Friday, September 28, 2007

పలక నీది నల్లన ...పైన రాత తెల్లన

పలక నీది నల్లన
పైన రాత తెల్లన
అ ఆ ఇ ఈ రాశాను
అమ్మ ముందు పెట్టాను
అమ్మ లడ్డూ బూందీ ఇచ్చింది
ఆనందంగా తిన్నాను

గుటుక్కున మింగూ ...

గోరు గోరు ముద్ద
కాకమ్మ ముద్ద
చందమామ ముద్ద
చక్కనైన ముద్ద
అమ్మమ్మ ముద్ద
అందమయిన ముద్ద
నానమ్మ ముద్ద
నాణ్యమైన ముద్ద
తాతయ్య ముద్ద
తళ తళ ముద్ద
పాపాయి ముద్ద
పానకాల ముద్ద

ఆసి బూసి నోట్లో ముద్ద
గుటుక్కున మింగూ

Thursday, September 27, 2007

కాకరపువ్వులు పూచేటి వేళ....

మోచేటి పెద్దమ్మ నోము పాట

ఈ జానపద పాట నాకు అందచేసిన శ్రీమతి చల్లా లీలావతిగారికి ధన్యవాదాలతో

మోచేటి పెద్దమ్మ నోచేటి వేళ
మొగ్గలు తామరలు పూసేటి వేళ
బీరాయి పువ్వులు పూసేటి వేళ
బిందెలతో ఉదకమ్ము తెచ్చేటి వేళ

గుమ్మడి పువ్వులు పూచేటి వేళ
గుండిగలతో ఉదకము తెచ్చేటి వేళ
కాకరపువ్వులు పూచేటి వేళ
కడవలతో ఉదకమ్ము తెచ్చేటి వేళ
ఆనబాయి పువ్వులు పూచేటి వేళ
అటికలతో ఉదకమ్ము తెచ్చేటి వేళ
చిక్కుడు పువ్వులు పూచేటి వేళ
చిప్పలతో గంధాలు తీసేటి వేళ
ఆవులు దూడలు వచ్చేటి వేళ
ఆంబోతు రంకెలు వేసేటి వేళ
సందిటి దీపాలు పెట్టేటి వేళ
చాకింటి మడతల్లు తెచ్చేటి వేళ
అన్నల్లు అందలా లెక్కేటి వేళ
తమ్ముళ్ళు తాంబూలాలు వేసేటి వేళ
మరుదుల్లు మరిజూదమాడేటి వేళ
కూతుళ్ళు గుండిగలు దింపేటి వేళ
కోడళ్ళు కాటు కొట్టేటి వేళ
చెల్లెల్లు చేమంతులు ముడిచేటి వేళ
వదినల్లు వంటల్లు చేసేటి వేళ
ముద్దుల్ల మొగము అద్దాన బోలు
తనముఖము తామర పద్మాలుబోలు

Tuesday, September 25, 2007

ఇది సాహిత్యమా , లేక ఇంకేదన్నానా...

బాబోయి....నాయనోయి.... కెవ్వు కెవ్వు కెవ్వు...ఇది సాహిత్యమా , లేక ఇంకేదన్నానా...
రాత్రి అదేదో చానెల్ లో వెంకటేశ్, సౌందర్యల పాట ఒకటి ఇలా సాగుతోంది

కాలం కలిసొస్తే
దేవుడు దిగివస్తే
మంచం మీదకి
నలగని బెడ్ షీటే అడగాలి

అని ఉదిత్ నారాయణుడు - వెంకి బాబుకి గాత్రం ధారపోసి

రాజస్థాన్ లో
ఒంటెలకన్నా
నువ్వే హైటేలే

అని ఆ పాడిన ఆవిడ ఎవరో కూడా తెలీకుండా - సౌందర్య గారు రెచ్చిపోయి పాడుకుంటున్నారు...

అప్పుడే భోజనం చేసి కుర్చీలో కూర్చున్నానేమో... ఆ పాట సాహిత్యం విని కడుపులో అంతా దేవేసి ఏవన్నా అవుతుందేమో అని భయం వేసింది

సిగ్గుతో తలదించుకోవాలండి, మన సినిమా సాహిత్యం ఇంతలా దిగజారిపోయినందుకు, పోతున్నందుకు...ఈ దిక్కుమాలిన సినిమాలు చూడటం కన్నా, ఇలాంటి పాటలు వినడం కన్నా ఊర్లో అందరి ఇళ్ళ ముందు కళ్ళాపి జల్లుకోవటం మంచిది.మిగిలిన ఊర్ల సంగతి ఏమో కానీ, మా ఊర్లో అయితే కళ్ళాపి ఇంకా జల్లుకుంటున్నారు...అసలు కళ్ళాపి అంటే ఏమిటి అని అడిగే దురదృష్టమయిన రోజు రాకూడదు అని కోరుకుంటూ....

Monday, September 24, 2007

ఎన్నో మంచి లలిత సంగీతం పాటలు ఇవిగో ...

ఎన్నో మంచి లలిత సంగీతం పాటలు ఇక్కడ

http://www.maganti.org/page8.html


పాటలు అందించిన శ్రీమతి సరస్వతి భట్టార్ గారికి ధన్యవాదాలతో

వరసైన బావల్లు వరహావతారం

ఈ పాటలు అన్నీ ఓపికగా కూర్చుని నాకు వినిపించిన శ్రీమతి లంక లలిత గారికి ధన్యవాదాలు

మా పాప మామల్లు మత్స్యావతారం
కూర్చున్న తాతల్లు కూర్మావతారం
వరసైన బావల్లు వరహావతారం
నట్టింట నాయత్త నరసింహావతారం
వాసిగల బొట్టెల్లు వామనావతారం
పరమ గురుదేవ పరశురామావతారం
రక్షించు మావయ్య రామావతారం
బంటైనా బంధువులు బలభద్రావతారం
చిట్టి నాకన్నోడ శ్రీ కృష్ణావతారం
బుద్ధితో మాచిట్టి బుద్ధావతారం
కలివిడితో మాయన్న కలికావతారం
వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తల్లి

పాపాయి జునపాలు పట్టుకుచ్చుల్లు

పాపాయి కన్నులు కలువ రేకుల్లు
పాపాయి జునపాలు పట్టుకుచ్చుల్లు
పాపాయి దంతాలు మంచి ముత్యాలు
పాపాయి పిక్కలు మొక్కజొన్న పొత్తులు
పాపాయి చెక్కులు పసివెన్నముద్దల్లు
పాపాయి వన్నెలు పసినిమ్మపండుల్లు
పాపాయి పలుకులు పంచదార చిల్కల్లు
పాపాయి చిన్నెలు బాలకృస్ణువన్నెల్లు

సంతకు పోదాం చెయి వూచు

చెయి ఊచమ్మా చెయి వూచు
సంతకు పోదాం చెయి వూచు
శనగలు తెద్దాం చెయి వూచు
చల్లగ తిందాం చెయి వూచు
మిఠాయి తెద్దాం చెయి వూచు
మెల్లగ తిందాం చెయి వూచు
ఉలవలు ఉలవలు వేయించి
ఉట్ల నిండుగ పోయించి
కందులు కందులు వేయించి
కడువల నిండుగ పోయించి
సెనగలు సెనగలు వేయించి
చేటల నిండగ పోయించి
చేయూచు బాలా చేయూచు
చిన్నారి బాలా చేయూచు
అడ్డాల దిడ్డీ చేయూచు
అరవ మాణిక్యాలు చేయూచు
పండ్లు తెద్దాం చేయూచు
పాపకు ఇత్తాం చేయూచు

Sunday, September 23, 2007

మహాభారతంలోని యుద్ధ వ్యూహాల గురించి

మహాభారతంలోని యుద్ధ వ్యూహాల గురించి నాకు లభించిన సమాచారం ఇక్కడ...

http://www.maganti.org/JanPDFdoc/yuddhavyuham.pdf

ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను, ఇంకా సమగ్రమయిన సమాచారం ఎక్కడయినా దొరుకుతుందేమో అని...కానీ సఫలం కాలేదు...మీకు ఈ వ్యూహాల గురించి ఇతరంగా ఏవేని వివరాలు తెలిస్తే, అంటే వీటి గురించి వ్రాసిన పుస్తకాల వివరాలు కానీ, తెలిస్తే దయ ఉంచి నాకు తెలియచెప్పమని విన్నపము...

Saturday, September 22, 2007

గడ్డానికున్నది గరక - గుఱ్ఱమొచ్చి పెఱక

అనంతపురం జిల్లాలోని పిల్లల గేలిపాట ఒకటి ఇక్కడ చూడండి

చన్నంపల్లి సాయిబ్బు
సాయిబ్బుకున్నది గడ్డము
గడ్డానికున్నది గరక
గుఱ్ఱమొచ్చి పెఱక
లబలబ మొత్తుకుని ఉరక
చన్నంపల్లి సెనిగలు
యేగుతున్నయి పొప్పులు
బావకున్నది తిప్పలు
మీ యక్క కున్నవి నొప్పులు
మీ యప్పకున్నవి అప్పులు
యింటెనక దొడ్డి
పొరుగూరి రెడ్డి
కిరసనాలు బుడ్డి
జెట్టికున్నది సెడ్డి
కల్లకున్నది గెడ్డి

ఊగాడమ్మా....ఊగిందమ్మా!!!

ఈ "ఊగాడమ్మా" పిల్లల పాట గోదావరి జిల్లాల్లో ప్రచారం పొందిన పాట అని తెలియవచ్చింది.బాలుడయితే ఇలా మోకాళ్ళ మీద ఊగిస్తూ ఇలా పాడుతూ ఉంటారు

ఊగాడమ్మా ఊగాడూ
ఊగే చిలుకా ఊగాడూ
బంగరు బొమ్మా ఊగాడూ
తంగేడు పువ్వా ఊగాడూ
గుడిపావురమా ఊగాడూ
కన్నుల వెలుగా ఊగాడూ
సొగసుల గువ్వా ఊగాడూ
శుకమా పికమా ఊగాడూ
చక్కని నెమలీ ఊగాడూ
చక్కెర బొమ్మా ఊగాడూ

అదే బాలికలయితే ఇలా పాడుతూ పిల్లలకి ఆనందం కలిగిస్తారు

ఊగిందమ్మా ఊగిందీ
ఊగే చిలుకా ఊగిందీ
బంగరు బొమ్మా ఊగిందీ
తంగేడు పువ్వా ఊగిందీ
గుడిపావురమా ఊగిందీ
కన్నుల వెలుగా ఊగిందీ
సొగసుల గువ్వా ఊగిందీ
శుకమా పికమా ఊగిందీ
చక్కని నెమలీ ఊగిందీ
చక్కెర బొమ్మా ఊగిందీ

బిరుదుల వ్యామోహం ఎందుకో?

మావయ్య గారు డాక్టర్ ద్వానా శాస్త్రి గారితో దగ్గర దగ్గర ఆరేళ్ళ తర్వాత ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవటానికి అవకాశం లభించింది నిన్న.నేను హైదరాబాదు చాలా సార్లు రావటం జరిగినా, ఆ సమయంలో ఆయన ఐ.యే.ఎస్స్ పాఠాలు బోధించడంలో ఉండటం వల్లో, సాహితీ సభలకి వేరే ఊర్లు వెళ్ళటం లాంటివి జరగటం వల్లో, ఆరోగ్యం బాగోపోవటం వల్లో కుదిరింది కాదు. మొత్తానికి నిన్న ఒక మూడు గంటల పైనే కూర్చుని ముచ్చటించుకున్నాము.

అడగకూడదు అనుకుంటూనే అడిగాను..... "మావయ్యా - ఒక వ్యాసం ఏమన్నా రాసివ్వగలవా" అని...వెంటనే ఆయన రాసిన "ద్వానాంతరంగం" అనే "విమర్శ వ్యాసాలు" పుస్తకం ఒకటి తీసి ఇచ్చి ఇందులో నీకు నచ్చింది ప్రచురించుకో అని చెప్పారు.

సరే ఇక ఆ 44 విమర్శా వ్యాసాల సంకలనంలోని ఒకటొకటి వరుసగా మీ ముందుకు...ఇక్కడ చూడండి

డాక్టర్.ద్వానా శాస్త్రి -"ద్వానాంతరంగం"

http://www.maganti.org/vyasavaliindex.html

ఈ వ్యాసాల మీద మీ అభిప్రాయాలు ఏవన్నా ఉంటే తెలియపర్చండి

Friday, September 21, 2007

"కన్నె పాటలు" - శ్రీ రాయప్రోలు సుబ్బారావు

శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు "కన్నె పాటలు" అని ఒక అద్భుతమయిన గేయ రచన చేసారు. అడుగడుగునా అద్భుతమయిన రచనా సౌందర్యం ఉట్టిపడుతూన్న ఈ అచ్చ తెనుగు పాటలు ఒకటొకటిగా మీ ముందుకు

http://maganti.org/kannepatalu/kannepatalu.html


భవదీయుడు

వంశీ

అబ్బో - ఇదండీ సంగతి

Sunday, September 2, 2007

మేధస్సు, జయంతి, వర్ధంతి, పాత్రికేయులు, రైతాంగం, శంఖుస్థాపనలు

ఈవేళ ఒక మంచి సాహితీ సమాలోచనం జరిగింది - ఎక్కడ ? మావయ్య ద్వా.నా.శాస్త్రి గారు తీసుకెళ్ళిన ఒకానొక ప్రదేశంలో....పెద్ద పెద్ద వారు అంతా సమావేశమయ్యారు - ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, రామబ్రహ్మం గారు, కవితా ప్రసాద్ గారు, నారాయణ రెడ్డి గారు ఇలా ఇంకా ఎంతో మంది...ఒక ఆసక్తికరమయిన విషయం చర్చకు వచ్చింది - ఆసక్తి అని ఎందుకు అంటున్నాను అంటే - మన తెలుగు భాషలో పదిమంది వాడే మాటల్లో దొర్లే తప్పుల గురించి జరిగిన చిన్నపాటి చర్చ - "పదుగురాడు మాట పాడియై ధరజెల్లు" తో మొదలయి మేధస్సు, జయంతి, వర్ధంతి, పాత్రికేయులు, రైతాంగం, శంఖుస్థాపనలు ఇలా ఇంకా చాలా వాటి గురించి మాటలు దొర్లినాయి
మచ్చుకి ఒకటి చూద్దాం - మేధస్సు - " ఫలానా ఆయన భలే మేధస్సు కలవాడు" లేదా "ఆయన మేధస్సు గొప్పది" అని అంటారు జనాలు. కానీ "మేధ" అని మాత్రమే అనాలి ఇవ్వాళ్ళ తెలియవచ్చింది. మేధస్సు అంటే - ఎముక, మెదడు అని అర్ధం అట. మేధ అంటే "బుద్ధి"...అదండీ సంగతి

కొసమెరుపు

భాష అనే పదం సంస్కృతం నుంచి మనం అరువు తెచ్చుకున్నది....అసలు "భాష" కి తెలుగు పదమే లేదని ఘంటాపధంగా నొక్కి వక్కాణించారు ఇక్కడి పెద్దవారు...

మరి ఇక్కడ ఉన్నన్నాళ్ళూ, మావయ్యతో పాటూ తిరిగితే ఇంకా చాలా విషయాలు తెలిసేటట్టు ఉన్నాయి...