Wednesday, January 30, 2008

ప్రణవ నాదం - "ఓం" - ఆడియో ఫైలు

ప్రణవ నాదం - "ఓం" - ఆడియో ఫైలు - ఎం.పి.3 రూపంలో ఎవరిదగ్గర అయినా ఉంటే దయచేసి maganti.org జీమెయిలు కు పంపించగలరా ? అంతర్జాలంలో వెతికాను కానీ మంచి క్లిప్పు కనపడలేదు...

క్షవర హాస్యం

క్షవర హాస్యం


తిరుపతి వేంకట కవులు మంచి హాస్యప్రియులని చెప్పే పద్యం ఒకటి ఇదిగో, మా నాన్నగారి పాతడైరీలో నుంచి

ఒకావిడ తన కొడుక్కి క్షురకర్మ చేయించటానికి మంగలిని పిలిచి, ఆ కార్యక్రమం అయ్యాక అతనికి ఒక కానీ ఇచ్చి - ఇదిగో అబ్బాయి నీ కూలి ఏగానీ తీసుకుని తక్కిన ఏగానీ ఇచ్చెయ్యి" అందిట. అప్పుడు ఆ మంగలి "నా దగ్గర చిల్లర లేదమ్మా" అన్నాట్ట. "చూస్తూ చూస్తూ ఏగానీ ఎక్కడ వదులుకోనూ?" అని ఆ తక్కిన చిల్లరకి తాను క్షవరం చేయించుకుందిట. -


ఒక ఏగానికి చిన్ని కుర్రనికి ఆయుష్కర్మ చేయించి దా
నికినై కాని ఒసంగి తక్కు సగమున్ తెమ్మన్న నా చేత లే
దకటా వాగను క్షౌరపుం గృతికి తా నంగీకృతిన్ చూపు లే
భ్య కులాయం బగు ముద్దరాలి చరితం బాలించితే తిర్పతీ

అతివ - మధురగతి రగడ

అతివను వర్ణించే ఒక అద్భుతమయిన మధురగతి రగడ చూడండి.

కోలాచలం శ్రీనివాసరావు గారు 1895 లో వ్రాసిన సునందినీపరిణయము అనే నాటకము నుంచి.


నెఱికురు లిరు లని-నీలపుసరు లని
శరదనికర మని-షట్పదగణ మని
కామినికీల్జడ-కాలోరగమని
భామినియలకలు-బంభరకుల మని
బాలశశాంకుడు-బాలనిటల మని
వాలుకనుబొమలు-వా లగువిం డ్లని
చెలికనిగవసిరి - చెన్ను కలువ లని
వెలిదామర లని-వీనులు మేరని
యతివకనీనిక-లళిబిత్తరు లని
సతివాల్చూపులు-స్మరునిశరము లని
హరిణచపల మని-హరువులగని యని
కరుణారసభర-కాసారం బని
తి రగునాసిక-తిలపుష్పం బని
చారుతరం బగు-సంపెగసుమ మని
అధర మమృతమని-యలబింబం బని
మధురముబూనిన-మావులచివురని
మరుతాపములను-మాన్పెడుమం దని
పరిమళములు గల-పద్మాకర మని
కప్పురగని యని-కాంతిబగడ మని
దప్పుల దీర్చెడు-తావిజలము లని
తరుణిరదనములు-తారలచా లని
మురువులమొల్లల-మొగ్గలతీ రని
చిఱుచిన్నెలు గల-చిఱుతనగవు గని
విరులసరము లని-వెన్నెలబా ఱని
కాంతకపోలము-కాంతముకుర మని
సంతత ముడురా-ట్ఛకలసమం బని
నెలతకు వీనులు-నెగడెడుశ్రీ లని
నలు వగునవములు-నవశష్కులు లని
వెలదివదన మహ-విధుబింబం బని
జలజాతం బని-సరససదన మని
మానినిమోమును-మానితముగ గని
పూనిక సుకవులు-పొగడుదు రవనిని
కలకంఠికి గల-గళ మబ్జం బని
కలనాదంబులు-గలవేణువె యని
మదనున్న్ డుంచిన-మంగళనిధికిని
గదలనిరేఖల-గట్టినక ట్టని
బాహులమూలలు-బంగరుపస లని
యూహకు మీరిన-యురగపుఫణు లని
పడతిభుజములను-బగడపుగుము లని
యడరెడుబాహుల నమరశాఖ లని
జలజముతూం డ్లని-జాళ్వాలత లని
చెలిపాణులు సిరి-చెలిసదనము లని
కిసములనన లని-గీర్తికినిధు లని
యసమానాంగుళు-లబ్జదళము లని
కరరుహములు రి-క్కలు సూసములని
తిర మగురుచిమౌ-క్తికములచా లని
సతిచనుగవ గన-జక్కవకవ యని
మతికి హితం బగు-మాలూరము లని
లికుచము లని సిరి-లిబ్బులుగిరు లని
చకచకలాడెడు-జాళ్వాగిం డ్లని
పుత్తడిబంతులె-పూగుత్తులె యని
మత్తేభంబుల-మదకుంభము లని
చెలియారును గని-చీమలబా ఱని
కలుములు గాచెడు-కాలోరగ మని
లావణ్యార్ణవ-లహరులు వళులని
యావట మగుభా-గ్యావహకళ లని
పొలతికిబొక్కిలి-పొన్నకుసుమ మని
తెలిదామర యని-తీ రగుగుహయని
పరిమళరసయుత-పద్మాకర మని
తరుణినడుము లే-దని మరి కల దని
హరిపదమని మరి-హరిరూపం బని
యరయగనాటక-మని మఱి యసదని
పరిపరివిధముల-బండితు లిమ్మహి
సరసిజముఖి గని-సారెకు నెంతురు
శుభవతి కిరవగు-శ్రోణి యచల మని
యభిరామంబగు-నమృతపుబ్రో లని
బలుపులినము లని-బంగరునిధు లని
యలసగమనతొడ-లనటులసిరులని
కర మరు దగుకరికరములశ్రీ లని
మురిపెము గులికెడు-మోకాళ్ళనుగని
సరసోరుద్యుతి-సంపద లొలుకని
బిరుదులబింకపుబిరడబిగువు లని
తరుణికి జంఘులు-తనరుశరధులని
పరికింపగ సతి-ప్రపదము దులులని
పదములు పంకజ-పదములరుచు లని
మధుమాసంబులమావులచివు రని
పరిపరివిధముల బడతిసొబగు గని
నరవరు లెన్నడునతిశయములు విని
కన్ను లలరగను-గన్నెను గంటిని
సన్నుతగుణముల-సతి కీయవనిని
సరి లే దంటిని-సరి యిదె యంటిని
తరుణులలో మే-ల్తరమిది యంటిని
తపసుల నైనను-తహతహపెట్టుర
చపలత లెరుగని-చపలారేఖర
సౌరభ మొందిన-జంత్రపుబొమ్మర
పరిమళ మొందిన-పసిడిసలాకర
జీవకళలు గల-చిత్తరుప్రతిమర
వాగ్విభవము గల-వన్నెలచిలుకర
వెన్నెలపులుగుల-విం దగుమోముర
వన్నెలకేకుల-వాపిరివేణిర
కోకిల యాకలికూడగునధరి ర
కోకము లుబ్బెడుగుబ్బలతరుణి ర
ఒయ్యారము గలయొప్పులకుప్పర
సయ్యాటములకు సరి యగుసరసి ర
వెయ్యాఱులలో వెతకిన లేదు ర
అయ్యారే! భళి! యంగనసవతు ర
ఇంతిసొబగు నే నెంత నుతింతుర!
ఎంతనుతించిన నింతికి వెల్తి ర

తోక పోయి కత్తి వచ్చె ఢాం ఢాం ఢాం

తోక పోయి కత్తి వచ్చె ఢాం ఢాం ఢాం
కత్తి పోయి కట్టె వచ్చె ఢాం ఢాం ఢాం
కట్టె పోయి దోసె వచ్చె ఢాం ఢాం ఢాం
దోసె పోయి డోలు వచ్చె ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం ఢాం ఢాం ఢాం

ఈ పాట వెనక ఒక కథ ఉంది...ఏమిటో చెప్పుకోండి చూద్దాం


ఇది సమకాలీన పరిస్థితులకి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది ... :)

కవిత్రయం - వృత్త విశేషాలు

మన కవిత్రయం వారు రాసిన ఆంధ్రమహాభారతంలోని వృత్త విశేషాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

అంబురుహము
బంధురము
భాస్కర విలసితము
భుజంగప్రయాతము
దోదకము
ద్రుతవిలంబితము
ఇంద్రవ్రజ
జలధరము
కవిరాజ విరాజితము
క్రౌంచ పదము
లయగ్రాహి
లయవిభాతి
మహాస్రగ్ధర
మాలిని
మందాక్రాంత
మంగళమహాశ్రీ
మణిభూషణము
మణిగణనికరము
మణిమాల
మానిని
మంజుభాషిణి
మత్తకోకిల
మేదిని
నర్కుటము
పద్మకము
పణవము
ప్రహరణకలితము
పృథ్వి
రధోద్దతము
సరసిజము
శిఖరిణి
స్రగ్ధర
స్రగ్విణి
శుద్ధవిరాటి
స్వాగతము
తరళ
తోదకము
తోటకము
ఉపజాతి
ఉపేంద్రవ్రజ
వనమయూరము
వసంతతిలక


వీటిలో ఆదికవిగారికి ప్రియమయిన వృత్త విశేషం మత్తకోకిల. ఎందుకంటే ఆయన రాసిన వాటిలో మత్తకోకిల వృత్తాలే ఎక్కువ ఉన్నాయి అని సాహితీకారులు చెపుతున్నారు. మత్తకోకిల తరువాత ఆయన ఎక్కువగా వాడిన వృత్త విశేషం తరళ.

తిక్కనామాత్యుల వారికి ఇష్టమయిన వృత్త విశేషం మాలిని అని చెపుతున్నారు. తరువాత వరుసగా మహాస్రగ్ధర , స్రగ్ధర, తరళ అని తెలియవస్తోంది.

ఇక ఎర్రాప్రెగడ వారికి ఇష్టమయిన వృత్త విశేషం ఆదికవి గారి ఇష్ట వృత్తమే - మత్తకోకిల. తరువాత వరుసగా మహాస్రగ్ధర , స్రగ్ధర, స్రగ్విణి అని తెలియవస్తోంది.

Saturday, January 26, 2008

ఒకే పద్యంలో 64 విచిత్రాలు

ఒకే పద్యంలో 64 విచిత్రాలు.

తెలుగు కవుల్లో గణపవరపు వేంకటకవిని ఆరుద్ర "సాముగరిడీల పహిల్వాన్" అన్నారు. చిత్రకవితా రీతులనన్నిటినీ ఆపోశన పట్టిన ఈ కవి 883 పద్యాలతో "ప్రబంధరాజ వేంకటేశ్వర విలాసం" రాసారు. ప్రతి పద్యంలోనూ ఒక చిత్రం - గారడీ కనిపిస్తుంది. ఇందులో 808 వ పద్యంలో ఏకంగా 64 రకాల విచిత్రాలున్నాయని పరిశోధకులు తెలిపారు. ఆ పద్యం:

"సారాగ్ర్య సారస సమనేత్రయుగళ నా
రద రుచికాంతి నరఘన వనిత
సారాగధీర విశదవీన తురగ భై
రవ భవజైత్ర భరశుభకరణ
సారాతిహార విసర చారణహరి సా
రసహిత చంద్ర శరజ జయనుత
వారాశి నారదవర పూజిత పదగౌ
రవకటి ఖడ్గ గరళగళసఖ
హరినగ నిలయ గిరిధర యసురదళన
మణిమయమకుట సురమణి మధువిశరణ
కరివరద కువర రుచిరత రవసనన
రహరి లసితదర నిగమ విహరణ హరి"


ఒక పద్యంలో మరొక పద్యాన్ని ఇమిడ్చి రాయటాన్ని "గర్భకవిత్వం" అంటారని మనకు తెలిసిన విషయమే కదా. ఇటువంటి గర్భకవిత్వాలు పై పద్యంలో 41 వున్నాయట. ఎటు చదివినా ఒకే విధంగా ఉండే అనులోమ విలోమ పద్యాలు మూడు ఉన్నాయట. నాగబంధం, ఖడ్గబంధం వంటి బంధాల్లో రాయబడిన బంధ కవిత్వ పద్యాలు ఇరవై దాకా వున్నాయి. చివర నాలుగు పాదాలు గల ఎత్తుగీతిలో అన్ని అక్షరాలూ లఘువులే కావడం ఒక విచిత్రం.

ఇటువంటి కవిత్వం అద్భుతావహం, పాండిత్య స్ఫోరకం కావచ్చు గానీ రసానందాన్ని కలగజెయ్యదంటారు. కానీ ప్రపంచంలో ఏ భాషలోనూ ఇటువంటి పద్యం లేదని చెప్పినప్పుడు ఆనందమే గదా! తెలుగు భాషకి ఇదొక ప్రత్యేకత

ఈ విచిత్రమయిన పద్యం నాకెలా తెలిసిందా అని అడిగితే మటుకు - ద్వా.నా.శాస్త్రి గారితో ముఖాముఖీ అప్పుడు దొర్లిన మాటల్లో ఆయన తెలియచేసిన పద్యం అని చెప్పవలసి ఉంటుంది..ఆయనకు ధన్యవాదాలతో

Friday, January 25, 2008

ఎందుకిలా ?

ఈనాటి కవిత్వం మీద ఒక చిన్న టపా రాయాలి అని అనిపించింది...ఒకటే విన్నపం - గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకునే వారు ఈ టపా చదవనఖ్ఖరలేదు - కామెంట్లు రాయనఖ్ఖరలేదు - అది మీ వివేచనకే వదిలేస్తున్నా...

అసలు వీళ్ళు కవితలు ఎందుకు రాస్తున్నారో, ఈ వెబ్జైనులు ఆ కవితలను ఎలా ప్రచురిస్తున్నాయో అర్థం కాకుండా ఉన్నది. ఇప్పుడు పేర్లు గట్రా ఎందుకు కానీండి కానీ...ఈ మధ్య అంతర్జాలం లోని కొన్ని పత్రికలలో వచ్చిన కవితలని చూస్తే పరమ రోతగా ఉంది. వీళ్ళ కవిత్వం ఎవరికోసం? రాసిన వారి ఆత్మ సంతృప్తి కోసమా? వీళ్ళకి పాఠకులెవరు? అందరూ చదివేలా రాయక్కర్లేదా? ఉచ్ఛ నీచాలు, ఉచితానుచితాలు పట్టించుకోకుండా కొత్తగా గమ్మత్తుగా రాయాలి అన్న తపన అడ్డగోలగా వాడుకభాషలోని పదాలను, రోజువారీ మాటలను అటూ ఇటూ తిప్పి ఒక పద్య పాదంగా రాసి చేతులు దులుపుకుంటున్నారు...

ఈ రోజుల్లో మంచి కవిత్వమా అని ఆశ్చర్యపోయే విధంగా ఇప్పటి పరిస్థితి వచ్చినందుకు సిగ్గుతో తల దించుకుంటున్న ఒక సామాన్యమానవుడిని……ఇప్పటి ఈ సామాన్య మానవులని ఈ కవిరాక్షసుల కలం బలం ఎన్నో తూట్లు పొడిచి తుత్తునియలు చేస్తోంది….నోట్లో ఏది ఆడితే అది రాసిపారేసి , అదే ఒక కవితారాజం లాగా భావించి, అది ఏదో ఒక పత్రికలో ( వెబ్ కానివ్వండి, సాధారణ పత్రిక కానివ్వండి) ప్రచురించి పబ్బం గడుపుకుందాము, ఆ పై తన్నుకు చచ్చేది ప్రజానీకమే కదా అని సంపాదకులు, కవి రాక్షసులు అనుకునే రోజులు ఇవి...బాబోయి ...నా వల్ల కాదు ఈ దుర్మార్గపు కవితలు చదవడం...పోనీ ఆ కవులకు లేదు అంటే, ఆ పత్రికల సంపాదకులకు ఏమయ్యింది? ఏదో రకంగా నాలుగు కవితలు ప్రచురించి కాలం గడుపుకుందాము, నాకేమి పోయె చదివేవాడి ఖర్మం అని పత్రికా సంపాదకులే ఆలోచిస్తున్నప్పుడు , అడ్డగోలుగా రాసే ఆ కవివరులకు "ఎగ్గేమి - సిగ్గేమి?".


ఉదాహరణకి ఒక కవితలో - ఓహో బాటసారి, ఇలా చేయ్యవలె మీరు , ముక్కు మూసుకోండి మీరు, పక్కకు జరగాలండి మీరు, ఎక్కడికొచ్చారో తెలుసా? కంపు కొట్టేచోటికి, పచ్చని పొదల్లో ఒకటికి పోయాలనిపిస్తోంది - ఏవండీ కవిగారు ఇది ఒక కవితా? అయ్యో జనాలు చదివి నవ్వుతారే అని కూడా అనిపించలేదాండీ మీకు? అసలు వీటికి కవిత అనే పదార్థంలో ఇరికించే అర్హత ఉందంటారా? పైగా దీని పేరు భావ కవిత్వమా? హయ్యో హతవిధీ...ఇలా ఖర్మం కాలబట్టే .....సరే...ఇంకో పత్రికలో పరుపులు, మరకలు,లేవండి, పదండి, అడక్కండి, మాట్లాడకండి అని ఇంకో కవిత...హయ్యయ్యో హయ్యయ్యో...


ఈ చర్చ తమ రాక్షస “రసి”కతను, జనాల మీదకు వదిలి సంతోషించే కవుల గురించే చర్చ కానీ , “విశాలత” గురించి కాదు. “మూడ్” ఉన్న, ఆ పైన “మాడు ” ఉన్న జనాలు చాలా కొద్ది మంది ఉన్న ఈ ప్రపంచంలో, ఈనాటి చాలామంది కవిరాకాసుల కవితలు “రంభలు” “గంగలు” మాత్రమే కావాలనుకునే వాళ్ళకి మాత్రమే ఉపయోగంగా ఉంటున్నాయి అనే ఉద్దేశం తప్ప …కాలప్రవాహం లో అనేకం మారుతూ ఉంటాయి - కాకపోతే మనం నీచ ప్రవాహం లో పడి కొట్టుకునిపోవటానికి చూస్తున్నామా, ఆ నీచ ప్రవాహానికి ఎదురీది దాని లోనుంచి ఒక మంచి తీరానికి చేరుతామా అన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది…అలా నీచ ప్రవాహాన్ని సృష్టించిన కవుల బాధ్యతే ఇక్కడ ఎక్కువ అన్నది నా అభిప్రాయం…


అసలు కవిత్వం గురించి చర్చించటానికి నీకేం అర్హత ఉన్నది అని కొంత మంది అడగవచ్చు - నాకున్న ఒకే ఒక అర్హత - నేను ఒక "సామాన్య పాఠకుడు"ని. అన్ని రచనలు చదివేవాడిని - చదివిన వాటిలో మంచివి ఏవో, చిరాకు పుట్టించేవి ఏవో భేదాలు గుర్తించగల పాఠకుడిని. ఎంత మంచి రచన అయినా స్పందించే పాఠకులు లేకపోతే మట్టి కొట్టుకునిపోతుంది అనే నానుడిని నమ్మేవాడిని.

పైగా ఒకాయన ఎవరో కవిత్వం ఒక సైన్సు అని చెపుతున్నాడు - సైన్సుల్లో అంత పెద్ద పట్టాలు ఉన్నవాళ్ళు మరి మంచి కవితలు రాయట్లేదే, రాయలేకా? లేక మనకి పట్టా ఉంది కదా ఏది రాసినా చెల్లుతుంది అనే అహంభావమా ?

అసలు మంచి కవిత అంటే ఏమిటి ? ఏదయినా మనసుకి హత్తుకుని, పడుతున్న కష్టాలనుంచి సేద తీర్చేదిగా ఉండి , ఆహ్లాదాన్ని కలిగిస్తూ, సంతోషాన్ని పంచుతూ, హాస్యాన్ని తనలో దాచుకుని మంచి చేస్తూ పదికాలాల పాటు నిలిచిపోయే విధంగా ఉండాలి...

కానీ , ఇలా దిక్కుమాలిన రాతలు రాసి “ఇన్స్టంట్” రెకగ్నిషన్ తెచ్చుకున్న కవిరాకాసులు ఎన్ని రోజులు తమ ఉచ్ఛ స్థితిని అట్టిపెట్టుకుంటారో కాలమే చెపుతుంది.


అలా అని మంచి కవితలు లేవు అని కాదు...ఆ మంచి కవితల గురించి మరొక టపాలో

Wednesday, January 23, 2008

శ్రీమతి జానకి గారి కర్ణాటక సంగీతం!

సకలలోకపాలకుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారి పదసన్నిధి తిరుపతిలో పుట్టి పెరిగిన సంగీత కోకిల శ్రీమతి జానకి గారు తన పాటలను మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వారికి ముందుగా హృదయ పూర్వక కృతజ్ఞతలు.నాలుగో ఏట నుండి సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టిన శ్రీమతి జానకి గారు , ఎస్.వి.మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ నుండి 1995లో బి.యే (మ్యూజిక్) పూర్తిచేసి, 1997లో పద్మావతి యూనివర్శిటీ నుండి ఎం.యే (కర్ణాటిక్- వోకల్) పట్టా పుచ్చుకున్నారు. అద్భుతమయిన గాత్రశుద్ధి కల జానకి గారు కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు శ్రీ శబరి గిరీష్ గారి ప్రియ శిష్యురాలు. ఆ పై 1992 లో ఎస్.వి.మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న "మహామహోపాధ్యాయ శ్రీ నూకల చిన సత్యనారాయణ" గారి వద్ద సంగీతం నేర్చుకునే అదృష్టం కలిగింది అని, పద్మావతి విశ్వవిద్యాలయం లో "శ్రీమతి ద్వారం లక్ష్మి" గారి వద్ద శిష్యరికం చేసే అదృష్టం లభించింది అని జానకి గారు ఎంతో సంతోషంగా చెపుతారు. 1996 లో మొదలయిన మొదటి కచేరీ తరువాత ఆ గానకోకిల గాత్రం ఎల్లలు లేకుండా అప్రతిహతంగా సుదూర తీరాల వరకు సాగిపోతోంది. ప్రతి తిరుమల, తిరుచానూర్ బ్రహ్మోత్సవాలలో వీరి గాత్రం వినపడవలసిందే.అన్నమాచార్య కృతులు అంటే ప్రాణంగా భావించే వీరు ఎంతో మంది పిల్లలకి విద్యాదానం చేస్తున్నారు.ఇలాంటి సంగీత కార్యక్రమాలు ఆవిడ ఇంకా ఎన్నో చేయాలి అని మనసారా కోరుకుంటూ,

శ్రీమతి జానకి గారి కర్ణాటక సంగీతం

ఆవిడ అందించిన అద్భుతమయిన ఆణిముత్యాలు కొన్ని విని ఆనందించమని విన్నపము.

Monday, January 21, 2008

దురదతో మ్రానికి వీపు రాయటం నీకే తగును!!

కాకమాని మూర్తికవి తన గురించి తాను చెప్పుకున్న ఈ పద్యం , అనాదిగా ఎంతో ప్రాచుర్యం పొందినదే -

"అల్లసానివాని యల్లిక జిగిబిగి
ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు
పాండురంగ విభుని పదగుంఫనంబును
కాకమానిరాయ! నీకెతగుర."


దీనిని రామలింగడు ఆక్షేపిస్తూ " నీకంత శక్తి ఎక్కడిదోయ్! అవికాక - దురదతో మ్రానికి వీపు రాయటం నీకే తగును. "కాక, మానిరాయ, నీకె తగుర" - అని విడదీసి వెక్కిరించాడట


ఇలాంటి ఇంకా ఎన్నో మీగడతరకలు ఇక్కడ చూడండి


వంశీ

Monday, January 14, 2008

కర్ణాటక సంగీతం పాఠాలు ( Carnatic Music E Learning at maganti.org)

శ్రీమతి చర్ల రత్న కుమారి గారి కర్ణాటక సంగీత పాఠాలు

కర్ణాటక సంగీతం - మొదటి పాఠం

ఇలాంటి ఇంకా ఎన్నో పాఠాలు మీ ముందుకు

అవకాశమిచ్చిన శ్రీమతి రత్న కుమారి గారికి పాదాభివందనాలతో

Saturday, January 12, 2008

అన్నమాచార్యుల వారి కీర్తనల లైవ్ రేడియో బ్రాడ్ కాస్ట్ - మాగంటి.ఆర్గ్ లో

టొరాంటోలో అన్నమాచార్యుల వారి కీర్తనల గురించి శ్రీమతి చర్ల రత్న గారు చేసిన లైవ్ రేడియో బ్రాడ్ కాస్ట్ ఇక్కడ వినండి

లైవ్ రేడియో బ్రాడ్ కాస్ట్


ఇక్కడ వాడుకోవటానికి అనుమతి ఇచ్చినందుకు రేడియో టొరాంటో వారికి, రత్న గారికి హృదయ పూర్వక ధన్యవాదాలతో

Monday, January 7, 2008

శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి "కన్నె పాటలు"

శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు "కన్నె పాటలు" అని ఒక అద్భుతమయిన గేయ రచన చేసారు. అందులోని పాటలు ఒకటొకటిగా మీ ముందుకు తీసుకుని రావాలి అని ఈ చిరు ప్రయత్నం.

కన్నె పాటలు

ఈ పుటలో కిందుగా ఉన్న కన్నెపాటలు మీట నొక్కండి

Sunday, January 6, 2008

లాలి పాటలు - జానపద పాటలు ఆడియో

లాలి పాటలు - జానపద పాటలు ఆడియో

రాధా మాధవ జ్యోతి (రేడియో ఆర్టిస్టు)

లాలి పాటలు / జానపద పాటలు ఆడియో - ప్రస్తుతానికి కొన్నే ఉన్నా - వరుసగా మరిన్ని పాటలతో మీ ముందుకు ...తరచుగా దర్శించండి

గ్రామదేవతలు-శిష్ఠదేవతలు-తులనాత్మక విశ్లేషణ-సాంస్కృతిక పరిశీలన

గ్రామదేవతలు-శిష్ఠదేవతలు-తులనాత్మక విశ్లేషణ-సాంస్కృతిక పరిశీలన

గ్రామ దేవతలు

డాక్టర్ ఎస్.పద్మనాభ రెడ్డి గారి గ్రామ దేవతలు - వ్యాసం రెండవ భాగం

పద్య నాటకం, గద్య నాటకం - నాటక సర్వస్వం

మిత్రులు రాం కాజ గారు నాటక సంబంధ సైటు ప్రారంభించారు...ఇక్కడ చూడండి...

నాటకం

Wishing him all the best

Vamsi

Friday, January 4, 2008

గ్రామదేవతలు

ఈ లంకె నొక్కండి డాక్టర్ ఎస్.పద్మనాభ రెడ్డి - గ్రామదేవతలు

హైదరాబాదు నాంపల్లిలోని కమీషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్లో తెలుగు రీడర్ గా పనిచేస్తున్న శ్రీ ఎస్.పద్మనాభ రెడ్డి గారు మీతో తన వ్యాసాలు పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వారికి సహస్ర ధన్యవాదాలు. ఎం.యే, ఎం.ఫిల్. పి.హెచ్ డి చేసిన డాక్టర్ పద్మనాభ రెడ్డి గారు 2003 సంవత్సరానికి మన రాష్ట్ర అత్యుత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. డాక్టర్ పద్మనాభ రెడ్డి గారు తన 26 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎందరో విద్యార్థులకి విద్యాదానం చేసారు. గత 16 సంవత్సరాలుగా ఒక పక్క ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తూనే వివిధ పరిశోధనాంశాల మీద దృష్టి నిలిపి డాక్టరేట్ పట్టా పొందిన వీరికి శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ ఆయనకు ఇంకొక డాక్టరేట్ ప్రదానం చేసే దిశగా ఉంది. ఎన్నో ప్రముఖ పత్రికలలో వీరి వ్యాసాలు ప్రచురించబడినాయి. 60 కి పైగా రేడియో ప్రసంగాలు చేసిన ఘనత వీరి సొంతం. మన భాషకి, మన రాష్ట్రానికి తన వంతుగా చేయవలసినది ఇంకా ఎంతో ఉన్నది అని ఎంతో వినమ్రంగా చెప్పే ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని కోరుకుంటున్నాను. ప్రథమంగా వీరి "గ్రామదేవతలు" వ్యాసాన్ని చదివి ఆనందించమని విన్నపం.