Saturday, July 14, 2007

అబ్బో! అప్పుడే రెండో వార్షికోత్సవమా!

మాగంటి.ఆర్గ్ మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఒక పక్క తప్పటడుగుల నుంచి, తప్పుటడుగుల నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా, ఈ రెండేళ్ళలో మన భాషకి,ఈ తరం పిల్లలకి మరింత చెయ్యలేకపోయానే అని చిన్న క్లేశం మిగిలిపోయింది.

కొంత మంది "అసలు ఈ వెబ్సైటు ప్రారంభించడానికి మీకు ప్రేరణ ఏమిటి" అని అడిగినదానికి సమాధానం ఏమిటీ అంటే స్థూలంగా ఇదిగో

"ఎంతో ప్రేమ ఆప్యాయత పంచి, తరతరాలుగా పెద్దలందరూ కాపాడుకుంటూ వస్తున్న మన సంస్కృతి, సాంప్రదాయాలు గురించి వారికి తెలిసినవి నాకు అందజేసి,అలా నాకు నేర్పిన ఆ విజ్ఞానాన్ని పదిమందితో, అందులోనూ ముఖ్యంగా తరువాతి తరం పిల్లలతో పంచుకోమని, అది ఒక మనిషి కనీస బాధ్యత అని బోధ చేసి, మమ్మల్ని వదిలి వెళ్ళిన తాతగార్లు,నానమ్మ,అమ్మమ్మగార్ల ఋణం తీర్చుకోవటానికి మొదలు పెట్టిందే ఈ మాగంటి.ఆర్గ్. "

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పెద్దలు ఊరకే అనలేదు కదా. నా మొట్టమొదటి గురువు నాన్న శ్రీ మాగంటి శివరామ శర్మగారు. ఆయనకి ఉన్న సాహిత్యాభిలాష వల్ల ఎన్నో ఎన్నెన్నో మంచి మంచి పుస్తకాల మధ్య పెరిగే అవకాశం లభించింది నాకు. ఇంట్లో అన్ని పుస్తకాలతో ఒక పెద్ద గ్రంథాలయంలాగా ఉండేది. అమ్మ శ్రీమతి ప్రసూనగారు సంగీతం నేర్చుకోకపోయినా ఎన్నో పాటలు - కృతులు, కీర్తనలు, తత్త్వాలు, లలిత సంగీతం, ఇలా ఒక్కటేమిటి ఎన్నో పాటలు చాలా చక్కగా పాడేవారు. అలా సంగీతం, సాహిత్యం అనే రెండు జీవజ్యోతుల మధ్య పెరిగిన వాతావరణం నన్ను ఎంతో ప్రభావితం చేసింది అని గర్వంగా చెప్పుకోగలను. అలాగే నాకు విద్య నేర్పి ఈ సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా జీవించడానికి అవకాశం కల్పించిన ఎందరో ఆచార్యవర్యులు - అందరికీ పేరు పేరునా శతసహస్రకోటి పాదాభివందనాలు.

కొన్ని సద్విమర్శలు, కొన్ని కువిమర్శలు, కొన్ని మెచ్చుకోళ్ళు, కొన్ని తిట్లు, ఎంతో మంది కొత్త మిత్రులతో పరిచయం - ఇలా కలగూరగంప లాగా ఈ రెండేళ్ళ ప్రస్థానం సాగిపోయింది. చాలానే మధుర స్మృతులు ఉన్నా, అలా వచ్చిన విమర్శలలో ఈ మధ్య నన్ను బాగా ఆలోచింపచేసిన వ్యాఖ్యలు కొన్ని -
  • "నేను గత ఆరు నెలలుగా నీ వెబ్సైటు చూస్తున్నాను. అసలు మాగంటి.ఆర్గ్ మొదలు పెట్టి నువ్వు సాధించింది ఏమిటీ",
  • "మనకున్న శతకోటి లింగాల్లో నీ వెబ్సైటు ఒక బోడిలింగం",
  • "అసలు ఇలాంటి వెబ్సైటులు శుద్ధ దండగ"

అని ఇద్దరు ముగ్గురు -పేర్లు ఎందుకులెండి కానీ- నాకు ఈమెయిలు పంపించారు.

ఇవి ఎవరో కోపం ఉన్నవాళ్ళు పంపించారులే అని పట్టించుకోకుండా ఉండొచ్చు కానీ - ఆ ఈమెయిళ్ళు చదివి ఒక వేళ నేను నిర్వహిస్తున్న బాధ్యతలో ఎక్కడయినా తప్పు చేస్తున్నానా, తప్పు జరిగిందా అని ఆలోచించాను. వారు అలా వ్రాసినందుకు ఏ మాత్రం బాధ లేదు నాకు, కానీ ఒక వేళ ఏదన్నా లోపం కనపడి ఉంటే నిర్మొహమాటంగా తెలియచెయ్యండి ఆ లోపాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాను.

అందుకే సభాముఖంగా మిమ్మల్నందరినీ అడుగుతున్నాను, ఎక్కడయినా తప్పులు, లోపాలు కనపడితే నిర్మొహమాటంగా తెలియచెయ్యమని.

అనుకోకూడదు కానీండి - ఈ వెబ్సైటు నిర్వాహణ అనేది ఒక వ్యసనం లాంటిది.ఈ వెబ్సైటు గొడవలో పడి కొన్ని రోజులు మా ఆవిడతో, కుటుంబంతో ఎక్కువ సమయం కూడా గడపలేకపోయేవాడిని. అయితే అవి అన్ని సహించి నాకు ప్రోత్సాహం (అలాంటివి సహించటమే ఒక ప్రోత్సాహం!) అందించిన నా శ్రీమతి శ్రీదేవికి, తన స్వచ్చమయిన బోసినవ్వుతో నా అలసటని అలా తీసిపారేసే మా అమ్మాయి వైష్ణవికి, మిగిలిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలతో.

జేజిమామయ్య పాటలు - 1

జేజిమామయ్య పాటలు ఒకటొకటిగా

రచన - శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు

తాయిలం

ఆటలు ఆడీ పాటలు పాడీ అలసీవచ్చానే
తియ్యతియ్యని తాయిలమేదో తీసిపెట్టమ్మా

పిల్లిపిల్లా కళ్ళూమూసి పీటా ఎక్కిందీ
కుక్కాపిల్లా తోకాడిస్తూ గుమ్మామెక్కిందీ

కడుపులోనీ కాకీపిల్లా గంతులేస్తోందీ
తియ్య తియ్యని తాయిలమేదో తీసిపెట్టమ్మా

గూటిలోని బెల్లం ముక్కా కొంచెం పెట్టమ్మా
చేటాలోని కొబ్బరి కోరూ చారెడు తియ్యమ్మా

అటకామీది అటుకుల కుండా అమ్మా దింపమ్మా
తియ్య తియ్యని తాయిలమేదో తీసిపెట్టమ్మా

Sunday, July 8, 2007

ప్రాస పాట ఒకటి

పిల్లల ప్రాస పాట

పిల్లల ప్రాస పాట ఒకటి చూడండి ఇక్కడ. ఈ పాట అందించిన మిత్రుడు రాగంపేట శ్రీనివాస్ కి ధన్యవాదాలు.తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వద్ద ఈ పాట వింటూ ఉండేవాడిని అని శ్రీనివాస్ తెలియచేసాడు.

పిట్టమ్మ పిట్ట
ఏమి పిట్ట
చిలక పిట్ట
ఏమి చిలక
తెలుపు చిలక
ఏమి తెలుపు
హంస తెలుపు
ఏమి హంస
రాజ హంస
ఏమి రాజు
మృగరాజు
ఏమి మృగము
వన మృగము
ఏమి వనము
పూల వనము
ఏమి పూలు
జాజి పూలు
ఏమి జాజి
గుత్తి జాజి
ఏమి గుత్తి
కవ్వం గుత్తి
ఏమి కవ్వం
చల్ల కవ్వం
ఏమి చల్ల
మంచు చల్ల
ఏమి మంచు
పొగ మంచు
ఏమి పొగ
దీపం పొగ
ఏమి దీపం
గోడ దీపం
ఏమి గోడ
కోట గోడ
ఏమి కోట
తులసి కోట
ఏమి తులసి
రామ తులసి
ఏమి రామ
ఆత్మా రామ

Saturday, July 7, 2007

యానాదోళ్ళ పెళ్ళిళ్ళు

యానాదోళ్ళ పెళ్ళిళ్ళు


వెన్నెలకంటి రాఘవయ్యగారు యానాది వాళ్ళ పెళ్ళిళ్ళగురించి తన యానాది అనే రచనలో ఎలా వివరించారో చూడండి


యానాదోళ్ళ పెళ్ళిళ్ళు, ఎంత మంచి పెళ్ళిళ్ళు
బొట్టుతో పనిలేదు, బోనాలఖ్ఖరలేదు
కొత్త చీరలొద్దు, అత్త పోర్లు వద్దు
చుట్టాలు రావొద్దు, చూడనయినా వొద్దు
కలుసుకుంటె చాలు, మురుసుకుంటుండొచ్చు
అల్లుళ్ళ పోరొద్దు, ఆస్తిపాస్తులు వద్దు
మేళతాళాలొద్దు, మంత్రతంత్రాలు వొద్దు
మంగమూరు దేముడికి మొక్కుకుంటే చాలు
గోత్రాలు మాకేల, గీత్రాలు మాకేల
నేత్రాలు ఒకటైతే సూత్రాలు ఏలయ్య
తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలేదు
వండుకోను కుండలేదు, పండుకోను పంచ లేదు
ఎందుకయ్య పెండ్లి ఎందుకయ్య మాకు
"సత్యశోధన" సత్యసాయి మాష్టారు గారి పిల్లల వ్యాసాలు

http://maganti.org/page15.html