Thursday, November 18, 2010

ఆడోళ్లైతే చెమ్మచెక్క - మగోళ్లైతే వైకుంఠపాళీ ....అదిరా సంగతి!! నా బకెట్ లిష్టు కూడా ఇచ్చా!!

ఒక గొప్ప నటుడు నటించిన సినిమా చూస్తే ఓ గొప్ప అనుభూతి మిగులుతుందనుకుందాం. మరి ఇద్దరు గొప్పనటులు నటించిన సినిమా చూస్తే ఏం మిగులుతుంది? అందులోనూ అభిమాన నటులనుకో - ఆడోళ్లైతే ముగ్గేసుకుని చెమ్మచెక్క ఆడుకోటం, మగోళ్లైతే వైకుంఠపాళీ ఆడుకోటమేగా? అదీ లెఖ్ఖ! ఆ వైకుంఠపాళీ ఆడుకోని ఆనందించాను బకెట్ లిస్ట్ అనే సినిమా చూసి నిన్న రాత్రి. ....

జేమ్స్ ఎర్ల్ జోన్స్, రాబర్ట్ డెనీరో, జాక్ నికొల్సన్, మోర్గన్ ఫ్రీమన్, ఆంథోనీ హాప్కిన్స్, జీన్ హాక్ మాన్, టాం హాంక్స్, యూల్ బ్రిన్నర్,  ఛార్ల్టన్ హెస్టన్, మార్టిన్ స్కోర్సేసి.....

ఆగిపోండక్కడే....వీళ్లంతా లేరు ఆ సినిమాలో....వీళ్లంతా నా అభిమాన "తారా, దర్శక, కళాకార" గణంలోని కొంతమంది....

ఈ గణంలోని ఇద్దరు వీరభద్రులు - జాక్ నికొల్సన్, మోర్గన్ ఫ్రీమన్ నటించిన సినిమా ఈ బకెట్ లిస్ట్. 2007లో విడుదలైందనుకుంటా!..

కథేమిటయ్యా అంటే, జాక్ నికొల్సన్ పేరు ఎడ్వర్డు, 70 ఏళ్లు, బోల్డంత డబ్బు, బోల్డన్ని విడాకులు, ప్రెయివేట్ రూముల్లేని హాస్పిటలు, హాస్పిటలు ఉన్నందుకు ఎడ్వర్డుకు కాన్సరు. ఇహ మోర్గన్ ఫ్రీమన్ పేరు కార్టర్, దాదాపు 70 ఏళ్లు, కొంచెం బీదవాడు, కాన్సరు. సరే ఇద్దరికీ కాన్సరుంది కాబట్టి, ఇద్దరూ జాక్ నికొల్సన్ గారి ప్రయివేట్ రూముల్లేని హాస్పిటల్లో ఒకే రూములో పక్క పక్కనే బెడ్లేసుకోని బజ్జుంటారు. ఆ పక్క పక్కనే బజ్జోటం జాక్ గారికి ఇష్టముండదు. కానీ తప్పదు. మోర్గన్ ఫ్రీమన్ బకెట్ తన్నేలోపు చెయ్యాల్సిన పనులు ఓ లిష్టు కింద రాసుకుంటాడు. అది చూసి జాక్ గారు కూడా లిష్టు వాత పెట్టుకోని, మోర్గన్ లిష్టుని పూర్తిచేసి ఆ తర్వాత మోర్గన్ కి వాతలెట్టుకుంటూ ప్రపంచమంతా తిప్పుకోని తీసుకొస్తాడు. స్థూలంగా అదీ కథ. రాబ్ రైనియెర్ దర్శకుడు. జస్టిన్ జాక్ హాం కథా రచయిత....

ఐతే వీరభద్రులు ఆడుకున్న వైకుంఠపాళీలో పాములెక్కువైనాయి కానీ చాలా డైలాగులు మటుకు కాలకూట విషంతో కాటేసినంత పని చేసినాయి...అంటే ఏదో అనుకునేరు, వెధవ బుఱ్ఱల్ని తగలెయ్య - తలకు అంత తొందరగా ఎక్కదూ చావదు - కాలకూట విషం అంతలా సఱ్ఱున ఎక్కిపోతాయన్న సంగతి తెలిస్తే ఇహ నా జన్మ ధన్యమే.


ఆ బకెటు చూసాక, దాన్ని అక్కడ పెట్టి నా బకెట్ లో కొచ్చి లిస్టు రాసుకుంటే తేలిన ఇరవై మగ్గుల్లో ఎనిమిది మగ్గులు  ఇవిరా చిదంబరం -

ఎనిమిదే ఎందుకు ? అన్నీ నీ దగ్గరే పెట్టుకోవచ్చుగా? ఇస్తే మొత్తం ఇవ్వు, లేదా మొత్తంగా మానెయ్యి...అంతే కానీ ఈ త్రిశంకు ఎందుకు మాకు?

నీకింత తెలివి ఎక్కడినుంచి వచ్చిందిరోయి? అది సరే కానీ, నీ త్రిశంకు సంగతి తర్వాత చూస్తా...

ఇప్పటికిది చదువుకో

అ) చిలకమర్తి వారి "ప్రహసనములు" టైపులో, టైపులో ఏమిటి? అచ్చు అలాటిదే - ఎన్ని పెన్నులు విఱిగిపోయినా, ఎంత సిరా కారిపోయినా, ఎన్ని కాయితాలు చిత్తైపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఓ 700 పేజీలు కాకుంటే ఓ 1000 పేజీల లెవెల్లో ఓ పేద్ద రచన చెయ్యాలనీ, ఎవడి నెత్తికీ మసి అంటకుండా నేనే 50,000 కాపీలు పబ్లిష్ చేసుకోవాలనీ, ఎవడు చదవకపోయినా అన్ని లైబ్రరీలకూ ఉచితంగా ఐదారు కాపీలు పందేరం చెయ్యాలనీ. ఆయా లైబ్రరీలు కూడా వద్దంటే శిలాశాసనం కింద చెక్కించి ఎల్.బి.స్టేడియంలో తలో మూల పాతించాలనీ...ఇలా బోల్డు.... ఈ కలలో నాలుగు పేజీలు అప్పుడెప్పుడో ఉపోద్ఘాతంగా వ్రాసుకున్నా...లింకులు ఇక్కడ....ఇది ఊరకే శాంపిలు! అసలు రచన, దీనికి గానీ ఈ ఇతివృత్తానికి గానీ సంబంధం లేని రచన - ఓ 20 పేజీలు డ్రాఫ్టులో ఉన్నది....ఇంకో ఎనభై పేజీలయ్యాక పార్ట్లు పార్ట్లుగా వదులుతా......

సణుగుడు మేళమా ?

సణుగుడు మేళం - సరిచేసిన రెండోభాగం 

సణుగుడు మేళం - మూడో భాగం

ఆ) అబ్దుల్ కలాం గారితో కలిసి మా ఇంట్లో భోజనం చెయ్యాలని....ఇది నిజంగా జరిగేదెలా? ఎలా? ఎలా?

ఇ)తాతయ్యా - తక తయ్యా కాకపోయినా అలాటిదేదో అంటూ కథకళి టైపులో ఓ పదివేల మంది జనాల సమక్షంలో వీరనృత్యం చెయ్యాలని మనసులో ఉన్నది. అలాగని పోతరాజు లెక్క గాదనుకో ఓ పోరగా! పదివేల మందే? చాలా నాయనా? ఇప్పటికి మా బుఱ్ఱల మీదికెక్కి ఆడుతున్నావు చాలదా అంటావా? నీ జాతకంలో "అది" రాసుంటే ఆడటమేమి ఖర్మరా సుపుత్రా ! బుఱ్ఱ రామకీర్తన పాడేస్తా, ఆ కీర్తన సుస్వర సహితంగా వ్రాసిస్తా, చెవిలో సీసం పోసినట్టు వెచ్చగా నీకే వినిపిస్తా, ఆ తర్వాత తమరి ఆనందాతిరేక ముఖారవిందాన్ని లోకులకు చూపిస్తా! 

ఈ)చిలకమర్తి - పానుగంటి - వేలూరి - శ్రీపాద చతుష్టయానికీ, వేదం వేంకటరాయ శాస్త్రి, విశ్వనాథ, విద్వాన్ విశ్వం, తెన్నేటి సూరి గార్ల వీరాభిమానినవ్వటం మూలాన, వారి పుస్తకాల ప్రతులన్నీ శాసనాల్లాగా రాళ్ల మీద చెక్కించి, హాలీవుడ్డు సైనులా హార్స్లీ కొండల మీద ఆ ఎత్తులో నిలబెట్టి కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా వారి వ్రాతలు "నాగబు" లా వెలుగు రేకలు విరజిమ్మేలా చేయాలన్న బృహత్ ప్రణాలిక ఎప్పటికి సఫలం అవుతుందో?

ఉ)నడుచుకుంటూ మవుంట్ కైలాశ్ దర్శన భాగ్యం చేసుకోని, ఆతర్వాత ఈ ప్రపంచకంలో చూట్టం మిగిలిపోయిన ప్రదేశ విహరణ సొంత విమానంలో - ఏవా? ఈజిప్టు, జోర్డాన్ లోని పెట్రా, మెక్సికోలోని యూకటాన్, పెరులోని మాచు పిచు, ఆర్జెంటినాలోని ఇగువాజు జలపాతం, చిలీలోని అటకామా ఎడారి, క్రోయేషియా లోని లిట్వైస్ లేక్స్, ఇటలీలోని రోము,  టర్కీలోని ఇస్తాంబుల్, స్పెయిన్లోని సెవియె, జర్మనీలోని బెర్లిన్, బెల్జియంలోని బ్రస్సెల్స్, ఆఫ్రికా ఖండంలో మొరాకో, కెన్యా, టాంజనియా, బోట్స్వానా, ఇవి అన్నీ ఐపోయాక బ్రజిల్ లోని అమెజాన్ నదిలో ఆ చివరినుంచి ఈ చివరిదాకా ఒంటరిగా చిన్న పడవలో ప్రయాణం. ఏమిటిది? భారతదేశంలో ఏవీ లేవా? ఉన్నాయి, ఉన్నాయి - వాటి లిష్టు హైదరాబాదు నుంచి కొండవీడు దాకా ఉంది శంకరయ్య గారూ!

ఋ) చల్లపల్లిలో ఓ పేద్ద స్కూలు, 1000 బెడ్ల హాస్పిటలు - బందరులో ఓ పేద్ద స్కూలు, 2000 బెడ్ల హాస్పిటలు పెట్టెయ్యడం. ఆ నాలుగిట్లో ఫ్రీగా చదువు, ఫ్రీగా వైద్యం అందించటం.అన్నీ నా డబ్బుల్తోనే లేవయ్యా.....అడుక్కోడం, దానమివ్వండి - సాయం చెయ్యండి అనటం మా ఇంటా వంటా లేదు...

ౠ) చివరిగా చల్లపల్లిలోనో, బందరులోనో ఓ ఇరవై ఎకరాలు కొనుక్కోని సరిగ్గా మధ్యలో ఓ పాక వేస్కోని - ఓ ఎకరంలో బెల్లపు బట్టీ, ఓ ఎకరంలో కూరగాయలు, ఓ ఎకరంలో పళ్లు, అర ఎకరమంత గాడిబావి, ఓ ఎకరంలో జింకలు, ఇంకొన్ని ఎకరాల్లో కందులు, జొన్నలు, సజ్జలు, ఓ ఎకరంలో గుర్రాలు, ఓ ఎకరంలో నీ తలకాయ, చివరి ఎకరంలో ఆరడుగుల గొయ్యి, ఆ పక్కనే కట్టెలు, ఆయిలు డబ్బా....

అదిరా సంగతి.....ప్రస్తుతానికి ఈ ఎనిమిదిటితో బ్లాగు టపా సిరా అయిపోయింది.....బుద్ధి పుట్టినప్పుడు, సిరా తెచ్చుకున్నాక, మళ్లీ వస్తా....

ఎనిమిదన్నావు మధ్యలో ఊ మిస్సయ్యింది చూసావా?

ఊం.... :) :) మొత్తానికి టపా చదివావన్నమాట ఐతే!

శుభం! నీకు తిరుగులేదురా అబ్బాయి !

మఱి ఇరవైలో మిగిలినవేమున్నాయి? కొద్దిగా వివరిస్తావా?

వేదపాఠశాల స్థాపన, భాషా పరిరక్షణ, సురభి నాటక సమాజ పూర్వవైభవ స్థాపన....ఇలా....బోల్డు ఉన్నాయి స్వామీ!

10 comments:

 1. చాలా బావుంది మీ బకెట్ లిస్టు. అన్నీ నెరవేరుగాక అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఎటొచ్చీ (ఈ)తోనే కొంచెం డవుటు. వారివారి వారసులతో యవ్వారం మరి.

  ReplyDelete
 2. ఇవన్నీ నెరవేరాలంటే ఈ జన్మకాదు కదా, ఎనిమిది జన్మలు కాదు కదా ఎనిమిదివందల జన్మలు కూడా సరిపోవు! ఇహ మీరు వైకుంఠం చేరినట్టే! :-)

  ReplyDelete
 3. @ కొత్తపాళీ, జ్యోతి, ఆర్.కె - ధన్యవాద్

  @ కామేశ్వర రావు గారూ - గంటన్నర సినిమాలోనే వీరభద్రులు బోల్డు చేసేసారు! ఆ మాత్రం 70 ఏళ్లు వచ్చే లోపల మనం చెయ్యలేమా?...... :) కనకమాలక్ష్మి ఎప్పుడో ఒకప్పుడు నా నెత్తి మీద ఆడకపోతుందా? అప్పుడు చెయ్యకపోతానా? ఆశాజీవిని మరి! :)

  ఈ సినిమాలో జాక్ అంటాడు - We Live And We Die - Wheels On The Bus Go Round And Round. అలా ఎనిమిదొందల జనమలైనా సరే ప్రతి జన్మా బకెట్ తన్నేసే లోపల ఈ లిష్టులో ఒక్కోటీ చేస్కుంటూ పోటమే! మళ్లీ ఆశ మాటెత్తుతావూ! :) అది చావదు మాష్టారూ ! వేల తలల నాగరాజు! ఎన్ని పడగలు నరికినా ఒకటి మిగిలే ఉంటుంది!

  మీరు వైకుంఠం అనగానే, నా వైకుంఠపాళీ వదిలేసి ఈ సినిమాలో మోర్గన్ పాత్ర చేత అనిపించిన మాటలు గుర్తుకొచ్చాయి - Our Lives Are Streams. Flowing Into The Same River Towards Whatever Heaven Lies In The Mist Beyond The Falls అలా ఆ వైకుంఠంలోకీ ఎనిమిది వందల సార్లు పోవాలని రాసుంటే అంతకన్నా సంతోషమేముంది?

  చివరిగా ఓ మాట - మోర్గన్ Kopi Luwak అనే కాఫీ బీన్ గుఱించి జాక్ కి ఓ పేపర్ మీద రాసిస్తాడు...వీలుంటే ఆ కాఫీ బీన్ గుఱించి గూగ్లించండి.....అలాటి జనాలున్న ఈ ప్రపంచకంలో మన ఆశలు ఎప్పటికీ సజీవమే! :)

  ReplyDelete
 4. నాకు ఇలాంటి బోల్డు కోరికలు ఉన్నాయండి. కాని తీరేదెలా?? లక్ష్మిదేవి కరుణించదు. అందుకే నా అదృష్టం బాగుంటే ఆ దేవుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమ్మంటే ఒక్కటంటే ఒక్కటే కోరుకుంటాను.. నేను కోరుకున్నవన్నీ జరిగేలా చేసే మాయాఉంగరం ఇమ్మని. అది నా చేతికే ఉండాలి. ఎవరైనా ఎత్తుకెళ్లినా అది వాళ్లకు పనిచేయకూడదు. ఈ ఉంగరం సాయంతో ప్రపంచంలో ఉన్నవాళ్లందరికి సాయం చేసేద్దామనే పిచ్చి కోరిక..

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. వావ్. మీ లిస్టు ని బట్టి మీ మంచి టేస్ట్ తెలుస్తోంది.

  నా లిస్టులో ఒక ఐటం ఉంది :-). మీరు అక్కడక్కడా పెట్టే కామెంట్స్, చేయి పైకెత్తి మాడ మీద గోక్కోని హర్ట్ చేసుకోకుండా ఏనాటికయినా ఫస్ట్ అటెంప్ట్ లోనే అర్ధం చేస్కోవాలని :-)

  That was in lighter vein Sir :-)

  ReplyDelete
 7. ఈ జీవితానికి" ఆరడుగుల గొయ్యి, ఆ పక్కనే కట్టెలు, ఆయిలు డబ్బా.... " ఇవి చాలండి!

  ReplyDelete
 8. @కుమార్ - మీ లిష్టు మీది...అది పూర్తిచేసుకునే భారమూ మీదే! గోకుడు, మాడ మీవే కాబట్టి నా బాధ్యత లేదని తెలియచేస్కోటమైనది... "జగత్కారణమచ్యుతం" లా నేను కారణభూతుణ్ణి మటుకే! ఆస్వాదన, అనుభూతి, అనుభవం అన్నీ మీవే ....:)

  @అనిల్ - అవునండీ....ఎన్ని జన్మలకైనా కావల్సినవి అవే! లిష్టులో మొదలా, చివరా అనేది మనిషిని బట్టి...ఆయా లిష్టుల్లో ఈ పదార్థాలు - మొదలైతే అదే అంతు, చివరైతే అదే మొదలు.... :)

  ReplyDelete