Saturday, July 26, 2008

మేరుపర్వతాన్ని గుప్పిట్లో బంధించటం ?

తెలుగు చిత్రజగత్తులో రచయితకు ఒక గుర్తింపు తీసుకువచ్చిన మహానుభావుడు శ్రీ సముద్రాల రాఘవాచార్య గారికి నీరాజనాలు అర్పిస్తూ ఈ రోజు ప్రసారమవుతున్న రేడియో కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

అరగంటలో ఆయన గురించి చెప్పాలి అంటే మేరుపర్వతాన్ని గుప్పిట్లో బంధించటమే!!

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Tuesday, July 22, 2008

కోతి మూతిలోన జగజ్యోతి ఉన్నాదీ!

మా అమ్మమ్మగారి ఊరు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఉన్న శివాలయంలో,సాయంత్రం పూట కొద్దిసేపు భజనలు జరిగేవి..అక్కడికి ఒక 50 యేళ్ళు ఉన్న ఆయన ఠంచనుగా 6 ఇంటికల్లా వచ్చేవాడు - పేరు "కోటయ్య" .....తత్త్వాలు, భజన పాటలు ఇలా ఒకటేమిటి చాలా పాడేవాడు ఆయన..మాంఛి గాత్ర శుద్ధి ఉన్న మనిషి..చిఱతలు కూడా ఉండేవి..అసలు కోటయ్య పాడే పాటలకోసమే కొంతమంది గుడికి వచ్చేవాళ్ళు, అంత బావుండేది...... ఇది అంతా ఎప్పుడో నా చిన్నప్పటి సంగతి...నిన్న ఓల్డ్ తెలుగుసాంగ్స్ లో దేనికోసమో చూస్తూ ఉంటే కోటయ్య పాడే పాట "యోగివేమన" చిత్రంలోనిది కనపడింది...ఒక్కసారిగా జ్ఞాపకాలన్నీ లేచి కూర్చున్నాయి....కోటయ్య పాడే ఈ పాటలో ఇంకా బోల్డన్ని చరణాలు ఉండేవి...మొత్తం పాట గుర్తుకులేదు, అంటే మరి కోటయ్య సముద్రాల వారి పాట తీసుకుని తన స్వంత పాట తయారు చేసుకున్నాడా అంటే - ఏమో చెప్పలేను..కానీ కనీసం మూడు నిముషాల పాటు సాగేంత పెద్ద పాట అది...

ఈ సారి చల్లపల్లి వెళ్ళినప్పుడు, కోటయ్యను పట్టుకుని ఆ పాటలన్నీ రికార్డు చేసుకోవాలి... ఈ పాట వినాలి అంటే ఓల్డ్ తెలుగుసాంగ్స్.కాం కి వెళ్ళి అక్కడ సెర్చ్ లో యోగివేమన చిత్రం సెలక్ట్ చేసుకోండి..


వచ్చేపోయే దారిలోనా కోతి ఉన్నాది
కోతి మూతిలోన జగజ్యోతి ఉన్నాదీ
నాదమీనవే మనసా నాదమీనవే
నాదమీనీ ఖేదముడిగీ మోదమందవే
మోదమందీ నీవు నేనూ కలిసిపోదామే
ఆ శివునిలోనా ఐక్యమవుదామే
ఆ శివునిలోనా ఐక్యమవుదామే..

Sunday, July 20, 2008

తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారి కథలు

తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సాహిత్యంలో తనదైన, అరుదయిన ముద్రను వేసిన సాహిత్యవేత్త. తన రచనా నేపథ్యం గురించి ఆయన స్వంతమాటల్లో, మాగంటి.ఆర్గ్ లో ఉన్న ధిక్కారం రచనలో 341 - 381 వరకు ఉన్న పేజీల్లో వివరించారు. చదివి ఆనందించండి. ఆయన రాసిన కథలు మాగంటి.ఆర్గ్ లో ప్రచురించటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకు శతసహస్ర ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మిత్రులు శ్రీ వారాల ఆనంద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.


రఘోత్తమ రెడ్డిగారు తాను రాయాలనుకున్న కథను చాలా లోతుగా చూస్తారనీ, మానవ సంబంధాల్లో, విలువల్లో ఉద్యమాలు తీసుకువస్తున్న ఘర్షణను సంక్లిష్టంగా, ప్రతిభావంతంగా చిత్రిస్తారని ప్రొఫెస్సర్ జి.హరగోపాల్ గారు అన్నా, సదా శ్రోతగా ఉండి తనను కదిలించిన జీవిత శకలాలను వస్తువులుగా చేసుకొని కథలు రాయడమే తెలిసిన మనిషి అని కాళీపట్నం రామారావు గారు అన్నా, రఘోత్తమరెడ్డిగారిలో మితిమీరిన సంవేదనా శీలత ఉన్నది, ఆయన ఏది చెప్పినా అబద్ధం చెప్పడు అని డాక్టర్ సదాశివ గారు అన్నా, కొ.కు, చా.సో, రావి శాస్త్రి, కా.రా ల నుంచి కొత్తకథల్ని ఆశించే అవకాశాన్ని పోగుట్టుకుని దిగులుగా ఉన్న నాలాంటి కథాభిమానుల్లో ఆశ రగిలించిన కొద్దిమంది యువ రచయితల్లో రఘోత్తమ రెడ్డి ముఖ్యుడు అని వల్లంపాటి సుబ్బయ్యగారు అన్నా, తను కోరుకుంటున్న అచ్చమైన, సృజనాత్మకమయిన, కళాత్మకమయిన జీవితం కోసం, మనుషులకోసం, విలువల కోసం పరితపించే మనిషి అని అల్లం రాజయ్య గారు అన్నా, భూగర్భంలో పొరలు పొరలుగా అల్లుకున్న బొగ్గుట్టలను చెమ్మాసుతో తోడినట్టే, మానవ సంబంధాలలో పొరలు పొరలుగా విస్తరించిన అనేక ఉద్వేగాలను రఘోత్తమ రెడ్డి, తన కలంతో తవ్వి కథల కుప్పలు పోసిపెట్టాడు అని ప్రేమతో ఎన్.వేణుగోపాల్ గారు అన్నా అందులో అతిశయోక్తి ఏమీ లేదు.

http://www.maganti.org/rachayitalu/tummeti/tummetiindex.html


వీలు వెంబడి ఆయన కథలు ఒకటొకటిగా మీ ముందుకు తీసుకుని రావటానికి ప్రయత్నం జరుగుతుంది అని తెలియచేసుకుంటున్నాను. ఈ కథల మీద సర్వహక్కులు వారివే అనీ, ఎవరయినా వాడుకోదలిస్తే ఆయనను ముందుగా సంప్రదించి అనుమతి తీసుకోవలసిందిగా కోరుతున్నాను.

Saturday, July 19, 2008

స్వరాలూరు మహారాజు సాలూరి రాజేశ్వర రావు

స్వరాలూరు మహారాజు సాలూరి రాజేశ్వర రావు గారి గురించి శ్రీ పరుచూరి శ్రీనివాస్ అందించిన విశేషాలతో, అరుదయిన పాటలతో, వాయిస్ ఆఫ్ శాక్రమెంటో రేడియో స్టేషన్లో ఈ శనివారం ప్రసారమయిన రేడియో కార్యక్రమం ఇక్కడ వినవచ్చు

http://www.radio.maganti.org/archives.html

వంశీ

Saturday, July 12, 2008

ఇలా చెప్తారన్నమాట...

అమెరికా లోని రాష్ట్రాల పేర్లు, 2 సంవత్సరాల 3 నెలలకి ఇలా చెప్తారన్నమాట

http://www.maganti.org/audiofiles/vaishnavi/allstates.mp3

వంశీ

Tuesday, July 8, 2008

వాతావరణం ఇలా తెలుసుకోవచ్చు ...


ఎవరో చైన్ ఈమెయిలో పంపగా వచ్చిన చిత్రం...

Sunday, July 6, 2008

"కోకిలమ్మ పెండ్లి" - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

తేటతెనుగు తీయదనం, ఆత్మీయత, ప్రకృతి వర్ణన ఎంతో చక్కగా వర్ణించబడ్డ ఈ "కోకిలమ్మ పెండ్లి" గురించి ఏమని చెప్పేది?


తను రాసుకున్న పాత డైరీలోనుండి ఈ "కోకిలమ్మ పెండ్లి"ని అందచేసిన మా నాన్న శ్రీ శివరామ శర్మగారికి ధన్యవాదాలతో.


నా తర్జుమాలో తప్పులు ఎక్కడయినా కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపము....

దీని కాపీరైటు సంగతి నాకు తెలియదు...ఇలా ప్రచురించటం ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియపరిస్తే , కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణలతో ఈ ప్రతి ఇక్కడి నుండి తొలగించబడుతుంది....


గమనిక : ఇది ...బ్లాగు మొదలెట్టాక 200 వ టపా .... :)...కోకిలమ్మ పెండ్లి
----శ్రీ విశ్వనాథ సత్యనారాయణ


లేతబుర్రలు కొక్కిరిస్తే
ఆతగాళ్ళతో యేమిగానీ
తాతతాతలనాటి కతలూ
తవ్విపోస్తానోయ్


ఊగులాడే కడలితరగలు
నాగుబాముల కోడెలల్లే
ఒడ్డుదాకా ప్రాకు ప్రాకీ
ఒరిగిపోతా యోయ్


ఒడ్డుదాకా అడవి అడవిలో
దొడ్డ చెట్లున్నాయి తరగల
వూగులాడే గాలిచేతా
వూగుతుంటాయోయ్


అడవిలోనూ కడలిలోనూ
అద్దరాతిరివేళ అప్పుడు
తొగరుకన్నుల చుక్కకన్నెలు
తొంగిచూస్తారోయ్


పొద్దుకూకేవేళ వొడ్డున
ముద్దు ముద్దుగ తిరుగుతుంటూ
సొగసునడకల గాలిపిల్లలు
సోకుపోతారోయ్


సుళ్ళు తిరిగే కడలినడుమా
చూపు కందీ అందకుండా
తెప్పలేసుకు పాముపడుచులు
తేలిపోతారోయ్


ఒడ్డునే బంగారుచేలూ
ఒడ్డునే పూవుల్లు చేత్తో
ఊరికే యిట్లంటె చాల్ పా
లుబికిపోతాయోయ్


నేను చెప్పేకతలు జరిగీ
యెన్ని నాళ్ళయ్యిందొ అప్పుడు
మలయ పొదలూ కొండకోనలూ
తెలుగునాడంతా


కడలి వొడ్డున పల్లె వొక్కటి
కలదు ఱేడున్నాడు దానికి
అప్పటికె యీ తెలుగులంతా
గొప్ప యెకిమీళ్ళూ

దొడ్డదొర, అతగాడి నేలలొ
ఎడ్డెపనులే చేయరెవ్వరు
దొంగనాగరికతలో దేశం
తూలిపోలేదోయ్

ఉన్నవాళ్ళకు ఎంతనేలా
దున్నుకుంటే చాలుతుందో
మించి ముట్టరుకూడ పైనా
చిన్న చెక్కయినా

అందరికి కావలసినంతా
వుంది, యెవ్వరితోడ నెవరికి
నెన్నడూ చూడలేమన్నా
చిన్ని తగవైనా

ఆ దొరకి కూతుళ్ళు ఇద్దరు
మోదుగులు పూశాయి పెదవులు
వారి పేరులు, చిలకతల్లీ,
కోకిలమ్మానూ

కోకిలమ్మా నల్లనీదీ
చిలకతల్లీ పచ్చనీదీ
చిలకతల్లికి కోకిలమ్మకు
ఎప్పుడూ పడదూ

చిలకతల్లీ చిన్ననాడే
పలుక మొదలెట్టింది ముద్దుల
మొలకలై తండ్రికీ మేనూ
పులకరించిందీ

ఎన్నొయేళ్ళూ వచ్చినాయీ
కన్నులింతగ తెరిచినాదీ
పాపమేమో ! కోకిలమ్మకు
మాటలే రావూ

చిలకతల్లికి రంగు రంగుల
చీరలూ తెస్తాడు తండ్రీ,
కోకిలమ్మను ఊరికనే
కోపపడతాడూ

చిలకతల్లీ నవ్విపోతే
తండ్రి మారూ పలుకకుంటే
తల్లి వంకా చూచి కోకిల
తెల్లపోతుందీ

చిలకతల్లీ వెక్కిరిస్తే
తండ్రి వచ్చీ కసురుకుంటే
తల్లి వెనుకా దాగిపోతూ
తల్లడిలుతుందీ

తల్లి యేమీ చెయ్యలేకా
తానుకూడా విసుక్కుంటే
కోకిలమ్మా లోనె లోనే
కుమిలిపోతుందీ

అడవిలో యే చెట్టుకిందో
అంత యెగ్గూ తలచుకోనీ
కూరుచున్నది కూరుచుండే
కుంగిపోతుందీ

చెట్టుతోనో పుట్టతోనో
చెప్పుకుందా మన్నగానీ
ఎట్టివాడో వాడు నోరూ
పెట్టలేదాయే

కొండవాగుల వెంట పోతూ
కొండపువ్వులవంక చూస్తూ
ఎంత పొద్దోయినా గానీ
యింటికే పోదూ

ఒక్కొక్కప్పుడు తెల్లవార్లూ
అడవిలోనే వుండిపోతే
తల్లి ఊరక తెల్లవార్లూ
తెల్లడిలుతుందీ

వానరోజులు వచ్చిపోగా
చలిపగళ్ళూ సాగిపోగా
ఆకురాలుట ఆగి చివురులు
జోక తాల్చాయి

చివురులో యీనెల్ల పసిరిక
పూవుల్లో తేనెల్ల, పలపల
చిలకతల్లికి కోకిలమ్మకు
వయసు వచ్చిందీ

చిలకతల్లీ చదువు చూచీ
చిలకతల్లీ సొగసు చూచీ
గాలిపిల్లలుకూడ లోపల
కలత పడ్దారూ

చిలకతల్లీ అందమంతా
చిందిపోయీ అన్నివైపుల
కనుల చూడని వారు కూడా
అనుకునేవారే

ఎల్లవారూ చిలకతల్లినె
పెళ్ళికై కోరారు, తండ్రి
తల్లిమాత్రము పిల్లదాన్నీ
కళ్ళకాస్తారు

కడలి అడవులఱేండ్లు తమలో
కలుపుకుంటారేమొ అనుకుని
గడపదాటీ చిలకతల్లిని
కదలిపోనీరూ

ఇంటిముంగలి దాటనీకా
ఇంటిపనులూ చేయనీకా
కంటికీ రెప్పాకి మల్లే
కాచుకుంటారూ

చిలకతల్లీ అందమేమో
చిల్లకతల్లీ పెళ్ళి యేమో
తలి దండ్రీ కోకిలమ్మను
తలచనే పోరూ

ఒక్క మధ్యాహ్నంబునందున
చెక్కులను కుండల ప్రభలవి
పిక్కటిలి బ్రాహ్మణుండొక్కరు
డక్కడికి వచ్చెన్

చిలకతల్లీ దండ్రులు
చేరవచ్చిన అతనికోసము
కోరినట్టివి యన్ని యిచ్చీ
ఆదరించారూ

వేదపనసలు చెప్పుకుంచూ
వాదములకూ కాలం త్రవ్వుచూ
ఆయనా తెలుగురాజింట్లో
ఆగిఉన్నాడూ

అతని వేదధ్వనులు వించూ
అతని వర్చస్సంత కంచూ
చిలకతల్లీ అతని తనలో
నిలిపివేసిందీ

సంగతంతా తెలిసి ఱేడూ
పొంగిపోయాడేమో కానీ
తల్లికీ చిలకతల్లంటే
వెళ్ళుకొచ్చిందీ

కోనలందూ అడవులందూ
కోకిలమ్మా తిరుగుతోందీ
ఎంత యేడుస్తోందొ తల్లీ
యింటికే రాదూ

ఏ యెఱుంగని నేలవాడో
యింటికొస్తే వాడిమీదా
చిలకతల్లీ వలపు తానూ
నిలిపివేసిందీ

కోకిలమ్మా యింటికైనా
రాక అడవుల్లోనే తిరుగుతు
పోకిళ్ళమారైంది, తల్లి
కాకపోయిందీ

అడవులెంటా కోనలెంటా
బుడబుడా చను సెలల వెంటా
అడుగులు తడబడా వెదుకుతు
నడచిపోయిందీ

అడవి మెకములు తిరుగులాడే
ఎడము లేనీ అడుగులొప్పే
అడవిలోపలి కోనలెల్లా
తడివి చూసిందీ

ఎచట పోయీ వెదకిననూ
ఎందులేదూ కోకిలమ్మా
ఎచ్చటుందో తల్లిగుండే
వ్రచ్చిపోయిందీ

ఒక్క సెలయేట్లోకీ వేరూ
మిక్కిలీ పోయినా ముషిణి
ప్రక్క చెట్టూ క్రింద కూర్చుని
స్రుక్కిపోయిందీ

తల్లివెనకా యింతసేపూ
మెల్లగా వస్తోంది కోకిల
తల్లి బాధ కళ్ళచూసీ
గొల్లుమన్నాదీ

ఉరుములా వురిమింది కోకిలా
మెరుపులా మెరిసింది కోకిల
వొక్కగంతున తల్లివొళ్ళో
వచ్చిపడ్డాదీ

తల్లిబిడ్డను బిడ్డ దల్లిని
కళ్ళుమూసుకు కౌగిలించీ
ఒళ్ళు తెలియక చెట్టు మొదటా
ఒరిగిపోయారూ

తల్లిబిడ్డల ప్రేమ అంటే
యిల్లాగు వుండాలంటూ
ప్రకృతిదేవీ వొళ్ళు తెలియక
పాట ఫాడిందీ

ఎప్పుడూ గిలకల్లె అడవిలో
ఎచట చూస్తే అచటవుండే
చిన్నకోకిల లేక అడవీ
చిన్నవోయిందీ

కోకిలమ్మా తిరుగులాడని
కోకిలమ్మా లేని అడవీ
కోనలకు తొలు కారుటందం
కొరతపడ్డాదీ

తల్లి అంటే అంతప్రేమా
వెళ్ళ గక్కిన కోకిలమ్మకు
చావు లేదని మావిచివురూ
సాగులాడిందీ

తల్లి అంటే అంతప్రేమా
వెళ్ళగ్రక్కిన కోకిలమ్మా
మునిగిపోదని అడవివూటా
ముర్మురించిందీ

తల్లి అంటే అంతప్రేమా
వెళ్ళ గ్రక్కిన కోకిలమ్మా
బ్రతికి వస్తుందంచు అడవీ
పాట పాడిందీ

వానలన్నీ వెనుకపట్టీ
కోనలన్నీ నీరుపట్టీ
ఆకురాలే కారుకూడా
ఆగిపోయిందీ

చిన్న మొగమున కుంకుమిడినా
కన్నె పేరంటాలి మల్లే
చెలువుగా అడివంత క్రొత్తగా
చివురు తొడిగిందీ

ఎక్కడో అడవిలో చివరా
చక్కగా సన్నగా యేదో
చిక్కనైనా తేనెపాటా
జీరు వారిందీ

ఆపాట వింటూనె అడివీ
అడివిగా నిలువెల్ల, పోయిన
వొక్కచుట్టం వచ్చినట్లూ
వులికిపడ్డాదీ

సన్నగా పోతున్నవూటా
జాలు జాలింతై వెడల్పై
పట్టలేకా ఓర్పు జలజల
పరువులెత్తిందీ

కోకిలమ్మా అదుగో మళ్ళీ
కూసెనంటె వచ్చెనానీ
వచ్చెనంటే వచ్చెనానీ
బ్రతికెనంటే బ్రతికెనానీ

చెన్నుతరగని మావిమోకా
చివురు తొడిగిందీ
అంతలోపల అడవి కందం
అతిశయించిందీ

అంతలో పూవుల్ల ఱేడు
వింతవింతల సోకు లేలిక
చెక్కులా నవ్వులూ చిలుకుతు
చేరవచ్చాడూ

ఏడాది కొకసారి వస్తా
డేడాది కొకసారి తెస్తా
డెన్ని పువ్వులు, అతనివేనూ
వన్నెలూ చిన్నెల్

వచ్చావటయ్యా పూలఱేడా
తెచ్చావటయ్యా పూలరాజా
నీవు తెచ్చిన పూవులే కా
నికల కిస్తామూ

కోకిలమ్మనూ ముద్దుపెళ్లీ
కూతురును చేస్తాము, పెళ్ళీ
కొడుకును చేస్తాము నీకూ
కూర్చివేస్తామూ

కోరి నీ అందానికీ మా
కోకిలమ్మా గొంతుకునకూ
సొగసుచేతా పాటచేతా
తగేపోయింది

రావయ్య ఓ పూలరాజా
రావయ్య ఓ అందగాడా
కోకిలమ్మకు నీవు, నీకూ
కోకిలా తగునూ

వారి పెళ్ళికి అడవి అంతా
తోరణాలైనాయి చివురులు
కాపలా కాసినై పూలులూ
గండశిలలందూ

సన్నాయి పాడింది తెల్లని
సన్నని సెలవూట పూలా
వెన్నెలై ప్రకృతి తల్లేమో
కన్ను తెరిచిందీ

పూలసోనలు కురిసినై, తే
నేలపాటలు విరిసినై, అం
దాల త్రోవలు వెలసినై, రాజ
నాలు పండినవి

చిలకతల్లి మహాన్వయంబున
నిలచినవి సాంస్కృతికవాక్కులు
కోకిలమ్మా తెనుగుపలుకూ
కూడబెట్టిందీ

Saturday, July 5, 2008

మధుర గాయని శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి ...

ఈ వారం ఆపాతమధురాలు కార్యక్రమంలో మధుర గాయని శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారి గురించి కొద్దిపాటి విశేషాలు, ఆవిడ పాడిన కొన్ని మధురగీతాలు...

http://www.radio.maganti.org/

ఆ పాత మధురాలు! రేడియో కార్యక్రమం

ప్రతి శనివారం శాక్రమెంటో 88.7 కేబుల్ ఎఫ్.ఎంలో ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు ప్రసారమయ్యే అచ్చతెనుగు రేడియో కార్యక్రమం మీ కోసం

Wednesday, July 2, 2008

1940 - 50 ప్రాంతాల్లో "ఆంధ్ర తారల" తీరులు

ఆంధ్ర తారల తీరులు గురించి శ్రీ జీ.వీ.పున్నయ్య అనే ఆయన, ఏదో సినిమా పత్రికలో 1940 - 50 ప్రాంతాల్లో రాసిన రాతలు ఇవి అని మా నాన్నగారి పాత డైరీలో ఉంది...ఇతర వివరాలు తీరిగ్గా కనుక్కోవాలి...అందాకా....


నేనే రాణిని
నేనే వాణిని
నేనే ప్రొడ్యూసర్
నేనే డైరెక్టర్
నేనే క్రిటిక్కు
నేనే సర్వము
నేనే యనెడు
ఎన్న రాణిగల్
ఎంగ యిరుకుదు?
బఱ్ఱె తోలుదౌ
కిఱ్ఱు పాదుకల
పల్లెజనములే
పట్టిరికరమున
కన్నమ్మా !అల్లసానికవి
అంకసీమన
అల్లార్ముద్దుగ
నాలాపించి -
ముక్కు తిమ్మన
ముద్దు పల్కుల -
ఆది కవీంద్రుల
అమరవాగ్ఝరిచె
హారతులందిన
తెలుగు భాషనే
తీసి కట్టని
ధనమాసించి
తమిళపటంబుల
తై తక్క లాడగ
తగునా కన్నమ్మా"ఎన్నసామి?
రొంబ సంబర,"
త్యాగరాజుదా
తమిళవాడుదా?
తెలుగు వాడుదా?
తెలియ జెప్పుమీ
తెల్లముగాను
అరవలనోట
ఆంధ్రంబుంచిన
అపరాధమయా
నాగ అయ్యరా?
పోతన యందున
పుణ్యమూర్తివై
తెలుగుమాతలౌ
తియ్యనిదుగ్దము
కంఠము వరకు
గడగడ ద్రావి
తక్కెడ యందున
తమిళ పటంబుల
నొక్కట నన్నిటి
అరవ సాంబరు
ఆరగింపగ
గూడకట్టురా
ముళ్ళనుబోలీ
ఓహో పోతివ
దొంగకృష్ణునిగ?నొనరగ నునిచీ
పోతన నొక్కెడ
పొలుపుగ నుంచీ
తూయించుమనీ
తులా భారమున
తెలుగు తమిళముల
తీరులు తెలియుబంగరు మాలా!
బాగున్నావా?
మాలపిల్లలో
మధురభాషివై
మళ్ళీ పెళ్ళిలో
మదనుని రేపి
బాలనాగు నడ
వాసన్ బందిలొ
అల్లాడెడు నీ
అవస్థగాంచియు
అనదలవోలె
అంగలార్చెడు
ఆంధ్రులమమ్మాదేవతయందున
దేదీప్యమ్ముగ
తేజరిల్లిన
దిట్ట కుమారీ
డంకన్ టాండన్
దర్శక బాబులు
దద్దమ్మనుగా
దిద్ది చూపిరి
తవమణి దేవి
ధగద్ధగిత
నగ్న చిందుల
వాల్మీకి యందున
వహ్వారే వహ్వారె!బొందితో స్వర్గము
బొందెడి స్వర్గము
పుడమి జనులకు
పొలుపుగ జూపే
పూవుల వల్లీ !
ఇందు బాలకా
నందము గూర్పగ
బొంద బాలుని
డెందము గుందగ
అందము దక్కి
చిందులు వేయుచు
అరవ పటంబుల
నాడు చుంటివా?
ఆంధ్రమె మరచీ
ధనమాసించి
తమిళము నేర్చి
చచ్చు పటంబుల
జొచ్చి నటించుట
తెలుగు తారలకు
తెగులీ నాటను -
అభిమానంబిది
అగ్గిని గలియ
నున్నానొక్కటె
యూడిన నొకటేతెలుగు తారలను
తీరని వంతల
గురిగా వించి
కులికే తమిళుల
కొలువాసించి -
తల్లి రొమ్మునే
తన్నే నటకులు
ఆంధ్రావనిలో
నసంఖ్యాకులుఆంధ్రమాతనే
యాదరించిన
నమరత్వంబది
యబ్బుట నిజము