Thursday, December 31, 2009

కొత్తతెను గొచ్చింది! కోత్తెనుగు సచ్చింది!

శ్రీ కూచి నరసింహము గారు 1923లో వ్రాసిన పత్రికావిలేఖనములు అనే రచనలో పాతతెనుగు గురించీ, కొత్తతెలుగు తమాషా గురించి - వరహాల్రావు అనే ఒక విద్యార్థి పాత్రచేత ఏమనిపిస్తారంటే...

దేఁవుడికి దణ్ణాలు! దేఁవుడికి దణ్ణాలు!
కొత్తతెను గొచ్చింది! కోత్తెనుగు సచ్చింది !
దిక్కుమాలిన పాతతెనుగు పోతూవుంది
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
'ఉప్మాలు' లే విహను 'ఉత్తపీచు' ల్లేవు
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
చదవకుండా తెనుగు చచ్చిన ట్లొస్తుంది
రాకేం జేస్తుంది రావడం లేదా?
'ప్రాఁదెనుఁగుఁగమ్మంటి పాత్తెనుగు తొంగుంది'
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
సంధులూ గిందులూ చచ్చుసూత్రాలన్ని
పోయాయ్ ! పోయాయ్! పోయాయ్ రా!
మన భాషలో ఫెయిలు మాఁయఁవై పోయింది
మార్కులన్నీ మనవె! మరేఁవి టున్నాది!
బూతుమాట ల్లేని పొస్తకా లన్నిన్ని
బారతా లవ్తాయి! పాఠాల కొస్తాయి!
చూడడం, చదవడం, చూపించడం, దిద్ది
తన్నడం, తిట్టడం, తప్పిపోయిందిరా!
యింతసులభ బ్భాష యిహయెక్కడున్నాది?
దాన్ని దెచ్చినవాళ్ళు దైవాలు! దైవాలు!


ఫలశ్రుతి కూడ చెప్పిస్తారు ఆ ప్రథమ తరంగానికి.. :)

శా. స్కూల్ఫైనల్తెలుగందుమార్కులుఘనఁవ్, ఇంటర్ప్రవేశంధ్రివఁవ్
తప్పుల్రాశిన తప్పులంటు నోరెత్తకుం డుండడఁవ్
పూర్వగ్రంధఁవులన్ని మూలబడడఁవ్, రావంటు-ఊమూల్గడఁవ్
భాషంతాచెడదీశి కూచుని లబోలబ్బోయటం చేడ్వడఁవ్

4 comments:

 1. బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
  ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
  మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
  http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
  ధన్యవాదములు
  - భద్రసింహ

  ReplyDelete
 2. మాన్యశ్రీ మాగంటి వంశీ గారికి,

  మీరు పైని పేర్కొన్న “కొత్త తెనుగొచ్చింది “ అన్న “కవిత”ను కూచి నరసింహం గారి అనర్ఘరచన “కొత్త తెలుగు తమాషా” ప్రహసనంలో అన్నది వరహాల్రావు కాదు: వెంకట్రత్నం అనే విద్యార్థి. అతని కవితను వింటూ వరహాల్రావు రంగప్రవేశం చేస్తాడు. పై వివరణలో సవరించాలి.

  ఈ బ్లాగులో వేఱొక చోట మీరు శ్రీ కూచి నరసింహ కవిగారి ఒక అపురూపమైన చిత్రాన్ని ప్రకటించారు. అందుకు కూడా మీకు నా అభినందనలు. నేనూ కొంత కాలం క్రితం “నిష్కళంక కవితా తపస్వి” అన్న పేరిట ఒక వ్యాసాన్ని “కౌముది” పత్రికలో ప్రకటించాను. దాని వివరం ఇది: http://www.koumudi.net/Monthly/2011/august/index.html.

  ఇంతమంది మహనీయుల విశేషాలను ఈ విధంగా ఒక్క చోటికి తెచ్చి మీరు సంకలనిస్తున్న తీరు ఒక బృహద్విజ్ఞానకోశానికి ప్రాతిపదికంగా ఉన్నది.

  ఎంతో అభిమానంతో, అంకితభావంతో తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవావరివస్యకు మీకు హృదయపూర్వకమైన అభినందనలను తెలియజేయాలని ఈ లేఖ!

  భవదీయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  ReplyDelete
 3. శ్రీ మాగంటి వంశీ గారికి
  నమస్సులతో,

  ఇప్పుడే అనుకోకుండా మీ బ్లాగును చూస్తుండగా - http://www.maganti.org/audiofiles/air/dramas/pushkaram.html అన్నచోట "కృష్ణాపుష్కరం" అని 1980లో నేను వ్రాసి ప్రసారం చేసిన రేడియో రూపకం కనుపించి, అంతులేని ఆశ్చర్యం కలిగింది. దీని రికార్డు, డబ్బింగు చేయటంలో సహాయం చేసినది శ్రీ ఎస్.బి. శ్రీరామమూర్తి (రామం) గారు. ఇందులోని ఎ. మురళీకృష్ణ గారంటే - ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు శ్రీ అంపోలు మురళీకృష్ణ గారు. వోలేటి వెంకటేశ్వర్లు గారి పద్యగానం ఇందులో ఉన్నది. అప్పుడే ఉద్యోగంలో చేరినందువల్ల రచన అపరిపక్వంగా ఉండటంలో ఆశ్చర్యం ఏముంటుంది? "కదిలింది కదిలింది" అన్న పాటను కీ.శే. శ్రీ వి.యస్. నారాయణమూర్తి గారు పాడారు.

  రచయిత పేరు ప్రసారంలో ఉన్నది కాని, ఈ సూచికలో లేకపోవటం వల్ల నేనే ఇది నాదని ఊహించలేకపోయాను!

  ముప్ఫైరెండేళ్ళ క్రితం జ్ఞాపకాలను మళ్ళీ మేల్కొలిపి, ఎన్నడో అతీత కాలయవనిక వెనుక మఱుగునపడిన రచనను మళ్ళీ సజీవం చేసిన మీకు ఎన్ని వేల ధన్యవాదాలని చెప్పను?

  మీకు నిండు కృతజ్ఞతలతో,

  మీ,
  ఏల్చూరి మురళీధరరావు

  ReplyDelete
 4. మాన్యులు శ్రీ ఏల్చూరి వారికి పాదాభివందనాలు

  అయ్యో ఇందులో నాదేమీ లేదండీ....ఆ ఆడియో అందించినవారి ఘనతే అది.....ఆకాశవాణి ప్రసారాలు కొన్ని శివరామప్రసాద్ గారు, డాక్టర్ కె.బి.గోపాలం గారు, పరుచూరి శ్రీనివాస్ గారు , రంజని గారు - ఇలా చాలా మంది, ఆ ప్రసారాలు ఒక చోట చేర్చటానికి సాయం చేసారు....కృతజ్ఞతలు అన్నీ ఆ సాయం చేసినవారికే...

  నా పని అల్లా, వారి వెంబడి పడి సతాయించటమే...ఆ సతాయింపు పని కూడ ఇప్పుడు మానుకున్నానుకోండి....ఇస్తే తీసుకోటం, లేకపోతే ఊరుకోటం....

  అయినా మీలాటి పెద్దలు నా వెబ్సైటును సందర్శించడమే సంతోషకరమైన వార్త.....కామెంటు వ్రాసినందుకు సహస్ర ధన్యవాదాలతో!

  భవదీయుడు
  మాగంటి వంశీ

  తా.క: మీరు నన్ను వంశీ అని పిలవవచ్చు....

  ReplyDelete