Monday, May 11, 2009

బల్లల చిల్లుల్లో నల్లుల బాధ!

కృష్ణాజిల్లాలో అమ్మమ్మగారి ఊరు చల్లపల్లి కమల, సాగర్ టాకీసుల్లో చూసిన "చిత్ర"అనుభవాలు

చల్లపల్లి - ఈ పేరు వినగానే నా రోమాలన్నీ నిక్కబొడుచుకుంటాయి...

అదేమిటి ? ఏదన్నా రోగమా ?

కాదు బాబూ కాదు ఉద్వేగం , ఆనందం, సంతోషం, ఆహ్లాదం వగైరా వగైరా అన్నమాట.

సరేలే అసలు సంగతి చెప్పు.

వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఈవేళ అక్కడి సినిమా టాకీసులు, వాటితో నా అనుభవాలు, అనుభూతులు, తద్భవాలు, తద్భిన్నాలు వగైరా వగైరా చెబుతానన్నమాట.

సరే చెప్పి తగలడు...

కమల టాకీసు హాలు కెపాసిటీ సుమారు 600 అనుకుందాం. కానీ ఆట మొదలయ్యేసరికి జనం ఓ వెయ్యి మంది ఉండేవాళ్ళు. ఎలా ? ఆట మొదలయిన ముప్పావుగంటవరకూ టిక్కెట్ల కవుంటర్లో టిక్కెట్లు అమ్మేవాళ్ళు. వెయ్యి ఏం ఖర్మం, కొత్త ఆట ఐతే రెండువేల మందిని కుక్కేసేవాళ్ళు...

ఆ టిక్కెట్ కవుంటర్లో కూర్చున్న నారాయణని ఎవరయినా " ఎంతసేపయ్యింది ఆట మొదలయ్యి?" అని అడిగితే "ఇదిగో ఇప్పుడే, ఐదు నివుషాలయ్యింది. ఊపందుకోడానికి టైము పట్టుద్దిలే. డబ్బులు డబ్బుల్తీయ్" అని హడావిడి పెట్టి టిక్కెట్టు కొనిపిచ్చేవాడు. సరే పోనీ ఎవడయినా ఖర్మ కాలి ఆట మొదలవ్వటానికి ముందే వెళితే అక్కడ "క్యూ" పద్ధతి లేకపోవడం మూలానా, బుక్కింగు ఆఫీసు కవుంటర్కి ఉన్న ఒకే ఒక చిన్న బెజ్జంలాంటి "దవారం"లో చెయ్యి పెట్టి టిక్కెట్టు తీసుకోటానికి చెయ్యిలోపలికి పెట్టగలిగే ధైర్యం చెయ్యగలిగితే, కొంత మంది పిన్నీసులు విప్పదీసి పట్టుకుని అవతలివాడిని గుచ్చిపారెయ్యటానికి రె"ఢీ" అయిపోయేవాళ్ళు.

సరే ఆ పోట్లు తట్టుకుని టికెట్టు ఎలాగోలా సంపాదించుకున్నవాళ్ళ బాధలు వేరే రకంగా ఉండేవి... తలుపు దగ్గర నుంచుని ఎప్పుడు తలుపు తీస్తాడా, పరిగెత్తుకెళ్ళి ఆడోళ్ళ సెక్షన్ పక్క సీట్లు సంపాదించుకుని వెకిలి వేషాలు వేద్దాము అనుకునే కుర్రమూకల గోల ఒకవైపు, చుట్టలు, బీడీలు కొండొకచో సిగిరెట్టు కాల్చే దర్జా బాబుల గోల ఒక వైపు...సరే అవి అన్నీ తట్టుకుని అక్కడే నిలబడగలిగితే ఆ "దవారం" నుండి ఇంతకుముందు జరుగుతున్న "ఆట"లో మాటలు, ఆట చివర్లోకి వచ్చి ఉంటే హీరోగారు గళ్ళలుంగీ విలన్ గారిని దంచే ఢిష్యుం ఢిష్యుం శబ్దాలూ వింటూ ఆనంద పరవశులవుతూ "అబ్బా ఏం కొడుతున్నాడురా విలనుగాణ్ణి నా సామిరంగా" అని డవిలాగుల మీద డవిలాగులు వదిలే వింత జనాభా మరోవైపు.

ఈ బాలారిష్టాలు అన్నీ దాటుకుని లోపలికి పోతే, నంబర్లూ గట్రా లేకపోవటం మూలాన జనాలంతా తత్తరబిత్తరగా ఉరుకులు పరుగులు పెట్టడం మూలాన, ఆపైన వీళ్ళ ఉరుకులు పరుగుల మూలాన విరిగిపోయిన కొన్ని కుర్చీలు, బెంచీలు మొదలయిన పదార్థాల నుంచి పొడుచుకొచ్చిన మేకులు, చెక్క పేళ్ళ వల్ల పంచెలు, పాంట్లు ఇరుక్కుపోయి, చిరిగిపోయి ఆ టాకీసు వాడిని బండబూతులు తిట్టుకుంటూ, మొత్తానికి వాటిల్లోనే సద్దుకుని పోయే వింత మానిసి రూపాలతో భలే చోద్యంగా ఉందేది.

సరే ఇక్కడ టాకీసులో సీట్ల గురించి చెప్పాలి...ముందు నేల టికెట్టు, తర్వాత బెంచీ టికెట్టు, తర్వాత కుర్చీ, తర్వాత బాల్కనీ...నేల టికెట్టు కొన్నవాడికి కళ్ళు విచ్చేలా కనపడే నానా రకాల పదార్ధాలతో కనువిందు... ఆ కనువిందు ఏమిటా ? చుట్ట, బీడీ తాగుతూ చేసే "తుపుక్కులు" , ఆ వాసన పడక పిల్లల పొట్టలోనుంచి బయటికి వచ్చిన పదార్థాల మరకలు - ఇలా నానావిధ పరిమళాలతో సుగంధభరితంగా ఉండేది. ఆ పదార్థాలు ఏవీ లేని చోటు చూసుకుని కూర్చున్న వాడి అదృష్టమే అదృష్టం. సరే బల్ల/బెంచీ టికెట్టు కొనుక్కున్న వారి బాధ ఇంకోటి. అన్ని బల్లలు సమానమయిన ఎత్తులో ఉండటం మూలాన, ఇతరులని వదిలి పెడితే , సమవయస్కులు, సమానమయిన ఎత్తు ఉన్నవాళ్లకి కూడా తెర, దాని మీద బొమ్మా కనపడక దిమ్మ తిరిగే అవస్థలు. ఆ పైన బల్లల చిల్లుల్లో నల్లుల బాధ వేరొకటి.

ఈ సీట్లు, తదితరాలాలు వీటన్నిటికీ ఒక సూత్రం వర్తిస్తుందండోయి...భుజం మీదున్న కండువానో, పాంటు జేబులో వున్న రుమాలో, చేతిలో వున్న పాత జ్యోతిచిత్రో - ఒకానొక ప్రదేశం మంచిది అని నిర్ణయానికి వచ్చాక, ఆ ప్రదేశంలో పడేసి "రిజర్వు" చేసుకుని కాలరెగరేసుకుంటూ అవసరం వున్నా లేకున్నా, అవసరమే ఎక్కువ లెండి, అలా ఒకసారి బయటకు వెళ్ళి చల్లగాలి పీల్చి ఆట మొదలయ్యేసరికి మళ్లీ లోపలికి జొరబడి అందరి కాళ్ళు, కీళ్ళు తొక్కుకుంటూ కండువా దగ్గరికో, రుమాల దగ్గరికో, జ్యోతిచిత్ర దగ్గరికో పోవటం ఒక గొప్ప ఆనందమయిన విషయం.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండోయి...ఖర్మకాలి ఆట మొదలయ్యే సమయానికి టికెట్లు మొత్తం అమ్ముడు కాకపోతే, టాకీసువారి వద్ద ఒక రిక్షా బండి ఉందేది, దానికి ఒక భీంపలాస్ అంత మైకు ఉండేది.."మందయ్య"ని వేంఠనే ఆ రిక్షా ఎక్కించి, టాకీసు పక్కనే ఉన్న ఐదారు వీధుల్లో తొక్కించి మైకులో "చూడండి నేడే చూడండి - ఆట మొదలు అవుతోంది" అంటూ అదేదో ఒక మాటల మంత్రం ఊదించేవారు...ఆ మంత్రాలకు చింతకాయలతో సహా పడ్డవాడు గొప్పవాడన్నమాట.

సరే ఇక కుర్చీ క్లాసుకు వస్తే, ఆ కుర్చీల వద్దకి మీరు వెళ్లేసరికి "శునక రాజాలో, మార్జాల రాజాలో" తమ అమృతమయిన వాసన వెదజల్లే దద్ధోజన ప్రసాదంతోనో, లేక పసుపు పచ్చని తీర్థంతోనో పావనం చేసుండకపోతే ఆ వేళ్టికి మీ అదృష్టదేవత మిమ్మల్ని కరుణించింది అనుకుని ఒక చిరుమందహాసంతో ఆ కుర్చీలో కూర్చుని ఆట చూస్తూ ఆ "చిత్ర"హింసకు తోడుగా బల్లలకు మల్లేనే కుర్చీలకు అంటుకుపోయిన నల్లులతో బాధ పడాలి అన్నమాట. ఒక్కోసారి ఆ టాకీసువారు DDT అనే పదార్థం కూడా జల్లేవారు ఆ కుర్చీల్లో నల్లుల బాధ రూపు మాపటానికి. ఆ DDT వాసన పడని వారి తుమ్ముల బాధ, చిత్రంలోని బాక్గ్రవుండు మ్యూజిక్కులాగా అదనపు ఆకర్షణ అన్నమాట.

బాల్కనీలో కుర్చీలు కొద్దిలో కొద్దిగా నయం. రెండు బాల్కనీ సైడ్లు ఉందేవి..ఒక్కోవైపు ఎనిమిదేసి సీట్లతో. ఆ ఎనిమిది మందికి ఒక ఫాను కూడానండోయి. ఫాను అంటే గుర్తుకొచ్చింది, కుర్చీవాళ్లకి, బల్ల వళ్ళకి, నేల వాళ్ళకి ఫాను గాలి అందే సమస్యే లేదు. ఉండటానికి టాకీసు మొత్తానికి 16 ఫాన్లు ఉండేవి. అబ్బో 16 యే - ఎక్కడ? టాకీసు ఆస్బెస్టాసు రేకులకు ఒక ఆడుగు దిగువున. ఆ ఎత్తునుంచి గాలి కుర్చీలదాకా రావాలి అంటే, వాయుదేవుడు మరో జన్మ ఎత్తాలి అన్నమాట.

ఇక "ఇంటర్వెల్లు" సమీపిస్తోంది అనగానే, ప్రకృతి పిలుపులకి తయారయినవాళ్ళది మరో బాధ. ఆడవాళ్ళకి మరింత కష్టంగా ఉండేది.. ఎందుకా ? ఇది కూడా తెలీదా నీకు ? ఓరి సుబ్బారావూ ......అందుకన్నమాట..సరే ఇంటర్వెల్లు సమయానికి బయటకు వస్తే అక్కడ పకోడీలు, బజ్జీలు వేసిపెట్టే "శీను" ఉండేవాడు. వాడు సుమారు నాలుగు నెల్లకు కామోలు, ఒక్కసారి మటుకు - ఆ బాణలిలో ఉన్న నూనెలో సగం మాత్రమేనండోయి - మార్చేవాడు. ఆ పదార్థాలు కొనుక్కున్నవాళ్ళ ఆయుష్షుని బట్టి యమదూతలు వేచిచూడటమా, పరుగు పరుగున రావటమా అన్నది నిర్ణయించేవారన్నమాట.

సరే ఇవి అన్నీ పక్కన పెడితే, ఎండాకాలం - మాటినీ ఆటకు వెళితే అందులోని ఆనందం వేరు. ప్రతి ఐదు పదినిముషాలకి ఒకడు తలుపు తీయటం మూలానా, ఆ తెరిచిన వాడు తలుపు వెంటనే ముయ్యకపోవటం మూలానా, తెర మీద బొమ్మ కనపడక, వాణ్ణి బండబూతులు తిడుతూ జనాలు చేసే గోల వల్ల ఆటలో డవిలాగులు అర్థం కాక మొత్తానికి "చిత్రం" అంతా సగం అర్థం అయ్యీ సగం అర్థం కాక అతుకులబొంతగా చిత్రవిచిత్రంగా ఉండేది.

(సశేషం .....)

ఇదేమిటి అప్పుడే సశేషం ఏమిటి ?

అదే మరి..అన్నీ ఇప్పుడే చెబుతే ఎలా నాగన్నా ?

3 comments:

 1. > "ఆట"లో మాటలు, ఆట చివర్లోకి వచ్చి ఉంటే హీరోగారు గళ్ళలుంగీ విలన్ గారిని దంచే ఢిష్యుం ఢిష్యుం శబ్దాలూ వింటూ ఆనంద పరవశులవుతూ "అబ్బా ఏం కొడుతున్నాడురా విలనుగాణ్ణి నా సామిరంగా"

  :-))

  ReplyDelete
 2. బాగు బాగు.
  బెజవాడ గవర్నరుపేట సెంటర్ లష్మీ టాకీసులో సినిమా చూసిన అనుభవాల్ని గుర్తుకి తెచ్చారు.

  ReplyDelete
 3. మీలాగే నాక్కూడా చల్లపల్లి అభిమాన ఊరు. నా బాల్యంలో కొద్దిసంవత్సరాలు (1973-75) అక్కడే గడిపాను. కమల, సాగర్ టాకీసులు అప్పట్లో చూడ్డానికి కొత్తగా ఉండేవి. ఇప్పుడు బాగా పాతబడిపోయి ఉండొచ్చు.

  --తాడేపల్లి

  ReplyDelete