Sunday, August 31, 2008

మల్లంపల్లి సోమశేఖర శర్మగారంటే చరిత్ర గుర్తుకు వస్తుంది. అయితే పరమాశ్చర్యంగా!

మల్లంపల్లి సోమశేఖర శర్మగారంటే చరిత్ర గుర్తుకు వస్తుంది. అయితే పరమాశ్చర్యంగా ఈయన 1923 - జులై నాటి" శారద" సంచికలో రాసిన "ఆంధ్రమాత" కవితను చూస్తాం:

"శ్రమించు నీ మూర్తి
చిత్తమందెంచి చేతులు జోడించి
శీర్షంబువంచి వినుతించి నీ ఖ్యాతి
ప్రణుతింతుమో మాత!
మమ్ము దీవింపుమా మముగన్నతల్లి!


పాడిపంటలతోడ భాగ్యాలు తూగి
విరియుపైరులఠీవి విభవానదోగి
చెలువారు నీరూపు
తలపోతు మేమాపు
మమ్ము దీవింపుమా మముగన్నతల్లి !


తెలుగు జోదుల కత్తి మలసి నర్తించె
తెలుగు జోదుల తేజిలవి జౌకళించె
తెలుగు దొరల సేన దెసలాక్రమించె
తెలుగు రాచరికంబు దెసలరాణించె
పరదుర్గములు కూలె - పరరాజ్యములు వ్రీలె
తెలుగువారల ధాటి వెలుగొందునపుడు
తెలుగువారిని నీవు దీవించినపుడు"


మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

ఇది మరి అద్భుత ప్రతిభా, లేక ఇంకేమన్నానా?

ఓలేటి వేంకటరామశాస్త్రి, ద్వివేది రామకృష్ణ శాస్త్రి కలిసి వేంకట రామకృష్ణ కవులయ్యారు

"ఎంత వడివడి జెప్పిన సుంతయేని
విరసమనుమాట పొడమదు వేయునేల?"


అనగల సత్తా గల ఈ జంటకవులు పిఠాపురం రాజా రావు వేంకట సూర్యారాయ మహీపతికి అర్జీ పెట్టుకున్నారు - గంటకి వంద పద్యాలు చెప్తామని. రాజాగారు నాలుగు గంటలలో శతావధానం చెయ్యాలని కోరారు. సరే అన్నారు రామకృష్ణ కవులు.


సెప్టెంబరు 13,1909 నాడు మధ్యాహ్నం 3.45 నుండి సాయంత్రం 7.50 వరకు శతావధానం చేసి మాట నిలుపుకున్నారట. రాజావారు ఎంతో ఆనందించి "అద్భుత శతావధానం" అని కీర్తించారు. ఈ శతావధానంలో 33 వృత్తాలు, 5 మత్తకోకిలలు, 2 తోవకములు, ఒక కవిరాజ విరాజితం, 33 కంద పద్యాలు, 19 గీత పద్యాలు, 4 ఆటవెలదులు, ఆర్య ఉత్సాహాలు ఒక్కొక్కటి చొప్పున చెప్పారట. వీటిని చివర్లో ధారణ కూడా చేశారట.

మరోసారి ప్రహ్లాద చరిత్రను నూరు పద్యాలలో ఒకే ఒక్క గంటలో చెప్పారట. ఇది మరి అద్భుత ప్రతిభా, లేక ఇంకేమన్నానా?

గ్రంథమంతయు నిట్టి భాషలో వ్రాయుట రసాభాస!

భావకవిత్వం గిట్టని చెళ్ళపిళ్ళ

"మున్ పటి రూల్సుకు కట్టుపడమ"ని చెప్పినా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు భావకవిత్వంపై ధ్వజమెత్తారు. బహుధాన్య సంవత్సరంనాటి "అభినవ సరస్వతి" పత్రికలోని ఈ రచన చదివితే చెళ్ళపిళ్ళవారి భావాలు తెలుస్తాయి.

"భావప్రధానమగు కవిత్వమే భావకవిత్వమగు. ఈ కవిత్వమందు బ్రయోగించు పదములన్నియు సంస్కృత పదములే కాని మనకవి సంపూర్ణముగ దెలియుట దుర్లభము. భావకవిత్వమనినంతమాత్రమున బదుగురకు దెలియనిచో బ్రయోజనమేమి? అంగటిలో నన్నియు నున్నవి - అల్లుని నోట శని యున్నది యన్నట్లగును. భావప్రధాన వాక్యములు కొంతవరకుండి తదితరము కొంతచేరియుండవలెనుగాని తుట్టతుదవఱకు నొకటే యుండరాదు. నేటి భావకవిత్వము గూటి చిలకేదిరా చిన్నన్నా లాగున వెళ్ళుచున్నది. అర్థము జెప్పలేము. ఇది యొక పరిభాష. సైన్సులోను, వైద్యములోను నెటులో యటులే నేటి భావకవిత్వమందును నీ పరిభాష ముక్కలు పడుచుండును.


ప్రతి పుస్తకమందును నీ భావకవిత గాంపింపగలదు. కాని పూర్వులీ కవితకు శీర్షిక పెట్టలేదు. "కుందనము వంటి మేను మధ్యందినా తపోష్మహతి గందె, వడదాకె నొప్పు లొలుకు వదనమ"ని వరూధిని బ్రాహ్మణునితో బలికెను. ఆ పద్యములో భావకవిత్వ మిమిడియున్నది. భావకవిత్వము నారంభించినవారి యుద్దేశము మంచిదే కాని దాని నితరులెంతవఱకు నిర్వర్తించుచున్నారోయనునది విచారణీయము. ప్రస్తుతము వచ్చెడి భావకవిత్వము ప్రజలనెంతవఱకు రంజింపజేయునను విషయము వేఱు.


ఇక నెంకిపాటల విషయమై సుబ్బారావుగారు యోగ్యతాపత్రమీవలసినదిగ నన్ను గోరిరి. "కడుపులో సెయ్యెట్టి కలసేసినాదే" మున్నగు పద్యములు వ్యంగ్యపూరితముగ మంచి యభిప్రాయమును దెల్పుపట్టులు చాలగలవు. ఒక్కొక్కొచో వ్యాకరణ దోషములను గూడ సరకుచేయకపోవచ్చును. "జగమేలే పరమాత్మా యెవరితో మొరలిడిదు"నను త్యాగయ్యగారు జగమేలెడి యని యనజాలకుండెనా? ఎంకిపాటలలో మొదటినుంచి చివరవరకు రసాభాస గలదు. కొన్నివేళల మాత్రము స్వదేశభాషను వాడిన దోషము లేదనిరి. కాని తుట్టతుదివఱకు గ్రంథమంతయు నిట్టి భాషలో వ్రాయుట రసాభాస."మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్యకబుర్లు పుస్తకం నుండి.

Friday, August 29, 2008

ఇంతటి ప్రతిభావంతురాలు, బహుముఖప్రజ్ఞాశాలి మళ్ళీ పుట్టబోదు!

భానుమతి రామకృష్ణ - తెలుగు చలనచిత్రజగత్తులో ఇంతటి ప్రతిభావంతురాలు, బహుముఖప్రజ్ఞాశాలి మళ్ళీ పుట్టబోదు అంటే అతిశయోక్తి ఏమీ కాదు.ఆవిడకు ఉన్న ప్రతిభాపాటవాలలో ఒక్కొక్కదానికి ఒక్కో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వవచ్చు.


ఆవిడకు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/


లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్యారడీలు !

దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎంత భావకవి అయినా, 'అనంత శోకభీకర తిమిర లోకైక పతిని" అని చెప్పుకొన్నా హాస్యప్రియత్వం లేకపోలేదు. 1945 ప్రాంతాల్లోనే ఆంధ్రజ్యోతిలోనూ, సోమసుందర్ నిర్వహణలో వెలువడే లిఖిత పత్రిక "అక్షయపాత్ర" లోనూ దేవులపల్లి చమత్కారంగా వేమనపై ప్యారడీలూ రాశారు.

"పట్టిపట్టి గుడికి పదిమంది నేస్తాలు
పర్వదినమటంచు పంపితేను
అతడు కన్నుకొట్టె అమ్మవారినిజూచి
విశ్వదాభిరామ వినురవేమ!""నాటకాలలోన నారి వేసము వేయ
పురుషునట్టులుండు పోతురాజు
ఉత్తయప్డు సరిగ యువతీలలామయే
విశ్వ.."

దేవులపల్లికే భావకవుల అతిని చూచి విసుగుపుట్టిందేమో మరి - ఈ ప్యారడీ వచ్చింది

"మెరుగుకంటిజోళ్ళు గిరజాలు సరదాలు
భావకవికి లేని వేవిలేవు
కవితయందుతప్ప గట్టివాడన్నింట
విశ్వ...."డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

బంగారు పతకం నీ చేత నిజం "పలికించగలిగింది" - శహభాషో!

శహభాష్ బింద్రా ! బంగారు పతకం నీ చేత నిజం "పలికించగలిగింది" - శహభాషో! (Believe it or not somehow I was expecting a statement like this from him!! - but not this soon!)

http://news.bbc.co.uk/1/hi/world/south_asia/7587606.stm

చేసింది ఏమీ లేకపోయినా, ఎవరయినా పతకాలెత్తుకొస్తే, ఆహా మా వాడు, మా అస్సోసియేషన్ ప్రతాపమే అని జబ్బలు చరుచుకోవటం , మీసాలు తిప్పుకోవటం, రాష్ట్రపతితో సహా ఇంద్రుడు చంద్రుడు అని కొనియాడటం, పక్కన నిలబడి వెధవ నవ్వులు నవ్వుతూ ఫోటోలు తీయించుకోవటం....ఇదీ ....

Wednesday, August 27, 2008

యెగరకె యెంగిలాక ని న్నెండుకుక్క పీక

వేసవి వర్ణనము

చెలరేగకేయుక్క నీ తలబట్టి చలినొక్క
తలపకుమాచిఱ్ఱ నిను దరుము విసరుకఱ్ఱ

అనుసరించకెనల్లి నిన్నట్టెమ్రింగు బల్లి
ననుదాకకే ఈగ నిను బనసజిగటలాగ

పగబూనకే చీమ నిన్ను బట్టి నేలపామ
పొగరెందుకే దోమ నిను బొగజంపును జుమ

ఎగరకుమాధూళి యి ల్లిదిగోవర్షాళి
యెగరకె యెంగిలాక ని న్నెండుకుక్క పీక

మూలం: హరికథేతిహాసమంజరి
రచయిత:బీ.బాలాజీదాసు
ప్రచురించింది: 1922లో

Sunday, August 24, 2008

ఓరె ! అరేబియా పిల్ల తెలుగు మాట్టాడుతుందిరా

తన బ్లాక్ అండ్ వైట్ రచనలో పింగళి నాగేంద్ర రావు గారి గురించి రాస్తూ రావికొండలరావు గారు ఇలా అంటున్నారు. "పెళ్ళి చేసి చూడు" (1952) లోని డ్రీం సీక్వెన్స్ లో అర్జునుడు ఊర్వశితో పాడుతూ - చాలు చాలు నీ సాముదాయికపు వలపులు పంపిణీ - అంటాడు. కో ఆపరేటివ్ విధానంలో ఊర్వశి తన ప్రేమను పంచుతుందన్నమాట. అదీ ఆయన చమత్కారం! ఆ పాటలోనే "యుగయుగాలుగా, జగజగాలుగా" అని ఒకచోట వస్తుంది. "ఊగించిన ఉర్రూగించిన" అని ఇంకో చోట వస్తుంది. యుగయుగాలు అంటాంగానీ, జగజగాలు అనం. అలాగే "ఉర్రూతలూగించిన" అని ఉండాలి. దానికాయన సమాధానం "పదాలను ప్రయోగించడంలో బాగుంటుందనుకున్నప్పుడు వేసేయడమే! జగజగాలు అలా వేసిందే. ఉర్రూగించడం భాషలో తప్పయినా, హ్రస్వీకరించి అర్ధమయ్యేటట్టుగా వాడటం తప్పు కాదు. భావం భాషకు బందీ అయిపోకూడదు. తన అవసరానికి భావం, భాషని వాడుకుంటుంది. భావం బాగుంటుందనుకున్నప్పుడు కొత్త ప్రయోగాలు చెయ్యాలి, తప్పుకాదు..................అందుకే మాయాబజార్లో రాశాను - 'ఎవరో ఒకరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయని" అని రావికొండల రావు గారు మాటల మాంత్రికుడు శ్రీ పింగళి నాగేంద్రరావు గారి గురించి చెప్పారు.

అయితే, మిగిలినవి పక్కన పెడితే "జగజగాలు" అన్న మాటతో చిన్న ఇబ్బంది వచ్చి పడింది. మామూలుగా పింగళి ఆయన మా బందరాయన కాబట్టి ఆయనకు నేను వీరాభిమానిని. అయితే నిన్న సుబ్బురామన్ గారి మీద ఆపాత మధురాలు రేడియో ప్రోగ్రాము కోసం పని చేసుకుంటున్నప్పుడు,లైలామజ్ఞూ (1949) చిత్రంలోని భానుమతి, ఘంటసాల మాష్టారు పాడిన పాట "విరితావుల లీల" వింటూ ఉంటే, అందులో జగజగాలు అని వినపడింది. సీనియర్ సముద్రాల వారికి కూడా వీరాభిమాని అయిన నేను ఒక్కసారి తుళ్ళిపడ్డా. అంటే ఈ మాట అసలుగా సముద్రాల వారిదా అని.. మరి రావికొండల రావు గారు ఈ జగజగాలు అన్న మాట పింగళివారిది అని "సజెస్ట్" చేసారా ? లేక ......!!


ఇది అంతా పక్కన బెడితే లైలా మజ్ఞు చిత్రంలోని పాట ఇంకోటి " ఏ కొరనోమూ నోచుకున్నానో - నేనూ" అని లైలా పాడుతుంది. లైలా అరేబియా కన్య కదా, నోము నోచుకోడాలూ అవీ వాళ్లకు ఉంటాయా గురూగారూ అని అడిగితే ఆచార్యులవారు తాంబూలం సేవిస్తూ ఒక మందహాసంతో - "ఓరె ! అరేబియా పిల్ల తెలుగు మాట్టాడుతుందిరా - ఆ మాట చెప్పు!" అని దాటవేశారట. :)

Friday, August 22, 2008

అంటరానితనం తాండవిస్తున్న 1938వ సంవత్సరంలో ......

తెలుగు వారిని, సమాజాన్ని అనతికాలంలోనే చైతన్యవంతం చేయగలిగింది పత్రిక, కళారంగాలే అని గుర్తించిన అతికొద్దిమంది ముఖ్యుల్లో గూడవల్లి రామబ్రహ్మం గారు ఒకరు. అంటరానితనం తాండవిస్తున్న 1938వ సంవత్సరంలో సాంఘిక ప్రయోజనాన్ని సాధించిన మాలపిల్ల చిత్రనిర్మాణంతో తెలుగు సినీ రంగంలో ఒక నూతన శకం ప్రారంభమయ్యింది. ఆయన సమాజ చైతన్య భావనలో పాలు పంచుకోవటమే ఆ మహానుభావుడికి మనం అర్పించగలిగే నివాళి.

అభ్యుదయవాది, జాతీయవాది, స్నేహశీలి, దానశీలి అయిన రామబ్రహ్మం గారికి శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Thursday, August 14, 2008

కర్నాటక సంగీతం - నాలుగవ పాఠం (గీతాలు)

కర్నాటక సంగీతం (E - Learning Class)

నాలుగవ పాఠం (గీతాలు ) ఇక్కడ

http://www.maganti.org/mukhamukhiindex.html

ఇలాంటి ఇంకా ఎన్నో పాఠాలు మీ ముందుకు .. అవకాశమిచ్చిన శ్రీమతి రత్న కుమారి గారికి పాదాభివందనాలతో

Tuesday, August 12, 2008

జిక్కిగారు ఖచ్చితంగా తప్పే పాడారు ...

బాటసారి చిత్రంలోని పాట మీద ప్రశ్న - ముందు పాట జాగ్రత్తగా ఇక్కడ వినండి,

http://www.oldtelugusongs.com/newsongs/vintage/Batasari_1961-Bhanumati-OBatasariNanuMaruvakoi-SamudralaSr_MasterVenu.mp3


ఒకవేళ ఈ పై లింకు పనిచెయ్యకపోతే ఇక్కడ నొక్కండి (note: - select open in new window)

http://www.maganti.org/audiofiles/misc/jikki.html

పాట జాగ్రత్తగా విన్న తరువాత, క్రింద నీలం రంగులో ఉన్న పదాల్లో ఏది Correct చెప్పండి. ఎరుపు రంగు పదం అయితే జిక్కిగారు ఖచ్చితంగా తప్పే పాడారు ...

ఈ "సుజించే" మీద కూడా కొంచెం అనుమానం ఉన్నది కానీ..... .."మది" "మరి" లో "మది" ఖాయమనుకుంటే సముద్రాల వారికి శతకోటి నమోన్నమహలు - అద్భుతమయిన అర్థం ఉన్నది


కనులకు దోచి చేతికందని ఎండమావులున్నై
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నై
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని


భూమి జనించి ఆకలికొదగని ఫలములున్నవి కొన్ని
భూమి జనించి ఆకలికొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవీ కొన్ని
తలపులున్నవీ కొన్ని

సృష్టిచేసినది దేవుడైన మరి నాశమునేల సృజించే
పలుకునొసగినది దేవుడైన మది (మరి) మూగలనేల సృజించే

కనులనొసగినది దేవుడైన మరి అందులనేల సుజించే
కనులనొసగినది దేవుడైన మరి అంధులనేల సుజించే
వెలుగునిచ్చినది దేవుడైన మది (మరి) చీకటినేల సృజించే
పెనుచీకటినేల సృజించే

వేదశాస్త్రములు చదివిన వారే ఎరుగరు సృష్టివిలాసం
వేదశాస్త్రములు చదివిన వారే ఎరుగరు సృష్టివిలాసం
అల్పబుద్ధితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం
సలుపకు పరిహాసం

బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుట మాని బ్రతుకుటయే న్యాయం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుట మాని బ్రతుకుటయే న్యాయం


PS: పాటలు, కవితలు అంటే ఇవీ...దిక్కుమాలిన పడవలు, పడకలు, మరకలు, గడ్డి పరకలు, రైలు పట్టాలు కాదు

Friday, August 8, 2008

తెలుగు సినిమా దర్శకుల్లో గొప్పవాళ్ళు ఎవరనే ప్రశ్న వస్తే?

తెలుగు సినిమా దర్శకుల్లో గొప్పవాళ్ళు ఎవరనే ప్రశ్న వస్తే మనం ముందుగా వినే పేరు “బి.ఎన్‌. రెడ్డి”. నిజానికి 30 ఏళ్ళ సినీ జీవితంలో ఆయన తీసింది పదకొండు సినిమాలే. కాని ప్రతి ఒక్కటీ పేరు గడించిందే! లోకానికంతటికీ “బి.ఎన్‌” గా పరిచితుడైన ఆయన అసలు పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి.

ఆయనకు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 – 11 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/


లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Tuesday, August 5, 2008

ఆయన ఎవరో తెలియదు కానీ, బానే అందుకున్నారు రాగాలు పాటలు

Basildon, UK లో జరిగిన Andhra Medical Graduates Reunion 1994 కు Chief Guest గా విచ్చేసిన భానుమతి రామకృష్ణ. Video..ఇందులో అప్పారావుగారు , ఆయన ఎవరో తెలియదు కానీ, బానే అందుకున్నారు రాగాలు పాటలు ....ఇక భానుమతి గురించి చెప్పనఖ్ఖరలేదు అనుకోండి .....గూగుల్ లో ఏదో వెతుకుతుంటే ఇక్కడ తేలా

http://telugu.yuyam.com/story.php?id=23314

వంశీ

Friday, August 1, 2008

తెలుగు సినీ జగత్తులో సినిమాలు, ఆ సినిమాలకు మాటలు ఉన్నంతకాలం ఆయన చిరంజీవే!

సినీజగత్తును తన మాటల మాయాజాలంతో అచ్చెరువొందించిన మాంత్రికుడు శ్రీ పింగళి నాగేంద్రరావు. ఒకటా రెండా - పాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, జగదేకవీరుని కథ, మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు లాంటి చిత్రరాజాలకు తన మాటలతో ప్రాణం పోసిన రచయిత.

జీవితమంతా బ్రహ్మచారిగా గడిపి, సాహిత్యానికి, ఆ సినీకళామతల్లికి తన సర్వం అర్పించిన మహానుభావుడు. సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం భౌతికంగా దేహం చాలించినా, తెలుగు సినీ జగత్తులో సినిమాలు, ఆ సినిమాలకు మాటలు ఉన్నంతకాలం ఆయన చిరంజీవే....

ఆయనకు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 - 10.30 (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ