత్తున రాలే బోగీపళ్లూ
పసుపూ గంధం అరటిపళ్లతో
మిసమిసలాడే పట్టుచీర్లతో
ముత్తైదువులా గాజులసడిలో
ఎత్తున రాలే బోగీపళ్లూ


చిట్టీ చిట్టీ రేగిపళ్లు
చిట్టీ తలపై బోగీపళ్లు
ఎంతో చక్కని బోగీపళ్లు
ఎర్రా ఎర్రని రేగీపళ్లూ
చిట్టీ చిట్టీ రేగిపళ్లూ
చిట్టీ తలపై బోగీపళ్లు
ఎంతో చక్కని బోగీపళ్లు
ఎర్రా ఎర్రని రేగీపళ్లూ


కొసమెరుపు: కొన్ని నెలల క్రితం దాకా నాకూ తెలీదు - "భోగి" కాదనీ - "బోగి" అనీ. అనవసరంగా వత్తు వచ్చి చేరిందని. ఎలా తెలిసింది బాబూ నీకు అని అంటున్నారా? శ్రీ నల్లాన్ చక్రవర్తుల శేషాచార్య గారి పుస్తకం - హాస వ్యాస మంజరి పుస్తకంలో ఉన్నది ఈ సంగతి. ఈ పుస్తకం సుమారు 10 నెలల క్రితం నా చేతికి వచ్చింది కానీ చదవటానికి తీరిక ఆ పై రెండు నెలలకు కానీ కలగలా. ఆ పుస్తకాన్ని ఇప్పుడు "సాహితీ సంబంధ" సెక్షన్లో చూడవచ్చు. వ్యంగ్యాత్మక వ్యాస పరంపర....చాలా మంచి పుస్తకం. వీలుచేసుకుని చదవండి.

చెప్పనివాళ్లకు చిప్పలు బహుమానం! చెప్పినవాళ్లకు?

చెప్పనివాళ్లకు చిప్పలు బహుమానం! చెప్పినవాళ్లకు?

ఈ క్రింది ఫోటోలు ఎవరివో గుర్తు పట్టి చెప్పినవాళ్లకు హారాలూ, మణిహారాలూ, భోజ్యాలూ, భక్ష్యాలు, వీరతాళ్లు....చెప్పనివాళ్లకు?? అవే అవే! :)రత్నాలండీ రత్నాలు, అనర్ఘ రత్నాలు - సిగ్గుపడాలి చెప్పలేకపోతే! తెలీని కుర్రకుంకలుంటారు, అది వేరే సంగతి....తెలుసుకోవాలని ప్రయత్నించని, తెలుసుకోకూడదనుకునే కుంకలుంటారే వాళ్లకు ఈ పోష్టే హెచ్చరిక....ఇహ ముందు ఇలాటివి బోల్డు టపాలు వస్తాయి......

జాగ్రత్త జాగ్రత్తేన జాగిలం, కరువం కరువమేన కండలం

చిత్ర సౌజన్యం: శ్రీ దేవరపల్లి రాజేంద్రకుమార్ - http://www.itsvizag.com/

Tuesday, February 1, 2011

చీపురు పట్టుకుని మా తాతయ్యగారి వాకిలి ఊడ్చిన ఒబామా!

చీపురు పట్టుకుని మా తాతయ్యగారి వాకిలి ఊడ్చిన ఒబామా!

అబ్బో! ఏమిటి నాయనా ఈ స్టేటుమెంటు? మళ్లీ ఏం తీర్థం పుచ్చుకొచ్చావ్?

తీర్థం పుచ్చుకోటమేమిటీ నిన్ను తగలెయ్య, నేనేమన్నా తాగుబోతుననుకున్నావురా?

తాగి మాట్లాడకపోతే మరి ఆ పైన స్టేటుమెంటు ఏమిటి? ప్రపంచాన్ని శాసించే ఒబామా, మీ తాతగారి వాకిలి ఊడవటమేమిటి?

అసలు మొదలెట్టనిస్తావా?

ఊం! చెప్పు! చెవులున్నాయిగా ? చస్తామా వినక!

సరే సంభాషణ వదిలేసి, ఉపోద్ఘాతం వదిలేసి సరాసరి కథలోకి - సాధారణంగా మనిషికొచ్చే కలల్లో 99.5 శాతం నిద్ర నుంచి లేస్తూనే పలక మీద తడిగుడ్డేసి తుడిచేసినట్టు సోదిలోకి రాకుండా ఎక్కడికో పరుగులెత్తుకుంటూ వెళ్లిపోతాయ్. మిగిలిన .5 శాతం కలల్లో .3 శాతం కలలు కొద్దిగా నిద్ర లేచాక కూడా కొద్దిగా గుర్తు ఉంటవి. అయితే ఆ "గుర్తు" మిగలడానికి, మిగుల్చుకోడానికి కొద్దిగా కష్టపడాలి. మిగిలిన .2 శాతం మటుకు కష్టపడనఖ్ఖరలేకుండా గుర్తు ఉంటాయి. ఇదీ నా థియరీ. ఈ నా థియరీకీ ఊతం స్వీయ అనుభవమైన నా కలలే - అవే నా అనుభవాలు. అలా .2 శాతంలోకి పడిపోయింది ఈరోజు పొద్దున్నే వచ్చిన కల.

ఇహ కలలోకి వచ్చేస్తూ -
పాత్రధారులు / కలలో కనపడ్డది వీరే:
అ) మూడు ఒంగోలు గిత్తలు
ఆ) సాయి రాం
ఇ) అమ్మమ్మ
ఈ) అమ్మ
ఉ) ఒబామా
ఊ) ఒబామా గారి పిల్లలు
ఋ) పిచ్చమ్మ గారి గేదెలు
ౠ) చీపురు కట్ట
ఎ) తాతయ్య అట్లాస్ సైకిలు

"భుజాన పుస్తకాల సంచీతో ఎనిమిదేళ్ల సాయిరాం (1 *) , శివాలయం పక్కనుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంటికి తిరిగే సందు చివర ఓ పశువుల కొట్టం. ఆ పశువుల కొట్టంలో సాయిరాంకి ఎంతో ఇష్టమైన ఒంగోలు గిత్తలు. ఆ గిత్తల్ని రోజూ నిమిరినట్టే నిమురుదామని కొట్టంలోకి సాయిరాం ప్రవేశం. అడుగుపెట్టటం ఆలస్యం ఆ మూడు గిత్తలు అమాంతంగా ఎవరెష్టు అంత ఎత్తుకు ఎదిగిపోతాయి (మాయాబజారు ఘటోత్కచుడిలా అన్నమాట!). అందులో ఒక గిత్త ఎవరెష్టు ఎత్తునుంచి తల కిందకు వంచి సాయిరాం భుజాన ఉన్న పుస్తకాల సంచీని నమలటానికి ప్రయత్నిస్తూ ఉండగా సాయిరాం పుస్తకాల సంచీని ఇవతలకు లాక్కుంటూ గిత్తను అదిలిస్తాడు. వేంఠనే గిత్త నుదురు మీద "శివ" అనే బంగారు అక్షరాలు మెరవటంతో సాయిరాం భయపడి ఓం నమశ్శివాయ అని ప్రార్థిస్తూ కొట్టం బయటకు పరిగెత్తుకుపోతాడు. 

ఇంటికి చేరి, అరుగుల మీద కూర్చుని పుస్తకాల సంచీ పక్కనబెట్టగానే, తెల్లచొక్కా నల్లపాంటుతో ఓ మనిషి, అదేనండీ ఒబామా - ఇద్దరు పిల్లలతో ప్రత్యక్షం. ప్రత్యక్షమవుతూనే అరుగు మీద ఓ పక్కగా, మూలకు నుంచోబెట్టిన చీపురు కట్టను తీసుకుని "అక్కయ్యను పట్టుకుని కాలితో తంతావా? నువ్వు ఈవేళ సూపర్ బవులు మాచు చూసేందుకు లేదు. రాఘవయ్యగారి ఇంటిముందు, ఇక్కడ కూర్చో ఇరవై నిముషాలు" అంటూ ఆ చీపురు కట్టతో తాతయ్యగారి (2 *) వీధి వాకిలి శుభ్రంగా ఊడ్చేసి, ఆ చిన్నపిల్లని తాతయ్య అట్లాస్ సైకిలు (2 *) పక్కన కూర్చోబెట్టి పెద్దమ్మాయిని తీసుకుని వెళ్లిపోతాడు. 

ఇంతలో సాయిరాం వాళ్ల ఇంటి సందులోనుంచి రోజూ వెళ్లే పిచ్చమ్మ గారి (3 *) గేదెల గుంపు ప్రత్యక్షం. వాటి మానాన అవి వెళ్లిపోకుండా తాతయ్య గారి ఇంటి వాకిలి ముందు, వాకిలికి అడ్డంగా కూర్చుని నెమరు వేస్తూ ఉంటాయి. ఒబామా వాళ్ల చిన్నపిల్ల గేదెల్ని చూసి భయపడిపోయి సాయిరాం భుజాల మీదకు ఎక్కేయ్యటం, సాయిరాం ఆ అమ్మాయి భుజాల మీదకెక్కగానే నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయి, బావి దగ్గర ఉన్న చప్టా మీద ఆ అమ్మాయిని కూర్చోబెట్టి, భయపడకు, ఇక్కడే ఉండు అని చెప్పి వెనకనున్న పాక తలుపు తీయగానే భుజం మీద ఆరో నంబరు కాలువలో ఉతికిన బట్టల మూట వేసుకుని లోపలికి వస్తున్న అమ్మమ్మ. 

లోపలికి వస్తూనే, ఎలా తెలిసిందో ఇంటి ముందు గేదెలున్నాయని, ఏరా తాతయ్య గుళ్లోంచి వచ్చే వేళయ్యింది ఆ గేదెల్ని తరుము, అవి అక్కడినుంచి పోకపోతే తాతయ్య లోపలికి రావటానికి మధ్యలో దారి చెయ్యి, అలాగే తాతయ్య వచ్చాక ఆయన కాళ్లు చేతులు కడుక్కునేలోగా ఆయన సంచీలోనుంచి కొబ్బరి నీళ్లు తీసుకుని తాగు అని అంటుంది. ఇంతలో అమ్మ కేక - ఎక్కడున్నావురా? ఏం చెప్పారు ఈవేళ స్కూల్లో అని. "

ఆ కేకకు మెలకువ వచ్చేసింది. అదండీ ఈవేళ్టి కల సంగతి....పొల్లుపోకుండా ఎందుకు గుర్తుండిపోయిందో అర్థం కాలా కానీ, నిద్ర లేచాక ఇంకా చల్లపల్లి తాతయ్యగారి ఇంటి అరుగుల మీద కూర్చునే ఉన్నానన్న "ఫీలింగు"తో ఆఫీసుకు వచ్చేసా...

ఇహ ఈ కల గురించి నా "ఇంటర్ప్రిటేషన్స్" నాకున్నాయి కానీ, మీరేమని విశ్లేషిస్తారో చూడాలని ఇక్కడ ఇలా పోష్టు చెయ్యటమైనది....కలల స్పెషలిష్టు ఎవరన్నా ఉంటే వారి అభిప్రాయం పంచుకుంటే మరింత సంతోషం.....

స్థూలంగా - స్టార్ల (*) బాక్ గ్రవుండు ఇదీ:
2)మా తాతయ్య, అమ్మ వాళ్ల నాన్న - రాఘవయ్య గారు రోజు సైకిలు తొక్కుకుంటూ మోపిదేవి వెళ్లేవారు.  మధ్యాహ్నం పూట ఇంటికి వస్తూ పిల్లలకు ఓ మూతున్న మరచెంబులో కొబ్బరి నీళ్లు తీసుకొచ్చేవారు. తాతయ్య దాదాపు యాభై ఎనిమిది ఏళ్లు పూజారిగా సుబ్రహ్మణ్య స్వామిని సేవించుకున్నారు. ఆయన నాన్న అంటే పెదతాతయ్య యాభై ఏళ్లు అదే గుళ్లో స్వామిని సేవించుకున్నారు. ఇప్పుడు మావయ్య వంతు...
3) పిచ్చమ్మ గారని, ఒకావిడ తాతయ్య వాళ్ల ఇంటి వెనకాతల సందులో ఉండేవారు. పేద్ద పాడి ఉండేది వారికి. ఆ గేదెలు రోజూ మా ఇంటి సందులోనుంచే వెళ్లేవి - మేయడానికి కానీ, స్నానాలకు కానీ..

 చల్లపల్లిలో తాతగారి ఇల్లు ఈ క్రింది బొమ్మలో చూడవచ్చు...
"తాత" అని నల్లగా హైలైటు చేసిందే మా తాతయ్యగారి ఇల్లు 


మరి (1 * ) ఏది బాబూ?

ఓ - సాయిరాం ఆ ? బానే పట్టావే - అయితే పోష్టు మొత్తం చదివావన్నమాట. సాయిరాం అంటే నేనే! మా అమ్మమ్మ నన్ను ముద్దుగా పిల్చుకునే పేరు. ఆవిడ షిర్డీ సాయి భక్తురాలు... ఇప్పుడు తాతయ్య, అమ్మమ్మ ఇద్దరూ లేరు కానీ - వాళ్ల జ్ఞాపకాలు? ...

గిత్తలు, అట్లాసు సైకిలు, గేదెలు , ఒబామ, పిల్లలు, తాతయ్య , అమ్మమ్మ - ఇలా బొమ్మ లు నాకు వెయ్యటం రాదు కాబట్టి బతికిపోయారు కానీ, లేకుంటే అన్నీ వేసి చూపించేవాడినే....

(Post 418)