Wednesday, July 15, 2009

తెలుగు నవల (1873 - 1975) - శ్రీ అక్కిరాజు రమాపతిరావు AUDIO

శ్రీ అక్కిరాజు రమాపతి రావు గారు మంజుశ్రీగా తెలుగు ప్రజలకు, సాహిత్యాభిమానులకు చిరపరిచితులు. మంజుశ్రీ గారి గురించి శ్రీ చీకోలు సుందరయ్య గారు ఇలా అంటారు - "మంజుశ్రీ కథలు రాశారు, నవలలు రాశారు, సాహిత్య చరిత్రలు, జీవిత చరిత్రలు రాశారు. అనువాద సాహిత్యం అందించారు. భాషాచరిత్రలో నిరుపమాన సేవ చేశారు. సంపాదకులుగా ఎన్నో గ్రంథాలు వెలయించారు. సంకలనాలు, కూర్పులు, సాంఘిక చరిత్రలు, ఆధ్యాత్మిక రచనలు..లెక్కలేనన్ని. ఇక వక్తగా, ఉపన్యాసకుడిగా, పరిశోధకుడిగా, వివిధ సాహితీ ప్రక్రియల్లో న్యాయనిర్ణేతగా ఎంతో చైతన్యం అందించారు. పందొమ్మిదో శతాబ్దం కందుకూరిదైతే ఇరవయ్యో శతాబ్దంలో అంతటి ప్రతిభ చూపినవారిలో అక్కిరాజు రమాపతిరావు గారు ప్రముఖులు" అని అంటారు.

అక్కిరాజు రమాపతిరావు గారు సుమారు 1975 ప్రాంతంలో రాసిన "తెలుగు నవల" రచనలో తెలుగు నవల గురించి, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి, 1975 దాకా నవలా ప్రస్థానాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్టు వివరిస్తారు. దాదాపు 47 పేజీలు కల ఆ పుస్తకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు 1975లో ప్రచురించారు. ఆ "తెలుగు నవల"ను ఆడియో రూపంలో మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేసాను. ఆ రచనలోని మొదటి 15 పేజీలు, 40 నిముషాల నిడివి కల భాగం ఆడియోగా ఇక్కడ వినవచ్చు.

తెలుగు నవల - మొదటి భాగం

రెండు, మూడు భాగాలు త్వరలో మీ ముందుకు...

Thursday, July 9, 2009

కృత్యాద్యవస్థ - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ (Audio)

నవ్యసాహిత్య పరిషత్తు వారి ' ప్రతిభ ' పత్రిక 1936 నవంబరు నెల సంచికలో కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు వ్రాసిన 'కృత్యాద్యవస్థ' వ్యాసం ఆడియో రూపంలో.

ఈ క్రింది లంకె నొక్కండి

కృత్యాద్యవస్థ - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

ఇదే వ్యాసం డాక్టర్ పురిపండా అప్పలస్వామిగారి సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు వెలువరించిన 'సారస్వత వ్యాసములు' రెండవ సంపుటంలో ప్రచురించబడింది. విషయం తెలియజేసిన ద్వా.నా.శాస్త్రిగారికి ధన్యవాదాలతో.

విశ్వనాథ వారి గురించి తెలుగు వారికి చెప్పేదేముంది ....

విశ్వనాథవారిని చాలా చాలా సంకోచిస్తూ అందుకున్నాను....చదువుతూంటే ఏదో తెలియని ఉద్వేగం, గొంతులో ఏదో తేడా....మొత్తానికి 23 నిముషాలు అదో లోకంలో విహరించి వచ్చి పడ్డాను...

మైకులోకి చదవటమే, నేనూ మొదటిసారిగా ఆ వ్యాసాన్ని చదవటం....రెపరెపలాడుతున్న పేజీలు తీసుకుని రికార్డర్ ముందు కూర్చుని ఎకాఎకిన (లోపల ఏదో తడబడుతూ) చదివిన వ్యాసం...ఎక్కడయినా ఏదన్నా లోపం కనపడితే క్షమాపణలు కోరుకుంటూ....

ఇన్ని రేడియోషోలలోనూ, ఇతర ఆడియో పుస్తకాలు చేసినప్పుడు కానీ నాకు ఏదో తెలియని, ఇది అని ఖచ్చితంగా చెప్పలేని ఇంత వింతయిన అనుభవం ఎదురు కాలేదు....జయహో విశ్వనాథ ...జయజయహో!

Friday, July 3, 2009

"అప్పలం - చప్పలం"

హిందీ సినిమా సంగీత దర్శకుల్లో నేను ప్రాణం ఇచ్చేసేది ఎవరికంటే సి.రామచంద్ర గారికి

చా నిజమా! ఎంతమందికి ఎన్ని సార్లు ప్రాణం ఇస్తావు? తెలుగులో పెండ్యాల గారంటావు, పింగళి గారంటావు, మార్కస్ బార్ట్లే గారంటావు, సముద్రాల గారంటావు - నీ పంచప్రాణాలు వీరేనన్నమాట

సరేలే - ఇంకా తీసుకెళ్ళి చిలకలో పెట్టి, బాలరాజుని తెప్పిస్తా అనలేదు...నిజమే చెపుతున్నా నాయనా...ఆయన పాటలు ఏవి విన్నా అదో ఆనందంలో మునిగిపోతాను....

సరే సరే ! ఐతే నీకు బాగా నచ్చిన పాట ఏమిటో చెప్పు ?

"అప్పలం చప్పలం" అని "ఆజాద్" చిత్రంలో ఆయన స్వరపరచిన పాట వింటూంటే మటుకు గడ్డం చేసుకోనప్పుడేమో, గడ్డం కైలాసం వంక సాగిపోతుంది, చేసుకున్నప్పుడు నందిలాగా ఆ దవారం వద్ద కాపలా కాస్తూ ఉంటుంది అన్న మాట...ఇక ఆ పాట చూస్తే మటుకు అదేదో అంటారే - "సింక్రనైజ్డ్ స్విమ్మింగో" ఏదో అని, వాళ్ళ బూడిద.... అదెందుకు పనికొస్తుంది ఈ నర్తకీమణుల ముందు?..

ఎక్కడ ఎక్కడ....?

ఇదిగో ఇక్కడ..ఇక్కడ

"అప్పలం చప్పలం"

చూసి నువ్వే నిర్ణయించుకో, రామచంద్ర గారి గురించి తెలుసుకోవాలి అంటే వక్కలపీడియా తోటలో నక్కలాగా నక్కి తెలుసుకో....

ఈ పాటకో చరిత్ర ఉందండీ....పాటల రచయిత రాజిందర్ క్రిషన్ గారు మద్రాసులో అప్పళం తింటూంటే సి.రామచంద్రగారు దాని మీద పాట రాయగలవా నువ్వు అని చాలెంజీ చేస్తే , ఓ చస్ ఇంతేనా అని అలా అలవోకగా రాసి పక్కపడేసారట...ఆయన అంత తేలిగ్గా రాసి పక్కనపడేస్తే రామచంద్రగారు అంతకన్నా తేలిగ్గా పాట కట్టేశారు....నా మనసులో పెట్టేశారు.....అదండీ సంగతి

తెలుగు ఆడియో పుస్తకాలు - ఏది ఉత్తమ కళ? - శ్రీ దేవులపల్లి రామానుజరావు

శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు

తెలుగు ప్రజలకు, సాహిత్యాభిమానులకు వీరి గురించి పరిచయం అవసరమే లేదు.ఆంధ్ర సారస్వత పరిషత్తు వీరి నిర్మాణ శక్తికి శాశ్వత కీర్తి స్తంభం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ చరిత్ర వీరి కార్యనిర్వాహక శక్తి నివేదిక. ఆయన వ్రాసిన "నవనీతము (వ్యాస సంపుటి)" అనే రచన నుండి తీసుకున్న "ఏది ఉత్తమ కళ?" అనే వ్యాసం ఆడియో రూపంలో ఇక్కడ ...

తెలుగు ఆడియో పుస్తకాలు

ఇలాటివి నాకు ప్రథమ ప్రయత్నం కాబట్టి, సమయం గడిచేకొద్దీ శ్రోతల సహకారంతో రికార్డింగులను ఇంకా బాగా తీర్చిదిద్దడానికి యత్నించడం జరుగుతుందనీ విన్నవించుకుంటూ

ఆ విరుపులు, ఆ ఝలక్కులు, ఆ చమక్కులు

అదొక కొత్త కలం - మత్తెక్కించే గళం - ఆ మాటలు, ఆ పదబంధాలు, ఆ సమాసాలు, ఆ పేర్లు, ఆ వాక్యాలు, ఆ విరుపులు, ఆ ఝలక్కులు, ఆ చమక్కులు - అన్నీ కొత్తదనంతో తళతళ మెరిశాయి.

ఎక్కడా ? ముందు ఇక్కడ నొక్కండి

పింగళి నాగేంద్రరావు

"నీవేనా నను తలచినది" సెక్షన్లోకి వెళ్ళి చదువుకోండి...

పింగళి నాగేంద్రరావుగారికి నీరాజనాలు అర్పిస్తూ "చిత్ర సకుటుంబ సచిత్ర మాసపత్రిక" జూన్ 2009 సంచికలో ప్రచురితమయిన వ్యాసాన్ని అందించిన మిత్రులు శ్రీ దేవరపల్లి రాజేంద్ర కుమార్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ....