Wednesday, June 17, 2009

వాయిదాకే విసుగొచ్చి హెచ్చరించడంతో - ఆడియో పుస్తకాలకి శ్రీకారం!

ఎన్నో నెలల నుంచి చేద్దాము అనుకున్న పని,వాయిదా పడీ పడీ, చివరికి వాయిదాకే విసుగొచ్చి హెచ్చరించడంతో బుర్ర కుదురుకుని మొదలుపెట్టా.

ఆ పని ఏమిటి? దాని కథా కమామీషు ఏమిటి?

వస్తున్నా అక్కడికే వస్తున్నా..

తెలుగులో ఆడియో పుస్తకాలు రికార్డు చేసి ప్రజనుల్లోకి, పురజనుల్లోకి వదలటం....

ఎట్టెట్టా ? తెలుగులో అలాటివి ఉన్నట్టు నేను ఎప్పుడూ వినలేదే ? సరే మొదలు పెట్టావు - గొప్ప పనే, మరి ఎలాటి రచనలు, సంగతులు వినొచ్చు అందులో?

ఆ సంగతంతా చెప్పేముందు - మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న ఆడియో వినండి....

తెలుగు హరికథా వాజ్మయం

అది దేని గురించా ? హరికథ గురించి - మావయ్య ద్వా.నా.శాస్త్రి గారి గురువుగారు "ఆచార్య తూమాటి దొణప్ప"గారు రాసిన "ఆకాశభారతి" అనే రచనలోనుండి తీసుకున్న ప్రసంగ వ్యాసం - "తెలుగు హరికథా వాజ్మయం"తో ఈ ఆడియో పుస్తకాలకి ఓనమాలు, వగైరా వగైరా....

ఇలాటివి - అంటే 1950-60 కి పూర్వం ఉన్న సాహిత్య రచనల్లో నుండి ఏరుకున్న ఆణిముత్యాలు ఒక చాంతాడంత లిష్టుగా తయారు అయ్యాయి.......అవి ఒకటొకటిగా - ప్రతి రెండు వారాలకి ఒక ఆడియో పుస్తకం చొప్పున విడుదల చేస్తానన్నమాట.

సరే పైదంతా ఒక వేళ వింటే, విన్నాక, చెవులు రక్తాలు కారినా, కారకపోయినా - నచ్చితే - ఎందుకు నచ్చిందో చెప్పండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో , నాలుగైదు లైన్లలోనో, ఒక ఠావు సైజు రాతలోనో చెప్పండి - ఇంకా బాగా వచ్చేటట్టు ఎలా చేయొచ్చో సలహా పడెయ్యండి - అంతే కానీ - మంచి ప్రయత్నం, అభినందనలు, ఆల్ ద బెష్టు , శుభం భవతు, అని ఒక్కొక్క లైను రాస్తే EGO అంటారే - దానికి భోజనం దొరుకుతుందేమో కానీ, నాకు అసలయిన సంతృప్తి కలగదు.... కాబట్టి రాసేటప్పుడు కొద్దిగా "పెన్ను" జాగ్రత్త పె(ప)ట్టుకుని రాయండి - ("ఒళ్ళు" అంటే బాగుండదు కాబట్టి పెన్ను అన్నా!)..

సర్వేజనా స్సుఖినోభవంతు!

8 comments:

 1. Excellent.
  Look forward to more such efforts.
  let's hope your work will be inspiration to other enthusiasts also.
  All the best

  ReplyDelete
 2. వంశి గారు -

  ఈ ఆలోచనా, మీరు వేసిన మొదటి అడుగూ అద్భుతం!!

  ఈ వ్యాఖ్య రాస్తూ ఆడియో బుక్ వింటున్నా :)

  ReplyDelete
 3. మీరీ ఫైల్ ను మాగంటి లో కాకుండా వేరే ఎక్కడైనా హోస్ట్ చెయ్యడం వీలవుతుందా? ఇలా అడగడానికి కారణాలు...

  మీరిచ్చిన లంకె మీద క్లిక్ చేసి వేరే పేజికి వెళ్ళడం కంటే, ఇదే పేజీలో ఎంబెడ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా? ఉదాహరణకు ఇక్కడ చూడండి:

  http://indianraga.wordpress.com/

  ఇంకో విషయం - ఆడియో బుక్ వింటున్నప్పుడు "play" "pause" options లేకపోవడం సరైన user friendly కాదు. చివరికంటా ఒకేసారి వినడం అందరికీ సాధ్యం కాకపోవచ్చును.

  మీరు fileden.com ద్వారా పైన Indiaraga బ్లాగులో లాగా ఎంబెడ్ చేయవచ్చు. మీ ఫైల్స్ ని జనం download చెయ్యడం మీకు నచ్చకపోతే esnips వాడవచ్చు.

  ఏమంటారు?

  ReplyDelete
 4. ఆడియో పుస్తకాలు కొన్ని తెలుగువన్ డట్ కాం లో ఇప్పటికే వున్నాయి.భానుమతి గారి అత్తగారి కధలు కూడా అడియో రూపం లో వచ్చాయి.మొదటగా ఈ ఆడియో కధలు వింటున్నప్పుడు అనుకున్నాను చక్కగా వంట పని,ఇంటిపని చేసుకుంటూ వినేయొచ్చని.కానీ అసలు చదివినప్పుడు వుండే ఆనందం లో పదోవంతు కూడా పొందలేకపోయాను.ఆడియో రూపం లో తేవడం మంచి ప్రయత్నమే.పనెక్కువ.ఫలితం తక్కువ.కానీ తెలుగు మాట్లాడడం వచ్చి చదవడం రాని తెలుగువారికి ఉపయోగకరం గా వుంటుంది.

  ReplyDelete
 5. మీరు మామూలోళ్లు కాదండి. భలే ఆలోచన. కానివ్వండి. మెల్లగా ఒక పెద్ద ఆడియో లైబ్రరీ తయారగుగాక!

  ReplyDelete
 6. మంచి రేడియోలో మంచి ప్రసంగం విన్నట్టుంది. శ్రేష్ఠంగా వున్నాయి మీరు చదివిన పద్ధతి, మీ గాత్రము రెండూ.

  ReplyDelete
 7. కొత్తపాళీగారూ

  ధన్యవాదాలు


  యోగి గారూ

  మీరు ఈ టపా చూసేటప్పటికి, ఆడియో బుక్స్ సెక్షన్ ఇంకా మాగంటి.ఆర్గ్ లో పబ్లిష్ చెయ్యలా...ప్రథమ ప్రయత్నం అని ఊరకే లింకు ఇచ్చా...ఇప్పుడు చూడండి, వెబ్సైటులో - సెక్షన్ ప్రారంభించాను....సూచనలు ఇంకేవయినా ఉంటే తెలియజేయగలరు


  రాధిక గారూ

  ఎవరికో ఒకరికి ఉపయోగపడటమే కావలసింది.. :) ...పని మొదలెట్టాక ఫలితంకోసం చూసేవాళ్ళ గుంపులో నేను పట్టనేమో అని అనుకుంటూ ఉంటాను, కాబట్టి అస్మదీయ మనసుకి నచ్చిన పని చేసెయ్యటమే......పని ఎక్కువవుతుంది అని బెంగ లేదు....ఫలితాలకోసం లొంగేది లేదు... :) ఇంతకీ విన్నారో వినలేదో తెలియరాలేదు....

  రానారె

  విన్నందుకు ధన్యవాదాలు...నేను మామూలోడినే....రెండో కామెంటు తెగ నచ్చేసింది...ఎవరికి ? నా ఈగోకి... :)....పెద్ద లైబ్రరీనే తయారు చెయ్యాలనే ఈ ప్రయత్నం...రెండు వారాలకోసారి తొంగి చూస్తూ ఉంటే కొత్తవి వినొచ్చు...నా గొంతు నచ్చింది అని అనటం మూలాన, ఇంతకు ముందు అలా ఎవరూ చెప్పకపోవటం మూలానా మీకు గిన్నెస్ రికార్డు బహూకరించడమయినది....

  ReplyDelete
 8. మంచి ప్రయత్నం
  డవున్ లోడ్ అవుతూఊఊఊఊ ఉన్నది
  అభినందనలు

  ReplyDelete