Monday, June 8, 2009

ఈ నాలుగు పేర్లు వినగానే నా రోమాలన్నీ.......

ఈ నాలుగు పేర్లు వినగానే నా రోమాలన్నీ నిక్కబొడుచుకుంటాయి...ఏదో తెలియని ఆనందం, ఉద్వేగానికి లోనవుతాను...

అబ్బో ! నిజంగానే ?

అవును స్వామీ - ఇందులో వెటకారం ఏమీ లేదు...అతిశయం అంతకన్నా లేదు...ఎవరేం అనుకున్నా ఇది మటుకు నిజ్జంగా నిజం...

సరేలే - ఎవరా నలుగురు ? ఏమా కథ ?

ఆ నలుగురు వీరే - మాటల మాంత్రికుడు శ్రీ పింగళి నాగేంద్ర రావు, చలనచిత్ర వినీలాకాశాన్ని వెన్నెలతో, ఇంద్రజాల మహేంద్రజాలాలతో నింపివేసిన రేరాజు శ్రీ మార్కస్ బార్ట్లీ, చిత్ర రంగంలో రచయితకి గుర్తింపు తీసుకువచ్చిన మహారచయిత శ్రీ సముద్రాల రాఘవాచార్య, అజరామర సంగీత దర్శకుడు శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు...

నాకు కూడా ఒక్కసారి ఒళ్ళు ఝల్లుమన్నదయ్యా....సంతోషం...ఇంతకీ ఆ నలుగురి ప్రసక్తి ఎందుకు తెచ్చావు?

వస్తున్నా అక్కడికే వస్తున్నా - ఆ నలుగురిలో ఇద్దరి మీద వెబ్సైటు ప్రారంభించాను...

ఎట్టెట్టా - ఏది మళ్ళీ జెప్పు ? మరి ఎవరు వారిద్దరు ?

ఆ ఇద్దరూ - పింగళి వారు, బార్ట్లీ గారు....

సరే, అంతా బాగుంది కాని అబ్బాయా - కొంచెం ఆ వెబ్సైటు వివరాలు తెలియచేస్తే సంతోషిస్తాం -

1) మాటల మాంత్రికుడు శ్రీ పింగళి నాగేంద్ర రావు గారికి పాదాభివందనాలర్పిస్తూ, వారికి సంబంధించిన విశేషాలతో ఈ వెబ్సైటు మీ ముందుకు. ప్రస్తుతానికి కొన్నే ఉన్నా, మిగిలినవి త్వరలో...లంకె ఇదిగో

శ్రీ పింగళి నాగేంద్ర రావు

"అజబీదఫపా విశ్వేసకి స్వాములవారు!", హలా, డింగరీ, గిడిగిడి, డింభకా, శాయరా, బుల్ బుల్" వంటి మాటల్ని పాటలు పాడుకున్నట్టుగా పదేపదే ప్రేక్షకుల చేత పలికించిన సినీ మహారచయిత పింగళి నాగేంద్రరావు. ఆయన పాటల్లోని మాటలూ, మాటల్లోని పాటలూ సినిమా టైటిల్స్ గా వచ్చినట్టు ఇంకో రచయితవి రాలేదు.........ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి అని అసమదీయులకి వీరతాళ్ళు వేయించి......"


సరే సరే మిగతావి అక్కడా చూస్తాంలే కానీ, మార్కస్ బార్ట్లీ గారి గురించి చెప్పవయ్యా

2) తెలుగు ప్రజలకు వివాహ భోజనం పెట్టించి, గిల్పం గింబళితో కప్పేసి తన కెమేరా కన్నుతో ఇందరజాల మహేంద్రజాల టక్కు టమారాది విద్యలు ప్రజల హృదయాల్లో సహస్ర వత్సరాల వరకు నిలిచిపోయేటట్టు చేసిన మహానుభావుడు శ్రీ మార్కస్ బార్ట్లీ గారికి వందనాలర్పిస్తూ ప్రారంభించిన వెబ్సైటు లంకె ఇదిగో

శ్రీ మార్కస్ బార్ట్లీ

ఆయన గురించి శ్రీ రావి కొండల రావు గారు ఏమంటారో తెలుసా ? - "పున్నమిచంద్రుడు వినీలాకాశంలో వెలిగి, వెన్నెల కురిపిస్తే మార్కస్ బార్ట్లీ, సినీలాకాశంలో తెరమీద " పిండారబోసినట్టు " దీపాలతో వెన్నెల సృష్టించి, ప్రేక్షకుల మీద కురిపించాడు. వెన్నెల పాటల్లోని, ఆ వెన్నెల థియేటర్లోని ప్రేక్షకుల ముఖాల మీద ప్రతిఫలించేది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో, ముఖ్యంగా " విజయా " చిత్రాల్లో ఛాయాగ్రహణ దర్శకుడు మార్కస్ బార్ట్లీ చూపించిన వెన్నెల, సహజమయిన వెన్నెలని మించిపోయింది. అందుకే ఆ రోజుల్లోని రసజ్ఞులు ఆకాశం మీద పూర్ణచంద్రుణ్ణి చూసినప్పుడు " ఇవాళ చంద్రుడు విజయా వారి చంద్రుడిలా వున్నాడు " అని ' తిరగవేసి ' చెప్పుకునేవారు. సంబంధం వున్నా లేకపోయినా, పాట, అదీ ప్రేమ గీతం అయితే - చందమామ, వెన్నెలా విధిగా ఉండవలసిందే. అది అసహజం కాదు, కృత్రిమం కాదు, ఆహ్లాదం కోసం, ఆనందం కోసం. పాట వింటున్నప్పుడు ఆ మాధుర్యాన్ని ఎలా ఆస్వాదిస్తామో, ఆ దృశ్యాన్ని కూడా అంత హాయిగా అనుభవించాలి. పాటని చీకట్లో చిత్రీకరిస్తే ?.... "


సరే సరే మిగతావి అక్కడ చదువుతాంలే....మొత్తానికి ఎన్నో ఏళ్ళకి మళ్ళీ నా మొహంలో, మనసులో సంతోషం కనపడిందయ్యా / నిండిపోయిందయ్యా ....ధన్యవాదాలు....మరి మిగతా ఇద్దరి సంగతి ?

చెబుతా - త్వరలో చెబుతా ....ఓపిక పట్టండి స్వామీ....

ఈ వెబ్సైట్లలో వివరాలు ప్రస్తుతానికి కొన్నే వున్నా, త్వరలో మిగిలినవి అందచేస్తాననిన్నీ...... ఆ పైన సభాముఖంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటి అంటే - ఎవరి వద్ద అయినా వీరి మీద కాపీరైటు సమస్యలు లేని వివరాలు , సరంజామా ఉంటే అందచెయ్యండి....అందుకు ముందుగానే కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను...ఒకవేళ హక్కుదారుల అనుమతి తీసుకోవలిస్తే మీరు అడిగి తీసుకున్నా సరే, లేదా తీసుకోవలసిన వారి వివరాలు అందచేసినా సరే.....

5 comments:

 1. మహా ప్రభో మరలా మా బోంట్లను కూడల్లోకి లాక్కొస్తున్నారన్నమాట :)
  శుభాభినందనలు

  ReplyDelete
 2. నెటిజన్ గారూ

  మీ అభినందనలకు ధన్యవాదాలు. అయినా ఏమనుకోనంటే ఒక్క మాట - అభినందనలు ఎందుకండీ ? ఆ పెద్దవారి మీద మీకున్న అభిమానం చాలును..నాకు వీరతాళ్ళు అక్కరలా, అందుకు తగను కూడా...ఈ కాలం కుర్రోళ్ళు మాయాబజార్ అంటేనో, మార్కస్ బార్ట్లీ అంటేనో, పింగళి నాగేంద్ర రావు గారంటేనో, ఇంకా ఎవరయినా అంటేనో - వెకిలిగా నవ్వి "who are those guys and why are you bothered about them....c'mon moron - let's go party" అని అనకుండా ఉంటే - అదే కోట్లు విలువ చేసే...

  రాజేంద్రా

  మళ్ళీ రంగంలోకి దిగినందుకు మాబోంట్లకు సంతోషం...అజ్ఞాతం వీడి జనస్రవంతిలో కలిసిపోబోతున్నందుకు ఇతరులకి సంతోషం ...just kidding అంతా బాగే అని తలుస్తాను...మీ లాటి వారు ఈ తరానికి చెప్పేందుకయినా కావాలి - వాళ్ళు విన్నా వినకున్నా ....

  ReplyDelete
 3. వంశీ గారు , ధన్యవాదములు .

  ReplyDelete
 4. మంచి టపా రాసినందుకు కృతజ్ఞతలు ..ఈ బ్లాగు తో మాలాంటి వారి మనసు దోచుకొన్నందుకు అభినందనలు.

  ReplyDelete