Friday, October 10, 2008

"కు లేదు కానీ అంతా లాసే బాబూ"

ఇప్పటి తరం వారిలో ఎంతమందికి వంగర అంటే చటుక్కున ఆయన జ్ఞాపకం వస్తారో తెలియదు కానీ, మాయాబజార్ చిత్రం చూసుంటే అందులోని పురోహితుడు శాస్త్రి పాత్ర వేసిన నటుడు అంటే మటుకు చప్పున ఆయన మొహం కళ్ళముందు కదలాడుతుంది. మాయాబజార్ చిత్రంలో అల్లు రామలింగయ్యతో కలిసి వంగర పంచిన హాస్యవల్లరి, చలనచిత్ర చరిత్రలో ఒక అరుదయిన ఆణిముత్యం.

ఆయన్ని ఎవరయినా - "ఏమండీ కులాసానా?" అని అడిగితే "కు లేదు కానీ అంతా లాసే బాబూ" అనేవారట. పోనీ అలా అడిగితే ఇలా అంటున్నారు అని "ఏమండీ పంతులు గారు - క్షేమమా?" అని అడిగితే - "ఆహా అంతా క్షామమే" అని చెప్పేవారట. ఆయన్ని దగ్గరి వారంతా వంగర అని కాకుండా "వ్యంగ్యర" అని పిలిచేవారట.

బాలయోగిని, మాలపిల్ల, రైతుబిడ్డ, ఘరానా దొంగ, పత్ని, పల్నాటియుద్ధం, మనదేశం, రక్షరేఖ, షావుకారు, మల్లీశ్వరి, ధర్మదేవత, పెద్దమనుషులు, కన్యాశుల్కం, తెనాలి రామకృష్ణ, పాండురంగ మహత్యం, మాయాబజార్, మాంగల్యబలం, దైవబలం, మహాకవి కాళిదాసు, శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యం, తిరుపతమ్మ కథ, నర్తనశాల, బభ్రువాహన - ఇలా ఎన్నో చిత్రాలలో నటించి, హాస్యం అనే అమృతాన్ని మనకు అందించి ఆ పైలోకాలకు తరలి వెళ్ళిపోయినా, ఈ చలనచిత్ర జగత్తు, తెలుగు ప్రజలు ఆ అమృతాన్ని జీవితాంతం సేవిస్తూనే ఉంటారు.


హాస్యం అనే ఒక చక్కని బొమ్మని హావభావాలు అనే ఉలితో చెక్కిన హాస్యశిల్పి, ఎలాంటి పాత్రలోనయినా అవలీలగా ఒదిగిపోయే నటుడు శ్రీ వంగర వెంకట సుబ్బయ్యగారికి శతకోటి నీరాజనాలు అర్పిస్తూ, ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం - "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/


లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

PS: అనివార్య కారణాల వల్ల ఈ వారం వంగర వెంకట సుబ్బయ్యగారి మీద రూపొందిన కార్యక్రమం ప్రసారం చేయలేకపోయినందుకు చింతిస్తున్నాను.వచ్చేవారం మళ్లీ ఇదే సమయానికి..

7 comments:

 1. ఓహో ఇది అక్కడిదా! పడమటి సంధ్యారాగం సినిమాలో చూసి ఆ రచయితదేమో అనుకున్నాను. రేడియో ప్రత్యక్షంగా కాకపోయినా ఆర్కైవుల్లో వింటున్న్నాను. మంచి సమాచారం ఇస్తున్నారు. చాలా బాగుంటున్నాయి.

  ReplyDelete
 2. నాకు చాలా ఇష్టమయిన హాస్యనటుడు. వారిపై కార్యక్రమం రూపొందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.

  ReplyDelete
 3. సదరు వ్యంగ్యరగారిని ఒకసారి ఒక మిత్రుడు "స్టూడియో కి వెళ్లి వచ్చావ్ కదా.. ఏదైనా వేషం ఇచ్చారా?" అంటే "ఏమిస్తార్లే బయటే ఏవియ్యం (AVM) అని బోర్డు పెడితే" అన్నార్ట.

  చాలా సంతోషం. హాస్యానికి ఆద్యులైన వంగర వంటి కళాకారులు చిరస్మరణీయులు.

  ReplyDelete
 4. ఒక అధ్భుతమైన,విశిష్టవ్యక్తి వంగర.అంతకు మించి విలక్షణమైన నటుడు.మీరు వంగర నటించిన చిత్రాలలో ఆణిముత్యమనదగ్గ మరో చిత్రాన్ని కూడా ఇవ్వాల్సింది.అది దొంగరాముడు,ఆ పల్లెటూరి బళ్ళొ పంతులుగానే కాక,గ్రామవైద్యుడిగా కూడా నటించిన వంగర వైదుష్యాన్ని అతి తక్కువ సన్నివేశాల్లో ఎంతో చక్కగా ప్రదర్శించారు.నీ మొహంమండా అనేది ఆయన ఊతపదం.అలాగే దొంగరాముడు చెల్లెలును వసతిగృహం లో చేర్పించేటప్పుడు ఊరి పేరు అడిగినప్పుడు,ఈయన ఇచ్చే సమాధానం జంభుకరంధ్రపురం.అదేమిటి,ఎక్కడుందీ అన్నప్రశ్నకు అదేనండి నక్కబొక్కలపాడు అంటారు,మీ పేరు అంటే ప్రతివాది భయంకరాచారి అంటారు.
  ఇలాంటి అనర్ఘరత్నాలను పరిచయం చేస్తున్న మాగంటి కుటుంబానికి నా అభినందనలు.
  వీలైతే పెరుమాళ్ళు అని ఒక సింప్లీసుపర్బ్ నటుడుండేవారు,ఆయన్ని గూర్చి కూడా కాస్త ప్రయత్నించగలరు :)

  ReplyDelete
 5. @ రానారె - అవును ఇప్పటిదంతా అప్పటిదే, అక్కడిదే

  @వికటకవి - నాకు కూడా ఆయనంటే చాలా ఇష్టం

  @సత్యప్రసాద్ గారు - ఆ మిత్రుడు మరెవరో కాదు - రావికొండలరావు గారు. ఆ మాటకు అసలు "కాంటెక్స్ట్" చాలా ఉన్నది..ప్రోగ్రాము వినండి..:)

  @రాజేంద్రా - అందరూ ఎంటీవోడీ మీద, ఏ.ఎన్నారు మీదే పడి సన్మానాలు చేస్తే కళాపోసన ఎట్టవుద్ది? వీళ్లూ - నిజమయిన "అనర్ఘ రత్నాలు". మీరు చెప్పిన పెరుమాళ్లే కాదు - నల్ల రామ్మూర్తి, చదలవాడ కుటుంబరావు, సత్యం, ఇంకా ఎన్నో రత్నాలు ఏరుకోవచ్చు ముందు ముందు...

  ReplyDelete
 6. అమ్మయ్య ఆమాట అన్నారు నాకు బోలెడానందం.

  ReplyDelete
 7. నాకు ఏంటో ఇష్టమైన హాస్య నటుడు .. చిడతల అప్పారావు. వారి ఫై కూడా ఒక టపా.

  ReplyDelete