Friday, January 25, 2008

ఎందుకిలా ?

ఈనాటి కవిత్వం మీద ఒక చిన్న టపా రాయాలి అని అనిపించింది...ఒకటే విన్నపం - గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకునే వారు ఈ టపా చదవనఖ్ఖరలేదు - కామెంట్లు రాయనఖ్ఖరలేదు - అది మీ వివేచనకే వదిలేస్తున్నా...

అసలు వీళ్ళు కవితలు ఎందుకు రాస్తున్నారో, ఈ వెబ్జైనులు ఆ కవితలను ఎలా ప్రచురిస్తున్నాయో అర్థం కాకుండా ఉన్నది. ఇప్పుడు పేర్లు గట్రా ఎందుకు కానీండి కానీ...ఈ మధ్య అంతర్జాలం లోని కొన్ని పత్రికలలో వచ్చిన కవితలని చూస్తే పరమ రోతగా ఉంది. వీళ్ళ కవిత్వం ఎవరికోసం? రాసిన వారి ఆత్మ సంతృప్తి కోసమా? వీళ్ళకి పాఠకులెవరు? అందరూ చదివేలా రాయక్కర్లేదా? ఉచ్ఛ నీచాలు, ఉచితానుచితాలు పట్టించుకోకుండా కొత్తగా గమ్మత్తుగా రాయాలి అన్న తపన అడ్డగోలగా వాడుకభాషలోని పదాలను, రోజువారీ మాటలను అటూ ఇటూ తిప్పి ఒక పద్య పాదంగా రాసి చేతులు దులుపుకుంటున్నారు...

ఈ రోజుల్లో మంచి కవిత్వమా అని ఆశ్చర్యపోయే విధంగా ఇప్పటి పరిస్థితి వచ్చినందుకు సిగ్గుతో తల దించుకుంటున్న ఒక సామాన్యమానవుడిని……ఇప్పటి ఈ సామాన్య మానవులని ఈ కవిరాక్షసుల కలం బలం ఎన్నో తూట్లు పొడిచి తుత్తునియలు చేస్తోంది….నోట్లో ఏది ఆడితే అది రాసిపారేసి , అదే ఒక కవితారాజం లాగా భావించి, అది ఏదో ఒక పత్రికలో ( వెబ్ కానివ్వండి, సాధారణ పత్రిక కానివ్వండి) ప్రచురించి పబ్బం గడుపుకుందాము, ఆ పై తన్నుకు చచ్చేది ప్రజానీకమే కదా అని సంపాదకులు, కవి రాక్షసులు అనుకునే రోజులు ఇవి...బాబోయి ...నా వల్ల కాదు ఈ దుర్మార్గపు కవితలు చదవడం...పోనీ ఆ కవులకు లేదు అంటే, ఆ పత్రికల సంపాదకులకు ఏమయ్యింది? ఏదో రకంగా నాలుగు కవితలు ప్రచురించి కాలం గడుపుకుందాము, నాకేమి పోయె చదివేవాడి ఖర్మం అని పత్రికా సంపాదకులే ఆలోచిస్తున్నప్పుడు , అడ్డగోలుగా రాసే ఆ కవివరులకు "ఎగ్గేమి - సిగ్గేమి?".


ఉదాహరణకి ఒక కవితలో - ఓహో బాటసారి, ఇలా చేయ్యవలె మీరు , ముక్కు మూసుకోండి మీరు, పక్కకు జరగాలండి మీరు, ఎక్కడికొచ్చారో తెలుసా? కంపు కొట్టేచోటికి, పచ్చని పొదల్లో ఒకటికి పోయాలనిపిస్తోంది - ఏవండీ కవిగారు ఇది ఒక కవితా? అయ్యో జనాలు చదివి నవ్వుతారే అని కూడా అనిపించలేదాండీ మీకు? అసలు వీటికి కవిత అనే పదార్థంలో ఇరికించే అర్హత ఉందంటారా? పైగా దీని పేరు భావ కవిత్వమా? హయ్యో హతవిధీ...ఇలా ఖర్మం కాలబట్టే .....సరే...ఇంకో పత్రికలో పరుపులు, మరకలు,లేవండి, పదండి, అడక్కండి, మాట్లాడకండి అని ఇంకో కవిత...హయ్యయ్యో హయ్యయ్యో...


ఈ చర్చ తమ రాక్షస “రసి”కతను, జనాల మీదకు వదిలి సంతోషించే కవుల గురించే చర్చ కానీ , “విశాలత” గురించి కాదు. “మూడ్” ఉన్న, ఆ పైన “మాడు ” ఉన్న జనాలు చాలా కొద్ది మంది ఉన్న ఈ ప్రపంచంలో, ఈనాటి చాలామంది కవిరాకాసుల కవితలు “రంభలు” “గంగలు” మాత్రమే కావాలనుకునే వాళ్ళకి మాత్రమే ఉపయోగంగా ఉంటున్నాయి అనే ఉద్దేశం తప్ప …కాలప్రవాహం లో అనేకం మారుతూ ఉంటాయి - కాకపోతే మనం నీచ ప్రవాహం లో పడి కొట్టుకునిపోవటానికి చూస్తున్నామా, ఆ నీచ ప్రవాహానికి ఎదురీది దాని లోనుంచి ఒక మంచి తీరానికి చేరుతామా అన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది…అలా నీచ ప్రవాహాన్ని సృష్టించిన కవుల బాధ్యతే ఇక్కడ ఎక్కువ అన్నది నా అభిప్రాయం…


అసలు కవిత్వం గురించి చర్చించటానికి నీకేం అర్హత ఉన్నది అని కొంత మంది అడగవచ్చు - నాకున్న ఒకే ఒక అర్హత - నేను ఒక "సామాన్య పాఠకుడు"ని. అన్ని రచనలు చదివేవాడిని - చదివిన వాటిలో మంచివి ఏవో, చిరాకు పుట్టించేవి ఏవో భేదాలు గుర్తించగల పాఠకుడిని. ఎంత మంచి రచన అయినా స్పందించే పాఠకులు లేకపోతే మట్టి కొట్టుకునిపోతుంది అనే నానుడిని నమ్మేవాడిని.

పైగా ఒకాయన ఎవరో కవిత్వం ఒక సైన్సు అని చెపుతున్నాడు - సైన్సుల్లో అంత పెద్ద పట్టాలు ఉన్నవాళ్ళు మరి మంచి కవితలు రాయట్లేదే, రాయలేకా? లేక మనకి పట్టా ఉంది కదా ఏది రాసినా చెల్లుతుంది అనే అహంభావమా ?

అసలు మంచి కవిత అంటే ఏమిటి ? ఏదయినా మనసుకి హత్తుకుని, పడుతున్న కష్టాలనుంచి సేద తీర్చేదిగా ఉండి , ఆహ్లాదాన్ని కలిగిస్తూ, సంతోషాన్ని పంచుతూ, హాస్యాన్ని తనలో దాచుకుని మంచి చేస్తూ పదికాలాల పాటు నిలిచిపోయే విధంగా ఉండాలి...

కానీ , ఇలా దిక్కుమాలిన రాతలు రాసి “ఇన్స్టంట్” రెకగ్నిషన్ తెచ్చుకున్న కవిరాకాసులు ఎన్ని రోజులు తమ ఉచ్ఛ స్థితిని అట్టిపెట్టుకుంటారో కాలమే చెపుతుంది.


అలా అని మంచి కవితలు లేవు అని కాదు...ఆ మంచి కవితల గురించి మరొక టపాలో

1 comment: