Sunday, September 28, 2008

"దేశభాషలందు తెలుగు లెస్స" అని కృష్ణదేవరాయల కంటె ముందరే వల్లభరాయలవారు శలవిచ్చారు...

1430 ప్రాంతంలోని సాహితీవేత్త వినుకొండ వల్లభరాయడు రాసిన క్రీడాభిరామం - ఆనాటి ఓరుగల్లు వీథులలో వెల్లి విరిసిన ఆంధ్ర సాంఘిక జీవన చలన చిత్రం. ఈ అద్భుతమయిన కావ్యంలో "దేశభాషలందు తెలుగు లెస్స" అని కృష్ణదేవరాయల కంటె ముందరే వల్లభరాయలవారు శలవిచ్చారు. ఇద్దరూ "రాయలే" అయినా ఒకాయన నిఝ్ఝంగా రాజుగారు అవ్వటంవల్ల, రాజు గారి మాట ప్రపంచానికి బాట అయ్యిందన్నమాట...

ఆ.వె - జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?


కానీ రాయలవారు కూడా "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పారు కాబట్టి దానికి అంత విఖ్యాతి వచ్చింది అనుకోవాలి ... :)..

కాకపోతే క్రీడాభిరామం శ్రీనాథుడు వ్రాసి వుండవచ్చు అని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు విభేదిస్తున్నారట.

Friday, September 26, 2008

ఘంటసాల మాష్టారు "ఒయ్యాల" అని పాడారా, "ఉయ్యాల" అని పాడారా?

నిన్న మాష్టార్ వేణు గారి రేడియో ప్రోగ్రాము కోసం పని చేసుకుంటున్నప్పుడు ఒక సందేహం వచ్చింది.

ఘంటసాల మాష్టారు మాంగల్యబలం చిత్రంలోని "ఆకాశవీధిలో అందాల జాబిలి" పాటలో 2.14 ని. వద్ద "ఒయ్యాల" అని పాడారా, "ఉయ్యాల" అని పాడారా? సుశీలమ్మ ఉయ్యాల అనే పాడారు. అది తెలిసిపోతోంది. మాష్టారుదే, ఎన్ని సార్లు విన్నా "ఒయ్యాల" వైపే ఒరుగుతోంది. మళ్లీ 3.18 ని. వద్ద "ఉయ్యాల" అనే వినపడుతోంది..:)...

ఈ పాట వినాలి అంటే www.oldtelugusongs.com కు వెళ్ళి అక్కడ "సెర్చ్" లో మాష్టర్ వేణు గారిని "సెలక్ట్" చేసుకుని వినండి.

ఏదయితేనేం డిగ్రీయే నా ఇంటి పేరులాగా అయిపోయి ......

తెలుగు చలనచిత్ర జగత్తులో జానపద సంగీతపు పోకడలకు పెద్ద పీట వేసి, నవ్యరీతులు చొప్పించి ఒక సముచితమయిన స్థానం కలిపించిన సంగీతస్వర సమ్రాట్టు మాష్టర్ వేణు గారికి నీరాజనాలు అర్పిస్తూ, ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆ పాత మధురాలు" విని ఆనందించండి ..

ఆయన్ను అందరూ మాష్టర్ వేణు అని ఎందుకు పిలిచేవారో ఆయన మాటల్లోనే - “నన్ను అందరూ మాష్టార్ వేణు అని పిలవడానికి రెండు కారణాలు – ఒకటి నేను బొంబాయిలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో హార్మోనియంతో ఫాటు, ఇతర వాయిద్యాలు నేర్చుకుని పుచ్చుకున్న పట్టా, ఈ పట్టా సంగతి తెలిసిన వాళ్ళు నన్ను మాష్టర్ అని పిలిచేవాళ్ళు. ఇంకొందరేమో - చిన్నపిల్ల వేషాలు వేసేవాళ్ళని మాష్టర్ అనడం అలవాటుకదా, నేను కూడా అలా చిన్నతనంలో వేషాలు వేసానేమో అని అనుకుని మాష్టార్ అని పిలిచేవాళ్ళు. ఏదయితేనేం డిగ్రీయే నా ఇంటి పేరులాగా అయిపోయి నన్ను మాష్టర్ వేణుని చేసింది” అని నిర్మలంగా నవ్వుతూ చెప్పేవారట.

వాడినపూలే వికసించెలే, కనులు కనులు కలిసెను, సడిసేయకో గాలి , ఆకాశ వీధిలో అందాల జాబిలి, ఏరువాకా సాగారో చిన్నన్న , ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే, ఈ పగలు రేయిగా పండువెన్నెలగ, కనులకు దోచి......ఇలా ఒకటా రెండా ...తన అద్భుతమయిన సంగీత ప్రతిభకు కొలబద్దగా అమూల్యమయిన ఎన్నో స్వరకుసుమాలను మనకు వదిలిపెట్టిన ఆ మాష్టారు పాదాలకు వేనవేల నమస్కారాలు అర్పిస్తూ .......

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Thursday, September 25, 2008

ముసలమ్మ కాలుజారిన పక్షమున ఎన్ని పిల్లిమంత్రములు వేసిన నీళ్లలో పడును?

చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు పరీక్షాపత్రాల పద్ధతిని తన ప్రహసనాల్లో గొప్పగా వివరించారు. మచ్చుకు ఒక రెండు

ఆకాశ విశ్వవిద్యాలయం : ఇంద్రవారము, 37వ డిశంబరు 19673 సంవత్సరము. కాలము అసుర సంధ్యవేళ గం 7-5ని మొదలు 7-6ని వఱకు

విషయం - గణితము:

1. చెన్నపట్టణమున గొల్లవాడొకడు ఇంటింటికి ఆవును దూడను తీసుకుని వచ్చి పిదకదలచి పాలు చేపుదల నిమిత్తము ప్రతి ఇంటి వద్ద దూడను ఒకసారి తల్లితో కలిపి వెంటనే యీవల కీడ్చుచు వచ్చును. అతడా విధముగా ప్రతిదినము 12 ఇళ్ళకూ పాలిచ్చుచూ వచ్చును. (ఎ) ఒక్కొక్క ఇంటివద్ద నొక్క చుక్క పాలు దూడ త్రాగిన పక్షమున వారమున కెన్ని చుక్కల పాలు దూడ త్రాగును? (బి) నూరు చుక్కలు ఒక గిద్దెడుగా లెక్క చూచుకున్న పక్షమున దూడ కడుపులో సోలెడు పాలు పడునప్పటి కెంతకాలము పట్టుతుంది?

2. రాజమహేంద్రవరములో గోదావరి ఒడ్డున వేసిన గట్టుమీద మెట్లమీదుగా గోదావరిలోకి డెబ్బది సంవత్సరముల ముసలమ్మ దిగితే కాలుజారిన పక్షమున ఎన్ని పిల్లిమంత్రములు వేసిన నీళ్లలో పడును?

ఇలా బోలెడు ఉన్నాయి ఆ ప్రహసనాల్లో ....

Tuesday, September 23, 2008

శంకరంబాడి సుందరాచారి "బొట్టు" !

"మా తెలుగు తల్లికి మల్లెపూదండ" అనే గొప్ప గీతం రాసిన శంకరంబాడి సుందరాచారి 1936 - డిసెంబరు నాటి ' వీణ ' పత్రికలో జానపదుల శైలిలో రాసిన "బొట్టు" గేయం ఇది

పరిగెత్తి నన్నంటి పట్టుకోరమ్మంటె
ఏమేమొ సేస్తావె నా మావాఁ!
ఇటుసూడు నా వొంక నా మావాఁ!
రంగిసెక్కిళ్ళంటి- రాలిపోతున్నాయి
ముద్దుసెమ్మటబొట్లు-ముత్తాలసరవంటు
అందుకొంటున్నావె-నా మావాఁ!
అందులోనేవుంది- నా మావాఁ!

Sunday, September 21, 2008

"ఆడబ్లాగుల్లో సోదే ఉంటుందా?" చూసి చటుక్కున ఇది గుర్తుకువచ్చింది

ఆడబ్లాగుల్లో సోదే ఉంటుందా అని సిరిసిరిమువ్వగారు వ్రాసిన టపా చూసి చటుక్కున "ఇంతింతై వధువింతై..." పద్యం గుర్తుకువచ్చింది.. :)

http://www.maganti.org/migadatarakaluindex.html

ఈ వెబ్ పేజీలో "ఇంతింతై వధువింతై..." లంకె నొక్కండి.. :)

వంశీ

Saturday, September 20, 2008

సంగీత దర్శకుడు మాష్టర్ వేణు గారి ఇంటి పేరు ఎవరికయినా తెలుసా?

సంగీత దర్శకుడు మాష్టర్ వేణు గారి ఇంటి పేరు ఎవరికయినా తెలుసా? ఆయన, నటుడు భానుచందర్ గారి తండ్రి కూడా!.. :)

Wednesday, September 17, 2008

ఆయన శూలం తిప్పితే ఈయన వాలం తిప్పాడట...

ఆతుకూరి మొల్ల కృష్ణదేవరాయలను సందర్శించినప్పుడు చెప్పిన పద్యం ఇది

అతడు గోపాలకుండితడు భూపాలకుం
డెలమినాతని కన్ననితడు ఘనుడు
అతడు పాండవపక్షుడితడు పండితరక్షు
డెలమినాతని కన్ననితడు ఘనుడు
అతడు యాదవపోషి ఇతడు యాచకతోషి
యెలమినాతని కన్ననితడు ఘనుడు
అతడు కంసధ్వంసి ఇతడు కష్టధ్వంసి
యెలమినాతని కన్ననితడు ఘనుడు

పల్లెకాతండు పట్టణ ప్రభువితండు
స్త్రీలకాతండు పద్మినీ స్త్రీలకితడు
సురలకాతండు తలప భూసురులకితడు
కృష్ణుడాతండు శ్రీమహాకృష్ణుడితడు


ఇది విన్నాక తెనాలి రామకృష్ణయ్య ఊరకుంటాడా? కృష్ణదేవరాయలు మానవమాత్రుడే తప్ప ఆ దేవదేవుడు కృష్ణుడితో సమానం కాదని, మొల్లని అధిక్షేపిస్తూ ఇలా చెప్పాడట


అతడంబకు మగండితడమ్మకు మగండు
నెలమినాతనికన్న నితడు ఘనుడు
అతడు శూలముద్రిప్పు నితడు వాలము ద్రిప్పు
నెలమినాతనికన్న నితడు ఘనుడు
అతడమ్మున నేయు నితడు కొమ్మునడాయు
నెలమినాతనికన్న నితడు ఘనుడు
అతని కంటను చిచ్చు నితని కంటను బొచ్చు
నెలమినాతనికన్న నితడు ఘనుడు

దాతయాతండు గోనెల మోత యితడు
దక్షుడాతండు ప్రజల సంరక్షకుడితడు
దేవుడాతండు కుడితికి దేవుడితడు
పశుపతి యతండు శ్రీమహాపశువితండు


మొల్ల అలా అనడం అతిశయోక్తే తప్ప, అందులో ఔచిత్యం లేదని వికటకవీంద్రుల వారు తెలియచేసారు. శివుడికీ, ఎద్దుకీ సారూప్యాలు తెచ్చి ఎద్దును శివుడికన్నా అధికంగా నిరూపించడం రామకృష్ణయ్యకే సాధ్యం.. :)

Tuesday, September 16, 2008

జాగ్రత్తగా విని "ఐస్ ఎన్ షవర్" అని, "అబ్బలం" అని ఎక్కడ వినపడిందో చెప్పినవారు విజేతలు!

42 మంది అమెరికా అధ్యక్షుల పేర్లు చెప్పిన రెండున్నరేళ్ళ వైష్ణవి.ఇక్కడ వినొచ్చు.

http://maganti.org/audiofiles/vaishnavi/42USPresidents.mp3


జాగ్రత్తగా విని "ఐస్ ఎన్ షవర్" అని," అబ్బలం" అని ఎక్కడ వినపడిందో చెప్పినవారు విజేతలు, కిరీటధారులు. :)..

వంశీ

విహారి వేసిన, చేసిన బ్లాగోళ జంభ వీడియో - ఊ..ట్యూబులో?

http://www.youtube.com/watch?v=3K2uPCnhMuI&feature=related


విహారి వేసిన, చేసిన బ్లాగోళ జంభ వీడియో - ఊ..ట్యూబులో

ఏదో వెతకటానికి వెళ్తే ఏదో తగిలింది .. :)

అందరూ ఇదివరకే చూసేసి ఉంటే మళ్ళీ చూడండి....


గది అయినాంక దూస్రా పార్ట్ ఈడ సూడండి...

http://www.youtube.com/watch?v=cmTHBERB0wg


వంశీ

Monday, September 15, 2008

నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్!

1660 ప్రాంతంలో నెల్లూరు జిల్లా తెట్టు గ్రామ వాస్తవ్యులయిన మోచర్ల వెంకన్న, మోచర్ల దత్తప్ప కవులు తిరుపతి వేంకట కవులకు పూర్వరూపాలుగా కనిపిస్తారు అని తెలియవస్తోంది. వివిధ రాజుల ఆస్థానాలు సందర్శించి అక్కడి విద్వత్కవులను ఓడించి, ఘనసమ్మానాలందుకున్న ఘనులట.
ఉదాహరణకి వీరి సమస్యా పూరణ ఒకటి చూడండి

సమస్య: నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

చం: అనిలజ! జాంబవంత! కమలాప్త తనూభవ ! వాయుపుత్ర ! ఓ
పనస! సుషేణ ! నీల ! నల ! భానుకులుం డగు రాఘవేంద్రు డ
ద్దనుజ పురంబు నే గెలువ, దైత్యుల జంపగ వేగ రమ్మనెన్
నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్


అలాగే మొదట ష కారం, చివర క్ష కారం వచ్చేట్టు పూరించమని అడిగితే చెప్పిన పద్యం

షాక్షర మాదిగ చెప్పెద - నీ క్షణమున కందపద్య నివహము వరుసన్
వీక్షింపర దయతో నిటు - రాక్షస హర ! రామ ! మోక్ష రామాధ్యక్షా!


Source: Dr.Dwa.Na.SAstry

Sunday, September 14, 2008

"జిల్లెడు మోమువాడు, చెప్పెను వీడు నాకు"
మళ్లీ నా పాత పుస్తకంలో నుంచి ఒక చిన్న మెఱుపు. పోతనామాత్యులవారు రాసిన ఈ రాముడి పద్యం కృష్ణుడి మీద రాసిన పద్యానికన్నా ముందుదే అయినా, "కృష్ణుడి"కి వచ్చిన "ఇది" "రాముడి"కి రాలేదు అని మా టీచరు చెప్పేవారు. కొసమెఱుపు ఏమిటి అంటే రాయప్రోలు వారు కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాసిన పద్యం ఈ చేతిరాత పుటలో ఉంది.మెఱుపుల సంగతి వదిలేసి ప్రకృతి వైపరీత్యాల్లాంటివి చూడాలి అంటే - భాషలో తూఫానులు లాంటివి అన్నమాట - స్కూల్లో నా బెంచీ మిత్రుడు శ్రీనివాసుకు సాటి అప్పట్లో నాకు ఎవరూ కనపడేవారు కాదు. ఎవడయినా వాడికి నచ్చనిదేదన్నా చెపితే ఆ కృష్ణుడి మీద పద్యంలోని మూడో వరసలోనించి "జిల్లెడు మోమువాడు, చెప్పెను వీడు నాకు" అని ఎత్తుకునేవాడు.అలాగే వాళ్ల నాన్నగారి దగ్గరినుంచి నేర్చుకున్న ఈ పద్యం వాడి నోట్లో ఎప్పుడూ ఆడుతూ ఉండేది.


"కరాగ్రే వసతే లక్ష్మీ

కర మధ్యే సరస్వతీ

కర మూలేతు గోవిందః

ప్రభాతే కర దర్శనం"

అన్నది మామూలుగా మామూలు జనాలకు తెలిసిన పద్యం అయితే,వాడు దానిని ఇలా చెప్పేవాడు


"ఖరాగ్రే వసతే లక్ష్మీ

ఖర మధ్యే సరస్వతీ

ఖర మూలేతు గోవిందః

ప్రభాతే ఖర దర్శనం"


ఒకరోజు ఇలానే మా టీచరు ముందు వాగి చచ్చేట్టు తన్నులు తిన్నాడనుకోండి - అది వేరే సంగతి...

Friday, September 12, 2008

చాలా మంది ఆయన పేరునిబట్టి తమిళ దేశస్థుడు అనుకుంటారు!

తొలి రోజుల్లో సినిమా పాటలకు “catchiness” సమకూర్చిన ప్రతిభ నిస్సందేహంగా C.R.సుబ్బురామన్‌దే. ఆయన దరువుల్లోనూ, స్వర ప్రస్తారంలోనూ “సాహసం” కనబడుతుంది.సంగీతం విషయంలో సుబ్బురామన్ ప్రతిభ అపూర్వం, అసామాన్యం. అకాల మరణం చెందకుండాఉంటే ఎస్‌.రాజేశ్వరరావు వంటి గొప్ప సంగీత దర్శకులకు ఆయన గట్టిపోటీగా నిలిచేవారనడంలో సందేహంలేదు. చాలా మంది ఆయన పేరునిబట్టి తమిళ దేశస్థుడు అనుకుంటారు. కానీ ఆయన తెలుగువాడే. వారి పూర్వీకులు తెలుగుదేశం నుండి తమిళదేశానికి వలస వెళ్ళారు. సుబ్బురామన్ శకం పూర్తయి యాభై సంవత్సరాలు దాటినా ఆయన సదా స్మరణీయుడే.

C.R.సుబ్బురామన్ కు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ, ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Monday, September 8, 2008

ఇక ప్రశ్నలోకి వస్తే!
ఎప్పుడో సుమారు ఇరవై రెండేళ్ళ క్రితం మా తెలుగు టీచరు శ్రీమతి కరుణమ్మగారి క్లాసులో నేను రాసుకున్న నోట్సు, నిన్న ఆదివారం పాత పుస్తకాలు సద్దుతుంటే కనపడింది. ఒక్కసారిగా అలా కూర్చుండిపోయాను. ఎందుకా? అది నాకే తెలుసు. అది ప్రస్తుత విషయానికి, ఈ టపాకీ సంబంధించినది కాదనుకోండి.


ఇక ప్రశ్నలోకి వస్తే శ్రీనాథుడు వ్రాసిన వీరరసాతిరేక పద్యంలోని 1, 3 లైన్లు - భట్టుమూర్తి రాసిన అబ్జముఖీలో 1, 2 లైన్లు ఒకేలాగున ముగియటం యాదృచ్ఛికమా ? లేక పాషాణ పద్యాలు ఇలాగే ఉండాలా ? అలాగే ఉండేటట్టు అయితే మిగతా మూడిటి ప్రాస, యతి అలానే కలుస్తాయా అని సందేహం?. అసలు ఈ పాషాణ పద్యాల గురించి ఎవరికయినా తెలిస్తే కొద్దిగా వివరించగలరు

Saturday, September 6, 2008

ఇద్దరు ప్రముఖ కవుల "పద్యభిక్ష"

పద్యభిక్ష

1940 లో కరవు వచ్చినప్పుడు కాగడా పత్రిక (తాపీ ధర్మారావు సంపాదకులు) "పద్యభిక్ష" పెట్టమని ప్రకటన ఇచ్చింది. అక్టోబరు సంచికలో ఇద్దరు ప్రముఖ కవుల "పద్యభిక్ష" గమనించండి:

"ప్రళయ భైరవ భయద నర్తనముసేయు
క్షుభిత కంకాళమాలా విశుష్కఘోష
క్షామదేవత శతకోటి చరణ ఘాత
ములదరిద్రోదర క్షుదాగ్నులను నేడు"

- అడవి బాపిరాజు


"కట్టుబట్టలేక, కడుపుకన్నములేక
నిలువ నీడలేక నీరులేక
మనువులేక మరల మరణించగాలేక
బ్రతుకువాని బ్రదుకు బ్రతుకు అగునె?"

- భాగవతుల శంకర శాస్త్రి (ఆరుద్ర)

ఏలమిత్రుడా, పరితాపమింతనీకు?

చింతా దీక్షితులు పద్యం

చంచలంబయి నిలువని సౌఖ్యములకు
ఏలమిత్రుడా, పరితాపమింతనీకు?
ప్రకృతి దుస్సాధ్యములు కొన్ని వాంఛితములు
కొన్ని యననేల, అన్నియు గ్రుంకుదుదకు."

మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

Friday, September 5, 2008

భానుమతి రామకృష్ణ - రెండో భాగం

తెలుగు చలనచిత్రజగత్తులో ఇంతటి ప్రతిభావంతురాలు, బహుముఖప్రజ్ఞాశాలి మళ్ళీ పుట్టబోదు అంటే అతిశయోక్తి ఏమీ కాదు.ఆవిడకు ఉన్న ప్రతిభాపాటవాలలో ఒక్కొక్కదానికి ఒక్కో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వవచ్చు.


ఆవిడకు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" రెండో భాగం విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/


లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

సూటిగా చెప్పకుండా ఊహతో సాధించుకోవలసి వచ్చేటట్టు ....

అయ్యలరాజు రామభద్రుడు, కృష్ణరాయల కీర్తిని వర్ణిస్తూ "సకల కథా సార సంగ్రహంలో" ఇలా అంటున్నారు

సీ. చినుకు పూసల నొనర్చిన చిత్తరపు దండ
దండాలు గల వేల్పు తపసి కొండ
కొండాటములకు చిక్కుల బెట్టు జడదారి
దారి తప్పక గట్టు జీరు టలుగు
అలుగు టింతికి వెన్ను డిలకు తెచ్చిన చెట్టు
చెట్టు గట్టగ జేయు చెలువతోడు
తోడాసపడు క్రీడి దొర పెద్ద తోబుట్టు
పుట్టు లిబ్బుల రేని పొందుకాడు

గీ.కాడు కనపపుల్ గాచిన గండు తల్లి
తల్లి బిడ్డల పెండ్లాడు గొల్ల మనికి
మనికితముతీర్చువిలుకానిజనకు విందు
విందు నీ కీర్తి నరసింహవిభుని కృష్ణ!


ఈ పద్యంలో రాయల కీర్తిని ముత్యాల పేరుతోను, శివుడి (దండ + ఆలు గల వేల్పు) కొండ అయిన కైలాసంతోను, నారదుడు, వజ్రాయుధం, పారిజాతం, చంద్రుడు, బలరాముడు, కుబేరుని (పుట్టు లిబ్బుల రేని) నేస్తం అయిన శివుడు, కుమారస్వామి (శ్మశానంలో రెల్లుగడ్డిలో పుట్టినవాడు), పాలసముద్రం (తల్లి బిడ్డలను - భూదేవిని, సీతను పెండ్లాడిన వెన్నుని నెలవు), అమృతం (మన్మథుని తండ్రి అయిన విష్ణువు విందు) అనే వాటితో పోలుస్తాడు కవి. ఉపమానాలను సూటిగా చెప్పకుండా ఊహతో సాధించుకోవలసి వచ్చేటట్టు చెప్పడం ఈ పద్యంలో చమత్కారం

శ్రీ గురుజాడ శ్రీరామమూర్తి పంతులు గారు వ్రాసిన "కవిజీవితములు" పుస్తకములోనిది

Thursday, September 4, 2008

పూవులమ్ము బందరుచే గట్టెలమ్మజేసి!!!

వీడ్కోలు పద్యం

చెళ్ళపిళ్ళ వారు హిందూ హైస్కూల్ ఉపాధ్యాయులుగా విరమణ చేసి బందరు నుంచి కడియం వెళ్తున్న సందర్భంలో 19-8-1916న వీడ్కోలు సభలో చదివిన పద్యం ఇది - (కడియం పూల తోటలకి ప్రసిద్ధి)

"నిను గన్నట్టి వీటికి కన్ను గుట్ట
లలి ద్రయోదశ వర్షముల్ నిలిపి పూవు
లమ్ము బందరుచే గట్టెలమ్మజేసి
గడియమేగెదె? వేంకటకవికులేంద్ర!"

మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

నాలుగు తన్నులు తన్నాడూ - అయిందమ్మా అయింది!

ముణిమాణిక్యం గారి హాస్య పద్యమొకటి

అయిందమ్మా అయిందీ
బావకు పెండ్లీ అయిందీ
మేళంతాళం లేకుండా
దమ్మిడికర్చూ లేకుండా
పెద్ద పెళ్ళి అయింది
నాన్నక్కోపం వచ్చిందీ
నాలుగు తన్నులు తన్నాడూ
అయిందమ్మా అయింది
బావకు పెండ్లి అయిందీ


ఈ పై పద్యం నా దగ్గర ఉన్న ఏదో చిన్న పేపర్ కటింగులో ఉంది (ఏ పత్రికో కూడా తెలీదు)

ధర్మవరం వారికి కోపం వచ్చింది!

ధర్మవరం వారికి కోపం వచ్చింది!

నాటక రంగానికి ధర్మవరం రామకృష్ణమాచార్యులవారు చేసిన సేవ అసామాన్యమయినది. ఆయన రాసిన "చిత్రనళీయం' నాటకం కూడా బాగా ప్రసిద్ధికెక్కింది. అయితే ఎవరో ఈ నాటకాన్ని 'అతుకులబొంత ' అని విమర్శించారట. ధర్మవరం వారికి కోపం వచ్చింది. ఇలా పద్యాస్త్రం వదిలారు -

"కొంచెపు పెంటలేరి తినుకుక్కుటముల్ నిను కందిగింజగా
దంచు త్యజించునంతనె యహా! యపకీర్తియె నీకు రత్నమా!
కాంచన పీఠి నిన్నునిడి కాంతి కిరీటములందు నిల్పి య
భ్యంచితరీతి మస్తకములందు ధరింపరె రాజశేఖరుల్!"

Wednesday, September 3, 2008

కుడిసి కుకుండ నిస్తర?

కుడిసి కుకుండ నిస్తర?

కర్నూలులో మద్దులపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ప్రధానాంధ్ర పండితులుగా పనిచేశారు. పద్యరచనలో దిట్ట. ఇంతటి పండితులు వినోద కవితలు రాయటం ఒక విశేషంకాగా - వాడుక భాషలో (గ్రామ్యభాషలో?) మన ఎన్నికల అభ్యర్థుల గురించి చురకలు వేస్తూ మంచి పద్యం రాయటం మరో విశేషం. ఆ పద్యం ఇదే -

"యిడవరు, యింటిసుట్టు వలవేత్తరు, సూత్తరు, వంకదణ్ణముల్
పెడతరు, మేలు సేస్తమని పెగ్గెలు బల్కుత రాపనైన వెం
బడి తిరిగైన సూడరిసుమంటి పెబుద్ధులు రాజ్జెమేలితే
కుడిసి కుకుండ నిస్తర? మొగుండ్లయి సూస్తనె గొంతు గోయరా?"మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

నేను శ్మశానవాటిక నిర్మించాను. మీలాంటి యోగ్యులు దానిని వినియోగించుకోవచ్చు

చెళ్ళపిళ్ళ X శ్రీపాద

ఒకసారి చెళ్ళపిళ్ళవారు రైలు ప్రయాణం చేస్తుంటే రైలులో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి పెదతల్లి కుమారుడు తారసపడ్డాడు. ఆయన పేరు సూర్యనారాయణ. ఎక్కడిదాకా వెడుతున్నావు అంటే, ఆయన "పొలమూరు" అని చెప్పారట. పొలమూరు శ్రీపాద వారి వూరు. వెంటనే చెళ్ళపిళ్ళ, సూర్యనారాయణతో వెటకారంగా, "శ్రీపాదవారి శ్మశానవాటిక చూశానని శ్రీపాదవారికి చెప్పండి" అన్నారట. శ్మశానవాటిక శ్రీపాదవారి నవల పేరు. సూర్యనారాయణ శ్రీపాదవారితో యథాతథంగా అప్పగించి చెప్పారు. తిరుగుప్రయాణం కడియం మీదుగానే కాబట్టి "నేను శ్మశానవాటిక నిర్మించాను. మీలాంటి యోగ్యులు దానిని వినియోగించుకోవచ్చు" అని చెళ్ళపిళ్ళవారికి చెప్పి వెళ్ళమని శ్రీపాదవారు అనటం, ఆ సూర్యనారాయణ కడియం వెళ్ళి అంతపని చెయ్యటం జరిగింది

(ఆంధ్రజ్యోతి - హాస్యజ్యోతి - నుండి)

రెండు పఠాపిఠా కఠోరకుఠరాలు

శ్రీశ్రీ పద్యాలనే వాడుడు

పఠాభి, నారాయణబాబు మొదలయిన వాళ్ళతో కవిత్వంలో ఒక నూతనాధ్యాయం ప్రారంభమయిందని భావించి జరుక్ శాస్త్రి "ఆశ్వాసాంతం" అనే కవిత రాశాడు. అయితే రుక్మిణీనాథ శాస్త్రి చెప్పిన కొత్తవాళ్ళందరూ తన అనుయాయులే - అని ధ్వనిస్తూ "శ్రీశ్రీ పద్యాలనే వాడుడు" అనే గీతం ఉత్తరోత్తరా శ్రీశ్రీ రాశాడని ఆరుద్ర చెప్తూ దీనికి వివరణ కూడా ఇచ్చారు

రెండు ట్వింకిల్ ట్టింకిల్
లిటల్ థియేటర్ స్టార్లు
రెండు ఆరుద్రాభిషేకాలు
రెండు రిక్షాపై మౌనశంఖాలు
రెండు విబ్జియార్భాటాలు
రెండు హనుమత్ శాస్త్రాలు
రెండు నమస్కరించదగ్గ
విశ్వనారాయణాస్త్రాలు
రెండు నామరహితఫిడేలు రాగారాబాలు
రెండు పఠాపిఠా కఠోరకుఠరాలు
రెండు గోరావీణావినాయకారాగాలు

ఇందులో శ్రీశ్రీ చమత్కారంతో పాటు అతని మనోభావాలు తెలుస్తాయి. ఎవరంటే ఇష్టమో తెలుస్తుంది లేదా ఎవరి ప్రభావం వుందో గమనిస్తాం. లిటిల్ థియేటర్ నడిపింది అబ్బూరి వరదరాజేశ్వర రావు. రెండు ఆరుద్రాభిషేకాలు - ఆరుద్ర. "మౌనశంఖం" కవితా సంపుటి శ్రీరంగం నారాయణబాబు. "విబ్జియార్" కవితా సంపుటిని రాసింది బి.వి.సింగరాచార్య. హనుమత్ శాస్త్రాలు ఇంద్రగంటి వారిని ఉద్దేశించింది. విశ్వనాథవారు నమస్కరించదగినవారు. ఆ తర్వాత పఠాభి , తర్వాత పిఠాపురం యువరాజా కవి. "వినాయకుడివీణ శీర్షిక" ద్వారా సంచలనం కలిగించిన గోరాశాస్త్రి. వీళ్ళంతా శ్రీశ్రీ హృదయంలో మెదిలేవాళ్ళని భావం!

మామయ్య ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

ఎన్నో విషయాలలో వారికీ నాకూ చుక్కెదురు!

విశ్వనాథను పొగిడిన శ్రీశ్రీ

"నేను చిన్నతనంలో కలం పట్టిన కొత్తరోజుల్లో నన్ను బాగా ఆకర్షించిన ఇద్దరు కవులలో విశ్వనాథవారొకరు. నేనంటే సత్యనారాయణగారికి వాత్సల్యం. వారంటే నాకు గౌరవ భావం. ఎన్నో విషయాలలో వారికీ నాకూ చుక్కెదురు. అయినా భారతీయ భాషలన్నిటిలోనూ ఒక్క తెలుగులోనే గొప్ప కవిత్వం ఉందనడంలో ఇద్దరమూ ఏకీభవిస్తాం."

శ్రీశ్రీ - జూన్ 9, 1973న విశ్వనాథకి "ఉడుగర"గా ఇలా సమర్పించాడు

"మాటలాడే వెన్నెముక
పాటపాడే సుషుమ్న
నిన్నటి నన్నయ్యభట్టు
ఈనాటి కవి సమ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆ సేతు మిహీకావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగునాటి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద

(శ్రీశ్రీ వ్యాసాలు నుంచి)