Thursday, December 31, 2009

32 ఔన్సుల కోకు! రసపట్టు!

2008లో విడుదలైన క్లింట్ ఈస్ట్ వుడ్ సినిమా "గ్రాన్ టొరీనో" తర్వాత నేను చూసిన సినిమా - రాబర్ట్ డౌనీ, జూడ్ లా నటించిన, క్రిందటి వారం విడుదలైన "షెర్లాక్ హోంస్" అనే ఇంగ్లీషు సినిమా. ఈ సినిమానే ఎందుకు అని అడిగితే దానికో కథ, దానికో కమామీషు , ఆ పైన ఒక స్క్రీన్ ప్లే కూడ ఉన్నది. ఐతే ఆ భాగోతం అంతా చెప్పకుండా క్లుప్తంగా చెప్పుబాబూ అంటే - ఆర్థర్ కానన్ డోయల్ సృష్టించిన షెర్లాక్ హోంస్ పాత్ర , అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు పుస్తకాలు చదవటం మొదలు పెట్టిన దగ్గరినుంచి, పురాణ పాత్రల తర్వాత నా బుర్రలో ఉన్న మలుపుల్లో దాక్కుని అప్పుడప్పుడు నేను ఇక్కడే వున్నానంటూ కలల్లో కూడ కనపడేంత అరాచకం సృష్టించిన పాత్ర. సరిగ్గా అలాటి పాత్ర ఇంకోటి కూడ ఉందండోయి - "రాబిన్ సన్ క్రూసో". ఆ క్రూసో కథ ఇక్కడ చూడొచ్చు. అంత అరాచకాభిమానం కాబట్టి, ఈ రాబర్ట్ డౌనీ సినిమాలు ఏవీ ఇంతమటుకు చూడకపోయినా నా అభిమాన డిటెక్టివ్ కోసం వెళ్ళానన్నమాట.

పావుగంట ముందు కారులో బయలుదేరాను, పార్కింగు చేసాను, చల్లగా వుందని కోటేసుకున్నాను, కవుంటరు దగ్గరికి నడిచెళ్ళాను, లైన్లో నిలబడ్డాను,జేబులో చెయ్యెట్టాను, వాలెట్ తీసాను, అందులో 10 డాలర్ల ఇరవైదు సెంట్లు తీసాను, కవుంటర్లో చెయ్యెట్టి టికెట్టడిగాను గట్రా గట్రా గొడవలన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆ అవతార్ సినిమా చూసినోళ్ళు అలానే రాసారు కాబట్టి ఇప్పటి ట్రెండు ఇదేనేమో అని ఒక రాయేసానన్నమాట. అలాగే మామిడికాయ షేకులు, మంచూరియాలు, పకోడీలు, నూడుల్స్, ష్రెక్ తలకాయలంత బుట్టలో పాప్ కార్ను, వేళ్ళకి జిగురేసేసే నాచో చీజు, సొమాలియాలో పిల్లాడికి ఒకనెలంతా సరిపోయే మంచినీళ్ళ బాటిలంత ప్లాస్టిక్కు గళాసులో 32 ఔన్సుల కోకు, అవేవీ లేకపోయినా సినిమా చూసేసేవాళ్ళల్లో ఒకడిని కాబట్టి, చూసేదే తక్కువైనా నేను ఎప్పుడు సినిమాకు వెళ్ళినా అదనపు ఖర్చు ఉండదు అనటంలో ఏమాత్రం సందేహమూ, చెప్పుకోటానికి సంశయమూ లేదు.

సరే సినిమా మొదలయ్యింది, మొదటి అరగంట బ్రహ్మాండం. బాగుంది. ఆ మొదటి అరగంటలో హాన్స్ జిమ్మర్మాన్ సంగీతం అదరగొట్టాడు అని చెప్పలేము కానీ, ఆ సంగీతం సహాయంతో సినిమా అదేదో లోకంలోకి తీసుకెళ్తుందేమో అని ఒక రకమైన ఫీలింగు కలిగించింది. అలానే లార్డ్ బ్లాక్ వుడ్ చేత చేతబడి వగైరా వగైరాలతో సినిమా ఊపందుకుంది. ఈ బ్లాక్ వుడ్ వేషం వేసిన నటుడి పేరు తెలియదు! - అలా అనటం కన్నా ఆయనగారి మొహమూ, ఆక్షనూ నచ్చలేదు కాబట్టి గుర్తుపెట్టుకోలేదు అనటం న్యాయం. మళ్లీ సినిమాలోకొస్తే - విచిత్రమైన సిక్స్ పాకు శరీరంతో మరింత చిత్రమైన దొమ్మీలు చేస్తూ, ప్రతీదాన్నీ హబుల్ టెలిస్కోపంత భూతద్దంలోనుంచి చూస్తూ, పరిశీలిస్తూ, గుర్తుపెట్టుకుంటూ షెర్లాక్ హోంస్ జీవితం డాక్టర్ వాట్సన్ (జూడ్ లా) సహాయంతో నడుస్తూ ఉంటుంది. డాక్టర్ వాట్సన్ , ఈ డిటెక్టివ్ స్నేహితుడి గోలతో అల్లకల్లోలంగా నడుస్తున్న జీవితం నుంచి శలవు తీసుకుని, పెళ్ళి చేసుకుని గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుదాం అనుకుంటాడు, కానీ మనోడు పడనివ్వడన్నమాట. బ్లాక్ వుడ్ గారు జనాల్ని భయకంపితుల్ని చేస్తూ వుంటే పోలీసులు తీసుకెళ్ళి బొక్కలో పెడతారు. అక్కడ కూడా జనాల్ని చంపేస్తూ ఆయన, ఆ డిటెక్టివ్ ని పంపించండి అని మన మద్దెల చెర్వు సూరిగారిలాగా షెర్లాక్ హోంస్ గారిని పిలిపించుకుని, కటింగు ఇస్తాడు.

కోర్టు బ్లాక్ వుడ్డుకు మరణశిక్ష విధించి అమలు చేస్తుంది. మరణశిక్ష అమలుపర్చాక బ్లాక్వుడ్డు చచ్చిపోయాడని డాక్టర్ వాట్సన్ ధృవీకరించటంతో, నా పక్కసీట్లో కూర్చున్న సుమారు ఎనిమిదేళ్ళ పిల్ల వాళ్ళ అమ్మతో "Oh that guy is dead, can we go get somemore popcorn pls అని వాళ్ళ అమ్మతో గుసగుసలాడటం వినపడి ఆ పర్వతంగారు నా కాళ్ళు ఎక్కడ తొక్కిపారేస్తుందో అని సద్దుకుని కూర్చున్నా. ఆవిడ వెళ్ళి మళ్ళీ ష్రెక్ తలకాయంత బుట్టలో పాప్ కార్ను తెచ్చి ఆ పిల్ల ఒళ్ళో పెట్టింది. కరకరలు, జుఱ్ఱుళ్ళు మొదలు అయ్యాయి.

సరే ఆ గోలమనకెందుకని మళ్ళీ సినిమా తెరలోకి వెళ్తే - విలన్ గారు చచ్చిపోయాక సమాధిని చీల్చుకుని, చిరంజీవి అదేదో సినిమాలో మట్టిలో కప్పిపెట్టాక మోటర్సైకిలుతోనో, జీపుతోనో ఆపద్బాంధవుడిలా పైకి లేచొస్తాడే అలా - మళ్ళీ లేచొచ్చి, హత్యలూ గట్రా చేస్తూ, కలకలం సృష్టిస్తూ - హీరో గారిని బుఱ్ఱతో చిత్తు చెయ్యటానికి, ఐరీన్ అనే ఒక అమ్మాయిగారిని (రేచల్ మెక్ ఆడంస్) వదులుతారు. ఇలా ఎత్తులు పైఎత్తులు వేస్కుంటూ, ఒక గంటన్నర నడిచింది. ఈ గంటన్నర - ఒక ఏడడుగుల భారీకాయుడి విన్యాసాలు ( వీరిని చూస్తే మూన్ రేకర్లో రోజర్ మూర్ గారిని చితగ్గొట్టిన భారీకాయుడు రిచర్డ్ కీల్ గుర్తుకొచ్చాడు), అంతకుముందు సీన్లో అగమ్యగోచరంగా మిగిలిపోయిన క్లూల ముడి ఉన్నట్టు వుండి హీరోగారు విప్పెయ్యటం, దానితో పాటు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టుకోవటం...ఇలా నడుస్తుంది. ఈ గంటన్నరలో వేసిన సెట్టింగులు ఇంతకుముందు ఏదో ఒక సినిమాలో చూసినవే అనిపిస్తాయి. భారీకాయుడితో యుద్ధంలో జూడ్ లా, హీరోగారి మీద ఒక పేద్ద పడవ/ఓడ, తత్సంబధితమైన ఓడ ముక్కలు పడబోతూండగా రక్షిస్తాడు. ఆ సీను, గ్రాఫిక్కులతో కలిసిపోయినందుకో ఏమో కొద్దిగా ఫరవాలా. కాపోతే సినిమాలో ప్రతిదానికీ హీరోగారు మార్షల్ ఆర్ట్స్ లో ఆలోచించి బుఱ్ఱలు రామకీర్తన పాడించడం అనేది కొంచెం ఓవర్ అయ్యిందనే చెప్పొచ్చు.

చివరికి హీరో ఒక పుస్తకం సాయంతో (మాయలఫకీరు ప్రాణాన్ని దాచిన స్థలం తెలుసుకున్నట్టుగా) విలన్ గారు పార్లమెంటులో పెద్దల సమావేశాన్ని రక్తి కట్టించబోతున్నాడని మాపుల మీద గీతలేసి చూపించి, దాన్ని భక్తి మార్గం పట్టించి, విలన్ గారి బండారం బయటపెట్టి - బోధ చేసి, వారిని పరలోకానికి పంపించి జనాలకు విందు చేస్తాడన్నమాట. అయ్యా అదీ కథ.

రాబర్ట్ డౌనీ ముఖంలో విపరీతమైన కళ - "ఛార్మ్" అంటారే అది వున్నది. వేషధారణ- బట్టలు, మేకప్పు వగైరా అన్నమాట - రాబర్ట్ డౌనీకి చాలా అందం తెచ్చిపెట్టాయి. అతన్ని చూడటం నాకు ఇదే మొదలైనా - కుర్రోడు "భాఘా" నచ్చాడు. యాక్షన్లో జూడ్ లా, డౌనీ కన్నా ఒక ఎత్తు పైనే వున్నాడని చెప్పొచ్చు. సినిమా హాల్లో నవ్వులూ పెద్దగా వినపడలా (నాతో సహా!).

అయ్యా అదీ సంగతి - సినిమా మొత్తానికి బాగుంది.. రాబర్ట్ డౌనీ కోసం, జూడ్ లా కోసం చూడొచ్చు. గై రిచ్చీ స్క్రీన్ ప్లే మీద ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టుంటే రసపట్టులో పడేది. అనవసర ఆర్భాటాలు చేస్కోకుండా, ఊహల్లో మునిగి తేలకుండా, ఆశించకుండా వెళితే చాలా టైంపాస్ సినిమా.

టైటిలు కు దీనికి సంబంధమేమన్నా వున్నదా ?

అలాగే! ఓహో అలాగేఁ ఓహోహో అలాగేఁ...

1 comment:

  1. I seriously disliked this movie!!!
    మిమ్మల్నేమీ అనడం లేదు గానీ ఉపోద్ఘాతంలో మీగురించి మీరే షెర్లాకు కి అరాచకాభిమానిని అని చెప్పుకున్నారు కాబట్టి ఈ సినిమాని ఈ మాత్రమైనా మెచ్చడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నా వుద్దేశంలో అసలు షెర్లాకు ఆత్మతత్వానికి చాలా ద్రోహం జరిగంది ఈ సినిమాలో.

    ReplyDelete