Saturday, October 20, 2007

"ఆకాశవాణి" వార్తలు

ఆకాశవాణి వార్తలు

చిన్నప్పటి హైదరాబాదు కేంద్రం ఆకాశవాణి మధుర స్మృతుల గురించి రాద్దాము అని ఎందుకో అనిపించింది. అసలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 1950లో డెక్కన్ రేడియోలో విలీనం అయ్యిందిట. అసలు రేడియో అంటే మర్ఫీ రేడియోనే. దానికి సాటి మరోటి లేదు. మా ఇంట్లో అలాంటి మర్ఫీ రేడియో ఒకటి ఉండేది. దానికి కాలం చెల్లాక నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ రేడియోతో పాటు ఉన్నది, దుబాయి నుంచి మా నాన్నగారి స్నేహితుడి ద్వారా తెప్పించారు.

మా ఇంట్లో ఆ పాత మర్ఫీ రేడియో పొద్దున్న ఆరు ఇంటి నుంచి మంద్ర స్వరంలో మోగుతూనే ఉండేది. మా అమ్మ ప్రసూన తన వంట కార్యక్రమాలు అవీ అయిపోయేదాకా నడుస్తూనే ఉండేది. తరువాత పదింటికో ఎప్పుడో ఆ కార్యక్రమాల ప్రసారం ఆగిపోయి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండింటికి మొదలు అయ్యేవి. నేను సుమారు 1978-80 నుంచి అంటే నాకు కొంచెం బాగా ఊహ వచ్చాక రేడియో ప్రసార కార్యక్రమాలు నా దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయినాయి అంటే అతిశయోక్తి కాదు.

నాకు తెలిసిన కొంత మంది అనౌన్సర్లు భువనేశ్వరి, ఇందిరాదేవి, నిర్మలా వసంత్, ఇలియాస్ అహమద్, ఎం.ఎన్.శాస్త్రి, జ్యోత్స్న, శేషారత్నం, పండా శమంతకమణి, డి.శ్రీరాములు, తురగా ఉషారాణి, పోణంగి బాలభాస్కర్, పార్వతీ ప్రసాద్, గద్దే బాబూరావు, యండ్రపాటి మాధవీలత, జె.చెన్నయ్య.జ్యోత్స్న గారు తరువాత తరువాత టి.వీ లో న్యూస్ రీడర్ గా దర్శనమిచ్చేవారు. వివిధభారతి వాణిజ్య ప్రసారాల్లో ఉమాపతి, ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి, సీత, ఇందిరా బెనర్జీ, మట్టపల్లి రావు, రాజగోపాల్ మొదలయినవారు ఉండేవారు.

దండమూడి మహీధర్ అని ఒకాయన పాఠాలు చెప్పేవారు. ఇక చిత్తరంజన్ గారు , పాలగుమ్మి వారు, మంచాళ జగన్నాథ రావు గారు, వింజమూరి సీతాదేవి గారు, అన్నయ్య, అక్కయ్య (న్యాపతి దంపతులు), బాలాంత్రపు రజనీకాంత రావు, రావూరి భరద్వాజ, శారదా శ్రీనివాసన్, కేశవపంతుల వారు (సంస్కృత పాఠాలు), సరే సరి.

ఇక రానారె చెప్పినట్టు కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క గారిని, ఏకాంబరం గారిని కూడా స్మరించుకోవాలి ఇక్కడ. ఇక బాలానందం, బాలవినోదం సరే సరి.

ఇక నాకు బాగా నచ్చిన న్యూస్ రీడర్, సమ్మోహకమయిన గాత్రం కల అద్దంకి మన్నార్. నాకయితే ఆయన వాక్ప్రవాహం లో పడితే సమయం అసలు తెలిసేది కాదు. అయ్యో అప్పుడే అయిపోయిందా...ఇంకా కొంచెం సేపు ఈయన కార్యక్రమం కొనసాగితే బాగుండు అనిపించేది. ఇంకా బాగా గుర్తు ఉన్న న్యూస్ రీడర్లు కందుకూరి సూర్యనారాయణ, ఏడిద గోపాల రావు, మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి,తిరుమలశెట్టి శ్రీరాములు, బండారు శ్రీనివాస రావు, బలదేవానంద సాగర్ (సంస్కృత వార్తలు), రత్నా సాగర్, , ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావు.

రేడియో మాస్కో, సిలోన్ రేడియో, బినాకా గీత్ మాలా, యువవాణిలోని మెహ్ఫిల్, ఉషశ్రీ గారి కార్యక్రమాలు, వోలేటి వెంకటేశ్వర్లు గారి మ్యూజిక్ ప్రోగ్రాములు నాకు నచ్చిన మరి కొన్ని ప్రసారాలు.

ఇక అమ్మమ్మగారి ఊరు వెళ్ళినప్పుడు అక్కడ విజయవాడ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. అందులో గుర్తు ఉన్న అనౌన్సర్లు , ఇందులో మా తాతయ్య గారి కాలం నాటి అనౌన్సర్లు కూడా ఉన్నారండోయి- నళిని, లింగరాజు శర్మ, వెంపటి రాధాకృష్ణ శర్మ, లత (అవును రచయిత లత గారే), వాసుదేవ మూర్తి, సుబ్రహ్మణ్య భట్ట్, శ్రీరామ్మూర్తి,కుటుంబరావు, సంజీవరావు, ఆంజనేయులు, విజయకుమారి, శారదా జయప్రకాష్, మాడ్గుల రామకృష్ణ ఇలా ఇంకా ఎంతో మంది....

ఈ గాత్ర సమ్మోహనా గంధర్వులకి నమోవాకాలతో ...

అలాగే నేను సేకరించగలిగిన వివరాల ప్రకారం కొంగర జగ్గయ్య, శ్రీ శ్రీ, నండూరి సుబ్బారావు, బందా కనకలింగేశ్వర రావుగారు, బుచ్చిబాబు, పింగళి లక్ష్మీకాంతం, మంగళంపల్లి బాలమురళి, దేవులపల్లి వారు, గొల్లపూడి ఇంకా ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలవారు అంతా మొదట్లో ఆకాశవాణి లో పనిచేసినవారే.

ఇక ఈ తరం అనౌన్సర్లు - మొన్న హైదరాబాదు వెళ్ళినప్పుడు విందామని రేడియో పెట్టుకోగానే, ఒక్క సారి వాంతికొచ్చినంత పని అయ్యింది...అదేదో ఎఫ్.ఎం ఛానెళ్ళ వారు తమ భయంకరమయిన ఉచ్చారణతో - నోరు అంతా మైకులో దూర్చేసి అదేదో కోడి పిల్లో, కుక్కపిల్లో అన్నట్టు - "నేను అల్లరి పిల్ల గౌతమో , భూతమో అని...ఉత్సాహంగా ఉల్లాసంగా" అని ఏదేదో విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఖర్మ అండి ఖర్మ....ఏం చేస్తాం?

సరే కానీ మీకు ఎవరికి అయినా అద్దంకి మన్నార్ గారి జీవిత విశేషాలు ఎక్కడయిన దొరుకుతాయేమో తెలిస్తే చెప్పండి.

9 comments:

 1. ఎఫ్.ఎం రేడియోల గురించి సరిగ్గా చెప్పారు.

  నాకు చిన్నప్పుడు రేడియో దైనందిన జీవితంలో భాగమే. పొద్దున్న భక్తిరంజనితో మొదలయ్యేది, స్కూల్ కి వెళ్ళేటప్పుడు వివిధభారతివారి సినిమా పాటలతో ఆగి, సాయంత్రం హింది పాటలతో మళ్ళి మొదలు.

  ReplyDelete
 2. బాగా గుర్తు చేసారండీ, ఆపాతమధురమయన ఆనాటి ఆకాశవాణి కార్యక్రమాల గూర్చి.

  ReplyDelete
 3. నాకు చిన్నప్పటి నుండీ రేడియో నేస్తం. వివిధభారతి, శని,ఆదివారాల్లో బాలానందం, బాలవినోదం. నాకు బాగా గుర్తున్నా అనౌన్సరులు అంటే సీత,ఇందిర,మట్టపల్లిరావు, జ్యోత్స, ఇలియాస్ గారు.
  రోజూ రేడియో పెట్టుకుని ఒక్కదాన్నీ కూర్చుని రాత్రి పదకొండు వరకు చదువుకోవటం అలవాటుగా ఉండేది.

  ReplyDelete
 4. వంశీ గారూ, అనుకోకుండా ఇద్దరం ఒకేరోజున రాసినా మీ వ్యాసం మరింత సంపూర్ణంగా ఉంది. నేను రాసిన ఉద్దేశం వేరనుకోండి. మర్చిపోయిన చాలా పేర్లు గుర్తు వచ్చాయి.
  నాకు చిన్నప్పుడు ఎప్పుడూ అనిపించేది, ఆకాశవాణిలో ఇంత నాణ్యమైన ప్రసారాలు వస్తాయి కదా, దూరదర్శన్ వాడు ఎందుకిలా ఉంటాడు అని. బహుశః ఆ ఆ సంస్థల్లో పని చేసే వ్యక్తుల సమర్ధతని బట్టే అయ్యుండచ్చు.

  ReplyDelete
 5. వంశీగారూ, చాలా పేర్లు గుర్తు చేశారు. ధన్యవాదాలు. గద్దే దుర్గారావు అనుకుంటానండి. బాబూరావు కాదేమో. ఆదివారం కార్మికుల కార్యక్రమంలో వచ్చే చిన్నక్క, ఏకాంబరం, ... వీళ్ల సంభాషణ భలే సరదాగా వుండేది. చిన్నక్కగా రతన్ ప్రసాద్‌గారి చాతుర్యం అనన్యం. ఆ ఉద్యోగాన్ని అంత ఇష్టంగా చేసేవారామె.

  ReplyDelete
 6. ఆకాశవాణి గురించి ఏదైనా రాయాలని చాలా తపన
  ఉన్నది . ఇంకా మొదలు పెట్టనేలేదు . (పరిమిత
  వనరులు ...) .

  ఆసక్తి ఉన్నవారు "ప్రసార ప్రముఖులు" అనే
  పుస్తకముని చూడవచ్చును .

  http://www.archive.org/details/prasarapramukulu022372mbp

  http://www.archive.org/details/PrasaraPramukulu

  ReplyDelete
 7. మంచి లంకె నిచ్చారు ఎం.వి.ఎస్ గారు...ధన్యవాదాలు...ఇందులో చాలా సంగతులు ఉన్నట్టు ఉన్నాయి...ఇంకా ఎక్కువ పేర్లు, ప్రోగ్రాములు జ్ఞాపకం వచ్చాయి..

  రానారె - అవును చిన్నక్క గారిని స్మరించడం మర్చిపోయినట్టు ఉన్నాను....గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  శ్రీరాం - దూరదర్శన్ వాడి గురించి మీ డవుటు సహేతుకమే

  ReplyDelete
 8. మంచి సమాచారం ఇచ్చారు, జ్ఞాపకాలను గుర్తు చేసారు, అందుకు మీకు ధన్యవాదాలు

  ReplyDelete
 9. ఎఫ్.ఎం రేడియో వారి చాలా మటుకు ఛానెళ్ళు అలానే ఉన్నాయి మరి. ఈ కాలంలో అలానే ఉండాలేమో ?

  ReplyDelete