Friday, March 5, 2010

ఈ పేర్లన్నీ వింటే ఏమనిపిస్తుంది ?

పాతాళభైరవి అదుపాజ్ఞల్లోకి వెళ్ళిపోయిన బ్లాగ్ద్వారానికి తోరణాలు కట్టమని ఒక పెద్దాయన ఆజ్ఞాపించడం మూలాన, ఇదొక్క టపా మాత్రమే ప్రచురించి దవారాన్ని మళ్ళీ మూసేస్తానన్న నా మాటనీ, నన్నూ.........ఇంతకన్నా చెప్పలేను........సరే - ఇదో పుస్తక పరిచయ టపా - ఇది ఉత్త పరిచయమేననిన్నీ, సమీక్షో, విమర్శో కాదనిన్నీ హెచ్చరిక....పుస్తకం ఈ మధ్యే నా చేతిలోకి వచ్చింది. వుండబట్టలేక రాస్తున్న పరిచయం కాబట్టి అసంపూర్తి వ్యాసమే ఇది.

సర్వశ్రీ జనమంచి శేషాద్రి శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, మొక్కపాటి నరసింహశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, గుర్రం జాషువా, అడివి బాపిరాజు, అబ్బూరి రామకృష్ణారావు,సురవరం ప్రతాపరెడ్డి, గడియారం వేంకటశేషశాస్త్రి, భమిడిపాటి కామేశ్వర రావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఖండవల్లి లక్ష్మీరంజనం, కొడవటిగంటి కుటుంబరావు, రావూరు వేంకటసత్యనారాయణ రావు, బోయి భీమన్న, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, మా గోఖలే, రావిశాస్త్రి, ఉషశ్రీ, దాశరథి, మధురాంతకం రాజారాం - ఈ పేర్లన్నీ వింటే ఏమనిపిస్తుంది ? పైవారందరి విశేషాలు ఒక్కచోటే చూస్తే పాఠకులు ఏమైపోతారు ?

పైన చెప్పినవారే కాక, మొత్తంగా కీర్తిశేషులైన అరవై రెండు మంది సాహితీ ప్రముఖుల జీవితానుభవాలు, వారు జీవించి ఉన్నప్పటి సామాజిక, సారస్వత పరిస్థితులు, ఆపైన వారి కుటుంబజీవిత విశేషాలు, మరెవరో కాకుండా వారి పిల్లలచేతే వివరింపచేసిన పుస్తకం డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి "మా నాన్నగారు". సుమారు 400 పేజీల ఈ పుస్తకంలో కావలసినన్ని విశేషాలు. ఆ మహానుభావుల ఫోటోలతో సహా. తోడుకున్నమ్మకు తోడుకున్నంత అనేది ఈ పుస్తకంలోని విశేషాలకు సరిపోతుంది.

ఈ పుస్తకం గురించి చెబుతూ ఈ ప్రముఖుల విశేషాలు సేకరించడానికి పడ్డ కష్టాలెన్నో అనీ, మహామహుల పుత్రులు ఎంతో ఇబ్బంది పెట్టారని, అసలుగా చెప్పాలంటే బోల్డంత ఏడిపించారనీ, పుత్రుల సహకారం లేనందువల్లే ఇంకా చాలామంది మహామహుల వివరాలు అందించలేకపోయాననీ ద్వా.నా.శాస్త్రిగారు నిర్మొహమాటంగా చెబుతారు. మెచ్చుకోవలసిన విషయం.

ద్వా.నా.శాస్త్రిగారు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పిన విశేషాలు కొంచెం గందరగోళంగా వున్నా అంకితమిచ్చిన తీరు బాగుంది.బాపుగారి కుంచె గీసిన పుస్తక ముఖచిత్రం పుస్తకానికి అదో వింత అందం తెచ్చింది.

పుస్తకంలోని కొన్ని, చాలా కొన్ని విశేషాలు ఇక్కడ పంచుకుంటాను. ఇవి ఒక శాతం మాత్రమే అంటే అందులో అతిశయోక్తి లేదు. మొత్తంగా చదివితే బోల్డన్ని ఆశ్చర్యపోయే విషయాలున్నాయి.

జనమంచి శేషాద్రి శర్మ గారి గురించి వారి కుమారులు శివకుమార శర్మగారు -
1) నాన్నగారు తన పదహారో ఏటే అష్టావధానాలు, శతావధానాలు చేశారు
2) వీరేశలింగం పంతులు గారి సలహామేరకు అవధానాలు విడిచిపెట్టేసారు
3) ఒకసారి నాన్నగారిని సభలో ఎవరో విమర్శిస్తే, నాన్నగారు నవ్వుతూ - "వాదించటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మన ఇంటిపేరు జనమంచి కి చెడ్డపేరు వస్తుంది కాబట్టి" అని ఊరుకున్నారు.
4) నాన్నగారు ఎన్ని రచనలు చేసినా వావిళ్ళవారు సంపాదించుకున్నారు కానీ, మా నాన్నగారికి ప్రతి సంవత్సరం లభించింది పట్టువస్త్రాలు మాత్రమే.


వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి వారి కుమారులు ఆనందమూర్తిగారు -
1) ఇంగ్లీషు చదవటానికి నాన్నగారికి ఇష్టం లేదు
2) పాఠశాల చదువులో నాన్నగారే అన్నిటా ముందు. కానీ లెక్కల్లో మాత్రం నిండు సున్నా
3) వీరేశలింగం పంతులుగారి ఆంధ్ర కవుల చరిత్ర ప్రథమ భాగాన్ని సంస్కరణ చేసేప్పుడు, నాన్నగారే ఏ ఏ విషయాలు ఎలా ఉండాలో సూచనలు రాసి, సంస్కరించవలసిన విధానాలు, పద్యాలు రాసి ఒక పెద్ద కట్టకు సరిపడ సమాచారాన్ని పంపించారు.
4) శకునాలను నమ్మకపోగా ఖండించేవారు కూడా


రాయప్రోలు సుబ్బారావు గారి గురించి వారి కుమారులు రాయప్రోలు శ్రీనివాస్
1) నాన్నగారు ఇంటినుండి పారిపోయి శాంతినేకేతన్లో చేరి ఠాగూర్, డబ్ల్యూ డబ్ల్యూ పియర్సన్ తో స్నేహబాంధవ్యం ఏర్పరచుకున్నారు.
2) ఎంతోమందికి నీడనిచ్చే ఒక పెద్ద మర్రిచెట్టులా బతికారు. ఐతే మర్రిచెట్టు తన నీడలో దేనినీ ఎదగనివ్వదనేది వాస్తవం
3) తనకొచ్చే కొద్దిపాటి జీతంతో మా ఎనిమిది మంది పిల్లలని ఎలా పైకి తీసుకొచ్చారోనని ఆశ్చర్యమే, విలాసవంతం కాకపోయినా ఒక మోస్తరు జీవితాన్ని ఆ రోజులకు తగ్గట్టుగా మాకు అందించారు.


మొక్కపాటి నరసింహశాస్త్రి గారి గురించి వారి కుమార్తె లలితాదేవి గారు

1) నాన్నగారు మెడిసిన్ చదవాలని ఇంట్లో చెప్పకుండా ఇంగ్లాండు వెళ్ళి అక్కడ అగ్రికల్చరల్ కోర్సు నాలుగేళ్ళు చదివారు
2) నాన్నగారు ఇంగ్లాండు నుంచి స్వదేశానికి తమంతట తాము రావాలని రాలేదు.మొదటి ప్రపంచ యుద్ధం రోజులు కావడంతో అక్కడి అధికారులు విదేశీయుల్ని స్వస్థలానికి పంపించెయ్యగా రావటం జరిగింది
3) నాన్నగారు ఒక్కపూటే భోజనం చేసేవారు
4) నాన్నగారి మొదటి రచన వేదుల సత్యనారాయణమూర్తి గారి "పిలక" మీద రాసిన వ్యాసం

ఇక బారిష్టరు పార్వతీశం కథా కమామీషు, పుట్టుపూర్వోత్తరాలు, ఆ నవల నామకరణం సంగతులు మీరు అక్కడ చదవాల్సిందే.


పింగళి లక్ష్మీకాంతం గారి గురించి వారి కుమారులు సుందరం గారు

1) నాన్నగారు వేంకటేశ్వర స్వామివారికి పరమ భక్తులు. మద్రాసులో నిరుద్యోగిగా ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నప్పుడు ఆ దేవుణ్ణి వేడుకుని "చేతిలో ఒక్కరూపాయి కూడా లేదే" అని ప్రార్థించి కాసేపు ఐన తర్వాత ఆకాశం వైపు చూస్తే ఆకాశమంతా పంగనామాలే కనిపించాయిట. ఇంటికి వెళ్దామని బయలుదేరుతుంటే కాలి బొటనవేలికి ఒక వెండి రూపాయి నాణెం తగిలిందిట.
2) ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్తో చర్చించి ఆంగ్ల, ఆంధ్ర ఉపన్యాసకులకు సమానంగా ఆ రోజుల్లో జీతం చెల్లించేలా చేసింది నాన్నగారే
3) సాహిత్య చరిత్ర రాయల యుగం దాకానే రాశారని చాలామంది అనుకుంటారు.. కానీ....

మిగిలింది అక్కడ చదువుకోండి.....

దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి గురించి వారి కుమారులు రాధాకృష్ణమూర్తిగారు చెప్పింది పుస్తకంలో చదవాల్సిందే. బ్రహ్మాండం.

ఇక ఇలా 62 మందివీ కొద్ది కొద్దిగా ఇక్కడ రాయలంటే చోటు సరిపోదేమోనన్న భయంతో ఇంతటితో ముగిస్తున్నా.....

ముగించే ముందు ఇక్కడ ఒక చిన్న సంగతి చెప్పాలి. డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారి నాన్న - అంటే మా కిష్టమూర్తి తాతయ్య మమ్మల్ని చిన్నప్పుడు "పజిల్స్"తో బోలెడు ఇరకాటంలో పెట్టేవాడు. పిల్లలంటే బోలెడు ప్రేమ ఉండేది. కాకుంటే అందరినీ మాటల్తో ఆట ఆడించేవాడు. ఆయన మీదెక్కి ఆడుకున్నా, మాటల్లో ఆయనతో చాలా జాగ్రత్తగా వుండేవాళ్ళమన్నమాట. ఒక రోజు నా వంతు. పజిల్ కాకపోయినా అప్పటి నా బుర్రకి పజిల్లాంటిదే

తాతయ్య: ఒరే పెద్ద మోహనూ, మీ స్కూల్ లో ఇంగ్లీషు బా నేర్పుతార్రా?
నేను: ఓ బ్రహ్మాండంగా తాతయ్యా.
తా: ఐతే నేను కొన్ని ఇంగ్లీషు పదాలు అల్ఫబెట్స్ గా పలుకుతాను, అవేమిటో ఠక్కున చెప్పు నాకు.
నే: సరే అడుగు.
తా: మీ టీచరమ్మ నీకు నిజంగా ఇంగ్లీషు నేర్పిందా?
నే: అబ్బా నేర్పింది తాతయ్యా, అసలు నువ్వు ముందు అడుగు. అడిగితే తెలుస్తుందిగా
తా: మరి నేను అలా అడగ్గానే ఇలా చెపుతావా, నీకెంత ఇంగ్లీషొచ్చో చూస్తా.
నే: నాకు ఇంగ్లీషు బాగా వచ్చు తాతయ్యా. ముందు అడుగు (ఉక్రోషంతో)
తా: సరే ఐతే. H U T అంటే?
నే:హట్ (ట్ అనే ఆల్ఫబెట్టు ఇంకా తాతయ్య నోట్లోంచి పూర్తిగా రాకముందే!)
తా: ఓ బాగుందే! ఇంగ్లీషు వచ్చన్నమాట. సరే మరి ఇప్పుడు B U T
నే: బట్
తా: C U T
నే: కట్
తా:N U T
నే: నట్
తా: P U T
నే: పట్
తా: పట్ ఆ..... అలా వున్నాయిరా మీ ఇంగ్లీషు చదువులు.(చుట్టూ వున్న నలుగురు పిల్లలతో తాను కూడా ఒక చిన్నపిల్లాడైపోయి విరగబడి నవ్వులు, అప్పుడు నా ముఖారవిందం ఎరుపెక్కిపోయినా, ఇప్పుడు తల్చుకుంటే ? అదండీ ....).

ఏదేమైనా మా కిష్టమూర్తి తాతయ్యకు అంకితమిచ్చిన పుస్తకం కాబట్టి, నాకు మరింత వెలలేని పుస్తకం.

ప్రతులు:
1)Visalandhra Book House, Bank Street, Hyderabad

2) Dr Dwa.Naa.Sastry
1-1-248, Gandhi Nagar
Hyderabad – 80

Price: 400 Rs.

Publications – Kinnera Publications


ఆడియోలు, ఇతర వివరాల కోసం మాగంటి.ఆర్గ్ ను ఒక వారం తరువాత దర్శించండి..... :)

భవదీయుడు
మాగంటి వంశీ

4 comments:

 1. పుస్తకం లోని విశేషాలు ఆసక్తికరంగా ఉన్నై. బ్లాగు ఎందుకు ముయ్యటం? బద్ధకం వదిలించి, వారానికో, పదిరోజులకో ఇలా మమ్మల్ని పలుకరించవచ్చు కదా?

  ReplyDelete
 2. ఈ పుస్తకం మార్కెట్ లోకి రావటానికి కాస్త అటూ ఇటూగా విశాఖపట్నం బుక్ సెంటర్ లో పెద్దలొకరు విసిరిన ఛలోక్తి, ఈ మహానుభావుల్లో కొందరి గురించి అవకాశముంటే,ద్వానాశాస్త్రి గారు వారి తల్లితండ్రులను కూడా వారివారి అభిప్ర్రాయాలను సేకరించి ఉంటే బాగుండేది అని.
  బహుకాల దర్శనం.
  ఇవ్వాళే వైజాగ్గుకి చెందిన ప్రముఖన్యాయవాది,సాహితీవేత్త రామకోటి గారు కన్ను మూసారు.

  ReplyDelete
 3. రావు గారు

  బాగున్నారని తలుస్తాను. కలుపు మొక్కలా మళ్ళీ మళ్ళీ "చిగురించాల్సొస్తోంది" ఈ బ్లాగు. రెండు నెల్లకో, ఐదు నెల్లకో ఆవులిస్తూ లేచి, వున్నానంటూ "చూపిస్తోంది". మొత్తానికి పీకిపారేద్దామంటే, సమయాభావం వల్ల బోలెడు టపాలు ఉండిపోయినాయి (పి.డి.ఎఫ్ చెయ్యటానికి)....అవి పి.డి.ఎఫ్ కాగానే సర్వం సహా నిర్మూలన. అది ఎప్పుడో ఆ మహాదేవుడే చెప్పాలె. త్రినేత్రం ఎప్పుడు తెరుస్తాడో ఏమిటో!

  రాజేంద్రగారూ

  మీదీ బహుకాల దర్శనమే! ఆరోగ్యం మళ్ళీ దారిలోకి వచ్చిందని ఆశిస్తూ....బాగుంది ఛలోక్తి......కీర్తిశేషుల తలిదండ్రులా! ఎంతమంది వున్నారో నాకు తెలియదు కానీ, మంచి ఆలోచనే! రామకోటి గారి వార్త బాధాకరం!

  ReplyDelete