Thursday, February 28, 2008

జంబూ ద్వీపం మొదలయిన సప్త ద్వీపాల గురించి..

జంబూ ద్వీపం మొదలయిన సప్త ద్వీపాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ?

http://www.maganti.org/page4.html

ఈ పుటలో ప్రకృతి దేశ సంబంధ విషయములు క్రింద ఉన్న మీటలు నొక్కండి

Tuesday, February 26, 2008

ఎవరిదగ్గర అయినా ??

ఎవరిదగ్గర అయినా జి.బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన త్యాగరాజుల వారి "ఎందరో మహానుభావులు" కృతి (ఎంపి3 కానీ, వేరే ఇతర ఆడియో ఫార్మాట్ కానీ) ఉంటే కొంచెం magantidotorgatgmaildotcom కు దయచేసి పంపించగలరా? ఆయన పాడిన ఈ పంచరత్న కృతి ఇంతకుముందు తెలుగుబిజ్.నెట్ లో ఉండేది. ఆ సైటు డవును అయిన దగ్గరినుంచి ప్రయత్నిస్తున్నాను కానీ , అంతర్జాలంలో మరెక్కడా దొరకలేదు

Sunday, February 24, 2008

శ్రీ పింగళి ప్రభాకర రావు - వందలాది బాణీలు

శ్రీ పింగళి ప్రభాకర రావు గారు లలిత సంగీతం, కర్ణాటక సంగీతం లో వందలాది బాణీలు కట్టి ఆ కళామతల్లి సేవలో తరిస్తున్న ధన్యజీవి. శ్రీ ఎం.ఎస్.బాల సుబ్రహ్మణ్యం గారి దగ్గర సంగీతం నేర్చుకున్న శ్రీ ప్రభాకర రావుగారు, ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి)లో తన మధురస్వరాలతో సంగీతాభిమానుల హృదయాలను ఉర్రూతలూగించారు అనటంలో సందేహం లేదు. ఆంధ్ర యూనివర్శిటీ లైబ్రరీలో పని చేసి, తరువాత ఢిల్లీలోని ఎస్.వి.కాలేజి లైబ్రేరియన్ గా రిటైరయిన వీరి గురించి వివరాలు

శ్రీ పింగళి ప్రభాకర రావు


ఆయన గాత్రంలో రూపుదిద్దుకున్న అద్భుతమయిన ఈ ఆణిముత్యాలు విని ఆనందించండి

Saturday, February 23, 2008

కర్ణాటక సంగీతం రెండవ పాఠం (Classical Music E-Learning at maganti.org)

Carnatic Music E-Learning Video Lesson 2

రెండవ పాఠం మీ కోసం

(జంట స్వరాలు - హెచ్చుస్థాయి స్వరాలు )

అవకాశమిచ్చిన శ్రీమతి రత్న కుమారి గారికి పాదాభివందనాలతో

Vamsi

Monday, February 11, 2008

లండన్ లో ఉన్నవాళ్ళు సంకల్పం ఇలా .........

డాక్టర్ వెలుదండ నిత్యానందరావుగారు రచించిన "తెలుగు సాహిత్యంలో పేరడీ" అనే పుస్తకంలో నుంచి ఒక పేరడీ

"ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధేశ్వేతవరాహకల్పే...." అని సంకల్పం చెప్పుకోవటం అందరికీ తెలిసిందే కదా...ఇది ఆంధ్రదేశంలో ఉన్న ఆంధ్రులకి సరిపోతుంది. మరి లండన్ లో ఉన్నవాళ్ళు సంకల్పం ఇలా చెప్పుకుంటారు అని చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు తెలియచేస్తున్నారు

"లండన్ వే స్వాహా జూశసే స్వాహ - క్రైస్తవే స్వాహా - ఇంగ్లండ్ - స్కాట్లండ్ - ఐర్లండ్ తత్త్రైస్తోర్వరేణ్యం - జుహోవా దేవస్య ధీమహీ - ధియోయోనః ప్రచోదయాత్" తో మొదలు అయ్యి

మిగతాది ఇక్కడ ......

ఇది "చిలకమర్తి ప్రహసనములు" లో నుండి "లండన్ సంకల్పం" పేరడీ అని డాక్టర్ నిత్యానందరావుగారు తెలియచేస్తున్నారు. ఈ పుస్తకం త్వరలో మీ ముందుకు maganti.org లో...ప్రచురించుకోవటానికి అనుమతి ఇచ్చిన డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారి మిత్రులు నిత్యానందరావుగారికి సహస్ర ధన్యవాదాలతో

Saturday, February 9, 2008

"కుమతీ" శతకము

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు "ఇతిశ్రీ" పేరుతో వ్రాసిన "కుమతీ శతకం"లోని కొన్ని అధిక్షేపాత్మక పద్యాలు.

1)
అధరము తడిసీ తడయక
మధురమ్మగు కాఫిజుర్రు మరి సిగరెట్టున్
ప్రథమముననె ముట్టించెడు
విధమేపో లైఫులోని విజ్ఞత కుమతీ

2)
బ్లేడును చూడని ముఖమును
బీడీ సిగరెట్ల కంపువీడని ముఖమున్
కోడిములు చెప్పు ముఖమును
బూడిద కిరవైన పాడు బొందిర కుమతీ

3)
లంచము పంచక తినకుము
కొంచెంబేనైన చేత గొనకుము సుమ్మీ
లంచంబు పట్టువారికి
కించిత్తుగ రాల్చకున్న కీడగు కుమతీ


4)
అడిగిన ప్రశ్నలు చెప్పని
మిడిమేలపు టీచరులతొ మెలగుటకంటెన్
వడిగొని త్యూషను వెట్టుక
బడి ప్యాసనవచ్చుగాదె వసుధను కుమతీ

ఇదే కోవలో ఇంచుమించు సుమతీ శతకం పద్యాలన్నిటికీ చాలా హాస్యపూరితమయిన పేరడీ పద్యాలు ఉన్నాయి "కుమతీ శతకము"లో. దీని పీఠిక కూడా చాలా హాస్యంగా ఉంది. అదంతా ఇక్కడ రాసే ఓపిక లేదు కానీ - మీకు ఓపిక ఉంటే ఈ కుమతీ పుస్తకం కొని చదువుకోండి...

ఇవి చదువుతున్నప్పుడు ముణిమాణిక్యంగారి "మనహాస్యం"లో ఉటంకించిన

తినదగు నెవ్వరు పెట్టిన
తినినంతనె తేన్పులిడక స్థిమితపడ
తిని రుచియు నరుచియు నెఱుగు
మనుజుడె సుఖభోజనుండు మహిలో సుమతీ

పద్యం గుర్తుకు వచ్చింది

Friday, February 8, 2008

చాకలి "చలువ"

ఊర్లల్లో చాకలి వారి మాటల్లో దొర్లే "చలువ" అనే పదానికి అర్థం ఏమిటి? మా అమ్మమ్మగారి ఊరు చల్లపల్లిలో కిష్టమ్మ అని చాకలి అమ్మాయి పని చేసేది, చిన్నప్పుడు ఆ మాట పెద్ద పట్టించుకోలేదు కానీ, నిన్న ఎందుకో చాకలి వాళ్ళ మాట వచ్చి గబుక్కున ఈ మాట గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి బట్టలు తీసుకెళ్ళి తిరిగి తెచ్చినప్పుడల్లా "కమలమ్మగారూ - బట్టలు చలువ చేసి తెచ్చానండి, పద్దు చూసి పంపించండి" అని అనేది. చలువ అనేది బట్టలు ఉతికే నీళ్ళలో కలిపే పదార్థమా , లేక బట్టలు ఆరపెట్టే విధానమా?

Thursday, February 7, 2008

బెజవాడ బందరు మధ్య స్టేషన్లు

బెజవాడ బందరు మధ్య స్టేషన్లు

డాక్టర్ ద్వా.నా శాస్త్రిగారితో జరిగిన ముఖాముఖి లో బయల్పడిన ఇంకో ఆణిముత్యం


ఒకసారి దువ్వూరి వెంకటరమణశాస్త్రిగారు బెజవాడ నుంచి బందరుకి రైల్లో వెడుతూ ఉండగా రెండు మూడు స్టేషన్లు దాటిన తర్వాత పక్కనున్నాయనని "తరువాత వచ్చే స్టేషన్ ఏమిటండీ?" అని అడిగారట. ఆయన "తరిగొప్పుల" అని చెప్పాడట. కొంచెం సేపయిన తర్వాత మళ్ళీ "వచ్చే స్టేషన్ పేరు?" అని అడిగితే పక్కనున్నాయన సమాధానం "ఇందుపల్లి" అని. కాస్సేపయిన తరువాత మళ్ళీ ఇప్పుడు వచ్చే స్టేషనేమిటి" అని అడగ్గానే పక్కాయనకి విసుగు పుట్టి , "ఏవండీ మీకు సంస్కృతం వచ్చునా?" అని అడిగారట. దువ్వూరివారు మహాపండితులు, "ఏదో కొద్దిగా వచ్చులెండి" అని అన్నారు. అప్పుడు ఆ పక్కనున్నాయన "అయితే ఈ శ్లోకం రాసుకోండి - స్టేషన్ల పేర్లన్నీ గుర్తుంటాయి" అని ఇలా చెప్పాడట -"బెరాని ఉత ఇందోగు నూక
వప్పెచిమాః క్రమాత్
స్టేషన్సు బెబం శాఖాయాం
నూక్రాస్యాదితి నిర్ణయః"
అప్పుడు శాస్త్రి గారు రాసుకుని చదువుకున్నారు

బె = బెజవాడ
రా = రామవరప్పాడు
ని = నిడమానూరు
ఉ = ఉప్పులూరు
త = తరిగొప్పుల
ఇం = ఇందుపల్లి
దో = దోసపాడు
గు - గుడ్లవల్లేరు
నూ = నూజెళ్ళ
క = కవుతరం
వ = వడ్లమన్నాడు
పె = పెడన
చి = చిలకలపుడి
మ = మచిలీపట్నం
బెబం = బెజవాడ బందరు మధ్య స్టేషన్లు


కానీ "నూక్రాస్యాత్" అనే పదం అర్థం కాక ఏమిటి అని ఆ పక్కాయన్ని కదిపితే వెంటనే ఆయన " నూజెళ్ళలో క్రాసింగ్ అవుతుంది" అని చెప్పి దిగిపోయాట్ట. ఇంతకీ ఈ శ్లోకం చెప్పిన మహానుభావుడి నామధేయం మాత్రం తెలీదు..

Tuesday, February 5, 2008

గాంధీ, చర్చిల్ కల్పితం! ఇదండీ సంగతి ....

ఈ వార్త "ఈనాడు" లో చూసాక ఒక్క నిముషం బుర్ర తిరిగింది..తెల్లతోళ్ళలో చాలా మంది పాపం "అమాయకులే"నని మొన్న మిత్రులు "శ్రీనివాస్" గారు చెపితే నవ్వా...నిజమే అని ...పైస్థానాల్లో ఉన్న కొద్దిమంది తమ తెల్లతోలు తెలివితేటలతో తమ చరిత్రనే కాక వేరేవారి చరిత్రలు కూడా ఇతర మార్గాలు పట్టించారు అని ఆయనతో ఒక మాట అనటం జరిగింది. అది ఇవ్వాళ్ళ ప్రత్యక్షంగా చదవటం జరిగింది...
గాంధీ, చర్చిల్ కల్పితం!

ఇదీ బ్రిటన్‌లోని అనేక మంది అభిప్రాయం

లండన్: ''మహాత్మా గాంధీ ఎన్నడూ జీవించిలేరు.. విన్‌స్టన్ చర్చిల్ ఓ కల్పిత పాత్ర''- బ్రిటన్‌లోని ఎంతో మంది అభిప్రాయమిది. చరిత్ర సరిగా తెలియని ఆ పౌరులు భారత జాతిపిత, బ్రిటన్ మాజీ ప్రధాని గురించి ఇలాంటి భావనతో ఉన్నారు. బ్రిటన్‌లో ఇటీవల జరిపిన ఒక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో భాగంగా, దేశంలోని 3 వేల మంది యువతీయువకులను 'యూకేటీవీ గోల్డ్ ఛానల్' ప్రశ్నించింది. గాంధీ, చర్చిల్, ఫ్లోరెన్స్ నైటింగేల్ కల్పితపాత్రలని అనేక మంది అభిప్రాయపడ్డారు. దాదాపు నాలుగో వంతు మంది చర్చిల్ ఊహాజనితమన్నారు. సైనికపరంగా పేరుగాంచిన 12వ శతాబ్ది ఆంగ్లేయ రాజు రిచర్డ్‌ను 47 శాతం మంది కల్పితపాత్రగానే తేల్చేశారు. మహానాయకులను, పలువురు ప్రముఖులను ఊహాజనితాలుగా చెప్పిన సర్వేలో పాల్గొన్న యువతీయువకులు.. షెర్లాక్ హోమ్స్, కింగ్ ఆర్థర్, రాబిన్ హుడ్ లాంటి ఎన్నో కల్పితపాత్రలను నిజంగా జీవించిన వ్యక్తులుగా పేర్కొనడం విశేషం.

Saturday, February 2, 2008

కృష్ణదేవరాయ సింహానికి బిలప్రవేశ దోషం

కృష్ణదేవరాయ సింహానికి బిలప్రవేశ దోషం


కృష్ణదేవరాయల వారు ఒకనాడు పెద్ద పళ్ళెం తెప్పించి ఎవరయినా ఒక నిర్దుష్టమయిన పద్యం చెప్పిన వారు , ఆ పళ్ళెరంలోని కానుకలన్నిటినీ తీసుకొనిపోవచ్చు అనగా - పెద్దన గారు -"శర సంధాన బల క్షమా గురుత రైశ్వర్యంబులున్ కల్గి దు
ర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నర సింహ క్షితిమండ లేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా
నరసింహ క్షితిమండలేశ్వరుల కృష్ణా ! రాజకంఠీరవా !"

అని చెప్పాడట.దీని అర్థం - నరసింహ క్షితి మండలేశ్వరుడి కుమారుడయిన కృష్ణదేవరాయలవారిని నరుడితోనూ, సింహంతోనూ, క్షితిమండలంతోనూ, ఈశ్వరుడితోనూ పోల్చవచ్చుట. ఎప్పుడు? నరుడికి బృహన్నల రూపం లేనప్పుడు, సింహానికి గుహ నివాసం లేకున్నప్పుడు, క్షితి మండలానికి నిరంతర చలనం లేనప్పుడు, ఈశ్వరుడికి బ్రహ్మఘ్నత లేనప్పుడు మాత్రమే అని.అయితే రామలింగడు ఊరుకుంటాడా? అద్భుతమయిన దోషం ఒకటి చూపించాడట ఇందులో."ఒక పక్క సింహానికి బిలప్రవేశ దోషం ఉంది అని చెపుతూనే, మళ్ళీ కృష్ణరాయలవారిని రాజకంఠీరవా అని సంబోధించడం దోషమే" అని తేల్చి చెప్పాడట.

ఇలాంటివి మరిన్ని - ఇక్కడ చూడండి


వంశీ

ఘంటసాల మాష్టారు తప్పు పాడారా ?

ఘంటసాల మాష్టారు తప్పు పాడారా ? అన్న సందేహం వచ్చింది నాకు పొద్దున్నే.పొద్దున్నే కార్ లో ఆఫీసుకు వెళుతూ మాష్టారు పాడిన స్తోత్రాలు, భక్తి పాటలు వినటం అలావాటు నాకు. (పొద్దున్నే కాదు అసలు చాలా మటుకు మాష్టారు పాటలు తప్ప ఇంకేవీ వినను!)నిన్న రాత్రి ghanTasAla.info నుండి కాళహస్తి మహత్యం చిత్రంలోని "జయ జయ మహాదేవ శంభో హరా శంకరా" స్తోత్రం download
చేసుకుని , పొద్దున్నే వింటుంటే , ఆ రికార్డులో 2.53 minutes దగ్గర "దివ్య ఫల పుస్ప" అని వినపడింది...ఆశ్చర్యపోయా - మాష్టారు తప్పు పాడటమా అని... ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ విన్నా అదే మాట.... నేనేమన్నా తప్పు విన్నానా ? ఆ స్తోత్ర రచనే అంతా? నా స్పీకర్ల ప్రాబ్లమా ఏమిటి అనేది అర్థం కాలా ...స్పీకర్ల ప్రాబ్లం అయితే మటుకు ఈ బోసు స్పీకర్ల వాడిని ఒక్క తాపు తన్నాలి

లింక్ ఇదిగో

http://www.ghantasala.info/allsongs/index.html

ఇందులో movie number 54 - song 5...

అంటే మాష్టారు తప్పు పాడకూడదని కాదు కానీ - నాకు మటుకు నమ్మశక్యంగా లేదు, ఆ మహానుభావుడు తప్పు పాడారు అంటే...