Wednesday, October 31, 2007

తిట్టుకోండి, అరుచుకోండి, బట్టలు చింపేసుకోండి, కానీ...

మనువు మీద కోపమెందుకో? ఈ మధ్య మనువు (పెళ్ళి కాదండోయ్)మీద మనసు మళ్ళి మంత్రాంగంతో మేధ మధిస్తే ముచ్చటయిన ముత్యాలు మురిపెంగా మకిలి లేకుండా తవ్వుకొచ్చినాయి. ఆ ముత్యాలు ఏంటి అంటారా? ఈ స్త్రీవాదులు, స్త్రీవాదాన్ని సమర్ధించేవారు , మనువు మీద అక్కసు ఉన్నవాళ్ళు, ఆ అక్కసుని దాచుకోలేక వెళ్ళగక్కేవాళ్ళు కాసింత ఆ మనువు ఏర్పరచిన ప్రామాణికా ముత్యాలను చూసి ఆలోచించి, ఆ పై ఆనందించండి. ఇంకా ఏడుస్తారా ? మీ ఖర్మ..మిమ్మల్ని ఎవడూ బాగు చెయ్యలేడు, భూషయ్య, లాడెన్, మోడీల్లాగా చరిత్రలో మిగిలిపోండి. ఇలా ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా?

అసలు ఇది అంతా ఎందుకు రాయవలసి వచ్చింది అంటే ఇవ్వాళ్ళ ఒక చిత్రమయిన డాక్టరేట్ మహాతల్లి ఇక్కడి తెలుగువారి కబురూ కాకరకాయ సమావేశానికి( నా భాషలో సాహితీ గోష్టికి) మా తలకు మాసిన సంఘానికి సుధారాణి అని ఒకావిడ ఉంది లెండి..ఆవిడ ఆహ్వానం మీద వచ్చి మనువు మీద పేద్ద లెక్చర్ ఇచ్చింది.

మనువు అనే వాడు పుట్టడమే తప్పు అన్నంత ఇదిగా వాదించింది. ఆవిడకి కొత్త డాక్టరేట్ పరిశోధనాంశం మనువు అట. అక్కడ ఆవిడకి సమాధానం చెప్పడానికి వెధవ గోల - ముఖ్య అతిథి అయిపోయిందాయె. సరే లేచివచ్చేద్దాము అని అనుకున్నా కానీ అసలు ఆవిడ బాధ ఏంటో చూద్దాము అనిపించి చివరిదాకా ఉన్నాను...ఒక ఇరవై నిముషాలు ఏకింది, ఏకింది, ఏకింది...చివరికి ఒక రెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగి అందరి వంక చూసి నవ్వింది...అదిగో ఆ నవ్వే నాకు ఎక్కడో కాలింది..పైగా ఈ సారి సమావేశానికి ఆవిడ వస్తోంది అనేటప్పటికి ఆడ జనాభా 22 మంది వచ్చి - ఈలలు గట్రా వేసుకుంటు ( ఈలలు అనేది మటుకు నేను కల్పించి రాసింది - ఈలలు అంటే యమా హుషారుగా అని అర్థం చేసుకోవాలి) ఉండేటప్పటికి మిగిలిన 4 మగ పుంగవులు గమ్మున అయిపోయాము అన్నమాట. సరే అక్కడ తక్కువయినా ఈ బ్లాగాయుధం ప్రయోగించి ఈనాడు మనువుకి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెపుదాము అని ఇది రాస్తున్నా అన్న మాట.ఈ బ్లాగు ఆవిడ కూడా చదువుతుంది లెండి. అందుకే ఇక్కడ రాసా... :)

నేను చదివిన పుస్తకాల్లో మనువు చెడ్డవాడు అని నాకు అనిపించలేదు. ఆ పుస్తకాల్లో మనువును గూర్చి వివరించిన దాన్ని బట్టి నాకు తోచింది ఇది. యే పుస్తకం? ఎక్కడ ఉంది? అది నేను కూడా చదివి అందులో తప్పులు పట్టుకంటాను, అంటే మటుకు చెప్పేది లెదు.

1. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాః తు న పూజ్యంతే సర్వాః తత్రాః ఫలాః క్రియాః
అంటే దీని అర్థం - స్త్రీలను ఆదరించి గౌరవించి నడిచే కుటుంబంలో దేవతల వంటి సంతానం, దివ్యమయిన సంతోషాలు లభిస్తాయి అని, అది జరగని చోట అన్నీ నిష్ఫలాలే అని భావం

2. పుత్రేణ దుహితా సమా
పుత్రిక కూడా పుత్రికతో సమానం. పుత్రిక ఆత్మతో సమానం. అందుకని ఆమె పితృసంపదకు అధికారిణి

3. పుత్రికకి తండ్రి ఆస్తిలో సమానాధికారం నిర్ణయించిన మనీషి మనువు

4. స్త్రీలను అబలలుగా భావించి, ఆమె బంధువులు ఆ స్త్రీల ధనం స్వాధీనం చేసుకుంటే దొంగలుగా నిర్ధారించి కఠిన శిక్ష వెయ్యాలి అని మనువు చెప్పాడు.

5. స్త్రీల మీద జరిగే అత్యాచారాలకు, అరాచకాలకు అత్యంత కఠిన శిక్షలు ఏర్పరచింది కూడా మనువే

6. వివాహం చేసుకోవటం లో స్త్రీ కి సంపూర్ణ స్వతంత్ర అధికారం కల్పించించి మనువే.

ఇలా ఎన్నో ఉన్నాయి...ఇవి చదివిన తరువాత అయినా మనువు మీద కోపం తగ్గించుకోండి...ఆయన పాపం అన్నీ ఖచ్చితంగానే చెప్పాడు.


దాన్ని వేరే విధంగా అమలు చేసిన దుర్మార్గపు మనుషులను తిట్టుకోండి, అరుచుకోండి, బట్టలు చింపేసుకోండి, కానీ మనువు ని ద్వేషించొద్దు.

Tuesday, October 30, 2007

ఒక వ్యంగ్యాస్త్రం - చదువు రానివేళ 'చంకరుండ'న్నాడు

కరుణశ్రీ గారు రాసిన ఒక వ్యంగ్యాస్త్రం

చదువు రానివేళ 'చంకరుండ'న్నాడు
చదువు కొనెడివేళ 'సంకరు'డనె
చదువు ముదిరిపోయి షంకరుండనెనయా
స్నిగ్ధ మధురహాస ! శ్రీనివాస!

Monday, October 29, 2007

డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ - సితార్ తళుకు తునక ఇక్కడ విని ఆనందించండి

డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు మంచి సంగీతాభినివేశం కల వ్యక్తి. ఆయన స్వరపరచిన "యమన్" రాగం లోని ఒక సితార్ తళుకు తునక ఇక్కడ విని ఆనందించండి.

http://maganti.org/audiofiles/krp/krpmusic.html


ఆ కళాతపస్వికి సహస్ర వందనాలతో

ఇంగ్లీషు ముష్టి బాగా కిడుతుంది అని కావును...

మా నాన్నగారి వద్ద శిధిలావస్థలో ఉన్న భమిడిపాటి కామేశ్వర రావుగారి "మన తెలుగు" పుస్తకం చదువుతూ ఉంటే ఒక అద్బుతమయిన ప్రసంగం కనపడింది. అనుమతి లేకుండా ఆయన రాసిన దానిని ఇక్కడ ఉపయోగించుకుంటున్నందుకు క్షమించమని విన్నపము.

ఆయన అంటారు... తెలుగు వాళ్ళల్లో విద్యాధికులయిన గొప్పవాళ్ళతొ ప్రసంగిస్తే ఈ కింద ఇచ్చిన నమూనా సమాధానలు వినపడతాయి అని

ఇంగ్లీషు ముష్టి బాగా కిడుతుంది అని కావును కొందరు ఈ మధ్య ఇంగ్లీషులో ఎత్తుతున్నారు. అక్కణ్ణించీ, తెలుగులో క్రియ లేకపోబట్టి, క్రియలన్నీ , ఇంగ్లీషులోనే జరిపె తెలుగు వాళ్ళు లేస్తోన్నారు. మాట్లాడ్డం, నడవడం, కోప్పడ్డం, తినడం, ఏడవడం వగైరా అన్నీ.

సరే ఇక ప్రశ్న, జవాబుల్లోకి వస్తే
ప్రశ్న - పెళ్ళానికి ఇంగ్లీషు రాదు
సమాధానం - వదిలెయ్

ప్రశ్న - తలిదండ్రులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - పాతెయ్

ప్రశ్న - బంట్రోతులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - తీసెయ్

ప్రశ్న - సంస్కృతం మాట ఏమిటి ?
సమాధానం - బతికున్న వాళ్ళకెందుకు! ఒక వేళ చచ్చి స్వర్గానికెడితె దేవుడితో సంభాషించవచ్చు

ప్రశ్న - ఇంగ్లీషు ?
సమాధానం - అల్లా అన్నారు - ఆల్రైటు! బానిసలమయిన మనమే కాదు, కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడ ఇది నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషుని ప్రపంచ భాష చెయ్యడానికి ఇంగ్లాండు వాళ్ళు వీరకంకణం కట్టి బోలెడన్నిపదాలు ఇంగ్లీషుని జల్లించి తీసి, వాట్లతోనే వెనకటి ఇంగ్లీషు గ్రంథాలన్నీ పిరాయించి రాస్తున్నారు. ఎంత నయం!

ప్రశ్న - హిందీ?
సమాధానం - అచ్చా! అందులో హుషా, మజా ఉన్నాయి. అయితేనేం? లిపి నాకు రాదు

ప్రశ్న - పోనీ తెలుగు ?
సమాధానం - చీ! తెలుగేమిటీ చప్పగా! నా బోటిగాడి కేమిటుంటుంది అందులో! స్టేల్!

ప్రశ్న - తెలుగు పుస్తకాలు?
సమాధానం - తర్జుమా, తత్సంబంధం, తస్కరణం. నా మనస్సుకి విందుగా గానీ, ఆహారంగా గానీ,పథ్యంగా గానీ, ఆఖరికి చిరుతిండిగా గానీ ఉండేదేనా ? లేదు

ప్రశ్న - తెలుగులో పాతరచన?
సమాధానం - మురుగు! విజ్ఞాన శూన్యం. పైగా అదంతా అదివరకే సంస్కృతంలో అంతకంటే రమ్యంగా ఉండేసిన బాపతుట

ప్రశ్న - తెలుగులో కొత్త రచన ?
సమాధానం - అగమ్యం, సంకరం, అసభ్యం, నీరసం

ప్రశ్న - చదివి చూశావా?
సమాధానం - కిట్టదు. అందుకనే చదవను. చదవకుండా చెప్పడం మాత్రం కళ కాదా?

ప్రశ్న - తెలుగులో పాత చిత్రకళ?
సమాధానం - అంతా ఇంగ్లీషు. అందులో పురాణ స్త్రీలు కూడా దొరసానుల్లానే ఉంటారు.

ప్రశ్న - మరి కొత్త చిత్ర కళ?
సమాధానం - బాబూ ఇది బెంగాలీ ఫక్కీ - అన్నీ భావ బొమ్మలు

ప్రశ్న - తెలుగులో క్పాత పాటలు?
సమాధానం - ఇప్పటి మూర్ఖులు, వెనకటి స్త్రీలు వినడానికోసం

ప్రశ్న - కొత్త పాటలు?
సమాధానం - గంధర్వ, వ్యాస్ - ఇమిటాషన్, ఒక్క త్యాగయ్య వీనా - అతడేనా అరవ దేశంలో ఉన్నాడు కనక. అతడికేనా తెలుగు బాగా రాదు.

ప్రశ్న - తెలుగు ఫిల్ములు?
సమాధానం - మంచిది ఒక్కటీ లేదు. నిశ్శబ్దంగా ఉండే సినీమాలోకి వెళ్ళిన తెలుగు నటుడు లేడు. ఇప్పుడు సశబ్దంగా ఉండే టాకీలో ముందు బుక్కై తరువాత తుక్కుగాని తెలుగు జనుడు లెడు.

ప్రశ్న - తెలుగు పత్రికలు?
సమాధానం - కొన్ని ఇంగ్లీషు వాటికి పుత్రికలు. కొన్ని అమ్రేడితాలు. కొన్ని ప్రచారమాత్రాలు

ప్రశ్న - తెలుగు యంత్ర పరిశ్రమలు?
సమాధానం - పేపరు మిల్లు, బట్టల మిల్లు వగైరా కొన్నింటిలో తెలుగే లేదు, తక్కిన వాటిలో పరిశ్రమే లేదు

ప్రశ్న - తెలుగు వాళ్ళ విదేశ వర్తకం?
సమాధానం - అది సాగుతుండేది అన్యభాషా పరిచయం వల్లే. తెలుగు వల్ల కాదు.

ప్రశ్న - తెలుగు పరపతి సంఘాలు?
సమాధానం - కొన్ని నరపతి సంఘాలు, కొన్ని తిరపతి సంఘాలు

ప్రశ్న - తెలుగు ప్రజల ధనాలయాలు?
సమాధానం - కొన్ని సుప్రజాలయాలు, కొన్ని స్వప్రజాలయాలు, కొన్ని లయాలు

ప్రస్ణ - తెలుగులో భీమాలు?
సమాధానం - కొన్ని హేమాలు, కొన్ని కామాలు

ప్రశ్న - తెలుగు నాయకులు?
సమాధానం - కొందరే, చాలా మంది వినాయకులు

ప్రశ్న - తెలుగు విశ్వవిద్యాలయం?
సమాధానం - అదంతా తెలుగుది కాదు

ప్రశ్న - అయితే?
సమాధానం - అప్పుడూ మజా! అదీ మెడ్రాస్ ఇమిటేషన్! పరీక్షల కార్ఖానా!

ప్రశ్న - కొత్త శాఖలున్నాయే!
సమాధానం - ఇంకా ఉండాలి - తెలుగవాలి

ప్రశ్న - డబ్బుండాలి కదా. అంతా తెలుగయితే అన్య దేశాల్లో మన పట్టాలు సాగవేమో?
సమాధానం - అన్య దేశాలు వెళ్ళనేవద్దు

ప్రశ్న - పోనీ తెలుగు రాష్ట్రం?
సమాధానం - అట్టెట్టె! ఆగాలి! సౌరాష్ట్రం


ఏతావాతా , తెలుగులో విద్య నేర్చినవాడికి తక్కిన తెలుగువాడికి మానసికంగా చాలా దూరం అయిపోయింది. కేవలం తెలుగువాడికి ఉండే భావాలు, అభిప్రాయాలు అసలయిన భావాలు, అభిప్రాయాలు కావని విద్యాధికుడయిన తెలుగు వాడు అనుకునే కర్మం తెలుగుదేశానికి పట్టింది అని భమిడిపాటి వారి విశ్లేషణ. 1948 లో వ్రాసిన ఈ పుస్తకం ప్రతి ఎక్కడయినా పూర్తిగా దొరికితే బాగుండు.

Sunday, October 28, 2007

కటింగుల్లో బయటపడ్డ ప్రముఖులు

మరి కొన్ని పాత పేపర్ కటింగుల్లో బయటపడ్డ మన ప్రముఖులు


స్థానం నర్సింహారావు


గిడుగు


చిలకమర్తి

Saturday, October 27, 2007

ఆకాశవాణి వార్తలు - 2

ఆకాశవాణి వార్తలు - 2

మరి కొద్ది మంది గుర్తుకు వచ్చారు

ప్రాంతీయ వార్తలు చదివేవాళ్ళు

తాటిబండ్ల రజని
మల్లెల జయలక్ష్మి
ఉప్పర్లపాటి జయప్రకాష్


నాటకాల్లో వేసేవాళ్ళు

సి.రామ్మోహన రావు
వి.బి.కనకదుర్గ
సీతారత్నం
మద్దాలి సుశీల
నండూరి రామ్మోహన రావు
చిట్టా శంకర్
విన్నకోట రామన్న పంతులు
చాట్ల శ్రీరాములు
సుబ్బరాయ శర్మ
కోట శంకర్ రావు
పద్మజా నిర్మల
వేదగిరి రాంబాబు
జీడిగుంట రామచంద్రమూర్తి
ఆదివిష్ణు
కోకా రాఘవరావు
శకుంతల


సంగీత విద్వాంసులు

సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్
వీణా శ్రీనివాస్ - వీణ
డాక్టర్ పద్మ - వీణ, నాదస్వరం
శ్రీమతి బుర్రా సరోజినీ మూర్తి - వయోలిన్
శ్యామసుందర్ అయ్యగారి - వీణ

Friday, October 26, 2007

శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథము తెలుగులో

శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథము తెలుగులో ..మంచి లంకె

http://www.shirdisaiashirvadam.org/babaframe.htm

ఇంకా ఆరతులు / హారతులు అవీ కూడా ఉన్నాయి..

Tuesday, October 23, 2007

మన వాళ్ళ తెలివితక్కువ తనమా, లేక ఇలాంటివి రాయటానికి తెగువ, ధైర్యం చాలకా?

నిన్న బార్న్స్ అండ్ నోబుల్ కి వెళ్ళినప్పుడు ఒక మంచి పుస్తకం దొరికింది. ఎప్పటిదో "టాడ్స్ రాజస్థాన్" అని ఆ పుస్తకం పేరు. అందులో మంచి మంచి విషయాలు - మరుగున పడిపోయినవి, మనం "తేజోమహాలయ" గురించి పెద్దగా ఆసక్తి చూపనట్టే, ఇందులో విశేషాల గురించి కూడా మర్చిపోయి ఉంటాము. ఒక విదేశీయుడు మన చరిత్ర గురించి, భారతీయుల దేశ, సముద్రాభియానం గురించి సమగ్రంగా వివరించటమనేది, మన వాళ్ళ తెలివితక్కువ తనమా, లేక ఇలాంటివి రాయటానికి తెగువ, ధైర్యం చాలకా? అని అనిపిస్తుంది

సరే...ఇక ఆ పుస్తకం లోని సంగతుల్లోకి వస్తే..అందులో చెప్పబడిన విశేషాలు

1) సగర చక్రవర్తి ఈ సముద్రాభియానానికి (invasion of the ocean) కి ఆద్యుడని చెప్పబడింది. ఆయన ఈస్ట్ ఇండియన్ ఆర్చిపేలగో (హిందూ ద్వీప సముదాయం) తొ పాటు ఎన్నో దేశాలు జయించాడు. అందులో శ్యామా దేశం ఒకటి. ఈ శ్యామా దేశమే ప్రస్తుత సియాం. ఈ దేశమే 1949 లో థాయిలాండ్ గా మారింది
2) ఈ సగర చక్రవర్తే - సముద్ర దేవుడుగా పూజలు అందుకుంటున్నాడు
3) ఈ సియాం దేశానికి ముఖ్య పట్టణం "అయూధియా" - మన అయోధ్యా నగర నామం తరువాతి కాలం భ్రష్టు పట్టి అయూధియా అయ్యింది. శిధిలమయిపోయిన ఈ నగరం లోని శిల్ప కళాచాతుర్యం అనన్య సామాన్యం అని తెలుస్తోంది.
4) ఈ శిల్పకళా చాతుర్యం గురించి అనేక డచ్, పోర్చుగీస్ చారిత్రిక పుస్తకాల్లో ఉంది అట.
5) కాంబోడియా దేశం - మన కాంభోజ రాజ్య నామాన్ని సూచిస్తోంది
6) ఈ దేశానికి "ఇందుపథపురి" అనేది రాజధాని - ఇది మన ఇంద్రప్రస్థం నామ సంకేతం. అంటే ఇక్కడి భారతీయులు భారతదేశాన్ని మర్చిపోలేదు అని చెప్పటం అన్న మాట.
7) ఈ ఇందుపథపురి లో కాశ్మీర దేశ శిల్పకళా చాతుర్యం కనిపిస్తుంది
8) సియాం దేశం లోని ముఖ్య భాష "పాశామకత". ఈ మాట "భాషా మగధ" అనే పదానికి అపభ్రంశ రూపం.అంటే ఇక్కడి వారిలో మగధ రాజ్య పౌరులు ఎక్కువగా ఉండేవారు
9) బాలి ద్వీపం లో మగధ పౌరులు ఎక్కువగా ఉండేవారు అని - మగధ భాష "పాలి" అవ్వటం మూలాన ఆ ద్వీపానికి "బాలి" ద్వీపం అనే పేరు వచ్చింది
10) డ్యాకా ద్వీపం - మన దక్ష ప్రజాపతి పేరిట పెట్టబడింది
11) మెక్సికో దేశ నామం - "మాక్షి" లేక "మాక్షిక" (స్వర్ణమయమయిన) అనే పదానికి రూపాంతరం
12) ఆజ్టెక్ వీరుల గురించి మీరు వినే ఉంటారు..ఆ ఆజ్టెక్ అనే పదం "అష్ట" లేక "అష్టకా" అనే పదనికి అపభ్రంశ రూపం
13) ఇంకో విశేషం ఏమిటి అంటే నిజంగానే ఇక్కడి మెక్సికో దేశవాసుల్ని కదిలిస్తే వారు చెప్పేది - తాము సూర్యుని బిడ్డలమని - ఇది మన సూర్య వంశీయుల పదానికి సరిపోతుందేమో
14) ఈజిప్టు దేశ పూర్వ నామం - మిసర - ఇది మన "మిశ్ర" నామానికి సంకేతం. నానా రకాల జాతి జనులు ఉండటం వల్ల "మిశ్ర" పద నామం పెట్టబడింది
15) మారిషస్ ద్వీపం - మారీచ మహాముని వంశీయులు నివసించిన భూమి
16) మడగాస్కార్ - చంద్ర వంశీయులు నివసించిన ప్రదేశం
17) ఈజిప్టు లోని "షూంట్" / "షోంటా" అనే ప్రదేశం - మన పుస్తకాల్లోని శోణిత పురం అని తెలుస్తోంది
18) అలాగే ఈజిప్టు కొత్త నామధేయం - సంస్కృత గ్రంథాల్లో "ఐగుప్త" శబ్దానికి తద్భవంగా చెప్పబడింది
19) ప్రద్యుమ్నుడు ప్రభావతి ని పరిణయమాడిన వజ్రపురం ప్రస్తుత సైబీరియా ప్రదేశం


ఐప్పటివరకు ఒక 40 పేజీలు మాత్రమే చదవగలిగాను- అందులోనే ఇన్ని విశేషాలు ఉన్నాయి...

మొత్తం పుస్తకం చదివితే ఇంకా ఎన్ని బయటపడతాయో ?

Monday, October 22, 2007

డాక్టర్ సరస్వతి భట్టార్ - ఒక తెలుగు తేజం.

డాక్టర్ సరస్వతి భట్టార్ - ఒక తెలుగు తేజం. ఇక్కడ చూడండి

స్వీయ పరిచయం లంకె మీద నొక్కండి

http://maganti.org/lalitasangitamindex.html


వంశీ

Sunday, October 21, 2007

ద్వారం వెంకటస్వామి నాయుడు గారి శిష్యురాలు....

శ్రీమతి బి.సరోజినీ మూర్తిగారు పాడిన కొన్ని సంప్రదాయ మంగళ హారతులు, వయోలిన్ మీద వాయించిన కొన్ని సంగీతికా ముత్యాలు ఇక్కడ చూడవచ్చు.

http://maganti.org/page8.html

శ్రీమతి సరోజినీమూర్తి గారు గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ గా దాదాపు ఇరవై ఏళ్ళు (1965 - 1986) పనిచేసారు. ఎన్నో ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వీరు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి శిష్యురాలు.

Saturday, October 20, 2007

"ఆకాశవాణి" వార్తలు

ఆకాశవాణి వార్తలు

చిన్నప్పటి హైదరాబాదు కేంద్రం ఆకాశవాణి మధుర స్మృతుల గురించి రాద్దాము అని ఎందుకో అనిపించింది. అసలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 1950లో డెక్కన్ రేడియోలో విలీనం అయ్యిందిట. అసలు రేడియో అంటే మర్ఫీ రేడియోనే. దానికి సాటి మరోటి లేదు. మా ఇంట్లో అలాంటి మర్ఫీ రేడియో ఒకటి ఉండేది. దానికి కాలం చెల్లాక నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ రేడియోతో పాటు ఉన్నది, దుబాయి నుంచి మా నాన్నగారి స్నేహితుడి ద్వారా తెప్పించారు.

మా ఇంట్లో ఆ పాత మర్ఫీ రేడియో పొద్దున్న ఆరు ఇంటి నుంచి మంద్ర స్వరంలో మోగుతూనే ఉండేది. మా అమ్మ ప్రసూన తన వంట కార్యక్రమాలు అవీ అయిపోయేదాకా నడుస్తూనే ఉండేది. తరువాత పదింటికో ఎప్పుడో ఆ కార్యక్రమాల ప్రసారం ఆగిపోయి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండింటికి మొదలు అయ్యేవి. నేను సుమారు 1978-80 నుంచి అంటే నాకు కొంచెం బాగా ఊహ వచ్చాక రేడియో ప్రసార కార్యక్రమాలు నా దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయినాయి అంటే అతిశయోక్తి కాదు.

నాకు తెలిసిన కొంత మంది అనౌన్సర్లు భువనేశ్వరి, ఇందిరాదేవి, నిర్మలా వసంత్, ఇలియాస్ అహమద్, ఎం.ఎన్.శాస్త్రి, జ్యోత్స్న, శేషారత్నం, పండా శమంతకమణి, డి.శ్రీరాములు, తురగా ఉషారాణి, పోణంగి బాలభాస్కర్, పార్వతీ ప్రసాద్, గద్దే బాబూరావు, యండ్రపాటి మాధవీలత, జె.చెన్నయ్య.జ్యోత్స్న గారు తరువాత తరువాత టి.వీ లో న్యూస్ రీడర్ గా దర్శనమిచ్చేవారు. వివిధభారతి వాణిజ్య ప్రసారాల్లో ఉమాపతి, ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి, సీత, ఇందిరా బెనర్జీ, మట్టపల్లి రావు, రాజగోపాల్ మొదలయినవారు ఉండేవారు.

దండమూడి మహీధర్ అని ఒకాయన పాఠాలు చెప్పేవారు. ఇక చిత్తరంజన్ గారు , పాలగుమ్మి వారు, మంచాళ జగన్నాథ రావు గారు, వింజమూరి సీతాదేవి గారు, అన్నయ్య, అక్కయ్య (న్యాపతి దంపతులు), బాలాంత్రపు రజనీకాంత రావు, రావూరి భరద్వాజ, శారదా శ్రీనివాసన్, కేశవపంతుల వారు (సంస్కృత పాఠాలు), సరే సరి.

ఇక రానారె చెప్పినట్టు కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క గారిని, ఏకాంబరం గారిని కూడా స్మరించుకోవాలి ఇక్కడ. ఇక బాలానందం, బాలవినోదం సరే సరి.

ఇక నాకు బాగా నచ్చిన న్యూస్ రీడర్, సమ్మోహకమయిన గాత్రం కల అద్దంకి మన్నార్. నాకయితే ఆయన వాక్ప్రవాహం లో పడితే సమయం అసలు తెలిసేది కాదు. అయ్యో అప్పుడే అయిపోయిందా...ఇంకా కొంచెం సేపు ఈయన కార్యక్రమం కొనసాగితే బాగుండు అనిపించేది. ఇంకా బాగా గుర్తు ఉన్న న్యూస్ రీడర్లు కందుకూరి సూర్యనారాయణ, ఏడిద గోపాల రావు, మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి,తిరుమలశెట్టి శ్రీరాములు, బండారు శ్రీనివాస రావు, బలదేవానంద సాగర్ (సంస్కృత వార్తలు), రత్నా సాగర్, , ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావు.

రేడియో మాస్కో, సిలోన్ రేడియో, బినాకా గీత్ మాలా, యువవాణిలోని మెహ్ఫిల్, ఉషశ్రీ గారి కార్యక్రమాలు, వోలేటి వెంకటేశ్వర్లు గారి మ్యూజిక్ ప్రోగ్రాములు నాకు నచ్చిన మరి కొన్ని ప్రసారాలు.

ఇక అమ్మమ్మగారి ఊరు వెళ్ళినప్పుడు అక్కడ విజయవాడ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. అందులో గుర్తు ఉన్న అనౌన్సర్లు , ఇందులో మా తాతయ్య గారి కాలం నాటి అనౌన్సర్లు కూడా ఉన్నారండోయి- నళిని, లింగరాజు శర్మ, వెంపటి రాధాకృష్ణ శర్మ, లత (అవును రచయిత లత గారే), వాసుదేవ మూర్తి, సుబ్రహ్మణ్య భట్ట్, శ్రీరామ్మూర్తి,కుటుంబరావు, సంజీవరావు, ఆంజనేయులు, విజయకుమారి, శారదా జయప్రకాష్, మాడ్గుల రామకృష్ణ ఇలా ఇంకా ఎంతో మంది....

ఈ గాత్ర సమ్మోహనా గంధర్వులకి నమోవాకాలతో ...

అలాగే నేను సేకరించగలిగిన వివరాల ప్రకారం కొంగర జగ్గయ్య, శ్రీ శ్రీ, నండూరి సుబ్బారావు, బందా కనకలింగేశ్వర రావుగారు, బుచ్చిబాబు, పింగళి లక్ష్మీకాంతం, మంగళంపల్లి బాలమురళి, దేవులపల్లి వారు, గొల్లపూడి ఇంకా ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలవారు అంతా మొదట్లో ఆకాశవాణి లో పనిచేసినవారే.

ఇక ఈ తరం అనౌన్సర్లు - మొన్న హైదరాబాదు వెళ్ళినప్పుడు విందామని రేడియో పెట్టుకోగానే, ఒక్క సారి వాంతికొచ్చినంత పని అయ్యింది...అదేదో ఎఫ్.ఎం ఛానెళ్ళ వారు తమ భయంకరమయిన ఉచ్చారణతో - నోరు అంతా మైకులో దూర్చేసి అదేదో కోడి పిల్లో, కుక్కపిల్లో అన్నట్టు - "నేను అల్లరి పిల్ల గౌతమో , భూతమో అని...ఉత్సాహంగా ఉల్లాసంగా" అని ఏదేదో విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఖర్మ అండి ఖర్మ....ఏం చేస్తాం?

సరే కానీ మీకు ఎవరికి అయినా అద్దంకి మన్నార్ గారి జీవిత విశేషాలు ఎక్కడయిన దొరుకుతాయేమో తెలిస్తే చెప్పండి.

చాటు పద్యం

ఉత్పలమాల

రాజిత కీర్తి శాలి అగు రాయని భాస్కరు వేడబోయినన్
ఆజికి ఇట్లనున్ , పరుని ఆలికి ఇట్లను, అర్ధి కిట్లనున్;
తేజము పెంపు లేని కడు దీనుని హీనుని వేడబోయినన్
ఆజికి ఇట్లనున్ , పరుని ఆలికి ఇట్లను, అర్ధి కిట్లనున్;


వేములవాడ భీమ కవి: ఒక రోజు ఈయనని చయనులు గారింట్లో అవుతున్న విందు భోజనానికి "విధవ కుమారుడు" అని రానివ్వనందుకు కడుపు మండిపోయి చెప్పిన చాటు పద్యం ఇది

గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి రాకు మంచు ఈ
త్రిప్పుడు బాప లందరును దిట్టిరి కావున నొక్కమారు ఈ
అప్పము లన్ని కప్పలయి, అన్నము సున్నముగాగ మారుచున్
పప్పును శాకముల్ పులుసు పచ్చడులున్ చిరు రాలు కావుతన్


కందం

వికటకవుల వారి చాటువు:
ప్తృవ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి; వల్వ బూదట; చేదే
బువ్వట; హుళుళుక్ హుళుళు క్కవ్వట , తలపంగ నట్టి హరునకు జే జే


కన్యాశుల్కం గిరీశం గారి చాటువు:
ఖగపతి అమృతము తేగా
భుగ భుగ మని పొంగి చుక్క భూమిని రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్వేములవాడ భీమ కవి గారి స్వపరిచయ పద్యం - రాజ కళింగు గంగు గారి దర్శనార్ధం వెళ్ళినప్పుడు
శాపానుగ్రహ పటువును
రాపాడెడి కవుల నెత్తి రంపం బనగా
భూపాల సభల బూజ్యుడు
నా పేరే భీము డండ్రు నరవర వినుమా

Friday, October 19, 2007

అంకెల గారడీ ?? పదివేల తలలు కల ఆదిశేషుడు

అంకెల గారడీ ??

పదివేల తలలు కల ఆదిశేషుడు మిమ్ములను ధన్యుల చేయుగాక అని ఒక చాటుకవి తన ప్రతాపాన్ని ఇలా చూపించాడు అట

పదియునైదు పదునైదు పదునైదు
నిఱువదైదు నూటయిఱువదైదు
నెలమి మూడునూరు లిన్నూరు మున్నూరు
తలలవాడు మిమ్ము ధన్యుజేయు


ఇలాంటివి అన్నీ మాగంటి.ఆర్గ్ లో "మీగడ తరకలు" అనే కొత్త పుట లో ప్రచురిద్దాము అని సంకల్పించడం అయినది. ఇక ఆ మధురమయిన తరకలు త్వరలో మీ ముందుకు

"కాశీనాథుడు" అంటే అర్థము?

"కాశి" పదం ఈ విధంగా వచ్చింది - క + అశి (నీరు తాగి జీవించునది - అనగా చేప)

"కాశీనాథుడు" అంటే - మత్స్య శ్రేష్ఠం అని అర్థము అట.

"టెంకిపాట" - "ఎంకి పాట"

నవ్వుల తోట అనే పత్రికలో 1922 వ సంవత్సరం ప్రచురణలో నండూరి వారి ఎంకి పాటకి ఒక పేరడీ / అనుకరణగా "టెంకిపాట" ఒకటి అచ్చయ్యింది. రచయిత పేరు ఎవరో తెలియదు.ఈ విషయం మా మావయ్య ద్వానా.శాస్త్రి గారు చెప్పారు

రావెరావె నా టెంకిరావె ముద్దులటెంకి
గోరంచు కోకెడ్త, కొప్పులో పూలెడ్త
కోరిన నగలెడ్త, కులికించి ముద్దులెడ్త రావె
నిన్నటి రేయి నేను నిన్నుకలలో జూచి
కన్నీరు గారిస్తి కనకంపుముద్దుల టెంకి రావె
పాలీల పండగనాడు పొట్టనిండ తాగితాగి
పక్కనున్న నిన్నుజూచి సంకల్లన్ని గుద్దుకొంటి రావె


************

Image Updated on Feb 17, 2019

Interesting that it was to be continued.... Thursday, October 18, 2007

వ్రేళ్ళు - వాటి సంగతులు

వ్రేళ్ళు - వాటి సంగతులు


చుట్టాల సురభి బొటన వ్రేలు
కొండీల కొరవి చూపుడు వ్రేలు
పుట్టుసన్యాసి మధ్య వ్రేలు
ఉంగరాల భోగి ఉంగరపు వ్రేలు
పెళ్ళికి పెద్ద చిటికెన వ్రేలు

అల్లల్లా కోడి

అల్లల్లా కోడి
పిల్లల్లా కోడి
గట్టు మీద కోడి
గవ్వల్లా కోడి
కొక్కొరొకోయన్నది
నిద్రలేచి కూర్చోమన్నది

"అతివ వర్ణన"

సన్యాసి కవి గారు 1850 రాసిన "గంగా వివాహం" అనే రచన లోనుంచి ఒక మంచి జానపదం "అతివ వర్ణన" ఇక్కడ చూడండి

http://maganti.org/janapadapatalu/janapadapata/ativavarnana.pdf


ఇతరమయిన జానపదాలకోసం ఇక్కడ...

http://maganti.org/janapadamindex.html

గుఱ్ఱం జాషువా గారి "ఆంధ్ర మాత"

గుఱ్ఱం జాషువా గారి "ఆంధ్ర మాత" రచన , శ్రీ రాయప్రోలు సుబ్బారావు "కన్నె పాటలు" ఇక్కడ చూడండి

http://maganti.org/page5.html

Wednesday, October 17, 2007

వ్యాస రచన - పిల్లల ప్రతిభ

వ్యాస రచన - మీ చిన్నారుల వ్యాసాలకు ఆహ్వానం.

మళ్లీ అందరీకీ గుర్తు చేద్దాము అని .......

అందరు పిల్లలూ ప్రతిభావంతులే. వారిలోని ప్రతిభను సానబెట్టి బయటకు తీసుకుని రావటం పెద్దవారిగా మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని అమలు చేయటం కోసం మొదలు పెట్టిన ఈ చిన్ని ప్రయత్నానికి మీ అందరి సహాయ సహకారాలు ఆశిస్తూ.

మీ పిల్లల చేత వారికి ఇష్టమయిన వాటి గురించి వ్రాయించండి,అక్షర రూపంలో ప్రాణంపోసి తీర్చిదిద్దిన ఆ రూపాన్ని మాగంటి.ఆర్గ్ కి పంపండి. సంతోషంగా ప్రచురిస్తాను.మీ పిల్లలలోని దాగి ఉన్న సృజనాత్మకతని వెలికితీయండి, వారికి ఇష్టమయినవి ఏమిటో తెలుసుకోండి, వారి భవిష్యత్తుని తీర్చి దిద్దండి.

వ్యాసాలు దేని మీద రాయొచ్చు అంటారా పిల్లలూ ? వివరాల కోసం ఇక్కడ చూడండి ....

http://maganti.org/page15.html


మీ వ్యాసాల కోసం ఎదురు చూస్తూ

మీ వంశీ

Tuesday, October 16, 2007

ఆకళ్ళచేత, మీ వాకిళ్ళలోను

ప్రాధేయపు పదము

కటకటా మీకెంత కరుణలేదయ్య
యిటువచ్చి యడుగమా కిది పద్ధతయ్య
ఏదయా మీదయా మామీద లేదు
యింతసేపుంచుట యిదిమీకు తగునా?
ఉత్తమాజనులార చిత్తగించండి
ఆలస్యముంచకం డాకలవుతుంది
ఆకళ్ళచేత, మీ వాకిళ్ళలోను
ఉంచుట మీకిది మంచిపని కాదు
పావులా బేడైతె పట్టేది లేదు
అర్ధరూపాయిస్తే అంటేదిలేదు
ముప్పావులా యిస్తే ముట్టేది లేదు
రూపాయి యిస్తేను ప్రాపకము కాదు
హెచ్చువరహా యిస్తే పుచ్చుకొంటాము
పైపావులా మాకు పప్పుబెల్లాళు
తెప్పించి కట్నంబు లిప్పించరయ్య
శీఘ్రమే పంపుడీ శ్రీమంతులార

Monday, October 15, 2007

పకోడీ గురించి తిరుపతి వేంకటేశ్వర కవుల వారు

పకోడీ గురించి తిరుపతి వేంకటేశ్వర కవుల వారు, తాము జరిపిన ఒక శతావధానము లోని "చంపకమాల" పద్యం

కరకరలాడు కొంచెమగుకారము గల్గు బలాండువాసనా
హర మగుగొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట
ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా
దరమునబల్కుచుందు రదితాదృశమే యగునంచుదోచెడిన్

Sunday, October 14, 2007

విశ్వకవి రవీంద్రుల వారు - రాజమహేంద్రవరం

హైదరాబాదులో ఉండగా మా నాన్న గారి పాత ఫోటో ఆల్బం లో దొరికిన ఒక ఆణిముత్యం - ఎవరో ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?


- విశ్వకవి రవీంద్రుల వారు - 1930 లో రాజమహేంద్రవరానికి కవితాగోష్టికి వచ్చినప్పుడు తీసిన ఛాయాచిత్రం ఇది. మిగిలిన వారు ఎవరో , నాకు తెలియదు..అ విషయం కనుక్కునే బాధ్యత మా నాన్నగారి భుజస్కంధాల మీద వదిలి వచ్చా..

Saturday, October 13, 2007

బహు పరాక్....వేచి చూడండి

మావయ్య ద్వానా.శాస్త్రి గారి మిత్రులు ఆచార్య డాక్టర్.వెలుదండ నిత్యానందరావు గారు అడిగిన వెంటనే కాదనకుండా తన పుస్తకం "తెలుగు సాహిత్యం లో పేరడీ" ఇచ్చి మాగంటి.ఆర్గ్ చదువరులతో పంచుకోమని అనుమతి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలతో....ఆ మణి"పుస్తక"పూస పూర్తి ప్రచురణ త్వరలో మీ ముందుకు. ఆ ఆణిముత్యం లో నుంచి మచ్చుకి కొన్ని ఇప్పుడు చూడండి

జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు శ్రీ శ్రీ "ప్రతిజ్ఞ" గేయానికి "ప్రతిష్ఠ" అనే పేరడీ రచించారు.

అవాకులన్నీ
చవాకులన్నీ
మహారచనలై మహిలో నిండగ
ఎగబడి చదివే పాఠకులుండగ
విరామ మెరుగక పరిశ్రమిస్తు
అహోరాత్రులు అవే రచిస్తూ
ప్రసిద్ధికెక్కే కవిపుంగవులకు
వారికి జరిపే సమ్మానాలకు
బిరుదుల మాలకు
దుశ్శాలువలకు
కరతాళాలకు ఖరీదు లేదోయ్


అలాగే

నేను సైతం
తెల్లజుట్టుకు
నల్లరంగును కొనుక్కొచ్చాను
నేను సైతం
నల్లరంగును
తెల్లజుట్టుకి రాసిదువ్వాను
యింత చేసీ
యింత క్రితమే
తిరుపతయ్యకు జుట్టునిచ్చాను


శ్రీ శ్రీ "జయభేరి"ని జొన్నవిత్తుల "గుండుభేరి" గా మార్చేసారు

అరే ప్రకాశం
ఒరే గణేశం
ఆకలి లోకం పిలిచింది
పదండి ముందుకు
పదండి తిండికి
పోదాం పోదాం హోటల్ కి

ఇలా ఎన్నో ఉన్నాయి.....మాగంటి.ఆర్గ్ చదువరులూ - బహు పరాక్ గా వేచి చూడండి

Friday, October 12, 2007

షోడశ మహారాజులు

షోడశ మహారాజులు

రామ
శిబి
రంతి
గయ
నృగు
పృథు
మాంధాతృ
యయాతి
మరుత్
దిలీప
సుహోత
భరత
అంబరీష
శశిబిందు
భగీరథ
పరశురామ

నవ కల్పములు

నవ కల్పములు

పార్థివ
అనంత
కూర్మ
బ్రహ్మ
వరాహ
స్వేత వరాహ
ప్రళయ
పద్మ
సావిత్రి

Wednesday, October 3, 2007

ఉడుకుమోత్తనం, అవస్థ

మా చిన్నమ్మ (పిన్ని) కూతురిని ఉడికించటానికి నిన్న, నన్ను ఎప్పుడో చిన్నప్పుడు మా మేనమామలు ఉడికించి ఏడ్పించిన ఒక కథ గుర్తుచేసుకుని దాని మీద ప్రయోగించా

ఇక చూడాలి దాని ఉడుకుమోత్తనం, అవస్థ


నేను: "అమ్మడూ నీకు ఒక కథ చెప్పనా?"
ఉదయ : " చెప్పన్నయ్యా"
నేను: "సరే చాలా జాగ్రత్తగా విను. ఎక్కడయినా మిస్ అయ్యావో, మరి ఇక నేను చెప్పను"
ఉదయ: "సరే మిస్ అవ్వను అన్నయ్యా . చెప్పు "
నేను: " ఒక ఊర్లో ఒక ముసలి అవ్వ ఉండేది. పాపం ఆ అవ్వకి కళ్ళు సరిగ్గా కనపడేవి కాదు. ఏం ?"
ఉదయ : "ఊం"
నేను : "ఆవిడ చీర ఒకటి చినిగిపోతే , కుట్టుకుందాము అని ఎలాగో కష్టపడి ఒక సూది తీసుకుని, దాని బెజ్జం లోకి ఎక్కించి, ఇక చీర కుట్టడనికి పూనుకుంది.
ఉదయ: "ఊం"
నేను: అప్పుడు ఆ సూది కాస్తా దారం నుంచి జారి ఎక్కడో పడిపోయింది"
ఉదయ: "ఊం"
నేను:
ఉదయ: "ఊం"
నేను:
ఉదయ: "ఊం అన్నయ్యా "
నేను: "ఊం అన్నయ్యా అంటే పోయిన సూది వస్తుందా?"
ఉదయ:"ఏంటి అన్నయ్యా?"
నేను: "ఏంటి అన్నయ్యా? అంటే సూది వస్తుందా?"
ఉదయ: " హబ్బా - ఇదేంటి అన్నయ్యా?"
నేను: "హబ్బా - ఇదేంటి అన్నయ్యా అంటే సూది వస్తుందా?"
ఉదయ: "ఫో అన్నయ్యా, ఇదెక్కడో సుత్తి కథలాగా ఉంది"
నేను: "ఫో అన్నయ్యా, ఇదెక్కడో సుత్తి కథలాగా ఉంది అంటే సూది వస్తుందా"
ఉదయ: "ఇదిగో , ఇంక నాకు కోపం వస్తున్నది"
నేను: "ఇదిగో , ఇంక నాకు కోపం వస్తున్నది అంటే సూది వస్తుందా"

ఇలా ఒక ఐదు నిముషా అయ్యేటప్పటికి అది నా దగ్గర నుంచి ఒకటే పరుగు....

చివరకి తేలిందేమిటయ్యా అంటే చెప్పేవాడికి చిలిపితనం ఉంటే, వినేవాడికి ఉడుకుమోత్తనం కలిగించగలడన్న పెద్దల మాట చద్దిమూటలాగా రుజువయ్యింది అన్న మాట

Tuesday, October 2, 2007

జరుక్ శాస్త్రిగారి - కాఫీ పానం కరిష్యామి

జరుక్ శాస్త్రిగారి పేరడీలలో ఒకటి మచ్చుకి

"సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ" అనే శ్లోకానికి ఆయన చేసిన వినోదానుకరణ
చోటాహజ్రీ నమస్తుభ్యం
వరదే కామరూపిణి
కాఫీ పానం కరిష్యామి
సిద్ధిర్భవతు మే సదా...

ఇలా అసంఖ్యాకమయిన పేరడీలు రాసిన ఆయనకు నమస్సుమాంజలి