Saturday, July 14, 2007

అబ్బో! అప్పుడే రెండో వార్షికోత్సవమా!

మాగంటి.ఆర్గ్ మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఒక పక్క తప్పటడుగుల నుంచి, తప్పుటడుగుల నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా, ఈ రెండేళ్ళలో మన భాషకి,ఈ తరం పిల్లలకి మరింత చెయ్యలేకపోయానే అని చిన్న క్లేశం మిగిలిపోయింది.

కొంత మంది "అసలు ఈ వెబ్సైటు ప్రారంభించడానికి మీకు ప్రేరణ ఏమిటి" అని అడిగినదానికి సమాధానం ఏమిటీ అంటే స్థూలంగా ఇదిగో

"ఎంతో ప్రేమ ఆప్యాయత పంచి, తరతరాలుగా పెద్దలందరూ కాపాడుకుంటూ వస్తున్న మన సంస్కృతి, సాంప్రదాయాలు గురించి వారికి తెలిసినవి నాకు అందజేసి,అలా నాకు నేర్పిన ఆ విజ్ఞానాన్ని పదిమందితో, అందులోనూ ముఖ్యంగా తరువాతి తరం పిల్లలతో పంచుకోమని, అది ఒక మనిషి కనీస బాధ్యత అని బోధ చేసి, మమ్మల్ని వదిలి వెళ్ళిన తాతగార్లు,నానమ్మ,అమ్మమ్మగార్ల ఋణం తీర్చుకోవటానికి మొదలు పెట్టిందే ఈ మాగంటి.ఆర్గ్. "

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పెద్దలు ఊరకే అనలేదు కదా. నా మొట్టమొదటి గురువు నాన్న శ్రీ మాగంటి శివరామ శర్మగారు. ఆయనకి ఉన్న సాహిత్యాభిలాష వల్ల ఎన్నో ఎన్నెన్నో మంచి మంచి పుస్తకాల మధ్య పెరిగే అవకాశం లభించింది నాకు. ఇంట్లో అన్ని పుస్తకాలతో ఒక పెద్ద గ్రంథాలయంలాగా ఉండేది. అమ్మ శ్రీమతి ప్రసూనగారు సంగీతం నేర్చుకోకపోయినా ఎన్నో పాటలు - కృతులు, కీర్తనలు, తత్త్వాలు, లలిత సంగీతం, ఇలా ఒక్కటేమిటి ఎన్నో పాటలు చాలా చక్కగా పాడేవారు. అలా సంగీతం, సాహిత్యం అనే రెండు జీవజ్యోతుల మధ్య పెరిగిన వాతావరణం నన్ను ఎంతో ప్రభావితం చేసింది అని గర్వంగా చెప్పుకోగలను. అలాగే నాకు విద్య నేర్పి ఈ సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా జీవించడానికి అవకాశం కల్పించిన ఎందరో ఆచార్యవర్యులు - అందరికీ పేరు పేరునా శతసహస్రకోటి పాదాభివందనాలు.

కొన్ని సద్విమర్శలు, కొన్ని కువిమర్శలు, కొన్ని మెచ్చుకోళ్ళు, కొన్ని తిట్లు, ఎంతో మంది కొత్త మిత్రులతో పరిచయం - ఇలా కలగూరగంప లాగా ఈ రెండేళ్ళ ప్రస్థానం సాగిపోయింది. చాలానే మధుర స్మృతులు ఉన్నా, అలా వచ్చిన విమర్శలలో ఈ మధ్య నన్ను బాగా ఆలోచింపచేసిన వ్యాఖ్యలు కొన్ని -
 • "నేను గత ఆరు నెలలుగా నీ వెబ్సైటు చూస్తున్నాను. అసలు మాగంటి.ఆర్గ్ మొదలు పెట్టి నువ్వు సాధించింది ఏమిటీ",
 • "మనకున్న శతకోటి లింగాల్లో నీ వెబ్సైటు ఒక బోడిలింగం",
 • "అసలు ఇలాంటి వెబ్సైటులు శుద్ధ దండగ"

అని ఇద్దరు ముగ్గురు -పేర్లు ఎందుకులెండి కానీ- నాకు ఈమెయిలు పంపించారు.

ఇవి ఎవరో కోపం ఉన్నవాళ్ళు పంపించారులే అని పట్టించుకోకుండా ఉండొచ్చు కానీ - ఆ ఈమెయిళ్ళు చదివి ఒక వేళ నేను నిర్వహిస్తున్న బాధ్యతలో ఎక్కడయినా తప్పు చేస్తున్నానా, తప్పు జరిగిందా అని ఆలోచించాను. వారు అలా వ్రాసినందుకు ఏ మాత్రం బాధ లేదు నాకు, కానీ ఒక వేళ ఏదన్నా లోపం కనపడి ఉంటే నిర్మొహమాటంగా తెలియచెయ్యండి ఆ లోపాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాను.

అందుకే సభాముఖంగా మిమ్మల్నందరినీ అడుగుతున్నాను, ఎక్కడయినా తప్పులు, లోపాలు కనపడితే నిర్మొహమాటంగా తెలియచెయ్యమని.

అనుకోకూడదు కానీండి - ఈ వెబ్సైటు నిర్వాహణ అనేది ఒక వ్యసనం లాంటిది.ఈ వెబ్సైటు గొడవలో పడి కొన్ని రోజులు మా ఆవిడతో, కుటుంబంతో ఎక్కువ సమయం కూడా గడపలేకపోయేవాడిని. అయితే అవి అన్ని సహించి నాకు ప్రోత్సాహం (అలాంటివి సహించటమే ఒక ప్రోత్సాహం!) అందించిన నా శ్రీమతి శ్రీదేవికి, తన స్వచ్చమయిన బోసినవ్వుతో నా అలసటని అలా తీసిపారేసే మా అమ్మాయి వైష్ణవికి, మిగిలిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలతో.

6 comments:

 1. అహా వంశీ గారూ - మీ వెబ్సైటు రెండో వార్షికోత్సవం సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు..మీ ఈ వెబ్సైటు ప్రస్థానం అప్రతిహతంగా ఇలాగే సాగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఇలాంటి మంచి మంచి విషయాలని ఎంతో ఓపికగా ఒక్కచోట పొందుపరచినందుకు, మా అందరికీ అందుబాటులో ఉంచినందుకు మరింత సంతోషం.

  అదీ ఒకే ఒక్క మనిషి కృషిచేసి మలచిన ఈ భాండాగారం మరిన్ని విషయాలతో పెరగాలని కోరుకుంటున్నాను. మీకు వెబ్సైటు పరంగా ఏదయినా సాయం కావాలి అంటే సంకోచించకుండా చెప్పండి.

  ReplyDelete
 2. వంశీ గారు, అభినందనలు. మీరు చేసినకృఇషి, అందించిన సేవ సామాన్యమైనవి కావు.
  ఇక మీ ప్రయత్నాలు యూనికోడు నీడన ఎదగాలని ఆశీర్వదిస్తూ..

  ReplyDelete
 3. ధన్యవాదాలు లలిత గారు

  @ ధన్యవాదాలు త్యాగా గారు, కొత్తపాళీ గారు - మీ లాంటి మంచివారి ఆశీర్వాదాలు, మాగంటి.ఆర్గ్ అనే బుడుతడికి శ్రీరామ రక్ష అవ్వాలి అని కోరుకుంటూ

  @ కొత్తపాళీ గారు,నామటుకు ఇది ఒక బాధ్యతగా భావించి చేసాను. దానికి మీ లాంటి ఎంతో మంది పెద్దవారు మంచి మనసుతో నాకు తెలియని విషయాలు తెలియచేసి, తప్పులు సరిదిద్ది సాయం చేసారు కూడా. కాబట్టి ఇది నా ఒక్కడి కృషే కాదు.అందుకు అందరికీ సహస్రకోటి ధన్యవాదాలు. ఇక యూనీకోడు విషయానికి వస్తే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు అయ్యినాయి. కొన్ని పత్రాలు యూనీకోడులో ప్రచురించటం జరిగింది కూడా.ఇక పై నుంచి కూడ అదే కొనసాగుతుంది అని తెలియచేయటనికి సంతోషిస్తున్నాను. ఇప్పటివరకు ఆ పని చేయకపోవటానికి ఒకే ఒక్క కారణం - నాకు ఎందుకో యూనీకోడు ఫాంటు నచ్చకపోవటమే.కానీ కొన్ని సార్లు ఇష్టాలు మార్చుకోవలసి వస్తుంది కదా.... :)

  ReplyDelete
 4. మీ వెబ్‌సైటు రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు అభినందనలు

  ReplyDelete
 5. "కొట్టుకొని పోయాయి కోటిలింగాలు - వీరేశలింగ మొకడు మిగిలెను చాలు" అన్నట్లుగా, శతకోటిలింగాలున్నా, వాటిలో ఒక బోడిలింగం శాశ్వతంగా నిలిచిపోతుంది. మీ దగ్గరున్న సమాచారం అసాధారణమైనది. అప్పుడప్పుడూ వచ్చి చదువుతూ ఉంటాను. 'మాగంటి.ఆర్గ్' చిరంజీవ!

  ReplyDelete