Wednesday, December 29, 2010

దేనికి తగ్గవారు దానికి ఉండరూ?

పద్యమొచ్చింది
పద్య పాఠకులొచ్చారు
పద్య విమర్శకులొచ్చారు

పద్యం పోయింది
పద్య పాఠకులు పోయారు
పద్య విమర్శకులు పోయారు

గేయమొచ్చింది
గేయ పాఠకులొచ్చారు
గేయ విమర్శకులొచ్చారు

గేయం పోయింది
గేయ పాఠకులు పోయారు
గేయ విమర్శకులు పోయారు

గద్యం వచ్చింది
గద్య పాఠకులొచ్చారు
గద్య విమర్శకులు వచ్చారు

గద్యం పోయింది
గద్య పాఠకులు పోయారు
గద్య విమర్శకులు పోయారు

చోద్యమొచ్చింది
చోద్య పాఠకులొచ్చారు
చోద్య విమర్శకులొచ్చారు


చోద్యం పోయాక ఏమొస్తుందో?

తెలీక అడుగుతున్నానబ్బాయీ - దేనికి తగ్గవారు దానికి ఉండరూ?..

మాల కొండయ్య గారి పుస్తకాల / కవితల ప్రేరణతో

(Post 403)

Sunday, December 19, 2010

ఇంకోసారి సరిగ్గా గీస్తా అని చెప్పా....

నిన్న సాయంత్రం - ప్రదోషానికి శివ జేజికి చేసే రుద్రాభిషేకానికి వెళ్లా! ఎందుకు? నాన్న కూడా చదువుతాడుగా రుద్రం అందుకు!. అయితే మధ్యలో బాగా ఆకలి వేసి వెళ్లిపోదాం అని గోల చేసా. నేను అలా గోల చేస్తున్నానని ప్రసాదం ఇచ్చేదాకా ఉండకుండా, శివ జేజికి అలంకారం చేస్తుంటే వచ్చేసాం. నాన్నకు బాగా కోపం వచ్చింది - నేను ప్రసాదం తీసుకోనివ్వలేదని.

మళ్లీ ఇవాళ మా గుళ్లో పొద్దున్నే 10.30కి గణపతి జేజికి అభిషేకానికి మళ్లీ రుద్రం చదువుతారుగా. అందుకు మళ్లీ తీసుకెళ్లాడు. ఈసారి రెండు పేపర్లు తెచ్చాడు. ఎందుకో అనుకున్నా. నాన్న రుద్రం వల్లిస్తూ, నిన్నట్లాగా మళ్లీ గోల చేస్తానేమోనని ఒక పేపరు నాకిచ్చి గణపతి జేజి బొమ్మ వెయ్యమని సైగ చేసాడు. అప్పుడర్థమయ్యింది, పేపర్లు ఎందుకు తెచ్చాడో..వెంటనే వేసేసా!

బొమ్మలో....అరటిపళ్లు, దీపాలు, ఎలక, కొబ్బరికాయలు, లడ్లు, చేతిలో పువ్వు అన్నీ వేసేసా....ఇంటికొచ్చాకా కలర్ వెయ్యమంటే అది కూడా వేసేసా...అదే ఇది....ఐపోయిందని చూపిస్తే, ఇంకో పేపరిచ్చాడు - సైగ చెయ్యలా...ఏం  వెయ్యాలో అర్థం కాక అప్పుడు పావురం బొమ్మలు వేసేసా....ఇసిటి ఫామిలీ అని మా టీచర్ జేన్ చెప్తుందిగా...ఆ ఫామిలీ పేరు పెట్టేసా...
బిగ్ కిస్స్ ఇచ్చి - చాలా బాగుంది చిన్నమ్మా, కానీ గణేశ్ జేజి బొట్టు ఏమిటే అలా వేసావు అని మాత్రం అన్నాడు నాన్న...త్రిశూలం బొమ్మ వేద్దామంటే ఎలాగో వచ్చింది ఆ బొట్టు మరి....ఇంకోసారి సరిగ్గా గీస్తా అని చెప్పా....

Tuesday, December 14, 2010

శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవం - ఆకాశవాణి ప్రసారం

మొలక మీసపు గట్టు, ముద్దుచందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటల రట్టు
సికపై ననల్పకల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతి జెర్లాడు మధురవాసనలు
బింబారుణము కదంబించు దాంబూలంబు
తాంబూల వాసనల దగులు భృంగ గణంబు
గనుల పండువుసేయ, మనసునిండుగ బూయ
ధణధణధ్వని దిశతతి బిచ్చలింపగా

ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు


పుట్టపర్తి వారి శివతాండవ కావ్యం - అద్భుతమైన కావ్యం ఆకాశవాణి వారు ప్రసారం చేస్తే, ఆ అద్భుతాన్ని మనకందించిన వారు తెలుగుథీసిస్.కాం రంజని గారు. వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో

******************************************************

శివతాండవం సంగీత రూపకం (1993)

శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవం గేయకావ్యానికి
రేడియో అనుసరణని వారి కుమార్తె శ్రీమతి నాగపద్మిని చేసారు.

సంగీతం: శ్రీ యెల్లా వేంకటేశ్వరరావు

పునఃప్రసారం : 12 Dec 2010  

******************************************************

ఎక్కడ? ఇక్కడ

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
వంశీ

Sunday, December 5, 2010

ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి / వరంగల్ ఆకాశవాణి కేంద్రం ప్రసారం

1931లో జన్మించి తెలుగు సాహిత్యలోకానికి అపారమైన సేవనందించిన ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రిగారి జీవిత విశేషాల గురించి వరంగల్ ఆకాశవాణి కేంద్రం ఒక మంచి కార్యక్రమం ప్రసారం చేసింది. కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ వెన్నవరం ఈరారెడ్డి, మారేడుకొండ బ్రహ్మచారి గారు.

కార్యక్రమాన్ని అందించిన కేశరాజు భానుకిరణ్ గారికి ధన్యవాదాలతో...****************************************************************

ఇక రామకోటి శాస్త్రి గారి సంక్షిప్త వివరాల్లోకి వస్తే - 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పి.జి.సెంటర్ వరంగల్లులో ప్రారంభమైనప్పుడు తెలుగు విభాగానికి ఆచార్య బిరుదురాజు రామరాజుగారు పునాదులు వేస్తే ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు పటిష్టపరిచారు. రామకోటి శాస్త్రిగారంటే సాహిత్య అధ్యయనం, సాహిత్య సంభాషణ. గుడివాడ కాలేజీలో అధ్యాపకుడిగా కె.జి.సత్యమూర్తి, చలసాని ప్రసాద్, త్రిపురనేని మధుసూదనరావు మొదలైనవారికి విద్యాబోధన చేసి ఈ సాహిత్య ప్రపంచానికి ఆణిముత్యాలవంటి ఎందరో సాహితీకారులని అందించారు. ప్రముఖ సాహితీవేత్త కాత్యాయనీ విద్మహే గారు ఆచార్యుల వారి కుమార్తె. 

*****************************************************************

ఎక్కడ వినవచ్చు  ? ఇక్కడ

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
వంశీ

Thursday, December 2, 2010

వాద్య కళాకారులు శ్రీ సత్యేంద్రనాధ్ పరిచయం / ఆకాశవాణి ప్రసారం

వాద్య కళాకారులు శ్రీ సత్యేంద్రనాధ్ పరిచయం
పరిచయకర్త : శ్రీ సుమనస్పతిరెడ్డి (PEx - AIR)

ప్రసారం తేదీ : 02 డిసెంబరు 2010
తెలుగు థీసిస్ డాట్ కాం రంజని గారి సౌజన్యంతో.

ఆడియో అందించిన రంజని గారు ఇలా అంటారు

_______________________________________

ఒక పాట లేదా ఓ రూపకం అద్భుతంగా ఉందని మనం
చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా సంగీత దర్శకుల ప్రతిభని
కొనియాడుతాము. వాయిద్య సహకారాన్ని అందించిన
కళాకారుల గూర్చి అంతగా పట్టించుకోము...

50 సంవత్సరాలకి పైగా అనేక ఆకాశవాణి కార్యక్రమాలకి
స్టేజి కార్యక్రమాలకి వాయిద్య సహకారాన్ని అందించిన
కళాకారులు శ్రీ సత్యేంద్రనాధ్. ఒక రిధమ్స్  కళాకారునిగా
పత్రికలలో ఈ పేరు అప్పుడప్పుడూ కనిపించేది - జీవన
వివరాలు ఇప్పుడు ఈ పరిచయ కార్యక్రమంలో...
_______________________________________

ఎక్కడ? ఇక్కడ

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
వంశీ

Wednesday, December 1, 2010

ఆచార్య తిరుమల రామచంద్ర - భారతి పత్రిక అనుబంధం

మహామనీషి ఆచార్య తిరుమల రామచంద్ర గారు భారతి పత్రికతో తనకున్న అనుబంధం గురించి వివరించిన ఈ వ్యాసం వారాంతం దేనికోసమో వెతుకుతుంటే ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లోనుంచి ఆణిముత్యంలా బయటపడింది.....

స్కాన్ ఫైళ్ల తేదీలు చూస్తే సంవత్సరన్నర క్రితం ఉన్నవి....బోల్డు ఆశ్చర్యపోయా నేనే - ఎలా మిస్సైపోయిందబ్బా అని!

ఇప్పుడు ప్రచురించేసా! మీరు చదువుకోవటమే మిగిలింది......ఎక్కడ?

http://www.maganti.org/newgen/index1.html

వ్యాసావళి సెక్షన్లో ...

భవదీయుడు
వంశీ