Wednesday, January 30, 2008

క్షవర హాస్యం

క్షవర హాస్యం


తిరుపతి వేంకట కవులు మంచి హాస్యప్రియులని చెప్పే పద్యం ఒకటి ఇదిగో, మా నాన్నగారి పాతడైరీలో నుంచి

ఒకావిడ తన కొడుక్కి క్షురకర్మ చేయించటానికి మంగలిని పిలిచి, ఆ కార్యక్రమం అయ్యాక అతనికి ఒక కానీ ఇచ్చి - ఇదిగో అబ్బాయి నీ కూలి ఏగానీ తీసుకుని తక్కిన ఏగానీ ఇచ్చెయ్యి" అందిట. అప్పుడు ఆ మంగలి "నా దగ్గర చిల్లర లేదమ్మా" అన్నాట్ట. "చూస్తూ చూస్తూ ఏగానీ ఎక్కడ వదులుకోనూ?" అని ఆ తక్కిన చిల్లరకి తాను క్షవరం చేయించుకుందిట. -


ఒక ఏగానికి చిన్ని కుర్రనికి ఆయుష్కర్మ చేయించి దా
నికినై కాని ఒసంగి తక్కు సగమున్ తెమ్మన్న నా చేత లే
దకటా వాగను క్షౌరపుం గృతికి తా నంగీకృతిన్ చూపు లే
భ్య కులాయం బగు ముద్దరాలి చరితం బాలించితే తిర్పతీ

1 comment:

  1. బావుంది. :-)
    క్షవరానికి సంబంధించి తెలుగులో ఎన్నో సామెతలు కూడా ఉన్నాయి .. కొన్ని ముతక సామెతలతో సహా :-)
    ఈ కింది హాస్యం చిలకమర్తి వారి వినోదములు అనే హాస్య సంకలనంలో చదివాను ఎప్పుడో చిన్నప్పుడు:
    ఒక బ్రాహ్మణ పండితుడు ఇంత లావు శాస్త్ర గ్రంథం చంకలో పట్టుకుని వీధిన పోతూ ఉంటే ఒక క్షత్రియుడు తన అరుగు మీద హుక్కా పీలుస్తూ కూర్చున్న వాడు ఆయన్ని పిలిచి అవ్వాళ్టి పంచాంగం చెప్పమన్నాడు. ఆ పండితుడు అది వ్యాకరణ గ్రంథమనీ, పంచాంగం చెప్పడానికి కుదరదనీ చెప్పాడు. రాజుగారు వెటకారంగా ఇంత పెద్ద పుస్తకం కనీసం పంచాంగం చెప్పడానిక్కూడా పనికిరాదా, శుద్ధ దండుగ అని నవ్వాడు.
    కొన్నాళ్ళు పోయాక ఈ రాజు గారు పెద్ద పట్టాకత్తి పుచ్చుకుని వేటకి వెళ్తుంటే ఇదే బ్రాహ్మడు తన అరుగు మీద జంధ్యాలు వొడుక్కుంటున్నాడు. రాజుగారిని కత్తిని చూసి కత్తి మహ పదునుగా ఉన్నది, తల మాసింది, క్షవరం చేసి పెట్టమన్నాడు. రాజు కళ్ళెర్ర జేసి, ఇది పట్టాకత్తి, వేటాడ్డానికే గాని, క్షవరం చెయ్య్టానికి కాదన్నాడు. హయ్యొ .. ఇంత పెద్ద కత్తీ మంగలి కత్తి పాటి చెయ్యదన్న మాట అని ప్రతీకారం తీర్చుకున్నాడు.

    ReplyDelete