Monday, November 8, 2010

లక్షా తొంభైఏడు వేల ఆరువందల పుట్టిన రోజులా? You mean 1,97,600 Birthdays? Jeez!

1,97,600 పుట్టినరోజులు - ఈ రోజు పొద్దున్న ఆఫీసుకు చేరటంతో నా రోజువారీ ప్రియ నేస్తం పూర్తిచేసుకుంది. ప్రతి వాహనానికి నడిచిన ప్రతి మైలూ ఒక పుట్టినరోజని నా నమ్మకం. అనగా ఏ పార్టూ గిట్టకుండానూ, సక్రమంగా పనిచేసిన్నూ, తర్వాత వచ్చే మైలు పరుగుపందానికి సిద్ధమయ్యిన్నూ, అందులో ఉన్నోడి డెత్తు డే చెయ్యకుండానూ ఇంటికి క్షేమంగా చేర్చి ఇంట్లో వాళ్లను ఆనందడోలికల్లో ఊగులాడిస్తూ ఉండటమన్నమాట.

ఎక్కడికైనా వెళ్దామంటే నేనెప్పుడూ రెడీనే అంటూ భుజాల మీదికెక్కించుకుని పరిగెత్తే స్నేహితులు ఎంతమంది? దగ్గిర దూరమైతే తాగటానికి ఓ టాంకు ఆయిలు మాత్రం కొట్టించు, దూరాభారమైతే వగరుస్తునప్పుడల్లా నువ్వే చూసుకుని నా గొంతులో ఆ తులసి తీర్థం పోస్తూ ఉండు అని చెవిలో ఓ మాట పడేసి తాళంచెవి పెట్టగానే ఆనందంతో ఓ కేక వేసి, గోల ఎక్కువైతే నేను నొచ్చుకుంటానేమో అని సాధ్యమైనంత మెత్తగా, సుతిమెత్తగా శబ్దం లేకుండా పరుగులుపెట్టే స్నేహితుణ్ని చూస్తే ఎవరికి మటుకు కావులించుకోవాలనిపించదు?

1997లో పుట్టి, పదమూడేళ్ల లేతవయసులోనే తన కన్నా ఎన్నో ఏళ్లు పెద్దవాళ్లమైన నాకు, మా ఆవిడకు బోల్డు ప్రదేశాలు చూపించి, ఆ ఆనందం చూసి తను ఆనందపడిపోయే స్నేహితుడిని ఏమనుకునేది?

షికాగోలో నేను వెచ్చగా హీటర్లేసుకుని దుప్పట్లో తొంగుంటే, బయట బట్టల్లేకుండా గజగజ వణికిపోతూ నెత్తిమీద, ఒంటి మీదా బోల్డు మంచుతో కప్పబడిపోయి, పొద్దున్నే లేచి నే బూతులు తిట్టుకుంటూ ఆ మీద పడ్డ మంచంతా శుభ్రం చేసేంతవరకూ ఆ నా తిట్లు వింటూ, ఓపిక చూపించే స్నేహితులెంతమంది? ఆపైన ఆ చలికి నేను తట్టుకోలేనేమో అని  కూర్చున్నాక హీటరేసి నా ఒళ్లు వెచ్చగా అట్టిబెట్టే స్నేహితుడికి ఎంతని ఋణపడేది?

మెక్సికోకెళ్లి సియుడాడ్ హువారెజ్ లో హెచ్ వన్ వీసా స్టాంపింగు చేయించుకొద్దామంటే ఎగిరి గంతేసి, ఆర్కన్సాస్ లోని బెంటన్ విల్ల్ నుండి ఎల్ పాసో, టెక్సాస్ వరకూ 1900 మైళ్ళ రవుండ్ ట్రిప్పు పయనానికి సై అంటూ పొద్దున్నే ఐదింటికి మొదలెట్టిన పరుగు ఆపకుండా రాత్రి తొమ్మిదిన్నరకు హోటల్లో మమ్మల్ని వదిలి అప్పుడు ఆయాసం తీర్చుకున్న స్నేహితుడికి ఏమని చెప్పేది?

లాన్సింగు, మిషిగన్ నుండి 1400 మైళ్లు (రవుండు ట్రిప్పు) సెయింట్ పాల్, మిన్నెసోటా కు తీసుకెళ్ళి  అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం నాడు చివరిసారిగా చూసిన స్నేహితుడిని మళ్లీ నా ముందు అలా అనాయాసంగా నిలబెట్టిన ఈ స్నేహితుడికి ఏమిచ్చేది?

లింకను, వాషింగ్టను, వైటు హవుసు చూద్దామని పోరితే ఓస్ - రవుండు ట్రిప్పు 1600 మైళ్లేగా - ఇంతేనా అని ఓ నవ్వు నవ్వేసి షికాగో నుండి ఓ గంతులో ఆ మహానుభావుల్ని చూపించిన ఈ స్నేహితుడికేమిచ్చేది?

అక్కడేదో పెద్ద ఆర్చీ ఉందిట , చూపిస్తావా అని అడిగితే ఓస్ ఇంతేగా అని రవుండు ట్రిప్పు 1000 మైళ్లు అలా అలా గాలిలో తేల్చుకుంటూ లాన్సింగు నుండి బయలుదేరి సెయింటు లూయిస్ చూపించిన ఈ స్నేహితుడికేమిచ్చేది?

అక్కడెక్కడొ కొలరాడొ నది భూమిని కోసిపారేసి ఈ లోతున గోతులు తీసింది, అవి చూపిస్తావా అంటే, బెంటన్ విల్ల్ నుండి గ్రాండ్ కాన్యన్ మధ్యనున్న రవుండు ట్రిప్పు 2300 మైళ్ల దూరాన్ని అలాగ్గా అలా పరిగెత్తుకుంటూ తీసుకెళ్లి చూపించిన ఈ స్నేహితుడికి ఏమిచ్చేది?

అదిగో అక్కడికెళ్తే క్యూబా కనపడుతుందిరా, చూపిస్తావా అంటే ఓ యెస్సంటూ 3200 మైళ్లు రవుండు ట్రిప్పుని మీదేసుకుని షికాగో నుంచి కీ వెస్టుకు తీసుకెళ్లి ఆనందంలో ముంచేసిన ఈ స్నేహితుడికేమిచ్చేది?

చూపించిన మిగిలిన చిన్న ప్రదేశాలనొదిలేసి, ఇహ మనం ఈ చలిని తట్టుకోలేమురా, చక్కగా పోయి కాలిఫోర్నియాలో ఉందాం అనగానే, చలైనా, వేడైనా, వానైనా నీతో ఎక్కడికైనా సరే అంటూ, వెనకాల సీట్లో - డిక్కీలో కుక్కగలిగినంత కుక్కేసిన సామానుకు బాధపడకుండా, షికాగో నుండి 2200 మైళ్ల దూరంలో ఉన్న శాక్రమెంటో నగరానికి రెండు రోజుల్లో చేర్చేసిన ఈ స్నేహితుడికి ఏమిచ్చేది?

పాప పుట్టాక గంతులేసి లాస్ ఏంజిల్స్ తీసుకెళ్లి హాలీవుడ్డు చూపించిన ఈ స్నేహితుడికి ఏమిచ్చేది?

ఇలా చెప్పుకుంటూ పోతూ ఉన్నా ఎంతో ఋణపడిపోయిన ఈ స్నేహితుడికి న్యాయం చెయ్యలేనేమో అన్న బాధతో!

ఇన్నేళ్లలో ఒక్క ట్రాఫిక్ టికెట్టు కూడా ఇప్పించని, ఇంటికి ప్రతిరోజూ క్షేమంగా చేరుస్తూ ఉన్న ఈలాటి స్నేహితుడు దొరికినందుకు ఆ భగవంతుడికి వేల దణ్ణాలతో !2 comments:

  1. మీకూ, మీ వాహనానికీ శుభాకాంక్షలు!! 'అన్నమయ్య' సినిమాలో, ఆఖరి సీనుకి డయలాగ్గులు మీరు కానీ వ్రాశారా ?

    ReplyDelete
  2. ఫణిబాబు గారూ....బాగుంది మీ జోకు! కలర్ తెలుగు సినిమాలు నేను చూడను కాబట్టి మీరన్న అన్నమయ్య సినిమా గురించి కానీ, దానిలో ఆఖరి సీను గురించి కానీ నాకు తెలవదు. నా వాహనకథకే ఇంకాస్త ఇమోషను కలుపుదామనుకున్నా...జనాలు బెంబేలెత్తుతారేమోనని డోసు తగ్గించా! :) మీకు గానీ నచ్చితే మీరు తీసే పున్నమయ్య సినిమాలో చాన్సు ఇప్పించండి...అదీ బ్లాక్ అండ్ వైటులోనే తియ్యమని ప్రార్థన...మీక్కావలసినంత ఇమోషనల్ సరుకు ఇవ్వగలవాడనని తెలియచేసుకుంటున్నాడ..

    ReplyDelete