Saturday, December 31, 2011

శ్రీశ్రీ గారి సాయంతో రా.నా లను కుమ్మేసిన ఆరుద్ర !!

అసలు సంగతికెళ్ళేముందు ఓ మాట  -

శ్రీ శ్రీ గారి ఈ క్రింది రచన బుర్రలో పదిలం చేసుకుని ఉన్నవారు ఉత్తమోత్తములు, చేసుకోవాలనుకున్నవారు మధ్యమోత్తములు, తెలిసి మర్చిపోయినవారు అధమోత్తములు, తెలియనివారు మూర్ఖనీచాధమోత్తములు అని ఒకాయన నాతో అంటూ ఉండేవాడు.....

కరకట్టు మాష్టారూ, ఎంతటి సత్యం చెప్పారు అని అనకుండా ఇంకేమన్నా అంటే ఎటుపోయి ఎటు వస్తుందో అని , ఆ చివరి ఉత్తముల మీద జాలి కలిగినా - "అవునని" నేనూ అంటుండేవాడిని.....

ఇప్పుడు అవకాశం దొరికింది కదాని ఆ చివరాఖరి "ఉత్తముల" కోసం పాఠం ఇస్తున్నా..చదువుకుని తరించండి....

**********************

Snows Of Yesteryear

-- Sri Sri

చక్రవర్తి అశోకుడెక్కడ?
జగద్గురు శంకరుండెక్కడ?
ఏవితల్లీ నిరుడు కురిసిన
హిమసమూహములు?

కాళిదాస మహా కవీంద్రుని
గాన వాహినిలో కరంగిన
ఉజ్జయిని నేడెక్కడమ్మా
ఉంది చూపించు

షాజహాన్ అంతఃపురంలో
షట్పదీ శింజానమెక్కడ
ఝాన్సిలక్ష్మీదేవి ఎక్కిన
సైంధవం నేడేది తల్లీ

రుద్రమాంబా భద్రకాళీ
రోచనోజ్జ్వల రోచులేవీ
ఖడ్గ తిక్కన కదనకాహళ
కహకహధ్వను లెక్కడమ్మా

ఎక్కడమ్మా కృష్ణరాయని
బాహుజాగ్రద్బాడబాగ్నులు
బాలచంద్రుని బ్రహ్మనాయని
ప్రాణవాయువు లేవితల్లీ

చక్రవర్తులు జగద్గురువులు
సత్కవీశులు సైన్యనాధులు
మానవతులగు మహారాజ్ఞులు
కాన రారేమీ?

పసిడిరెక్కలు విసిరికాలం
పారిపోయిన జాడలేవీ
ఏవితల్లీ నిరుడుకురిసిన
హిమ సమూహములు?

**********************

సరే అక్కడికాపేస్తే, ఇప్పుడు శ్రీ శ్రీ గారి అదే రచనను వాడుకుని, అనగా పేరడీ చేస్తూ  ఆరుద్ర గారు రాసిన  విరుపు చూడండి....... ఇది 1955 ఎన్నికల్లో ఓడిపోయి తప్పుకున్నవాళ్ళని ఎద్దేవా చేస్తూ రాసిందని సాహితీ రంగంలో మాట...

**********************

గతజల సేతు బంధనం

ప్రదేశపతి సంజీవుడెక్కడ?
కళా వేంకట రాయడెక్కడ?
ఏవి తల్లీ నిరుడు మండిన
ఎండు తాటాకుల్?

మంత్రివర్యుని బంధువర్గపు
యంత్రశాల తయారుచేసే
నూనెడబ్బా లేవి తల్లీ
నువ్వు చూపించు

అసెంబ్లీ దర్బారులో మన
ఆకు పచ్చని సీటులేవీ?
అల్లూరి సత్యం బొమ్మరింట్లో
ఆడి విడిచిన పిడతలేవీ?

దుర్గబాయీ భర్గురాణీ
భీకరానన స్పీకరేదీ?
లోకైక లీడరు రైతు రంగా
బూకరింపుల బాకులెక్కడ?

ఎక్కడమ్మా ఆంధ్ర కేసరి
జూలుజాగ్రద్ధూళీ దుమ్ములు
చంద్రమౌళీ సాంబమూర్తీ
కేంద్రి తిరుమల రాయలేరీ?

కరోడా కాకాని, అగ్గి
బరాటా మరుపిళ్ళ చిట్టి
కాలు గాలిన పిల్లు లిప్పుడు
కానరారేమీ?

ఎన్నికల నోరును తెరచికాలం
ఎందరిని కబళించెనమ్మా?
ఏడతల్లీ నిరుడుకురిసిన
వడగళ్ళ గడబిడలు?
**********************


భవదీయుడు
మాగంటి వంశీ మోహన్  


PS: 1952 February - తెలుగు స్వతంత్ర పత్రిక నుండి 

0 comments:

Post a Comment

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.