Saturday, May 24, 2008

గాంధీ గారి ముత్తైదుతనం కంటే నెహ్రూగారి వెధవతనమే బాగున్నట్టుందండీ!

1964 లో ప్రచురించబడ్డ "ఆంధ్ర రత్న గోపాలకృష్ణుని చాటువులు" అనే పుస్తకం దుమ్ము దులపటానికి కుదిరింది నిన్న రాత్రి...అందులోని కొన్ని మణిమాణిక్యాలు...
*********************************
ఆంధ్ర నాయకుల మీద "ఆంధ్ర రత్న" గోపాలకృష్ణ గారి పద్యం ఒకటి...

సీ. కొండెంకటప్పన్న గుండుసున్నగదన్న
గోపాలకిట్టాయి కొక్కిరాయి
టంగుటూరు ప్రకాశ మింగిలీషుపిశాచి
నాగేశ్వరుడు వట్టి నాగజెముడు
పట్టాబిసీతన్న తుట్టెపురుగుగదన్న
ఉన్నవ లచ్చుమన్న దున్నపోతు
గొల్లపూడ్సతన్న కళ్ళులేనికబోది
బులుసు సాంబడు వట్టి పుట్టుకుంక
అయ్యదేవరవాడు పెయ్యనాకుడుగాడు
అయ్యంకి రమణయ్య దయ్యమయ్య
డాక్టర్ సుబర్మణ్య మాక్టింగ్ ఫులిష్టాపు
దువ్వూరి సుబ్బమ్మ దృష్టిబొమ్మ

అనుచు బల్కుదు రాంధ్రుల నవనియందు
గాంధిశ్రేష్ఠునిమతములో గలసినపుడు
తపములేనిదె యెన్న రే నెపములెల్ల
రామనగరీ నరేంద్ర! శ్రీరామచంద్ర!

**********************************
అలాగే 1925 బందరు ఆంధ్ర రాష్ట్రీయ మహాసభలను గురించి

బడాయికోర్లన్న, కాంగ్రెసు
బడాయికోర్లన్న
బందరులోన సందడిచేసిరి

విందులు చిందులు తందనాలతో
వందలకొలదిగ సందడిచేసిరి

పొట్టమాటలను చాటుధారలను
వోటుకు, రైటుకు లోటుపడక బహు
బూటకములతో, నాటకములతో
ప్లాటుఫారమున ఘాటుగ వాగిరి
********************************
అదే పుస్తకంలో హాస్య చెణుకులు కొన్ని

౧)గుంటూరు కాంగ్రెస్ ఆఫీసుకు గోపాలకృష్ణయ్య గారు వెళ్ళగా గొల్లపూడి సీతారామశాస్త్రి గారు ఖద్దర్ బోర్డు లెఖ్ఖలు చూస్తుంటే, ఆయన అన్న మాట ఇది - "ఏం చేస్తున్నారు ? శాస్తుర్లుగారూ! తారీఖులు కూడుతున్నారా ఏమిటీ?"
********************************
౨)1924లో కాంగ్రెస్ లో "స్వరాజ్య పార్టీ", "నో చేంజి" పార్టీలని రెండు పార్టీలుండేవి. మన గోపాలకృష్ణయ్యగారేమో కొంతవరకు స్వరాజ్య పార్టీ అభిమాని. రెండో పార్టీని "మారని పార్టీ" అని చమత్కరించేవారుట. ఈ రెండు పార్టీల్లో ఏది మంచిదండీ? అని ఒకాయన అడిగితే "గాంధీ గారి ముత్తైదుతనం కంటే నెహ్రూగారి వెధవతనమే బాగున్నట్టుందండీ" అని సమాధానం ఇచ్చారుట. ఆ రోజుల్లో గాంధీగారి అభిమానం నోచేంజి పార్టీకి ఉండేదని వినికిడి... :)

2 comments:

  1. హా హా హా అదిరింది వంశీగారు,గాంధీగారిని పేదరికం లో ఉంచటానికి కాంగ్రెస్ పార్టీకి ఎంత ఖర్చౌతుందో అని సరోజిని నాయుడు వ్యాఖానించిన సంగతి గుర్తొచ్చింది.తరచూ ఇలా ప్రముఖుల చమక్కులను మాకందించగలరు

    ReplyDelete
  2. స్వరాజ్య, నో చేంజ్ పార్టీలా? మొదటిసారి వింటున్నాను. దీనిగురించి మరింత వివరంగా ఎక్కడ తెలుసుకోవచ్చో(లింకు వగైరా) చెప్పగలరు.

    ReplyDelete