Friday, August 31, 2007

హైదరాబాదు ప్రయాణంలో పదనిసలు

హైదరాబాదు ప్రయాణంలో పదనిసలు

ఈ రోజు తెల్లవారు ఝామున రెండు గంటలకి హైదరాబాదు విమానాశ్రయంలోకి రొద పెట్టుకుంటూ కె.ఎల్.ఎం వారి విమానం దిగింది.అందులో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఇంకెవరు - నేను, నా సతీమణి, 24 గంటల ప్రయాణంలో తిండి తిప్పలు లేక అలసిపోయి మా భుజాల మీద వాలిపోయిన మా చిన్నారి పాప వైష్ణవి. నా దురదృష్టమో ఏమో కానీ , నేను ఎప్పుడు హైదరాబాదు వచ్చినా ఒక ఐదారుగురు "జింగులకా" గాళ్ళు నేను వచ్చే విమానంలో తిష్ట వేసి ఉంటారు. జింగులకా గాళ్ళు అంటే అవసరం ఉన్నా లేకపోయినా చెవులు చిల్లులు పడేటట్టు మాట్టాడేవాళ్ళు, చిన్నపాటి చతుర్లకి గాఠ్ఠిగా దడుసుకునేటట్టు నవ్వే వాళ్ళు, అవసరం ఉన్నా లేకపోయినా గాలిసత్రపు (ఎయిర్ హోస్టెస్) దాని కాళ్ళకి, ఆవిడ తెచ్చే పానకపు బళ్ళకి అడ్డం పడుతూ, మూత్రశాలల దగ్గర తచ్చాడుతూ, ఒళ్ళు విరుచుకుంటూ, అలా ఒళ్ళు విరుస్తూ పక్కనున్న వాళ్ళు మనలని చూస్తున్నారా లేదా అని ఓరచూపులు చూస్తూ, విమానం ఇంకో నిముషంలో కిందకి దిగుతుందనగా పైనున్న వాడి పెట్టెలో సామాను సరిగ్గా ఉందా లేదా అని ఒక సారి సరిచూసుకుంటూ, ఆ గాలిసత్రపువారిచేత చీవాట్లు తిని తమ ఆసనాలకి తిరిగి వెళ్ళేవాళ్ళు - ఇలా అన్న మాట. అలా ఈ సారి కూడ వీళ్ళ బాధితుడిని అయి మొత్తానికి ఆ విమానంలో నుంచి బయటపడ్డాము.దిగాక వలస (ఇమ్మిగ్రేషన్) అధికారుల వద్దకి వెళ్ళాలి కదా. ముగ్గురమూ కలిసి ఆయన వద్దకి చాంతాడంత క్యూలో నిలబడి వెళితే ఆయన ఒక చిరునవ్వు నవ్వి " ఏం సార్ పాపకి ఎన్నేళ్ళు - అమెరికన్ సిటిజనా?. ఐతే ఇక్కడ మీ ఎడ్రస్ రాయండి.ఎన్నాళ్ళు ఉంటారు సార్" అని పలకరించేటప్పటికి ఉబ్బితబ్బిబ్బు అయ్యాను. అబ్బో ఇంత మధురమయిన స్వాగతం, పైగా అది కూడా నవ్వుతూ, ఇన్నేళ్ళ నా ప్రయాణంలో ఎప్పుడూ చూడలేదు అని సంతోషించి, పెట్టె బేడ ఎత్తుకుని మన సుంకం (కస్టంస్) సుబ్బారావు గారి వద్దకి వెళ్ళాను.ఆయన ఎవరికీ వినపడకుండా మంద్ర స్వరంతో "సార్" అన్నాడు. నాకు నిజంగానే వినపడలేదు.నేను విని కూడా పరాకు నటిస్తున్నాను అని సుబ్బారావు గారు మళ్ళీ "సార్" అన్నాడు. ఈ సారి వినపడి ఆయన వంక చూసా - ఆయన "సార్ - బచ్చే హై - ఏదో తోచింది ఇవ్వండి...మీ దగ్గర ఐదు వందల రూపాయలు నోటు లేకపోతే డాలర్లు అయినా ఫరవాలేదు" అన్నాడు. ఉలిక్కిపడ్డా , అసలు ఈయన ఏమిటి అడుగుతున్నాడు అని, తేరుకుని కొంచెం ఈ లోకంలోకి వచ్చిన తరువాత జాలిపడ్డా - హతవిధీ ఇలా సుంకాధికారులు కూడా అడుక్కోవడం మొదలు అయ్యేంతగా పరిస్థితి దిగజారిందా అని. సరే అలా సిగ్గు విడిచి అడుక్కున్నందుకు అయినా ఏదో మొహాన పడేద్దామా అని అనిపించింది కానీ - మళ్ళీ ఇలాగే అందరూ ఇస్తూ పోతూ ఉంటే, ఈ మహమ్మారి ఎప్పటికి వదలదు అని గుర్తుకు వచ్చి "నా దగ్గర ఏమీ లేవు అండి - కావాలి అంటే నా పెట్టే బేడ వెతుక్కోండి" అని అచ్చ తెలుగులో అన్నాను. వెంటనే సుబ్బారావు గారు నన్ను ఎగా దిగా చూసి "వో కస్టంస్ పేపర్ దేకే జావ్" అని హిందిలో ఒక సమాధానం ఇచ్చి పాస్పోర్టు అవీ చూసి అక్కడినుంచి పంపించాడు.

రెండో భాగం త్వరలో ......

అన్నట్టు ఒక రెండు గంటలు పడుకుని 10 గంటల ప్రాంతంలో కొత్త పెళ్ళికొడుకు "త్రివిక్రముడికి" దూరతంత్రి లో శుభాకాంక్షలు తెలియచేసి మళ్ళీ ముసుగేసా

1 comment:

  1. avi neethi panulenantunnaaru,mii aa mericaalo antha avinithi ani ee madye telicindi, nijmeenaa?

    ReplyDelete