Saturday, May 24, 2008

గాంధీ గారి ముత్తైదుతనం కంటే నెహ్రూగారి వెధవతనమే బాగున్నట్టుందండీ!

1964 లో ప్రచురించబడ్డ "ఆంధ్ర రత్న గోపాలకృష్ణుని చాటువులు" అనే పుస్తకం దుమ్ము దులపటానికి కుదిరింది నిన్న రాత్రి...అందులోని కొన్ని మణిమాణిక్యాలు...
*********************************
ఆంధ్ర నాయకుల మీద "ఆంధ్ర రత్న" గోపాలకృష్ణ గారి పద్యం ఒకటి...

సీ. కొండెంకటప్పన్న గుండుసున్నగదన్న
గోపాలకిట్టాయి కొక్కిరాయి
టంగుటూరు ప్రకాశ మింగిలీషుపిశాచి
నాగేశ్వరుడు వట్టి నాగజెముడు
పట్టాబిసీతన్న తుట్టెపురుగుగదన్న
ఉన్నవ లచ్చుమన్న దున్నపోతు
గొల్లపూడ్సతన్న కళ్ళులేనికబోది
బులుసు సాంబడు వట్టి పుట్టుకుంక
అయ్యదేవరవాడు పెయ్యనాకుడుగాడు
అయ్యంకి రమణయ్య దయ్యమయ్య
డాక్టర్ సుబర్మణ్య మాక్టింగ్ ఫులిష్టాపు
దువ్వూరి సుబ్బమ్మ దృష్టిబొమ్మ

అనుచు బల్కుదు రాంధ్రుల నవనియందు
గాంధిశ్రేష్ఠునిమతములో గలసినపుడు
తపములేనిదె యెన్న రే నెపములెల్ల
రామనగరీ నరేంద్ర! శ్రీరామచంద్ర!

**********************************
అలాగే 1925 బందరు ఆంధ్ర రాష్ట్రీయ మహాసభలను గురించి

బడాయికోర్లన్న, కాంగ్రెసు
బడాయికోర్లన్న
బందరులోన సందడిచేసిరి

విందులు చిందులు తందనాలతో
వందలకొలదిగ సందడిచేసిరి

పొట్టమాటలను చాటుధారలను
వోటుకు, రైటుకు లోటుపడక బహు
బూటకములతో, నాటకములతో
ప్లాటుఫారమున ఘాటుగ వాగిరి
********************************
అదే పుస్తకంలో హాస్య చెణుకులు కొన్ని

౧)గుంటూరు కాంగ్రెస్ ఆఫీసుకు గోపాలకృష్ణయ్య గారు వెళ్ళగా గొల్లపూడి సీతారామశాస్త్రి గారు ఖద్దర్ బోర్డు లెఖ్ఖలు చూస్తుంటే, ఆయన అన్న మాట ఇది - "ఏం చేస్తున్నారు ? శాస్తుర్లుగారూ! తారీఖులు కూడుతున్నారా ఏమిటీ?"
********************************
౨)1924లో కాంగ్రెస్ లో "స్వరాజ్య పార్టీ", "నో చేంజి" పార్టీలని రెండు పార్టీలుండేవి. మన గోపాలకృష్ణయ్యగారేమో కొంతవరకు స్వరాజ్య పార్టీ అభిమాని. రెండో పార్టీని "మారని పార్టీ" అని చమత్కరించేవారుట. ఈ రెండు పార్టీల్లో ఏది మంచిదండీ? అని ఒకాయన అడిగితే "గాంధీ గారి ముత్తైదుతనం కంటే నెహ్రూగారి వెధవతనమే బాగున్నట్టుందండీ" అని సమాధానం ఇచ్చారుట. ఆ రోజుల్లో గాంధీగారి అభిమానం నోచేంజి పార్టీకి ఉండేదని వినికిడి... :)

Wednesday, May 21, 2008

జీవితంలో ఒక్కసారయినా కావాలని కోరుకునే పదార్థం ...

"సక్సెస్" - అదేనండీ.... అందరూ జీవితంలో ఒక్కసారయినా కావాలని కోరుకునే పదార్థం - ఇదిగో ఇలా ఉంటుంది ... బొమ్మను నొక్కితే .....బాఘా....... కనపడుతుంది మరిFriday, May 16, 2008

"భారతీయ సినిమాల్లో స్త్రీ" - ఒక మంచి పుస్తకం ఇక్కడ చదువుకోండి

"భారతీయ సినిమాల్లో స్త్రీ" - ఒక మంచి పుస్తకం ఇక్కడ చదువుకోండి

http://www.maganti.org/page5.html

ఈ పుటలో ఈ తరం రచయితలు, వారి రచనలు HEADING క్రింద ఉన్న "వారాల ఆనంద్" మీటను నొక్కండి

లేదా ఇక్కడ చూడండి

http://www.maganti.org/rachayitalu/varala/varalaindex.html

విధేయుడు
వంశీ

Monday, May 12, 2008

కర్ణాటక సంగీతం - మూడవ పాఠం (అలంకారములు) వీడియో

శ్రీమతి చర్ల రత్నకుమారి గారి కర్ణాటక సంగీతం మూడవ పాఠం (అలంకారములు) వీడియో ఇక్కడ.

http://www.maganti.org/mukhamukhiindex.html

అవకాశం ఇచ్చినందుకు ఆవిడకు పాదాభివందనాలతో

విధేయుడు

వంశీ

Sunday, May 11, 2008

మళ్లీ పాడిందే పాటరా ....తాపీ ధర్మారావు గారి గురించి


మళ్లీ పాడిందే పాటరా ...."తాపీ ధర్మారావు గారి గురించి తెలియని తెలుగువారు ఉన్నారంటే ...ఇక చెప్పేదేమీలేదు....ఈ చిత్రరాజాన్ని పంపించిన మిత్రుడు శ్రీనివాస్ కి ధన్యవాదాలు...దీని కాపీరైటు సంగతి సందిగ్ధంలో ఉన్నది...ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియచెయ్యండి...ఇలా ప్రచురించటం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియచేస్తూ ఈ బ్లాగునుండి తొలగిస్తాను...

సురభి నాటక సమాజ నిర్మాత
సురభి నాటక సమాజ నిర్మాత అయిన వనారస గోవిందరావు గారి గురించి తెలియని తెలుగువారు ఉన్నారంటే ...ఇక చెప్పేదేమీలేదు....ఈ చిత్రరాజాన్ని పంపించిన మిత్రుడు శ్రీనివాస్ కి ధన్యవాదాలు...దీని కాపీరైటు సంగతి సందిగ్ధంలో ఉన్నది...ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియచెయ్యండి...ఇలా ప్రచురించటం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియచేస్తూ ఈ బ్లాగునుండి తొలగిస్తాను...

స్థానం నరసింహారావు గారుస్థానం నరసింహారావు గారుఈయన గురించి తెలియని తెలుగువారు ఉన్నారంటే ...ఇక చెప్పేదేమీలేదు....ఈ చిత్రరాజాన్ని పంపించిన మిత్రుడు శ్రీనివాస్ కి ధన్యవాదాలు...దీని కాపీరైటు సంగతి సందిగ్ధంలో ఉన్నది...ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియచెయ్యండి...ఇలా ప్రచురించటం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియచేస్తూ ఈ బ్లాగునుండి తొలగిస్తాను...

Thursday, May 8, 2008

కరీం నగర్ ఫిల్మ్ సొసైటి అధ్యక్షులు, రచయిత శ్రీ వారాల ఆనంద్ గారి రచన

కరీం నగర్లోని హనుమాన్ నగర్ వాస్తవ్యులయిన మిత్రులు శ్రీ వారాల ఆనంద్ గారి రచన "మానేరు తీరం"ని మీ ముందుకు తీసుకునిరావటానికి అవకాశం లభించినందుకు ఆనందిస్తూ, ముందుగా వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

ఆనంద్ గారు కరీం నగర్ ఫిల్మ్ సొసైటి అధ్యక్షులు. ప్రముఖ రచయిత. తెలుగు లో ఎం.ఏ చేసి, లైబ్రరీ సైన్సులో ఎం.ఫిల్ పట్టా పుచ్చుకున్న ఆనంద్ గారు శాతవాహన సెంటర్ ఫర్ కరీం నగర్ లిటరేచర్, కల్చర్ అండ్ హిస్టరీ స్థాపించి అందులో వందలు వేలాది పుస్తకాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

చాలా కాలంగా తెలిసిన మిత్రులే అయినా, ఆయన మితభాషి అవ్వటం వల్ల, ప్రచారం ఇష్టం లేకపోవటం వల్ల - ఆయన వెంబడి పడుతున్నా కూడా కుదరనిది, మొత్తానికి సాధించా......ఆయన సాయంతో కరీం నగర్ ప్రాంత ఇతర రచయితల పుస్తకాలు కూడా మీ ముందుకు త్వరలో ...

Wednesday, May 7, 2008

పెండ్యాల నాగేశ్వరరావు గారి చిత్రాన్ని చూసే భాగ్యం!
పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతాన్ని చెవులు కోసేసుకు వినటమే కానీ, ఆయన యవ్వనంలో ఎలా ఉండి ఉంటారో అన్న "ఇది" తీరలేదు..ఈరోజుతో ఆ "ఇది"కి "అది" లభించింది...ఆ మహానుభావుడి యవ్వనంలోని చిత్రాన్ని చూసే భాగ్యం ఈ వేళ ఆప్తమిత్రుడు రాగంపేట శ్రీనివాస్ వల్ల కలిగింది.... ఓల్డ్ తెలుగుసాంగ్స్ సైటులో ఆయన వృద్ధ్యాప్యం లోని చిత్రం ఉన్నది

Tuesday, May 6, 2008

వేంకట పార్వతీశ్వర కవులు 1910 లో "నాటకములు" మీద రాసిన పద్యం

వేంకట పార్వతీశ్వర కవులు 1910 లో "నాటకములు" మీద రాసిన పద్యం

సీ. జనదురాచార హింస్రాజంతుమారణ
క్రీడాసముత్సుకా ఖేటకములు
ధర్మాదిపూరుషార్థచతుష్టయాసూచి
కమనీయవిమల శృంగాటకములు
శృంగారహాస్య విశేషరసాపాది
చిత్రవిదూషక చేటకములు
దుర్వాదదుర్మత దుర్నీతిబోధక
విమతసంతానచపేటకములు
ఛాందసాచార దుర్గ్రహోచ్చాటకములు
పాటితాజ్ఞానదుర్విష కీటకములు
అభ్యుపేతసమున్నత హాటకములు
నవనవోద్ఘాటకమ్ములు నాటకములు

Monday, May 5, 2008

థూబొడ్డు ...

మన తెలుగుజాతి గర్వించదగ్గ మహానుభావుడు శ్రీ నేదునూరి గంగాధరంగారు వ్రాసిన "సెలయేరు" అనే పుస్తకము నుండి ఈ గోడీబిళ్ళ పాట చూడండి

గోడీ బిళ్ళ గోటీబిళ్ళ కానుబిళ్ళ కంచాబిళ్ళ
మానుబిళ్ళ మక్కేబిళ్ళ సానుబిళ్ళ చక్కనిబిళ్ళ
కోనుపెట్టి గూనుపెట్టి సాచిపెట్టి గోచిపెట్టి
అంగట్లో ఆమట్లో కఱ్ఱతో కొల్చి బుఱ్ఱతో గుణించి
వద్దంటే కద్దంటే సాటి తగవులతో గోటు తీర్పులతో
కుంటిమంది సొంటిపిక్క చాలలేని టెంకాయ
ఓనమాలు కాక్కాలు ఓడిన దొంగ వాటిమీద కొంగ
కూతెట్టిపోయి లాలా అర్ధా
లాక్కురా మిడక్కురా గూటీబిళ్ళ థూబొడ్డు

ఊగు ఊగు గంగెద్దా ...

ఊగు ఊగు గంగెద్దా
ఉగ్గు పాలే గంగెద్దా
సోలి ఊగే గంగెద్దా
సోలెడు పాలే గంగెద్దా
తాళి ఊగే గంగెద్దా
తవ్వెడు పాలే గంగెద్దా
మారీ ఊగే గంగెద్దా
మానెడు పాలే గంగెద్దా
ఆగీ ఊగే గంగెద్దా
అడ్డెడు పాలే గంగెద్దా
కూర్చో కూర్చో గంగెద్దా
కడివెడు పాలే గంగెద్దా
ఆడీ పాడే గంగెద్దా
అర్ధశేరు పాలే గంగెద్దా

నాగీ నాగీ నల్లేరు

అనంతపురం జిల్లాలోని ఒక గేలిపాట

నాగీ నాగీ నల్లేరు
నాగిని పట్టుకు తన్నేరు
ఈదులు ఈదులు తిప్పేరు
ఈత గందం పూసేరు
గాది కింద ఏసేరు
గంజి మెతుకులు బెట్టేరు
మూల ఇంట్లో మూసేరు
ముంత పొగలు ఏసేరు
పరమటింట్లో ఏసేరు
పక్కలిరుగ తొన్నేరు
గూబలు పట్టుక ఎత్తేరు
గుత్తికొండ చూపేరు

రెడ్డొచ్చె రెడ్డొచ్చె రెడ్డొచ్చె నమ్మా

శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్రము పుస్తకములో రెడ్డిరాజుల కాలం నాటి ప్రజాజీవితాన్ని వివరిస్తున్న ఒక మంచి జానపదం చూడండి

రెడ్డొచ్చె రెడ్డొచ్చె రెడ్డొచ్చె నమ్మా
వీరభద్రారెడ్డి విచ్చేసె నమ్మా
ప్రొద్దున్నె మారెడ్డి పొరకూడిపించు
నిలువెల్ల నడివీధి నీరు జల్లించు
సందుగొందులలోన సాన్పు పోయించి
చేకట్ల పసుపుకుంకుమలు పూయించు
రంగవల్లుల నూరు రాణింపజేయు
తోరణా పంక్తుల తులకింపజేయు
దివ్వెలను వెలిగించు దివ్యమార్గాలా
మాపెల్లి పాలించు మంచి మార్గాలా
ఎండలకు పందిళ్ళు వేయించుతాడూ
పొందుగా మారేళ్ళు పోయించుతాడూ
ఊరి బావులలోన ఉప్పు సున్నాలా
వెదజల్లు నేటేట నిండుపున్నానా రెడ్డొచ్చె

తువ్వాయి తువ్వాయి ఏమితువ్వాయి?

తువ్వాయి తువ్వాయి ఏమితువ్వాయి?
తువ్వాయి తువ్వాయి మంచి తువ్వాయి
తువ్వాయి మెడలోన ఏమివున్నాయి?
తువ్వాయి మెడలోన మువ్వలున్నాయి
తువ్వాయి కాళ్ళల్లో ఏమివున్నాయి?
తువ్వాయి కాళ్ళల్లోపరుగులున్నాయి
తువ్వాయి నోట్లోన ఏమివున్నాయి?
నోట్లోన తొలిపాల నురగలున్నాయి
తువ్వాయి తువ్వాయి ఎవ్వారి తువ్వాయి?
ఆవుగారి తువ్వాయి అసలు మాతువ్వాయి

చింతా దీక్షితులు గారి లక్కపిడతలు పుస్తకమునుండి తువ్వాయి గేయం

Saturday, May 3, 2008

విస్మృతికి గురైన ఈ చిలుకపాటను గుర్తుచేసుకుందాం

మన తత్త్వాలలో కావలసినంత వైరాగ్యం ఉంది. ఒకనాడు వీటిని వీధిలో పాడుతూ వచ్చేవారు. తాతలూ, బామ్మలూ పారాయణం చేసేవారు. ఈ "టెక్నాలజీ" యుగంలో వీటి ఊసే లేదు. ఈ తత్త్వాల వల్ల నిరాశ చెందమని కాదు - జీవిత పరమార్థం గ్రహించమని. జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు కాబట్టి మంచిపనులు వాయిదా వెయ్యకుండా గబగబా చెయ్యమని ప్రబోధించడమే అసలు రహస్యం. ఒకనాడు జనం పాటగా వుండి ఈనాడు విస్మృతికి గురైన ఈ చిలుకపాటను గుర్తుచేసుకుందాం

"ఎన్నాళ్ళు బతికినా కల్ల సంసారమిది
కనిపెట్టి తిరగవే చిలుకా
మూన్నాళ్ళ బ్రతుకు నీకు
మురిసేవు తుళ్ళేవు - ముందుగతికానవే చిలుకా!

కొడుకు వండినకూడు గూటికాకుల పాలు
దిక్కెవ్వరే నీకు చిలుకా!
వంటిమీదాగుడ్డ ఏటిచాకలిపాలు
దిక్కెవ్వరే రామచిలుకా!

నిన్ను పెంచినవారు నీళ్ళు మేతలుపెట్టి
తలుపడ్డమేసిరే చిలుకా!
తలుపుచాటున పిల్లి తా పొంచియున్నది
తప్పించుకో రామచిలుకా!

కట్టెలే బంధువులు నిప్పులే స్నేహితులు
కన్నతల్లెవ్వరో చిలుకా!
కాలయముడూ వచ్చి కూలబడి తంతేను
దిక్కెవ్వరే నీకు చిలుకా!

పచ్చని చేలకి వుచ్చులొడ్డున్నారు
తప్పించుకో రామచిలుకా
వుచ్చులో బడనేల వూపిరి పోనేల
పరనింద మనకేల చిలుకా!

ఆలుపిల్లలు నాది ఆస్తంత నాదని
చాలమోహించేవు చిలుకా!
ఇల్లు ఇల్లనియేవు యిల్లు నాదని యేవు
నీ ఇల్లు ఎక్కడే చిలుకా!

ఊరికుత్తరాన రెండు చెఱువులమధ్య
పారేసి వత్తురే చిలుకా!
మోసేరు నలుగురు వెంబడిని పదిమంది
కడకు తొలగొత్తురే చిలుకా!
కాలిపోయేదాక కావలుందురుకాని
వెంటనెవరూ రారు చిలుకా!

మావయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి "సాహిత్యకబుర్లు" నుండి