Sunday, December 27, 2009

గుడిలో గోల!

ఈ రోజు ఆదివారం కాబట్టీన్నూ, ప్రతి ఆదివారం పొద్దున్న పూట మా ఊర్లో వున్న గుళ్ళో - గణపయ్యకు అభిషేకం జరిపే రోజు కావటం మూలాన్నూ, ఆ అభిషేక సమయంలో "రుద్రం" చదువుతారు కాబట్టిన్నూ, చిన్నప్పుడు తాతగారి దగ్గర చమడాలు లేచిపోయేలా దెబ్బలు తిని వల్లెవేసిన రుద్రం మర్చిపోవటం మూలాన్నూ, మర్చిపోయినందుకు ప్రాయశ్చిత్తంగా గత రెండు నెలలుగా ప్రతి ఆదివారం వెళ్ళి ఆ "రుద్రం"లో పాలుపంచుకోవటం మూలాన్నూ, మతిలో గతి తప్పిన నమకం, చమకం మళ్ళీ దారిలో పడటం మూలాన్నూ - ఆ మహాదేవుడి కృప మళ్ళీ కొద్దిగా లభిస్తోంది అనే చెప్పాలి.

ఈ రోజు వైకుంఠ ఏకాదశి కావటం మూలాన్నూ, గుళ్ళో జనాల తాకిడి ఎక్కువగానే వున్నది. మహా పండితులు శ్రీ ఉమాశంకర్ దీక్షిత్ గారు, ఆలయ అధికారి, స్థాపించినవారు ఈ రోజు కనపడ్డారు. ఆయన పర్వదినాల్లో తప్పక దర్శనమిస్తారు. ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో "రుద్రం" జరగబోతోందేమో అని చాలా ఆనందం వేసింది. కానీ, ఆశ అడియాస అయ్యింది. సరే అభిషేకం, పెద్దపూజారి శ్రీ సుబ్బారావుగారు మొదలుపెట్టారు. రుద్రం కాక గకార గణపతి సహస్రం, ఇతర మంత్రాలతో (అవేవో నాకు తెలియదు!) అభిషేకం నడుస్తోంది.

ఇక్కడ పిట్టకథలు కొన్ని చెప్పుకోవాలి. ( ఈ పిట్ట కథలూ, కాకరకాయలూ అన్నీ అభిషేకం ముందు జరిగిన, నేను చూసిన సీన్లన్నమాట.) ఈవేళ గుడికి వచ్చిన జనాభాలో సగం మందికి పైగా కన్నడిగులు, 30 శాతం అరవ వాళ్ళు, 10 శాతం నార్త్ ఇండియా వాళ్ళు, మిగిలిన 10 శాతం తెలుగు వాళ్ళు అన్నమాట. సరే కన్నడిగుల్లో మగవాళ్ళలో చాలా మంది పాంటు షర్టుతో వచ్చారు బానే వున్నది. ఆడవాళ్ళు పట్టుచీరలు కట్టుకు వచ్చారు. అదీ బానే వున్నది. అరవ వాళ్ళు కొంతమంది పాంట్లూ, చాలా మంది పంచెలు, అడ్డబొట్ల మీద చందనం, దాని మీద కుంకుమ విపరీతంగా పూసుకుని వచ్చారు. అదీ బానే వున్నది. ఇక నార్త్ ఇండియా వారు సరే సరి.

మన తెలుగు వారి వద్దకు వద్దామిప్పుడు. వారిలో ఒకరు (ఇక్కడ ఒకరు అంటే, ఒకళ్ళు అవ్వొచ్చు, ఒక కుటుంబమూ అవ్వొచ్చు అన్న మాట!) లాగూతోనూ, ఒకరు తొడల మీద చిరుగులు పడ్డ జీన్సు పాంటుతోనూ, ఒకావిడ కాప్రీసుతోనూ, ఇంకొకావిడ మోకాళ్ళ మీదకు స్కర్టు, దానికి తోడు రేయ్బాన్ కళ్ళజోడు (దేవుడి శక్తిని తట్టుకోవటానికి కాబోలు), ఇంకొకాయన పైజమాతోనూ, ఇంకొకావిడ ఇక్కడ రాయలేని డ్రస్సుతోనూ వచ్చారు. ఆవిడను చూసాక "హరహరమహాదేవ" అని చెంపలు వేసుకుని పక్కకు జరిగి నిలబడ్డాను. ఆ నిలబడడం నిలబడడం, ఒక పూర్తి స్వచ్ఛమయిన తెలుగు జంట, భర్త తెలుగాయన - భార్య అరవావిడ అయిన ఇంకో జంట పక్కన ఇరకాల్సి వచ్చింది.

ఇక వారి మాటలు ఇవీ -

సగం తెలుగు జంటలోని భర్త - "ఏమండీ - మీరు ఫాల్సంలో(ఇదో ప్రదేశం!) వున్న రెష్టారెంటుకు వెళ్ళారా ? చికెన్ అదిరిపోతుందండీ - మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళాలి" (ఇదంతా తెలుగులోనే చెపుతున్నాడనుకునేరు - మీ ఖర్మ! పక్కా ఆంగ్లంలో)..."శంభో శంకరా" "నారాయణ నారాయణ" - గుళ్ళో ఇవి తప్పితే మాట్లాడటానికి మీకేం దొరకలేదురా అనుకుని , ఆ పక్కనే వుంటే ఇంకేం వినాల్సి వస్తుందో అనుకుని మరింత పక్కకు జరిగా.

ఈలోపల శ్రీ ఉమాశంకర్ దీక్షిత్ గారి నుంచి ఒక ప్రకటన, అభిషేకం ఐపోయాక, గుడి వెనక భాగంలో ప్రసాదం వుంటుంది, భక్తులందరూ అక్కడికి వెళ్ళి ప్రసాద వినియోగం చేస్కోండి అని - ఐతే ఈ వేళ వైకుంఠ ఏకాదశి మూలాన, ఉప్మానూ, రవ్వకేసరీ మటుకే వున్నాయి, అన్నపు వంటకాలు ఏవీ లేవు అని ఆయన చెప్పడంతో మన తెలుగు జంటల్లో హాహాకారాలు చెలరేగాయి. ఒకావిడ వాళ్ళ అత్తగారితో "Usually ప్రతిసారి Curd Rice పులిహోర వుంటాయి. ఇవ్వాళ్ళ రైస్ లేదంట. Oh Oh this is not good అని అనటం, అది విని పక్కనున్న ఇంకో తెలుగు జంటలోని భర్త "O yA! it's the same in other temples too. ఇవ్వాళ్ళ Everywhere is like that " అని అనటం, నేను మరింత పక్కకు జరగటం జరిగింది. ఆ జరగటం జరగటం పంచముఖ ఆంజనేయ స్వామివారి పాదాల దగ్గరికి జరిగామన్నమాట.

సరే ఈలోపల ఇంకో జంటలోని భర్త వారి కుమార రత్నాన్ని గుళ్ళో వున్న దేవుళ్ళందరి దగ్గరకు తీసుకెళ్ళి దణ్ణం పెట్టిస్తూ, ఆంజనేయుల వారి దగ్గరకు వచ్చాడు. ఆయన ఆ కుమార రత్నం ప్రశ్నకు నా బుఱ్ఱతో సహా పక్కనున్న వారందరివీ తిరిగిపోయేలా చెప్పిన సమాధానం మీరంతా ఇప్పుడు వినాలన్నమాట. అసలింతకీ కుమార రత్నం అడిగిన ప్రశ్న - " who is this and why does he have 5 faces" పితామహుల సమాధానం - "He is monkey god. He has horse face and pig face on either side and he's very powerful. You should pray him always" - ఆ దెబ్బ నుంచి తేరుకునేలోపల కుమారరత్నం వారి సమాధానం - "I will not pray to monkeys and pigs" - పితామహుల మోములో పెద్ద దరహాసం, పక్కనే వున్న వాళ్ళ ఆవిడ మోములో వికటాట్టహాసం he's so funny అని ముందు అని " నో అఖిల్ - తప్పు - డోంట్ సే లైక్ దట్." అని అన్నది. భగవంతుడా ఈ క్షోభ నుంచి నన్ను రక్షించు నాయనా అని మళ్ళీ ఓ మూలకు జరిగి అరవ్వాళ్ళ సంతలోకి దూరా. ఆ సంతలో వాళ్ళేం మాట్టాడుకున్నా, నాకర్థం కాదనే ధైర్యంతో!

సరే అభిషేకం మొదలవుతూ సంకల్పానికి వచ్చారు. నాదైపోయాక, నా పక్కనున్న అరవ కుటుంబం వంతు. "రావణ్" అనే పేరు "పునర్ పూసం" అనే నక్షత్రంతో - ఏ గోత్రమో తెలియని ఒక నల్ల సిద్ధి చెబుతూ వుంటే మతి పోయింది! రావణుడనే పేరు కలవాళ్ళున్నారనిన్నీ, ఆ పైన వారి నక్షత్రం ఆ శ్రీరామ చంద్రుల వారి నక్షత్రం పునర్వసు అవటం యాదృచ్ఛికమా లేక, మాయా, కనికట్టా అనేది అర్థం కాని అయోమయ లోకంలోకి పడబోతూండగా ఆ పక్కనే వున్న ఒక తెలుగు కుటుంబం నన్ను రక్షించింది. "పిల్లుల" గోత్రం అని చెప్పి. ఆ అయోమయం నుంచి భయోమయం లోకి నెట్టావా అని అనుకుంటూండగా, "పిల్లుల" గోత్రమా అని పూజారి గారు మళ్ళీ అడగడం - కాదు కాదు "పిల్లుట్ల" అని ఆయన చెప్పటం జరగటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటూండగా - ఆ పక్కనాయన "తాబేలు" గోత్రం అని చెప్పాడు. ఇక పరిస్థితి పవర్ హౌస్ పాపన్న లాగా తయారయ్యింది. ఇలాటి గోత్రాలు గత నలభై ఏళ్ళలో ఎన్నడూ వినకపోవటం మూలాన (మీలో ఆ గోత్రాలకు చెందినవారు ఎవరన్నా వుంటే వారికి క్షమాపణలతో!). చివరిగా "చిత్త" గోత్రం - "కౌండిన్యస" నక్షత్రం అని గుళ్ళోకొచ్చిన ఆనందంతో తబ్బిబ్బుపడ్డ ఒకానొక బ్రాహ్మణ కుటుంబాన్ని చూసి ఏమనాలో తెలియలా!

సరే సంకల్పం అయిపోయింది, అభిషేకం అయిపోయింది. మంత్రపుష్పం అయిపోయింది. అప్పుడు సుబ్బారావుగారు (ప్రధాన పూజారి) "వాంగో వాంగో బద్రీ" అనటంతో ఒకాయన, అదే ఆ బద్రీ అనే అరవాయన "మహాగణబదిం" అని ఒక పాట అందుకున్నాడు. ఇదేమిటి ఈ "బదిం" ఎప్పుడూ వినలేదే అనుకుంటూండగానూ, ఆయన రెండో సారి "గణబదిం" కు రాగానే ఆ బద్రి గారికి నాలుగు జంటల ఇవతల వున్న జంటలో అప్పటిదాకా వాళ్ళ అమ్మ భుజం మీదకెక్కి అందరినీ బోసినవ్వుతో చూస్తున్న పాప "బేర్" అని నూటొక్క రాగం ఎత్తుకుంది, అదీ చెవులు చిల్లులు పడేలా. బద్రి గారి "బదిం" ఒక్క నిమేషం ఆగి ఆ బేర్ తో నాకు సంబంధం లేదు - ఉన్న సంబంధమంతా బదింతోనే అనుకుంటూ తన ప్రయాణం తను సాగించింది. చివరకు పాట అయిపోయింది, పాప ఏడుపూ ఆగింది. బద్ర్ ఆ పాప వంక, ఆ పిల్ల తల్లి వంక చూసి తల అడ్డంగా ఊపటమూ జరిగిపోయింది.

ఏదైతేనేం ఇవ్విధమైన అనుభవాలతో నిజంగా "వైకుంఠాన్ని" చూపించిన ఆ వెంకటేశ్వర పాదాలకు నమస్కారాలు చేసుకుంటూ - వెంకటేశ్వర స్వామి వారికి ఎదురుగా నిర్మించిన వైకుంఠ ద్వారం (చాలా సుందరంగా వున్నది) నుంచి అలా బయటకు వచ్చి తీర్థం తీసుకుని, ప్రసాదం వినియోగం చేసుకుని ఇంటికొచ్చి పడ్డానండీ. ఒక విషయం మటుకు చెప్పాలి, మా సుబ్బారావుగారు చేసే అలంకారం చూడాలంటే నిజంగానే రెండు కళ్ళూ చాలవు. అలా రెప్పెయ్యకుండా స్వామివారినయినా, అమ్మవారినయినా అలా చూస్తూ వుండిపోవాల్సిందే. అలాగే చిన్నపూజారి శ్రీరాం గారి గొంతులో వినపడే "గణపతి పంచకం" సాక్షాత్తూ ఆ శైలనివాసానికీ, ఆ గణనాయకుడి పాదాల వద్దకు చేరుస్తుంది. అంత మధురంగా పాడతారు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కానీ - ఆహా!

అయ్యా అదీ సంగతి. ఇదంతా ఒకవేళ ఓపికగా చదివుంటే మీ ఓపికకు మెచ్చి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామి వారి ఆశీస్సులతో సంతృప్తి చెందుదురుగాక!

13 comments:

 1. బురదలో దొర్లుతూ పన్నీరు వాసన కావాలంటే .... ఊప్స్. :)

  భలే అనుభవం లెండి.

  ReplyDelete
 2. ఎక్కడ పోయినా మన తెలుగు బుద్ధి ఇంతేనా!
  సరేలెండి వదిలేయండి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.

  ReplyDelete
 3. హహహ! అమెరికా లో గుళ్ళల్లో ఇలాంటి అనుభవాలు ప్రతిఒకరికీ కనీసం ఒక్కసారైనా ఎదురవుతాయి. మీకు ఆ స్తోత్రాలూ అవీ వచ్చు. రాని మాలాంటి వాళ్ళకి ఆ పూజారులు ఏ భాషలో ఏమి చెబుతున్నారో కూడా అర్ధం కాదు. ఇహ జనం గొడవ అంటారా? అచ్చం మీరు చెప్పినట్లే.

  ReplyDelete
 4. Hilarious.
  తమిళంలో నక్షత్రాల పేర్లు అలాగే ఉంటాయి. కంఆరు పడనవసరం లేదు. రావణ ఇంద్రజిత్ అనే పేర్లు కూడా సాధారణమే. మనవేఫు పెట్టుకోము గానీ పంజాబ్ లో కర్ణుడి పేరు (కరన్‌) సాధారణం.

  ReplyDelete
 5. విజయమోహన్ గారూ - ధన్యవాదాలు. సునీతగారికిచ్చిన సమాధానం చదవండి వీలుంటే

  కొత్తపాళీ గారూ - నక్షత్రాల పరిస్థితి అర్థమయ్యింది, ఐతే మీరు చెప్పిన ఆ రావణ్, ఇంద్రజిత్ అనే పేర్లు వినటం ఇదేమొదలు నాకు. నన్ను జడిపించిన సంగతి మటుకు ఆ గుళ్లో తారసపడ్డ రావణుడి నక్షత్రం రాములవారి "పునర్వసు" అవ్వటం. :)

  సునీత - ఏ మంత్రాలైనా సంస్కృత భాషలోనే చెప్పేది. మీరు అన్న జనాల గొడవ మటుకు నిజం. ఇక్కడ ఓ మాంచి సంగతి చెప్పాలి. ఆ మధ్య మా అమ్మా, నాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడి (అంటే కాలిఫోర్నియా అన్నమాట) కాంకర్డ్ లోని మురుగన్ గుడికి సుబ్రహ్మణ్య షష్టి రోజు వెళ్ళాము. ఆరోజు మన జనాభా గొడవ అచ్చంగా ఇలానే - అంటే పైన చెప్పినట్టే వున్నా, ఆ గుడికి ఒక తెల్ల జంట (సుమారు 55 యేళ్ళు వుంటాయేమో - ఇద్దరికీ) వచ్చారు. ఆవిడ చక్కగా నిండా కప్పుకున్న పట్టుచీర, ఇంత పెద్ద బొట్టు, మంగళ సూత్రం, నల్లపూసలు, కాళ్ళకు మట్టెలు, పూలు పెట్టుకుని చేతిలో హార్మోనియం పట్టుకునిన్నీ , ఆయనేమో తెల్లని జుబ్బా, తెలుగువారి పంచె కట్టు కట్టుకుని విభూది పూసుకుని, కుంకం బొట్టు ధరించి చేతిలో చిఱతలతో వచ్చారు. సుబ్రహ్మణ్యాభిషేకం అయిపోయాక ఆవిడ చక్కగా బాసిపట్టు వేసుకుని కూర్చుని, హార్మోనియం ముందు పెట్టుకుని భజనలు పాడారు, ఆయన చిఱతల సహకారంతో. ఎంత బాగా పాడారనుకున్నారు. అద్భుతం!. ఇక వాళ్ళ పేర్లు ఏమిటో తెలుసా ? భవాని / శంకర్ - అచ్చం ఆ మహాదేవుని జంట కుమారుణ్ణి ఆశీర్వదించటానికి వచ్చిందా అనిపించింది నాకైతే. వాళ్ళను కదిపితే తెలిసిన విషయం - ఆ జంట కొన్ని దశాబ్దాల కిందట, మద్రాసులోనూ, హైదరాబాదులోనూ వున్నారట. అప్పటినుండి ఇదే "లైఫ్స్టైల్" పాటిస్తున్నాము అని చెబితే నాకు మూర్చ వచ్చినంత పనయ్యింది. ఈ గుడిలో కూడా మనవాళ్ళ సంగతి పైన చెప్పినట్టు షరా మామూలే! భయంకరమైన బట్టలు వేసుకుని రావటం, పెద్ద పెద్ద గొంతులతో అరవటం, ప్రసాదాన్ని చిందర వందరగా పడెయ్యటం ..అబ్బో చెప్పుకుంటూ పోతూ వుంటే ఇలా బోలెడు...

  శ్రావ్య - ధన్యవాదాలు

  నాయనా ప్రవీణూ - కటింగు బాగుంది - అందులో నిజం దాగుంది. అది వొప్పుకుంటాను.. :) బుఱదలోనే కమలాలు వికసించేది, పందీ దొర్లేది. వాసనల సంగతి ఇవతలివారి ఆఘ్రాణశక్తి మీదేనన్నమాట నిజంగా నిజం!

  ReplyDelete
 6. ఇక్కడ గోత్రనామాలు చెప్పమంటే --- పచారీ కొట్టు లిష్టు అంత లిష్టు తీస్తున్నారు, ఈ జాబితాలో కొత్తగా చేరినవి - వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు - ఇంతకీ అక్కడ సంకల్పం ఎట్టా ఎత్తుకుంటారో?

  కలి మహిమ - "ఆవిడను చూసాక "హరహరమహాదేవ" అని చెంపలు వేసుకుని పక్కకు జరిగి నిలబడ్డాను."

  ఈ వాక్యం లో జరిగి నాకు చాలాసేపు వెళ్లి లాగా కనిపించింది

  ReplyDelete
 7. ఊకదంపుడు గారు

  ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రథమపాదే, క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్ర ఖండే (జంబూ, భరత, భరత స్థానంలో)............అలా అలా.. సంవత్సరం, అయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారం, నక్షత్రం, యోగం......అలాగన్నీ అయ్యవారు చెప్పాక - మనము - గోత్రం, నామం, నక్షత్రం, రాశి చెప్పుకుని మన నమస్కారాలు మనం చేసుకుంటే, పక్కనవారి వంతన్నమాట. ఇకపోతే వాహనాల రిజిష్ట్రేషన్ నంబర్లు అదరహా! ఆ భాగ్యం మాకింకా కలగలా!

  మీరు చెప్పింది నిజం. మీరన్న ఆ "వెళ్ళి" అచ్చంగా నాకు మరో "పెళ్ళి" అయినంత అయ్యింది. అల్లా ఎన్నో "పెళ్ళిళ్ళు" చేసుకోవాల్సి వచ్చింది నిన్న. అయ్యా అదీ సంగతి.. :)

  ReplyDelete
 8. ఏవండీ అంటే అన్నామంటారు గానీ వాళ్ళ ఆలోచనలు భోజనాల చుట్టూ తిరిగితే మీ ఆలోచనలు జనాల చుట్టూ తిరిగాయి.గుళ్ళోకొచ్చి అవన్నీ పట్టించుకునేపదులు కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి తలచుకుంటే మిమ్మల్ని కదిలించేవారూ,కాదనేవారూ ఎవరు?రెండున్నర గంటలు ప్రయాణించి మరీ గుడికెళ్ళే మాలాంటి వాళ్ళు దేవుడితో పాటూ ఆయన ప్రసాదాన్ని కూడా దృష్టిలో పెట్టుకునేవెళతాము :) మీరన్నట్టు తమిళ్,కన్నడ వాళ్ళు చాలా పద్దతిగా గుడికొస్తారు.నాకు అది బాగా నచ్చుతుంది. గుళ్ళో చికెన్ ల గురించి మాట్లాడే $%*( వాళ్ళని ఆ దేవుడుకూడా బాగుచెయ్యలేడు.

  ReplyDelete
 9. రాధికగారూ - మీరు అలా అలా మొత్తానికి బస్సు మిస్సయిపోయారు... :) నేను పిట్టకధల బ్రాకెట్లో చెప్పి విప్పింది అందుకే. మీలాటోరు అడుగుతారనే. ఆలోచనలు జనాల చుట్టూ తిరగలా, ఆ వేంకటేశ్వర స్వామి వారే తిరగలేసి తిప్పి చూపించారు. అబ్బాయీ - గుడికొచ్చిన ప్రతీసారీ అలా కళ్ళు మూసుకునే ఉండకు (అంటే నేను వారంలో కనీసం రెండుసార్లు, వీలుంటే మూడుసార్లూ వెళతానన్నమాట! - ఇంతవరకూ ఎవరూ కదిలించినవారూ లేరు, కాదన్నవారూ లేరు!), కళ్ళు మొత్తానికి మూసుకుపోయి గుడ్డివాడివైపోతావూ, తర్వాత నన్ను కూడా చూడలేవు - కాబట్టి ఈవేళ - అదీనూ అభిషేకం ముందు మటుకే కళ్ళు విప్పు, అంతకాదనుకుంటే చెవులు మటుకన్నా విప్పు, చుట్టూరా ఎన్ని వింత మానిసి రూపాలు వున్నాయో చూసో, అది కాకపోతే కనీసం వినన్నా తరించు అనీ - తర్వాత నీకు అలవాటైన దారిలో నువ్వు పడిపోదువుగాని అనీ ఆర్డరేసారు.....అదండీ సంగతి. అందుకే మీరు "ముందు మాటలే" చూసారు. పూజ సమయంలో ఒక్క మాట కూడా లేదు...నా దారి మళ్ళీ ఆదారి అయిపోయిందన్నమాట. పద్ధతి గురించే నా బాధంతానూ ! ఇక మీ రెండున్నర గంటల ప్రయాణం గురించి నేను మాట్టాడదామన్నా ఏమీ లేదు. ఎందుకంటే - నేను మీకు కూతవేటు దూరంలో వున్న వాకీగన్ నుండి (అక్కడ మూడేళ్ళు ఉన్నాలెండి) అరోరా వరకూ వారానికి ఒకసారి, వీలైతే రెండుసార్లూ వెళ్ళేవాడిని. అయినా ప్రసాదం కోసం ఎప్పుడూ వెళ్ళలా...అదన్నమాట సంగతి... :)

  ReplyDelete
 10. :) మీరు టపాలో చెప్పిన విషయం నాకర్ధం అయిందండి.
  నాకు గుళ్ళో మాట్లాడేవాళ్ళంటే చాలా చాలా ఛిరాకు.[అవును ఛిరాకే]ఆమాత్రం సేపైనా ప్రశాంతత పొందలేనివాళ్ళు గుడికి రావడం వేస్టని నా ఘట్టి నమ్మకం.,ఈ టపాలోని విషయాలతో ఏకీభవిస్తూనే ప్రసాదం విషయం లో మాలాంటి వాళ్ళని క్షమించేయమంటున్నాను :)

  ReplyDelete
 11. హమ్మయ్యా మా అమ్మమ్మగారూరి ముక్కోటి తిరణాళ్ళ గోల మిస్సవకుండా దానిసాటి సంగతొకటి చదివించేసారు. ఒకసారి రెండు గుంపుల మధ్య గోల జరిగి రాత్రి భజన సమయానికి దురదదుండాకు ఒకరికొకరు పూసుకుని మరీ గలాటా చేసారు. ఆ సీన్ కూడ కనపడింది. పోతే నా వ్యాఖ్యలో భాషాదోషాలు వుంటే ఈసారికి వదిలేయండి, ఎందుకంటే "వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామి వారి ఆశీస్సులతో సంతృప్తి" పడిన ప్రాణినని. ;)

  ReplyDelete
 12. ఉషగారు - ధన్యవాదాలు.

  "శాస్త్రం"లో "శాస్త్రి"గారు చెప్పినవిధంగా "సర్వం" ఆ మహాదేవార్పణమస్తు.

  నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః

  ఇంతకీ మీదే ఊరో, ఆ తిరణాల సంగతేమిటో తెలియరాలేదు.

  ReplyDelete