Tuesday, November 9, 2010

చీవాట్లు కొన్నే పడాల్సి ఉన్నా అవి బోల్డు ఎందుకైపోయాయంటే?

మా కొలీగ్ కీత్ నైట్ అనే ఆయనతో రోజూ జరిగే మాటా మంతీ, పిచ్చాపాటీలో ఈవేళ "ప్లెడ్జ్ ఆఫ్ అలీజియన్స్" గురించి మాట్టాడుకున్నాం. ఈయన అమెరికన్ ఎయిర్ ఫోర్సు రెటైర్డ్ లుట్టెనెంట్ కల్నల్ (అర్థం కానివాళ్లకి - మనం లుట్టెనెంట్ ని లెఫ్టినెంట్ అని అంటాం). చిన్నప్పుడు ఆయన స్కూల్లో ఉన్నప్పుడు, చదువుకునేప్పుడు ఎలాగుండేది అన్నీ వివరించుకొచ్చాడు. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

అందులో నా మనసుకు వేంటనే పట్టుకున్నది, నేను నా చిన్నప్పుడు ప్రతిరోజూ మా స్కూల్లో పిల్లలంతా అస్సెంబుల్ అయ్యాక చేసింది, చదివింది, పాడింది
అ) స్వామి వివేకానందుల వారి "నేషనల్ ప్లెడ్జ్"
ఆ) టాగూర్ వారి "జనగణమన"


కీత్ కూడా ప్రతిరోజూ చేసేవాడట ఈ పని...చాలా రోజులు మిలటరీ స్కూల్లో చదివినందుకు అక్కడ ఖచ్చితంగా ఇవి చదవాల్సిందే అయినా, మిలటరీలో చేరకముందు బయట స్కూల్లో కూడ చదివినప్పుడు అంటే సుమారు 1950-60ల్లో ఈ Pledge, Anthem రోజూ అమెరికన్ స్కూళ్లలో వల్లె వేయించేవారన్నమాట విన్నప్పుడు బోల్డు ఆశ్చర్యం కలిగింది నాకు.బోల్డు జ్ఞాపకాలు లేచొచ్చినాయి....

అ)సత్యవాణి టీచరుగారి పని పిల్లలంతా సరిగ్గా లైన్లో నుంచున్నారా లేదా అని చూడటం. నుంచోకపోతే చేతిలో ఉన్న బెత్తంతో చర్రున ఓక్కటేసి "ఎన్ని సార్లు చెప్పాలిరా నీకు, లైనంటే గీత గీసినట్టు ఉండాలిరా, కట్లపాము లా కాదు. నుంచో సరిగ్గా నుంచో వెధవా!" అని ఆవిడ నోట్టో నుంచి వచ్చే మాటలు గిర్రున గింగిరాలు తిరిగేట్టు వినపడ్డాయి.

ఆ)ప్రతిరోజూ ఒక్కో విద్యార్థి చేత చదివించి, ఆ విద్యార్థి ఒక్కో లైను చదవటం - మిగిలిన పిల్లలు కోరస్ వెయ్యటం....అలా ఓ రోజు ప్లెడ్జీ నా భాగ్యం. ఆ భాగ్యాన్ని తట్టుకోలేని నేను ప్లెడ్జిలోని రెండో లైను తప్పుగా చదివి ఆ తర్వాత హెడ్మాష్టరు ముకుంద గారితో ఆవిడ ఆఫీసులో బోల్డు చీవాట్లు తిన్న సంగతి చక్రాలేసుకుంటూ ముందుకొచ్చి నిలబడింది.

అసలింతకీ ఆ తప్పు ఏమిటా? - రెండో లైనులో  I Love My Country బదులు ఆరోజు పొద్దున్నే కోదండం మావయ్య యూనిట్ టెస్టు పరీక్షల కోసం వల్లె వేయించిన Myself వ్యాసంలోని మైసెల్ఫ్ - కంట్రీకి బదులు నోట్టో నుంచి బయల్పడడం...చీవాట్లు కొన్నే పడాల్సి ఉన్నా అవి బోల్డు ఎందుకైపోయాయంటే, నేను చదవగానే నాతో పాటు ఇంకో 100 మంది మైసెల్ఫ్ అనటం మూలానన్నమాట...

ఇ) ఐతే అదే సంవత్సరం స్కూల్ వార్షికోత్సవాల సందర్భంగా వేసిన "అలెక్జాండర్" నాటికలో నేను వేసిన పురుషోత్తమ చక్రవర్తి వేషానికి ప్రథమ బహుమతి రావటం, అది ఆవిడ చేతుల మీదుగా తీసుకోడం ఓ మర్చిపోలేని అనుభూతి.

ఇంకా బోల్డు చక్రాలున్నాయి కానీ, అవి అన్నీ మీకెందుకు? నా దగ్గరే అట్టిపెట్టుకుంటా!

పిచ్చాపాటీ అయిపోయాక  కీత్ ఒక లింకు పంపించాడు...

ఇక్కడ చూడండి.....

ఇప్పటి మన దుస్థితే, వీళ్లకూ ఉందని తెలుసుకుని ఆనందపడాలో, బాధపడాలో అర్థం కాక ఊరకున్నా. దుస్థితా ? ఏమిటది అంటారా? రెడ్ స్కెల్టన్ గారి ప్రసంగంలో చివరి రెండు లైన్లు ఘాట్టిగా మళ్లీ ఓ సారి చదివి రండి...

భవదీయుడు
వంశీ

1 comment:

  1. వెల్, ఏ దేశమైనా, మనిషి మనిషే కదండి. బుధ్ధి మారుతుందా?

    ReplyDelete