Thursday, September 30, 2010

ఎమ్మెస్ - కె.ఎస్ - డి.ఎస్ - బేబీ సరోజతమిళ డైరెక్టరు కె.ఎస్.సుబ్రహ్మణ్యం, ఆయన భార్య డి.ఎస్.సుబ్బలక్ష్మి, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, బాలనటి బేబీ సరోజ ల చిత్రం

మిత్రులు ఆలన్ బార్ట్లే గారి సౌజన్యంతో (మార్కస్ బార్ట్లే గారి కుమారుడు)

Wednesday, September 29, 2010

ఆకాశవాణి - శారదా శ్రీనివాసన్‌ గారి పరిచయ కార్యక్రమం
మహానటి సావిత్రి కళ్లలో నవరసాల్ని ఒలికిస్తే ఈమె తన గళంలో పలికిస్తారు. ఆమె చిత్రజగత్తు నేలిన అభినేత్రి అయితే ఈమె ఆకాశవాణి వాచకాభినేత్రి. 1960-90ల మధ్య కాలంలో రేడియో నాటకం విన్నవారు ఆమె వాచకాన్ని, అలలలలుగా వినబడే ఆ నవ్వుని మరిచిపోవడం అసంభవం. పురూరవలో ఊర్వశిగా, సుప్తశిలలో అహల్యగా, కాలాతీతవ్యక్తుల్లో ఇందిరగా, భాగ్యనగరంలో భాగమతిగా, కంఠాభరణంలో సుబ్బలక్ష్మిగా ... కొన్ని వేల పాత్రలకు రేడియోలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన శారదా శ్రీనివాసన్‌గారి జ్ఞాపకాలు ఆంధ్రజ్యోతి వారు అక్షర రూపంలో పదిలపరిస్తే, స్వరంలో ఆకాశవాణి వారు 2008 వ సంవత్సరంలో పదిలపరచారు. ఆ ఆకాశవాణి పరిచయ కార్యక్రమాన్ని రికార్డు చేసి పంపించిన మిత్రులు శ్రీ రంజని (తెలుగుథీసిస్.కాం) గారికి హృదయ పూర్వక ధన్యవాదాలతో...

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి - ఆ సెక్షన్లో ఆ కార్యక్రమం చూడవచ్చు, వినవచ్చు....

ఆంధ్రజ్యోతి వారన్నారు, వార్తన్నారు, వ్యాసమన్నారు మరి - అదెక్కడ ఉందా? పరిచయ కార్యక్రమం మొదటి భాగం పేజీలో !

భవదీయుడు
వంశీ

Sunday, September 26, 2010

రావు బాలసరస్వతి - రంగనాయకమ్మఇష్టా గోష్టి

"వేదికపై నాటకం రసవత్తరంగా జరుగుతోంది. ఒక ప్రధాన పాత్రధారి రామనాధశాస్త్రిగారు ఆ సందర్భాన పాడవలసిన పాటను ప్రారంభించారు. ఇంతలో ఆహుతుల్లోంచి 4ఏళ్లపాప ఆ పాట నాకునూ వచ్చు నేను పాడతాను అంటూ గట్టిగా అరిచింది. పెద్దలు ఎవ్వరూ చెపినా వినదే! నేనూ పాడతానంటూ మారం చేసింది. చివరికి రామనాధశాస్త్రిగారు ముచ్చటపడి ఆ పాపను స్టేజిపైకి పిలిచి ఆ పాటను ఆమెచేతే పాడించారు. ప్రేక్షకులంతా కరతాళధ్వనులు చేశారు. అభినందనలు అందించారు. ఆశీర్వదించారు.మరో రెండేళ్లకే ఆ అమ్మాయి ఒకేసారి 2సోలో రికార్డులు పాడిన పిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. ఇదంతా 1934నాటి మాట. ఆ అమ్మాయి సంగీతవనంలో మొదటిసారిగా 'లలిత సంగీతమనే పుష్పాన్ని పూయించిన తోటమాలి. ఇప్పుడు ఆ స్వరకేళికి 80ఏండ్లు. కానీ రావు బాలసరస్వతీదేవి పేరు దక్కిన ఖ్యాతి నిలిచేను వెయ్యేళ్లు." - "వార్త" పత్రికలో రావు బాలసరస్వతి గారి మీద ప్రచురించిన వ్యాసంలోని మాటలివి.

పాటలు అనే పదార్ధం ఇష్టం ఉన్నవారెవరికైనా ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరం లేదనే ఇంతవరకూ అనుకుంటున్నాను. అలాగే మనకున్న రచయిత్రుల్లో రంగనాయకమ్మ గారి గురించీ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మరి గానకోకిల రావు బాలసరస్వతి గారు - రచయిత్రి రంగనాయకమ్మ గారు ఇష్టా గోష్టి కార్యక్రమంలో పాల్గొంటే ఏలా ఉంటుంది ? ఆ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 1992 లో. అదే కార్యక్రమాన్ని ఈ నెల 25వ తారీకున పునః ప్రసారమూ చేసింది.

ఆ పునఃప్రసార అవకాశాన్ని ఒడిసిపట్టుకుని "రంజని" గారు ఆ ఆడియోను రికార్డు చేసి వెబ్సైటులో పబ్లిష్ చెయ్యమని పంపించారు. అందుకు రంజనిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో...

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి - ఆ సెక్షన్లో ఆ కార్యక్రమం చూడవచ్చు, వినవచ్చు....

ఆనందో బ్రహ్మ

మళ్ళీ బ్లాగు దర్శన ప్రాప్తిరస్తు, పునఃప్రాప్తిరస్తు
సందర్శకులకు సందడీ పుణ్య ప్రాప్తిరస్తు

భవదీయుడు
వంశీ