Thursday, February 26, 2009

ఇది కలా, నిజమా ? ఆశ్చర్యం, అద్భుతం !

సమావేశం జరిగిన ఆరునెలలకి సి.బి.రావు గారు ఫోటోలు పంపి కేక పెట్టించారు....ఇక నివేదిక ఎప్పుడొస్తుందో తెలియదు కానీ, అందాకా బ్లాగు చుట్టాలూ - ఖాళీ విస్తరాకులు ముందెట్టుకుని కూర్చుని, నోట్టో తాంబూలంతో దంతాలు రక్తవర్ణం చేస్కోండి...పిండివంటలు, భోజనపదార్థాలూ తరువాత వడ్డిస్తారట రావు గారు... :)..:)
ఆచార్యుల వారు

Set 1


Set 2

Tuesday, February 3, 2009

మొత్తానికి నా చేత మళ్ళీ టపా వ్రాయించింది !

మొత్తానికి బే ఏరియా సమావేశం నా చేత మళ్ళీ బ్లాగు టపా వ్రాయించింది ..

అన్నిటికన్నా ముందుగా నేను అడగగానే ఈ సమావేశాన్ని వాళ్ళింట్లో జరుపుతానని ముందుకు వచ్చిన కిరణ్ ప్రభగారికి అభినందనలు, కృతజ్ఞతలు.

ఆహ్వానం ఇక్కడ చూడవచ్చు

http://deeptidhaara.blogspot.com/2009/01/bay-area-causa.html

కొత్తవారిని కలవటం, మన భాష మీద వారి "విలువయిన" అభిప్రాయాలు తెలుసుకోవటం, ఒక రెండు ముక్కలు బ్లాగుల గురించి మాట్లాడటంతో బహు పసందుగా జరిగిందనే చెప్పాలి. మొదటి సారి బ్లాగర్లు, పత్రికాధిపతులు, రచయితలు వంటి వివిధ వ్యక్తులు కలుసుకోవటం వల్ల కలిగే ఆనందం ఇలా ఉంటుంది అని అందరికీ తెలియవచ్చింది.

"స్పందన" అనే సంస్థ నుండి విచ్చేసిన వారు విచ్చలవిడిగా పంచిన రంగురంగుల పాంఫ్లెట్లతో నా ఎస్.యు.వీ నిండిపోయిందనే చెప్పాలి. మరి ఎంతమంది ఈ "స్పందన"కు "స్పందిస్తారో" తెరపై చూడాల్సిందే.

అక్కడికి వచ్చిన భాషాభిమానుల్లో కొందరు "తెలుగు" మాట్లాడటానికి కొద్దిగా కష్టపడటం మంచి ముదావహమయిన సంగతి. కిరణ్ వాకా గారూ - మీరు తడుముకోవద్దు. మిమ్మల్ని ఉద్దేశించి అన్నది కాదు. మీరు తెలుగునాడులో పెరగలేదు కాబట్టి మిమ్ములని వదిలివెయ్యటం జరిగింది. మరికొంతమంది అంటే వైధర్ గారి లాంటి వారు ఈ మీటింగుకు రాక ముందు నుండీ వారాల కొద్దీ మౌనవ్రతం పాటించారా, ఇంకా పాటిస్తున్నారా అని అనిపించటంలోని ఆనందం చెప్పనలవి కాదు.

మధ్య మధ్యలో ఆచార్య వేమూరి గారు విసిరిన చెణుకులతో చాలా సరదాగా గడిచిపోయిందనే చెప్పాలి. ఆయనే గనక లేకుంటే నడిసంద్రంలో చుక్కాని లేని నావలో వెళుతూ, ఉప్పునీళ్ళు తాగుతూ, ఆ కఱ్ఱెక్కిన ఉప్పుతో రక్తపోటు పెరిగి నావలో టెక్కే మీదకెక్కి పడుకుని సూర్యుణ్ణి చూస్తూ కళ్ళు పోగొట్టుకునే పరిస్థితి వచ్చేది అనే చెప్పాలి.

ఈ సమావేశానికి వచ్చినవారంతా నా మీద దయ ఉంచి, ఈ క్రింది నిజ వాక్యాలను కోపం లేకుండా చదువు కోవాలని ఈ భవదీయుడి విజ్ఞప్తి... ఇదేదో విమర్శ అనుకుని అపోహ పడవద్దని, విసురులు అంతకన్నా కావని, గుండెల నిండా పొంగుతున్న ఆనందంతో రాసింది అని అర్థం చేసుకోవలసినదిగా అందరికీ మనవి

** తెలుగు హలాంత భాష కాదని, గొప్ప అజంత భాష అనీ, భాషలో ఇతర భాష పదాలు లేకపోతే భాష జీవనాడి దెబ్బతింటుంది అనీ, అందువలన కార్ ని కారు అని, బస్ ని బస్సు అని కొద్దిగా మార్చి అజంతా గుహల్లోకి విసిరేసి పలకాలని వచ్చిన విజ్ఞప్తులకి మనసు ఎంత చెమ్మగిల్లిందో, బుడతకీచులు అనే పదం చాలా మందికి తెలీదు అన్న విషయం తెలిసినప్పుడు అంతగానూ విస్తుపోయింది. (నిజమే?)

"మోటివేషన్"కు తెలుగు పదం ఏది అన్నప్పుడు "స్ఫూర్తి" అని వచ్చిన సమాధానం విని మనసు కిరణ్ ప్రభగారి ఇంట్లో మెట్ల మీదకు ఎక్కి ఆనందంతో గంతులు వేసింది.

మొత్తానికి సమయం చూసి తాను రాసిన, రాస్తున్న విశ్వనాథ మీద విమర్శ అనే తన బ్లాగు టపాలను ప్రస్తావించి అందరినీ విస్మయానికి, ఆనందానికి గురిచేసారు సి.బి.రావు గారు.

ఉన్న పదాలనే అసలు వాడకుండా, కొత్తవి చేరితేనో, తెలుగు మాట్టాడటమే నామోషీ అని అభిప్రాయ పడటం వల్లో ఉపయోగం ఏమిటి అన్న ఆచార్యుల వారి ప్రశ్నకు సమాధానం చెప్పలేక అందరి బుఱ్ఱలకు శొంఠి పట్టు వేసుకుని, ఆపైన అమృతాంజనం ముక్కులో దట్టంగా పట్టించి కూర్చోవటం జరిగింది.

ఆచార్యుల వారు నిజంగా ఆచార్యులు అని తెలిసిన తరువాతి పరిణామాలు - కొంతమందికి లేని పనులు ఉన్నట్టు ఉండి గుర్తుకురావటం జరిగి వేగంగా సమావేశం నుండి నిష్క్రమించడానికి కారణం అయ్యింది.

గబ్బిలాలు యాహూ గ్రూపును చాలా మంది "బాట్" గా మార్చమని అడుగుతున్నారని, అలాటి వాటికి లొంగేది లేదని వారికి తెగేసి చెప్పిన వసుంధరగారికి అందరూ శెహభాసు కొట్టారు.

ఇలాటి సమావేశాలు కనీసం ఆరునెలలకు ఒకసారి జరిగితే బాగుంటుంది అని రేగొడియాలు పెట్టే రాజారావుగారు అనటం అందరికీ ఎంతో సంతోషాన్నిచ్చింది.

కిరణ్ ప్రభగారికి కౌముది పత్రికను యూనీకోడులోకి తీసుకునిరావటానికి సి.బీ.రావు గారు తాన్సేన్ తీరులో పదే పదే సరిగమలు పాడుతూ హిందుస్తానీలో యమన్ రాగంలో అందరి నిద్రను వదలగొడుతూ ఒక చక్కని పాటను అందుకోగా, ఆ రాగాలాపనకు తట్టుకోలేని కిరణ్ ప్రభగారు మొత్తానికి ఒకటో రెండో యూనీకోడులోకెక్కించే ప్రయత్నం మొదలు పెడతాను అని హామీ ఇచ్చిన పిదప సి.బీ.రావుగారు తన పాటను ఆపి అందరికీ మనఃశ్శాంతిని కలిగించారు.

బాటా చెప్పులోకి కంకర రాయి దూరిన చందంగా, రాబోయే బాటా - తానా సమావేశాల్లో, కార్యక్రమాల్లో తనకు తెలిసినవారితో చెప్పి బ్లాగు అనే కంకరతో ఒక ప్రదర్శన ఇప్పిద్దాము అని కిరణ్ ప్రభగారు హామీ ఇవ్వటంతో నాలాటి వారు కొద్దిగా ఉపశమనం పొందారు.**

ఇలాటివి ఇంకా చాలా ఉన్నా మిగతా మంచి మంచి సంగతులు రావు గారు తన టపాలో ప్రస్తావించబోతారు కాబట్టి ఆయన టపా పొడుగును మించిన టపా కాకూడదని ఇంతటితో శెలవు తీసుకుంటున్నాను.

ఏదీ ఏమయినా సూపరు బవులు లో బంతిని తన్నాలి అనీ, ఆకాశవీధిలో వస్తున్న కుటుంబసభ్యుల్ని జాగ్రత్తగా దించుకోవటానికి వెళ్ళాలి అని తప్పించుకున్న వాళ్ళు తప్పించుకోగా - వచ్చిన వారితో మొదటి సమావేశం అందరికీ ఎంతో ఆనందం పంచటంతో, బ్రతుకుజీవుడా అని బలుసాకు తినటం కోసం ప్రయాణం మొదలుపెట్టాక కాశీమజిలీ కథ పేదరాసి పెద్దమ్మ చెప్పిన చందంగా అవ్వటంతో పిల్లలంతా కిరణ్ ప్రభ గారి సతీమణి శ్రీమతి కాంతి గారు వండిపెట్టిన కమ్మని కారపు సేమ్యాఉప్మా, ఆ పైన పప్పుబెల్లాలు లాటి తీపి పదార్థాలు తిని బ్రేవని తేనుస్తూ "శైలూ డాట్ కాం" నిర్వాహకులు శైలేష్ గారు తన నైపుణ్యం ప్రదర్శించి తీసిన చిత్రరాజాలతో ముగింపుకొచ్చింది. ఆ చిత్రరాజాలు రావుగారి వద్దే బందీ అయిపోవటంతో ఆయన ఆ జైలుపక్షులను వదిలేంతవరకూ ఎదురు చూడవలసినదిగా అభ్యర్ధన