Monday, March 31, 2008

మిమ్మల్ని మీరు మహరాజుగా భావించుకోవాలి అనుకుంటే!

మహారాజులు - వారి పరివార సభ్యుల గురించి అయ్యలరాజు నారాయణామాత్యుల వారు తన హంసవింశతిలో ఎంత చక్కగా వివరించారో చూడండి. దాదాపు 72 వినియోగాలు ఉన్న వీరంతా ఉంటేనే కానీ ఆ పరివారాన్ని "రాజుగారి పరివారం" అని పిలవలేముట


"గురు మహాప్రధాన సామంత సేనాపతి ద్వారపాల కావసరిక ఘటికానిర్ధారక గణక లేఖక పౌరాణిక పురోహిత జ్యౌతిషిక కావ్యజ్ఞ విద్వజ్జన దేవతార్చక మాల్యాకారక పరిమళకారక గోష్ఠాధికార గజాధికా రాశ్వాధికార భాండారాధికార ధాన్యాదికా రాంగరక్షక సూత సూద భేతాళ మత తాంబూలిక తాళవృంతక నరవాహక చ్చాత్రిక చామరిక కళాచిక కరశారిక కారపాలిక పాదుకాదార నర్తక గాయక వైణిక శకునిక మాగధ వైతాళిక పరిహాసక కాంచుక క్షౌరక రజక సౌచిక చర్మకారక ముద్రాధికార పురపాలక వనపాలక నరవైద్య గజవై ద్యాశ్వవైద్య పశువైద్య భేరివాదక మురజవాదక రౌమక శిలాచ్చేదక కాంస్యకారక కుంభకారక చిత్రకారక వ్యవహారిక మృగయార్ధి పక్షిఘోషక పణిహారక రాయభార కోగ్రాణాధికార వేశ్యజనంబు లాదియైన డెబ్బది రెండు వినియోగంబుల వారు సేవింపనతండు వెలయుచుండు"

కాబట్టి ఎప్పుడయినా మిమ్మల్ని మీరు మహరాజుగా భావించుకోవాలి అనుకుంటే, ముందు మీకింత పరివారం ఉందో లేదో ఆలోచించుకుని తరువాత ఆ భావ వీచికలకు ఒక రూపం ఇవ్వండి

Saturday, March 29, 2008

ఆచార్య వేమూరి వేంకటేశ్వర రావు గారి ఇంటర్వ్యూ

ఆచార్య వేమూరి వేంకటేశ్వర రావు గారి ఇంటర్వ్యూ

http://www.maganti.org/mukhamukhiindex.html

విలువయిన సమయం వెచ్చించి, ఎన్నో సూచనలు , అనుభవాలు, అనుభూతులు పంచుకున్న శ్రీ వేంకటేశ్వరరావుగారికి పాదాభివందనాలర్పిస్తూ, మీరు కూడా ఆయన చేసే అత్యంత విలువయిన ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాలు పంచుకుని మీ వంతు సాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను.

If you are experiencing problems with the high resolution/high bandwidth interview, let me know and I will look into it

Thanks in advance for watching

Vamsi

Saturday, March 22, 2008

సాహిణమే "సాని" అయ్యిందా ?

సాహిణమే "సాని" అయ్యిందా ?


లకం"సాని", మేడ"సాని", అల్ల"సాని" , చల"సాని" - ఇలా ప్రముఖమయిన ఇంటి పేర్లు మనకి తెలిసినవే కదా...అయితే కొత్త సంగతి ఒకటి తెలిసింది..


సాహిణం అంటే జంతుసాల(అశ్వ, గజ) అని, ఈ సాహిణం అనే మాటే "సాని" అయ్యిందని ఈ మధ్య కాలిఫోర్నియాలో జరిగిన ఒకానొక సాహితీసభలో వినటం జరిగింది, ఇది నిజమేనా - లేక సానికి వేరే అర్ధం ఏమయినా ఉందా? పెద్దలు తెలుపగలరు..

చివరి చెణుకు ఏమిటి అంటే అల్లసాని వారికి రథ గజ తురగ సాలలు బోలెడు ఉండేవి అని, ఆయన తన వీరత్వాన్ని అసలు యుద్ధంలో కాకుండా, పదకవితల్లో చూపించారని వక్తగారు నొక్కి వక్కాణించారు

Friday, March 21, 2008

కరోడ్గిరి నాకా అనే పదానికి అర్ధం ఏమిటి ?

నిన్న నా వాహనానికి రోగం వచ్చి మూలుగుతూ ఉంటే, ఆఫీసుకి మా ఇంటి దగ్గరలోనే ఉన్న లైట్ రైల్ స్టేషన్ నుండి రైలెక్కి వెళ్ళా..సాయంత్రం పూట ఆఫీసునుండి తిరిగి వస్తున్నప్పుడు అదే ట్రెయిన్లో ఇద్దరు తెలంగాణా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు...సుమారు 60-65 యేళ్ళు ఉంటాయనుకుంటా ...నేను కూర్చున్న సీటుకి రెండు సీట్లవతల కూర్చున్నారు..

వాళ్ళల్లో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఒకాయన - "గా పోరడోళ్ళ అయ్య కరోడ్గిరి నాకా లో పంజేశెటోడు. అందుల మస్తు మతలబు జేశిండులే, కొడ్కుని ఇరగదీశుర్రు" అనటం వినపడింది...ఈ కరోడ్ గిరి నాకా / కరోడ్గిరి నాకా అనే పదానికి అర్ధం ఏమిటి ?

ఈ మాటన్న ఆయన్నే అడుగుదాం అంటే ఎగాదిగా చూస్తాడేమో అని ఒకవైపు, తెలంగాణాలో పెరిగి ఈ మాట కూడా తెలీలేదే అన్న అభిమానం ఒకవైపు కత్తులు తీసుకుని కొద్ది సేపు కదనరంగంలో కొట్టుకున్నాయి. చివరికి ఆయన్నే అడుగుదాము అని నిశ్చయయించుకునేలోపు నాకు "కరోడ్గిరి నాకా" ను వదిలి వాళ్ళు ఇద్దరూ చక్కా దిగిపోయారు..

"నాకా" అంటే ఆఫీసు అని తెలుసు కానీ - కరోడ్గిరి, కరోడ్ గిరి సంగతి తెలియాలి

Wednesday, March 19, 2008

పూర్తి పాఠం తెలిస్తే పూరించండి

జిడ్డు పంతులుకీ జిలేబి జాంగ్రీ
బడ్డు పంతులుకీ బాదంఖీరు
రొడ్డు పంతులుకీ రాణీవాసం
దుడ్డు పంతులుకీ దొరసానివేషం
దొడ్డు పంతులుకీ దద్ధోజనం
ఎడ్డి పంతులుకీ లడ్డు మిఠాయి
మడ్డి పంతులుకీ మసాలావడ
కడ్డి పంతులుకీ కందులపాకం

ఇలా కృష్ణా జిల్లాలో ఒక పిల్లల పాట ఉండేది...చిన్నప్పుడు ఎప్పుడో విన్న పాట ఇది..కొంచెమే గుర్తు ఉంది..ఎవరికయినా పూర్తి పాఠం తెలిస్తే పూరించండి

"కంచికి వెళ్ళి మంచివాడిని" పెళ్ళిచేసుకుందుకుట

రేడియో అక్కయ్య గారి పాట ఇంకోటి...ఈ పాట అందించిన మా చిన్నమ్మ (పిన్ని) శ్రీమతి లంక లలిత గారికి ధన్యవాదాలతో

ఏనుగట - ఏడు మూళ్ళ తొండమట
తననట, నేనట
పెళ్ళాడాలట
అయ్యో బతుకో బతుకు

ఒంకరటింకర ఒంటెట
పొడుగాటి గొంతట
తననట, నేనట
పెళ్ళాడాలట
అయ్యో బతుకో బతుకు

గుఱ్ఱమట
పళ్ళన్నీ తొఱ్ఱి అట
తననట, నేనట
పెళ్ళాడాలట
అయ్యో బతుకో బతుకు

కాకట కటిక నలుపట
కన్ను గుడ్డట
తననట, నేనట
పెళ్ళాడాలట
అయ్యో బతుకో బతుకు

అసలింతకీ ఈ పాట ఒక దోమ "కంచికి వెళ్ళి మంచివాడిని" పెళ్ళిచేసుకుందుకుట

హైదరాబాదు వస్తే నీకూ - అన్నీ కలిపీ పెడతాను

ఈ పాట అందించిన మా చిన్నమ్మ (పిన్ని) శ్రీమతి లంక లలిత గారికి ధన్యవాదాలతో...ఇది రేడియో అక్కయ్య గారి పాట అని తెలుస్తోంది..

మ్యావ్ మ్యావ్ పిల్లీ రారమ్మూ
పుస్ పుస్ పిల్లీ రారమ్మూ

గోలుకొండకు వస్తే నీకూ
పాలూ మీగడ పెడతాను
వరంగల్లుకు వస్తే నీకూ
కారప్పూసా పెడతాను

నల్లాగొండకు వస్తే నీకూ
చల్లా మజ్జిగ పోస్తానూ
ఖాజీపేటకు వస్తే నీకూ
కాజాలాడ్డూ పెడతాను

ఖమ్మమ్మెట్టుకు వస్తే నీకూ
కమ్మని బువ్వాపెడతానూ
హైదరాబాదు వస్తే నీకూ
అన్నీ కలిపీ పెడతాను

కాలం అవగాహన - డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ వ్యాసం

కాలం అవగాహన - 1

డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ వ్యాసం

ఇతర వ్యాసాల కోసం ఇక్కడ

http://www.maganti.org/vyasavaliindex.html

విధేయుడు
వంశీ

జీవపరిణామం - డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ వ్యాసం


ఇతర వ్యాసాల కోసం ఇక్కడ

http://www.maganti.org/vyasavaliindex.html

విధేయుడు

వంశీ

Tuesday, March 18, 2008

శ్రీ అబ్దుల్ కలాం గారు పాడిన "ఎందరో మహానుభావులు"...

శ్రీ అబ్దుల్ కలాం గారు పాడిన "ఎందరో మహానుభావులు"...

http://youtube.com/watch?v=zLXiNj94rx8

(vIDiyO lO 2.04 నిముషం దగ్గరినుంచి మొదలు )

ఆయన స్వరం కలిపిన "ఎందరో మహానుభావులు" అంటే బాగుంటుందేమో... ఆ పక్కనే రెండో భాగం, మూడో భాగం కూడ ఉన్నాయి..వాటిల్లో ఆయన ఎంత శ్రధ్ధగా, లీనమయిపోయి వింటున్నారో చూడండి, ముఖ్యంగా రెండో భాగంలో

Note:

శ్రీ జి.బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన త్యాగరాజుల వారి ఇదే కృతి ఇంతవరకు మళ్ళీ నాకు దొరకలేదు...ఆయన పాడిన ఈ కృతి తెలుగుబిజ్.నెట్ లో ఇంతకుముందు దొరికేది..చాలా మంది ఇదే కృతి పాడగా విన్నా కానీ - శ్రీ జి.బి.కె గాత్రంలో విన్న తరువాత, ఇంకెవరిదీ వినబుద్ధి కాలా... హైదరాబాదులో కూడా తెలిసిన వారి ద్వారా ప్రయత్నించాను కానీ, సఫలం కాలా...ఇక తిరుపతిలో కానీ, మద్రాసులో కానీ దొరుకుతుందేమో చూడాలి

Saturday, March 15, 2008

ఇది నిజమయిన తెలుగు వెన్నెలే

ఇది నిజమయిన తెలుగు వెన్నెలే

http://www.maganti.org/lalitasangitam/drbhattar/vennelavennela.pdf

నేలనవ్వుతోందా

http://www.maganti.org/lalitasangitam/drbhattar/nelanavvutonda.pdf

రింగు రింగు

http://www.maganti.org/lalitasangitam/drbhattar/ringuringu.pdf

అంతా ఒక్కటే

http://www.maganti.org/lalitasangitam/drbhattar/antaokkate.pdf

బంగారు బాల బాలికలం

http://www.maganti.org/lalitasangitam/drbhattar/bangarubalabalikalam.pdf

మనసాయెరా

http://www.maganti.org/lalitasangitam/drbhattar/manasayera.pdf

పడవ నడపవోయి


http://www.maganti.org/lalitasangitam/drbhattar/padavanadapavoyi.pdf


మిగిలిన లలిత సంగీతం పాటలు ఇక్కడ చూడవచ్చు


http://www.maganti.org/lalitasangitamindex.html

విధేయుడు
వంశీ

Thursday, March 13, 2008

ఇదో రకమయిన తెలుగు కీర్తి !

శ్రీ రాయప్రోలు వారి పద్యానికి పేరడీ

http://www.maganti.org/mukhamukhiindex.html

రాయప్రోలు లింకు నొక్కండి.

శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారి సౌజన్యంతో

విధేయుడు
వంశీ

Saturday, March 8, 2008

సహస్రనామావళి

విష్ణు, లలిత, శివ, రామ, గణపతి, సుబ్రహ్మణ్య సహస్రనామావళి ఇక్కడ

http://maganti.org/page9.html


సహస్రనామావళి

Friday, March 7, 2008

బుడుగో బుడుగో

బుడుగో బుడుగో


వానల్లు కురవాలి
వరిచేలు పండాలి
బుడుగో బుడుగో

వరిచేలు కొయ్యాలి
పాలేళ్ళు నూర్చాలి
బుడుగో బుడుగో

కావిళ్ళ తేవాలి
గాదెల్లో పోయాలి
బుడుగో బుడుగో

మా నాన్న తియ్యాలి
మా దాసికివ్వాలి
బుడుగో బుడుగో

మా దాసి దంపాలి
మాయమ్మ కివ్వాలి
బుడుగో బుడుగో

మా యమ్మ వండాలి
మా బొజ్జ నిండాలి
బుడుగో బుడుగో

మాటాడి తప్పవు మన్మధాకార....

పొగడ్త పాట


బంగారు, జలతారు రంగయిన పాగ
ముత్యాల పోగులు ముద్దుటుంగరము
చేతి కంకణబిరుదు చంద్రహారములు
నిలువుటంగీలును నీలాపు మణులు
గోమేధికాపుష్య గొలుసు రత్నములు
మాణిక్యకిరీట మహితప్రతాప
అయ్యవారికిచాలు ఐదువరహాలు
చిన్నవాళ్ళకుచాలు సిరిసెనగపప్పు
పిల్లవాళ్ళకుచాలు పప్పుబెల్లాలు

మాటాడి తప్పవు మన్మధాకార
సాటిలేరెవ్వరు సద్గుణాకార
సరసనీవచనములు జాజిపూతోట
వరసతో నీమాట వరహాలమూట
అసమానగుణధీర అంగజాకార


వసుధలో (ఇంటి పేరు) వారి వంశవిస్తార
గరిమ (తల్లి పేరు) గర్భసుకుమార
భళి భళీ (ఆసామి పేరు) భాగ్యదేవేంద్ర

తాతా తాతా తైతక్కలాట..

తాతా తాతా తైతక్కలాట
నువ్వుందేమో సామర్లకోట

కోట కింద బొమ్మలాట
కూచుందేమో కుర్చీపీట
పీట కింద బంగారు మూట

ఆ మూట నాకిస్తే
నీ మాట నే వింటా

Wednesday, March 5, 2008

ఇవి ఎద్దులా ? లేక ఇంకేమన్నానా

ఇవి ఎద్దులా ? లేక ఇంకేమన్నానా

http://www.builtreport.com/bovine.html

"బెల్జియన్ బ్లూ కాటిల్" అట

Monday, March 3, 2008

ఇదీ రాబోయే తెలుగు తరాల "కథా" భవిత !!

నిన్న రాత్రి ఒక తెలుగు వారింటికి వెళ్ళాల్సి వచ్చింది. సరే సాయంకాలపు మాటలూ గట్రా అయ్యాక రాత్రి తొమ్మిదిన్నరకు కామోలు భోజనాలు అయ్యాయి. భోజనాలు అయ్యాక, మళ్ళీ యధావిధిగా మాటామంతీ కార్యక్రమం నడుస్తోంది. వెళ్ళిన వారింటి వారికి ఒక మూడేళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాడిని సుమారు పదింటికల్లా రోజూ వాళ్ళమ్మ తెలుగు కథలు చెపుతూ పడుకోబెడుతుందిట, ఆ మాట విని చాలా సంతోషించాను నేను...సరే పిల్లవాడి నిద్రా సమయం మించిపోతోంది అని ఆవిడ వాడిని వాడి బెడ్రూం లోకి తీసుకుని వెళ్ళింది.. మా స్నేహితుడు కొద్దిసేపు మాటలు అవీ ఆపి, పైరేటెడ్ "జోధా అక్బర్" సినిమా డి.వీ.డీ ప్లేయర్లో పెట్టి సినిమా మొదలుపెట్టాడు...మిగిలిన జనాలు సినిమాలో లీనమయిపోయారు...

అయితే నా అదృష్టం ఏమిటి అంటే ఆ పిల్లవాడి బెడ్రూం తలుపు సరిగ్గా నేను కూర్చున్న సోఫాలాంటి కుర్చీ "రిక్లైనర్" కి ఆనుకుని ఉంది...మరి ఆవిడ తలుపు సరిగ్గా వెయ్యటం మర్చిపోయిందో ఏమో , ఆవిడ లోపల మాట్లాడే మాటలు అవీ నాకు వినపడుతూనే ఉన్నాయి..సభ్యత కాదని అనిపించినా , నాకు చిన్నపిల్లలకి కథలు చెప్పే అలవాటు ఉండటం వల్ల ఆవిడ పిల్లవాడికి కథ ఎలా చెపుతుందో అని లోపల చాలా ఇదిగా ఉండటం మూలాన ఒక చెవి ఆ కథలవైపు పడేసి ఉంచా...మొదటగా ఒక చిన్న కూనిరాగం "రామలాలీ మేఘ శ్యామ లాలీ" అని వినిపించింది...అహా పిల్లవాడు ఎంత అదృష్టవంతుడురా నాయనా, ఇలాంటి తల్లి ఉన్నందుకు అని అనుకున్నా...ఐదు నిముషాలు అయ్యింది..ఎంతసేపటికీ రామలాలీ మేఘశ్యామ లాలీ అనే వినపడుతోందే తప్ప రాముల వారి మేఘాల బండి ముందుకు కదలట్లా...మరి ఇరుసులు అరిగిపోయినాయో ఏమో తెలియదు, కొద్ది సేపటికి పాట ఆగిపోయింది...అయ్యో అనుకున్నా..ఇంతలో కథాసరిత్సాగరం మొదలు అయ్యింది -


ఎలా ? ఇలా ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా నా మదిలో రికార్డు అయిపోయింది...


"బుజ్జీ - మనం ఇవ్వాల ఏం కథ చెప్దాం? సరే ఇప్పుడు పిల్లి వస్తుంది, దాంతో పాటు కుక్క వస్తుంది...కుక్క వచ్చి ఏం చేస్తుంది? ఆం ఆం తినేస్తుంది...అప్పుడు ఏన్గు వస్తుంది, ఏన్గు వచ్చి ఏం చేస్తుంది? ఆం ఆం తినేస్తుంది...అప్పుడు పెద్ద ట్రక్కు వస్తుంది...ట్రక్కు ఏం చేస్తుంది? డుర్ర్ మని పోతుంది..అప్పుడు నాన్న ఎక్కడికి వెళ్తుంది ? నాన్న ఆఫిస్కి వెళ్తుంది..నాన్న వచ్చాక నువ్వు ఎక్కడికి ఎళ్తావు ? సన్ రైజ్ మాల్ కి వెళ్తావు కదా...బుజ్జి కన్న..బుజ్జి కన్న...మ్మ్ చ్హ్...మ్మ్ చ్చ్ (ముద్దులు)...అప్పుడు అక్కడికి ఏం వస్తుంది ? శాండీ కుక్క వస్తుంది...అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆం ఆం అని పాలు తాగేస్తావు కదా...బుజ్జి కన్న..బుజ్జి కన్న...మ్మ్ చ్హ్...మ్మ్ చ్చ్ (మళ్ళీ ముద్దులు)...తర్వాత నువ్వు ఏం చేసావు? ఊమ్మ్...ఎ బి సి డి చెప్పేస్తావు కదా, తర్వాత ఏం చెప్తావు ? ఊమ్మ్...నువ్వు సాయంతం మెయిల్ తెస్తావు కదా ? ఎలా వెళ్తావు? హహహ...బుజ్జి కన్న..బుజ్జి కన్న...మ్మ్ చ్హ్...మ్మ్ చ్చ్ (మళ్ళీ ముద్దులు)...పాంట్ వేస్కుని వెళ్తావు కదా..." అని ఇక్కడితో సరిత్సాగరం అయిపోయి మళ్ళీ "రామలాలీ" మొదలు అయ్యింది...

ఈ లోపల నా నెత్తి మీద ఉన్న సెంట్రల్ హీటర్ తిరగటం మొదలు అయ్యి, ఆ పీడన శక్తి వల్ల నాజూగ్గా వేసి ఉన్న తలుపు ఠప్పున మూసుకుంది..


సరిగ్గా ఒక నాలుగు నిముషాల తర్వాత ఆవిడ బయటకు వచ్చి - "అమ్మయ్య ఇవ్వాళ్టికో పని అయ్యింది" అని ఒక పేద్ద నవ్వు నవ్వింది..."మీరు మీ వాడికి రోజూ కథ చెపుతారటగా, చాలా మంచి అలవాటు అది" అని నేను కూడా నవ్వి ఊరుకున్నా... మరి ఆ పిల్లవాడు ఈవిడ చెప్పే కథలకు శోష వచ్చి పడుకుంటున్నాడో, ఆనందించి పడుకుంటున్నాడో తెలీదు కానీ, నాకు మటుకు ఒకటి బాగా అర్థం అయ్యింది - ఈనాటి తెలుగు పిల్లలకు తల్లులు ఎలాంటి కథలు చెపుతున్నారో...


ఇలా పెరిగిన పిల్లలే రేపటి తెలుగు భవిత అని తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది.. :) ...(అదృష్టం అని పైన ఎందుకు అన్నానో మీకు ఈపాటికి తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నా)