Monday, March 15, 2010

హాహా....కారాంధ్రుల భాగ్యం - వినరో!!!! - PART 1

ఈ దేశపు విపణి వీధుల్లో మన దేశపు ప్రజల వారాంతపు దైనందిన కార్యక్రమాల గురించీ, దేశీ పచారీ కొట్ల కత ఏమని చెప్పేది ? సాక్షాత్తూ వ్యాసులవారు రాకపోయినా వారి పౌత్రుని పౌత్రుని పౌత్రుని పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి.............. హుష్హో .....పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పౌత్రుడి పితామహుడు వచ్చి రాస్తే అది ప్రపంచ సాహిత్య చరిత్రలో కలకాలం నిలిచిపోయే ఉద్గ్రంధం అవుతుందని నా ప్రగాఢ విశ్వాసం.

ఇతర స్థలాలకు వెళ్ళకుండా మా చిన్న నగరంలోని జనాభా తంతు, కొన్ని పచారీ కొట్లలోని తంతు వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు గానీ, మీ నగరంలో వున్న మరెవరికి గానీ ఇలాటివి ఎదురవ్వకపోతే మా నగరానికి రండి. కళ్ళకు కట్టినట్టు, మనసులో కంచుతో చేసిన కటారు ముద్ర వేసి మిమ్ములను మీ ఆనందభాష్పాల్లోనే ముంచి తిరిగి పంపించగలవాడను అని పులకిస్తున్న హృదయంతో తెలియచేసుకుంటున్నాడ.

ఓం ప్రథమంగా - దీనికి అంటే ఈ టపాకు పే.............................................ద్ద ఉపోద్ఘాతం రాయాలి ఇప్పుడు....

ఈ మా సుందర నగరంలో ( నగరం పేరేమిటి ? దానికి రాజెవడు ? - వస్తా...అక్కడికి మళ్ళీ వస్తా....త్వరలో చెబుతా!) - శనివారం, ఆదివారం షరా మామూలుగా , ఇంకేమన్నా అంటే అసలుగా వారంలో పెద్దగా పనీపాటల్లో అలిసిపోయిందేమీ లేకపోయినా శలవు దొరికితే చాలు, కడుపుకు అన్నం తినటం ఎంత నిజమో అంతే నిజంగానూ, యధావిధిగానూ - పదకొండింటికో, అలా కాకపోతే మిట్టమధ్యాహ్నమో లేచి పాచిపళ్ళతో భానుణ్ణో, వరుణున్నో పలకరించే చాలా మంది దుర్మార్గులు, అందునా ఆంధ్రులు నివసించే నగరం మాది. అందులో ఇసుమంత, ఈషణ్మాత్రం సందేహం లేదు. అలాటి వాళ్ళను చూస్తే భవదీయుడికి రక్తపోటు సునామీ లాగా ఉవ్వెత్తున, వీలుంటే ఆ ఎత్తున ఎగిసిపడుతుందనటంలో అణువంత సందేహం అంతకన్నా లేదు. వారపు దినాల సంగతి పక్కనబెట్టి వీరి వారాంతపు దైనందిన కార్యక్రమాల గురించి కొద్దిసేపు తర్వాత వివరిస్తాను. ఈలాటి దుర్మార్గులు మా దేశీ జనాభాలో అరవై ఎనిమిది శాతమైతే, మిగిలిన ముప్ఫైరెండు శాతంలో ఇంకో రకం దుర్మార్గులున్నారు.

ఈ పై ముప్ఫై రెండు శాతంలో ఇరవై శాతం జనాభా పొద్దున్నే ఐదింటికో, ఐదున్నరకో లేచి - పనులు చక్కబెట్టుకుని ఆ సూర్యపరమాత్మ ఆకాశంలో వున్నప్పుడు, పొద్దున్నే లేవని పెళ్ళాం పిల్లలని సతాయించో, ప్రాధేయపడో, అదిలించో, కదిలించో సుమారు పదింటికల్లా ఊరి మీద పడి, వారంలో మిగిలిపోయిన కొన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకుని పన్నెండింటికి చక్కా గుడికి వచ్చి ప్రసాదాన్ని ప్రసాదంలా కాకుండా భోజనంలా కడుపుకు పట్టించి, ఇంటికి పోయి పక్క ఎక్కి నిద్రాదేవతను ఆవాహన చేసి మంచం మీద ప్రతిష్టించి రెండు గంటలకు తగ్గకుండా గుర్రుపెట్టే రకం. ఈ రకాలు వారికి వారు సుఖజీవాలు, కానీ ఇతరులకు యమజీవాలు. నిద్ర లేచాక, "వారమంతా పనీ పాట లేకుండా రోజుకో గంట మాత్రం వంట చేసి మిగిలిన సమయమంతా టి.విలోనో, కంప్యూటర్లోనో వచ్చే సినిమాలు, సీరియళ్ళు చూసేదానివి, కనీసం వారాంతంలో మొగుడికి ఉల్లిపాయ పకోడీనో, వంకాయ బజ్జీనో చెయ్యలేవా" అని పెళ్ళాన్ని ఎండగట్టి, చివరికి ఆవిడ మొహం ఎర్ర____ కోతి లాగా పెట్టుకుని చేసిన ఆ పదార్ధం పిల్లలకూ, ఇతరులకూ మిగలకుండా లాగించి, దానితో పాటు యాలకుల టీనో, ఫిల్టర్ కాఫీనో కొద్దిగా గొంతులో దింపుకుని ఊరి మీద పడి కొంత మంది అస్మదీయ ప్రవృత్తిగల గొట్టంగాళ్ళతో ఉబుసుపోక కబుర్లు కాకరకాయలు చెప్పుకుని, రాత్రేళ తిరిగి వస్తూ నల్ల కళ్ళజోడు తియ్యకుండా పచారీ కొట్టుకెళ్ళి, అర్ధనారికి ఫోను కొట్టి కొట్టో వున్నాను ఏం కావాలో చెప్పు అని, అక్కడికొచ్చిన దేశీ భామల్ని చూస్తూ నల్లకళ్ళద్దాల్లోనించి "కళ్ళ చొంగ" కారుస్తూ ఇంటవిడ చెప్పినదానిలో సగం మర్చిపోయిన్నూ, పప్పు బదులు ఉప్పు ఇంటికి తీసుకెళ్ళిన్నూ, ఇంటికెళ్ళాక నాలుక్కరుచుకుని కవరింగు ఇచ్చే రకము అన్న ఆ పరమపిత మాట - పెన్సిలుతో తెల్ల కాయితం మీద రాస్తే పడే గీతలంత నిజం. వీళ్ళల్లో కొద్దిగా కలాపోసన ఉన్న జనాభా బావిలో కప్పల్లాగా కాకుండా దిక్కుమాలిన కథా సంకలనాలు తయారుచేసే మహానుభావుల ఇళ్ళకో, అర్ధం అనేది వెతుక్కోలేని సాంస్-కృతి(త)క కార్యక్రమాలు జరిపే అపర విశ్వామిత్రుల ఇళ్ళకో వెళ్ళి పన్నీరు జల్లో, జల్లించుకునో ఇంటికి చేరి, ఆనాటి సుమధుర భాషణలు ఇంటావిడ కర్ణాల్లోకి బూరా ఊది ఆవిడకు రెండు రోజుల దాకా కంటిమీద కునుకు లేకుండానూ, కొద్దిగా వీకు హృదయంగల నారీమణి ఐతే ఆసిడ్ రిఫ్లక్సు తెప్పించేసిన్నూ ఆనందపడే పాషాణహృదయులు. వీరి గురించి ఇంకా.....బోలెడు చెబుతా. పాఠకులకు వీలున్నప్పుడు ఈ ధారావాహికలోని భాగాలు చదువుకోవలసినదిగా హెచ్చరిక...

సరే మిగిలిన శాతాల్లోకి పోయేముందు - అరవైఎనిమిది శాతం మంది దగ్గరకు వస్తే - వీళ్ళల్లో పెళ్ళైనవాడు, పెళ్ళికానివాడు అంటూ తేడా లేదు. అన్నీ ఆ తానులో గుడ్డలే. ఈ మగానుబావులు మోడరన్ గానూ, ఇంగ్లీషు పొయెట్రీ లెక్కన జారుగా, బడబడలూ, సలసలలూ లేకుండగా ఓట్రిచ్చే కవితల తీరులో ఏటిగట్టెక్కి లాగుతో సంధ్యావందనం ఆచరించే పితామహులు. వీళ్ళని ఒరే అర్ధానుస్వారమంటే ఏమిట్రా అనడిగితే అదేదో గ్రహచారం పాలైనట్టు మొహమెట్టి, మాష్టారూ - అలాటి మాటలు మాట్టాడకండి. మాకు అసలే మెదడు చిటికెన వేల్లో ఉంటుంది. మాకు అశ్వమూ, స్వరమూ అన్న మటుకే తెలుసు - ఈ కొత్త పద ప్రయోగం మాకు పరలోక యోగం కలిపిస్తుందేమోనని మాకు భయంగా ఉంది. కాబట్టి కాపాడండి అంటారు. ఇహ వీరు మిట్టమధ్యాహ్నం పక్క మీద నుంచి దిగి, కొండొకచో ఇండియన్ రెష్టారెంటు మూసేసే వేళకు లేచినప్పుడు, ఇంకేమీ కడుక్కోకుండా లిస్టరీనుతో మాత్రం పుక్కిలించి పరిగెత్తుకెళ్ళే జనాభా! అబ్బా ఛా! నా. సరే మీరు మా ఊరొచ్చినప్పుడు పెళ్ళైనవాళ్ళలో మా వెంకట్రావును, కుమార్ ను చూపిస్తాను - తరిద్దురు గాని. ఇంకా వీలుంటే ఇండియన్ రెష్టారంటులో మెక్కక ముందో, ఒకోసారి మెక్కాకో అక్కడే కడుపు కదిలిన కాలకృత్యాలు తీర్చుకునే పెళ్ళికాని పరమాత్ములు మూర్తిగారిని , ఆనంద్ గారిని కూడా చూడొచ్చు మీరు. ఏమ్మా - ఈ దంతధావనరహిత పక్షులతో ఎలా పడుతున్నారని అడిగితే, పాపం అర్ధనారుల తెల్లమొహం చూడాల్సొచ్చేది. సరే కడుపులో కుడితి పడ్డాక, ఇక అచ్చోసిన ఆబోతులు కూడా తక్కువే ఈ జనాభా ముందు. - ఏ సినిమాలున్నాయి? ఎవరు ఖాళీగా వున్నారు? ఎవడితో వెడితే మనకు డబ్బు ఖర్చు కాదు? ఇలా అన్నీ బేరీజు వేసుకున్నాక ఒక బకరాను, వీలుంటే వారి కుటుంబాన్ని కూడా బలవంతం చేసి వాళ్ళక్కూడా ఆనందం పంచే మహిమాన్వితులు వీరు. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో. ఇంతటి పుణ్యాత్ముల మధ్య బతకటమంటే మాటలా! దేనికైనా పెట్టి పుట్టాలి. మిగతా సంగతులు ఇతర భాగాల్లో!

ఇహ ముప్ఫై రెండు శాతంలో మిగిలిన పన్నెండు శాతం ఉందిగా, దాని పరిస్థితికొస్తే - అందులో పదిశాతం మంది - వీరు - ఏడుపుగొట్టు రకాలన్నమాట. ఒకడు పడుకుని బారెడు పొద్దెక్కి లేస్తే చూడలేరు, ఒకడు పొద్దున్నే లేచి పనులు చక్కబెట్టుకుంటేనూ చూడలేరు. వీరి ప్రత్యేకత ఏమిటంటే, పై రెండు వర్గాల్లో ఏదో ఒకదాన్ని కాకుండా - గుత్తగా రెండు వర్గాలనీ సహించలేరు. అవకాశం వస్తే చీల్చి చెండాడతామంటారు. వీరి చెండు బెండులాగున్నా, ఇతరుల కండ - తమ బెండుతో కలకండో, బభ్రాజమానమో ఎలా చెయ్యొచ్చా అని ఆలోచిస్తూ వుంటారు. మీ ఆలోచన ఎక్కడికెళుతోందో తెలిసింది. నన్ను ఆ ఏడుపుగొట్టు రకాల్లో పడేద్దామనుకుంటున్నారా ? చూసారా - ఏదైనా ఇట్టే పట్టెయ్యగలను మగానుభావా(వి) !! అంత ప్రయాస అనవసరంగానీ - చెబుతా...చెబుతా..నేనే చెబుతా! నేనెందులోకి ఇముడుతానో చెబుతా!

మళ్ళీ రేపో, ఎల్లుండో కలుద్దాము...

సశేషం! ......

2 comments:

  1. మీకు,మీ కుటుంబానికి వికృతి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. OMG!!!
    సాక్షివ్యాసాల్లో పానుగంటివారు సృష్టించిన జంఘాలశాస్త్రి వాగ్ధాటిని తలపించారు! ఎలాగూ ప్రసక్తి వచ్చింది కాబట్టి, ఇదేలెక్కన అనెరికాలో దేశీయ జీవితం గురించి ఒక సిరీస్ రాసెయ్యకూడదూ ఇదే ఇష్టైల్లో?

    ReplyDelete