Monday, November 10, 2008

గయ్యాళి అంటే ఎవరు ?
తెలుగువారి గుండెల్లో తీపి గుర్తుగా మిగిలిపోయిన అత్తగారు "శ్రీమతి పెద్దిభొట్ల సూర్యకాంతం" గారి గురించి కొద్దిగా తెలుసుకుందాం. 1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని కృష్ణరాయపురంలో జన్మించిన సూర్యాకాంతం గారు వారి తలిదండ్రులకి 14వ బిడ్డ. అయితే బాధాకరంగా అందరూ చనిపోగా ఒక అక్కయ్య, ఇద్దరు అన్నయ్యలు మాత్రమే మిగిలారట. చిన్నప్పుడే నాట్యం నేర్చుకోవటం వల్లా, సినిమాలంటే పిచ్చి ప్రేమ ఉండటంవల్ల,ఏనాటికయినా తాను కూడా సినిమాల్లో నటించాలి అని ఆవిడ కలలు కనేదిట. ఆవిడ కన్న కలలు ఆవిడను జెమినీవారు చంద్రలేఖ సినిమా నిర్మిస్తున్న సమయంలో మద్రాసుకు తీసుకెళ్లి, అదే సినిమాలో డాన్సర్ గా 65 రూపాయల నెల జీతంతో సినీప్రస్థానాన్ని ప్రారంభించి ఆ స్వప్నాన్ని సాకారం చేసాయి. అయితే 65 రూపాయలే ఇస్తారా అంటూ ఆవిడ జెమినీవారితో పోట్లాడటంతో ఆ జీతం 75 రూపాయలకు పెరిగింది. నిజమెంతో తెలియదు కానీ తరువాత జరిగిన చిన్న గొడవతో జెమినీతోనూ ఆ విధంగా చంద్రలేఖ చిత్రంతోనూ ఒప్పందం రద్దు అయ్యింది అని చెపుతారు.


మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుని తల్లి పాత్రలో ఆవిడ చెప్పిన పలుకులు ఈనాటికీ ప్రజల చెవుల్లో "సుపుత్రా సుపుత్రా నీకిది తగదంటిని కదరా" అంటూ వినపడుతూనే ఉంటాయి.


నాగిరెడ్డి - చక్రపాణి కలిసి ప్రత్యేకంగా సూర్యాకాంతంగారి పాత్ర చుట్టూ ఒక కథ అల్లి, "గుండమ్మ కథ"గా మలిచి దాన్ని సూపర్ డూపర్ హిట్టు చేయించారు అంటే , వాళ్లకు ఆవిడ మీద ఎంత నమ్మకం ఉందో తెలియచేస్తుంది.ఆ రోజుల్లో సూర్యాకాంతం లేని సినిమాలేదు అంటే అతిశయోక్తి ఏమీ లేదు. ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే ఆవిడ నటించిన ఏ సన్నివేశమయినా మొట్టమొదటి టేకులోనే ఓ.కే అయ్యేది. ఆవిడతో నటించేటప్పుడు మహామహులయిన ఎన్.టీ.ఆర్, ఎస్.వీ.ఆర్, ఏ.ఎన్.ఆర్ లు కూడా చాలా జాగ్రత్తగా ఉండేవారట.

ఆవిడ తెరమీద గయ్యాళిగా పెట్టే కష్టాలకు చాలా మంది ఏకంగా శాపనార్థాలే పెట్టేవారు అని వినికిడి. ఇంకో గట్టి ఉదాహరణ ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆవిడ పేరు తమ పిల్లలకు పెట్టుకోవటానికి కూడా భయపడి, పెట్టుకునేవారు కాదు. నటనలో ఎంతో పరిపూర్ణత్వం ఉంటేనే కానీ ప్రజల హృదయాల్లో అంత ఇది లభించదు. ఆ విధంగా ఆవిడ ఆ కళామతల్లికి అతిప్రియమయిన ముద్దుబిడ్డ.

తెర మీద ఎంత గయ్యాళి పాత్ర పోషించినా, ఆవిడ చాలా మృదు స్వభావి, సౌమ్యశీలి. అవసరమయిన వారికి లేదనకుండా తనకు తోచిన సాయం చేసే గుణమున్న మనిషి. షూటింగుకు వచ్చినప్పుడల్లా ఒక పెద్ద క్యారియర్లో భోజనం తెచ్చి పదిమందికి పెట్టి వాళ్లు కడుపునిండా తింటే ఎంతో ఆనందపడేదిట. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఆవిడ ఒక వంటల పుస్తకం కూడా రాసారు.

ఐదు దశాబ్దాలు తెలుగు వారిని తన నటనతో అలరించి, ఏ పాత్రలోనయినా ఇట్టే ఒదిగిపోయి ఆ పాత్రకు పరిపూర్ణ న్యాయం చేకూర్చగలిగిన నటీమణి శ్రీమతి సూర్యాకాంతం గారికి శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం - "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

"లోకాస్సమస్తా సుఖినోభవంతు, బ్లాగే జనా సుఖినోభవంతు"

వంశీ

Friday, November 7, 2008

అపశబ్దాలు, తప్పుడు విరుపులు చోటు చేసుకునేవిట!!

తెలుగు నాటక, చలనచిత్ర చరిత్రల్లో బహుముఖ ప్రజ్ఞాదురంధరత కలిగిన అగ్రశ్రేణి సాహితివేత్తలు ఎవరు అని ప్రశ్న వస్తే అందులో మొదటగా గుర్తుకువచ్చేది బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు. తెలుగు నాటకం మీద, నాటక కళాకారుల మీద ఈ దశాబ్దపు మొదటి భాగంలో గౌరవం పెరగడానికి కారణం ఒకటి అని చెప్పుకోవచ్చు.స్వయంగా నాటక కర్తలే నటులుగా ప్రవేశం చెయ్యటం. అప్పటిదాకా ఆయా నాటకాల్లో పాత్రలు వేస్తున్నవాళ్ళు పండితులు కాకపోవటంవల్ల, అపశబ్దాలు, తప్పుడు విరుపులు చోటు చేసుకునేవిట. కానీ వేదం వేంకటరాయ శాస్త్రిగారు, ధర్మవరం వారు, కోలాచలం వారు, బలిజేపల్లి మొదలయిన వారు తాము స్వయంగా రంగంలోకి దిగటంతో, నాటక రంగం కొత్తవెలుగుని చవి చూసింది.

లక్ష్మీకాంతం గారు స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. గాంధీజీ అంటే ఆయనకు చాలా భక్తి ఉందేది అట. స్వాతంత్ర్య పోరాట సమయంలో రెండేళ్లు కారాగార వాసం కూడా అనుభవించారు. స్వరాజ్య రథము, స్వరాజ్య సమస్య అనే ఖండకావ్యాలు కూడా రచించారు.

బలిజేపల్లి వారు తన నాటకల్లో లేని వ్యావహారిక భాషని , తాను రాసిన సినిమా పాటల్లో చొప్పించి ఎంతో అందమయిన పాటలని సృష్టించారు. లక్ష్మీకాంతం గారు చాలా సినిమాలకు స్క్రిప్టు కూడా రాయటమే కాకుండా సినిమాల్లో నటించారు కూడా. ఆయన రచన చేసిన సినిమాలు మచ్చుకి కొన్ని - బ్రహ్మరథము,భూకైలాసము, ధ్రువ విజయము, సతీ అనసూయ, బాలనాగమ్మ, ముగ్గురు మరాటీలు. అలాగే గుణసుందరి, వరవిక్రయం సినిమాల్లో నటించారు కూడా.వరవిక్రయంలో ఆయన వేసిన సింగరాజు లింగరాజు పాత్ర ఆరోజుల్లో చాలా పేరు తెచ్చిపెట్టింది ఆయనకు.

జీవిత చరమాంకంలో కాళహస్తి రాజావారి ఆహ్వానం మీద శ్రీకాళహస్తి చేరుకుని, అక్కడి ప్రశాంత వాతావరణంలో ఇల్లు కట్టుకుని, శేష జీవితాన్ని మహాపుణ్యక్షేత్రమయిన ఆ శివసాన్నిధ్యంలో గడిపిన ధన్యజీవి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు.

బహుముఖ ప్రజ్ఞావంతుడు, నాటకకర్త, నటుడు, కవి, సంగీతకళానిధి అయినటువంటి బలిజేపల్లి లక్ష్మీకాంతం గారికి శతకోటి నీరాజనాలు అర్పిస్తూ, ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం - "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Friday, October 24, 2008

ఈయన కవిత నిజంగా, నగ్నంగా ఉంటుంది.

బసవరాజు అప్పారావు గారు భావకవులలో ఒక విశిష్టమైన కవి. జీవించింది ముప్ఫైమూడు సంవత్సరాలే అయినా భావకవుల్లో మిన్నగా వాసికెక్కిన కవి. బసవరాజు నండూరి, దేవులపల్లి, రాయప్రోలు కన్నా కూడా ముందే పాటలల్లారు. ఒకరకంగా దేవులపల్లి వారికి అప్పారావుగారి భావావేశమే స్ఫూర్తి అని చెప్పవచ్చు. నిజమెంతో తెలియదు కానీ, బసవరాజు అప్పారావుగారి ప్రేరణ వల్లే నండూరి సుబ్బారావుగారు "యెంకి" పాటలు రాసారట.

వైతాళికులలో ముద్దు కృష్ణ గారు అప్పారావుగారిని పరిచయం చేస్తూ “ఈయన కవిత నిజంగా, నగ్నంగా ఉంటుంది” అన్నారు. నిజంగానే ఈయన కవితలో అబద్ధాలేవీ మనకి కనబడవు. ఎటువంటి ఆర్భాటాలూ లేకుండా సూటిగా మన గుండెల్లోకి దూసుకుపోతాయి.

''నవ్య కవిత్వానికి గురజాడ వేగుచుక్క అయితే, భావకవితా జగత్తులో బసవరాజు పగటి చుక్క. దేవులపల్లి రేచుక్క.''-అంటారు పరిశోధకులు.


సంఘ సంస్కరణ, దేశభక్తి, వేదాంతం, ప్రేమ ఇలా ఒకటా రెండా, ఎన్నో విషయాల మీద అమితమయిన భావావేశంతో గీతాలు రాసి, తర్వాతి కవులకు స్ఫూర్తిగా ప్రేరణగా నిలిచి,అతి చిన్న వయసులోనే ఈ లోకానికి వీడ్కోలు పలికిన ఆ ధన్యజీవికి నీరాజనాలు అర్పించటమే మనం ఆయనకు అర్పించగలిగే నివాళి.

అప్పారావుగారికి శతకోటి నీరాజనాలు అర్పిస్తూ, ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం - "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Monday, October 20, 2008

భట్ మాత్రం నిజంగా భట్రాజే !...

భట్ మాత్రం నిజంగా భట్రాజే


జాతీయవాది, దేశభక్తుడు అయిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని ఒక సారి బందరులో ఘనంగా సన్మానించారట. ఆ సభకు వక్తగా విచ్చేసినవారిలో శ్రీ పి.పి.భట్ గారు ఒకరు. ఆయన పట్టాభి గారిని గురించి చెపుతూ - భోగాన్ని అనుభవించడంలో ఆయన భోగరాజు, ధర్మగుణంలో ఆయన ధర్మరాజు, దానం చేయడంలో దానరాజు, త్యాగశీలతలో త్యాగరాజు అని ఇలా పొగడడం మొదలెట్టారట. పొగడ్తలంటే అసలే గిట్టని పట్టాభి గారు ఆయన ప్రసంగం అయ్యాక "నా గురించి భట్ గారు చెప్పింది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ భట్ మాత్రం నిజంగా భట్రాజే" అన్నారట.

Source: Dr Dwa.na.Sastry

Friday, October 17, 2008

శ్రీ వంగర వెంకట సుబ్బయ్యగారి రేడియో కార్యక్రమం ....

హాస్యం అనే ఒక చక్కని బొమ్మని హావభావాలు అనే ఉలితో చెక్కిన హాస్యశిల్పి, ఎలాంటి పాత్రలోనయినా అవలీలగా ఒదిగిపోయే నటుడు శ్రీ వంగర వెంకట సుబ్బయ్యగారికి శతకోటి నీరాజనాలు అర్పిస్తూ, ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం - "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..


http://www.radio.maganti.org/


లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Monday, October 13, 2008

విఘ్నం రాకూడదని గాడిదనెందుకండీ ధ్యానించడం?

మహా మహోపాధ్యాయ వేదము వెంకటరాయశాస్త్రి గారు ఒక సభలో ప్రసంగిస్తూ - " ప్రతిమాటకీ, శ్లోకానికీ అర్ధము, విపరీతార్ధమూ కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు 'శుక్లాంబరధరం' అనే శ్లోకానికి గాడిద పరంగా అర్ధం చెప్పవచ్చు ' అని అన్నారట.

అదెలాగో చెప్పండని అడిగాడొకాయన సభలో నుంచి. వేదం వేంకటరాయ శాస్త్రిగారు - 'శుక్ల అంటే తెల్లనైన, అంబర అంటే వస్త్రములను, ధరం అంటే ధరించినదియు అనగా మోయుచున్నట్టిదియు, విష్ణుం అంటే వ్యాపించినట్టిదియు అనగా ఒక చోట స్థిరముగా వుండక తిరుగునదియు, శశి వర్ణం అంటే బూడిదరంగు కలిగినదియు, చతుర్భుజం అంటే నాలుగు కాళ్ళు కలదియు, ప్రసన్న వదనం అంటే దాని ముఖం ఎంత ప్రసన్నము, అట్టి దానిని అన్ని విఘ్నములను ఉపశమించుటకు ధ్యానించుచున్నాను ' అని చెప్పారట.

'అయితే విఘ్నం రాకూడదని గాడిదనెందుకండీ ధ్యానించడం' అని మళ్ళీ అడిగాడు మొదటి ప్రశ్న వేసిన పెద్ద మనిషి. 'ఓ గాడిదా ! మా ఉపన్యాసమునకు అడ్డు రాకుమా. మా పనికి మాటిమాటికీ అడ్డు రాకుమా అని మా ప్రార్ధన ' అని అన్నారట శాస్త్రి గారు. ఆ పెద్దమనిషి మరి నోరు ఎత్తలేదు.

Sunday, October 12, 2008

Saturday, October 11, 2008

అనివార్య కారణాల వల్ల.....

అనివార్య కారణాల వల్ల రేడియో స్టేషన్ కు వెళ్లలేకపోయినందుకు, ఈ వారం వంగర వెంకట సుబ్బయ్యగారి మీద రూపొందిన కార్యక్రమం ప్రసారం చేయలేకపోయినందుకు చింతిస్తున్నాను.

వచ్చేవారం మళ్లీ ఇదే సమయానికి..

వంశీ

ప్రపంచ దేశాలు చెప్పటానికి "బబ్బ" కావాలి.....

ప్రపంచ దేశాలు చెప్పటానికి "బబ్బ" కావాలి..

http://maganti.org/familyphotos/vaishnavi/audio/oct/countries.mp3

పూర్తిగా విని ఇక్కడ చెప్పినవి ఎన్నో లెక్కబెట్టి, అసలు "బబ్బ" తాగిందో లేదో కామెంటినవాళ్లకి కిరీటాలు

అలాగే మిగతావి ఇక్కడ

గ్రహాల పేర్లు - http://maganti.org/familyphotos/vaishnavi/audio/oct/planets.mp3

పన్నెండు నెలలు - http://maganti.org/familyphotos/vaishnavi/audio/oct/months.mp3

Friday, October 10, 2008

"కు లేదు కానీ అంతా లాసే బాబూ"

ఇప్పటి తరం వారిలో ఎంతమందికి వంగర అంటే చటుక్కున ఆయన జ్ఞాపకం వస్తారో తెలియదు కానీ, మాయాబజార్ చిత్రం చూసుంటే అందులోని పురోహితుడు శాస్త్రి పాత్ర వేసిన నటుడు అంటే మటుకు చప్పున ఆయన మొహం కళ్ళముందు కదలాడుతుంది. మాయాబజార్ చిత్రంలో అల్లు రామలింగయ్యతో కలిసి వంగర పంచిన హాస్యవల్లరి, చలనచిత్ర చరిత్రలో ఒక అరుదయిన ఆణిముత్యం.

ఆయన్ని ఎవరయినా - "ఏమండీ కులాసానా?" అని అడిగితే "కు లేదు కానీ అంతా లాసే బాబూ" అనేవారట. పోనీ అలా అడిగితే ఇలా అంటున్నారు అని "ఏమండీ పంతులు గారు - క్షేమమా?" అని అడిగితే - "ఆహా అంతా క్షామమే" అని చెప్పేవారట. ఆయన్ని దగ్గరి వారంతా వంగర అని కాకుండా "వ్యంగ్యర" అని పిలిచేవారట.

బాలయోగిని, మాలపిల్ల, రైతుబిడ్డ, ఘరానా దొంగ, పత్ని, పల్నాటియుద్ధం, మనదేశం, రక్షరేఖ, షావుకారు, మల్లీశ్వరి, ధర్మదేవత, పెద్దమనుషులు, కన్యాశుల్కం, తెనాలి రామకృష్ణ, పాండురంగ మహత్యం, మాయాబజార్, మాంగల్యబలం, దైవబలం, మహాకవి కాళిదాసు, శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యం, తిరుపతమ్మ కథ, నర్తనశాల, బభ్రువాహన - ఇలా ఎన్నో చిత్రాలలో నటించి, హాస్యం అనే అమృతాన్ని మనకు అందించి ఆ పైలోకాలకు తరలి వెళ్ళిపోయినా, ఈ చలనచిత్ర జగత్తు, తెలుగు ప్రజలు ఆ అమృతాన్ని జీవితాంతం సేవిస్తూనే ఉంటారు.


హాస్యం అనే ఒక చక్కని బొమ్మని హావభావాలు అనే ఉలితో చెక్కిన హాస్యశిల్పి, ఎలాంటి పాత్రలోనయినా అవలీలగా ఒదిగిపోయే నటుడు శ్రీ వంగర వెంకట సుబ్బయ్యగారికి శతకోటి నీరాజనాలు అర్పిస్తూ, ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం - "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/


లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

PS: అనివార్య కారణాల వల్ల ఈ వారం వంగర వెంకట సుబ్బయ్యగారి మీద రూపొందిన కార్యక్రమం ప్రసారం చేయలేకపోయినందుకు చింతిస్తున్నాను.వచ్చేవారం మళ్లీ ఇదే సమయానికి..

Monday, October 6, 2008

తెలుగులో మొట్టమొదటి "రాప్" పోకడల పాట ఇదేనా ?

నిన్న ఆదివారం బలిజేపల్లి లక్ష్మీకాంతకవి గారి జీవితవిశేషాలతో ప్రసారమయ్యే రేడియో కార్యక్రమం కోసం పనిచేసుకుంటున్నప్పుడు 1949లో విడుదలయిన "రక్షరేఖ" చిత్రంలోని "చేయి చేయి కలుపుకోరా" అనే పాట ఒకటి - ఆయన రాసిందే - శివరావు, కనకం గార్ల గళంలోనిది విని ఒక అనుమానం వచ్చింది.

మొదటి రెండు మూడు లైన్ల తర్వాత పాట ఒక రకమయిన "రాప్" సంగీతం పోకడలు పోతోంది అని అనిపించింది...అలా మీకు కూడా అనిపిస్తే........!!!

తెలుగులో మొట్టమొదటి "రాప్" పోకడల పాట ఇదేనా అని నా అనుమానం?

ఆ పాట వినాలి అంటే "ఓల్డ్ తెలుగు సాంగ్స్.కాం" కి వెళ్లి అక్కడ రక్షరేఖ చిత్రం సెలక్ట్ చేసుకుని వినండి...

Saturday, October 4, 2008

అసలు ఆ పదార్ధం లేకపోతే పని జరగదా?

ఇది చదివే ముందు ఈ టపాకి ప్రేరణ (ప్రేరేపించిన?) మచ్చుకి ఇక్కడ చదవండి.. కామెంటక ముందు ఈ నా టపాలో ఉన్న ప్రతి లైన్ ని రెండు మూడు సార్లు చదువుకుని అర్థం చేసుకోమని విన్నప...ఇది డాక్టర్ దార్ల గారి మీద కోపంతో రాసింది కాదు అని విన్నవిం...

http://vrdarla.blogspot.com/2008/10/blog-post_04.html

http://vrdarla.blogspot.com/2008/10/dalit-students-union-3-10-2008.html


ప్రేరణ ఇది ఒకటి మాత్రమే కాదు- ఇలాటివి, ఇతరులవి బోలెడు ఉన్నాయి...కొంతమందికి నేను రాసిన , రాస్తున్న ఈ టపాలో అంతలా రియాక్ట్ అవ్వటానికి ఏముంది అని అనిపించవచ్చు...కానీ నా పాళీలో సిరాకి ఈ కైపు ఎక్కడానికి ఇంకా బోలెడు కారణాలు...తర్వాత వివరంగా...


ఈయన టపా గబుక్కున కళ్ల ముందు కదలాడతంతో ఈ లింకులు ఇవ్వటం జరిగింది తప్ప...వేరే ఉద్దేశం ఏమీ లేదు...

మాష్టారూ - అంతా బానే ఉంది కానీ, ప్రతి దానికి ముందు "దళిత" చేర్చటమే కొంచెం "ఇది"గా ఉన్నది..

అసలు ఆ పదార్ధం లేకపోతే పని జరగదా?

మనం చేసే పనిలో పస ఉండాలి కానీ, పెట్టుడు పేర్లలో ఏముంది?

ఆఖరికి స్టూడెంట్స్ యూనియన్లో కూడా "దళిత" పదం చేరిపోయింది అంటే బాధేసింది...మీరు మాష్టారు అయ్యుండి, ఇలాంటివి .......

బై ది బై - అసందర్భం కాకపోతే మీరు ఎంతగానో అభిమానించే ద్వా.నా.శాస్త్రి గారు మా మావయ్యే...:)...

కొద్ది రోజులు పోతే పళ్లు తోముకునే టూత్ పేష్టు, తినే అన్నానికి కూడా ఈ పెట్టుడు పేరు "బ్రాండ్ అంబాసిడర్" గా మారిపోతుందేమో....భళా ...

స్త్రీవాదం, దళితవాదం, హేతువాదం, నాస్తికవాదం, బోడిగుండు వాదం అన్నీ వదిలిపెట్టి మానవతావాదం వైపు అడుగులు పడవా మనకి ? అసలు ఈ పదాలు వాడటం ఎంత అవసరం ? ఎవరికి ఉపయోగం? పేరు - ఆ పేరు తగిలించుకున్నంత మాత్రానే సాగర మథనం జరిగి అమృతం బయటికి వచ్చిందా? వస్తే ఎంతమందికి దక్కింది ? దక్కిన వాళ్లు దేవతలై ఇతరులకి ఎన్ని వరాలు ఇచ్చారు ? ఇవి అన్నీ డాక్టర్ దార్ల గారినే అడిగాను అనుకుంటే పొరపడ్డట్టే...ఇవి ఈ వాదాలతో వేళ్లాడేవారందరికీ అని చిత్తగిం....


ఈ మధ్య ఈ అనవసరమయిన పేర్లు ఉన్న "వాదాలు" ఎక్కడ చూసినా "ఇంతింతై దళితంతై, స్త్రీవాదంతై, హేతువాదంతై, నాస్తికవాదంతై" లాగా ఆవరించి కనపడుతుంటే.....


ఎప్పుడో ఏదో జరిగింది అని ఇప్పుడు బోరు తవ్వి బావిలో పడేసి ఈ నామం చేర్చి కుమ్మిస్తా అంటే...

ఇంతే సంగతులు చిత్తగించవలెను...

Friday, October 3, 2008

సక్కగా బొట్టెట్టి, పంచె ఎగ్గట్టి ఇందూ సోదరులకు ఇందులెప్పుడయినా ఇస్తిరా?

రంజాన్ - ముసల్మానుల పయిత్రమైన నెల - "ఈద్" ఒక గొప్ప .....

తమ్మి పోరలకు ఇందువుల ఇఫ్తార్ విందు బహు పసందు..

అయితే - మనోళ్లంతా - ఇందూ అన్నలంతా - బభ్రాజమానాలాంటోళ్లంతా, చీపు మినిష్టరు, జవ జవలాడే గవర్నరు అయ్యోరితో సహా ముసల్మాను టోపీలెట్టుకుని, మసీదుల్లో ప్రార్థనలు జేసి మన ముసల్"మాను" సోదరులకు ఇందులిస్తే, షబ్బీరు అలీ అయ్యోరు, ఒవైసీ అయ్యోరు, మిగిలినోళ్లు, సోదర మత పెద్దలు దసరా పండక్కి - సక్కగా బొట్టెట్టి, పంచె ఎగ్గట్టి ఇందూ సోదరులకు ఇందులెప్పుడయినా ఇస్తిరా?


ఇఫ్తార్ ఇందు భుక్తాయాసం తీరేప్పటికి మన దసరా అయిపోద్ది కాబోలు...

నవ్వు ...నవ్వు..నాపసేను ఇరగకాసిద్దిలే...

శ్రీశ్రీకి చక్రపాణి కలలో కనపడి ఇలా అడిగాడట!!!

శ్రీశ్రీ రాసిన సిరిసిరి మువ్వ శతకంలోని కొన్ని మువ్వలు..అన్నీ కందాల అందాలే మరి !

కుర్చీలు విరిగిపోతే
కుర్చోడం మాననట్టు గొప్ప రచనలన్
కూర్చే శక్తి నశిస్తే
చేర్చదగు నొకింత చెత్త సిరిసిరి మువ్వా!


పెసలో, బొబ్బర్లో, వే
రుసెనగలో విక్రయించి రూపాయలు బొ
క్కసమున కెక్కించడమా
సిసలయిన కవిత్వ రచన సిరిసిరి మువ్వా!


ఖగరాట్ కృషి ఫలితంగా
పొగాకు భూలోకమందు పుట్టెను గానీ
పొగ చుట్ట లెన్ని అయినను
సిగరెట్టుకు సాటి రావు సిరిసిరి మువ్వా!


ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన ఊరనుండుము
చొప్పడ కున్నట్టి ఊరు చొరకుము మువ్వాశ్రీశ్రీకి చక్రపాణి కలలో కనపడి ఇలా అడిగాడట

నీకొక సిగరెట్టిస్తా
నా కొక శతకమ్ము వ్రాసి నయముగ నిమ్మా
త్రైకాల్య స్థాయిగ నీ
శ్రీ కావ్యము వరలునోయి సిరిసిరి భాయీ!జీవిత మొక యాగముగా
భావన మొక యాగముగ స్వభావము భోగా
భోగముగ తిరుగు తిరుపతి
జేగురు గడ్డము నుతింతు సిరిసిరి మువ్వా!ఉగ్గేల త్రాగుబోతునకు?
ముగ్గేలా తాజమహలు ముని వాకిటిలో?
విగ్గేల కృష్ణశాస్త్రికి?
సిగ్గేలా భావకవికి? సిరిసిరి మువ్వా!అందంగా, మధురస ని
ష్యందంగా, పఠితృ హృదయ సంస్పందంగా
కందా లొకవంద రచిం
చిందికి మనసయ్యె నాకు సిరిసిరి మువ్వా!తలకాయలు తమ తమ జే
బులలోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజులు వస్తే
సెలవింక డెమోక్రసీకి సిరిసిరి మువ్వా!


ఈ రోజులలో ఎవడికి
నోరుంటే వాడె రాజు, నూరుచు మిరియాల్
కారాలు, తెగ బుకాయి
స్తే రాజ్యా లేలవచ్చు సిరిసిరి మువ్వా!


ఏవేనా కొత్తవి రా
శావా? చూపించమంచు చంపేవాళ్ళం
తా వినడానికి నేనీ
జీవత్కృతి నాలపింతు సిరిసిరిమువ్వా!మళ్లీ ఇన్నాళ్లకి ఇ
న్నేళ్లకి పద్యాలు రాయుటది ఎట్లన్నన్
పళ్లూడిన ముసలిది కు
చ్చిళ్లను సవరించినట్లు సిరిసిరిమువ్వా!తెగకుట్టి వదిలిపెట్టిన
వగణిత వైజాకు దోమలశ్వత్థామల్
పొగరెక్కిన రెక్కేంగులు
సిగలెగసెడు తుమ్మముళ్లు సిరిసిరిమువ్వా!నాలాగ కంద బంధ
జ్వాలా జాలాగ్ర సంవసత్ సద్గీతా
లాలాపించే కవితా
శ్రీలోలుడు నహినహీతి సిరిసిరి మువ్వా!


గొర్రెల మందగ, వేలం
వెర్రిగ ఉద్రిక్తభావ వివశులయి జనుల్
కిర్రెక్కి పోయినప్పుడు
చిర్రెత్తుకు వచ్చునాకు సిరిసిరిమువ్వా!ఇంతెందుకు? వింతలలో
వింతైన విశేషమొకటి వినిపిస్తున్నా
సొంతంగా సాంతంగా
చింతిస్తే పెద్దతప్పు, సిరిసిరిమువ్వా!


పందిని చంపినవాడే
కందం రాయాల టన్న కవి సూక్తికి నా
చందా యిస్తానా? రా
సేందు కయో షరతులేల ? సిరిసిరి మువ్వా!బంగాళాఖాతంలో
సంగీతం పారవైచి సాయంకాలం
కాంగానే ఆకాశపు
చెంగావిని త్రాగెనొకడు సిరిసిరిమువ్వా!
చివరిగా

"వైవాహిక జీవితములు దావాలకు దారితీసి తగులడిపోతే కేవలము పెళ్ళిమాని ఖుషీవాలాలగుట మేలు సిరిసిరి మువ్వా"

అని కూడా అన్నాడండోయి ఆయన

Sunday, September 28, 2008

"దేశభాషలందు తెలుగు లెస్స" అని కృష్ణదేవరాయల కంటె ముందరే వల్లభరాయలవారు శలవిచ్చారు...

1430 ప్రాంతంలోని సాహితీవేత్త వినుకొండ వల్లభరాయడు రాసిన క్రీడాభిరామం - ఆనాటి ఓరుగల్లు వీథులలో వెల్లి విరిసిన ఆంధ్ర సాంఘిక జీవన చలన చిత్రం. ఈ అద్భుతమయిన కావ్యంలో "దేశభాషలందు తెలుగు లెస్స" అని కృష్ణదేవరాయల కంటె ముందరే వల్లభరాయలవారు శలవిచ్చారు. ఇద్దరూ "రాయలే" అయినా ఒకాయన నిఝ్ఝంగా రాజుగారు అవ్వటంవల్ల, రాజు గారి మాట ప్రపంచానికి బాట అయ్యిందన్నమాట...

ఆ.వె - జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?


కానీ రాయలవారు కూడా "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పారు కాబట్టి దానికి అంత విఖ్యాతి వచ్చింది అనుకోవాలి ... :)..

కాకపోతే క్రీడాభిరామం శ్రీనాథుడు వ్రాసి వుండవచ్చు అని వేటూరి ప్రభాకరశాస్త్రి గారు విభేదిస్తున్నారట.

Friday, September 26, 2008

ఘంటసాల మాష్టారు "ఒయ్యాల" అని పాడారా, "ఉయ్యాల" అని పాడారా?

నిన్న మాష్టార్ వేణు గారి రేడియో ప్రోగ్రాము కోసం పని చేసుకుంటున్నప్పుడు ఒక సందేహం వచ్చింది.

ఘంటసాల మాష్టారు మాంగల్యబలం చిత్రంలోని "ఆకాశవీధిలో అందాల జాబిలి" పాటలో 2.14 ని. వద్ద "ఒయ్యాల" అని పాడారా, "ఉయ్యాల" అని పాడారా? సుశీలమ్మ ఉయ్యాల అనే పాడారు. అది తెలిసిపోతోంది. మాష్టారుదే, ఎన్ని సార్లు విన్నా "ఒయ్యాల" వైపే ఒరుగుతోంది. మళ్లీ 3.18 ని. వద్ద "ఉయ్యాల" అనే వినపడుతోంది..:)...

ఈ పాట వినాలి అంటే www.oldtelugusongs.com కు వెళ్ళి అక్కడ "సెర్చ్" లో మాష్టర్ వేణు గారిని "సెలక్ట్" చేసుకుని వినండి.

ఏదయితేనేం డిగ్రీయే నా ఇంటి పేరులాగా అయిపోయి ......

తెలుగు చలనచిత్ర జగత్తులో జానపద సంగీతపు పోకడలకు పెద్ద పీట వేసి, నవ్యరీతులు చొప్పించి ఒక సముచితమయిన స్థానం కలిపించిన సంగీతస్వర సమ్రాట్టు మాష్టర్ వేణు గారికి నీరాజనాలు అర్పిస్తూ, ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆ పాత మధురాలు" విని ఆనందించండి ..

ఆయన్ను అందరూ మాష్టర్ వేణు అని ఎందుకు పిలిచేవారో ఆయన మాటల్లోనే - “నన్ను అందరూ మాష్టార్ వేణు అని పిలవడానికి రెండు కారణాలు – ఒకటి నేను బొంబాయిలో స్కూల్ ఆఫ్ మ్యూజిక్లో హార్మోనియంతో ఫాటు, ఇతర వాయిద్యాలు నేర్చుకుని పుచ్చుకున్న పట్టా, ఈ పట్టా సంగతి తెలిసిన వాళ్ళు నన్ను మాష్టర్ అని పిలిచేవాళ్ళు. ఇంకొందరేమో - చిన్నపిల్ల వేషాలు వేసేవాళ్ళని మాష్టర్ అనడం అలవాటుకదా, నేను కూడా అలా చిన్నతనంలో వేషాలు వేసానేమో అని అనుకుని మాష్టార్ అని పిలిచేవాళ్ళు. ఏదయితేనేం డిగ్రీయే నా ఇంటి పేరులాగా అయిపోయి నన్ను మాష్టర్ వేణుని చేసింది” అని నిర్మలంగా నవ్వుతూ చెప్పేవారట.

వాడినపూలే వికసించెలే, కనులు కనులు కలిసెను, సడిసేయకో గాలి , ఆకాశ వీధిలో అందాల జాబిలి, ఏరువాకా సాగారో చిన్నన్న , ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే, ఈ పగలు రేయిగా పండువెన్నెలగ, కనులకు దోచి......ఇలా ఒకటా రెండా ...తన అద్భుతమయిన సంగీత ప్రతిభకు కొలబద్దగా అమూల్యమయిన ఎన్నో స్వరకుసుమాలను మనకు వదిలిపెట్టిన ఆ మాష్టారు పాదాలకు వేనవేల నమస్కారాలు అర్పిస్తూ .......

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Thursday, September 25, 2008

ముసలమ్మ కాలుజారిన పక్షమున ఎన్ని పిల్లిమంత్రములు వేసిన నీళ్లలో పడును?

చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు పరీక్షాపత్రాల పద్ధతిని తన ప్రహసనాల్లో గొప్పగా వివరించారు. మచ్చుకు ఒక రెండు

ఆకాశ విశ్వవిద్యాలయం : ఇంద్రవారము, 37వ డిశంబరు 19673 సంవత్సరము. కాలము అసుర సంధ్యవేళ గం 7-5ని మొదలు 7-6ని వఱకు

విషయం - గణితము:

1. చెన్నపట్టణమున గొల్లవాడొకడు ఇంటింటికి ఆవును దూడను తీసుకుని వచ్చి పిదకదలచి పాలు చేపుదల నిమిత్తము ప్రతి ఇంటి వద్ద దూడను ఒకసారి తల్లితో కలిపి వెంటనే యీవల కీడ్చుచు వచ్చును. అతడా విధముగా ప్రతిదినము 12 ఇళ్ళకూ పాలిచ్చుచూ వచ్చును. (ఎ) ఒక్కొక్క ఇంటివద్ద నొక్క చుక్క పాలు దూడ త్రాగిన పక్షమున వారమున కెన్ని చుక్కల పాలు దూడ త్రాగును? (బి) నూరు చుక్కలు ఒక గిద్దెడుగా లెక్క చూచుకున్న పక్షమున దూడ కడుపులో సోలెడు పాలు పడునప్పటి కెంతకాలము పట్టుతుంది?

2. రాజమహేంద్రవరములో గోదావరి ఒడ్డున వేసిన గట్టుమీద మెట్లమీదుగా గోదావరిలోకి డెబ్బది సంవత్సరముల ముసలమ్మ దిగితే కాలుజారిన పక్షమున ఎన్ని పిల్లిమంత్రములు వేసిన నీళ్లలో పడును?

ఇలా బోలెడు ఉన్నాయి ఆ ప్రహసనాల్లో ....

Tuesday, September 23, 2008

శంకరంబాడి సుందరాచారి "బొట్టు" !

"మా తెలుగు తల్లికి మల్లెపూదండ" అనే గొప్ప గీతం రాసిన శంకరంబాడి సుందరాచారి 1936 - డిసెంబరు నాటి ' వీణ ' పత్రికలో జానపదుల శైలిలో రాసిన "బొట్టు" గేయం ఇది

పరిగెత్తి నన్నంటి పట్టుకోరమ్మంటె
ఏమేమొ సేస్తావె నా మావాఁ!
ఇటుసూడు నా వొంక నా మావాఁ!
రంగిసెక్కిళ్ళంటి- రాలిపోతున్నాయి
ముద్దుసెమ్మటబొట్లు-ముత్తాలసరవంటు
అందుకొంటున్నావె-నా మావాఁ!
అందులోనేవుంది- నా మావాఁ!

Sunday, September 21, 2008

"ఆడబ్లాగుల్లో సోదే ఉంటుందా?" చూసి చటుక్కున ఇది గుర్తుకువచ్చింది

ఆడబ్లాగుల్లో సోదే ఉంటుందా అని సిరిసిరిమువ్వగారు వ్రాసిన టపా చూసి చటుక్కున "ఇంతింతై వధువింతై..." పద్యం గుర్తుకువచ్చింది.. :)

http://www.maganti.org/migadatarakaluindex.html

ఈ వెబ్ పేజీలో "ఇంతింతై వధువింతై..." లంకె నొక్కండి.. :)

వంశీ

Saturday, September 20, 2008

సంగీత దర్శకుడు మాష్టర్ వేణు గారి ఇంటి పేరు ఎవరికయినా తెలుసా?

సంగీత దర్శకుడు మాష్టర్ వేణు గారి ఇంటి పేరు ఎవరికయినా తెలుసా? ఆయన, నటుడు భానుచందర్ గారి తండ్రి కూడా!.. :)

Wednesday, September 17, 2008

ఆయన శూలం తిప్పితే ఈయన వాలం తిప్పాడట...

ఆతుకూరి మొల్ల కృష్ణదేవరాయలను సందర్శించినప్పుడు చెప్పిన పద్యం ఇది

అతడు గోపాలకుండితడు భూపాలకుం
డెలమినాతని కన్ననితడు ఘనుడు
అతడు పాండవపక్షుడితడు పండితరక్షు
డెలమినాతని కన్ననితడు ఘనుడు
అతడు యాదవపోషి ఇతడు యాచకతోషి
యెలమినాతని కన్ననితడు ఘనుడు
అతడు కంసధ్వంసి ఇతడు కష్టధ్వంసి
యెలమినాతని కన్ననితడు ఘనుడు

పల్లెకాతండు పట్టణ ప్రభువితండు
స్త్రీలకాతండు పద్మినీ స్త్రీలకితడు
సురలకాతండు తలప భూసురులకితడు
కృష్ణుడాతండు శ్రీమహాకృష్ణుడితడు


ఇది విన్నాక తెనాలి రామకృష్ణయ్య ఊరకుంటాడా? కృష్ణదేవరాయలు మానవమాత్రుడే తప్ప ఆ దేవదేవుడు కృష్ణుడితో సమానం కాదని, మొల్లని అధిక్షేపిస్తూ ఇలా చెప్పాడట


అతడంబకు మగండితడమ్మకు మగండు
నెలమినాతనికన్న నితడు ఘనుడు
అతడు శూలముద్రిప్పు నితడు వాలము ద్రిప్పు
నెలమినాతనికన్న నితడు ఘనుడు
అతడమ్మున నేయు నితడు కొమ్మునడాయు
నెలమినాతనికన్న నితడు ఘనుడు
అతని కంటను చిచ్చు నితని కంటను బొచ్చు
నెలమినాతనికన్న నితడు ఘనుడు

దాతయాతండు గోనెల మోత యితడు
దక్షుడాతండు ప్రజల సంరక్షకుడితడు
దేవుడాతండు కుడితికి దేవుడితడు
పశుపతి యతండు శ్రీమహాపశువితండు


మొల్ల అలా అనడం అతిశయోక్తే తప్ప, అందులో ఔచిత్యం లేదని వికటకవీంద్రుల వారు తెలియచేసారు. శివుడికీ, ఎద్దుకీ సారూప్యాలు తెచ్చి ఎద్దును శివుడికన్నా అధికంగా నిరూపించడం రామకృష్ణయ్యకే సాధ్యం.. :)

Tuesday, September 16, 2008

జాగ్రత్తగా విని "ఐస్ ఎన్ షవర్" అని, "అబ్బలం" అని ఎక్కడ వినపడిందో చెప్పినవారు విజేతలు!

42 మంది అమెరికా అధ్యక్షుల పేర్లు చెప్పిన రెండున్నరేళ్ళ వైష్ణవి.ఇక్కడ వినొచ్చు.

http://maganti.org/audiofiles/vaishnavi/42USPresidents.mp3


జాగ్రత్తగా విని "ఐస్ ఎన్ షవర్" అని," అబ్బలం" అని ఎక్కడ వినపడిందో చెప్పినవారు విజేతలు, కిరీటధారులు. :)..

వంశీ

విహారి వేసిన, చేసిన బ్లాగోళ జంభ వీడియో - ఊ..ట్యూబులో?

http://www.youtube.com/watch?v=3K2uPCnhMuI&feature=related


విహారి వేసిన, చేసిన బ్లాగోళ జంభ వీడియో - ఊ..ట్యూబులో

ఏదో వెతకటానికి వెళ్తే ఏదో తగిలింది .. :)

అందరూ ఇదివరకే చూసేసి ఉంటే మళ్ళీ చూడండి....


గది అయినాంక దూస్రా పార్ట్ ఈడ సూడండి...

http://www.youtube.com/watch?v=cmTHBERB0wg


వంశీ

Monday, September 15, 2008

నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్!

1660 ప్రాంతంలో నెల్లూరు జిల్లా తెట్టు గ్రామ వాస్తవ్యులయిన మోచర్ల వెంకన్న, మోచర్ల దత్తప్ప కవులు తిరుపతి వేంకట కవులకు పూర్వరూపాలుగా కనిపిస్తారు అని తెలియవస్తోంది. వివిధ రాజుల ఆస్థానాలు సందర్శించి అక్కడి విద్వత్కవులను ఓడించి, ఘనసమ్మానాలందుకున్న ఘనులట.
ఉదాహరణకి వీరి సమస్యా పూరణ ఒకటి చూడండి

సమస్య: నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

చం: అనిలజ! జాంబవంత! కమలాప్త తనూభవ ! వాయుపుత్ర ! ఓ
పనస! సుషేణ ! నీల ! నల ! భానుకులుం డగు రాఘవేంద్రు డ
ద్దనుజ పురంబు నే గెలువ, దైత్యుల జంపగ వేగ రమ్మనెన్
నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్


అలాగే మొదట ష కారం, చివర క్ష కారం వచ్చేట్టు పూరించమని అడిగితే చెప్పిన పద్యం

షాక్షర మాదిగ చెప్పెద - నీ క్షణమున కందపద్య నివహము వరుసన్
వీక్షింపర దయతో నిటు - రాక్షస హర ! రామ ! మోక్ష రామాధ్యక్షా!


Source: Dr.Dwa.Na.SAstry

Sunday, September 14, 2008

"జిల్లెడు మోమువాడు, చెప్పెను వీడు నాకు"
మళ్లీ నా పాత పుస్తకంలో నుంచి ఒక చిన్న మెఱుపు. పోతనామాత్యులవారు రాసిన ఈ రాముడి పద్యం కృష్ణుడి మీద రాసిన పద్యానికన్నా ముందుదే అయినా, "కృష్ణుడి"కి వచ్చిన "ఇది" "రాముడి"కి రాలేదు అని మా టీచరు చెప్పేవారు. కొసమెఱుపు ఏమిటి అంటే రాయప్రోలు వారు కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాసిన పద్యం ఈ చేతిరాత పుటలో ఉంది.మెఱుపుల సంగతి వదిలేసి ప్రకృతి వైపరీత్యాల్లాంటివి చూడాలి అంటే - భాషలో తూఫానులు లాంటివి అన్నమాట - స్కూల్లో నా బెంచీ మిత్రుడు శ్రీనివాసుకు సాటి అప్పట్లో నాకు ఎవరూ కనపడేవారు కాదు. ఎవడయినా వాడికి నచ్చనిదేదన్నా చెపితే ఆ కృష్ణుడి మీద పద్యంలోని మూడో వరసలోనించి "జిల్లెడు మోమువాడు, చెప్పెను వీడు నాకు" అని ఎత్తుకునేవాడు.అలాగే వాళ్ల నాన్నగారి దగ్గరినుంచి నేర్చుకున్న ఈ పద్యం వాడి నోట్లో ఎప్పుడూ ఆడుతూ ఉండేది.


"కరాగ్రే వసతే లక్ష్మీ

కర మధ్యే సరస్వతీ

కర మూలేతు గోవిందః

ప్రభాతే కర దర్శనం"

అన్నది మామూలుగా మామూలు జనాలకు తెలిసిన పద్యం అయితే,వాడు దానిని ఇలా చెప్పేవాడు


"ఖరాగ్రే వసతే లక్ష్మీ

ఖర మధ్యే సరస్వతీ

ఖర మూలేతు గోవిందః

ప్రభాతే ఖర దర్శనం"


ఒకరోజు ఇలానే మా టీచరు ముందు వాగి చచ్చేట్టు తన్నులు తిన్నాడనుకోండి - అది వేరే సంగతి...

Friday, September 12, 2008

చాలా మంది ఆయన పేరునిబట్టి తమిళ దేశస్థుడు అనుకుంటారు!

తొలి రోజుల్లో సినిమా పాటలకు “catchiness” సమకూర్చిన ప్రతిభ నిస్సందేహంగా C.R.సుబ్బురామన్‌దే. ఆయన దరువుల్లోనూ, స్వర ప్రస్తారంలోనూ “సాహసం” కనబడుతుంది.సంగీతం విషయంలో సుబ్బురామన్ ప్రతిభ అపూర్వం, అసామాన్యం. అకాల మరణం చెందకుండాఉంటే ఎస్‌.రాజేశ్వరరావు వంటి గొప్ప సంగీత దర్శకులకు ఆయన గట్టిపోటీగా నిలిచేవారనడంలో సందేహంలేదు. చాలా మంది ఆయన పేరునిబట్టి తమిళ దేశస్థుడు అనుకుంటారు. కానీ ఆయన తెలుగువాడే. వారి పూర్వీకులు తెలుగుదేశం నుండి తమిళదేశానికి వలస వెళ్ళారు. సుబ్బురామన్ శకం పూర్తయి యాభై సంవత్సరాలు దాటినా ఆయన సదా స్మరణీయుడే.

C.R.సుబ్బురామన్ కు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ, ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Monday, September 8, 2008

ఇక ప్రశ్నలోకి వస్తే!
ఎప్పుడో సుమారు ఇరవై రెండేళ్ళ క్రితం మా తెలుగు టీచరు శ్రీమతి కరుణమ్మగారి క్లాసులో నేను రాసుకున్న నోట్సు, నిన్న ఆదివారం పాత పుస్తకాలు సద్దుతుంటే కనపడింది. ఒక్కసారిగా అలా కూర్చుండిపోయాను. ఎందుకా? అది నాకే తెలుసు. అది ప్రస్తుత విషయానికి, ఈ టపాకీ సంబంధించినది కాదనుకోండి.


ఇక ప్రశ్నలోకి వస్తే శ్రీనాథుడు వ్రాసిన వీరరసాతిరేక పద్యంలోని 1, 3 లైన్లు - భట్టుమూర్తి రాసిన అబ్జముఖీలో 1, 2 లైన్లు ఒకేలాగున ముగియటం యాదృచ్ఛికమా ? లేక పాషాణ పద్యాలు ఇలాగే ఉండాలా ? అలాగే ఉండేటట్టు అయితే మిగతా మూడిటి ప్రాస, యతి అలానే కలుస్తాయా అని సందేహం?. అసలు ఈ పాషాణ పద్యాల గురించి ఎవరికయినా తెలిస్తే కొద్దిగా వివరించగలరు

Saturday, September 6, 2008

ఇద్దరు ప్రముఖ కవుల "పద్యభిక్ష"

పద్యభిక్ష

1940 లో కరవు వచ్చినప్పుడు కాగడా పత్రిక (తాపీ ధర్మారావు సంపాదకులు) "పద్యభిక్ష" పెట్టమని ప్రకటన ఇచ్చింది. అక్టోబరు సంచికలో ఇద్దరు ప్రముఖ కవుల "పద్యభిక్ష" గమనించండి:

"ప్రళయ భైరవ భయద నర్తనముసేయు
క్షుభిత కంకాళమాలా విశుష్కఘోష
క్షామదేవత శతకోటి చరణ ఘాత
ములదరిద్రోదర క్షుదాగ్నులను నేడు"

- అడవి బాపిరాజు


"కట్టుబట్టలేక, కడుపుకన్నములేక
నిలువ నీడలేక నీరులేక
మనువులేక మరల మరణించగాలేక
బ్రతుకువాని బ్రదుకు బ్రతుకు అగునె?"

- భాగవతుల శంకర శాస్త్రి (ఆరుద్ర)

ఏలమిత్రుడా, పరితాపమింతనీకు?

చింతా దీక్షితులు పద్యం

చంచలంబయి నిలువని సౌఖ్యములకు
ఏలమిత్రుడా, పరితాపమింతనీకు?
ప్రకృతి దుస్సాధ్యములు కొన్ని వాంఛితములు
కొన్ని యననేల, అన్నియు గ్రుంకుదుదకు."

మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

Friday, September 5, 2008

భానుమతి రామకృష్ణ - రెండో భాగం

తెలుగు చలనచిత్రజగత్తులో ఇంతటి ప్రతిభావంతురాలు, బహుముఖప్రజ్ఞాశాలి మళ్ళీ పుట్టబోదు అంటే అతిశయోక్తి ఏమీ కాదు.ఆవిడకు ఉన్న ప్రతిభాపాటవాలలో ఒక్కొక్కదానికి ఒక్కో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వవచ్చు.


ఆవిడకు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" రెండో భాగం విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/


లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

సూటిగా చెప్పకుండా ఊహతో సాధించుకోవలసి వచ్చేటట్టు ....

అయ్యలరాజు రామభద్రుడు, కృష్ణరాయల కీర్తిని వర్ణిస్తూ "సకల కథా సార సంగ్రహంలో" ఇలా అంటున్నారు

సీ. చినుకు పూసల నొనర్చిన చిత్తరపు దండ
దండాలు గల వేల్పు తపసి కొండ
కొండాటములకు చిక్కుల బెట్టు జడదారి
దారి తప్పక గట్టు జీరు టలుగు
అలుగు టింతికి వెన్ను డిలకు తెచ్చిన చెట్టు
చెట్టు గట్టగ జేయు చెలువతోడు
తోడాసపడు క్రీడి దొర పెద్ద తోబుట్టు
పుట్టు లిబ్బుల రేని పొందుకాడు

గీ.కాడు కనపపుల్ గాచిన గండు తల్లి
తల్లి బిడ్డల పెండ్లాడు గొల్ల మనికి
మనికితముతీర్చువిలుకానిజనకు విందు
విందు నీ కీర్తి నరసింహవిభుని కృష్ణ!


ఈ పద్యంలో రాయల కీర్తిని ముత్యాల పేరుతోను, శివుడి (దండ + ఆలు గల వేల్పు) కొండ అయిన కైలాసంతోను, నారదుడు, వజ్రాయుధం, పారిజాతం, చంద్రుడు, బలరాముడు, కుబేరుని (పుట్టు లిబ్బుల రేని) నేస్తం అయిన శివుడు, కుమారస్వామి (శ్మశానంలో రెల్లుగడ్డిలో పుట్టినవాడు), పాలసముద్రం (తల్లి బిడ్డలను - భూదేవిని, సీతను పెండ్లాడిన వెన్నుని నెలవు), అమృతం (మన్మథుని తండ్రి అయిన విష్ణువు విందు) అనే వాటితో పోలుస్తాడు కవి. ఉపమానాలను సూటిగా చెప్పకుండా ఊహతో సాధించుకోవలసి వచ్చేటట్టు చెప్పడం ఈ పద్యంలో చమత్కారం

శ్రీ గురుజాడ శ్రీరామమూర్తి పంతులు గారు వ్రాసిన "కవిజీవితములు" పుస్తకములోనిది

Thursday, September 4, 2008

పూవులమ్ము బందరుచే గట్టెలమ్మజేసి!!!

వీడ్కోలు పద్యం

చెళ్ళపిళ్ళ వారు హిందూ హైస్కూల్ ఉపాధ్యాయులుగా విరమణ చేసి బందరు నుంచి కడియం వెళ్తున్న సందర్భంలో 19-8-1916న వీడ్కోలు సభలో చదివిన పద్యం ఇది - (కడియం పూల తోటలకి ప్రసిద్ధి)

"నిను గన్నట్టి వీటికి కన్ను గుట్ట
లలి ద్రయోదశ వర్షముల్ నిలిపి పూవు
లమ్ము బందరుచే గట్టెలమ్మజేసి
గడియమేగెదె? వేంకటకవికులేంద్ర!"

మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

నాలుగు తన్నులు తన్నాడూ - అయిందమ్మా అయింది!

ముణిమాణిక్యం గారి హాస్య పద్యమొకటి

అయిందమ్మా అయిందీ
బావకు పెండ్లీ అయిందీ
మేళంతాళం లేకుండా
దమ్మిడికర్చూ లేకుండా
పెద్ద పెళ్ళి అయింది
నాన్నక్కోపం వచ్చిందీ
నాలుగు తన్నులు తన్నాడూ
అయిందమ్మా అయింది
బావకు పెండ్లి అయిందీ


ఈ పై పద్యం నా దగ్గర ఉన్న ఏదో చిన్న పేపర్ కటింగులో ఉంది (ఏ పత్రికో కూడా తెలీదు)

ధర్మవరం వారికి కోపం వచ్చింది!

ధర్మవరం వారికి కోపం వచ్చింది!

నాటక రంగానికి ధర్మవరం రామకృష్ణమాచార్యులవారు చేసిన సేవ అసామాన్యమయినది. ఆయన రాసిన "చిత్రనళీయం' నాటకం కూడా బాగా ప్రసిద్ధికెక్కింది. అయితే ఎవరో ఈ నాటకాన్ని 'అతుకులబొంత ' అని విమర్శించారట. ధర్మవరం వారికి కోపం వచ్చింది. ఇలా పద్యాస్త్రం వదిలారు -

"కొంచెపు పెంటలేరి తినుకుక్కుటముల్ నిను కందిగింజగా
దంచు త్యజించునంతనె యహా! యపకీర్తియె నీకు రత్నమా!
కాంచన పీఠి నిన్నునిడి కాంతి కిరీటములందు నిల్పి య
భ్యంచితరీతి మస్తకములందు ధరింపరె రాజశేఖరుల్!"

Wednesday, September 3, 2008

కుడిసి కుకుండ నిస్తర?

కుడిసి కుకుండ నిస్తర?

కర్నూలులో మద్దులపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ప్రధానాంధ్ర పండితులుగా పనిచేశారు. పద్యరచనలో దిట్ట. ఇంతటి పండితులు వినోద కవితలు రాయటం ఒక విశేషంకాగా - వాడుక భాషలో (గ్రామ్యభాషలో?) మన ఎన్నికల అభ్యర్థుల గురించి చురకలు వేస్తూ మంచి పద్యం రాయటం మరో విశేషం. ఆ పద్యం ఇదే -

"యిడవరు, యింటిసుట్టు వలవేత్తరు, సూత్తరు, వంకదణ్ణముల్
పెడతరు, మేలు సేస్తమని పెగ్గెలు బల్కుత రాపనైన వెం
బడి తిరిగైన సూడరిసుమంటి పెబుద్ధులు రాజ్జెమేలితే
కుడిసి కుకుండ నిస్తర? మొగుండ్లయి సూస్తనె గొంతు గోయరా?"మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

నేను శ్మశానవాటిక నిర్మించాను. మీలాంటి యోగ్యులు దానిని వినియోగించుకోవచ్చు

చెళ్ళపిళ్ళ X శ్రీపాద

ఒకసారి చెళ్ళపిళ్ళవారు రైలు ప్రయాణం చేస్తుంటే రైలులో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి పెదతల్లి కుమారుడు తారసపడ్డాడు. ఆయన పేరు సూర్యనారాయణ. ఎక్కడిదాకా వెడుతున్నావు అంటే, ఆయన "పొలమూరు" అని చెప్పారట. పొలమూరు శ్రీపాద వారి వూరు. వెంటనే చెళ్ళపిళ్ళ, సూర్యనారాయణతో వెటకారంగా, "శ్రీపాదవారి శ్మశానవాటిక చూశానని శ్రీపాదవారికి చెప్పండి" అన్నారట. శ్మశానవాటిక శ్రీపాదవారి నవల పేరు. సూర్యనారాయణ శ్రీపాదవారితో యథాతథంగా అప్పగించి చెప్పారు. తిరుగుప్రయాణం కడియం మీదుగానే కాబట్టి "నేను శ్మశానవాటిక నిర్మించాను. మీలాంటి యోగ్యులు దానిని వినియోగించుకోవచ్చు" అని చెళ్ళపిళ్ళవారికి చెప్పి వెళ్ళమని శ్రీపాదవారు అనటం, ఆ సూర్యనారాయణ కడియం వెళ్ళి అంతపని చెయ్యటం జరిగింది

(ఆంధ్రజ్యోతి - హాస్యజ్యోతి - నుండి)

రెండు పఠాపిఠా కఠోరకుఠరాలు

శ్రీశ్రీ పద్యాలనే వాడుడు

పఠాభి, నారాయణబాబు మొదలయిన వాళ్ళతో కవిత్వంలో ఒక నూతనాధ్యాయం ప్రారంభమయిందని భావించి జరుక్ శాస్త్రి "ఆశ్వాసాంతం" అనే కవిత రాశాడు. అయితే రుక్మిణీనాథ శాస్త్రి చెప్పిన కొత్తవాళ్ళందరూ తన అనుయాయులే - అని ధ్వనిస్తూ "శ్రీశ్రీ పద్యాలనే వాడుడు" అనే గీతం ఉత్తరోత్తరా శ్రీశ్రీ రాశాడని ఆరుద్ర చెప్తూ దీనికి వివరణ కూడా ఇచ్చారు

రెండు ట్వింకిల్ ట్టింకిల్
లిటల్ థియేటర్ స్టార్లు
రెండు ఆరుద్రాభిషేకాలు
రెండు రిక్షాపై మౌనశంఖాలు
రెండు విబ్జియార్భాటాలు
రెండు హనుమత్ శాస్త్రాలు
రెండు నమస్కరించదగ్గ
విశ్వనారాయణాస్త్రాలు
రెండు నామరహితఫిడేలు రాగారాబాలు
రెండు పఠాపిఠా కఠోరకుఠరాలు
రెండు గోరావీణావినాయకారాగాలు

ఇందులో శ్రీశ్రీ చమత్కారంతో పాటు అతని మనోభావాలు తెలుస్తాయి. ఎవరంటే ఇష్టమో తెలుస్తుంది లేదా ఎవరి ప్రభావం వుందో గమనిస్తాం. లిటిల్ థియేటర్ నడిపింది అబ్బూరి వరదరాజేశ్వర రావు. రెండు ఆరుద్రాభిషేకాలు - ఆరుద్ర. "మౌనశంఖం" కవితా సంపుటి శ్రీరంగం నారాయణబాబు. "విబ్జియార్" కవితా సంపుటిని రాసింది బి.వి.సింగరాచార్య. హనుమత్ శాస్త్రాలు ఇంద్రగంటి వారిని ఉద్దేశించింది. విశ్వనాథవారు నమస్కరించదగినవారు. ఆ తర్వాత పఠాభి , తర్వాత పిఠాపురం యువరాజా కవి. "వినాయకుడివీణ శీర్షిక" ద్వారా సంచలనం కలిగించిన గోరాశాస్త్రి. వీళ్ళంతా శ్రీశ్రీ హృదయంలో మెదిలేవాళ్ళని భావం!

మామయ్య ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

ఎన్నో విషయాలలో వారికీ నాకూ చుక్కెదురు!

విశ్వనాథను పొగిడిన శ్రీశ్రీ

"నేను చిన్నతనంలో కలం పట్టిన కొత్తరోజుల్లో నన్ను బాగా ఆకర్షించిన ఇద్దరు కవులలో విశ్వనాథవారొకరు. నేనంటే సత్యనారాయణగారికి వాత్సల్యం. వారంటే నాకు గౌరవ భావం. ఎన్నో విషయాలలో వారికీ నాకూ చుక్కెదురు. అయినా భారతీయ భాషలన్నిటిలోనూ ఒక్క తెలుగులోనే గొప్ప కవిత్వం ఉందనడంలో ఇద్దరమూ ఏకీభవిస్తాం."

శ్రీశ్రీ - జూన్ 9, 1973న విశ్వనాథకి "ఉడుగర"గా ఇలా సమర్పించాడు

"మాటలాడే వెన్నెముక
పాటపాడే సుషుమ్న
నిన్నటి నన్నయ్యభట్టు
ఈనాటి కవి సమ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆ సేతు మిహీకావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగునాటి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద

(శ్రీశ్రీ వ్యాసాలు నుంచి)

Sunday, August 31, 2008

మల్లంపల్లి సోమశేఖర శర్మగారంటే చరిత్ర గుర్తుకు వస్తుంది. అయితే పరమాశ్చర్యంగా!

మల్లంపల్లి సోమశేఖర శర్మగారంటే చరిత్ర గుర్తుకు వస్తుంది. అయితే పరమాశ్చర్యంగా ఈయన 1923 - జులై నాటి" శారద" సంచికలో రాసిన "ఆంధ్రమాత" కవితను చూస్తాం:

"శ్రమించు నీ మూర్తి
చిత్తమందెంచి చేతులు జోడించి
శీర్షంబువంచి వినుతించి నీ ఖ్యాతి
ప్రణుతింతుమో మాత!
మమ్ము దీవింపుమా మముగన్నతల్లి!


పాడిపంటలతోడ భాగ్యాలు తూగి
విరియుపైరులఠీవి విభవానదోగి
చెలువారు నీరూపు
తలపోతు మేమాపు
మమ్ము దీవింపుమా మముగన్నతల్లి !


తెలుగు జోదుల కత్తి మలసి నర్తించె
తెలుగు జోదుల తేజిలవి జౌకళించె
తెలుగు దొరల సేన దెసలాక్రమించె
తెలుగు రాచరికంబు దెసలరాణించె
పరదుర్గములు కూలె - పరరాజ్యములు వ్రీలె
తెలుగువారల ధాటి వెలుగొందునపుడు
తెలుగువారిని నీవు దీవించినపుడు"


మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

ఇది మరి అద్భుత ప్రతిభా, లేక ఇంకేమన్నానా?

ఓలేటి వేంకటరామశాస్త్రి, ద్వివేది రామకృష్ణ శాస్త్రి కలిసి వేంకట రామకృష్ణ కవులయ్యారు

"ఎంత వడివడి జెప్పిన సుంతయేని
విరసమనుమాట పొడమదు వేయునేల?"


అనగల సత్తా గల ఈ జంటకవులు పిఠాపురం రాజా రావు వేంకట సూర్యారాయ మహీపతికి అర్జీ పెట్టుకున్నారు - గంటకి వంద పద్యాలు చెప్తామని. రాజాగారు నాలుగు గంటలలో శతావధానం చెయ్యాలని కోరారు. సరే అన్నారు రామకృష్ణ కవులు.


సెప్టెంబరు 13,1909 నాడు మధ్యాహ్నం 3.45 నుండి సాయంత్రం 7.50 వరకు శతావధానం చేసి మాట నిలుపుకున్నారట. రాజావారు ఎంతో ఆనందించి "అద్భుత శతావధానం" అని కీర్తించారు. ఈ శతావధానంలో 33 వృత్తాలు, 5 మత్తకోకిలలు, 2 తోవకములు, ఒక కవిరాజ విరాజితం, 33 కంద పద్యాలు, 19 గీత పద్యాలు, 4 ఆటవెలదులు, ఆర్య ఉత్సాహాలు ఒక్కొక్కటి చొప్పున చెప్పారట. వీటిని చివర్లో ధారణ కూడా చేశారట.

మరోసారి ప్రహ్లాద చరిత్రను నూరు పద్యాలలో ఒకే ఒక్క గంటలో చెప్పారట. ఇది మరి అద్భుత ప్రతిభా, లేక ఇంకేమన్నానా?

గ్రంథమంతయు నిట్టి భాషలో వ్రాయుట రసాభాస!

భావకవిత్వం గిట్టని చెళ్ళపిళ్ళ

"మున్ పటి రూల్సుకు కట్టుపడమ"ని చెప్పినా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు భావకవిత్వంపై ధ్వజమెత్తారు. బహుధాన్య సంవత్సరంనాటి "అభినవ సరస్వతి" పత్రికలోని ఈ రచన చదివితే చెళ్ళపిళ్ళవారి భావాలు తెలుస్తాయి.

"భావప్రధానమగు కవిత్వమే భావకవిత్వమగు. ఈ కవిత్వమందు బ్రయోగించు పదములన్నియు సంస్కృత పదములే కాని మనకవి సంపూర్ణముగ దెలియుట దుర్లభము. భావకవిత్వమనినంతమాత్రమున బదుగురకు దెలియనిచో బ్రయోజనమేమి? అంగటిలో నన్నియు నున్నవి - అల్లుని నోట శని యున్నది యన్నట్లగును. భావప్రధాన వాక్యములు కొంతవరకుండి తదితరము కొంతచేరియుండవలెనుగాని తుట్టతుదవఱకు నొకటే యుండరాదు. నేటి భావకవిత్వము గూటి చిలకేదిరా చిన్నన్నా లాగున వెళ్ళుచున్నది. అర్థము జెప్పలేము. ఇది యొక పరిభాష. సైన్సులోను, వైద్యములోను నెటులో యటులే నేటి భావకవిత్వమందును నీ పరిభాష ముక్కలు పడుచుండును.


ప్రతి పుస్తకమందును నీ భావకవిత గాంపింపగలదు. కాని పూర్వులీ కవితకు శీర్షిక పెట్టలేదు. "కుందనము వంటి మేను మధ్యందినా తపోష్మహతి గందె, వడదాకె నొప్పు లొలుకు వదనమ"ని వరూధిని బ్రాహ్మణునితో బలికెను. ఆ పద్యములో భావకవిత్వ మిమిడియున్నది. భావకవిత్వము నారంభించినవారి యుద్దేశము మంచిదే కాని దాని నితరులెంతవఱకు నిర్వర్తించుచున్నారోయనునది విచారణీయము. ప్రస్తుతము వచ్చెడి భావకవిత్వము ప్రజలనెంతవఱకు రంజింపజేయునను విషయము వేఱు.


ఇక నెంకిపాటల విషయమై సుబ్బారావుగారు యోగ్యతాపత్రమీవలసినదిగ నన్ను గోరిరి. "కడుపులో సెయ్యెట్టి కలసేసినాదే" మున్నగు పద్యములు వ్యంగ్యపూరితముగ మంచి యభిప్రాయమును దెల్పుపట్టులు చాలగలవు. ఒక్కొక్కొచో వ్యాకరణ దోషములను గూడ సరకుచేయకపోవచ్చును. "జగమేలే పరమాత్మా యెవరితో మొరలిడిదు"నను త్యాగయ్యగారు జగమేలెడి యని యనజాలకుండెనా? ఎంకిపాటలలో మొదటినుంచి చివరవరకు రసాభాస గలదు. కొన్నివేళల మాత్రము స్వదేశభాషను వాడిన దోషము లేదనిరి. కాని తుట్టతుదివఱకు గ్రంథమంతయు నిట్టి భాషలో వ్రాయుట రసాభాస."మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్యకబుర్లు పుస్తకం నుండి.

Friday, August 29, 2008

ఇంతటి ప్రతిభావంతురాలు, బహుముఖప్రజ్ఞాశాలి మళ్ళీ పుట్టబోదు!

భానుమతి రామకృష్ణ - తెలుగు చలనచిత్రజగత్తులో ఇంతటి ప్రతిభావంతురాలు, బహుముఖప్రజ్ఞాశాలి మళ్ళీ పుట్టబోదు అంటే అతిశయోక్తి ఏమీ కాదు.ఆవిడకు ఉన్న ప్రతిభాపాటవాలలో ఒక్కొక్కదానికి ఒక్కో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వవచ్చు.


ఆవిడకు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/


లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్యారడీలు !

దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎంత భావకవి అయినా, 'అనంత శోకభీకర తిమిర లోకైక పతిని" అని చెప్పుకొన్నా హాస్యప్రియత్వం లేకపోలేదు. 1945 ప్రాంతాల్లోనే ఆంధ్రజ్యోతిలోనూ, సోమసుందర్ నిర్వహణలో వెలువడే లిఖిత పత్రిక "అక్షయపాత్ర" లోనూ దేవులపల్లి చమత్కారంగా వేమనపై ప్యారడీలూ రాశారు.

"పట్టిపట్టి గుడికి పదిమంది నేస్తాలు
పర్వదినమటంచు పంపితేను
అతడు కన్నుకొట్టె అమ్మవారినిజూచి
విశ్వదాభిరామ వినురవేమ!""నాటకాలలోన నారి వేసము వేయ
పురుషునట్టులుండు పోతురాజు
ఉత్తయప్డు సరిగ యువతీలలామయే
విశ్వ.."

దేవులపల్లికే భావకవుల అతిని చూచి విసుగుపుట్టిందేమో మరి - ఈ ప్యారడీ వచ్చింది

"మెరుగుకంటిజోళ్ళు గిరజాలు సరదాలు
భావకవికి లేని వేవిలేవు
కవితయందుతప్ప గట్టివాడన్నింట
విశ్వ...."డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

బంగారు పతకం నీ చేత నిజం "పలికించగలిగింది" - శహభాషో!

శహభాష్ బింద్రా ! బంగారు పతకం నీ చేత నిజం "పలికించగలిగింది" - శహభాషో! (Believe it or not somehow I was expecting a statement like this from him!! - but not this soon!)

http://news.bbc.co.uk/1/hi/world/south_asia/7587606.stm

చేసింది ఏమీ లేకపోయినా, ఎవరయినా పతకాలెత్తుకొస్తే, ఆహా మా వాడు, మా అస్సోసియేషన్ ప్రతాపమే అని జబ్బలు చరుచుకోవటం , మీసాలు తిప్పుకోవటం, రాష్ట్రపతితో సహా ఇంద్రుడు చంద్రుడు అని కొనియాడటం, పక్కన నిలబడి వెధవ నవ్వులు నవ్వుతూ ఫోటోలు తీయించుకోవటం....ఇదీ ....

Wednesday, August 27, 2008

యెగరకె యెంగిలాక ని న్నెండుకుక్క పీక

వేసవి వర్ణనము

చెలరేగకేయుక్క నీ తలబట్టి చలినొక్క
తలపకుమాచిఱ్ఱ నిను దరుము విసరుకఱ్ఱ

అనుసరించకెనల్లి నిన్నట్టెమ్రింగు బల్లి
ననుదాకకే ఈగ నిను బనసజిగటలాగ

పగబూనకే చీమ నిన్ను బట్టి నేలపామ
పొగరెందుకే దోమ నిను బొగజంపును జుమ

ఎగరకుమాధూళి యి ల్లిదిగోవర్షాళి
యెగరకె యెంగిలాక ని న్నెండుకుక్క పీక

మూలం: హరికథేతిహాసమంజరి
రచయిత:బీ.బాలాజీదాసు
ప్రచురించింది: 1922లో

Sunday, August 24, 2008

ఓరె ! అరేబియా పిల్ల తెలుగు మాట్టాడుతుందిరా

తన బ్లాక్ అండ్ వైట్ రచనలో పింగళి నాగేంద్ర రావు గారి గురించి రాస్తూ రావికొండలరావు గారు ఇలా అంటున్నారు. "పెళ్ళి చేసి చూడు" (1952) లోని డ్రీం సీక్వెన్స్ లో అర్జునుడు ఊర్వశితో పాడుతూ - చాలు చాలు నీ సాముదాయికపు వలపులు పంపిణీ - అంటాడు. కో ఆపరేటివ్ విధానంలో ఊర్వశి తన ప్రేమను పంచుతుందన్నమాట. అదీ ఆయన చమత్కారం! ఆ పాటలోనే "యుగయుగాలుగా, జగజగాలుగా" అని ఒకచోట వస్తుంది. "ఊగించిన ఉర్రూగించిన" అని ఇంకో చోట వస్తుంది. యుగయుగాలు అంటాంగానీ, జగజగాలు అనం. అలాగే "ఉర్రూతలూగించిన" అని ఉండాలి. దానికాయన సమాధానం "పదాలను ప్రయోగించడంలో బాగుంటుందనుకున్నప్పుడు వేసేయడమే! జగజగాలు అలా వేసిందే. ఉర్రూగించడం భాషలో తప్పయినా, హ్రస్వీకరించి అర్ధమయ్యేటట్టుగా వాడటం తప్పు కాదు. భావం భాషకు బందీ అయిపోకూడదు. తన అవసరానికి భావం, భాషని వాడుకుంటుంది. భావం బాగుంటుందనుకున్నప్పుడు కొత్త ప్రయోగాలు చెయ్యాలి, తప్పుకాదు..................అందుకే మాయాబజార్లో రాశాను - 'ఎవరో ఒకరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయని" అని రావికొండల రావు గారు మాటల మాంత్రికుడు శ్రీ పింగళి నాగేంద్రరావు గారి గురించి చెప్పారు.

అయితే, మిగిలినవి పక్కన పెడితే "జగజగాలు" అన్న మాటతో చిన్న ఇబ్బంది వచ్చి పడింది. మామూలుగా పింగళి ఆయన మా బందరాయన కాబట్టి ఆయనకు నేను వీరాభిమానిని. అయితే నిన్న సుబ్బురామన్ గారి మీద ఆపాత మధురాలు రేడియో ప్రోగ్రాము కోసం పని చేసుకుంటున్నప్పుడు,లైలామజ్ఞూ (1949) చిత్రంలోని భానుమతి, ఘంటసాల మాష్టారు పాడిన పాట "విరితావుల లీల" వింటూ ఉంటే, అందులో జగజగాలు అని వినపడింది. సీనియర్ సముద్రాల వారికి కూడా వీరాభిమాని అయిన నేను ఒక్కసారి తుళ్ళిపడ్డా. అంటే ఈ మాట అసలుగా సముద్రాల వారిదా అని.. మరి రావికొండల రావు గారు ఈ జగజగాలు అన్న మాట పింగళివారిది అని "సజెస్ట్" చేసారా ? లేక ......!!


ఇది అంతా పక్కన బెడితే లైలా మజ్ఞు చిత్రంలోని పాట ఇంకోటి " ఏ కొరనోమూ నోచుకున్నానో - నేనూ" అని లైలా పాడుతుంది. లైలా అరేబియా కన్య కదా, నోము నోచుకోడాలూ అవీ వాళ్లకు ఉంటాయా గురూగారూ అని అడిగితే ఆచార్యులవారు తాంబూలం సేవిస్తూ ఒక మందహాసంతో - "ఓరె ! అరేబియా పిల్ల తెలుగు మాట్టాడుతుందిరా - ఆ మాట చెప్పు!" అని దాటవేశారట. :)

Friday, August 22, 2008

అంటరానితనం తాండవిస్తున్న 1938వ సంవత్సరంలో ......

తెలుగు వారిని, సమాజాన్ని అనతికాలంలోనే చైతన్యవంతం చేయగలిగింది పత్రిక, కళారంగాలే అని గుర్తించిన అతికొద్దిమంది ముఖ్యుల్లో గూడవల్లి రామబ్రహ్మం గారు ఒకరు. అంటరానితనం తాండవిస్తున్న 1938వ సంవత్సరంలో సాంఘిక ప్రయోజనాన్ని సాధించిన మాలపిల్ల చిత్రనిర్మాణంతో తెలుగు సినీ రంగంలో ఒక నూతన శకం ప్రారంభమయ్యింది. ఆయన సమాజ చైతన్య భావనలో పాలు పంచుకోవటమే ఆ మహానుభావుడికి మనం అర్పించగలిగే నివాళి.

అభ్యుదయవాది, జాతీయవాది, స్నేహశీలి, దానశీలి అయిన రామబ్రహ్మం గారికి శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Thursday, August 14, 2008

కర్నాటక సంగీతం - నాలుగవ పాఠం (గీతాలు)

కర్నాటక సంగీతం (E - Learning Class)

నాలుగవ పాఠం (గీతాలు ) ఇక్కడ

http://www.maganti.org/mukhamukhiindex.html

ఇలాంటి ఇంకా ఎన్నో పాఠాలు మీ ముందుకు .. అవకాశమిచ్చిన శ్రీమతి రత్న కుమారి గారికి పాదాభివందనాలతో

Tuesday, August 12, 2008

జిక్కిగారు ఖచ్చితంగా తప్పే పాడారు ...

బాటసారి చిత్రంలోని పాట మీద ప్రశ్న - ముందు పాట జాగ్రత్తగా ఇక్కడ వినండి,

http://www.oldtelugusongs.com/newsongs/vintage/Batasari_1961-Bhanumati-OBatasariNanuMaruvakoi-SamudralaSr_MasterVenu.mp3


ఒకవేళ ఈ పై లింకు పనిచెయ్యకపోతే ఇక్కడ నొక్కండి (note: - select open in new window)

http://www.maganti.org/audiofiles/misc/jikki.html

పాట జాగ్రత్తగా విన్న తరువాత, క్రింద నీలం రంగులో ఉన్న పదాల్లో ఏది Correct చెప్పండి. ఎరుపు రంగు పదం అయితే జిక్కిగారు ఖచ్చితంగా తప్పే పాడారు ...

ఈ "సుజించే" మీద కూడా కొంచెం అనుమానం ఉన్నది కానీ..... .."మది" "మరి" లో "మది" ఖాయమనుకుంటే సముద్రాల వారికి శతకోటి నమోన్నమహలు - అద్భుతమయిన అర్థం ఉన్నది


కనులకు దోచి చేతికందని ఎండమావులున్నై
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నై
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని


భూమి జనించి ఆకలికొదగని ఫలములున్నవి కొన్ని
భూమి జనించి ఆకలికొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవీ కొన్ని
తలపులున్నవీ కొన్ని

సృష్టిచేసినది దేవుడైన మరి నాశమునేల సృజించే
పలుకునొసగినది దేవుడైన మది (మరి) మూగలనేల సృజించే

కనులనొసగినది దేవుడైన మరి అందులనేల సుజించే
కనులనొసగినది దేవుడైన మరి అంధులనేల సుజించే
వెలుగునిచ్చినది దేవుడైన మది (మరి) చీకటినేల సృజించే
పెనుచీకటినేల సృజించే

వేదశాస్త్రములు చదివిన వారే ఎరుగరు సృష్టివిలాసం
వేదశాస్త్రములు చదివిన వారే ఎరుగరు సృష్టివిలాసం
అల్పబుద్ధితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం
సలుపకు పరిహాసం

బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుట మాని బ్రతుకుటయే న్యాయం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుట మాని బ్రతుకుటయే న్యాయం


PS: పాటలు, కవితలు అంటే ఇవీ...దిక్కుమాలిన పడవలు, పడకలు, మరకలు, గడ్డి పరకలు, రైలు పట్టాలు కాదు

Friday, August 8, 2008

తెలుగు సినిమా దర్శకుల్లో గొప్పవాళ్ళు ఎవరనే ప్రశ్న వస్తే?

తెలుగు సినిమా దర్శకుల్లో గొప్పవాళ్ళు ఎవరనే ప్రశ్న వస్తే మనం ముందుగా వినే పేరు “బి.ఎన్‌. రెడ్డి”. నిజానికి 30 ఏళ్ళ సినీ జీవితంలో ఆయన తీసింది పదకొండు సినిమాలే. కాని ప్రతి ఒక్కటీ పేరు గడించిందే! లోకానికంతటికీ “బి.ఎన్‌” గా పరిచితుడైన ఆయన అసలు పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి.

ఆయనకు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 – 11 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/


లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Tuesday, August 5, 2008

ఆయన ఎవరో తెలియదు కానీ, బానే అందుకున్నారు రాగాలు పాటలు

Basildon, UK లో జరిగిన Andhra Medical Graduates Reunion 1994 కు Chief Guest గా విచ్చేసిన భానుమతి రామకృష్ణ. Video..ఇందులో అప్పారావుగారు , ఆయన ఎవరో తెలియదు కానీ, బానే అందుకున్నారు రాగాలు పాటలు ....ఇక భానుమతి గురించి చెప్పనఖ్ఖరలేదు అనుకోండి .....గూగుల్ లో ఏదో వెతుకుతుంటే ఇక్కడ తేలా

http://telugu.yuyam.com/story.php?id=23314

వంశీ

Friday, August 1, 2008

తెలుగు సినీ జగత్తులో సినిమాలు, ఆ సినిమాలకు మాటలు ఉన్నంతకాలం ఆయన చిరంజీవే!

సినీజగత్తును తన మాటల మాయాజాలంతో అచ్చెరువొందించిన మాంత్రికుడు శ్రీ పింగళి నాగేంద్రరావు. ఒకటా రెండా - పాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, జగదేకవీరుని కథ, మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు లాంటి చిత్రరాజాలకు తన మాటలతో ప్రాణం పోసిన రచయిత.

జీవితమంతా బ్రహ్మచారిగా గడిపి, సాహిత్యానికి, ఆ సినీకళామతల్లికి తన సర్వం అర్పించిన మహానుభావుడు. సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం భౌతికంగా దేహం చాలించినా, తెలుగు సినీ జగత్తులో సినిమాలు, ఆ సినిమాలకు మాటలు ఉన్నంతకాలం ఆయన చిరంజీవే....

ఆయనకు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 - 10.30 (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Saturday, July 26, 2008

మేరుపర్వతాన్ని గుప్పిట్లో బంధించటం ?

తెలుగు చిత్రజగత్తులో రచయితకు ఒక గుర్తింపు తీసుకువచ్చిన మహానుభావుడు శ్రీ సముద్రాల రాఘవాచార్య గారికి నీరాజనాలు అర్పిస్తూ ఈ రోజు ప్రసారమవుతున్న రేడియో కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

అరగంటలో ఆయన గురించి చెప్పాలి అంటే మేరుపర్వతాన్ని గుప్పిట్లో బంధించటమే!!

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

Tuesday, July 22, 2008

కోతి మూతిలోన జగజ్యోతి ఉన్నాదీ!

మా అమ్మమ్మగారి ఊరు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఉన్న శివాలయంలో,సాయంత్రం పూట కొద్దిసేపు భజనలు జరిగేవి..అక్కడికి ఒక 50 యేళ్ళు ఉన్న ఆయన ఠంచనుగా 6 ఇంటికల్లా వచ్చేవాడు - పేరు "కోటయ్య" .....తత్త్వాలు, భజన పాటలు ఇలా ఒకటేమిటి చాలా పాడేవాడు ఆయన..మాంఛి గాత్ర శుద్ధి ఉన్న మనిషి..చిఱతలు కూడా ఉండేవి..అసలు కోటయ్య పాడే పాటలకోసమే కొంతమంది గుడికి వచ్చేవాళ్ళు, అంత బావుండేది...... ఇది అంతా ఎప్పుడో నా చిన్నప్పటి సంగతి...నిన్న ఓల్డ్ తెలుగుసాంగ్స్ లో దేనికోసమో చూస్తూ ఉంటే కోటయ్య పాడే పాట "యోగివేమన" చిత్రంలోనిది కనపడింది...ఒక్కసారిగా జ్ఞాపకాలన్నీ లేచి కూర్చున్నాయి....కోటయ్య పాడే ఈ పాటలో ఇంకా బోల్డన్ని చరణాలు ఉండేవి...మొత్తం పాట గుర్తుకులేదు, అంటే మరి కోటయ్య సముద్రాల వారి పాట తీసుకుని తన స్వంత పాట తయారు చేసుకున్నాడా అంటే - ఏమో చెప్పలేను..కానీ కనీసం మూడు నిముషాల పాటు సాగేంత పెద్ద పాట అది...

ఈ సారి చల్లపల్లి వెళ్ళినప్పుడు, కోటయ్యను పట్టుకుని ఆ పాటలన్నీ రికార్డు చేసుకోవాలి... ఈ పాట వినాలి అంటే ఓల్డ్ తెలుగుసాంగ్స్.కాం కి వెళ్ళి అక్కడ సెర్చ్ లో యోగివేమన చిత్రం సెలక్ట్ చేసుకోండి..


వచ్చేపోయే దారిలోనా కోతి ఉన్నాది
కోతి మూతిలోన జగజ్యోతి ఉన్నాదీ
నాదమీనవే మనసా నాదమీనవే
నాదమీనీ ఖేదముడిగీ మోదమందవే
మోదమందీ నీవు నేనూ కలిసిపోదామే
ఆ శివునిలోనా ఐక్యమవుదామే
ఆ శివునిలోనా ఐక్యమవుదామే..

Sunday, July 20, 2008

తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారి కథలు

తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సాహిత్యంలో తనదైన, అరుదయిన ముద్రను వేసిన సాహిత్యవేత్త. తన రచనా నేపథ్యం గురించి ఆయన స్వంతమాటల్లో, మాగంటి.ఆర్గ్ లో ఉన్న ధిక్కారం రచనలో 341 - 381 వరకు ఉన్న పేజీల్లో వివరించారు. చదివి ఆనందించండి. ఆయన రాసిన కథలు మాగంటి.ఆర్గ్ లో ప్రచురించటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకు శతసహస్ర ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మిత్రులు శ్రీ వారాల ఆనంద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.


రఘోత్తమ రెడ్డిగారు తాను రాయాలనుకున్న కథను చాలా లోతుగా చూస్తారనీ, మానవ సంబంధాల్లో, విలువల్లో ఉద్యమాలు తీసుకువస్తున్న ఘర్షణను సంక్లిష్టంగా, ప్రతిభావంతంగా చిత్రిస్తారని ప్రొఫెస్సర్ జి.హరగోపాల్ గారు అన్నా, సదా శ్రోతగా ఉండి తనను కదిలించిన జీవిత శకలాలను వస్తువులుగా చేసుకొని కథలు రాయడమే తెలిసిన మనిషి అని కాళీపట్నం రామారావు గారు అన్నా, రఘోత్తమరెడ్డిగారిలో మితిమీరిన సంవేదనా శీలత ఉన్నది, ఆయన ఏది చెప్పినా అబద్ధం చెప్పడు అని డాక్టర్ సదాశివ గారు అన్నా, కొ.కు, చా.సో, రావి శాస్త్రి, కా.రా ల నుంచి కొత్తకథల్ని ఆశించే అవకాశాన్ని పోగుట్టుకుని దిగులుగా ఉన్న నాలాంటి కథాభిమానుల్లో ఆశ రగిలించిన కొద్దిమంది యువ రచయితల్లో రఘోత్తమ రెడ్డి ముఖ్యుడు అని వల్లంపాటి సుబ్బయ్యగారు అన్నా, తను కోరుకుంటున్న అచ్చమైన, సృజనాత్మకమయిన, కళాత్మకమయిన జీవితం కోసం, మనుషులకోసం, విలువల కోసం పరితపించే మనిషి అని అల్లం రాజయ్య గారు అన్నా, భూగర్భంలో పొరలు పొరలుగా అల్లుకున్న బొగ్గుట్టలను చెమ్మాసుతో తోడినట్టే, మానవ సంబంధాలలో పొరలు పొరలుగా విస్తరించిన అనేక ఉద్వేగాలను రఘోత్తమ రెడ్డి, తన కలంతో తవ్వి కథల కుప్పలు పోసిపెట్టాడు అని ప్రేమతో ఎన్.వేణుగోపాల్ గారు అన్నా అందులో అతిశయోక్తి ఏమీ లేదు.

http://www.maganti.org/rachayitalu/tummeti/tummetiindex.html


వీలు వెంబడి ఆయన కథలు ఒకటొకటిగా మీ ముందుకు తీసుకుని రావటానికి ప్రయత్నం జరుగుతుంది అని తెలియచేసుకుంటున్నాను. ఈ కథల మీద సర్వహక్కులు వారివే అనీ, ఎవరయినా వాడుకోదలిస్తే ఆయనను ముందుగా సంప్రదించి అనుమతి తీసుకోవలసిందిగా కోరుతున్నాను.

Saturday, July 19, 2008

స్వరాలూరు మహారాజు సాలూరి రాజేశ్వర రావు

స్వరాలూరు మహారాజు సాలూరి రాజేశ్వర రావు గారి గురించి శ్రీ పరుచూరి శ్రీనివాస్ అందించిన విశేషాలతో, అరుదయిన పాటలతో, వాయిస్ ఆఫ్ శాక్రమెంటో రేడియో స్టేషన్లో ఈ శనివారం ప్రసారమయిన రేడియో కార్యక్రమం ఇక్కడ వినవచ్చు

http://www.radio.maganti.org/archives.html

వంశీ

Saturday, July 12, 2008

ఇలా చెప్తారన్నమాట...

అమెరికా లోని రాష్ట్రాల పేర్లు, 2 సంవత్సరాల 3 నెలలకి ఇలా చెప్తారన్నమాట

http://www.maganti.org/audiofiles/vaishnavi/allstates.mp3

వంశీ

Tuesday, July 8, 2008

వాతావరణం ఇలా తెలుసుకోవచ్చు ...


ఎవరో చైన్ ఈమెయిలో పంపగా వచ్చిన చిత్రం...

Sunday, July 6, 2008

"కోకిలమ్మ పెండ్లి" - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

తేటతెనుగు తీయదనం, ఆత్మీయత, ప్రకృతి వర్ణన ఎంతో చక్కగా వర్ణించబడ్డ ఈ "కోకిలమ్మ పెండ్లి" గురించి ఏమని చెప్పేది?


తను రాసుకున్న పాత డైరీలోనుండి ఈ "కోకిలమ్మ పెండ్లి"ని అందచేసిన మా నాన్న శ్రీ శివరామ శర్మగారికి ధన్యవాదాలతో.


నా తర్జుమాలో తప్పులు ఎక్కడయినా కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపము....

దీని కాపీరైటు సంగతి నాకు తెలియదు...ఇలా ప్రచురించటం ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియపరిస్తే , కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణలతో ఈ ప్రతి ఇక్కడి నుండి తొలగించబడుతుంది....


గమనిక : ఇది ...బ్లాగు మొదలెట్టాక 200 వ టపా .... :)...కోకిలమ్మ పెండ్లి
----శ్రీ విశ్వనాథ సత్యనారాయణ


లేతబుర్రలు కొక్కిరిస్తే
ఆతగాళ్ళతో యేమిగానీ
తాతతాతలనాటి కతలూ
తవ్విపోస్తానోయ్


ఊగులాడే కడలితరగలు
నాగుబాముల కోడెలల్లే
ఒడ్డుదాకా ప్రాకు ప్రాకీ
ఒరిగిపోతా యోయ్


ఒడ్డుదాకా అడవి అడవిలో
దొడ్డ చెట్లున్నాయి తరగల
వూగులాడే గాలిచేతా
వూగుతుంటాయోయ్


అడవిలోనూ కడలిలోనూ
అద్దరాతిరివేళ అప్పుడు
తొగరుకన్నుల చుక్కకన్నెలు
తొంగిచూస్తారోయ్


పొద్దుకూకేవేళ వొడ్డున
ముద్దు ముద్దుగ తిరుగుతుంటూ
సొగసునడకల గాలిపిల్లలు
సోకుపోతారోయ్


సుళ్ళు తిరిగే కడలినడుమా
చూపు కందీ అందకుండా
తెప్పలేసుకు పాముపడుచులు
తేలిపోతారోయ్


ఒడ్డునే బంగారుచేలూ
ఒడ్డునే పూవుల్లు చేత్తో
ఊరికే యిట్లంటె చాల్ పా
లుబికిపోతాయోయ్


నేను చెప్పేకతలు జరిగీ
యెన్ని నాళ్ళయ్యిందొ అప్పుడు
మలయ పొదలూ కొండకోనలూ
తెలుగునాడంతా


కడలి వొడ్డున పల్లె వొక్కటి
కలదు ఱేడున్నాడు దానికి
అప్పటికె యీ తెలుగులంతా
గొప్ప యెకిమీళ్ళూ

దొడ్డదొర, అతగాడి నేలలొ
ఎడ్డెపనులే చేయరెవ్వరు
దొంగనాగరికతలో దేశం
తూలిపోలేదోయ్

ఉన్నవాళ్ళకు ఎంతనేలా
దున్నుకుంటే చాలుతుందో
మించి ముట్టరుకూడ పైనా
చిన్న చెక్కయినా

అందరికి కావలసినంతా
వుంది, యెవ్వరితోడ నెవరికి
నెన్నడూ చూడలేమన్నా
చిన్ని తగవైనా

ఆ దొరకి కూతుళ్ళు ఇద్దరు
మోదుగులు పూశాయి పెదవులు
వారి పేరులు, చిలకతల్లీ,
కోకిలమ్మానూ

కోకిలమ్మా నల్లనీదీ
చిలకతల్లీ పచ్చనీదీ
చిలకతల్లికి కోకిలమ్మకు
ఎప్పుడూ పడదూ

చిలకతల్లీ చిన్ననాడే
పలుక మొదలెట్టింది ముద్దుల
మొలకలై తండ్రికీ మేనూ
పులకరించిందీ

ఎన్నొయేళ్ళూ వచ్చినాయీ
కన్నులింతగ తెరిచినాదీ
పాపమేమో ! కోకిలమ్మకు
మాటలే రావూ

చిలకతల్లికి రంగు రంగుల
చీరలూ తెస్తాడు తండ్రీ,
కోకిలమ్మను ఊరికనే
కోపపడతాడూ

చిలకతల్లీ నవ్విపోతే
తండ్రి మారూ పలుకకుంటే
తల్లి వంకా చూచి కోకిల
తెల్లపోతుందీ

చిలకతల్లీ వెక్కిరిస్తే
తండ్రి వచ్చీ కసురుకుంటే
తల్లి వెనుకా దాగిపోతూ
తల్లడిలుతుందీ

తల్లి యేమీ చెయ్యలేకా
తానుకూడా విసుక్కుంటే
కోకిలమ్మా లోనె లోనే
కుమిలిపోతుందీ

అడవిలో యే చెట్టుకిందో
అంత యెగ్గూ తలచుకోనీ
కూరుచున్నది కూరుచుండే
కుంగిపోతుందీ

చెట్టుతోనో పుట్టతోనో
చెప్పుకుందా మన్నగానీ
ఎట్టివాడో వాడు నోరూ
పెట్టలేదాయే

కొండవాగుల వెంట పోతూ
కొండపువ్వులవంక చూస్తూ
ఎంత పొద్దోయినా గానీ
యింటికే పోదూ

ఒక్కొక్కప్పుడు తెల్లవార్లూ
అడవిలోనే వుండిపోతే
తల్లి ఊరక తెల్లవార్లూ
తెల్లడిలుతుందీ

వానరోజులు వచ్చిపోగా
చలిపగళ్ళూ సాగిపోగా
ఆకురాలుట ఆగి చివురులు
జోక తాల్చాయి

చివురులో యీనెల్ల పసిరిక
పూవుల్లో తేనెల్ల, పలపల
చిలకతల్లికి కోకిలమ్మకు
వయసు వచ్చిందీ

చిలకతల్లీ చదువు చూచీ
చిలకతల్లీ సొగసు చూచీ
గాలిపిల్లలుకూడ లోపల
కలత పడ్దారూ

చిలకతల్లీ అందమంతా
చిందిపోయీ అన్నివైపుల
కనుల చూడని వారు కూడా
అనుకునేవారే

ఎల్లవారూ చిలకతల్లినె
పెళ్ళికై కోరారు, తండ్రి
తల్లిమాత్రము పిల్లదాన్నీ
కళ్ళకాస్తారు

కడలి అడవులఱేండ్లు తమలో
కలుపుకుంటారేమొ అనుకుని
గడపదాటీ చిలకతల్లిని
కదలిపోనీరూ

ఇంటిముంగలి దాటనీకా
ఇంటిపనులూ చేయనీకా
కంటికీ రెప్పాకి మల్లే
కాచుకుంటారూ

చిలకతల్లీ అందమేమో
చిల్లకతల్లీ పెళ్ళి యేమో
తలి దండ్రీ కోకిలమ్మను
తలచనే పోరూ

ఒక్క మధ్యాహ్నంబునందున
చెక్కులను కుండల ప్రభలవి
పిక్కటిలి బ్రాహ్మణుండొక్కరు
డక్కడికి వచ్చెన్

చిలకతల్లీ దండ్రులు
చేరవచ్చిన అతనికోసము
కోరినట్టివి యన్ని యిచ్చీ
ఆదరించారూ

వేదపనసలు చెప్పుకుంచూ
వాదములకూ కాలం త్రవ్వుచూ
ఆయనా తెలుగురాజింట్లో
ఆగిఉన్నాడూ

అతని వేదధ్వనులు వించూ
అతని వర్చస్సంత కంచూ
చిలకతల్లీ అతని తనలో
నిలిపివేసిందీ

సంగతంతా తెలిసి ఱేడూ
పొంగిపోయాడేమో కానీ
తల్లికీ చిలకతల్లంటే
వెళ్ళుకొచ్చిందీ

కోనలందూ అడవులందూ
కోకిలమ్మా తిరుగుతోందీ
ఎంత యేడుస్తోందొ తల్లీ
యింటికే రాదూ

ఏ యెఱుంగని నేలవాడో
యింటికొస్తే వాడిమీదా
చిలకతల్లీ వలపు తానూ
నిలిపివేసిందీ

కోకిలమ్మా యింటికైనా
రాక అడవుల్లోనే తిరుగుతు
పోకిళ్ళమారైంది, తల్లి
కాకపోయిందీ

అడవులెంటా కోనలెంటా
బుడబుడా చను సెలల వెంటా
అడుగులు తడబడా వెదుకుతు
నడచిపోయిందీ

అడవి మెకములు తిరుగులాడే
ఎడము లేనీ అడుగులొప్పే
అడవిలోపలి కోనలెల్లా
తడివి చూసిందీ

ఎచట పోయీ వెదకిననూ
ఎందులేదూ కోకిలమ్మా
ఎచ్చటుందో తల్లిగుండే
వ్రచ్చిపోయిందీ

ఒక్క సెలయేట్లోకీ వేరూ
మిక్కిలీ పోయినా ముషిణి
ప్రక్క చెట్టూ క్రింద కూర్చుని
స్రుక్కిపోయిందీ

తల్లివెనకా యింతసేపూ
మెల్లగా వస్తోంది కోకిల
తల్లి బాధ కళ్ళచూసీ
గొల్లుమన్నాదీ

ఉరుములా వురిమింది కోకిలా
మెరుపులా మెరిసింది కోకిల
వొక్కగంతున తల్లివొళ్ళో
వచ్చిపడ్డాదీ

తల్లిబిడ్డను బిడ్డ దల్లిని
కళ్ళుమూసుకు కౌగిలించీ
ఒళ్ళు తెలియక చెట్టు మొదటా
ఒరిగిపోయారూ

తల్లిబిడ్డల ప్రేమ అంటే
యిల్లాగు వుండాలంటూ
ప్రకృతిదేవీ వొళ్ళు తెలియక
పాట ఫాడిందీ

ఎప్పుడూ గిలకల్లె అడవిలో
ఎచట చూస్తే అచటవుండే
చిన్నకోకిల లేక అడవీ
చిన్నవోయిందీ

కోకిలమ్మా తిరుగులాడని
కోకిలమ్మా లేని అడవీ
కోనలకు తొలు కారుటందం
కొరతపడ్డాదీ

తల్లి అంటే అంతప్రేమా
వెళ్ళ గక్కిన కోకిలమ్మకు
చావు లేదని మావిచివురూ
సాగులాడిందీ

తల్లి అంటే అంతప్రేమా
వెళ్ళగ్రక్కిన కోకిలమ్మా
మునిగిపోదని అడవివూటా
ముర్మురించిందీ

తల్లి అంటే అంతప్రేమా
వెళ్ళ గ్రక్కిన కోకిలమ్మా
బ్రతికి వస్తుందంచు అడవీ
పాట పాడిందీ

వానలన్నీ వెనుకపట్టీ
కోనలన్నీ నీరుపట్టీ
ఆకురాలే కారుకూడా
ఆగిపోయిందీ

చిన్న మొగమున కుంకుమిడినా
కన్నె పేరంటాలి మల్లే
చెలువుగా అడివంత క్రొత్తగా
చివురు తొడిగిందీ

ఎక్కడో అడవిలో చివరా
చక్కగా సన్నగా యేదో
చిక్కనైనా తేనెపాటా
జీరు వారిందీ

ఆపాట వింటూనె అడివీ
అడివిగా నిలువెల్ల, పోయిన
వొక్కచుట్టం వచ్చినట్లూ
వులికిపడ్డాదీ

సన్నగా పోతున్నవూటా
జాలు జాలింతై వెడల్పై
పట్టలేకా ఓర్పు జలజల
పరువులెత్తిందీ

కోకిలమ్మా అదుగో మళ్ళీ
కూసెనంటె వచ్చెనానీ
వచ్చెనంటే వచ్చెనానీ
బ్రతికెనంటే బ్రతికెనానీ

చెన్నుతరగని మావిమోకా
చివురు తొడిగిందీ
అంతలోపల అడవి కందం
అతిశయించిందీ

అంతలో పూవుల్ల ఱేడు
వింతవింతల సోకు లేలిక
చెక్కులా నవ్వులూ చిలుకుతు
చేరవచ్చాడూ

ఏడాది కొకసారి వస్తా
డేడాది కొకసారి తెస్తా
డెన్ని పువ్వులు, అతనివేనూ
వన్నెలూ చిన్నెల్

వచ్చావటయ్యా పూలఱేడా
తెచ్చావటయ్యా పూలరాజా
నీవు తెచ్చిన పూవులే కా
నికల కిస్తామూ

కోకిలమ్మనూ ముద్దుపెళ్లీ
కూతురును చేస్తాము, పెళ్ళీ
కొడుకును చేస్తాము నీకూ
కూర్చివేస్తామూ

కోరి నీ అందానికీ మా
కోకిలమ్మా గొంతుకునకూ
సొగసుచేతా పాటచేతా
తగేపోయింది

రావయ్య ఓ పూలరాజా
రావయ్య ఓ అందగాడా
కోకిలమ్మకు నీవు, నీకూ
కోకిలా తగునూ

వారి పెళ్ళికి అడవి అంతా
తోరణాలైనాయి చివురులు
కాపలా కాసినై పూలులూ
గండశిలలందూ

సన్నాయి పాడింది తెల్లని
సన్నని సెలవూట పూలా
వెన్నెలై ప్రకృతి తల్లేమో
కన్ను తెరిచిందీ

పూలసోనలు కురిసినై, తే
నేలపాటలు విరిసినై, అం
దాల త్రోవలు వెలసినై, రాజ
నాలు పండినవి

చిలకతల్లి మహాన్వయంబున
నిలచినవి సాంస్కృతికవాక్కులు
కోకిలమ్మా తెనుగుపలుకూ
కూడబెట్టిందీ

Saturday, July 5, 2008

మధుర గాయని శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి ...

ఈ వారం ఆపాతమధురాలు కార్యక్రమంలో మధుర గాయని శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారి గురించి కొద్దిపాటి విశేషాలు, ఆవిడ పాడిన కొన్ని మధురగీతాలు...

http://www.radio.maganti.org/

ఆ పాత మధురాలు! రేడియో కార్యక్రమం

ప్రతి శనివారం శాక్రమెంటో 88.7 కేబుల్ ఎఫ్.ఎంలో ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు ప్రసారమయ్యే అచ్చతెనుగు రేడియో కార్యక్రమం మీ కోసం

Wednesday, July 2, 2008

1940 - 50 ప్రాంతాల్లో "ఆంధ్ర తారల" తీరులు

ఆంధ్ర తారల తీరులు గురించి శ్రీ జీ.వీ.పున్నయ్య అనే ఆయన, ఏదో సినిమా పత్రికలో 1940 - 50 ప్రాంతాల్లో రాసిన రాతలు ఇవి అని మా నాన్నగారి పాత డైరీలో ఉంది...ఇతర వివరాలు తీరిగ్గా కనుక్కోవాలి...అందాకా....


నేనే రాణిని
నేనే వాణిని
నేనే ప్రొడ్యూసర్
నేనే డైరెక్టర్
నేనే క్రిటిక్కు
నేనే సర్వము
నేనే యనెడు
ఎన్న రాణిగల్
ఎంగ యిరుకుదు?
బఱ్ఱె తోలుదౌ
కిఱ్ఱు పాదుకల
పల్లెజనములే
పట్టిరికరమున
కన్నమ్మా !అల్లసానికవి
అంకసీమన
అల్లార్ముద్దుగ
నాలాపించి -
ముక్కు తిమ్మన
ముద్దు పల్కుల -
ఆది కవీంద్రుల
అమరవాగ్ఝరిచె
హారతులందిన
తెలుగు భాషనే
తీసి కట్టని
ధనమాసించి
తమిళపటంబుల
తై తక్క లాడగ
తగునా కన్నమ్మా"ఎన్నసామి?
రొంబ సంబర,"
త్యాగరాజుదా
తమిళవాడుదా?
తెలుగు వాడుదా?
తెలియ జెప్పుమీ
తెల్లముగాను
అరవలనోట
ఆంధ్రంబుంచిన
అపరాధమయా
నాగ అయ్యరా?
పోతన యందున
పుణ్యమూర్తివై
తెలుగుమాతలౌ
తియ్యనిదుగ్దము
కంఠము వరకు
గడగడ ద్రావి
తక్కెడ యందున
తమిళ పటంబుల
నొక్కట నన్నిటి
అరవ సాంబరు
ఆరగింపగ
గూడకట్టురా
ముళ్ళనుబోలీ
ఓహో పోతివ
దొంగకృష్ణునిగ?నొనరగ నునిచీ
పోతన నొక్కెడ
పొలుపుగ నుంచీ
తూయించుమనీ
తులా భారమున
తెలుగు తమిళముల
తీరులు తెలియుబంగరు మాలా!
బాగున్నావా?
మాలపిల్లలో
మధురభాషివై
మళ్ళీ పెళ్ళిలో
మదనుని రేపి
బాలనాగు నడ
వాసన్ బందిలొ
అల్లాడెడు నీ
అవస్థగాంచియు
అనదలవోలె
అంగలార్చెడు
ఆంధ్రులమమ్మాదేవతయందున
దేదీప్యమ్ముగ
తేజరిల్లిన
దిట్ట కుమారీ
డంకన్ టాండన్
దర్శక బాబులు
దద్దమ్మనుగా
దిద్ది చూపిరి
తవమణి దేవి
ధగద్ధగిత
నగ్న చిందుల
వాల్మీకి యందున
వహ్వారే వహ్వారె!బొందితో స్వర్గము
బొందెడి స్వర్గము
పుడమి జనులకు
పొలుపుగ జూపే
పూవుల వల్లీ !
ఇందు బాలకా
నందము గూర్పగ
బొంద బాలుని
డెందము గుందగ
అందము దక్కి
చిందులు వేయుచు
అరవ పటంబుల
నాడు చుంటివా?
ఆంధ్రమె మరచీ
ధనమాసించి
తమిళము నేర్చి
చచ్చు పటంబుల
జొచ్చి నటించుట
తెలుగు తారలకు
తెగులీ నాటను -
అభిమానంబిది
అగ్గిని గలియ
నున్నానొక్కటె
యూడిన నొకటేతెలుగు తారలను
తీరని వంతల
గురిగా వించి
కులికే తమిళుల
కొలువాసించి -
తల్లి రొమ్మునే
తన్నే నటకులు
ఆంధ్రావనిలో
నసంఖ్యాకులుఆంధ్రమాతనే
యాదరించిన
నమరత్వంబది
యబ్బుట నిజము

Saturday, June 28, 2008

చిత్తూరు.వి.నాగయ్య గా పిలవబడే శ్రీ ఉప్పలదడియం నాగయ్య గారి గురించి ..

పూర్వజన్మ సుకృతంతోనో, మరి ప్రస్తుత జన్మలో అబ్బిన సంస్కారం వల్లో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని, జీవితాన్ని తెలుగు నాటక , సినీ రంగాలకు అంకితం చేసి చేతికి ఎముకలేకుండా అడిగినవారికి లేదనకుండా దానం చేసిన దానకర్ణుడు, చిత్తూరు.వి.నాగయ్య గా పిలవబడే శ్రీ ఉప్పలదడియం నాగయ్య గారి గురించి కొద్దిపాటి విషయాలతో ఆయన పాటలు కొన్ని, ఆపాత మధురాలు కార్యక్రమంలో వినండి.

http://www.radio.maganti.org/


ఆ పాత మధురాలు! రేడియో కార్యక్రమం

ప్రతి శనివారం శాక్రమెంటో 88.7 కేబుల్ ఎఫ్.ఎంలో ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు ప్రసారమయ్యే అచ్చతెనుగు రేడియో కార్యక్రమం మీ కోసం

Wednesday, June 25, 2008

(సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి - By శ్రీ పరుచూరి శ్రీనివాస్‌

(సినీ)కళాద్రష్ట బి.ఎన్‌. రెడ్డి - By

http://www.eemaata.com/em/issues/200005/774.html


For those who have not read - చాలా అద్భుతమయిన వ్యాసం. ఇంత మంచి వ్యాసం చాలా ఆలస్యంగా చదివినందుకు చింతిస్తున్నా...

ఎంతో సమయం వెచ్చించి, మాకు తెలియని విషయాలు సేకరించి, విపులంగా పరిపూర్ణ రూపంలో మా ముందుంచినందుకు శ్రీనివాస్ గారు, మీకు మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

Vamsi

Tuesday, June 24, 2008

ఏదయినా నేర్చుకుంటారు..ఒక్క కథలేమిటి ?

ఒక రాజుకు ఏడుగురు కొడుకులు కథ - ఇలా ఉంటుంది అన్న మాట. 26 నెలల వైష్ణవి చెప్పిన కథ . ఒకవేళ లింకు కనపడకపోతే ఇక్కడ కనపడుతున్న లైను మీద నొక్కండి

http://www.maganti.org/audiofiles/vaishnavi/okarAjuku_EDugurukoDukulu.mp3

ఇంతకు ముందు ఒక టపాలో ఈ "పిల్లలకు కథ"విషయం గురించి చెప్పాను...కానీ మనం సమయం వెచ్చించి శ్రద్ధ తీసుకుని, మనసు పెట్టి, మన బాల్యంలో మన అమ్మమ్మలు, నానమ్మలు, అత్తయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు చెప్పిన సరంజామా పిల్లలకు ఓపికగా చెపితే, వాళ్ళు వయసుతో నిమిత్తం లేకుండా ఏదయినా నేర్చుకుంటారు..ఒక్క కథలేమిటి ?

వంశీ

Monday, June 16, 2008

739 మంది ప్రత్యక్ష శ్రోతలకు సభాముఖంగా ధన్యవాదాలు

మొన్న శనివారం http://www.maganti.org/ చే సమర్పించబడి "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో"లో ప్రసారమయిన "ఆపాత మధురాలు" రేడియో కార్యక్రమాన్ని ఇంటర్నెట్టులో , కేబుల్ ఎఫ్.ఎం. రేడియోలో విన్న 739 మంది ప్రత్యక్ష శ్రోతలకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. అలాగే కార్యక్రమాన్ని చివరిదాకా విని, శ్రమతీసుకుని తమ అభిప్రాయాలను తెలియచేసిన వారందరికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు.

ప్రత్యక్ష ప్రసారాన్ని వినలేకపోయిన వారు http://www.radio.maganti.org/ లోని ఆర్కైవ్స్ సెక్షన్లో ఉన్న లింకులు నొక్కి , ప్రసారమయిన కార్యక్రమాలను వినవచ్చు

మాగంటి వంశీ, మాగంటి శ్రీదేవి

Saturday, June 14, 2008

ఆ పాత మధురాలు! రేడియో కార్యక్రమం మీ కోసం

ఆ పాత మధురాలు! రేడియో కార్యక్రమం

ప్రతి శనివారం శాక్రమెంటో 88.7 కేబుల్ ఎఫ్.ఎంలో ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు ప్రసారమయ్యే అచ్చతెనుగు రేడియో కార్యక్రమం మీ కోసం

http://www.radio.maganti.org/

June 14న ప్రసారమయ్యే మొట్ట మొదటి కార్యక్రమం ఉదయం 10 గంటలనుండి 11 గంటల వరకు (IST - Indian Timings - Night 10.30 PM to 11.30 PM)కొనసాగే ఒక ప్రత్యేక కార్యక్రమం. తరువాతి శనివారం నుండి, "ఆపాత మధురాలు" ఉదయం 10 గంటల నుండి 10.30 వరకు (IST - Indian Timings - Night 10.30 PM to 11.00 PM)Regular Schedule లో ప్రసారం అవుతుంది .

ప్రత్యక్ష ప్రసారం వినలేకపోయినవారు Archives లింకు క్లిక్కు చేసి, పాత ప్రసారాలన్నిటినీ వినవచ్చు.

ప్రతివారం ఒక చిత్రరాజానికో, ఒక రంగస్థల నటుడికో, ఒక జానపద కళాకారుడికో, ఒక రచయితకో, ఒక సంగీతకారుడికో,ఒక మేకప్ మాన్ కో, ఒక ఆర్టు డైరెక్టరుకో, అద్భుతమయిన ప్రతిభ కలిగి ఉండి కూడా, కళాపోషకులు లేక మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయిన ఎందరో మహానుభావులకు నీరాజనాలు అర్పిస్తున్న ఈ రేడియో కార్యక్రమం, తెలుగు గడ్డపై జన్మించి కళకే జీవితాన్ని అంకితం చేసి, అవిశ్రాంత కళాపిపాసతో ఆణిముత్యాల్లాంటి కళాఖండాలను సృష్టించి, మన జీవితాలను మనస్సులను స్పృశించి, వాటిలోని మాధుర్యాన్ని ఆస్వాదించమని మనకు వదిలి వెళ్ళిన ఆ కళామతల్లి ముద్దుబిడ్డలకు అంకితం

ఎందరో మహానుభావులు అందరికీ శతకోటి నమఃస్సుమాంజలులు

మాగంటి వంశీ మోహన్ , మాగంటి శ్రీదేవి

Sunday, June 8, 2008

డాక్టర్ సామల సదాశివ - "యాది"

డాక్టర్ సామల సదాశివ గారు బహుభాషాకోవిదుడు. సాహిత్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. ఆయన రాసిన "యాది" అనే శీర్షిక "వార్త" పత్రికలో చాలా కాలం నడిచింది. ఆయన రాసిన గ్రంథం "మిర్జాగాలిబ్ (జీవితము-రచనలు)" గాలిబ్ వ్యక్తిగత జీవితాన్ని, సాహిత్య జీవితాన్ని సమాంతరంగా చర్చిస్తూ, గాలిబ్ చరిత్రను రాసిన వివిధ ఉర్దూ రచయితల అభిప్రాయాలలోని వైరుధ్యాలను, వివాదాస్పద అంశాలను చర్చించి గాలిబ్ వ్యక్తిత్వాన్ని సమగ్రంగా ప్రతిఫలింపచేసింది....అలాగే సంగీత శిఖరాలు అనే పుస్తకంలోని ఒక్కొక్క వ్యాసం మనలను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. హిందుస్తానీ సంగీతాన్ని గురించి తెలుగులో వెలువడిన మొదటి గ్రంథం ఇదే అని చెప్పవచ్చు. ఇందులో సదాశివగారి సాహిత్య, సంగీత విశ్వరూపాన్ని చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిపొందిన ఉరుదూ కవుల భాషా కవిత్వ రీతుల్ని, వ్యంగ్య శైలిని, చాతుర్యాన్ని, ముషాయిరీల ముచ్చట్లను "ఉరుదు భాషా కవిత్వ సౌందర్యంలో" అనే రచనలో చూడవచ్చు...ఇలా ఎన్నో ఆణిముత్యాలను మనకు అందించిన సదాశివ గారి గురించి వారాల ఆనంద్ గారు తీసిన ఈ వీడియో మీతో పంచుకునే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ, అనుమతి ఇచ్చినందుకు ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
http://www.maganti.org/mukhamukhiindex.html

Vamsi

శ్రీ ముద్దసాని రాం రెడ్డి గారు - (ఒక తెలంగాణా సాహితీమూర్తి )

శ్రీ ముద్దసాని రాం రెడ్డి గారు తెలుగు సాహిత్యం పట్ల ఎంతో నిబద్ధత గల దీక్షాదక్షుడు, ప్రముఖ సాహితీవేత్త. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారాలు, తెలుగు అకాడెమీల బహుమతులు ఈయన సాహితీ ప్రతిభకు, సాహితీ ఆరాధనకు అందిన ఎన్నో బహుమతులలో కొన్ని. కారు ప్రమాదంలో నడుము విరిగి, మంచంలోనే ఉంటూ ఎన్నో దశాబ్దాల నుండి తన సాహితీ ప్రయాణాన్ని కొనసాగించిన మహామనీషి...ఆయన గురించి కరీం నగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ వారాల ఆనంద్ గారు తీసిన ఈ వీడియో మీతో పంచుకునే అవకాశం వచ్చినందుకు, ఆ పైన అనుమతి ఇచ్చినందుకు ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ...

http://www.maganti.org/mukhamukhiindex.html

Vamsi

Friday, June 6, 2008

చిన్నపిల్లలు ఇళ్ళల్లో పాఠాలు బట్టీపట్టే విధానాన్ని ఇలా....

ముళ్లపూడి వెంకటరమణ గారి ఋణానందలహరిలో "అప్పడి కథ"లో - చిన్నపిల్లలు ఇళ్ళల్లో పాఠాలు బట్టీపట్టే విధానాన్ని ఇలా వివరిస్తారు..

"పూర్వము అప్పడని ఒక్కడుండెనూ. ఇద్దరు ఉండుటకు వీలులేకనే వక్కడు వుండెనూ. వానికి డబ్బుగల స్నేహితుడూ గలడు. అందువల్ల డబ్బు లేదూ. అందు స్నేహితుడు అప్పడికి మొహమాటంచే ప్రతి దినమూ ఒక వరహా బదులు ఇచ్చుచుండెనూ. ఇట్లుండగా ఒక దినమున అప్పడు ఇట్లాలోచించెనూ. వీడు నాకు రోజురోజూ వడ్డీ వరహా ఇస్తూ ఉన్నాడుగదా, వక్కసారే వంద ఎందుకు అడగరాదూ, వీడు ఇవ్వరాదూ. ఇట్లా యోచించి అట్లా అప్పుడు మిత్రుడని ఒకరోజున వక్కసారిగా వంద వరహాలు అడిగెనూ. వాడు వెంటనే నా వద్ద అంత డబ్బు లేదు గదా, ఏమి చేయుదునూ అని యోచించి, ఓరి అప్పుడూ, నా వద్ద లేదు అని చెప్పివేసెనూ. మొహమాటమూ పోయింది గావున మరునాడు ఒక వరహా కూడా యివ్వలేదూ..."

చిన్నపిల్లలు బిగ్గరగా చదువుతున్నప్పుడు వాక్యాంతాలను దీర్ఘాంతాలుగా పలకడం సహజం. విషయంతో సంబంధం లేకుండా కేవలం చదివే తీరును రమణ గారు రాయటం ఇందులో విశేషం...

ఆయన రాసిందే ఇంకో రచన - రాజకీయ భేతాళ పంచ వింశతి , నీతి సిగ్గూ లజ్జా లేని మన రాజకీయ నాయకుల మీద విదిలిచిన కొరడా. అందులో "చేప కథ" ఇలా సాగుతుంది

ఒక మంత్రి గారు భోజనం చేస్తున్నప్పుడు ఒక ఎండని చేప వస్తుంది. మిగతావన్నీ ఎండినప్పుడు దీనికేం రోగం? ఇదేం అసెంబ్లీ అనుకుందా? మునిసిపల్ కవున్సిల్ అనుకుందా? ఇండిపెండెంటు మెంబరుని అనుకుందా? అని కోపంతో ఆ మంత్రిగారు ఎంక్వైరీ కమీషనరుగా తనని తానే నియమించుకుని విచారణకు ఉద్యమించాడు
చేపా చేపా ఎందుకు ఎండలేదు?గడ్డిదుబ్బు అడ్డమొచ్చిందిట్రాక్టర్ మిషన్ వాడు ! ట్రాక్టర్ మిషన్ వాడ గడ్దిదుబ్బు నెందుకు కొట్టలేదు?కామందు చెప్పలేదు. ఆయన తన కొడుకుని ఇక్కడికి బదిలీ చేయించుకోవాలి అని చూస్తున్నాడు...

ఇలా విచారణ తిరిగి తిరిగి, ఎక్కడెక్కడో నడిచి తీగలాగితే డొంక కదిలినట్టు చివరికి తనకే ఎసరు వచ్చే పరిస్థితి వచ్చి ఫైలు మూసెయ్యాలి అని చూస్తాడు..కానీ అప్పటికే ఆ వార్త పత్రికలకెక్కిపోవడం వల్ల ప్రతిపక్షాల వాళ్ళు నివేదిక అడుగుతారు. అందుకు విరుగుడుగా మళ్ళీ ఒక సంఘం - ఈ సారి ప్రముఖులతో కూడింది ఏర్పడుతుంది. ఈ సంఘం వాళ్ళంతా చాలా చాలా ఊర్లల్లో సమావేశాలు నిర్వహించి, చివరాఖరికి ఉదకమండలంలో సమావేశంలో పరివేస్ఠితులై ఉండగా, అప్పటికి మూడునెలల కాలం గడిచిపోవటం వల్ల ఆ చేప గబ్బు లేస్తుంది. అప్పుడు ఆ చివరాఖరి సమావేశంలో వాసన వస్తోంది కాబట్టి చెత్తబుట్టలో పారెయ్యండి అని సూచిస్తారు. దాంతో సమావేశం ముగియటం, ఫైలు ముయ్యటం తటస్థిస్తుంది..

Saturday, May 24, 2008

గాంధీ గారి ముత్తైదుతనం కంటే నెహ్రూగారి వెధవతనమే బాగున్నట్టుందండీ!

1964 లో ప్రచురించబడ్డ "ఆంధ్ర రత్న గోపాలకృష్ణుని చాటువులు" అనే పుస్తకం దుమ్ము దులపటానికి కుదిరింది నిన్న రాత్రి...అందులోని కొన్ని మణిమాణిక్యాలు...
*********************************
ఆంధ్ర నాయకుల మీద "ఆంధ్ర రత్న" గోపాలకృష్ణ గారి పద్యం ఒకటి...

సీ. కొండెంకటప్పన్న గుండుసున్నగదన్న
గోపాలకిట్టాయి కొక్కిరాయి
టంగుటూరు ప్రకాశ మింగిలీషుపిశాచి
నాగేశ్వరుడు వట్టి నాగజెముడు
పట్టాబిసీతన్న తుట్టెపురుగుగదన్న
ఉన్నవ లచ్చుమన్న దున్నపోతు
గొల్లపూడ్సతన్న కళ్ళులేనికబోది
బులుసు సాంబడు వట్టి పుట్టుకుంక
అయ్యదేవరవాడు పెయ్యనాకుడుగాడు
అయ్యంకి రమణయ్య దయ్యమయ్య
డాక్టర్ సుబర్మణ్య మాక్టింగ్ ఫులిష్టాపు
దువ్వూరి సుబ్బమ్మ దృష్టిబొమ్మ

అనుచు బల్కుదు రాంధ్రుల నవనియందు
గాంధిశ్రేష్ఠునిమతములో గలసినపుడు
తపములేనిదె యెన్న రే నెపములెల్ల
రామనగరీ నరేంద్ర! శ్రీరామచంద్ర!

**********************************
అలాగే 1925 బందరు ఆంధ్ర రాష్ట్రీయ మహాసభలను గురించి

బడాయికోర్లన్న, కాంగ్రెసు
బడాయికోర్లన్న
బందరులోన సందడిచేసిరి

విందులు చిందులు తందనాలతో
వందలకొలదిగ సందడిచేసిరి

పొట్టమాటలను చాటుధారలను
వోటుకు, రైటుకు లోటుపడక బహు
బూటకములతో, నాటకములతో
ప్లాటుఫారమున ఘాటుగ వాగిరి
********************************
అదే పుస్తకంలో హాస్య చెణుకులు కొన్ని

౧)గుంటూరు కాంగ్రెస్ ఆఫీసుకు గోపాలకృష్ణయ్య గారు వెళ్ళగా గొల్లపూడి సీతారామశాస్త్రి గారు ఖద్దర్ బోర్డు లెఖ్ఖలు చూస్తుంటే, ఆయన అన్న మాట ఇది - "ఏం చేస్తున్నారు ? శాస్తుర్లుగారూ! తారీఖులు కూడుతున్నారా ఏమిటీ?"
********************************
౨)1924లో కాంగ్రెస్ లో "స్వరాజ్య పార్టీ", "నో చేంజి" పార్టీలని రెండు పార్టీలుండేవి. మన గోపాలకృష్ణయ్యగారేమో కొంతవరకు స్వరాజ్య పార్టీ అభిమాని. రెండో పార్టీని "మారని పార్టీ" అని చమత్కరించేవారుట. ఈ రెండు పార్టీల్లో ఏది మంచిదండీ? అని ఒకాయన అడిగితే "గాంధీ గారి ముత్తైదుతనం కంటే నెహ్రూగారి వెధవతనమే బాగున్నట్టుందండీ" అని సమాధానం ఇచ్చారుట. ఆ రోజుల్లో గాంధీగారి అభిమానం నోచేంజి పార్టీకి ఉండేదని వినికిడి... :)

Wednesday, May 21, 2008

జీవితంలో ఒక్కసారయినా కావాలని కోరుకునే పదార్థం ...

"సక్సెస్" - అదేనండీ.... అందరూ జీవితంలో ఒక్కసారయినా కావాలని కోరుకునే పదార్థం - ఇదిగో ఇలా ఉంటుంది ... బొమ్మను నొక్కితే .....బాఘా....... కనపడుతుంది మరిFriday, May 16, 2008

"భారతీయ సినిమాల్లో స్త్రీ" - ఒక మంచి పుస్తకం ఇక్కడ చదువుకోండి

"భారతీయ సినిమాల్లో స్త్రీ" - ఒక మంచి పుస్తకం ఇక్కడ చదువుకోండి

http://www.maganti.org/page5.html

ఈ పుటలో ఈ తరం రచయితలు, వారి రచనలు HEADING క్రింద ఉన్న "వారాల ఆనంద్" మీటను నొక్కండి

లేదా ఇక్కడ చూడండి

http://www.maganti.org/rachayitalu/varala/varalaindex.html

విధేయుడు
వంశీ

Monday, May 12, 2008

కర్ణాటక సంగీతం - మూడవ పాఠం (అలంకారములు) వీడియో

శ్రీమతి చర్ల రత్నకుమారి గారి కర్ణాటక సంగీతం మూడవ పాఠం (అలంకారములు) వీడియో ఇక్కడ.

http://www.maganti.org/mukhamukhiindex.html

అవకాశం ఇచ్చినందుకు ఆవిడకు పాదాభివందనాలతో

విధేయుడు

వంశీ

Sunday, May 11, 2008

మళ్లీ పాడిందే పాటరా ....తాపీ ధర్మారావు గారి గురించి


మళ్లీ పాడిందే పాటరా ...."తాపీ ధర్మారావు గారి గురించి తెలియని తెలుగువారు ఉన్నారంటే ...ఇక చెప్పేదేమీలేదు....ఈ చిత్రరాజాన్ని పంపించిన మిత్రుడు శ్రీనివాస్ కి ధన్యవాదాలు...దీని కాపీరైటు సంగతి సందిగ్ధంలో ఉన్నది...ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియచెయ్యండి...ఇలా ప్రచురించటం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియచేస్తూ ఈ బ్లాగునుండి తొలగిస్తాను...

సురభి నాటక సమాజ నిర్మాత
సురభి నాటక సమాజ నిర్మాత అయిన వనారస గోవిందరావు గారి గురించి తెలియని తెలుగువారు ఉన్నారంటే ...ఇక చెప్పేదేమీలేదు....ఈ చిత్రరాజాన్ని పంపించిన మిత్రుడు శ్రీనివాస్ కి ధన్యవాదాలు...దీని కాపీరైటు సంగతి సందిగ్ధంలో ఉన్నది...ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియచెయ్యండి...ఇలా ప్రచురించటం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియచేస్తూ ఈ బ్లాగునుండి తొలగిస్తాను...

స్థానం నరసింహారావు గారుస్థానం నరసింహారావు గారుఈయన గురించి తెలియని తెలుగువారు ఉన్నారంటే ...ఇక చెప్పేదేమీలేదు....ఈ చిత్రరాజాన్ని పంపించిన మిత్రుడు శ్రీనివాస్ కి ధన్యవాదాలు...దీని కాపీరైటు సంగతి సందిగ్ధంలో ఉన్నది...ఎవరికయినా అభ్యంతరాలు ఉంటే తెలియచెయ్యండి...ఇలా ప్రచురించటం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియచేస్తూ ఈ బ్లాగునుండి తొలగిస్తాను...

Thursday, May 8, 2008

కరీం నగర్ ఫిల్మ్ సొసైటి అధ్యక్షులు, రచయిత శ్రీ వారాల ఆనంద్ గారి రచన

కరీం నగర్లోని హనుమాన్ నగర్ వాస్తవ్యులయిన మిత్రులు శ్రీ వారాల ఆనంద్ గారి రచన "మానేరు తీరం"ని మీ ముందుకు తీసుకునిరావటానికి అవకాశం లభించినందుకు ఆనందిస్తూ, ముందుగా వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

ఆనంద్ గారు కరీం నగర్ ఫిల్మ్ సొసైటి అధ్యక్షులు. ప్రముఖ రచయిత. తెలుగు లో ఎం.ఏ చేసి, లైబ్రరీ సైన్సులో ఎం.ఫిల్ పట్టా పుచ్చుకున్న ఆనంద్ గారు శాతవాహన సెంటర్ ఫర్ కరీం నగర్ లిటరేచర్, కల్చర్ అండ్ హిస్టరీ స్థాపించి అందులో వందలు వేలాది పుస్తకాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

చాలా కాలంగా తెలిసిన మిత్రులే అయినా, ఆయన మితభాషి అవ్వటం వల్ల, ప్రచారం ఇష్టం లేకపోవటం వల్ల - ఆయన వెంబడి పడుతున్నా కూడా కుదరనిది, మొత్తానికి సాధించా......ఆయన సాయంతో కరీం నగర్ ప్రాంత ఇతర రచయితల పుస్తకాలు కూడా మీ ముందుకు త్వరలో ...

Wednesday, May 7, 2008

పెండ్యాల నాగేశ్వరరావు గారి చిత్రాన్ని చూసే భాగ్యం!
పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతాన్ని చెవులు కోసేసుకు వినటమే కానీ, ఆయన యవ్వనంలో ఎలా ఉండి ఉంటారో అన్న "ఇది" తీరలేదు..ఈరోజుతో ఆ "ఇది"కి "అది" లభించింది...ఆ మహానుభావుడి యవ్వనంలోని చిత్రాన్ని చూసే భాగ్యం ఈ వేళ ఆప్తమిత్రుడు రాగంపేట శ్రీనివాస్ వల్ల కలిగింది.... ఓల్డ్ తెలుగుసాంగ్స్ సైటులో ఆయన వృద్ధ్యాప్యం లోని చిత్రం ఉన్నది

Tuesday, May 6, 2008

వేంకట పార్వతీశ్వర కవులు 1910 లో "నాటకములు" మీద రాసిన పద్యం

వేంకట పార్వతీశ్వర కవులు 1910 లో "నాటకములు" మీద రాసిన పద్యం

సీ. జనదురాచార హింస్రాజంతుమారణ
క్రీడాసముత్సుకా ఖేటకములు
ధర్మాదిపూరుషార్థచతుష్టయాసూచి
కమనీయవిమల శృంగాటకములు
శృంగారహాస్య విశేషరసాపాది
చిత్రవిదూషక చేటకములు
దుర్వాదదుర్మత దుర్నీతిబోధక
విమతసంతానచపేటకములు
ఛాందసాచార దుర్గ్రహోచ్చాటకములు
పాటితాజ్ఞానదుర్విష కీటకములు
అభ్యుపేతసమున్నత హాటకములు
నవనవోద్ఘాటకమ్ములు నాటకములు

Monday, May 5, 2008

థూబొడ్డు ...

మన తెలుగుజాతి గర్వించదగ్గ మహానుభావుడు శ్రీ నేదునూరి గంగాధరంగారు వ్రాసిన "సెలయేరు" అనే పుస్తకము నుండి ఈ గోడీబిళ్ళ పాట చూడండి

గోడీ బిళ్ళ గోటీబిళ్ళ కానుబిళ్ళ కంచాబిళ్ళ
మానుబిళ్ళ మక్కేబిళ్ళ సానుబిళ్ళ చక్కనిబిళ్ళ
కోనుపెట్టి గూనుపెట్టి సాచిపెట్టి గోచిపెట్టి
అంగట్లో ఆమట్లో కఱ్ఱతో కొల్చి బుఱ్ఱతో గుణించి
వద్దంటే కద్దంటే సాటి తగవులతో గోటు తీర్పులతో
కుంటిమంది సొంటిపిక్క చాలలేని టెంకాయ
ఓనమాలు కాక్కాలు ఓడిన దొంగ వాటిమీద కొంగ
కూతెట్టిపోయి లాలా అర్ధా
లాక్కురా మిడక్కురా గూటీబిళ్ళ థూబొడ్డు

ఊగు ఊగు గంగెద్దా ...

ఊగు ఊగు గంగెద్దా
ఉగ్గు పాలే గంగెద్దా
సోలి ఊగే గంగెద్దా
సోలెడు పాలే గంగెద్దా
తాళి ఊగే గంగెద్దా
తవ్వెడు పాలే గంగెద్దా
మారీ ఊగే గంగెద్దా
మానెడు పాలే గంగెద్దా
ఆగీ ఊగే గంగెద్దా
అడ్డెడు పాలే గంగెద్దా
కూర్చో కూర్చో గంగెద్దా
కడివెడు పాలే గంగెద్దా
ఆడీ పాడే గంగెద్దా
అర్ధశేరు పాలే గంగెద్దా

నాగీ నాగీ నల్లేరు

అనంతపురం జిల్లాలోని ఒక గేలిపాట

నాగీ నాగీ నల్లేరు
నాగిని పట్టుకు తన్నేరు
ఈదులు ఈదులు తిప్పేరు
ఈత గందం పూసేరు
గాది కింద ఏసేరు
గంజి మెతుకులు బెట్టేరు
మూల ఇంట్లో మూసేరు
ముంత పొగలు ఏసేరు
పరమటింట్లో ఏసేరు
పక్కలిరుగ తొన్నేరు
గూబలు పట్టుక ఎత్తేరు
గుత్తికొండ చూపేరు

రెడ్డొచ్చె రెడ్డొచ్చె రెడ్డొచ్చె నమ్మా

శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్రము పుస్తకములో రెడ్డిరాజుల కాలం నాటి ప్రజాజీవితాన్ని వివరిస్తున్న ఒక మంచి జానపదం చూడండి

రెడ్డొచ్చె రెడ్డొచ్చె రెడ్డొచ్చె నమ్మా
వీరభద్రారెడ్డి విచ్చేసె నమ్మా
ప్రొద్దున్నె మారెడ్డి పొరకూడిపించు
నిలువెల్ల నడివీధి నీరు జల్లించు
సందుగొందులలోన సాన్పు పోయించి
చేకట్ల పసుపుకుంకుమలు పూయించు
రంగవల్లుల నూరు రాణింపజేయు
తోరణా పంక్తుల తులకింపజేయు
దివ్వెలను వెలిగించు దివ్యమార్గాలా
మాపెల్లి పాలించు మంచి మార్గాలా
ఎండలకు పందిళ్ళు వేయించుతాడూ
పొందుగా మారేళ్ళు పోయించుతాడూ
ఊరి బావులలోన ఉప్పు సున్నాలా
వెదజల్లు నేటేట నిండుపున్నానా రెడ్డొచ్చె

తువ్వాయి తువ్వాయి ఏమితువ్వాయి?

తువ్వాయి తువ్వాయి ఏమితువ్వాయి?
తువ్వాయి తువ్వాయి మంచి తువ్వాయి
తువ్వాయి మెడలోన ఏమివున్నాయి?
తువ్వాయి మెడలోన మువ్వలున్నాయి
తువ్వాయి కాళ్ళల్లో ఏమివున్నాయి?
తువ్వాయి కాళ్ళల్లోపరుగులున్నాయి
తువ్వాయి నోట్లోన ఏమివున్నాయి?
నోట్లోన తొలిపాల నురగలున్నాయి
తువ్వాయి తువ్వాయి ఎవ్వారి తువ్వాయి?
ఆవుగారి తువ్వాయి అసలు మాతువ్వాయి

చింతా దీక్షితులు గారి లక్కపిడతలు పుస్తకమునుండి తువ్వాయి గేయం

Saturday, May 3, 2008

విస్మృతికి గురైన ఈ చిలుకపాటను గుర్తుచేసుకుందాం

మన తత్త్వాలలో కావలసినంత వైరాగ్యం ఉంది. ఒకనాడు వీటిని వీధిలో పాడుతూ వచ్చేవారు. తాతలూ, బామ్మలూ పారాయణం చేసేవారు. ఈ "టెక్నాలజీ" యుగంలో వీటి ఊసే లేదు. ఈ తత్త్వాల వల్ల నిరాశ చెందమని కాదు - జీవిత పరమార్థం గ్రహించమని. జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు కాబట్టి మంచిపనులు వాయిదా వెయ్యకుండా గబగబా చెయ్యమని ప్రబోధించడమే అసలు రహస్యం. ఒకనాడు జనం పాటగా వుండి ఈనాడు విస్మృతికి గురైన ఈ చిలుకపాటను గుర్తుచేసుకుందాం

"ఎన్నాళ్ళు బతికినా కల్ల సంసారమిది
కనిపెట్టి తిరగవే చిలుకా
మూన్నాళ్ళ బ్రతుకు నీకు
మురిసేవు తుళ్ళేవు - ముందుగతికానవే చిలుకా!

కొడుకు వండినకూడు గూటికాకుల పాలు
దిక్కెవ్వరే నీకు చిలుకా!
వంటిమీదాగుడ్డ ఏటిచాకలిపాలు
దిక్కెవ్వరే రామచిలుకా!

నిన్ను పెంచినవారు నీళ్ళు మేతలుపెట్టి
తలుపడ్డమేసిరే చిలుకా!
తలుపుచాటున పిల్లి తా పొంచియున్నది
తప్పించుకో రామచిలుకా!

కట్టెలే బంధువులు నిప్పులే స్నేహితులు
కన్నతల్లెవ్వరో చిలుకా!
కాలయముడూ వచ్చి కూలబడి తంతేను
దిక్కెవ్వరే నీకు చిలుకా!

పచ్చని చేలకి వుచ్చులొడ్డున్నారు
తప్పించుకో రామచిలుకా
వుచ్చులో బడనేల వూపిరి పోనేల
పరనింద మనకేల చిలుకా!

ఆలుపిల్లలు నాది ఆస్తంత నాదని
చాలమోహించేవు చిలుకా!
ఇల్లు ఇల్లనియేవు యిల్లు నాదని యేవు
నీ ఇల్లు ఎక్కడే చిలుకా!

ఊరికుత్తరాన రెండు చెఱువులమధ్య
పారేసి వత్తురే చిలుకా!
మోసేరు నలుగురు వెంబడిని పదిమంది
కడకు తొలగొత్తురే చిలుకా!
కాలిపోయేదాక కావలుందురుకాని
వెంటనెవరూ రారు చిలుకా!

మావయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి "సాహిత్యకబుర్లు" నుండి

Friday, April 25, 2008

ఔరా ! అవి అవధానాలా ??

అవధాన విద్య ఆంధ్రుల సొత్తు. నిజమే ! ధార, ధారణలకి నిలయం. ఇదీ నిజమే!! పద్య వైభవానికి, ఆశుకవితా విన్యాసానికి నిదర్శనం. అవును. కానీ - ఇదంతా గత వైభవమే ! ఒకనాటి వాస్తవమే. మరి ఈనాటి పరిస్థితి? ...

పూర్తి వ్యాసం ఇక్కడ -

http://www.maganti.org/vyasavali/dwaana/aura.html

విధేయుడు
వంశీ

Wednesday, April 23, 2008

డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి "కాలం - అవగాహన" వ్యాసాలు

డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి "కాలం - అవగాహన" వ్యాసాలు

http://www.maganti.org/vyasavali/krpsir/kalamone.html

http://www.maganti.org/vyasavali/krpsir/kalamtwo.html

http://www.maganti.org/vyasavali/krpsir/kalamthree.html

అన్ని వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు

http://www.maganti.org/vyasavaliindex.html

విధేయుడు

వంశీ

Monday, April 21, 2008

కౌముది పత్రిక సంపాదకుడు కిరణ్ ప్రభగారితో ముఖాముఖి

భూగోళానికి ఇవతలివైపున అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక చిన్న నగరంలో నివసిస్తూ, ఒక పూర్తిస్థాయి తెలుగు పత్రికను నడపడం అనేది చెప్పుకోదగ్గ విశేషమే. ప్రతినెలా దాదాపు 35 శీర్షికలతో , 150 పేజీల పత్రికను క్రమం తప్పకుండా తీసుకురావడం అభినందించదగ్గ విషయం. ప్రస్తుతం ఇంటర్నెట్ కే పరిమితమయిన ఈ పత్రిక అత్యంత ఉత్తమమయిన సాహితీవిలువలు కల రచనలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అందిస్తోంది అనటంలో అతిశయోక్తి లేదు. ఆ విశిష్ట పత్రిక పేరు కౌముది. ఈ విశిష్టపత్రిక స్థాపకుడు, నిర్వాహకుడు, సంపాదకుడూ అయిన కిరణ్ ప్రభ (శ్రీ పాతూరి ప్రభాకర రావు) గారితో ముఖాముఖీ కార్యక్రమంలో ముచ్చటించటానికి అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ, ఆయన అనుభవాలు, ఆలోచనలు, సూచనలు మీతో పంచుకుంటున్నాం.

http://www.maganti.org/mukhamukhiindex.html

కిరణ్ ప్రభ గారి పేరు ఉన్న లింకు మీద క్లిక్కండి

విధేయుడు
వంశీ

Friday, April 11, 2008

ఆదికవి నన్నయ - సుందరయ్య ఎలా అయ్యాడబ్బా ?

బహుజనపల్లి సీతారామాచార్యుల వారి ప్రౌఢవ్యాకరణం చదువుతున్నప్పుడు ఆదికవి "నన్నయ" గారి నామార్థం తెలిసింది...

ఆ పేరుని ఇలా విడగొట్టాలిట - నన్ని + అయ - నన్నయ.. నన్ని (నన్నె)అంటే "సుందరము" అర్ధమని ఆ పుస్తకం చెపుతోంది

కాబట్టి ఆదికవి నన్నయ అసలు పేరు "సుందరయ్య" అనుకోవచ్చేమో..అలాగే మరి నన్నిచోడుడు / నన్నెచోడుడుడిని సుందర చోడుడు అనుకోవచ్చు మరి.. :)

విధేయుడు
వంశీ

Wednesday, April 9, 2008

పాటు, చేటు, కాటు, ఆటు, పోటు, కుందేలు, తోడేలు

శ్రీ వజ్ఝల చినసీతారామశాస్త్రి గారి బాలవ్యాకరణోద్యోతము చదువుతుంటే "పడ్వాదులు" అని ముక్క కనిపించింది...అదేమిటో అని చూస్తుంటే ఇక్కడికి తేలింది

పడ్వాదులు = పడు+ఆదులు

పడు, చెడు, ఆడుచు, కఱచు, పొడుచు, ఓడు మొదలయిన ధాతువులను పడ్వాదులు అంటారు.

అయితే "టు" అనే కృత్ప్రత్యయము పరమగునపుడు ఈ ధాతువులు ఆద్యక్షర శేషములై దీర్ఘమునొందునట

పడు + టు - పాటు
చెడు + టు - చేటు
ఆడుచు + టు - ఆటు
కఱచు + టు - కాటు
పొడుచు + టు - పోటు
ఓడు + టు - ఓటు

నేనింతవరకు ఈ పైవన్నీ ఒకే పదం అని అనుకుంటున్నా...బాల వ్యాకరణం కళ్ళు తెరిపించింది...అనుమానం వచ్చి పరవస్తుగారి బాల వ్యాకరణం కూడా చూసా...అందులో కూడా ఇలానే ఉన్నది...

అదే పుస్తకం ఇంకో విభాగంలో - కుందు + ఏలు - కుందేలు , తోడు + ఏలు - తోడేలు అని అలాగే పొటేలు, తాబేలు మొదలయినవి "ఏలు" సహాయంతో జంతుపక్షి వాచకాలుగా ఏర్పడినాయి అని వివరణ ఉన్నది

Friday, April 4, 2008

మన్నికకు.. అందానికి ..శుభ్రతకు


అప్పుతచ్చులా, అచ్చుతప్పులా !! ఒకవేళ ఉంటే ఎన్ని ?
అపార్థం చేసుకుంటారేమో - నేను ఏమీ హేళణ చెయ్యట్లా.....పాతకాలం ప్రచార కరపత్రాలు ఇలా ఉండేవన్న మాట అనే ఆరాటమే తప్ప...
NOTE: - All copyrights belong to Chandamama...Few of these images used under fair use act...

కోతిమార్కు నల్ల పండ్లపొడి !"పుష్ప రంజన్" వారి అగరవత్తులు ! ప్రత్యేకత ఏమిటో?


"పుష్ప రంజన్" వారి అగరవత్తులు - 1954 లోని "చందమామ"లో ప్రచార కరపత్రం ...
ప్రత్యేకత ఏమిటో పరీక్షగా చూసి చెప్పండి చూద్దాం

Wednesday, April 2, 2008

"దోమ" పద్యాలు

మంగిపూడి వేంకట శర్మ గారు 1913లో రాసిన "సరసరసాయనము" లోని కొన్ని పద్యాలు. కవిగారి గురించి శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఈ పుస్తక పీఠికలో చాలా ప్రశంసించారు. కవిగారి కాలం, ఇతర రచనలు, వివరాలు అవీ తెలియరాలేదు

దోమ

గీ!! సారె నాయంత వారలు లేరటంచు
నెగసి పడియెద వెందుకే? నీచజన్మ
ఏనుగౌదువె ! నీవు పాట్లెన్ని పడిన
తొండ మున్నంత మాత్రాన దోమకూన !

క!! జవ సత్వములున్నవె యా
హవములలో ఘనశతఘ్నికాదుల నెల్లన్
దవిలి వహింతువె కరితో
నవమతి! నీకెట్టి సామ్యమరయవె దోమా !

క!! భటులకు వాహంబై యా
ర్భటితో ఘీంకృతులు సెలగ బ్రతివీరమహా
పటలములద్రుంప గలవే
పటుగతి గరహాతుల బహుళపద ఘట్టనలన్ !

గీ!! నెలతలకు మందయానంబు నేర్పగలవొ
దాన ధారల నలులను దనుప గలవొ
పొసగు మౌక్తిక దంతంబు లొసగ గలవొ
సామజమునకు నీకేటి సాటి? చెపుమ !

క!! దూతలు చఱపులటంచును
జేతుల దట్టుచును విసువుచేతను నిన్ను
బూతులు దిట్టుచు రోతురు
రాతురులను మనుజులెల్ల రక్కసి దోమా!

Monday, March 31, 2008

మిమ్మల్ని మీరు మహరాజుగా భావించుకోవాలి అనుకుంటే!

మహారాజులు - వారి పరివార సభ్యుల గురించి అయ్యలరాజు నారాయణామాత్యుల వారు తన హంసవింశతిలో ఎంత చక్కగా వివరించారో చూడండి. దాదాపు 72 వినియోగాలు ఉన్న వీరంతా ఉంటేనే కానీ ఆ పరివారాన్ని "రాజుగారి పరివారం" అని పిలవలేముట


"గురు మహాప్రధాన సామంత సేనాపతి ద్వారపాల కావసరిక ఘటికానిర్ధారక గణక లేఖక పౌరాణిక పురోహిత జ్యౌతిషిక కావ్యజ్ఞ విద్వజ్జన దేవతార్చక మాల్యాకారక పరిమళకారక గోష్ఠాధికార గజాధికా రాశ్వాధికార భాండారాధికార ధాన్యాదికా రాంగరక్షక సూత సూద భేతాళ మత తాంబూలిక తాళవృంతక నరవాహక చ్చాత్రిక చామరిక కళాచిక కరశారిక కారపాలిక పాదుకాదార నర్తక గాయక వైణిక శకునిక మాగధ వైతాళిక పరిహాసక కాంచుక క్షౌరక రజక సౌచిక చర్మకారక ముద్రాధికార పురపాలక వనపాలక నరవైద్య గజవై ద్యాశ్వవైద్య పశువైద్య భేరివాదక మురజవాదక రౌమక శిలాచ్చేదక కాంస్యకారక కుంభకారక చిత్రకారక వ్యవహారిక మృగయార్ధి పక్షిఘోషక పణిహారక రాయభార కోగ్రాణాధికార వేశ్యజనంబు లాదియైన డెబ్బది రెండు వినియోగంబుల వారు సేవింపనతండు వెలయుచుండు"

కాబట్టి ఎప్పుడయినా మిమ్మల్ని మీరు మహరాజుగా భావించుకోవాలి అనుకుంటే, ముందు మీకింత పరివారం ఉందో లేదో ఆలోచించుకుని తరువాత ఆ భావ వీచికలకు ఒక రూపం ఇవ్వండి

Saturday, March 29, 2008

ఆచార్య వేమూరి వేంకటేశ్వర రావు గారి ఇంటర్వ్యూ

ఆచార్య వేమూరి వేంకటేశ్వర రావు గారి ఇంటర్వ్యూ

http://www.maganti.org/mukhamukhiindex.html

విలువయిన సమయం వెచ్చించి, ఎన్నో సూచనలు , అనుభవాలు, అనుభూతులు పంచుకున్న శ్రీ వేంకటేశ్వరరావుగారికి పాదాభివందనాలర్పిస్తూ, మీరు కూడా ఆయన చేసే అత్యంత విలువయిన ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాలు పంచుకుని మీ వంతు సాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను.

If you are experiencing problems with the high resolution/high bandwidth interview, let me know and I will look into it

Thanks in advance for watching

Vamsi

Saturday, March 22, 2008

సాహిణమే "సాని" అయ్యిందా ?

సాహిణమే "సాని" అయ్యిందా ?


లకం"సాని", మేడ"సాని", అల్ల"సాని" , చల"సాని" - ఇలా ప్రముఖమయిన ఇంటి పేర్లు మనకి తెలిసినవే కదా...అయితే కొత్త సంగతి ఒకటి తెలిసింది..


సాహిణం అంటే జంతుసాల(అశ్వ, గజ) అని, ఈ సాహిణం అనే మాటే "సాని" అయ్యిందని ఈ మధ్య కాలిఫోర్నియాలో జరిగిన ఒకానొక సాహితీసభలో వినటం జరిగింది, ఇది నిజమేనా - లేక సానికి వేరే అర్ధం ఏమయినా ఉందా? పెద్దలు తెలుపగలరు..

చివరి చెణుకు ఏమిటి అంటే అల్లసాని వారికి రథ గజ తురగ సాలలు బోలెడు ఉండేవి అని, ఆయన తన వీరత్వాన్ని అసలు యుద్ధంలో కాకుండా, పదకవితల్లో చూపించారని వక్తగారు నొక్కి వక్కాణించారు

Friday, March 21, 2008

కరోడ్గిరి నాకా అనే పదానికి అర్ధం ఏమిటి ?

నిన్న నా వాహనానికి రోగం వచ్చి మూలుగుతూ ఉంటే, ఆఫీసుకి మా ఇంటి దగ్గరలోనే ఉన్న లైట్ రైల్ స్టేషన్ నుండి రైలెక్కి వెళ్ళా..సాయంత్రం పూట ఆఫీసునుండి తిరిగి వస్తున్నప్పుడు అదే ట్రెయిన్లో ఇద్దరు తెలంగాణా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు...సుమారు 60-65 యేళ్ళు ఉంటాయనుకుంటా ...నేను కూర్చున్న సీటుకి రెండు సీట్లవతల కూర్చున్నారు..

వాళ్ళల్లో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఒకాయన - "గా పోరడోళ్ళ అయ్య కరోడ్గిరి నాకా లో పంజేశెటోడు. అందుల మస్తు మతలబు జేశిండులే, కొడ్కుని ఇరగదీశుర్రు" అనటం వినపడింది...ఈ కరోడ్ గిరి నాకా / కరోడ్గిరి నాకా అనే పదానికి అర్ధం ఏమిటి ?

ఈ మాటన్న ఆయన్నే అడుగుదాం అంటే ఎగాదిగా చూస్తాడేమో అని ఒకవైపు, తెలంగాణాలో పెరిగి ఈ మాట కూడా తెలీలేదే అన్న అభిమానం ఒకవైపు కత్తులు తీసుకుని కొద్ది సేపు కదనరంగంలో కొట్టుకున్నాయి. చివరికి ఆయన్నే అడుగుదాము అని నిశ్చయయించుకునేలోపు నాకు "కరోడ్గిరి నాకా" ను వదిలి వాళ్ళు ఇద్దరూ చక్కా దిగిపోయారు..

"నాకా" అంటే ఆఫీసు అని తెలుసు కానీ - కరోడ్గిరి, కరోడ్ గిరి సంగతి తెలియాలి

Wednesday, March 19, 2008

పూర్తి పాఠం తెలిస్తే పూరించండి

జిడ్డు పంతులుకీ జిలేబి జాంగ్రీ
బడ్డు పంతులుకీ బాదంఖీరు
రొడ్డు పంతులుకీ రాణీవాసం
దుడ్డు పంతులుకీ దొరసానివేషం
దొడ్డు పంతులుకీ దద్ధోజనం
ఎడ్డి పంతులుకీ లడ్డు మిఠాయి
మడ్డి పంతులుకీ మసాలావడ
కడ్డి పంతులుకీ కందులపాకం

ఇలా కృష్ణా జిల్లాలో ఒక పిల్లల పాట ఉండేది...చిన్నప్పుడు ఎప్పుడో విన్న పాట ఇది..కొంచెమే గుర్తు ఉంది..ఎవరికయినా పూర్తి పాఠం తెలిస్తే పూరించండి

"కంచికి వెళ్ళి మంచివాడిని" పెళ్ళిచేసుకుందుకుట

రేడియో అక్కయ్య గారి పాట ఇంకోటి...ఈ పాట అందించిన మా చిన్నమ్మ (పిన్ని) శ్రీమతి లంక లలిత గారికి ధన్యవాదాలతో

ఏనుగట - ఏడు మూళ్ళ తొండమట
తననట, నేనట
పెళ్ళాడాలట
అయ్యో బతుకో బతుకు

ఒంకరటింకర ఒంటెట
పొడుగాటి గొంతట
తననట, నేనట
పెళ్ళాడాలట
అయ్యో బతుకో బతుకు

గుఱ్ఱమట
పళ్ళన్నీ తొఱ్ఱి అట
తననట, నేనట
పెళ్ళాడాలట
అయ్యో బతుకో బతుకు

కాకట కటిక నలుపట
కన్ను గుడ్డట
తననట, నేనట
పెళ్ళాడాలట
అయ్యో బతుకో బతుకు

అసలింతకీ ఈ పాట ఒక దోమ "కంచికి వెళ్ళి మంచివాడిని" పెళ్ళిచేసుకుందుకుట

హైదరాబాదు వస్తే నీకూ - అన్నీ కలిపీ పెడతాను

ఈ పాట అందించిన మా చిన్నమ్మ (పిన్ని) శ్రీమతి లంక లలిత గారికి ధన్యవాదాలతో...ఇది రేడియో అక్కయ్య గారి పాట అని తెలుస్తోంది..

మ్యావ్ మ్యావ్ పిల్లీ రారమ్మూ
పుస్ పుస్ పిల్లీ రారమ్మూ

గోలుకొండకు వస్తే నీకూ
పాలూ మీగడ పెడతాను
వరంగల్లుకు వస్తే నీకూ
కారప్పూసా పెడతాను

నల్లాగొండకు వస్తే నీకూ
చల్లా మజ్జిగ పోస్తానూ
ఖాజీపేటకు వస్తే నీకూ
కాజాలాడ్డూ పెడతాను

ఖమ్మమ్మెట్టుకు వస్తే నీకూ
కమ్మని బువ్వాపెడతానూ
హైదరాబాదు వస్తే నీకూ
అన్నీ కలిపీ పెడతాను

కాలం అవగాహన - డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ వ్యాసం

కాలం అవగాహన - 1

డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ వ్యాసం

ఇతర వ్యాసాల కోసం ఇక్కడ

http://www.maganti.org/vyasavaliindex.html

విధేయుడు
వంశీ

జీవపరిణామం - డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ వ్యాసం


ఇతర వ్యాసాల కోసం ఇక్కడ

http://www.maganti.org/vyasavaliindex.html

విధేయుడు

వంశీ

Tuesday, March 18, 2008

శ్రీ అబ్దుల్ కలాం గారు పాడిన "ఎందరో మహానుభావులు"...

శ్రీ అబ్దుల్ కలాం గారు పాడిన "ఎందరో మహానుభావులు"...

http://youtube.com/watch?v=zLXiNj94rx8

(vIDiyO lO 2.04 నిముషం దగ్గరినుంచి మొదలు )

ఆయన స్వరం కలిపిన "ఎందరో మహానుభావులు" అంటే బాగుంటుందేమో... ఆ పక్కనే రెండో భాగం, మూడో భాగం కూడ ఉన్నాయి..వాటిల్లో ఆయన ఎంత శ్రధ్ధగా, లీనమయిపోయి వింటున్నారో చూడండి, ముఖ్యంగా రెండో భాగంలో

Note:

శ్రీ జి.బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన త్యాగరాజుల వారి ఇదే కృతి ఇంతవరకు మళ్ళీ నాకు దొరకలేదు...ఆయన పాడిన ఈ కృతి తెలుగుబిజ్.నెట్ లో ఇంతకుముందు దొరికేది..చాలా మంది ఇదే కృతి పాడగా విన్నా కానీ - శ్రీ జి.బి.కె గాత్రంలో విన్న తరువాత, ఇంకెవరిదీ వినబుద్ధి కాలా... హైదరాబాదులో కూడా తెలిసిన వారి ద్వారా ప్రయత్నించాను కానీ, సఫలం కాలా...ఇక తిరుపతిలో కానీ, మద్రాసులో కానీ దొరుకుతుందేమో చూడాలి

Saturday, March 15, 2008

ఇది నిజమయిన తెలుగు వెన్నెలే

ఇది నిజమయిన తెలుగు వెన్నెలే

http://www.maganti.org/lalitasangitam/drbhattar/vennelavennela.pdf

నేలనవ్వుతోందా

http://www.maganti.org/lalitasangitam/drbhattar/nelanavvutonda.pdf

రింగు రింగు

http://www.maganti.org/lalitasangitam/drbhattar/ringuringu.pdf

అంతా ఒక్కటే

http://www.maganti.org/lalitasangitam/drbhattar/antaokkate.pdf

బంగారు బాల బాలికలం

http://www.maganti.org/lalitasangitam/drbhattar/bangarubalabalikalam.pdf

మనసాయెరా

http://www.maganti.org/lalitasangitam/drbhattar/manasayera.pdf

పడవ నడపవోయి


http://www.maganti.org/lalitasangitam/drbhattar/padavanadapavoyi.pdf


మిగిలిన లలిత సంగీతం పాటలు ఇక్కడ చూడవచ్చు


http://www.maganti.org/lalitasangitamindex.html

విధేయుడు
వంశీ