Monday, November 10, 2008

గయ్యాళి అంటే ఎవరు ?
తెలుగువారి గుండెల్లో తీపి గుర్తుగా మిగిలిపోయిన అత్తగారు "శ్రీమతి పెద్దిభొట్ల సూర్యకాంతం" గారి గురించి కొద్దిగా తెలుసుకుందాం. 1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని కృష్ణరాయపురంలో జన్మించిన సూర్యాకాంతం గారు వారి తలిదండ్రులకి 14వ బిడ్డ. అయితే బాధాకరంగా అందరూ చనిపోగా ఒక అక్కయ్య, ఇద్దరు అన్నయ్యలు మాత్రమే మిగిలారట. చిన్నప్పుడే నాట్యం నేర్చుకోవటం వల్లా, సినిమాలంటే పిచ్చి ప్రేమ ఉండటంవల్ల,ఏనాటికయినా తాను కూడా సినిమాల్లో నటించాలి అని ఆవిడ కలలు కనేదిట. ఆవిడ కన్న కలలు ఆవిడను జెమినీవారు చంద్రలేఖ సినిమా నిర్మిస్తున్న సమయంలో మద్రాసుకు తీసుకెళ్లి, అదే సినిమాలో డాన్సర్ గా 65 రూపాయల నెల జీతంతో సినీప్రస్థానాన్ని ప్రారంభించి ఆ స్వప్నాన్ని సాకారం చేసాయి. అయితే 65 రూపాయలే ఇస్తారా అంటూ ఆవిడ జెమినీవారితో పోట్లాడటంతో ఆ జీతం 75 రూపాయలకు పెరిగింది. నిజమెంతో తెలియదు కానీ తరువాత జరిగిన చిన్న గొడవతో జెమినీతోనూ ఆ విధంగా చంద్రలేఖ చిత్రంతోనూ ఒప్పందం రద్దు అయ్యింది అని చెపుతారు.


మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుని తల్లి పాత్రలో ఆవిడ చెప్పిన పలుకులు ఈనాటికీ ప్రజల చెవుల్లో "సుపుత్రా సుపుత్రా నీకిది తగదంటిని కదరా" అంటూ వినపడుతూనే ఉంటాయి.


నాగిరెడ్డి - చక్రపాణి కలిసి ప్రత్యేకంగా సూర్యాకాంతంగారి పాత్ర చుట్టూ ఒక కథ అల్లి, "గుండమ్మ కథ"గా మలిచి దాన్ని సూపర్ డూపర్ హిట్టు చేయించారు అంటే , వాళ్లకు ఆవిడ మీద ఎంత నమ్మకం ఉందో తెలియచేస్తుంది.ఆ రోజుల్లో సూర్యాకాంతం లేని సినిమాలేదు అంటే అతిశయోక్తి ఏమీ లేదు. ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఆవిడ నటించిన ఏ సన్నివేశమయినా మొట్టమొదటి టేకులోనే ఓ.కే అయ్యేది. ఆవిడతో నటించేటప్పుడు మహామహులయిన ఎన్.టీ.ఆర్, ఎస్.వీ.ఆర్, ఏ.ఎన్.ఆర్ లు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవారట.

ఆవిడ తెరమీద గయ్యాళిగా పెట్టే కష్టాలకు చాలా మంది ఏకంగా శాపనార్థాలే పెట్టేవారు అని వినికిడి. ఇంకో గట్టి ఉదాహరణ ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆవిడ పేరు తమ పిల్లలకు పెట్టుకోవటానికి కూడా భయపడి, పెట్టుకునేవారు కాదు. నటనలో ఎంతో పరిపూర్ణత్వం ఉంటేనే కానీ ప్రజల హృదయాల్లో అంత ఇది లభించదు. ఆ విధంగా ఆవిడ ఆ కళామతల్లికి అతిప్రియమయిన ముద్దుబిడ్డ.

తెర మీద ఎంత గయ్యాళి పాత్ర పోషించినా, ఆవిడ చాలా మృదు స్వభావి, సౌమ్యశీలి. అవసరమయిన వారికి లేదనకుండా తనకు తోచిన సాయం చేసే గుణమున్న మనిషి. షూటింగుకు వచ్చినప్పుడల్లా ఒక పెద్ద క్యారియర్లో భోజనం తెచ్చి పదిమందికి పెట్టి వాళ్లు కడుపునిండా తింటే ఎంతో ఆనందపడేదిట. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఆవిడ ఒక వంటల పుస్తకం కూడా రాసారు.

ఐదు దశాబ్దాలు తెలుగు వారిని తన నటనతో అలరించి, ఏ పాత్రలోనయినా ఇట్టే ఒదిగిపోయి ఆ పాత్రకు పరిపూర్ణ న్యాయం చేకూర్చగలిగిన నటీమణి శ్రీమతి సూర్యాకాంతం గారికి శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం - "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

"లోకాస్సమస్తా సుఖినోభవంతు, బ్లాగే జనా సుఖినోభవంతు"

వంశీ

1 comment:

  1. ఆ రోజులే వేరు. సూర్యాకాంతం వెళ్ళిపోయిన తరువాత తెలుగు తెర చిన్నపోయింది.

    ReplyDelete