Friday, June 6, 2008

చిన్నపిల్లలు ఇళ్ళల్లో పాఠాలు బట్టీపట్టే విధానాన్ని ఇలా....

ముళ్లపూడి వెంకటరమణ గారి ఋణానందలహరిలో "అప్పడి కథ"లో - చిన్నపిల్లలు ఇళ్ళల్లో పాఠాలు బట్టీపట్టే విధానాన్ని ఇలా వివరిస్తారు..

"పూర్వము అప్పడని ఒక్కడుండెనూ. ఇద్దరు ఉండుటకు వీలులేకనే వక్కడు వుండెనూ. వానికి డబ్బుగల స్నేహితుడూ గలడు. అందువల్ల డబ్బు లేదూ. అందు స్నేహితుడు అప్పడికి మొహమాటంచే ప్రతి దినమూ ఒక వరహా బదులు ఇచ్చుచుండెనూ. ఇట్లుండగా ఒక దినమున అప్పడు ఇట్లాలోచించెనూ. వీడు నాకు రోజురోజూ వడ్డీ వరహా ఇస్తూ ఉన్నాడుగదా, వక్కసారే వంద ఎందుకు అడగరాదూ, వీడు ఇవ్వరాదూ. ఇట్లా యోచించి అట్లా అప్పుడు మిత్రుడని ఒకరోజున వక్కసారిగా వంద వరహాలు అడిగెనూ. వాడు వెంటనే నా వద్ద అంత డబ్బు లేదు గదా, ఏమి చేయుదునూ అని యోచించి, ఓరి అప్పుడూ, నా వద్ద లేదు అని చెప్పివేసెనూ. మొహమాటమూ పోయింది గావున మరునాడు ఒక వరహా కూడా యివ్వలేదూ..."

చిన్నపిల్లలు బిగ్గరగా చదువుతున్నప్పుడు వాక్యాంతాలను దీర్ఘాంతాలుగా పలకడం సహజం. విషయంతో సంబంధం లేకుండా కేవలం చదివే తీరును రమణ గారు రాయటం ఇందులో విశేషం...

ఆయన రాసిందే ఇంకో రచన - రాజకీయ భేతాళ పంచ వింశతి , నీతి సిగ్గూ లజ్జా లేని మన రాజకీయ నాయకుల మీద విదిలిచిన కొరడా. అందులో "చేప కథ" ఇలా సాగుతుంది

ఒక మంత్రి గారు భోజనం చేస్తున్నప్పుడు ఒక ఎండని చేప వస్తుంది. మిగతావన్నీ ఎండినప్పుడు దీనికేం రోగం? ఇదేం అసెంబ్లీ అనుకుందా? మునిసిపల్ కవున్సిల్ అనుకుందా? ఇండిపెండెంటు మెంబరుని అనుకుందా? అని కోపంతో ఆ మంత్రిగారు ఎంక్వైరీ కమీషనరుగా తనని తానే నియమించుకుని విచారణకు ఉద్యమించాడు
చేపా చేపా ఎందుకు ఎండలేదు?గడ్డిదుబ్బు అడ్డమొచ్చిందిట్రాక్టర్ మిషన్ వాడు ! ట్రాక్టర్ మిషన్ వాడ గడ్దిదుబ్బు నెందుకు కొట్టలేదు?కామందు చెప్పలేదు. ఆయన తన కొడుకుని ఇక్కడికి బదిలీ చేయించుకోవాలి అని చూస్తున్నాడు...

ఇలా విచారణ తిరిగి తిరిగి, ఎక్కడెక్కడో నడిచి తీగలాగితే డొంక కదిలినట్టు చివరికి తనకే ఎసరు వచ్చే పరిస్థితి వచ్చి ఫైలు మూసెయ్యాలి అని చూస్తాడు..కానీ అప్పటికే ఆ వార్త పత్రికలకెక్కిపోవడం వల్ల ప్రతిపక్షాల వాళ్ళు నివేదిక అడుగుతారు. అందుకు విరుగుడుగా మళ్ళీ ఒక సంఘం - ఈ సారి ప్రముఖులతో కూడింది ఏర్పడుతుంది. ఈ సంఘం వాళ్ళంతా చాలా చాలా ఊర్లల్లో సమావేశాలు నిర్వహించి, చివరాఖరికి ఉదకమండలంలో సమావేశంలో పరివేస్ఠితులై ఉండగా, అప్పటికి మూడునెలల కాలం గడిచిపోవటం వల్ల ఆ చేప గబ్బు లేస్తుంది. అప్పుడు ఆ చివరాఖరి సమావేశంలో వాసన వస్తోంది కాబట్టి చెత్తబుట్టలో పారెయ్యండి అని సూచిస్తారు. దాంతో సమావేశం ముగియటం, ఫైలు ముయ్యటం తటస్థిస్తుంది..

1 comment:

  1. manchi post.. kaasepu haayigaa navvukunelaa chesindi. chepa endaka povataaniki koodaa commision ??!! :-)

    ReplyDelete