Thursday, December 31, 2009

కొత్తతెను గొచ్చింది! కోత్తెనుగు సచ్చింది!

శ్రీ కూచి నరసింహము గారు 1923లో వ్రాసిన పత్రికావిలేఖనములు అనే రచనలో పాతతెనుగు గురించీ, కొత్తతెలుగు తమాషా గురించి - వరహాల్రావు అనే ఒక విద్యార్థి పాత్రచేత ఏమనిపిస్తారంటే...

దేఁవుడికి దణ్ణాలు! దేఁవుడికి దణ్ణాలు!
కొత్తతెను గొచ్చింది! కోత్తెనుగు సచ్చింది !
దిక్కుమాలిన పాతతెనుగు పోతూవుంది
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
'ఉప్మాలు' లే విహను 'ఉత్తపీచు' ల్లేవు
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
చదవకుండా తెనుగు చచ్చిన ట్లొస్తుంది
రాకేం జేస్తుంది రావడం లేదా?
'ప్రాఁదెనుఁగుఁగమ్మంటి పాత్తెనుగు తొంగుంది'
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
సంధులూ గిందులూ చచ్చుసూత్రాలన్ని
పోయాయ్ ! పోయాయ్! పోయాయ్ రా!
మన భాషలో ఫెయిలు మాఁయఁవై పోయింది
మార్కులన్నీ మనవె! మరేఁవి టున్నాది!
బూతుమాట ల్లేని పొస్తకా లన్నిన్ని
బారతా లవ్తాయి! పాఠాల కొస్తాయి!
చూడడం, చదవడం, చూపించడం, దిద్ది
తన్నడం, తిట్టడం, తప్పిపోయిందిరా!
యింతసులభ బ్భాష యిహయెక్కడున్నాది?
దాన్ని దెచ్చినవాళ్ళు దైవాలు! దైవాలు!


ఫలశ్రుతి కూడ చెప్పిస్తారు ఆ ప్రథమ తరంగానికి.. :)

శా. స్కూల్ఫైనల్తెలుగందుమార్కులుఘనఁవ్, ఇంటర్ప్రవేశంధ్రివఁవ్
తప్పుల్రాశిన తప్పులంటు నోరెత్తకుం డుండడఁవ్
పూర్వగ్రంధఁవులన్ని మూలబడడఁవ్, రావంటు-ఊమూల్గడఁవ్
భాషంతాచెడదీశి కూచుని లబోలబ్బోయటం చేడ్వడఁవ్

32 ఔన్సుల కోకు! రసపట్టు!

2008లో విడుదలైన క్లింట్ ఈస్ట్ వుడ్ సినిమా "గ్రాన్ టొరీనో" తర్వాత నేను చూసిన సినిమా - రాబర్ట్ డౌనీ, జూడ్ లా నటించిన, క్రిందటి వారం విడుదలైన "షెర్లాక్ హోంస్" అనే ఇంగ్లీషు సినిమా. ఈ సినిమానే ఎందుకు అని అడిగితే దానికో కథ, దానికో కమామీషు , ఆ పైన ఒక స్క్రీన్ ప్లే కూడ ఉన్నది. ఐతే ఆ భాగోతం అంతా చెప్పకుండా క్లుప్తంగా చెప్పుబాబూ అంటే - ఆర్థర్ కానన్ డోయల్ సృష్టించిన షెర్లాక్ హోంస్ పాత్ర , అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు పుస్తకాలు చదవటం మొదలు పెట్టిన దగ్గరినుంచి, పురాణ పాత్రల తర్వాత నా బుర్రలో ఉన్న మలుపుల్లో దాక్కుని అప్పుడప్పుడు నేను ఇక్కడే వున్నానంటూ కలల్లో కూడ కనపడేంత అరాచకం సృష్టించిన పాత్ర. సరిగ్గా అలాటి పాత్ర ఇంకోటి కూడ ఉందండోయి - "రాబిన్ సన్ క్రూసో". ఆ క్రూసో కథ ఇక్కడ చూడొచ్చు. అంత అరాచకాభిమానం కాబట్టి, ఈ రాబర్ట్ డౌనీ సినిమాలు ఏవీ ఇంతమటుకు చూడకపోయినా నా అభిమాన డిటెక్టివ్ కోసం వెళ్ళానన్నమాట.

పావుగంట ముందు కారులో బయలుదేరాను, పార్కింగు చేసాను, చల్లగా వుందని కోటేసుకున్నాను, కవుంటరు దగ్గరికి నడిచెళ్ళాను, లైన్లో నిలబడ్డాను,జేబులో చెయ్యెట్టాను, వాలెట్ తీసాను, అందులో 10 డాలర్ల ఇరవైదు సెంట్లు తీసాను, కవుంటర్లో చెయ్యెట్టి టికెట్టడిగాను గట్రా గట్రా గొడవలన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆ అవతార్ సినిమా చూసినోళ్ళు అలానే రాసారు కాబట్టి ఇప్పటి ట్రెండు ఇదేనేమో అని ఒక రాయేసానన్నమాట. అలాగే మామిడికాయ షేకులు, మంచూరియాలు, పకోడీలు, నూడుల్స్, ష్రెక్ తలకాయలంత బుట్టలో పాప్ కార్ను, వేళ్ళకి జిగురేసేసే నాచో చీజు, సొమాలియాలో పిల్లాడికి ఒకనెలంతా సరిపోయే మంచినీళ్ళ బాటిలంత ప్లాస్టిక్కు గళాసులో 32 ఔన్సుల కోకు, అవేవీ లేకపోయినా సినిమా చూసేసేవాళ్ళల్లో ఒకడిని కాబట్టి, చూసేదే తక్కువైనా నేను ఎప్పుడు సినిమాకు వెళ్ళినా అదనపు ఖర్చు ఉండదు అనటంలో ఏమాత్రం సందేహమూ, చెప్పుకోటానికి సంశయమూ లేదు.

సరే సినిమా మొదలయ్యింది, మొదటి అరగంట బ్రహ్మాండం. బాగుంది. ఆ మొదటి అరగంటలో హాన్స్ జిమ్మర్మాన్ సంగీతం అదరగొట్టాడు అని చెప్పలేము కానీ, ఆ సంగీతం సహాయంతో సినిమా అదేదో లోకంలోకి తీసుకెళ్తుందేమో అని ఒక రకమైన ఫీలింగు కలిగించింది. అలానే లార్డ్ బ్లాక్ వుడ్ చేత చేతబడి వగైరా వగైరాలతో సినిమా ఊపందుకుంది. ఈ బ్లాక్ వుడ్ వేషం వేసిన నటుడి పేరు తెలియదు! - అలా అనటం కన్నా ఆయనగారి మొహమూ, ఆక్షనూ నచ్చలేదు కాబట్టి గుర్తుపెట్టుకోలేదు అనటం న్యాయం. మళ్లీ సినిమాలోకొస్తే - విచిత్రమైన సిక్స్ పాకు శరీరంతో మరింత చిత్రమైన దొమ్మీలు చేస్తూ, ప్రతీదాన్నీ హబుల్ టెలిస్కోపంత భూతద్దంలోనుంచి చూస్తూ, పరిశీలిస్తూ, గుర్తుపెట్టుకుంటూ షెర్లాక్ హోంస్ జీవితం డాక్టర్ వాట్సన్ (జూడ్ లా) సహాయంతో నడుస్తూ ఉంటుంది. డాక్టర్ వాట్సన్ , ఈ డిటెక్టివ్ స్నేహితుడి గోలతో అల్లకల్లోలంగా నడుస్తున్న జీవితం నుంచి శలవు తీసుకుని, పెళ్ళి చేసుకుని గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుదాం అనుకుంటాడు, కానీ మనోడు పడనివ్వడన్నమాట. బ్లాక్ వుడ్ గారు జనాల్ని భయకంపితుల్ని చేస్తూ వుంటే పోలీసులు తీసుకెళ్ళి బొక్కలో పెడతారు. అక్కడ కూడా జనాల్ని చంపేస్తూ ఆయన, ఆ డిటెక్టివ్ ని పంపించండి అని మన మద్దెల చెర్వు సూరిగారిలాగా షెర్లాక్ హోంస్ గారిని పిలిపించుకుని, కటింగు ఇస్తాడు.

కోర్టు బ్లాక్ వుడ్డుకు మరణశిక్ష విధించి అమలు చేస్తుంది. మరణశిక్ష అమలుపర్చాక బ్లాక్వుడ్డు చచ్చిపోయాడని డాక్టర్ వాట్సన్ ధృవీకరించటంతో, నా పక్కసీట్లో కూర్చున్న సుమారు ఎనిమిదేళ్ళ పిల్ల వాళ్ళ అమ్మతో "Oh that guy is dead, can we go get somemore popcorn pls అని వాళ్ళ అమ్మతో గుసగుసలాడటం వినపడి ఆ పర్వతంగారు నా కాళ్ళు ఎక్కడ తొక్కిపారేస్తుందో అని సద్దుకుని కూర్చున్నా. ఆవిడ వెళ్ళి మళ్ళీ ష్రెక్ తలకాయంత బుట్టలో పాప్ కార్ను తెచ్చి ఆ పిల్ల ఒళ్ళో పెట్టింది. కరకరలు, జుఱ్ఱుళ్ళు మొదలు అయ్యాయి.

సరే ఆ గోలమనకెందుకని మళ్ళీ సినిమా తెరలోకి వెళ్తే - విలన్ గారు చచ్చిపోయాక సమాధిని చీల్చుకుని, చిరంజీవి అదేదో సినిమాలో మట్టిలో కప్పిపెట్టాక మోటర్సైకిలుతోనో, జీపుతోనో ఆపద్బాంధవుడిలా పైకి లేచొస్తాడే అలా - మళ్ళీ లేచొచ్చి, హత్యలూ గట్రా చేస్తూ, కలకలం సృష్టిస్తూ - హీరో గారిని బుఱ్ఱతో చిత్తు చెయ్యటానికి, ఐరీన్ అనే ఒక అమ్మాయిగారిని (రేచల్ మెక్ ఆడంస్) వదులుతారు. ఇలా ఎత్తులు పైఎత్తులు వేస్కుంటూ, ఒక గంటన్నర నడిచింది. ఈ గంటన్నర - ఒక ఏడడుగుల భారీకాయుడి విన్యాసాలు ( వీరిని చూస్తే మూన్ రేకర్లో రోజర్ మూర్ గారిని చితగ్గొట్టిన భారీకాయుడు రిచర్డ్ కీల్ గుర్తుకొచ్చాడు), అంతకుముందు సీన్లో అగమ్యగోచరంగా మిగిలిపోయిన క్లూల ముడి ఉన్నట్టు వుండి హీరోగారు విప్పెయ్యటం, దానితో పాటు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టుకోవటం...ఇలా నడుస్తుంది. ఈ గంటన్నరలో వేసిన సెట్టింగులు ఇంతకుముందు ఏదో ఒక సినిమాలో చూసినవే అనిపిస్తాయి. భారీకాయుడితో యుద్ధంలో జూడ్ లా, హీరోగారి మీద ఒక పేద్ద పడవ/ఓడ, తత్సంబధితమైన ఓడ ముక్కలు పడబోతూండగా రక్షిస్తాడు. ఆ సీను, గ్రాఫిక్కులతో కలిసిపోయినందుకో ఏమో కొద్దిగా ఫరవాలా. కాపోతే సినిమాలో ప్రతిదానికీ హీరోగారు మార్షల్ ఆర్ట్స్ లో ఆలోచించి బుఱ్ఱలు రామకీర్తన పాడించడం అనేది కొంచెం ఓవర్ అయ్యిందనే చెప్పొచ్చు.

చివరికి హీరో ఒక పుస్తకం సాయంతో (మాయలఫకీరు ప్రాణాన్ని దాచిన స్థలం తెలుసుకున్నట్టుగా) విలన్ గారు పార్లమెంటులో పెద్దల సమావేశాన్ని రక్తి కట్టించబోతున్నాడని మాపుల మీద గీతలేసి చూపించి, దాన్ని భక్తి మార్గం పట్టించి, విలన్ గారి బండారం బయటపెట్టి - బోధ చేసి, వారిని పరలోకానికి పంపించి జనాలకు విందు చేస్తాడన్నమాట. అయ్యా అదీ కథ.

రాబర్ట్ డౌనీ ముఖంలో విపరీతమైన కళ - "ఛార్మ్" అంటారే అది వున్నది. వేషధారణ- బట్టలు, మేకప్పు వగైరా అన్నమాట - రాబర్ట్ డౌనీకి చాలా అందం తెచ్చిపెట్టాయి. అతన్ని చూడటం నాకు ఇదే మొదలైనా - కుర్రోడు "భాఘా" నచ్చాడు. యాక్షన్లో జూడ్ లా, డౌనీ కన్నా ఒక ఎత్తు పైనే వున్నాడని చెప్పొచ్చు. సినిమా హాల్లో నవ్వులూ పెద్దగా వినపడలా (నాతో సహా!).

అయ్యా అదీ సంగతి - సినిమా మొత్తానికి బాగుంది.. రాబర్ట్ డౌనీ కోసం, జూడ్ లా కోసం చూడొచ్చు. గై రిచ్చీ స్క్రీన్ ప్లే మీద ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టుంటే రసపట్టులో పడేది. అనవసర ఆర్భాటాలు చేస్కోకుండా, ఊహల్లో మునిగి తేలకుండా, ఆశించకుండా వెళితే చాలా టైంపాస్ సినిమా.

టైటిలు కు దీనికి సంబంధమేమన్నా వున్నదా ?

అలాగే! ఓహో అలాగేఁ ఓహోహో అలాగేఁ...

Sunday, December 27, 2009

గుడిలో గోల!

ఈ రోజు ఆదివారం కాబట్టీన్నూ, ప్రతి ఆదివారం పొద్దున్న పూట మా ఊర్లో వున్న గుళ్ళో - గణపయ్యకు అభిషేకం జరిపే రోజు కావటం మూలాన్నూ, ఆ అభిషేక సమయంలో "రుద్రం" చదువుతారు కాబట్టిన్నూ, చిన్నప్పుడు తాతగారి దగ్గర చమడాలు లేచిపోయేలా దెబ్బలు తిని వల్లెవేసిన రుద్రం మర్చిపోవటం మూలాన్నూ, మర్చిపోయినందుకు ప్రాయశ్చిత్తంగా గత రెండు నెలలుగా ప్రతి ఆదివారం వెళ్ళి ఆ "రుద్రం"లో పాలుపంచుకోవటం మూలాన్నూ, మతిలో గతి తప్పిన నమకం, చమకం మళ్ళీ దారిలో పడటం మూలాన్నూ - ఆ మహాదేవుడి కృప మళ్ళీ కొద్దిగా లభిస్తోంది అనే చెప్పాలి.

ఈ రోజు వైకుంఠ ఏకాదశి కావటం మూలాన్నూ, గుళ్ళో జనాల తాకిడి ఎక్కువగానే వున్నది. మహా పండితులు శ్రీ ఉమాశంకర్ దీక్షిత్ గారు, ఆలయ అధికారి, స్థాపించినవారు ఈ రోజు కనపడ్డారు. ఆయన పర్వదినాల్లో తప్పక దర్శనమిస్తారు. ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో "రుద్రం" జరగబోతోందేమో అని చాలా ఆనందం వేసింది. కానీ, ఆశ అడియాస అయ్యింది. సరే అభిషేకం, పెద్దపూజారి శ్రీ సుబ్బారావుగారు మొదలుపెట్టారు. రుద్రం కాక గకార గణపతి సహస్రం, ఇతర మంత్రాలతో (అవేవో నాకు తెలియదు!) అభిషేకం నడుస్తోంది.

ఇక్కడ పిట్టకథలు కొన్ని చెప్పుకోవాలి. ( ఈ పిట్ట కథలూ, కాకరకాయలూ అన్నీ అభిషేకం ముందు జరిగిన, నేను చూసిన సీన్లన్నమాట.) ఈవేళ గుడికి వచ్చిన జనాభాలో సగం మందికి పైగా కన్నడిగులు, 30 శాతం అరవ వాళ్ళు, 10 శాతం నార్త్ ఇండియా వాళ్ళు, మిగిలిన 10 శాతం తెలుగు వాళ్ళు అన్నమాట. సరే కన్నడిగుల్లో మగవాళ్ళలో చాలా మంది పాంటు షర్టుతో వచ్చారు బానే వున్నది. ఆడవాళ్ళు పట్టుచీరలు కట్టుకు వచ్చారు. అదీ బానే వున్నది. అరవ వాళ్ళు కొంతమంది పాంట్లూ, చాలా మంది పంచెలు, అడ్డబొట్ల మీద చందనం, దాని మీద కుంకుమ విపరీతంగా పూసుకుని వచ్చారు. అదీ బానే వున్నది. ఇక నార్త్ ఇండియా వారు సరే సరి.

మన తెలుగు వారి వద్దకు వద్దామిప్పుడు. వారిలో ఒకరు (ఇక్కడ ఒకరు అంటే, ఒకళ్ళు అవ్వొచ్చు, ఒక కుటుంబమూ అవ్వొచ్చు అన్న మాట!) లాగూతోనూ, ఒకరు తొడల మీద చిరుగులు పడ్డ జీన్సు పాంటుతోనూ, ఒకావిడ కాప్రీసుతోనూ, ఇంకొకావిడ మోకాళ్ళ మీదకు స్కర్టు, దానికి తోడు రేయ్బాన్ కళ్ళజోడు (దేవుడి శక్తిని తట్టుకోవటానికి కాబోలు), ఇంకొకాయన పైజమాతోనూ, ఇంకొకావిడ ఇక్కడ రాయలేని డ్రస్సుతోనూ వచ్చారు. ఆవిడను చూసాక "హరహరమహాదేవ" అని చెంపలు వేసుకుని పక్కకు జరిగి నిలబడ్డాను. ఆ నిలబడడం నిలబడడం, ఒక పూర్తి స్వచ్ఛమయిన తెలుగు జంట, భర్త తెలుగాయన - భార్య అరవావిడ అయిన ఇంకో జంట పక్కన ఇరకాల్సి వచ్చింది.

ఇక వారి మాటలు ఇవీ -

సగం తెలుగు జంటలోని భర్త - "ఏమండీ - మీరు ఫాల్సంలో(ఇదో ప్రదేశం!) వున్న రెష్టారెంటుకు వెళ్ళారా ? చికెన్ అదిరిపోతుందండీ - మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళాలి" (ఇదంతా తెలుగులోనే చెపుతున్నాడనుకునేరు - మీ ఖర్మ! పక్కా ఆంగ్లంలో)..."శంభో శంకరా" "నారాయణ నారాయణ" - గుళ్ళో ఇవి తప్పితే మాట్లాడటానికి మీకేం దొరకలేదురా అనుకుని , ఆ పక్కనే వుంటే ఇంకేం వినాల్సి వస్తుందో అనుకుని మరింత పక్కకు జరిగా.

ఈలోపల శ్రీ ఉమాశంకర్ దీక్షిత్ గారి నుంచి ఒక ప్రకటన, అభిషేకం ఐపోయాక, గుడి వెనక భాగంలో ప్రసాదం వుంటుంది, భక్తులందరూ అక్కడికి వెళ్ళి ప్రసాద వినియోగం చేస్కోండి అని - ఐతే ఈ వేళ వైకుంఠ ఏకాదశి మూలాన, ఉప్మానూ, రవ్వకేసరీ మటుకే వున్నాయి, అన్నపు వంటకాలు ఏవీ లేవు అని ఆయన చెప్పడంతో మన తెలుగు జంటల్లో హాహాకారాలు చెలరేగాయి. ఒకావిడ వాళ్ళ అత్తగారితో "Usually ప్రతిసారి Curd Rice పులిహోర వుంటాయి. ఇవ్వాళ్ళ రైస్ లేదంట. Oh Oh this is not good అని అనటం, అది విని పక్కనున్న ఇంకో తెలుగు జంటలోని భర్త "O yA! it's the same in other temples too. ఇవ్వాళ్ళ Everywhere is like that " అని అనటం, నేను మరింత పక్కకు జరగటం జరిగింది. ఆ జరగటం జరగటం పంచముఖ ఆంజనేయ స్వామివారి పాదాల దగ్గరికి జరిగామన్నమాట.

సరే ఈలోపల ఇంకో జంటలోని భర్త వారి కుమార రత్నాన్ని గుళ్ళో వున్న దేవుళ్ళందరి దగ్గరకు తీసుకెళ్ళి దణ్ణం పెట్టిస్తూ, ఆంజనేయుల వారి దగ్గరకు వచ్చాడు. ఆయన ఆ కుమార రత్నం ప్రశ్నకు నా బుఱ్ఱతో సహా పక్కనున్న వారందరివీ తిరిగిపోయేలా చెప్పిన సమాధానం మీరంతా ఇప్పుడు వినాలన్నమాట. అసలింతకీ కుమార రత్నం అడిగిన ప్రశ్న - " who is this and why does he have 5 faces" పితామహుల సమాధానం - "He is monkey god. He has horse face and pig face on either side and he's very powerful. You should pray him always" - ఆ దెబ్బ నుంచి తేరుకునేలోపల కుమారరత్నం వారి సమాధానం - "I will not pray to monkeys and pigs" - పితామహుల మోములో పెద్ద దరహాసం, పక్కనే వున్న వాళ్ళ ఆవిడ మోములో వికటాట్టహాసం he's so funny అని ముందు అని " నో అఖిల్ - తప్పు - డోంట్ సే లైక్ దట్." అని అన్నది. భగవంతుడా ఈ క్షోభ నుంచి నన్ను రక్షించు నాయనా అని మళ్ళీ ఓ మూలకు జరిగి అరవ్వాళ్ళ సంతలోకి దూరా. ఆ సంతలో వాళ్ళేం మాట్టాడుకున్నా, నాకర్థం కాదనే ధైర్యంతో!

సరే అభిషేకం మొదలవుతూ సంకల్పానికి వచ్చారు. నాదైపోయాక, నా పక్కనున్న అరవ కుటుంబం వంతు. "రావణ్" అనే పేరు "పునర్ పూసం" అనే నక్షత్రంతో - ఏ గోత్రమో తెలియని ఒక నల్ల సిద్ధి చెబుతూ వుంటే మతి పోయింది! రావణుడనే పేరు కలవాళ్ళున్నారనిన్నీ, ఆ పైన వారి నక్షత్రం ఆ శ్రీరామ చంద్రుల వారి నక్షత్రం పునర్వసు అవటం యాదృచ్ఛికమా లేక, మాయా, కనికట్టా అనేది అర్థం కాని అయోమయ లోకంలోకి పడబోతూండగా ఆ పక్కనే వున్న ఒక తెలుగు కుటుంబం నన్ను రక్షించింది. "పిల్లుల" గోత్రం అని చెప్పి. ఆ అయోమయం నుంచి భయోమయం లోకి నెట్టావా అని అనుకుంటూండగా, "పిల్లుల" గోత్రమా అని పూజారి గారు మళ్ళీ అడగడం - కాదు కాదు "పిల్లుట్ల" అని ఆయన చెప్పటం జరగటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటూండగా - ఆ పక్కనాయన "తాబేలు" గోత్రం అని చెప్పాడు. ఇక పరిస్థితి పవర్ హౌస్ పాపన్న లాగా తయారయ్యింది. ఇలాటి గోత్రాలు గత నలభై ఏళ్ళలో ఎన్నడూ వినకపోవటం మూలాన (మీలో ఆ గోత్రాలకు చెందినవారు ఎవరన్నా వుంటే వారికి క్షమాపణలతో!). చివరిగా "చిత్త" గోత్రం - "కౌండిన్యస" నక్షత్రం అని గుళ్ళోకొచ్చిన ఆనందంతో తబ్బిబ్బుపడ్డ ఒకానొక బ్రాహ్మణ కుటుంబాన్ని చూసి ఏమనాలో తెలియలా!

సరే సంకల్పం అయిపోయింది, అభిషేకం అయిపోయింది. మంత్రపుష్పం అయిపోయింది. అప్పుడు సుబ్బారావుగారు (ప్రధాన పూజారి) "వాంగో వాంగో బద్రీ" అనటంతో ఒకాయన, అదే ఆ బద్రీ అనే అరవాయన "మహాగణబదిం" అని ఒక పాట అందుకున్నాడు. ఇదేమిటి ఈ "బదిం" ఎప్పుడూ వినలేదే అనుకుంటూండగానూ, ఆయన రెండో సారి "గణబదిం" కు రాగానే ఆ బద్రి గారికి నాలుగు జంటల ఇవతల వున్న జంటలో అప్పటిదాకా వాళ్ళ అమ్మ భుజం మీదకెక్కి అందరినీ బోసినవ్వుతో చూస్తున్న పాప "బేర్" అని నూటొక్క రాగం ఎత్తుకుంది, అదీ చెవులు చిల్లులు పడేలా. బద్రి గారి "బదిం" ఒక్క నిమేషం ఆగి ఆ బేర్ తో నాకు సంబంధం లేదు - ఉన్న సంబంధమంతా బదింతోనే అనుకుంటూ తన ప్రయాణం తను సాగించింది. చివరకు పాట అయిపోయింది, పాప ఏడుపూ ఆగింది. బద్ర్ ఆ పాప వంక, ఆ పిల్ల తల్లి వంక చూసి తల అడ్డంగా ఊపటమూ జరిగిపోయింది.

ఏదైతేనేం ఇవ్విధమైన అనుభవాలతో నిజంగా "వైకుంఠాన్ని" చూపించిన ఆ వెంకటేశ్వర పాదాలకు నమస్కారాలు చేసుకుంటూ - వెంకటేశ్వర స్వామి వారికి ఎదురుగా నిర్మించిన వైకుంఠ ద్వారం (చాలా సుందరంగా వున్నది) నుంచి అలా బయటకు వచ్చి తీర్థం తీసుకుని, ప్రసాదం వినియోగం చేసుకుని ఇంటికొచ్చి పడ్డానండీ. ఒక విషయం మటుకు చెప్పాలి, మా సుబ్బారావుగారు చేసే అలంకారం చూడాలంటే నిజంగానే రెండు కళ్ళూ చాలవు. అలా రెప్పెయ్యకుండా స్వామివారినయినా, అమ్మవారినయినా అలా చూస్తూ వుండిపోవాల్సిందే. అలాగే చిన్నపూజారి శ్రీరాం గారి గొంతులో వినపడే "గణపతి పంచకం" సాక్షాత్తూ ఆ శైలనివాసానికీ, ఆ గణనాయకుడి పాదాల వద్దకు చేరుస్తుంది. అంత మధురంగా పాడతారు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కానీ - ఆహా!

అయ్యా అదీ సంగతి. ఇదంతా ఒకవేళ ఓపికగా చదివుంటే మీ ఓపికకు మెచ్చి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామి వారి ఆశీస్సులతో సంతృప్తి చెందుదురుగాక!

Wednesday, December 23, 2009

కే.సీ.ఆర్ గారి పృచ్ఛకత్వం ! "కాఖాగాఘాకిజ కాటన్నాయాటీజ" ట

ఈనాడువారు చిదంబర "అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు" రహస్యాన్ని బట్టబయలెందుకు చెయ్యాలన్నట్టు, చేస్తే ఆఫీసు అద్దాలెక్కడ పగులతాయన్నట్టు, ఎవరో వచ్చి ఎవరి బొమికలో విరక్కొడతారన్నట్టు "రాష్ట్రంలో తక్షణం శాంతిని నెలకొల్పండి : చిదంబరం" లో అతితెలివిగా కలిపేసి చేతులు దులుపుకున్నారు. లేపోతే వారు రామోజీరావూ ఎందుకవుతారు , అది ఈనాడు ఎందుకవుతుంది?

ఈ సంప్రదింపుల ఎత్తుకోళ్ళ, దింపుకోళ్ళ పరిణామం ఆశించిందే అయినా, మళ్ళీ బందులతో, పనిలో పనిగా ప్రభుత్వ ఆస్తులతో, విద్యార్థుల - ప్రజల జీవితాలతో ఆడుకోవటానికి భూత ప్రేత పిశాచ గణాలు శివాలెత్తుతూ తయారైపోతున్నాయి. పరిస్థితి అంతా అదుపులోనే ఉందంటూ ప్రకటనలు చేస్తూ, బూచిని చూపెట్టినట్టుగా భూ.ప్రే.పి గణాలతో కుదుర్చుకున్న లోపాయకారీ ఒప్పందంలో భాగంగా (ప్రస్తుతానికి గాసిప్పు మాత్రమే - కానీ నిజమైనా అయ్యుండొచ్చు!) చంద్రహాస దరహాసంతో ఆ సుందరవదనారవిందమ్మీద ముసిముసినవ్వులు పూయిస్తూ - 144 సెక్షను విధించడమైనది అని చేతులు దులుపుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారు.
(అసలుగా వెనకమాల జరుగుతున్న ఏదో పేద్ద గూడుపుఠాణీ అనిన్నీ, కాంగిరేసు ఎదుర్కుంటున్న ఇతర సంక్షోభాల నుండి దారిమళ్ళించే ఊదుడు గొట్టమనిన్నీ కూడా గాసిప్పులు మరి! )

కొద్దిగా అయినా చైతన్యం వున్నవారెవరన్నా, అలా వీలుకాకపోతే రక్షక భటులన్నా - ఈ ఆస్తుల విధ్వంసానికి పాల్పడేవారిలో ముగ్గురినో నలుగురినో తీసుకెళ్ళి, తగలబడుతున్న ఆ ఆస్తుల్లోకి తోసిపారేసి బయటకు రాకుండా కాపలా కాసి మాడిమసైపోయేటట్టు చేస్తే మిగతా భూ.ప్రే.పి మూకకు బుద్ధి వస్తుందేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తూంది.

ఎవరి ఆస్తి వారికి ప్రాణం, ఎవరి ప్రాణం వారికి ప్రియం. సంయమనం కోల్పోయి, మా ఆవేదన పట్టించుకోకపోతే హింసే శరణ్యం అంటే, ఆ హింస మీ ఆస్తుల మీద ముందు చూపించుకోండి అని ఆ పరమపిత ఉద్ఘాటిస్తున్నాడు. నిన్న నిజాము హయాములో మీకు జరిగింది, ఈవేళ ఇతరుల మీద చూపిస్తున్నారనుకోవాలా కొంపదీసి ? సోదరుల ఆవేదన అర్థవంతమైనదే అనుకున్నా,రాష్ట్రంలోని అనేకంగా వున్న ఇతర వెనకబడిన ప్రాంతాల ప్రజలతో కలిసి, ఒక కార్యాచరణ రూపొందించుకునో, పని చెయ్యని నాయకులకు తన్నోపదేశమో చెయ్యాలి కానీ...ఇదేమి వైనం? ఇదేమి విపరీతపు పోకడలు?

తెలంగాణా ప్రాంతాల్లానే రాష్ట్రంలోని 60 - 70 శాతం ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదన్నమాట విస్మరించి "మూడు కాళ్ళ కుందేలు ముడ్డిలో మూతెట్టుక్కూర్చుంటే ఎట్టా?"

ఈ ముష్కర మూకల్లో విద్యార్థులుండడం మరింత శోచనీయం.

ఇక రాజీనామాస్త్రాన్ని కె.సి.ఆర్ మహాశయులవారు పాపం చిక్కి శల్యమైన పొదిలో మిగిలిపోయిన బక్కచిక్కుళ్ళ అస్త్రాల్లోంచి తియ్యలేక తియ్యలేక తీసి "మూతాండీవం" ఎక్కుపెట్టి వినోదం తిలకించటానికి తయరైపోతున్నారని మరిన్ని వార్తలు ఈనాడువారి సౌజన్యంతో తెలిసినాయి ఇప్పుడే..సంతోషం.. ఛానళ్ళవారికి, బ్లాగుల్లో దిక్సూచి లేకుండా తిరిగే వాదులకు కావలసినంత పని, బుర్ర వున్నవాళ్ళకు ఆవేశకావేషాలతో కూడిన వినోదం...గట్రా.....గట్రా....

60 యేళ్ళనుంచి లాక్కొస్తున్న బండి ఇరుసుని కే.సి.ఆర్ మహాశయుల వారు ఇరుకున పెడదామని శాయశక్తులా ప్రయత్నించగా, వారికి మిగిలినదేమనగా హాస్పిటల్ బెడ్డులో ఎక్కించుకున్న "టి.పి.ఎస్" అనే పదార్థమో, అదేదో అంటున్నారే అది మాత్రమేననిన్నీ, ఇక్కడి డాలర్ స్టోర్లలో పిల్లవార్లను సంతోషపెట్టటానికి బహూకరించే అవార్డు ట్రోఫీ, దానితో పాటు రాసిచ్చే (గీతలున్న) తెల్లకాగితపు ప్రశంసాపత్రంలోని "తెలంగాణా గాంధీ" అన్న పదమేననిన్నీ...ఆ ప్రశంసాపత్రం ప్రజల నాలిక గీక్కోటానికి కాక, ఆయన నోరు,నాలిక గీక్కోటానికి కూడా పనికిరాదని కూడా చెప్పుకుంటున్నారు - ఏది నిజమో ఏమో - అయినా నాకెందుకు !!

సమిధలై పోయిన విద్యార్థులూ, కాబోతూన్న అమాయక తెలంగాణా ప్రజలు, ఆమాటకొస్తే ఇతర సీమాంధ్ర తెలుగు ప్రజలూ, సమస్త తెలుగు ప్రజానీకం - తమంతట తామే తమ చేతులతో కొద్దిమంది నాయకులకు తొడిగిన గండపెండేరాలు తళుకుల జిలుగులతో వెక్కిరిస్తూంటే ఆ ధగధగలకు మైమరచిపోతున్నారనీ, కుటుంబంలోనే కాక బయటి ప్రపంచానికీ ఎంత లోకువ అయిపోతున్నామన్నది పట్టించుకోకుండా, ధగధగలు మాయమయ్యాక చీకట్లో మగ్గవలసింది స్వయంగా వాళ్ళే అన్న ధ్యాస కూడా లేకుండా "అదేదో" జరుపుకుంటున్నారని,....ఇంకా బోలెడు రాయాలని వున్నా, మనసొప్పుకోవట్లేదనీ....అయ్యా అదీ సంగతీ....

ఏదేమైనా - పాపం గొర్రె జనాలు కసాయి ఎక్కడ అని ఒకసారి అడిగాక, ఆ వార్త కసాయికి వినపడ్డాకా...ఏమవుతుందీ ?

అదలా పక్కనబెడితే ఈ తతంగమంతా చూస్తూ వుంటే

అస్థివత్ బకవచ్చైవ
చల్లవత్ తెల్లకుక్కవత్
రాజతే భోజ! తే కీర్తి!
పునస్సన్యాసిదంతవత్

అనే పద్యం గుర్తుకొస్తోంది! :) ఇక్కడ భోజులవారు స్వయానా మన నాయకమ్మణ్యులేనని ఒక మదిలో మెదిలిన చిలిపి ఊహట... అయ్యా అదీ సంగతీ....

ఆయనెవరో పృచ్ఛకుడు అతితెలివి ప్రదర్శించి

"కాఖాగాఘాకిజ కాటన్నాయాటీజ" అని సమస్య ఇస్తే

అవధాని శ్రీ చిదంబర శాస్త్రిగారు

"చాఛాజాఝాచి జ చంచన్నాయా ఛీజ
తాథాదాధా తిజ తాతన్నాయా థూజ
పాఫాబాభా పిజ పాపన్నాయా పీజ
" అని ఆపారట

ఆ పృచ్ఛకుడు బిత్తరపోయి - దీని అర్థమేమిటి అని అడిగితే

మీ సమస్యకర్థముంటే మాపూరణకూ అర్థమున్నట్టే అన్నారట శాస్త్రిగారు...అలా వున్నది...మన కే.సీ.ఆర్ గారి పృచ్ఛకత్వం

Saturday, December 12, 2009

1956లో - జరుక్ శాస్త్రి అలా అన్నారన్నమాట

ఎంత వద్దనుకున్నా, నేను ఎంతగానో అభిమానించే జరుక్ శాస్త్రిగారు కాబట్టి సైటులో పెట్టింది ఇలా బ్లాగు జనాలకి తెలియాలని, మూసేసిన బ్లాగు మళ్ళీ తెరవాల్సి వచ్చింది. హతోస్మి!... హతోస్మి!

విశ్వనాథ వారి సమగ్ర వ్యక్తిత్వాన్ని ఈ వ్యాసంలో అలా ఒక్కసారి కళ్ళకు కట్టినట్టు చూపించారు జరుక్ శాస్త్రిగారు, తన ధోరణికి విభిన్నంగా. అదీ ఇందులోని చమక్కు.

ఆంధ్రపత్రిక - జనవరి 14, 1956 లో ప్రచురితమైన ఈ వ్యాసం అందించిన మా నాన్నగారు శివరామ శర్మగారికి వందనాలతో. ఆయన చాలా వాటిని జాగ్రత్త చేసినట్టే, దీనిని కూడా ఫైలు ఫోల్డర్లో పెట్టి జాగ్రత్త చేసారు. కానీ ఆ ఫైలుకు, అందులోని పేపర్ కట్టింగులకు అవసానదశ సమీపించడంతో ఐదారేళ్ళ క్రితం ఆ ఫైలులోనుండి వ్రాసుకోగలిగినంత ఒక పుస్తకంలో వ్రాసుకున్నారు. ఆ పుస్తకం, మొన్నీ మధ్య స్నేహితుడు హైదరాబాదు వెళితే వాడికిచ్చి పంపించారు. అదీ కథా కమామీషు అన్నమాట.

ఈ కింద లింకు నొక్కి, ఆ పేజిలో చివరన వున్న జరుక్ శాస్త్రిగారి వ్యాసం చదూకోండి.!

వ్యాసాలు

ఆ పుస్తకంలోని ఇతర వ్యాసాలు మళ్ళీ ఎప్పుడన్నా

వంశీ