Thursday, September 27, 2007

కాకరపువ్వులు పూచేటి వేళ....

మోచేటి పెద్దమ్మ నోము పాట

ఈ జానపద పాట నాకు అందచేసిన శ్రీమతి చల్లా లీలావతిగారికి ధన్యవాదాలతో

మోచేటి పెద్దమ్మ నోచేటి వేళ
మొగ్గలు తామరలు పూసేటి వేళ
బీరాయి పువ్వులు పూసేటి వేళ
బిందెలతో ఉదకమ్ము తెచ్చేటి వేళ

గుమ్మడి పువ్వులు పూచేటి వేళ
గుండిగలతో ఉదకము తెచ్చేటి వేళ
కాకరపువ్వులు పూచేటి వేళ
కడవలతో ఉదకమ్ము తెచ్చేటి వేళ
ఆనబాయి పువ్వులు పూచేటి వేళ
అటికలతో ఉదకమ్ము తెచ్చేటి వేళ
చిక్కుడు పువ్వులు పూచేటి వేళ
చిప్పలతో గంధాలు తీసేటి వేళ
ఆవులు దూడలు వచ్చేటి వేళ
ఆంబోతు రంకెలు వేసేటి వేళ
సందిటి దీపాలు పెట్టేటి వేళ
చాకింటి మడతల్లు తెచ్చేటి వేళ
అన్నల్లు అందలా లెక్కేటి వేళ
తమ్ముళ్ళు తాంబూలాలు వేసేటి వేళ
మరుదుల్లు మరిజూదమాడేటి వేళ
కూతుళ్ళు గుండిగలు దింపేటి వేళ
కోడళ్ళు కాటు కొట్టేటి వేళ
చెల్లెల్లు చేమంతులు ముడిచేటి వేళ
వదినల్లు వంటల్లు చేసేటి వేళ
ముద్దుల్ల మొగము అద్దాన బోలు
తనముఖము తామర పద్మాలుబోలు

No comments:

Post a Comment