Wednesday, January 12, 2022

అనగనగా

 #అనగనగా


ఎప్పటిదో కాలం


పరమాత్ముడు మహాశివుడు కైలాసంలో నిర్మలంగా ఒకానొక ఉదయం బాసిపట్టు వేసుకుని ధ్యానించుకుంటున్న కాలం


ఆ సమయంలో కాపలా కాస్తున్నాడు


ఎవరా కాసేది?


ఇంకెవరూ? 


నందీశ్వరుడు


ఎవరు వచ్చి మహాదేవుడి ధ్యానం భగ్నం చేస్తారోనని అతిజాగ్రత్తగా కాపలా కాస్తున్నాడు


ఇంతలో అక్కడికి ఒక ముసలి సన్యాసి వచ్చాడు


కాపలాగా ఉన్న నందీశ్వరుడి దగ్గరకు వచ్చి - "అయ్యా! ఆ పరమాత్ముణ్ణి దర్శించుకోవాలని వచ్చాను. చూడవచ్చా? దారి వదులుతావా?" అని వినమ్రంగా అడిగాడు


"కుదరదయ్యా! పెద్దాయన ధ్యానంలో ఉన్నాడు. ఇప్పుడు నిన్ను లోపలికి పంపిస్తే ఆయన ధ్యానం భగ్నం అయిపోతుంది. వెళ్ళిపోయి సాయంత్రం రా! అప్పుడు ఖాళీగా ఉంటె పంపిస్తా లోపలికి" అన్నాడు నంది


సన్యాసి ఒక్కసారిగా ఉసూరుమన్నాడు


"అయ్యా నేనెక్కడినుంచో, అంధక దేశం నుంచి వస్తున్నాను. చాలా దూరం. ఇక్కడ ఎవరూ నాకు తెలియదు కూడాను. వెళ్ళిపోయి సాయంత్రం రమ్మంటే ఎలా వచ్చేది. బాబ్బాబు, కొంచెం దయ ఉంచి ఆయన దర్శనం ఇప్పిస్తే నా గోడు చెప్పుకుని వెళ్లిపోతా" అన్నాడు ఆ ముసలాయన


"కుదరదని చెప్పానా!" అని కసిరాడు నంది 


ఇక ముసలాయనకు దారి లేక, "సరే, సాయంత్రం దాకా ఇక్కడే ఈ పక్కల మూలకు కూర్చుంటానులే" అని ఆ ద్వారం పక్కనే ఉన్న అరుగు మీద కూలబడ్డాడు


నంది పట్టించుకోకుండా తన కాపలా పని తను చేసుకుంటున్నాడు


ఇంతలో ఈ హడావిడి, ఈ మాటలు అవీ వినపడి పరమాత్ముడు కళ్ళు తెరిచి "నందీ" అని సౌమ్యంగా పిలవటం జరిగింది


హుటాహుటిన పరుగులెత్తాడు నంది పరమాత్ముడి వద్దకు


అక్కడకు పోయి చేతులు కట్టుకుని నిలబడ్డాడు - "ఆజ్ఞ ఏమిటి దొరా?" అంటూ


మహాదేవుడన్నాడు - "ఎవరాయన, ఎందుకు వచ్చాడు? వయసులో పెద్దాయన కదా, అలా ఆయన క్షేమ సమాచారాలు కనుక్కోకుండా, తాగటానికి నీళ్ళు కూడా ఇవ్వకుండా అలా అక్కడ కూర్చోపెట్టావేమి. ఇలా రమ్మను ఆయన్ని" అని


నందికి చెమటలు పట్టినాయ్ ఒక్కసారిగా


"తప్పు జరిగింది మహప్రభూ!" అంటూ పరుగెత్తి ముసలాయన దగ్గరకు పోయి ఆయనను తోడుకొని తెచ్చాడు నంది


ముసలాయన పరమాత్ముణ్ణి చూడగానే కన్నీరు మున్నీరయ్యాడు. ఒళ్ళు జలదరించింది. మైమరచిపోయాడు ఆ సుందరమూర్తిని చూడగానే. ఒక రెండు నిమిషాలు మాట లేకుండా అలా ఆయన్ని చూస్తూ ఉండిపోయాడు


పరమాత్ముడు ఆయన రెండు నిమిషాలు ఆయనకిచ్చి, ఆ తర్వాత నెమ్మదిగా "ఏమండీ! అంత దూరం నుంచి, ఎక్కడో దేశానికి కిందనున్న దేశం నుంచి ఇలా వచ్చారు. ముందు ఈ నీళ్ళు తాగండి" అంటూ జటాజూటంలోంచి గంగమ్మను కాస్త నీటిని విడవమని చెప్పి ఆ నీళ్ళు ఇచ్చి ఆయన్ని సేద దీర్చాడు


ఆయన సేదదీరింతర్వాత, తను వచ్చిన పని చెప్పుకున్నాడు


ఏమని?


"పరమాత్మా, మా రాజ్యంలో భాష అంతా నాశనమైపోతోంది. అందరూ భ్రష్టు పట్టిపోయారు. ఎంత చక్కనైన భాష మాది. ప్రపంచంలోనే అతి తియ్యనైన భాష. మాట్లాడినా, రాసిన తేనెలు కురిపించే భాష. అట్లాటి దానిని, ఆ తెలుగును ఎంతగానో నిర్లక్ష్యం చేసి నాశనం చేసేస్తున్నారు. ఎట్లాగైనా ఒక దారి చూపిస్తావని వచ్చాను" అని తన పని వివరించాడు 


పరమాత్ముడు నవ్వి ఆ ముసలాయనతో ఒక పద్యం చెప్పాడు 


ఏమా పద్యం?


ఇదిగో

    

శేషశాయి 'అ ' కారమై చెల్వుగులుకఁ

బద్మభవుడు 'క్ష ' కారరూపము ధరింపఁ

నగ్ని బీజ రేఫము రుద్రుఁడై వెలుంగ

'నక్షర ' పదమ్ము మూర్తిత్రయాత్మకమగు


ఆ పద్యం చెప్పి, "మన దేశంలోని ఏ భాషకైనా సరే "అక్షరం" మూల ఆయువు. ప్రధాన వాయువు.ఆ అక్షరాన్ని త్రిమూర్తులమైన మేము ఆవరించి ఉంటాం. ఏ శరీరానికైనా ఆయువు వాయువులో ఉంటుంది. ఆ వాయువును కలుషితం చేసిననాడు, ఆ శరీరం భ్రష్టు పట్టిపోవాల్సిందే! అగ్నిలో మసి అయిపోవాల్సిందే! ఒకనాడు దేవభాష అయిన సంస్కృతాన్ని దూరంగా పారత్రోలి, అక్షరానికి మూలస్తంభాలైన మహావిష్ణువుకు బ్రహ్మకు స్వస్తి పలికారు. దానితో నా వంతు బాధ్యతగా ఆ భాషను మానవులకు అందకుండా అగ్ని పాలు చేసేసాను. అగ్నిలో కాలి పునీతమైన ఆ దేవభాష మా వద్ద ప్రశాంతంగా బతుకుతోంది ఇక్కడ. మీ వాళ్ళు అదే తప్పు చేస్తున్నారు. దానిని మార్చగలిగేది మేము కాదు. మీరే! అది మీ బాధ్యతే! ఇవ్వటం వరకే మా ఇది. రక్షించుకునేది మీరే. తప్పులు హద్దు మీరితే ఇచ్చినదానిని తిరిగి పునీతంగా మా వద్దకు తెచ్చేసుకుంటాం" అని ఆ ముసలాయనకు వివరణ ఇచ్చాడు


ఆ వివరణ విన్న ముసలాయనకు ఏం చెప్పాలో తెలియక, వేరే దారి లేక, అక్కడినుంచి తెలుగు దేశానికి తిరిగి వచ్చి ఆ సందేశం అంధక రాజ్య ప్రజలకు వినిపించాడు


అంధక రాజ్యంలోని ఆ అంధకులు, ఆ అంధులు విని బాగుచేసుకున్నారో, నిర్లక్ష్యం చేసారో తెలియదు కానీ తెలుగు భాష మటుకు అగ్నిలో పునీతం అవ్వటానికి పాడె ఎక్కి సిద్ధంగా ఉన్నదని తెలియవచ్చింది 


అట్లా ఓం తత్ సత్ జరిగింది 


-- ఓనాడు 2017లో వానమామలై వరదాచార్యుల వారు రాసిన పద్యం చదివినాక (ఈ అనగనగాలో పరమాత్ముడు చెప్పిన పద్యమే అది) రాసుకున్న కథ

Wednesday, December 29, 2021

ఈ పుస్తకం ఇక ముందు ఎవరికీ లభ్యం కాదు కనక ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు - Part 1

పెయింటింగులు అవీ వేసుకుంటున్న కాలంలో, నాకిష్టమయిన అమెరికన్ ఆర్టిష్టు గురించి ఒక దశాబ్దం క్రితం రాసుకున్నది. అమెజాను నుండి నా పుస్తకాలు అన్నీ తీసివేసి కొంతకాలం అయ్యింది కనక, ఈ పుస్తకం ఇక ముందు ఎవరికీ లభ్యం కాదు కనక ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు, నాకు ఇష్టమయినవి ఇక్కడ వేయాలని నిశ్చయించుకున్నాను

చదవాలనుకునేవారు చదువుకోవచ్చు 

మొదటి భాగం ఈ బొమ్మ కింద నుంచి చదవవచ్చు 

#LeroyNeiman

#GreatestAmericanArtists
తదేజతి, తన్నైజతి, తద్దూరే, తద్ద్వంతినే

తదంతరస్య సర్వస్య, తదు సర్వ స్యాస్య బాహ్యత:

 

అని ఈశావాస్యోపనిషత్ చెపుతుంది

 

అంటే

 

జగత్కారణమైన ఆత్మతత్త్వం కదుల్తుంది, కదలదు

 

అది అజ్ఞానులకు దూరమే

 

అది  జ్ఞానులకు దగ్గరనే

 

జగత్తులో - అంతటా, లోపలా బయటా కూడా నిండి వెలిగేది అదే

 

అలాటి అత్మతత్త్వమే కళాకారుల్లో ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తుంది

 

మామూలు మనుషుల్లో కనపడనిదది

 

అసలు కళ అంటే ఏమిటి?

 

జగత్తులో అన్ని పదాలకు వివిధ అర్థాలు ఉంటాయి

 

అలాగే కళ అంటే చాలా రకాలైన అర్థాలు ఉన్నవి

వాటిలో ముఖ్యమైనది మూర్ఛ

 

కళ అనగా మూర్ఛ కలుగచేయునది

 

ఏదైనా అద్భుతమైనది చూడగానే మనిషికి, వాని మనసుకు మూర్ఛ కలుగును

 

మూర్ఛ అనగా వేరేదేమో కాదు మైమరపు

 

మైమరపు ఉన్నవాడికి లోకమే తెలియదు

 

అలాటి ఎన్నో లోకాలను తన మాయతో చూపించేదే కళ

 

అలాటి కళను సొంతం చేసుకున్నవాడు కళాకారుడు

 

అలాటి కళను ప్రపంచానికి చూపించేవాడు కళాకారుడు

 

అలాటి కళలు చతుష్షష్టి గా ఉన్నవి

 

అనగా 64 రకములు

 

అవి ఏమిటో చూద్దాం

 

ఆచార్య రవ్వా శ్రీహరి గారి నిఘంటువులో 64 కళలు ఇలా విభాగించబడి ఉన్నవి

 

1 గీతము (స్వర ప్రధానముగా, పద ప్రధానముగా, లయ ప్రధానముగా మనస్సు యొక్క అవధానము ప్రధానముగా లోలోపల గానము చేయబడునది)

 

2 వాద్యము (ఇది తత-ఘన-అనవద్ధ-సుషిర భేదములచే నాలుగు విధములు )

 

3 నృత్యము (భావాభినయము)

 

4 అలేఖ్యము (చిత్రలేఖనము)

 

5 విశేషకచ్ఛేధ్యము (తిలక-పత్రభంగాది రచన)

 

6 తండులకుసుమ బలివికారములు (బియ్యపుపిండితో, పూలతో భూతతృప్తి కొఱకు పెట్టెడి ముగ్గులు)

 

7 పుష్పాస్తరణము (పూలశయ్యలను, అసనములను ఏర్పఱచుట)

 

8 దశన వసనాంగరాగము (దంతములకు, వస్త్రములకు రంగులద్దుట)

 

9 మణిభూమికాకర్మ (మణులతో బొమ్మలను చేయుట)

 

10 శయన రచనము (ఋతువుల ననుసరించి శయ్యలను కూర్చుట)

 

11 ఉదక వాద్యము (జలతరంగిణి)

 

12 ఉదకాఘాతము (వసంతకేళిలో పిచికారుతో నీళ్ళు చిమ్ముట)

 

13 చిత్రయోగములు (రకరకముల వేషములతో సంచరించుట)

 

14 మాల్యగ్రథన వికల్పములు (చిత్ర విచిత్రములైన పూలమాలలను కూర్చుట)

 

15 శేఖరకాపీడ యోజనము (పూలతో కిరీటమును, తలకు చుట్టును అలంకరించుకొనెడి పూల నగిషీని కూర్చుట)

 

16 నేపథ్య ప్రయోగము (అలంకరణ విధానములు)

 

17 కర్ణపత్రభంగములు (ఏనుగు దంతములతోను శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట)

 

18 గంధయుక్తి (అత్తరువులు మొదలగునవి చేసెడి నేర్పు )

 

19 భూషణ యోజనము (సామ్ములు పెట్టుకొను విధానము )

 

20 ఇంద్రజాలములు (చూపఱుల కనులను భ్రమింప జేయుట)

 

21 కౌచిమారయోగము (సుభగంకరణాది యోగములు)

 

22 హస్త లాఘవము (చేతులలోనున్న వస్తువులను మాయము చేయుట)

 

23 విచిత్ర శాఖయూష భక్ష్యవికారములు (రకరకముల తినుబండములను వండుట)

 

24 పానక రసరాగాసవ యోజనము (పానకములు, మద్యములు చేయుట)

25 సూచీవానకర్మ (గుడ్డలు కుట్టుట)

 

26 సూత్రక్రీడ (దారములను ముక్కలు చేసి, కాల్చి మరల మామూలుగా చూపుట)

 

27 వీణాడమరుక వాద్యములు (ఈవాద్యములందు నేర్పు)

 

28 ప్రహేళికలు (సామాన్యార్థము మాత్రము పైకి కనబడునట్లును, గంభీరమైన యర్థము గర్భితమగునట్లును కవిత్వము చెప్పుట)

 

29 ప్రతిమాల (కట్టుపద్యములను చెప్పుట)

 

30 దుర్వాచక యోగములు (విలాసము కొఱకు క్లిష్ట రచనలను చదువులట)

 

31 పుస్తక వాచకము (అర్థవంతముగా చదివెడి నేర్పు)

 

32 నాటకాఖ్యాయికా దర్శనము (నాటకములకు, కథలకు సంబంధించిన జ్ఞానము )

 

33 కావ్యసమస్యాపూరణము (పద్యములతో సమస్యలను పూరించుట)

 

34 పట్టికా వేత్రవాన వికల్పములు (పేముతో కుర్చీలు, మంచములు అల్లుట)

 

35 తక్షకర్మ (విలాసము కొఱకు బొమ్మలు మొదలైనవి చేయుట)

 

 

36 తక్షణము (కఱ్ఱపని యందు నేర్పు)

 

37 వాస్తువిద్య (గృహాదినిర్మాణ శాస్త్రము )

 

38 రూప్యరత్నపరీక్ష (రూపాయలలోను, రత్నములలోను మంచి చెడుగులను పరిశీలించుట)

 

39 ధాతువాదము (లోహములుండెడి ప్రదేశములను కనుగొనుట)

 

40 మణిరాగాకర జ్ఞానము (మణుల గనులను కనిపెట్టుట)

 

41 వృక్షాయుర్వేద యోగములు (చెట్లవైద్యము)

 

42 మేషకుక్కుటలావక యుద్ధవిధి (పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు మొదలగు వానితో పందెములాడుట)

 

43 శుకశారికా ప్రలాపనము (చిలుకలకు, గోరువంకలకు మాటలు నేర్పుట)

 

44 ఉత్సాదన, సంవాహన, కేశమర్దన కౌశలము (ఒళ్ళుపట్టుట, పాదములొత్తుట, తలయంటుట వీనియందు నేర్పు)

 

45 అక్షరముష్టికా కథనము (అక్షరములను మధ్య మధ్య గుర్తించుచు కవిత్వము చెప్పుట)

 

46 మ్లేచ్ఛితక వికల్పములు (సాధుశబ్దమును గూడ అక్షర వ్యత్యయము చేసి అసాధువని భ్రమింపజేయుట)

 

47 దేశభాషా విజ్ఞానము (బహుదేశ భాషలను నేర్చియుండుట)

 

48 పుష్పశకటిక (పూలతో రథము, పల్లకి మొదలగునవి కట్టుట)

 

49 నిమిత్త జ్ఞానము (శుభాశుభ శకునములను తెలిసియుండుట)

 

50 యంత్ర మాతృక (యంత్ర నిర్మాణాదులు)

 

51 ధారణ మాతృక (ఏకసంధా గ్రహణము)

 

52 సంపాఠ్యము (ఒకడు చదువుచుండగా

పలువురు వానిననుసరించి వల్లించుట)

 

53 మానసీక్రియ (మనస్సుయొక్క అవధానమునకు సంబంధించిన క్రియ)

 

54 కావ్యక్రియ (కావ్యములను రచించుట)

 

55 అభిధాన కోశచ్ఛందో విజ్ఞానము (నిఘంటువులు, ఛందోగ్రంథములు-వీని పరిజ్ఞానము)

 

56 క్రియాకల్పము (కావ్యాలంకార శాస్త్ర పరిజ్ఞానము)

 

57 ఛలితక యోగములు (మాఱువేషములతో నింకొక వ్యక్తివలె చలామణి యగుట)

58 ద్యూతవిశేషములు (వస్త్రములను మాయము చేయుట మొదలగు పనులు)

 

59 ద్యూతవిశేషములు (జూదమునందలి విశేషములను తెలిసికొని యుండుట)

 

60 ఆకర్షక్రీడలు (జూదములందలి భేదములు)

 

61 బాలక్రీడనకములు (పిల్లల ఆటలు)

 

62 వైనయిక జ్ఞానము (గజ అశ్వ-శాస్త్ర పరిజ్ఞానము)

 

63 వైజయిక విద్యలు (విజయసాధనోపాయములను తెలిసియుండుట)

 

64 వ్యాయామిక జ్ఞానము (వ్యాయామపరిజ్ఞానము)

 

పై అరవైనాలుగిట్లో సంపుటంలో చిత్రలేఖనం గురించి ముచ్చటించుకుందాం

 

చిత్రాన్ని చిత్రించడమే చిత్రలేఖనం

 

ఒక వస్తువును, ఒక మనిషిని, ఒక ప్రాణిని ఉన్నది ఉన్నట్టుగా బొమ్మ చేయటం చిత్రమే కదా?

 

చిత్రమే, బొమ్మే చిత్రలేఖనానికి ఒక ఆయువుపట్టు

 

అసలు ఆయువుపట్టు కళాకారుడే అయినా, అతనికి సాయంగా ఉపకరణాలు కావలసి వస్తవి

అలాటి ఉపకరణాలలో చిత్రలేఖిని, కిత్తనార గుడ్డ, రంగులు ముఖ్యమైనవి

 

అయితే చిత్రలేఖనం మొదటి రోజుల్లో వీటన్నిటి అవసరం ఉండేది కాదు

 

రాతి మనుషులు గుహల్లో బొమ్మలు వేసినపుడు వారికి ఉపకరణాలు - చేతులు, కాసింత జంతు రక్తమో, మట్టో, బురదో - అంతే!

 

తర్వాత తర్వాత నెమ్మదిగా నాగరికత పెంచుకొన్న కొద్దీ ఉపకరణాలూ పెరిగినాయి

 

చిత్రాలలో నాజూకుతనమూ పెరిగింది

 

కళాకారులూ నాజూకుతనం పెంచుకున్నారు

నాజూకు అంటే ఏమిటి ?

 

సున్నితమైనది, నాణ్యమైనది అని

 

అలా కళాకారుల వలన చిత్రలేఖనం నాజూకుతనం సంతరించుకున్నది

 

తరువాత ఆధునికత్వం వచ్చి చేరింది

 

ఆధునికత్వం అనగా సద్యఃకాల సంబంధమయినది

 

ఈరోజటికి ఏది ఎట్లా ఉన్నదో అట్లాగే చూపించటం, ఉన్నదానిని కొత్తగా చూపించటం, పాతవాటికి కొత్తహంగులు అద్దటం లాటిది అన్నమాట

 

ఆధునికత్వమైన, పురాతనమైనా ప్రక్రియ ఒకటే

 

ఆనందాద్ధ్యేవ ల్విమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతి, ఆనందం ప్రయంత్యభిశం విశంతీతి అని తైత్తిరీయోపనిషత్ చెప్పినట్లుగా - సకల కళలు ఆనందం నుండి పుట్టి, ఆనందంలో జీవించి, ఆనందంలోనే మరణిస్తాయి

 

చిత్రలేఖనమూ అందుకు అతీతం కాదు

 

కొన్నిసార్లు కళలో బాధ ఉద్భవించవచ్చు, కళ బాధ నుండి ఉద్భవించవచ్చు - కానీ అది చివరకు ఆనందానికే దారి తీస్తుంది

 

చిత్రకళాకారుడికి హస్తవశీకరణం, చేతి నేర్పు ఉండవలసిందే

వశీకరణం పుట్టుకతో రావొచ్చును

 

చేతి నేర్పు అభ్యాసం వల్ల రావొచ్చును

 

నేర్పు వల్ల రమణీయ చిత్రాలకు సౌందర్య సంపత్తి అలవడుతుంది

 

అలాటి నేర్పు వల్లే మానవ ప్రయోజనం సమకూరుతుంది

 

అలా నేర్పుతో ఉద్భవించిన చిత్ర కళవల్ల ప్రపంచానికి వాక్ససందేశాల అవసరం తప్పిపోతుంది