Sunday, May 30, 2010

స్వర సుధాకరులు - ఆకాశవాణి - చిత్రాలు

శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారు తన సాహిత్యాభిమానిబ్లాగులో పెట్టిన "రేడియో కళాకారుల" చిత్రాలే కాక ఇతర ఫోటోలు కూడా పంపి నన్ను ఎంతో ఆశ్చర్యంలోనూ, ఆనందంలోనూ ముంచేసారు. వారికి బోల్డన్ని..బోల్డన్ని..బోల్డన్ని కృతజ్ఞతలు.

ఇక్కడ నొక్కండి - అక్షర చిత్రాలు

ఒకమాట మటుకు చెప్పాలె - శ్రీ అద్దంకి మన్నార్ గారి గొంతు విని మైమర్చిపోతూ ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ణి. భగవంతుడు ఇంత మంచి గాత్రం ప్రసాదించాడు - మనిషి ఎలా ఉంటారో అని! శివరామప్రసాద్ గారి పుణ్యమా అని ఆ అందగాణ్ణి చూసే భాగ్యమూ, వెబ్సైటులో పెట్టుకునే పుణ్యమూ దక్కినాయి. ధన్యోస్మి...ధన్యోస్మి...

మీరెవరి వద్దైనా ఇలాటివి ఉండి పంచుకోవాలనుకుంటే, maganti dot org at gmail dot com కు ఈమెయిలు పంపించండి....అలా పంచుకోవాలనుకున్న మహానుభావులకు ముందస్తు వందనాలు - ధన్యవాదాలు.

Wednesday, May 26, 2010

మీ కడుపు సొరంగమా? ఐతే !!!

మా రామారావు - చూస్తే చీపురుపుల్లంత, కాకుంటే నోళ్ళు గీక్కునే తాటాకంత బక్కపలచగా ఉంటాడు. కానీ భోజనానికి కూర్చుంటే ఆరు నిండు పళ్ళాలు (పెద్దిస్తరాకులంతటివి) ఉఫ్ఫున లాగిపారేస్తాడు. మహానుభావుడు. ఆ సర్వలోకరక్షకుడు "తిండేశ్వర స్వామి" వారిని సదా స్మరిస్తూ తన పూర్వాశ్రమంలో ఘోరమైన తపస్సు చేసి మేరు పర్వతంతో సహా ఏ పదార్థం భుజించినా అరాయించుకునే శక్తీ, వరమూ పొందిన మహామహిమాన్వితుడు, భక్తాగ్రేసరుడు. ఆయనతో ఒక సాయంత్రం, అదీ వారింట్లోనే వారి పక్కన నా సమయాన్ని గడిపే అవకాశం ఈ మధ్య లభించింది. నేను మాటల్లో వివరించలేని అదృష్టం చేసుకుని ఉంటేనో, నా పూర్వజన్మలో పట్టలేని సుకృతమో చేసుకుని ఉంటేనో తప్ప - అలా ఒక సాయంత్రం పూట ఆయన (రామారావు) పక్కన కూర్చునే అవకాశం వస్తుందనిన్ని. వారితో పాటు భోజనంచేసే అవకాశం నన్ను వరిస్తుందనిన్నీ కలలో కూడా అనుకోలా. ఆ అవకాశం కూడా చాలా అనూహ్యంగా నా పాల బడింది. వివరాల్లోకి ఎందుకు గానీ, ఆ అవకాశం వచ్చినందుకు, నన్ను వరించినందుకు ఎంతో తబ్బిబ్బు అయిపోయాను.

పిచ్చాపాటీ అయ్యింది. తేనీరు సేవించడం అయ్యింది. పుస్తకాల గురించీ, ఆయన "బాతు"రూము రాగాల(కూనిరాగాల) గురించీ, బ్లాక్ అండ్ వైటు సినిమాల గురించీ, నాటక రంగం గురించీ మాటలయ్యాయి. ఏడున్నర అవడంతోనూ శ్రీమతి రామారావు గారు భోజనానికి లెమ్మని చెప్పడంతోనూ ఆయన వాక్ప్రవాహానికి అడ్డుకట్ట పడి "భోజన" ప్రవాహం, ప్రహసనం మొదలయ్యింది. సముద్రానికీ, రామారావుకు అడ్డుకట్టలు వెయ్యటం/కట్టటం ఈ భూప్రపంచకంలో సాధ్యమయ్యే పనికాదని నా ప్రగాఢ నమ్మకం. ఇంతవరకూ వమ్ము కాలేదు. ఇకముందు అవుతుందన్న ఆశా లేదు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి, ఆవిడ చేతి వంట అమృతప్రాయమే. గత ఇరవైదేళ్ళుగా ఒరే అంటే ఒరే అని పిలుచుకునే చనువు గల మా రామారావు అలా భోజనప్రియుడిగా, ఎంత తింటున్నాడో కూడా తెలీకుండా విస్తళ్ళు విస్తళ్ళు లాగించి "ఉపమ" కుదరకపోయినా బాన బాణాసురుడిలాగా పెంచిన్నూ, బకాసుర వేషంలోకి పరకాయప్రవేశం చెయ్యటానికిన్నూ పూర్తి బాధ్యత ఆవిడదేననిన్నీ, ఆవిడ వంటదేననన్నీ ఘాట్టిగా నొక్కి వక్కాణించి చెప్పొచ్చు.

ఓం ప్రథమంగానూ, పనిలో పనిగానూ అసలు వడ్డించిన వంటకాలేమిటో చెప్పి తరువాత ఆయన వీరావేశంతో అవిక్రపరాక్రమంగా అలెక్జాండరును నిలువరించిన పురుషోత్తముడిలా వాడైన దంతాలతో తన "భోజన"దాడిని ఎలా విజయవంతంగా సాగించాడో వివరించటానికి / మొదలెట్టటానికి నిశ్చయమయింది కావున మీరు అలా అలా చదూకుంటూ పోండి. మొదటగా ఎనిమిది గ్లాసుల రైసుకుక్కరులో 8 గ్లాసులూ సోనామసూరి బియ్యం పోసి వండిన అన్నం, తెల్లగా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూండగా, రామారావుకు నాలుగు పెద్ద కరుళ్ళు, నేను అభ్యంతరం చెప్పగా ఒకటే పెద్ద కరుడు వేసి పక్కనే గుత్తివంకాయ కూర వడ్డించగా ఆ ఘుమఘుమలకే సగం కడుపు నిండింది. అదేమిటి ఘుమ ఘుమలు అప్పటిదాకా రాలేదా అని అడుగుతున్నారా? వారి 4000 అడుగుల ఇంట్లో వంటశాల ఓ మారుమూల ఉండడం మూలానూ, ఆ వంటశాలలో ఈవిడ వంటల మహత్యం తెలిసిన మా రామారావు చాలా బలమైన ఎగ్జాష్టు పెట్టించటం మూలానూ, మేము కూర్చున్న హాల్లో మానసికోల్లాసం కోసం మా రామయ్యగారు టార్గెట్టులో ఆరోజే కొన్న గ్లేడ్ వత్తులు/కొవ్వొత్తులు ఆరు వెలిగించడం మూలానూ కొద్దిగా వంటల ఘుమ ఘుమలు ముక్కుకు పట్టలేదనే చెప్పాలి.

సరే సరే...తరువాయి వంటకం - ఆవపెట్టిన పులిహోర, పైగా షార్టుకట్టు నిమ్మకాయ కాకుండా చింతపండు పులిహోర - ఆహా ..మ్మ్మ్..మ్మ్మ్...మ్మ్మ్...అందులోనూ పొద్దున్నే ఆవపెట్టగా, సాయంత్రానికి వచ్చే రుచితో ఇంకేది సాటి? ఆ తర్వాత వడ్డించిన వంటకమేమనగా కంది పచ్చడి, అందులోకి పోసుకోడానికి వేడి వేడి పచ్చిపులుసు - వంకాయ ఒవెనులో బ్రహ్మాండంగా కాల్చి, ఎన్నో ఉల్లిపాయలేసి, బోల్డంత ఇంగువేసి పైనుంచి వాళ్ళమ్మమ్మ వాళ్ళింట్లోనుంచి తెచ్చుకున్న రాచిప్పలోపోసి కళ్ళెదురుగా పెడితే ఎక్కడికో పరుగులెత్తాల్సొచ్చింది. ఎక్కడికి బాబూ ? మా చల్లపల్లికి బాబూ, మా అమ్మమ్మగారింటికి బాబూ...అసలు పరుగెందుకు బాబూ అనడుగుతారా?... హ్మ్మ్ ...హ్మ్మ్మ్...హ్మ్మ్....సరే పచ్చిపులుసు పోసుకుని అదేదో లోకాలకు వెళ్ళి అక్కడ విహరిస్తూండగా, "ఆ ఆవడలు ఇటు తీసుకురా వాణీ" అన్న రామారావు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డా....మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోతూ ఉండగా అనుభవించిన ఆనందం చెప్పలేనిది. కాకుంటే వెరైటిగా ఆవిడ పైనాపిలు అనగా అనాస ముక్కలు కూడా ఆ పెరుగులో నానబెట్టి ఆవడలతో పాటూ వెయ్యగా ఆనందం రెట్టింపు అయ్యింది. ఆ తరువాత వేసిన గడ్డపెరుగులో నంచుకోటానికి "ఆంధ్రమాత" అందించిన ఆనందం ఏమని చెప్పేది.

ఇవి అన్నీ అయ్యాక, మా రామారావు ధాటికి మూడురోజులకో బాక్సు అయిపోయే మావిడి పళ్ళ బాక్సులోనుంచి మాంచి కాయలు - అనగా అటు దోరా కాక, ఇటు మగ్గిపోయినవీ కాక ఉన్న ఒక నాలుగు మావిడిపళ్ళు తీసి ముక్కలు కోసి "డిజర్టు" కింద లాగించగా, (ఆ నాలుగిట్లో నేను తిన్నది ఒక్కటే అని మనవి) - ఇహ మీరే ఊహించుకోవచ్చు..

ఈ పై వంటకాలన్నిటికీ విడివిడిగా స్టాండర్డు కరుళ్ళు నాలుగు మా రామారావుకు, ఐతే ఇప్పుడో ప్రశ్న పాఠక జనాలకు - మొత్తం రామారావు తిన్న కరుళ్ళు ఎన్ని? తప్పుడు సమాధానం చెప్పారో మీ పొట్ట నాలుగు చెక్కలయ్యి సొరంగంలో పడిపోవుగాక అని శాపం.

ఇహ అసలు సంగతికొస్తే భోజన సమయంలో రామారావుకు నాకూ జరిగిన సంభాషణ

రా: ఈ పైవాడికి బుద్ధి లేదురా

నే: ఏ పైవాడు, ఎవడికన్నా పైన పోర్షను అద్దెకిచ్చావా?

రా: ఎహె కాదురా, పైవాడంటే ఆ పైవాడు - దేవుడు

నే: ఏమిటి? ఏమయ్యింది ఇప్పుడు ఆయన మీద పడ్డావు?

రా: మనకు అసలు ఇంత చిన్న పొట్ట ఇవ్వటంలో ఉద్దేశమేమిటీ అని!

నే: ఉన్న ఒక్క చిన్నదాన్ని నింపటానికే బోల్డు కష్టాలు కదరా. ఎంతది కావాలి నీకు ?

రా: ఎహె ఊర్కో! ఎక్కువ తిందామంటే పట్టదూ చావదూ. ఓ పెద్ద సొరంగం లాటిదో, ఏడెనిమిది గదుల్లాటివో ఉంటే ఎంత బాగుండు.

నే: హహహ....హహహ...ఏమిటీ మళ్ళీ చెప్పు

రా: నీకు నవ్వులాటేరా. మాంచి పదార్థాలు తిందామంటే ఈ చిన్నదాన్లోకెట్లా ఎక్కించేది. సూదిలో దారం లాగా ఉంటే ఎట్లా. సూది బదులు గునపమైతే బాగుండేది కదరా!

నే: అలాగ సొరంగాలుంటే ఇహ రాత్రీ పగలూ లేకుండా ఎన్నైనా లోపలెయ్యొచ్చు అంటావు

రా: అంతేగా. దాంతో పాటు ఎన్ని వీశెలు తిన్నా అలా లటుక్కున అరిగిపోయేట్టు ఏదన్నా రుబ్బురోలు లాటిది కూడా మన పొట్టలో పెట్టాలి.

నే: హ్మ్మ్మ్...

రా: హ్మ్మ్మ్...ఏమిటి...హ్మ్మ్...ఏమిట్రా - అలాగే ఐదారు పేద్ద ముద్దలు ఒకేసారి అలా నోట్టో వేసుకుందుకు ఓ పేద్దనోరు కూడా ఇస్తే బాగుండేది

నే: అప్పుడు మనల్నిమనం మనుషుల జాతి అని పిల్చుకోలేమేమోరా

రా: పోనీ ఎవడిక్కావాలి. చక్కగా కావాల్సింది కడుపుకు తినలేకపోతే మనుషులైతే ఏమిటి? మురుగుకాల్వైతే ఏమిటి?

నే: ఒరే ఎక్కడికో పోతున్నావు....

రా: $%%^&

నే: ఒరే! ఆపరా బాబూ - తిననీ

రా: $%్**

నే: హహ...సరే లే!


ఇలా ఇంకా బోల్డంత సంభాషణ జరిగింది....క్లుప్తంగా మీ కళ్ళముందుంచటమూ అయ్యింది. తరువాతి భాగంలో తరువాయి సంభాషణ ...

ఇహ శలవు తీసుకుని బయలుదేరుతుండగా "లక్ష్మి" ఎదురొచ్చింది. లక్ష్మి ఎవరు? ఏమా కథా? లక్ష్మి మా రామారావు గారి ఎనిమిదేళ్ళ కుమార్తె. అసలు పేరు "భాగ్యలక్ష్మి". పేరుకు తగ్గట్టే చక్కగా ముద్దుగా మరింత బొద్దుగా అలరారే చిన్నమ్మి. నేను రెండేళ్ళ క్రితం ఓసారి "భాగ్యం ఇలా రామ్మా" అన్నానని మిస్సెస్ రామారావు ఒక ఆర్నెల్లు నాతో మాట్టాడాలా. వేరే ఉద్దేశమేదీ లేదండీ అని చెప్పినా సరే, ఉహూఁ - వినలా. తర్వాత్తరవాత ప్రతాదివారం పిల్లలకు నేను చెప్పే తెలుగు పాఠాలకు పంపిస్తూ, "భాగ్యం" భాఘా తెలుగు నేర్చుకుని పద్యాల్లోకి దిగిపోయాక ఆవిడ కోపం తగ్గిందన్నమాట. ఇంతకీ ఆవిడకు కోపం రాటానికి కారణమేమనగా - భాగ్యలక్ష్మి అన్న పేరు "వాణి" వాళ్ళ అమ్మమ్మ గారి పేరని , అలా ఎవరైనా భాగ్యం అని పిలిస్తే వాణి గారి చేతిలో రాచ్చిప్ప ప్రత్యక్షమవుతుందనీ - భాగ్యాన్ని "భాగ్యం" అని పిలిచేదాకా నాకు తెలియదు. కాకుంటే నేను "భాగ్యం" అన్నప్పుడు రాచ్చిప్పను చూడలా.

చెప్పొచ్చేదంటంటే - ఎవరికైనా అజీర్ణం చేసో, తిన్నదరక్కో (రెండూ వేరు వేరు - అందులో సందేహమేమీ లేదు) బాధలు పడుతుంటే మా రామేశ్వరులను దర్శించుకోండి. పుణ్యలోక ప్రాప్తిని పొందండి

PS: రామారావూ - ఇదిగో నువ్వడిగిన పోష్టు - మళ్ళీ ఇదంతా రాసానని నన్ను ఏకొద్దు - అడిగావూ - ఐతే నీ ఖర్మ అని ముందే చెప్పా! ఈ పోష్టు నీకే జన్మజన్మాలకూ అంకితం...పళ్ళాల, పదార్థాల ఫోటోలు పెట్టలేదు, దిష్టి కొడుతుంది అని...క్షమించు..

Monday, May 24, 2010

పక్కన చుక్కెట్టి చూడండి...వచ్చిందా ? ..

మొన్న ఆదివారం ఎందుకో నా వెబ్సైటు యు.ఆర్.ఎల్ టైపు చేస్తుంటే చివర చుక్క పడింది... చటుక్కున ప్రత్యక్షమయింది...ఏం ప్రత్యక్షమయింది ? అదే అదే.. సరే అని కొద్దిగా రీసెర్చి చేస్తే ఇదీ బయట పడింది...అదండీ సంగతి

Wednesday, May 19, 2010

కావాలనుకున్నోళ్ళు చూస్కోండి!

Hindu Literature Or, the Anicient Books Of India By Elizabeth A Reed

1891 లో రాసిన ఈ పుస్తకం అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం సాన్ ఫ్రాన్సిస్కో పియర్ 39 కి వెళ్ళినప్పుడు ఎంబార్కడేరో, పావెల్ స్ట్రీట్ ఇంటర్సెక్షను దగ్గర ఒక మూలకున్న పుస్తకాల కొట్లో 4 డాలర్ల 75 సెంట్లెట్టి కొన్నా. అప్పుడు చదివా, బానే ఉంది. ఓ రెండు వారాల క్రితం మళ్ళీ బయటకు తీసా. ఓ 300 పేజీలు చదివాక - ఇవ్వాళ్ళ అసలు ఈ ఎలిజబెత్ రీడ్ కథా కమామీషు ఏమిటి అని గూగిలించా.

ఢామ్మని ఒక మాంచి పుస్తకాల సైటు దొరికింది. కావాలనుకున్నోళ్ళు చూస్కోండి

ఫర్ గాట్టెన్ బుక్స్

ఈ పైన చెప్పిన పుస్తకం కూడా ఇక్కడున్నది - మంచి కాపీ కాదు కానీ - ఫరవాలా - డైరెక్టు లింకు ఇక్కడ

Hindu Literature, Or the Anicient Books Of India

ఈ ఎలిజబెత్ రీడ్ గురించి పెద్దగా వివరాలు దొరకలేదు కానీ వికిపీడియాలో ఉన్న వివరాలను బట్టి ఈవిడే ఆవిడ అనుకుంటున్నా.. :)

ఎలిజబెత్ రీడ్

ఇప్పటికింతే....పుస్తకంలో విశేషాలు అక్కడ చదూకోండి. రాసే ఓపిక లేదు

ఈ కింద పుస్తకాలు కూడా కనపడ్డాయి ఆ సైట్లో -

Hymns of Samaveda

The Laws of Manu

The Garuda Purana

Songs of Kabir

A Vedic Reader For Students

Great Systems Of Yoga

Black Marigolds

Hindu Mysticismఅలానే ఇంకో మంచి సైటు - చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ - మళ్ళీ

సేక్రెడ్ టెక్స్ట్స్

వీళ్ళు సి.డిలు కూడా అమ్ముతారు - రెండేళ్ళ క్రితం ఒకటి కొన్నా - రెఫరెన్సు కోసం బాగుంది. సేక్రెడ్ టెక్స్ట్స్ లో ఉన్నవీ ఫర్ గాట్టెన్ బుక్స్ లో ఉన్నవీ - మన హిందూ దేశానికి సంబంధించి - చాలా మటుకు ఒకటే. ఐతే ఇతర పుస్తకాలు ఫర్ గాట్టెన్ బుక్స్ లో కొన్ని మాంచివి కనపడ్డాయి ...అదన్న మాట సంగతి...

మనోళ్ళు కూడా ఎవరన్నా తెలుగులో ఇలాటిదొకటి సేత్తే బాగుంటది.. ! అంటే సేక్రెడ్ టెక్స్ట్స్ లాటిది...ఆర్కైవ్ ఉంది - డి.ఎల్.ఐ ఉంది అని సెప్పొద్దు... :)Update to the post -

క్లారిటీ కోసం - "ఇలాటి సైటు తెలుగులో కూడా" అంటే - మనోళ్ళు ఆ దుర్మార్గాన్ని ఖండిస్తోనో, ఆ పుస్తకాల్లోని అవకతవకల్ని ఎత్తిచూపుతోనో, నిజమైన నిజాలని రాసిన పుస్తకాల సైటు అన్న మాట.....అలాటి పుస్తకాలు మనకు తక్కువే, చాలా తక్కువే వున్నా....అదో సంతోషం..

RK - మీ కామెంటు చూసాక Update చేసింది ఇది.. :)

Tuesday, May 18, 2010

నొక్కండి - చూడండి -నేర్చుకోండి

ఈ కింద లింకు మీద నొక్కండి

చింతా? అదేమిటి ? - నిక్ వుజిసిక్

ఏం నేర్చుకున్నారో చెప్పండి

Thursday, May 13, 2010

ఫదహారేళ్ళ వయసు - గుడిపాటి వెంకట చలం - రంగనాయకమ్మ!

'తమ శక్తులను స్త్రీల సమస్యలపై కేంద్రీకరించి, సంఘం వారిపట్ల ప్రదర్శిస్తున్న వైఖరికి విసిగి మనలో ఏర్పడిన ద్వంద్వ ప్రమాణాలకు ఆగ్రహించి మనల్ని సంస్కరించడానికి అకుంఠిత దీక్షతో పోరాడిన" వీరులలో ఒకరుగా పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు పేర్కొన్న సంచలన వచన రచయితను ఈ చిత్రంలో చూస్తాం.

బాల్య వివాహాలు జరుగుతున్నకాలం నాటి చిత్రమిది. ఇందులో కనిపించే పెళ్ళికొడుకు 1894 లో పుట్టాడు. పెళ్ళికూతురు విజయవాడ వాస్తవ్యు లైన ఉప్పులూరి రామశేషయ్య గారి కుమార్తె - రంగనాయకమ్మ. 1910 నాటి ఈ పెళ్ళి బొమ్మలో ఉన్నది ఫదహారేళ్ళ వయసు గల గుడిపాటి వెంకట చలం (తెలుగు వెలుగు చలం పుస్తకం ఆధారంగా)


ఎక్కడా? - ఇదిగో ఇక్కడ - ఈ కింద అక్షరచిత్రాలు అని లింకు ఉన్న పేజీలో 23 నంబరు బొమ్మను నొక్కండి...

అక్షర చిత్రాలు

ఇతర అపురూప చిత్రాలు చూడాలంటే అన్ని నంబర్లూ నొక్కుకుంటూ పోటమే!

వారం వారం - ఒక్కో చిత్రం, వ్యాఖ్యానం ఇక్కడే, ఇదే పేజీలో చూడొచ్చు....

Monday, May 10, 2010

హలా అంటున్న గజ్జెలకోడి !!!

పింగళిగారి వర్ధంతి సందర్భంగా సాక్షి టి.వి అర్పించిన నీరాజనాలు ఇప్పుడు - "ఇక్కడ" - "పింగళి" వారి వెబ్సైటులో దృశ్యమాలిక సెక్షన్లో చూడవచ్చు. ఈ వీడియోలో పింగళివారి గురించి వేటూరి వారి వజ్రాల మా(మూ)టలూ తప్పక వినాల్సిందే!

వెబ్సైటులో పెట్టుకోడానికి అనుమతిచ్చిన సాక్షి టి.వి వారికి, సాయం చేసిన మిత్రులు, సాక్షి టి.వి. (ఐ.టి. హెడ్) శ్రీ మదన్ మోహన్ రెడ్డి గారికి, ఆ కార్యక్రమం సాక్షి టి.వి లో ప్రసారమైంది అన్న విషయాన్ని తెలియచేసిన మిత్రులు దేవరపల్లి రాజేంద్రగారికి బోల్డన్ని కృతజ్ఞతలు

పింగళి వారి ఇతర విశేషాలు, ప్రత్యేకించి చుట్టరికాలూ ఎవరికన్నా తెలిస్తే maganti dot org at gmail dot com కు ఈమెయిలు కొట్టండి. సాయానికి ముందస్తు ధన్యవాదాలు

తెలుగువారికి వీరతాళ్ళు వేసి, అస్మదీయులకు తస్మదీయులకు హాంఫట్ ను ఒకేరకంగా నేర్పించి, సాహసం శాయరా డింభకా అని ముందుకు తోసి, హలా అంటున్న గజ్జెలకోడిని మహాజనానికి మరదలు పిల్లను చేసేసి, గింబళి మీద లాహిరిలాహిరిలో ఓలలాడించిన అపర సరస్వతీ పుత్రుడు, మాటల మాంత్రికుడు శ్రీ శ్రీ శ్రీ పింగళి నాగేంద్రరావు గారికి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ

భవదీయుడు
వంశీ