Saturday, January 26, 2008

ఒకే పద్యంలో 64 విచిత్రాలు

ఒకే పద్యంలో 64 విచిత్రాలు.

తెలుగు కవుల్లో గణపవరపు వేంకటకవిని ఆరుద్ర "సాముగరిడీల పహిల్వాన్" అన్నారు. చిత్రకవితా రీతులనన్నిటినీ ఆపోశన పట్టిన ఈ కవి 883 పద్యాలతో "ప్రబంధరాజ వేంకటేశ్వర విలాసం" రాసారు. ప్రతి పద్యంలోనూ ఒక చిత్రం - గారడీ కనిపిస్తుంది. ఇందులో 808 వ పద్యంలో ఏకంగా 64 రకాల విచిత్రాలున్నాయని పరిశోధకులు తెలిపారు. ఆ పద్యం:

"సారాగ్ర్య సారస సమనేత్రయుగళ నా
రద రుచికాంతి నరఘన వనిత
సారాగధీర విశదవీన తురగ భై
రవ భవజైత్ర భరశుభకరణ
సారాతిహార విసర చారణహరి సా
రసహిత చంద్ర శరజ జయనుత
వారాశి నారదవర పూజిత పదగౌ
రవకటి ఖడ్గ గరళగళసఖ
హరినగ నిలయ గిరిధర యసురదళన
మణిమయమకుట సురమణి మధువిశరణ
కరివరద కువర రుచిరత రవసనన
రహరి లసితదర నిగమ విహరణ హరి"


ఒక పద్యంలో మరొక పద్యాన్ని ఇమిడ్చి రాయటాన్ని "గర్భకవిత్వం" అంటారని మనకు తెలిసిన విషయమే కదా. ఇటువంటి గర్భకవిత్వాలు పై పద్యంలో 41 వున్నాయట. ఎటు చదివినా ఒకే విధంగా ఉండే అనులోమ విలోమ పద్యాలు మూడు ఉన్నాయట. నాగబంధం, ఖడ్గబంధం వంటి బంధాల్లో రాయబడిన బంధ కవిత్వ పద్యాలు ఇరవై దాకా వున్నాయి. చివర నాలుగు పాదాలు గల ఎత్తుగీతిలో అన్ని అక్షరాలూ లఘువులే కావడం ఒక విచిత్రం.

ఇటువంటి కవిత్వం అద్భుతావహం, పాండిత్య స్ఫోరకం కావచ్చు గానీ రసానందాన్ని కలగజెయ్యదంటారు. కానీ ప్రపంచంలో ఏ భాషలోనూ ఇటువంటి పద్యం లేదని చెప్పినప్పుడు ఆనందమే గదా! తెలుగు భాషకి ఇదొక ప్రత్యేకత

ఈ విచిత్రమయిన పద్యం నాకెలా తెలిసిందా అని అడిగితే మటుకు - ద్వా.నా.శాస్త్రి గారితో ముఖాముఖీ అప్పుడు దొర్లిన మాటల్లో ఆయన తెలియచేసిన పద్యం అని చెప్పవలసి ఉంటుంది..ఆయనకు ధన్యవాదాలతో

5 comments:

 1. పద్యం రసానందాన్ని కలుగజేయాలంటే వుండవలసినది పదసముదాయం కన్నా భావసంచయమే. చిత్రకవిత్వంలో సంస్కృతపదాలు యెక్కువ పడుతూవుంటాయి, బహుశా పద్యం సరిపెట్టడనికి యెంతటివారికైనా శ్రమ తప్పదేమో. ఒక్క గోమూత్రికాబంధం తప్పితే బంధకవిత్వమూ దాదాపు అంతే. విశ్వనాథవారు అన్నట్టుగా ఆశుకవితకు అనాదిగా వెల యెక్కువ. ఇల్లాంటి బంధ చిత్ర కవిత్వాలు చదవగా చదవగా లేదా వ్రాయగా వ్రాయగా "అభ్యాసం కూసు విద్య" అన్నట్టుగా ఆశువులోకూడా వీటిని అందంగా యిమడ్చగల పట్టు దొరుకుతుంది కాబోలు. నాకైతే మీరు వుటంకించిన యీ పద్యం చూడగానే కవనపుఠీవి, ముద్దుపలుకు గలిగిన ముక్కు తిమ్మయ యొక్క పారిజాతాపహరణంలో నారదుడు శ్రీకృష్ణునిపై జేసిన చిత్ర,బంధకవితాస్తుతి గుర్తుకువచ్చింది.

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. మాగంటి వారికి కయిలాటము...
  అయ్యా పై పద్యం సంస్కృత పద్యము వలె కానవచ్చుచున్నది కాని తెనుగు పద్యమనుకొనుటకు నా మనస్సు అంగీకరించుట లేదు.
  ఇంచు వింటి చెంచు = మన్మధుడు
  అగ్గికంటిదేవర = శివుడు
  కయిలాటము = నమస్కారము
  క్రోలెముక =వెన్నెముక
  చిలువగట్టుదొర = శ్రీ వేంకటేశ్వరస్వామి
  ఇవి మచ్చుకి కొన్ని అచ్చతెలుగు పదాలు
  పై పద్యాన్ని దేవనాగరిలిపి లో రాసి చూస్తే సంస్కృత పద్యమే కనిపిస్తుంది..
  "కానీ ప్రపంచంలో ఏ భాషలోనూ ఇటువంటి పద్యం లేదని చెప్పినప్పుడు ఆనందమే గదా! తెలుగు భాషకి ఇదొక ప్రత్యేకత " అన్నప్పుడు కొంచెం యిబ్బంది పడాల్సిన పరిస్థితి..
  మిత్రుడు..
  యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ..
  yvs@teacher.com

  ReplyDelete
 4. ఈ మధ్య బ్లాగులలో పద్యాలు చదువుతున్నప్పుడు ఆలోచిస్తుంటే, పద్యానికి భావంతో పాటు, శబ్దం చాలా ముఖ్యమేమో అని. ఒక్క భావమే ముఖ్యమైతే, వచనంలో వ్రాసేస్తే చాలు కదా, దానికోసం పద్యమెందుకు. ఇవి నా ఆలోచనలు మాత్రమే, నిజమవ్వక్కరలేదు ;)

  నమస్కారలతో,
  సూర్యుడు :-)

  ReplyDelete
 5. telugunu abhinimchevaaru tappaka chadavandi (telugOdu) pustakam.
  eteevali kaalamoLo vacchina adbuthmain pustkaalalO adiokaTi .kaani maganti.org lO scan bagaalEdu.
  aa kavi ganaka meeke telistE krutajyatahleu cheppaMdi

  ReplyDelete