Sunday, July 6, 2008

"కోకిలమ్మ పెండ్లి" - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

తేటతెనుగు తీయదనం, ఆత్మీయత, ప్రకృతి వర్ణన ఎంతో చక్కగా వర్ణించబడ్డ ఈ "కోకిలమ్మ పెండ్లి" గురించి ఏమని చెప్పేది?


తను రాసుకున్న పాత డైరీలోనుండి ఈ "కోకిలమ్మ పెండ్లి"ని అందచేసిన మా నాన్న శ్రీ శివరామ శర్మగారికి ధన్యవాదాలతో.


నా తర్జుమాలో తప్పులు ఎక్కడయినా కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపము....

దీని కాపీరైటు సంగతి నాకు తెలియదు...ఇలా ప్రచురించటం ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియపరిస్తే , కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణలతో ఈ ప్రతి ఇక్కడి నుండి తొలగించబడుతుంది....


గమనిక : ఇది ...బ్లాగు మొదలెట్టాక 200 వ టపా .... :)...కోకిలమ్మ పెండ్లి
----శ్రీ విశ్వనాథ సత్యనారాయణ


లేతబుర్రలు కొక్కిరిస్తే
ఆతగాళ్ళతో యేమిగానీ
తాతతాతలనాటి కతలూ
తవ్విపోస్తానోయ్


ఊగులాడే కడలితరగలు
నాగుబాముల కోడెలల్లే
ఒడ్డుదాకా ప్రాకు ప్రాకీ
ఒరిగిపోతా యోయ్


ఒడ్డుదాకా అడవి అడవిలో
దొడ్డ చెట్లున్నాయి తరగల
వూగులాడే గాలిచేతా
వూగుతుంటాయోయ్


అడవిలోనూ కడలిలోనూ
అద్దరాతిరివేళ అప్పుడు
తొగరుకన్నుల చుక్కకన్నెలు
తొంగిచూస్తారోయ్


పొద్దుకూకేవేళ వొడ్డున
ముద్దు ముద్దుగ తిరుగుతుంటూ
సొగసునడకల గాలిపిల్లలు
సోకుపోతారోయ్


సుళ్ళు తిరిగే కడలినడుమా
చూపు కందీ అందకుండా
తెప్పలేసుకు పాముపడుచులు
తేలిపోతారోయ్


ఒడ్డునే బంగారుచేలూ
ఒడ్డునే పూవుల్లు చేత్తో
ఊరికే యిట్లంటె చాల్ పా
లుబికిపోతాయోయ్


నేను చెప్పేకతలు జరిగీ
యెన్ని నాళ్ళయ్యిందొ అప్పుడు
మలయ పొదలూ కొండకోనలూ
తెలుగునాడంతా


కడలి వొడ్డున పల్లె వొక్కటి
కలదు ఱేడున్నాడు దానికి
అప్పటికె యీ తెలుగులంతా
గొప్ప యెకిమీళ్ళూ

దొడ్డదొర, అతగాడి నేలలొ
ఎడ్డెపనులే చేయరెవ్వరు
దొంగనాగరికతలో దేశం
తూలిపోలేదోయ్

ఉన్నవాళ్ళకు ఎంతనేలా
దున్నుకుంటే చాలుతుందో
మించి ముట్టరుకూడ పైనా
చిన్న చెక్కయినా

అందరికి కావలసినంతా
వుంది, యెవ్వరితోడ నెవరికి
నెన్నడూ చూడలేమన్నా
చిన్ని తగవైనా

ఆ దొరకి కూతుళ్ళు ఇద్దరు
మోదుగులు పూశాయి పెదవులు
వారి పేరులు, చిలకతల్లీ,
కోకిలమ్మానూ

కోకిలమ్మా నల్లనీదీ
చిలకతల్లీ పచ్చనీదీ
చిలకతల్లికి కోకిలమ్మకు
ఎప్పుడూ పడదూ

చిలకతల్లీ చిన్ననాడే
పలుక మొదలెట్టింది ముద్దుల
మొలకలై తండ్రికీ మేనూ
పులకరించిందీ

ఎన్నొయేళ్ళూ వచ్చినాయీ
కన్నులింతగ తెరిచినాదీ
పాపమేమో ! కోకిలమ్మకు
మాటలే రావూ

చిలకతల్లికి రంగు రంగుల
చీరలూ తెస్తాడు తండ్రీ,
కోకిలమ్మను ఊరికనే
కోపపడతాడూ

చిలకతల్లీ నవ్విపోతే
తండ్రి మారూ పలుకకుంటే
తల్లి వంకా చూచి కోకిల
తెల్లపోతుందీ

చిలకతల్లీ వెక్కిరిస్తే
తండ్రి వచ్చీ కసురుకుంటే
తల్లి వెనుకా దాగిపోతూ
తల్లడిలుతుందీ

తల్లి యేమీ చెయ్యలేకా
తానుకూడా విసుక్కుంటే
కోకిలమ్మా లోనె లోనే
కుమిలిపోతుందీ

అడవిలో యే చెట్టుకిందో
అంత యెగ్గూ తలచుకోనీ
కూరుచున్నది కూరుచుండే
కుంగిపోతుందీ

చెట్టుతోనో పుట్టతోనో
చెప్పుకుందా మన్నగానీ
ఎట్టివాడో వాడు నోరూ
పెట్టలేదాయే

కొండవాగుల వెంట పోతూ
కొండపువ్వులవంక చూస్తూ
ఎంత పొద్దోయినా గానీ
యింటికే పోదూ

ఒక్కొక్కప్పుడు తెల్లవార్లూ
అడవిలోనే వుండిపోతే
తల్లి ఊరక తెల్లవార్లూ
తెల్లడిలుతుందీ

వానరోజులు వచ్చిపోగా
చలిపగళ్ళూ సాగిపోగా
ఆకురాలుట ఆగి చివురులు
జోక తాల్చాయి

చివురులో యీనెల్ల పసిరిక
పూవుల్లో తేనెల్ల, పలపల
చిలకతల్లికి కోకిలమ్మకు
వయసు వచ్చిందీ

చిలకతల్లీ చదువు చూచీ
చిలకతల్లీ సొగసు చూచీ
గాలిపిల్లలుకూడ లోపల
కలత పడ్దారూ

చిలకతల్లీ అందమంతా
చిందిపోయీ అన్నివైపుల
కనుల చూడని వారు కూడా
అనుకునేవారే

ఎల్లవారూ చిలకతల్లినె
పెళ్ళికై కోరారు, తండ్రి
తల్లిమాత్రము పిల్లదాన్నీ
కళ్ళకాస్తారు

కడలి అడవులఱేండ్లు తమలో
కలుపుకుంటారేమొ అనుకుని
గడపదాటీ చిలకతల్లిని
కదలిపోనీరూ

ఇంటిముంగలి దాటనీకా
ఇంటిపనులూ చేయనీకా
కంటికీ రెప్పాకి మల్లే
కాచుకుంటారూ

చిలకతల్లీ అందమేమో
చిల్లకతల్లీ పెళ్ళి యేమో
తలి దండ్రీ కోకిలమ్మను
తలచనే పోరూ

ఒక్క మధ్యాహ్నంబునందున
చెక్కులను కుండల ప్రభలవి
పిక్కటిలి బ్రాహ్మణుండొక్కరు
డక్కడికి వచ్చెన్

చిలకతల్లీ దండ్రులు
చేరవచ్చిన అతనికోసము
కోరినట్టివి యన్ని యిచ్చీ
ఆదరించారూ

వేదపనసలు చెప్పుకుంచూ
వాదములకూ కాలం త్రవ్వుచూ
ఆయనా తెలుగురాజింట్లో
ఆగిఉన్నాడూ

అతని వేదధ్వనులు వించూ
అతని వర్చస్సంత కంచూ
చిలకతల్లీ అతని తనలో
నిలిపివేసిందీ

సంగతంతా తెలిసి ఱేడూ
పొంగిపోయాడేమో కానీ
తల్లికీ చిలకతల్లంటే
వెళ్ళుకొచ్చిందీ

కోనలందూ అడవులందూ
కోకిలమ్మా తిరుగుతోందీ
ఎంత యేడుస్తోందొ తల్లీ
యింటికే రాదూ

ఏ యెఱుంగని నేలవాడో
యింటికొస్తే వాడిమీదా
చిలకతల్లీ వలపు తానూ
నిలిపివేసిందీ

కోకిలమ్మా యింటికైనా
రాక అడవుల్లోనే తిరుగుతు
పోకిళ్ళమారైంది, తల్లి
కాకపోయిందీ

అడవులెంటా కోనలెంటా
బుడబుడా చను సెలల వెంటా
అడుగులు తడబడా వెదుకుతు
నడచిపోయిందీ

అడవి మెకములు తిరుగులాడే
ఎడము లేనీ అడుగులొప్పే
అడవిలోపలి కోనలెల్లా
తడివి చూసిందీ

ఎచట పోయీ వెదకిననూ
ఎందులేదూ కోకిలమ్మా
ఎచ్చటుందో తల్లిగుండే
వ్రచ్చిపోయిందీ

ఒక్క సెలయేట్లోకీ వేరూ
మిక్కిలీ పోయినా ముషిణి
ప్రక్క చెట్టూ క్రింద కూర్చుని
స్రుక్కిపోయిందీ

తల్లివెనకా యింతసేపూ
మెల్లగా వస్తోంది కోకిల
తల్లి బాధ కళ్ళచూసీ
గొల్లుమన్నాదీ

ఉరుములా వురిమింది కోకిలా
మెరుపులా మెరిసింది కోకిల
వొక్కగంతున తల్లివొళ్ళో
వచ్చిపడ్డాదీ

తల్లిబిడ్డను బిడ్డ దల్లిని
కళ్ళుమూసుకు కౌగిలించీ
ఒళ్ళు తెలియక చెట్టు మొదటా
ఒరిగిపోయారూ

తల్లిబిడ్డల ప్రేమ అంటే
యిల్లాగు వుండాలంటూ
ప్రకృతిదేవీ వొళ్ళు తెలియక
పాట ఫాడిందీ

ఎప్పుడూ గిలకల్లె అడవిలో
ఎచట చూస్తే అచటవుండే
చిన్నకోకిల లేక అడవీ
చిన్నవోయిందీ

కోకిలమ్మా తిరుగులాడని
కోకిలమ్మా లేని అడవీ
కోనలకు తొలు కారుటందం
కొరతపడ్డాదీ

తల్లి అంటే అంతప్రేమా
వెళ్ళ గక్కిన కోకిలమ్మకు
చావు లేదని మావిచివురూ
సాగులాడిందీ

తల్లి అంటే అంతప్రేమా
వెళ్ళగ్రక్కిన కోకిలమ్మా
మునిగిపోదని అడవివూటా
ముర్మురించిందీ

తల్లి అంటే అంతప్రేమా
వెళ్ళ గ్రక్కిన కోకిలమ్మా
బ్రతికి వస్తుందంచు అడవీ
పాట పాడిందీ

వానలన్నీ వెనుకపట్టీ
కోనలన్నీ నీరుపట్టీ
ఆకురాలే కారుకూడా
ఆగిపోయిందీ

చిన్న మొగమున కుంకుమిడినా
కన్నె పేరంటాలి మల్లే
చెలువుగా అడివంత క్రొత్తగా
చివురు తొడిగిందీ

ఎక్కడో అడవిలో చివరా
చక్కగా సన్నగా యేదో
చిక్కనైనా తేనెపాటా
జీరు వారిందీ

ఆపాట వింటూనె అడివీ
అడివిగా నిలువెల్ల, పోయిన
వొక్కచుట్టం వచ్చినట్లూ
వులికిపడ్డాదీ

సన్నగా పోతున్నవూటా
జాలు జాలింతై వెడల్పై
పట్టలేకా ఓర్పు జలజల
పరువులెత్తిందీ

కోకిలమ్మా అదుగో మళ్ళీ
కూసెనంటె వచ్చెనానీ
వచ్చెనంటే వచ్చెనానీ
బ్రతికెనంటే బ్రతికెనానీ

చెన్నుతరగని మావిమోకా
చివురు తొడిగిందీ
అంతలోపల అడవి కందం
అతిశయించిందీ

అంతలో పూవుల్ల ఱేడు
వింతవింతల సోకు లేలిక
చెక్కులా నవ్వులూ చిలుకుతు
చేరవచ్చాడూ

ఏడాది కొకసారి వస్తా
డేడాది కొకసారి తెస్తా
డెన్ని పువ్వులు, అతనివేనూ
వన్నెలూ చిన్నెల్

వచ్చావటయ్యా పూలఱేడా
తెచ్చావటయ్యా పూలరాజా
నీవు తెచ్చిన పూవులే కా
నికల కిస్తామూ

కోకిలమ్మనూ ముద్దుపెళ్లీ
కూతురును చేస్తాము, పెళ్ళీ
కొడుకును చేస్తాము నీకూ
కూర్చివేస్తామూ

కోరి నీ అందానికీ మా
కోకిలమ్మా గొంతుకునకూ
సొగసుచేతా పాటచేతా
తగేపోయింది

రావయ్య ఓ పూలరాజా
రావయ్య ఓ అందగాడా
కోకిలమ్మకు నీవు, నీకూ
కోకిలా తగునూ

వారి పెళ్ళికి అడవి అంతా
తోరణాలైనాయి చివురులు
కాపలా కాసినై పూలులూ
గండశిలలందూ

సన్నాయి పాడింది తెల్లని
సన్నని సెలవూట పూలా
వెన్నెలై ప్రకృతి తల్లేమో
కన్ను తెరిచిందీ

పూలసోనలు కురిసినై, తే
నేలపాటలు విరిసినై, అం
దాల త్రోవలు వెలసినై, రాజ
నాలు పండినవి

చిలకతల్లి మహాన్వయంబున
నిలచినవి సాంస్కృతికవాక్కులు
కోకిలమ్మా తెనుగుపలుకూ
కూడబెట్టిందీ

No comments:

Post a Comment