Wednesday, May 26, 2010

మీ కడుపు సొరంగమా? ఐతే !!!

మా రామారావు - చూస్తే చీపురుపుల్లంత, కాకుంటే నోళ్ళు గీక్కునే తాటాకంత బక్కపలచగా ఉంటాడు. కానీ భోజనానికి కూర్చుంటే ఆరు నిండు పళ్ళాలు (పెద్దిస్తరాకులంతటివి) ఉఫ్ఫున లాగిపారేస్తాడు. మహానుభావుడు. ఆ సర్వలోకరక్షకుడు "తిండేశ్వర స్వామి" వారిని సదా స్మరిస్తూ తన పూర్వాశ్రమంలో ఘోరమైన తపస్సు చేసి మేరు పర్వతంతో సహా ఏ పదార్థం భుజించినా అరాయించుకునే శక్తీ, వరమూ పొందిన మహామహిమాన్వితుడు, భక్తాగ్రేసరుడు. ఆయనతో ఒక సాయంత్రం, అదీ వారింట్లోనే వారి పక్కన నా సమయాన్ని గడిపే అవకాశం ఈ మధ్య లభించింది. నేను మాటల్లో వివరించలేని అదృష్టం చేసుకుని ఉంటేనో, నా పూర్వజన్మలో పట్టలేని సుకృతమో చేసుకుని ఉంటేనో తప్ప - అలా ఒక సాయంత్రం పూట ఆయన (రామారావు) పక్కన కూర్చునే అవకాశం వస్తుందనిన్ని. వారితో పాటు భోజనంచేసే అవకాశం నన్ను వరిస్తుందనిన్నీ కలలో కూడా అనుకోలా. ఆ అవకాశం కూడా చాలా అనూహ్యంగా నా పాల బడింది. వివరాల్లోకి ఎందుకు గానీ, ఆ అవకాశం వచ్చినందుకు, నన్ను వరించినందుకు ఎంతో తబ్బిబ్బు అయిపోయాను.

పిచ్చాపాటీ అయ్యింది. తేనీరు సేవించడం అయ్యింది. పుస్తకాల గురించీ, ఆయన "బాతు"రూము రాగాల(కూనిరాగాల) గురించీ, బ్లాక్ అండ్ వైటు సినిమాల గురించీ, నాటక రంగం గురించీ మాటలయ్యాయి. ఏడున్నర అవడంతోనూ శ్రీమతి రామారావు గారు భోజనానికి లెమ్మని చెప్పడంతోనూ ఆయన వాక్ప్రవాహానికి అడ్డుకట్ట పడి "భోజన" ప్రవాహం, ప్రహసనం మొదలయ్యింది. సముద్రానికీ, రామారావుకు అడ్డుకట్టలు వెయ్యటం/కట్టటం ఈ భూప్రపంచకంలో సాధ్యమయ్యే పనికాదని నా ప్రగాఢ నమ్మకం. ఇంతవరకూ వమ్ము కాలేదు. ఇకముందు అవుతుందన్న ఆశా లేదు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి, ఆవిడ చేతి వంట అమృతప్రాయమే. గత ఇరవైదేళ్ళుగా ఒరే అంటే ఒరే అని పిలుచుకునే చనువు గల మా రామారావు అలా భోజనప్రియుడిగా, ఎంత తింటున్నాడో కూడా తెలీకుండా విస్తళ్ళు విస్తళ్ళు లాగించి "ఉపమ" కుదరకపోయినా బాన బాణాసురుడిలాగా పెంచిన్నూ, బకాసుర వేషంలోకి పరకాయప్రవేశం చెయ్యటానికిన్నూ పూర్తి బాధ్యత ఆవిడదేననిన్నీ, ఆవిడ వంటదేననన్నీ ఘాట్టిగా నొక్కి వక్కాణించి చెప్పొచ్చు.

ఓం ప్రథమంగానూ, పనిలో పనిగానూ అసలు వడ్డించిన వంటకాలేమిటో చెప్పి తరువాత ఆయన వీరావేశంతో అవిక్రపరాక్రమంగా అలెక్జాండరును నిలువరించిన పురుషోత్తముడిలా వాడైన దంతాలతో తన "భోజన"దాడిని ఎలా విజయవంతంగా సాగించాడో వివరించటానికి / మొదలెట్టటానికి నిశ్చయమయింది కావున మీరు అలా అలా చదూకుంటూ పోండి. మొదటగా ఎనిమిది గ్లాసుల రైసుకుక్కరులో 8 గ్లాసులూ సోనామసూరి బియ్యం పోసి వండిన అన్నం, తెల్లగా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూండగా, రామారావుకు నాలుగు పెద్ద కరుళ్ళు, నేను అభ్యంతరం చెప్పగా ఒకటే పెద్ద కరుడు వేసి పక్కనే గుత్తివంకాయ కూర వడ్డించగా ఆ ఘుమఘుమలకే సగం కడుపు నిండింది. అదేమిటి ఘుమ ఘుమలు అప్పటిదాకా రాలేదా అని అడుగుతున్నారా? వారి 4000 అడుగుల ఇంట్లో వంటశాల ఓ మారుమూల ఉండడం మూలానూ, ఆ వంటశాలలో ఈవిడ వంటల మహత్యం తెలిసిన మా రామారావు చాలా బలమైన ఎగ్జాష్టు పెట్టించటం మూలానూ, మేము కూర్చున్న హాల్లో మానసికోల్లాసం కోసం మా రామయ్యగారు టార్గెట్టులో ఆరోజే కొన్న గ్లేడ్ వత్తులు/కొవ్వొత్తులు ఆరు వెలిగించడం మూలానూ కొద్దిగా వంటల ఘుమ ఘుమలు ముక్కుకు పట్టలేదనే చెప్పాలి.

సరే సరే...తరువాయి వంటకం - ఆవపెట్టిన పులిహోర, పైగా షార్టుకట్టు నిమ్మకాయ కాకుండా చింతపండు పులిహోర - ఆహా ..మ్మ్మ్..మ్మ్మ్...మ్మ్మ్...అందులోనూ పొద్దున్నే ఆవపెట్టగా, సాయంత్రానికి వచ్చే రుచితో ఇంకేది సాటి? ఆ తర్వాత వడ్డించిన వంటకమేమనగా కంది పచ్చడి, అందులోకి పోసుకోడానికి వేడి వేడి పచ్చిపులుసు - వంకాయ ఒవెనులో బ్రహ్మాండంగా కాల్చి, ఎన్నో ఉల్లిపాయలేసి, బోల్డంత ఇంగువేసి పైనుంచి వాళ్ళమ్మమ్మ వాళ్ళింట్లోనుంచి తెచ్చుకున్న రాచిప్పలోపోసి కళ్ళెదురుగా పెడితే ఎక్కడికో పరుగులెత్తాల్సొచ్చింది. ఎక్కడికి బాబూ ? మా చల్లపల్లికి బాబూ, మా అమ్మమ్మగారింటికి బాబూ...అసలు పరుగెందుకు బాబూ అనడుగుతారా?... హ్మ్మ్ ...హ్మ్మ్మ్...హ్మ్మ్....సరే పచ్చిపులుసు పోసుకుని అదేదో లోకాలకు వెళ్ళి అక్కడ విహరిస్తూండగా, "ఆ ఆవడలు ఇటు తీసుకురా వాణీ" అన్న రామారావు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డా....మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోతూ ఉండగా అనుభవించిన ఆనందం చెప్పలేనిది. కాకుంటే వెరైటిగా ఆవిడ పైనాపిలు అనగా అనాస ముక్కలు కూడా ఆ పెరుగులో నానబెట్టి ఆవడలతో పాటూ వెయ్యగా ఆనందం రెట్టింపు అయ్యింది. ఆ తరువాత వేసిన గడ్డపెరుగులో నంచుకోటానికి "ఆంధ్రమాత" అందించిన ఆనందం ఏమని చెప్పేది.

ఇవి అన్నీ అయ్యాక, మా రామారావు ధాటికి మూడురోజులకో బాక్సు అయిపోయే మావిడి పళ్ళ బాక్సులోనుంచి మాంచి కాయలు - అనగా అటు దోరా కాక, ఇటు మగ్గిపోయినవీ కాక ఉన్న ఒక నాలుగు మావిడిపళ్ళు తీసి ముక్కలు కోసి "డిజర్టు" కింద లాగించగా, (ఆ నాలుగిట్లో నేను తిన్నది ఒక్కటే అని మనవి) - ఇహ మీరే ఊహించుకోవచ్చు..

ఈ పై వంటకాలన్నిటికీ విడివిడిగా స్టాండర్డు కరుళ్ళు నాలుగు మా రామారావుకు, ఐతే ఇప్పుడో ప్రశ్న పాఠక జనాలకు - మొత్తం రామారావు తిన్న కరుళ్ళు ఎన్ని? తప్పుడు సమాధానం చెప్పారో మీ పొట్ట నాలుగు చెక్కలయ్యి సొరంగంలో పడిపోవుగాక అని శాపం.

ఇహ అసలు సంగతికొస్తే భోజన సమయంలో రామారావుకు నాకూ జరిగిన సంభాషణ

రా: ఈ పైవాడికి బుద్ధి లేదురా

నే: ఏ పైవాడు, ఎవడికన్నా పైన పోర్షను అద్దెకిచ్చావా?

రా: ఎహె కాదురా, పైవాడంటే ఆ పైవాడు - దేవుడు

నే: ఏమిటి? ఏమయ్యింది ఇప్పుడు ఆయన మీద పడ్డావు?

రా: మనకు అసలు ఇంత చిన్న పొట్ట ఇవ్వటంలో ఉద్దేశమేమిటీ అని!

నే: ఉన్న ఒక్క చిన్నదాన్ని నింపటానికే బోల్డు కష్టాలు కదరా. ఎంతది కావాలి నీకు ?

రా: ఎహె ఊర్కో! ఎక్కువ తిందామంటే పట్టదూ చావదూ. ఓ పెద్ద సొరంగం లాటిదో, ఏడెనిమిది గదుల్లాటివో ఉంటే ఎంత బాగుండు.

నే: హహహ....హహహ...ఏమిటీ మళ్ళీ చెప్పు

రా: నీకు నవ్వులాటేరా. మాంచి పదార్థాలు తిందామంటే ఈ చిన్నదాన్లోకెట్లా ఎక్కించేది. సూదిలో దారం లాగా ఉంటే ఎట్లా. సూది బదులు గునపమైతే బాగుండేది కదరా!

నే: అలాగ సొరంగాలుంటే ఇహ రాత్రీ పగలూ లేకుండా ఎన్నైనా లోపలెయ్యొచ్చు అంటావు

రా: అంతేగా. దాంతో పాటు ఎన్ని వీశెలు తిన్నా అలా లటుక్కున అరిగిపోయేట్టు ఏదన్నా రుబ్బురోలు లాటిది కూడా మన పొట్టలో పెట్టాలి.

నే: హ్మ్మ్మ్...

రా: హ్మ్మ్మ్...ఏమిటి...హ్మ్మ్...ఏమిట్రా - అలాగే ఐదారు పేద్ద ముద్దలు ఒకేసారి అలా నోట్టో వేసుకుందుకు ఓ పేద్దనోరు కూడా ఇస్తే బాగుండేది

నే: అప్పుడు మనల్నిమనం మనుషుల జాతి అని పిల్చుకోలేమేమోరా

రా: పోనీ ఎవడిక్కావాలి. చక్కగా కావాల్సింది కడుపుకు తినలేకపోతే మనుషులైతే ఏమిటి? మురుగుకాల్వైతే ఏమిటి?

నే: ఒరే ఎక్కడికో పోతున్నావు....

రా: $%%^&

నే: ఒరే! ఆపరా బాబూ - తిననీ

రా: $%్**

నే: హహ...సరే లే!


ఇలా ఇంకా బోల్డంత సంభాషణ జరిగింది....క్లుప్తంగా మీ కళ్ళముందుంచటమూ అయ్యింది. తరువాతి భాగంలో తరువాయి సంభాషణ ...

ఇహ శలవు తీసుకుని బయలుదేరుతుండగా "లక్ష్మి" ఎదురొచ్చింది. లక్ష్మి ఎవరు? ఏమా కథా? లక్ష్మి మా రామారావు గారి ఎనిమిదేళ్ళ కుమార్తె. అసలు పేరు "భాగ్యలక్ష్మి". పేరుకు తగ్గట్టే చక్కగా ముద్దుగా మరింత బొద్దుగా అలరారే చిన్నమ్మి. నేను రెండేళ్ళ క్రితం ఓసారి "భాగ్యం ఇలా రామ్మా" అన్నానని మిస్సెస్ రామారావు ఒక ఆర్నెల్లు నాతో మాట్టాడాలా. వేరే ఉద్దేశమేదీ లేదండీ అని చెప్పినా సరే, ఉహూఁ - వినలా. తర్వాత్తరవాత ప్రతాదివారం పిల్లలకు నేను చెప్పే తెలుగు పాఠాలకు పంపిస్తూ, "భాగ్యం" భాఘా తెలుగు నేర్చుకుని పద్యాల్లోకి దిగిపోయాక ఆవిడ కోపం తగ్గిందన్నమాట. ఇంతకీ ఆవిడకు కోపం రాటానికి కారణమేమనగా - భాగ్యలక్ష్మి అన్న పేరు "వాణి" వాళ్ళ అమ్మమ్మ గారి పేరని , అలా ఎవరైనా భాగ్యం అని పిలిస్తే వాణి గారి చేతిలో రాచ్చిప్ప ప్రత్యక్షమవుతుందనీ - భాగ్యాన్ని "భాగ్యం" అని పిలిచేదాకా నాకు తెలియదు. కాకుంటే నేను "భాగ్యం" అన్నప్పుడు రాచ్చిప్పను చూడలా.

చెప్పొచ్చేదంటంటే - ఎవరికైనా అజీర్ణం చేసో, తిన్నదరక్కో (రెండూ వేరు వేరు - అందులో సందేహమేమీ లేదు) బాధలు పడుతుంటే మా రామేశ్వరులను దర్శించుకోండి. పుణ్యలోక ప్రాప్తిని పొందండి

PS: రామారావూ - ఇదిగో నువ్వడిగిన పోష్టు - మళ్ళీ ఇదంతా రాసానని నన్ను ఏకొద్దు - అడిగావూ - ఐతే నీ ఖర్మ అని ముందే చెప్పా! ఈ పోష్టు నీకే జన్మజన్మాలకూ అంకితం...పళ్ళాల, పదార్థాల ఫోటోలు పెట్టలేదు, దిష్టి కొడుతుంది అని...క్షమించు..

11 comments:

 1. LOOOOL - Too good! Had my lunch just before reading this post and guess what, I am hungry now!

  ReplyDelete
 2. హ్హ హ్హ హ్హ! బాగుంది. మా అమ్మమ్మ ఇలాంటి భోజనప్రియుల్ని చూసినప్పుడల్లా మాంచి టంగ్ ట్విస్టర్ లాంటి మాటొకటి "లక్ష భక్ష్యాలు తినే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యం ఒక లక్ష్యమా" అంటూండేది.

  ReplyDelete
 3. హ హ హ అదిరిందండి బాబు . వాసి కన్నా రాసి ముఖ్యం అనేవారిని ఏమి చెయ్యగలం నాలుగు వాయల ఇడ్లి లు వేసి దివించెయ్యడమే... నాకు ఆ లాజిక్ బోదపడదు పార్టీలలో కూడా చూస్తానా సన్నగా ఉండెవాళ్ళ ప్లేట్ నిండిపోతుంది సుమండీ . మీ బ్లాగ్ మిస్సెస్ సుబ్బారావు గారి వంట లాగే ఘమ ఘమలాడింది.

  ReplyDelete
 4. Vamsi M Maganti గారూ...,

  నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
  ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
  నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
  మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

  తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
  తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
  హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

  మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

  - హారం ప్రచారకులు.

  ReplyDelete
 5. చదువుతూ ఉంటే తింటున్నట్టు అనిపించిన్దండీ. ఫోటోలు పెడితే ఇంకా చాలా బాగుండేది. దిష్టేమిటండీ దిష్టి.. చక్కగా కడుపుకు తినడం కోసమేగా ఎవరైనా కష్టపడేది. అసలు అలా తినడం అరాయిన్చుకోడం కూడా ఒక గొప్ప అదృష్టం. ఆ రకంగా అదృష్టవంతులయిన రామారావు గారికి శుభాకాంక్షలు. ఒక్కోసారి తినే శ్రద్ధ మగవారికి ఉన్నా భార్యలకి రుచిగా వంట చేసిపెట్టె శ్రద్ధ ఉండదు. కాబట్టి శ్రీమతి & శ్రీ రామారావు గార్లకి హృదయపూర్వక శుభాకాంక్షలు.

  ReplyDelete
 6. :)
  ________________________________
  చక్కగా కావాల్సింది కడుపుకు తినలేకపోతే మనుషులైతే ఏమిటి?
  ________________________________

  Truly Said!!

  ReplyDelete
 7. >> ఎనిమిది గ్లాసుల రైసుకుక్కరులో 8 గ్లాసులూ సోనామసూరి బియ్యం పోసి వండిన అన్నం

  వంశీ గారు, మేమొల్లమండి.. మేము బియ్యం ఒకటికి ఒకటికి మూడు నీళ్ళ కొలత కనుక, చక్కగా పొత్తల్లే ఉడకాలంటే ఐదు కన్నా వండలేము. కాస్త పలుగ్గా సగం ఉడికీ, సగం బియ్యంగా అంటే ఓకే గాని.

  మీకప్పుడే ఆంధ్రమాత దొరుకుతుందన్నమాట? మావి వేలంత మొలకలే..ఎప్పుడు నాలుగాకులు వచ్చేనో, మేము పచ్చడి నూరేమో గాని.

  మేము వంకాయలు ఇప్పుడు బి.బి.క్యు. పొయ్యి మీద కాల్చి మన కుమ్మోంకాయ తిన్నంత ఆనందపడుతున్నాం. :) ఏమనుకోరనే, నిజానికి ఈ పచ్చిపులుసు పొలాల్లో కోతల పనికి పక్కూరు నుంచి వచ్చి చేసేవారి దగ్గర నోరూరుంచే రుచి [ట], తినే భాగ్యం కలగలేదుగాని. ప్రక్కగా వెళ్తుంటే ఘుమ ఘుమలు, మాయాబజార్ లో మదిరి రాచ్చిప్ప మొత్తమ్ జుర్రేయాలన్నట్లుగగా


  మామిడికాయలు "కేసరి" రకం కాకపోతే అవి తినాల్సిందే.
  ఇక భోజనప్రియులని చూస్తే అబ్బురమే ఎప్పటిలా.

  ఈ [లాంగ్] వీకెండ్ ఏమి వండుకోవాలో లిస్ట్ ఇచ్చేసారు, ధన్యవాదాలు.

  ఆ సంభాషణ ఒకసారి సిడ్నీలో నేరేళ్ళ వేణుమాధవ్ గారు మేమిచ్చిన విండు తర్వాత నవ్విస్తూ చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చాయి.

  ReplyDelete
 8. అందరికీ ధన్యవాద్....రామారావు దంపతులు బోల్డు సంతోషపడిపోయామని చెప్పమన్నారు మీకందరికీ...

  @ఉషగారూ - మీరు "నిజంగా" చదువుతారు ఏదైనా. 8 గ్లాసుల కుక్కరులో 8 గ్లాసులు బియ్యం పోసాక, 14 గ్లాసుల (ఇక్కడ గ్లాసులంటే కొలత కప్పులు అనీ) నీళ్ళు పడతాయనీ, సోనా మసూరీకి ఆ 14 చాలనీ "వాణి" గారు తెలియచేస్తున్నారు. :)

  ReplyDelete
 9. ఇంతకీ ఎవరూ రామారావు పొట్టలోకి ఎన్ని కరుళ్ళు వెళ్ళాయో చెప్పలేదనీ....నీ...నీ...నీ...

  ReplyDelete
 10. వంశీగారు,
  తిన్నారా లేదా అన్నది ముఖ్యం కాని ఎంత తిన్నాడని లెక్క కడతారటండి?? ప్లేట్ మీల్స్ పెట్టే హోటలోడు తప్ప.. మీరు మరీను.. నాకు డౌటు.. ఇక్కడ మీరు, రామారావు ఇద్దరూ తారమారయ్యారేమో అని.

  ReplyDelete
 11. వంశీగారు, నాకు వంటపిచ్చి కనుక మళ్ళీ రాక తప్పట్లేదు ఈ టపా చదవను :) ఇక ఆ లెక్కలు, పాళ్ళలో తేలిందేమిటంటే వారిది కరక్కాయలు నవిలి పారేసే వంశం..మాది నూకలన్నం నెమరేసే జాతి..
  పోగా మా ఇంట్లో ఒక పద్దతి ఉంది - తినేవారికి దిష్టి అని లెక్కలు నోటితో చెప్పటం కాక వేళ్ళతో చూపటం..కనుక మీ దంతసిరి రామారావు గారి కరుళ్ళ లెక్క ఆ విధంగానే నాకున్న ఇరవై వేళ్లలో కొన్నిటితో ఇక్కడ చూపటం జరిగింది.. :)

  ఇక కూరలో కర్వేపాకు [నేను తినేస్తా కానీ]... ఆ "నిజంగా" అని నొక్కివక్కాణించారని; నన్నొకరు అలా ప్రతీది నిజంగా/నిజమే అనుకుని/ నిజానిజాలు వదిలి చదవటమే నీ లోపం అన్నారు. వాదన ఇంకా కొనసాగుతుంది. :)

  ReplyDelete