Monday, March 3, 2008

ఇదీ రాబోయే తెలుగు తరాల "కథా" భవిత !!

నిన్న రాత్రి ఒక తెలుగు వారింటికి వెళ్ళాల్సి వచ్చింది. సరే సాయంకాలపు మాటలూ గట్రా అయ్యాక రాత్రి తొమ్మిదిన్నరకు కామోలు భోజనాలు అయ్యాయి. భోజనాలు అయ్యాక, మళ్ళీ యధావిధిగా మాటామంతీ కార్యక్రమం నడుస్తోంది. వెళ్ళిన వారింటి వారికి ఒక మూడేళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాడిని సుమారు పదింటికల్లా రోజూ వాళ్ళమ్మ తెలుగు కథలు చెపుతూ పడుకోబెడుతుందిట, ఆ మాట విని చాలా సంతోషించాను నేను...సరే పిల్లవాడి నిద్రా సమయం మించిపోతోంది అని ఆవిడ వాడిని వాడి బెడ్రూం లోకి తీసుకుని వెళ్ళింది.. మా స్నేహితుడు కొద్దిసేపు మాటలు అవీ ఆపి, పైరేటెడ్ "జోధా అక్బర్" సినిమా డి.వీ.డీ ప్లేయర్లో పెట్టి సినిమా మొదలుపెట్టాడు...మిగిలిన జనాలు సినిమాలో లీనమయిపోయారు...

అయితే నా అదృష్టం ఏమిటి అంటే ఆ పిల్లవాడి బెడ్రూం తలుపు సరిగ్గా నేను కూర్చున్న సోఫాలాంటి కుర్చీ "రిక్లైనర్" కి ఆనుకుని ఉంది...మరి ఆవిడ తలుపు సరిగ్గా వెయ్యటం మర్చిపోయిందో ఏమో , ఆవిడ లోపల మాట్లాడే మాటలు అవీ నాకు వినపడుతూనే ఉన్నాయి..సభ్యత కాదని అనిపించినా , నాకు చిన్నపిల్లలకి కథలు చెప్పే అలవాటు ఉండటం వల్ల ఆవిడ పిల్లవాడికి కథ ఎలా చెపుతుందో అని లోపల చాలా ఇదిగా ఉండటం మూలాన ఒక చెవి ఆ కథలవైపు పడేసి ఉంచా...మొదటగా ఒక చిన్న కూనిరాగం "రామలాలీ మేఘ శ్యామ లాలీ" అని వినిపించింది...అహా పిల్లవాడు ఎంత అదృష్టవంతుడురా నాయనా, ఇలాంటి తల్లి ఉన్నందుకు అని అనుకున్నా...ఐదు నిముషాలు అయ్యింది..ఎంతసేపటికీ రామలాలీ మేఘశ్యామ లాలీ అనే వినపడుతోందే తప్ప రాముల వారి మేఘాల బండి ముందుకు కదలట్లా...మరి ఇరుసులు అరిగిపోయినాయో ఏమో తెలియదు, కొద్ది సేపటికి పాట ఆగిపోయింది...అయ్యో అనుకున్నా..ఇంతలో కథాసరిత్సాగరం మొదలు అయ్యింది -


ఎలా ? ఇలా ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా నా మదిలో రికార్డు అయిపోయింది...


"బుజ్జీ - మనం ఇవ్వాల ఏం కథ చెప్దాం? సరే ఇప్పుడు పిల్లి వస్తుంది, దాంతో పాటు కుక్క వస్తుంది...కుక్క వచ్చి ఏం చేస్తుంది? ఆం ఆం తినేస్తుంది...అప్పుడు ఏన్గు వస్తుంది, ఏన్గు వచ్చి ఏం చేస్తుంది? ఆం ఆం తినేస్తుంది...అప్పుడు పెద్ద ట్రక్కు వస్తుంది...ట్రక్కు ఏం చేస్తుంది? డుర్ర్ మని పోతుంది..అప్పుడు నాన్న ఎక్కడికి వెళ్తుంది ? నాన్న ఆఫిస్కి వెళ్తుంది..నాన్న వచ్చాక నువ్వు ఎక్కడికి ఎళ్తావు ? సన్ రైజ్ మాల్ కి వెళ్తావు కదా...బుజ్జి కన్న..బుజ్జి కన్న...మ్మ్ చ్హ్...మ్మ్ చ్చ్ (ముద్దులు)...అప్పుడు అక్కడికి ఏం వస్తుంది ? శాండీ కుక్క వస్తుంది...అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆం ఆం అని పాలు తాగేస్తావు కదా...బుజ్జి కన్న..బుజ్జి కన్న...మ్మ్ చ్హ్...మ్మ్ చ్చ్ (మళ్ళీ ముద్దులు)...తర్వాత నువ్వు ఏం చేసావు? ఊమ్మ్...ఎ బి సి డి చెప్పేస్తావు కదా, తర్వాత ఏం చెప్తావు ? ఊమ్మ్...నువ్వు సాయంతం మెయిల్ తెస్తావు కదా ? ఎలా వెళ్తావు? హహహ...బుజ్జి కన్న..బుజ్జి కన్న...మ్మ్ చ్హ్...మ్మ్ చ్చ్ (మళ్ళీ ముద్దులు)...పాంట్ వేస్కుని వెళ్తావు కదా..." అని ఇక్కడితో సరిత్సాగరం అయిపోయి మళ్ళీ "రామలాలీ" మొదలు అయ్యింది...

ఈ లోపల నా నెత్తి మీద ఉన్న సెంట్రల్ హీటర్ తిరగటం మొదలు అయ్యి, ఆ పీడన శక్తి వల్ల నాజూగ్గా వేసి ఉన్న తలుపు ఠప్పున మూసుకుంది..


సరిగ్గా ఒక నాలుగు నిముషాల తర్వాత ఆవిడ బయటకు వచ్చి - "అమ్మయ్య ఇవ్వాళ్టికో పని అయ్యింది" అని ఒక పేద్ద నవ్వు నవ్వింది..."మీరు మీ వాడికి రోజూ కథ చెపుతారటగా, చాలా మంచి అలవాటు అది" అని నేను కూడా నవ్వి ఊరుకున్నా... మరి ఆ పిల్లవాడు ఈవిడ చెప్పే కథలకు శోష వచ్చి పడుకుంటున్నాడో, ఆనందించి పడుకుంటున్నాడో తెలీదు కానీ, నాకు మటుకు ఒకటి బాగా అర్థం అయ్యింది - ఈనాటి తెలుగు పిల్లలకు తల్లులు ఎలాంటి కథలు చెపుతున్నారో...


ఇలా పెరిగిన పిల్లలే రేపటి తెలుగు భవిత అని తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది.. :) ...(అదృష్టం అని పైన ఎందుకు అన్నానో మీకు ఈపాటికి తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నా)

8 comments:

 1. మీరు మరీ వ్యక్తిగత విషయాలు ఇలా బ్లాగుల్లో వ్రాసే ముందు కొద్దిగా ముమ్దూ వెనకా ఆలోచించాలనుకుంటాను :) పాపం ఆవిడ గారు చదివితే ఫీలవ్వరూ, అదీ కాక మిమ్మళ్ని ఎలా చూస్తారు చదివిన తరువాత నుండి ? ఏమైనా ఉంటే ఆమెతోనే చెపితే బాగుండేది. పాపం కథలు చెప్పాలని ఉన్నా కథలు రావేమో, ఏదైనా పుస్తకాలు సజెస్ట్ చేస్తే పొయేది కదా!

  ReplyDelete
 2. రామలాలి పాట అందరికీ రావాలి అని లేదు కదండి.ఏదో ఆవిడ ముచ్చట కొద్దీ ఆ ముక్కలయినా పాడారు.ఈ టపా నాకు కూడా అభ్యంతరకరం గానే తోస్తుంది.ఇలా చెప్పవలసి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను.

  ReplyDelete
 3. eerojullo andarki cars, buildings, lot of money kavali. Vati kosam enthina katsha padatharu. Kani mana samprdayam, mana snaskruthi daggara kocheeppatiki maku theleyadau antaru. Idi enthvariki samanjasam. Naa chinnappudu ma nayanamma enni kathalu cheppindo, eeni devidi patalu pali lalinchido. Kani, repu na pillilaki, ma amma gani, maa avidi kani okka pata & kadha kuda kacchitanga cheppaleru. veti viluva ippudu theliyak povacchu, mundi mundi muundu theluchstundi.

  ReplyDelete
 4. అప్పుడప్పుడే అన్నీ గమనించే చిన్న పాపలకి వారు రోజూ చేసే పనులు, ఆరోజంతా జరిగిన విషయాలు చెపితే వారు శ్రద్ద గా వింటూ అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారికి ఇది చాలా ఆసక్తి గా ఉంటుంది. అందువల్లే ఆవిడ అలా చెప్పి ఉంటారు.
  అంత చిన్న పాపలు కొత్త కొత్త కథలు వినటానికి అంత ఇష్టం చూపరు. ఒకే కథ రోజూ చెప్పమంటారు.
  ఎలాగైతేనేం నిద్ర కి ముందు అమ్మ తో కబుర్లాడి బజ్జునే ఆబుజ్జి గాడు అదృష్టవంతుడు.

  ReplyDelete
 5. రానారే గారన్నట్టు కొంచం వ్యక్తిగత విషయమైనా, నేనిది చదివి నవ్వుకోకుండా ఉండలేకపోయాను. మీఆవేదన సబబుగానే అనిపించింది.

  ReplyDelete
 6. @కిరణ్ - ఆవిడ మీద వ్యక్తిగత విమర్శ అని కాదు కాని, ఆ కథ విన్న తర్వాత నాకు కలిగిన "ఆనందాన్ని" ఎవరితో ఎలా పంచుకోవాలో తెలియక ఇక్కడ రాసా. ఒక సామాజిక దృక్పథంతో చూస్తే, క్రితం "జనరేషన్" దాకా మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయిన ఈ కథానందనం క్రమంగా ఎందుకు కనుమరుగు కావలసి వచ్చింది అనేది నా ఆశ్చర్యానికి కారణం..అలా అనుకుంటే ఇది ఒకటే కాదు ఇంకా ఎన్నో కనుమరుగు అయిపోతున్నాయి, అయిపోయినాయి అని అనవచ్చు..కానీ ఈ కథలు, పద్యాలు పిల్లకు చెప్పడం అనేది బాలల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడేది కాబట్టి, ఈ కథ విన్నాక ఇదే పంథా క్రమంగా చాప కింద నీరులా అందరికీ విస్తరిస్తుందేమో అని కొద్దిగా నాకు "ఆనందం" ఎక్కువ అయ్యింది. ఈ పాటికి విస్తరించకపోయుంటే నేను చాలా బాధ పడాల్సి ఉంటుంది. అందరికీ కథలు చెప్పడం రాకపోవచ్చు, అది ఖచ్చితంగా ఒప్పుకునే వాదనే. అయితే మనం చేతులు ఉపయోగించి అన్నం ఎలా తింటున్నామో, ఆ చేతుల్లాగే కథలు కూడా మన బాల్యంలో భాగాలే...మన భాగాలనే మనం ఉపయోగించకుండా, ఆ భాగాలను పనికిరానివాటిగా మారుస్తున్నామే, ఆ తియ్యని కథలను మర్చిపోయే పరిస్థితికి వస్తున్నామే అన్న ఆనందం ఇది. గోరుముద్దలు మనకు తినిపించి, కథలు చెప్పి మన బాల్యానికి ఒక రూపు తీసుకుని వచ్చిన అమ్మ,అమ్మమ్మలు, నానమ్మలు అందించిన వారసత్త్వాన్ని మనంతట మనమే మర్చిపోయామా, లేక తెలిసీ తవ్వి పాతర వేస్తున్నామా అనే ఆనందం ఇది.ఆవిడ ఎలా చూసినా, ఇలా నేను రాసినందుకు నా మీద ఎవరికి కోపం ఉన్నా ఫరవాలేదు - ఆ కథ విన్న రాత్రే నేను ఒక నిర్ణయం తీసేసుకున్నా - అది ఏమిటో, దాని ఆచరణ ఎప్పుడో ఏమిటో విపులంగా తర్వాత రాస్తా.

  @రాధిక - మీ అభ్యంతరం అభిలషణీయమే, కాదని నేను అనట్లేదు...మీరు ఇది చెప్పటానికి బాధపడనవసరం కూడా లేదు...ఎప్పుడయినా నిరభ్యంతరంగా, నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలను చెప్పవచ్చు. ఇక విషయానికి వస్తే రామలాలిమేఘ శ్యామ లాలీ అందరికీ రావాలి అని లేదు..అసలుగా ఆవిడ పాట మొదలు పెట్టినప్పుడు నేను పొందిన నిజమయిన ఆనందాన్ని మీకు తెలియచెప్పలేను. కాని ఆ ఆనందం కొద్ది నిముషాల్లోనే ఆవిరి అవటం జీర్ణించుకోలేక రాసాను. మీ ప్రశ్నకు సమాధానంగా మరొక టపా రాస్తాను అది చూసి మీ అభిప్రాయం తెలపండి.

  @రమ్య - మీరు చెప్పిన ఆ కోణంలో కూడా ఆలోచించి నేను రాసే తరువాతి టపా గురించి మీ అభిప్రాయం చెపితే సంతోషిస్తాను

  @లక్ష్మణ్, మురళి - ఇటు వైపు తొంగి చూసినందుకు ధన్యవాదాలు

  ReplyDelete
 7. "జోధా అక్బర్" అనే మాట వినేదాకా , మీరు మాఇంటికొచ్చారేమో అని భయపడ్డాను. మా ఇంట్లో హిందీ సినిమాలు ఆడవు కాబట్టి సరిపోయింది.
  చిన్నపిల్లలకి ఏమి అందిచలేకపోరున్నారో - ఈ తరం తల్లిదండ్రులు అర్ధంచేసుకోలెకపోతున్నారు. యాంత్రికయుగం ఇది.

  ReplyDelete
 8. ఊకదంపుడు గారూ - హహహ...ఆ కథ విని నేను అనుభవించిన "ఆనందాన్ని" (ఆవేదనని) మీ కామెంటు ఉఫ్ఫున ఊదేసింది...ధన్యవాదాలు...

  ReplyDelete