Thursday, March 24, 2011

జిమ్ములందు తెలుగు వారి జిమ్ములు వేరయా!

జిమ్ములందు తెలుగు వారి జిమ్ములు వేరయా!

గత ఆరేళ్ల నుంచి మా కాంప్లెక్సులో చుట్టుపక్కల "తెలుగువాళ్ళు" లేక ఎంతో ప్రశాంతంగా వుండేది జీవితం. ఐతే మావాడికి ఖాళీలు ఎక్కువైపోయి ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు రెంటు ధరలు మార్చి ఒకటవ తారీకు నుంచి ఏకంగా నాలుగువందలు తగ్గించడంతో అప్పటిదాకా ఆ నాలుగువందల తక్కువ రెంటుతో అక్కడెక్కడో ఇతర కాంప్లెక్సుల్లో జీవితం గడుపుతున్నవాళ్లు పొలోమని నల్ల గొర్రెల మందలా బే...బే....అని అరుచుకుంటూ ఇందులోకి దిగిపోయారు.

ఏ మాటకామాటే - మా కాలనీ, కాంప్లెక్సు ఎంతో ప్రశాంతంగా, బ్రహ్మాండంగా, కన్నులకింపుగా, ప్రకృతి సౌందర్యానికి దగ్గరగా ఉంటాయి. దేశీ జనాభా ఒకరో ఇద్దరో. అసలందుకే, అనగా దేశీ జనాభా తక్కువున్నారనే డబ్బులెక్కువైనా, దేశీ జనాభాతో ఇంతకుముందు ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాన్ని గుర్తు పెట్టుకుని ఆరేళ్ళ క్రితం అందులో సెటిలు అయ్యింది. పైగా స్కూలు డిస్ట్రిక్టు చాలా మంచిది.

సరే బాబూ సరే, అక్కడికాపేసి - గొర్రెలు దిగితే మీక్కలిగిన కష్టమేమిటో చెబుతే సంతోషిస్తాం.....

అడిగారూ? అనుకుంటూనే ఉన్నా.....ఏమని చెప్పేది?

ఏం చెబుదామని మొదలుపెట్టావు?

సరే అడిగారు కాబట్టి ఈ రోజుకి జిమ్ము సంగతులతో సశేషం చేసి......మిగిలిన విషయాలు ధారావాహికగా ప్రచురిస్తా!

క్లబ్బు హవుసు లాటిదానిలో జిమ్ము, సౌనా, రాకెట్ బాల్ కోర్టు, బాస్కెట్టు బాలు కోర్టు, టెన్నిసు కోర్టు లాటివి ఉన్నాయని ఊహించుకోండి. మీకు ఊహ అయినా అవి మాకు నిజంగానే క్లబ్బుహవుసులో అందుబాటులో ఉన్నాయి కాబట్టి, వాటిల్లో మేము ఉపయోగించేది - జిమ్ము, రాకెట్ బాల్ కోర్టు. అందుబాటులో ఉన్నాయి కాబట్టి జిమ్ముని వారంలో నాలుగు రోజులు సందర్శిస్తూ ఉంటామన్నమాట.

ఈ వయసులో నీకు జిమ్ము ఎందుకు? కండలు పెంచటానికా?

ఈ వయసులో కండలేం పెరుగుతాయి కానీ, ఉన్నవి జారకుండా ఉంటే చాలని - ట్రెడ్డు మిల్లుల మీద పందెపు పరుగులు, నేల మీద బస్కీలు, బెంచీల మీద డంబ్ బెల్లులు కొద్దిగా ఇరగ అన్నమాట.

అవి ఇరగా? మీరు ఇరగా?

అల్లా అడిగితే ఏం చెబుతాం?

ఇంతకీ జిమ్ములో ఏమయ్యింది?

చెప్పాగా? పరమ చిరాగ్గా బోల్డు జనాభా పోగయ్యిందని. పోగవ్వటం, ప్రణాలిక వేసుకుని, ఓ పద్ధతి ప్రకారం ఇతరుల శాంతి నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకుని ఆ జనాభాలో నుంచి ఆడ జనాభా పిల్లా పీచుతో కలిసి పొలోమంటూ జిమ్ము మీద పడ్డారని ఇక్కడి లోకలు న్యూస్ ఛానలు, పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ టి.వి.స్టేషను కె.వి.ఐ.ఇ లో వార్త. రాకెటు బాలు కోర్టును కూడా రోజూ ఇరగ్గొట్టేస్తున్నారని వార్త వినపడింది తెల్ల తోళ్ల నుంచి.

ఖర్మం కాలో, అదృష్టం కొద్దో నిన్న నేనెళ్ళిన సమయంలోనే ఈ మంద అంతా డోర్లు బద్దలు కొట్టుకుని ప్రవేశించారు. సరిగ్గా 13 మంది. ఆరుగురు ఆడోళ్లు, ఏడుగురు పిల్లలు. పిల్లల డ్రస్సుల కంటే ఛండాలంగా వేసుకుని పెద్దవాళ్లు. పిల్లలకేసినవి పైకి పోయినా కొద్దిగా సద్దుకుపోవచ్చు, చిన్న పిల్లలు కాబట్టి. పెద్దవాళ్ళకు బట్టలు పైకి పోతే ఎంత చిరాగ్గా అసహ్యంగా ఉంటుందో వివరించనక్ఖరలేదుగా?

ఆరుగురు పెద్దవారిలో ఐదుగురు - అనకూడదూ, సభ్యతా కాదూ - కానీ, నిన్న నన్ను పెట్టిన బాధలకు, అంటే ఫరవాలేదేమో అని ధైర్యం చేసి అనేస్తున్నా.....ఎవరైనా నొచ్చుకుంటే .........నా బాధ్యత లేదని తెలియచేసుకుంటున్నా ...బాధ్యత ఉందని అనుకుంటే మటుకు క్షమించెయ్యొచ్చు... :)  ----శూర్పణఖకు తక్కువ, హిడింబికి ఎక్కువ లాగున్నారు...దానికి తగ్గట్టు జిమ్మనగానే గజ్జల్లోకి పోయిన లాగూలు, జబ్బలు కత్తిరించిన టీ.షర్టులు వేసుకుని వచ్చారు - నారాయణ నారాయణ...రామ రామ.....పైనుంచి నల్ల కళ్లద్దాలు, ఎందుకో భగవంతుడికి తెలియాలె - ఐఫోనులు, సంగీతం వినటానికి ఐపాడులు ఫరవాలేదనుకుందాం. ఒకావిడ కొద్దిగా ఫరవాలా......కానీ దారుణమే అని చెప్పాలే....చిన్నదారుణం.....


చేసే అరగంట విన్యాసాలకు ఇంత ఆర్భాటం అవసరమా అన్న ప్రశ్న ఎక్కడో ఓ మూల పొడసూపింది కానీ ఏదో పిశాచం నోరు నొక్కేసింది.


ఏమిటి? నువ్వు చెప్పేదంతా నమ్మదగ్గదిగా లేదబ్బాయ్.... అసలు ఎవరైనా అంత భారీగా ఉంటారా? పైగా అరగంట కోసం అంటావేమిటీ? అంత భారీగా ఉంటే అరగంటేం సరిపోతుంది జిమ్ములో?


ఓ నమ్మదగ్గదిగా లేదా? ఐతే ఓ సారి అల్లా తూర్పు దిరిగి దణ్ణం పెట్టు, వంగో...లే...వంగో...లే.... ఈశాన్య మూలకు తిరుగు సూటిగా అలా చూడు...వంగో...లే....అప్పుడు ఐమూలగా సుబాహు మారీచులు కనపడతారు...వారిని పక్కకు పిలిచి ఇప్పుడు నన్నేసిన పెశ్నలు అడుగు....బారుబద్దలు చేసి, తీసి చక్కగా తాడిచెట్టు మీదకెక్కించి తాపు తన్ని చెబుతారు..... అవును అరగంటేం సరిపోతుంది ? బేతాళుడిలా అడిగావే? కానీ నేను విక్రమార్కుడిని కాదన్న సంగతి నీకు తెలియాలి ఈపాటికి...తెలియకపోతే పోయి ఎవరిచేతన్నా తద్దినం పెట్టించుకో !


ఇహ పిల్లలు అంతా రాకెటు బాలు కోర్టులో కింద కూర్చున్నారు......ఆ ఆరుగురిలో కొద్దిగా డీసెంటుగా ఉన్నావిడ ఓ కర్ర పుచ్చుకుంది. ఎందుకో తెలియలా.....మొగుడి తోలు చీరి ఫ్రెష్షుగా వెంట తెచ్చుకుందేమో అనుకున్నా....రాకెటు బాలు కోర్టులో దూరింది. కింద కూర్చుంది కష్టపడి. కర్ర కోర్టు చెక్క నేల మీద కొట్టి, పుస్తకాలు తియ్యండి అన్నది. పిల్లల హోమువర్కు పుస్తకాలు జిమ్ములోకెందుకు? అంత టీచరులా సేవ చెయ్యాలనుకుంటే రాకెటు బాలు కోర్టులో ఎందుకు అన్నది శేష ప్రశ్నగానే మిగిలిపోతుందని నా ఘాట్టి నమ్మకం


ఇహ రాకెటు బాల్ కోర్టునొదిలి జిమ్ములోకొస్తే, అక్కడ మిగిలిన ఐదుగురిలో ఇద్దరు రెండు ట్రెడ్డు మిల్లుల మీదకెక్కారు. మిగిలిన ముగ్గురినీ ఓరగా చూసి కిసుక్కుమన్నారు. దేనికో తెలియలా? ఆ మిగిలిన ముగ్గురిలో ఒకావిడ సైకిలెక్కి మిగిలిన నలుగురి వంక చూసి కిసుక్కు. ఎందుకో - అదీ తెలియలా....మిగిలిన ఇద్దరిలో ఇద్దరూ చెరో ఎలిప్టికల్ ఎక్కి మిగిలిన ముగ్గురి వంక చూసి కిసుక్కు. మళ్లీ ఎందుకో తెలియలా!

ట్రెడ్డు మిల్లు మీదకెక్కిన ఇద్దరు, మిల్లు స్టార్టు చేసి పరుగు మొదలుపెట్టారు. డబ డబ శబ్దాలు....మరి ట్రెడ్డు మిల్లు శబ్దమో, లేక భారీకాయుల శబ్దమో అర్థం కాలా కానీ రెండు నిముషాలయ్యేటప్పటికి ఆగిపోయింది.

ఏమిటీ? మిల్లా? పరుగా?

పరుగు నాయనా... పరుగు .....వెనువెంటనే రొప్పుల శబ్దాలు, హుష్షో శబ్దాలు వినపడ్డాయి.....అవి మిల్లు శబ్దంతో కలిసిపోయి అదో వింత అనుభూతి...ఏమని చెప్పను ఆ నా కర్ణాల భాగ్యం?

ఏమిటి రెండు నిముషాలకే రొప్పులా? ఇంతకీ రొప్పులన్నావా? నొప్పులన్నావా?

రొప్పులు, రొప్పులు - రకారం రొప్పులు ....అవును రెండే నిముషాలు....

సైకిలెక్కినావిడ నల్ల కళ్లద్దాలు కొద్దిగా కిందకు దించి రొప్పుల వాళ్లను చూసి కిసుక్కు.

ఓ నవ్వావులే, ఆ సైకిలు పని చూడమ్మా అని ట్రెడ్డుమిల్లు బృందంలోని ఒకావిడ కామెంటు.

మిగిలిన నలుగురు కిసుక్కు.

రెండు నిముషాలు దాటి మూడో నిముషంలోకి అడుగు పెట్టటం - మిల్లు ఆపటం ఒకేసారి జరిగినాయి. ట్రెడ్డు మిల్లు బృందం నీళ్ళ బావి దగ్గరికి పరుగు....నీళ్ల బావా? అదే వాటరు కూలరు నాయనా! ప్లాస్టిక్కు కవర్లలో చుట్టబడిన ప్లాటిక్కు గ్లాసుల కవర్లు పర పర చించి, చల్లని నీళ్ళు పట్టి గట గట చెరో రెండు గ్లాసులు తాగి పారేసారు ఇద్దరూ.

ఏమిటి? రెండు నిముషాలకు రెండు గ్లాసుల చల్ల నీళ్ళా? మరి పావుగంట పరుగెత్తితే వాటరు కూలరు ఏమైపోతుందోనని నాకే భయంగా ఉందన్నయ్యా! తర్వాత ఏమయ్యింది?

ఏమయ్యిందా? ఉన్న రెండు బెంచీల మీద ఆక్రమణ పర్వం, ఆ తర్వాత ఆశీనం.

ఇహ సైకిలెక్కినావిడకు సుర్రున కాలిందేమో, సరా సరా తొక్కటం మొదలు పెట్టింది. అది చూసి ఎలిప్టికల్ వాళ్ళు కిసుక్కు. వీళ్ళందరినీ చూసి నాకు దడ. ఏమిటో ఎక్కడికి దారితీస్తుందోనని. ఇంతలో మైక్ జాన్సన్ వచ్చాడు...

ఆయనెవరు?

ఆఫ్రికన్ అమెరికనుడు...జిమ్ము స్నేహితుడు...నేను ఏ రోజుల్లో జిమ్ముకు వెళతానో, టైములో వెళతానో దాదాపు అదే రోజుల్లో, అదే సమయంలో వస్తూ ఉంటాడు. అందువల్ల కొద్దిగా స్నేహం. మనిషి యమా దిట్టంగా ఉంటాడు. ఒంటినిండా కండలే. షేక్ హాండు ఇచ్చాడంటే ఓ పేద్ద ఇనప స్తంభం మన చెయ్యిని ఊపినట్టే. అలా తలుపు తీసి నా వంక చూసి "హే బడ్డీ" అని - కళ్ళు అలా ఆడోళ్ళ వైపు తిప్పి, మళ్ళి నా వైపు తిరిగి కన్ను కొట్టి "దిస్ ఈస్ అన్ యూజువల్లి క్రౌడెడ్...జీజ్!" అని ఎస్.వీ.రంగారావు గారి టైపులో పెద్దగా నవ్వాడు....

వేసుకున్న జాకెట్టు విప్పి పక్కనే ఉన్న బారు బస్కీల యంత్రం మీదికెక్కాడు. అలాగ్గా ఓ ఇరవై బస్కీలు తీసి ఉఫ్ఫ్ అని కూడా అనకుండా దిగేసి 50 పౌండ్ల డంబ్ బెల్లులు పుచ్చుకుని నా పక్కకొచ్చాడు.
 
ఇంతకీ నువ్వేం చేస్తున్నావు బాబూ ఇంతసేపు? ఆ హిడింబి వేషాలు చూడటం కాకుండా

అప్పటికే మిల్లు మీద నా పరుగులు కోటా అయిపోటంతో, ఈ గొర్రె జనాభా వచ్చేప్పటికి - నేను అటువైపునున్న రోయింగ్ యంత్రం మీద ఉన్నా....

సరే ఇంతలోపల సైకిలు సుందరి కాళ్ళు లాగినట్టున్నాయి.....ఆపి ఆపసోపాలు పడుతోంది....ఆపసోపాలు పడుతూండగానే For a Few Dollars More సినిమా ఈల పాట - అదేనండీ థీం సాంగ్ మోగింది....ఆవిడ పర్సు అక్కడెక్కడో మూలకు ఉన్నది....ఈ భారీ కాయాన్ని సైకిలు మీద నుంచి దింపి పర్సు వైపు పరిగెత్తేలోగా ఈల ఆగింది. ఈల ఆగటం, మిగిలిన నలుగురూ మళ్ళీ కిసుక్కు. ఏమిటో ఈ కిసుక్కుల గోల నాయనో! ఎలాగూ ఆగింది కదాని సైకిలు కూలర్ మీద పడింది...

ఏంటీ ? సైకిలు కూలర్ మీద పడిందా? ఎలా?

ఓరి కుంకన్నర కుంకా...సైకిలు సుందరి మంచి నీళ్ళ కోసం వాటర్ కూలర్ మీద పడింది...

ఓహో! అదా! ఇంకా ఏమిటో అనుకున్నా...

సరే సైకిలు ఏకంగా మూడు గలాసులు తాగి మిల్లు సుందరిల రికార్డు బీటు చేసింది....

పాపం కూలర్ అని జాలిగా చూసా....అదీ నా వంక మరింత జాలిగా చూసింది....

ఇంతలో మిల్లు సుందరిలలో ఒకావిడకు ఫోను...అదేదో అర్థం కాని రింగుటోనులో....వచ్చిందిగా, సరే ఎత్తారు....ఎత్తి నేను జిమ్ములో ఉన్నానండి, మెయిలు తీసుకుని ఇక్కడికే వచ్చెయ్యండి అని ఫోను పెట్టేసింది....

వాళ్ళ ఆయన వస్తున్నాడనగానే ఎలిప్టికలు సుందరిల జంటలో కలకలం. ఎందుకో మరి నాకైతే తెలీదు....

ఓ రెండు నిముషాలయ్యింది...ఇంతలో సదరు మొగుడు గారు ప్రత్యక్షం....ఓ సారి జిమ్మంతా స్కానింగు...నా వంక చూసి నవ్వింగు...నేనూ ప్రతి నవ్వింగు....

ఆయన అలా లోపలకు రాగానే, ఎలిప్టికలు అప్పటిదాకా కొద్దిగా సవుండూ చేస్తున్నవి కాస్తా, వీర లెవిల్లో సవుండు చెయ్యటం మొదలెట్టాయి....చూద్దును కదా ఏనుగులు చెరుకుతోటలో పడి బీభత్సం చేస్తున్నంత ఇదిగా కాళ్ళతో తొక్కి పారేస్తున్నారు ఎలిప్టికలును....ఎందుకో భగవంతుడికి తెలియాలె.....

ఈలోపల ఆ వచ్చినాయన సరే తాళం ఇవ్వు అని "తాళం చెవి" ఆవిడ దగ్గరినుంచి తీసుకెళ్ళాడు. తాళం చెవిని తాళం  చేసిపారేసిన ఆయన తెలివికి జోహార్లు అర్పించేసి నా రోయింగు నేను చేసుకుంటున్నా...

ఆయన అటు వెళ్ళగానే చెరుకుతోట విధ్వంసం ఆగింది.....ఓరి భగవంతుడో అనుకుని - ఆయనకు , ఆ చెరుకుతోట విద్వంసానికి లంకె ఏమిటో అర్థం కాక రోయింగు ఆపేసా...చేతులూ నొప్పులు పుట్టటం ప్రారంభించినై - అందుకు కూడా అనుకోండి....సరేనని ఓ నిముషం విశ్రాంతి ఇద్దామని పక్కనున్న డంబ్ బెల్లు బెంచీ మీద కూర్చుని - జాన్సన్ ని "హౌ ఈస్ ద డే సో ఫార్" అని కదిల్చా.....Was better until I came here..geez! అని వెళ్ళి తలుపు ఒకటి తీసి, అది మళ్ళీ మూసుకోకుండా కిందనున్న డోర్ స్టాపరు పెట్టి వచ్చాడు...దేనికో అనుకున్నా....ఒక్క నిముషం తర్వాత అర్థం అయ్యింది....

మొత్తం జిమ్ము, చెరుకు తోట విధ్వంసానికి ఎంతలా వేడెక్కిపోయిందో, ఆ బయటి నుంచి వచ్చిన చల్ల గాలి తెలియచెప్పింది. ఫాన్లు తిరుగుతున్నాయి విపరీతమైన స్పీడుతో, అయినా అంతలా వేడెక్కిందంటే పాఠకులు అర్థం చేసుకోవచ్చు.
 
సైకిలు, మిల్లు కలిసి జాన్సన్ ను పైకీ కిందకీ చూసారు....అందులో ఒక నల్ల కళ్ళద్దాల గాంధారి జాన్సన్ ను చూసిందో లేదో నాకైతే తెలియలా కానీ, కొరకొరా చూసినట్టే అనిపించింది...

గోలంతా నడిచేటప్పటికి, అయ్యేటప్పటికి ఓ ఇరవై నిముషాలయ్యుంటుందని అనుకుంటున్నా....ఆశ్చర్యంగా ఎలిప్టికలు వారు కూలర్ మీద పడలా...దయ తలిచారేమో అని సరిపెట్టుకున్నా! ఠ.డా...అని జిమ్ము బ్యాగులోనుంచి మాజా బాయటకొచ్చింది....

ఛా! మాజా దొరుకుతుందా అక్కడ?

పప్పా! ఇక్కడి దేశీ బాజారుల్లో మాజా ఏమి ఖర్మ? ఏదన్నా దొరుకుతాయి. ఎక్స్పైరీ డేట్లు చూసుకుంటే తాగలేం కానీ..లేకపోతే కుడితి తాగినట్టు తాగుతు ఉంటారు మన వాళ్ళు...కుడితి అని ఎందుకన్నానో తెలియదు కానీ అచ్చంగా అలాగే గలాసుల్లో పోసేసుకుని ఎత్తిన గ్లాసు దించకుండా ఉప్ఫున ఊదేసారు మొత్తం బాటిలు....చిన్న బాటిలనుకునేవు సుబ్రహ్మణ్యం....నా తలకాయంత బారున ఉన్నది అది......

సరే మాజా తాగటం అయిపోయింది -  ఇహ విధ్వంసం అలసట నుంచి తేరుకున్నారేమో అనుకున్న నా ఊహ పటాపంచలు అయ్యింది. మిల్లు సుందరిలు బెంచీల మీద నుంచి లేవటం, భుజానికేసుకొచ్చిన జిమ్ము బ్యాగుల్లో నుంచి నెస్క్విక్ చాకొలేట్ మిల్కు కాన్లు బయటకొచ్చినై....ఇహ ఈ ఘటోత్కచ భోజన పర్వం చూడలేక అటు తిరిగా.

అటా? అంటే ఎటు?

డంబ్ బెల్లు బెంచీల వైపు.....వెళ్ళి 15 పవుండ్ల డంబు బెల్లులు తెచ్చుకుని నా పని నేను మొదలుపెట్టుకున్నా...

ఇంతలో హాహాకారాలు, కేకలు, అరుపులు వినపడ్డాయి....

అన్నీ ఒకేసారి వినపడ్డాయా? నమ్మశక్యంగా లేదు...

యెహ్హా విను.....ఎదవ కామెంట్లు ఆపి....ఏమిటయ్యిందోనని వెనక్కి తిరిగి చూసా......

సైకిలు సుందరి విరామం నుంచి లేచి ఎలిప్టికలు ఎక్కుతూ కాలు జారింది....పడబోయింది....మొత్తానికి ఎలాగో ఏదో దొరకబుచ్చుకుని ఆగింది.....అందుకు - ఆ
హాహాకారాలు, కేకలు, అరుపులు

మైక్ జాన్సన్ - Are you alright? అని అడిగి, ఎప్పటినుంచి ఉగ్గబట్టుకుంటున్నాడో తెలీదు కానీ, ఇహ ఆపుకోలేక, సహనం నశించిపోయి  Can you guys keep it low please. It's getting loud in here అని అటు తిరిగి డంబ్ బెల్లుల గోలలో పడిపోయాడు.


ఇంతలో బిల బిల మని పిల్లలంతా రాకెటు బాలు కోర్టు లోనుంచి బయటకొచ్చారు, అరుచుకుంటూ.....

హుష్ హుష్... అని ఆ పర్వతాలు అంటున్నారు కానీ, పిల్లలుగా - ఎక్కడ ఆగుతారు? పైగా హోం వర్కు శిక్ష నుంచి స్వతంత్రం లభించిందేమో, ఇహ పట్టపగ్గాలు లేవు...

ఇహ చిరాకు దొబ్బి, డంబ్ బెల్లులు అక్కడ పారదొబ్బి - జాన్సన్ కి బై చెప్పి సరాసరి కాంప్లెక్సు ఆఫీసులోకి వెళ్ళి - జిమ్ములో వీళ్ళంతా కలిసి వెధవ గోల చేస్తున్నారు అని చెప్పా, హోము వర్కు సంగతీ "కేటీ"కి చెప్పా....ఆవిడ Ok I will take care of it అని అటు జిమ్ములోకి, నేను ఇంటివైపుకి....

ఆ తర్వాత ఏమయ్యిందో తెలియదు.....మళ్ళీ శుక్రవారమ్ జిమ్ముకు వెళ్ళినప్పుడు చూడాలి పరిస్థితి....




 

16 comments:

  1. #మిల్లు సుందరిలు, సైకిలు సుందరిలు, ఎలిప్టికలు సుందరిలు
    లొల్ :).. చూస్తుంటే మీరు ఆడవారి వ్యాయామశాలకి వెళ్ళినట్లు నాకు గట్టి హనుమానంగా ఉంది ;-) హమ్మా!

    భలే సరదాగా రాసారు. మీరూ ఒక మూడునెలలు వరసగా వ్యాయామ౦ చేస్తే మీకూ చెరుకుతోట..గజధ్వన్సిణులూ స్వాగతం ఇస్తాయి ;-)

    ReplyDelete
  2. ఇదన్యాయం సారూ, మరీ ఇంత ఘోరంగా నవ్విస్తారా.
     
    అన్నట్టు నేను కూడా ఈ దేశీల బాధితుడినే :(

    ReplyDelete
  3. ఏనుగులు చెరుకుతోటలో పడి బీభత్సం చేస్తున్నంత ఇదిగా కాళ్ళతో తొక్కి పారేస్తున్నారు .....

    ఫక్కుమనకుండా ఉండలేకపోయా.ఇంకా నయం ఈసారి నుంచీ మీకు ఆ డంబెల్లులు తప్పితే ఇంకేమీ దొరకవు. చాలా పాట్లే పడ్డాము.aerobics class lo సన్నగా చిన్నగా ఉన్నవాళ్ళుకూడా కర్చీఫ్ వేసినట్లుగా స్తెప్పర్లు వేసికుని కూర్చునేవారు. ఉన్న 12 స్టెప్పర్లూ ఐపొతే వెనక వచ్చినవాళ్ళు చేతులు కట్టుకోవాలిసివచ్చేది. ఆ రకంగా టిన్నులూ, మాజలు తాగి ఇంకాసిని కాలరీలు పెంచడం తప్ప కరిగించింది ఏముంది?

    ReplyDelete
  4. @రాజేష్ - నేను గత మూడున్నరేళ్ళుగా వెడుతున్నా జిమ్ముకు....మూడు నెలలేం ఖర్మ! అయినా ధ్వన్సిణులు, తోటలు విషయంలో మీరన్నది నాకర్థం కాలా! స్వాగతం ఇవ్వటం ఏమిటి? వివరం తెలియచెయ్యండి - లేకుంటే జిమ్ములో వాటరు కూలరు మీకు పార్సిలు పంపిస్తా...దాని జాడ కనుక్కోటానికి పర్వతాలు బయల్దేరతాయి! ఇహ ఆఖరే!

    @భరద్వాజ్ - అన్యాయం అయిపోయింది నేను, నాతో పాటు మా జిమ్ము, మా కాంప్లెక్సు, జిమ్ములో కూలరు, మైకు జాన్సను, మిల్లులు, సైకిలు, ఎలిప్టికలు.... ఇవీ అన్యాయం అయిపోయిన కొన్ని జీవాల లిష్టు.......పరిస్థితులు ఇలాగే సాగితే త్వరలో కొత్త ఇంట్లోకి మారాల్సి వచ్చేట్టు ఉన్నది...

    @ సునీత - :)

    ReplyDelete
  5. హలో వంశీ,
    ఈ రోజు లంచ్ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటే, మీ బ్లాగ్ చదివాను. అయ్యబాబోయ్, విరగదీసారు కదా, నవ్వకుండా ఉండలేకపోయాను. నిజానికి ఆ పరిస్థితిలో మిమ్మల్ని ఊహించుకుంటే ఇంకా నవ్వు ఆగలేదు. పనిలో పనిగా మన వాళ్ళ గురించి కూడ ఒకసారి దున్నేయండి :)

    లంచ్ పక్కన పెట్టి అది చదివేసరికి, లంచ్‌కి అరగంట లేటు. :). చాలాబాగుంది కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు.

    ReplyDelete
  6. వంశీ గారూ,
    బాబోయ్, చదివి చుట్టుపక్కల చూసుకోకుండా విరగబడి నవ్వాను.
    మీరు చెప్పిన దాంట్లో ఏది కాదన్న అది అబద్ధమే అవుతుంది. ఒక్కోసారి మన దేశీలు చేసే విన్యాసాలు చూస్తుంటే, మనకే సిగ్గు వేస్తుంది. :-))
    రాజేష్, చెరుకు తోటలు, గజధ్వన్సిణులూ స్వాగతాలు ... అర్ధమయింది . :-))

    ReplyDelete
  7. @ రమేశ్ - లంచు టైము దాటించినందుకు సంతోషం.. :) వీలు కుదిరినప్పుడు "మనవాళ్ళు" అనగా వివరించుడు...

    @ పద్మవల్లి - ఎగ్గేమి సిగ్గేమి? అర్థమైనదేమి?

    ReplyDelete
  8. నాక్కూడా చెరుకు తోటలు, ఏనుగులు, విధ్వంసాలు నచ్చాయి.

    ReplyDelete
  9. భలే నవ్వించారండీ..బావున్నాయి మీ జిమ్ములోని విధ్వంసాల జిమ్మిక్కులు ..:)

    ReplyDelete
  10. పాపం వంశీగారికి ఎన్ని కష్టాలో!!!
    అనగ అనగ రాగమతిశయిల్లు
    కనగ కనగ జిమ్ము భేషుగుండు...
    ఇలా సర్దుకుపోండి. ఇంతోటిదానికి ఇల్లు మారాలనే తీవ్రనిర్ణయం తీసుకోకండి...:))

    ReplyDelete
  11. ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలంటారు? ఇర్వింగ్ లో ఉన్నపుడు (అపార్ట్ మెంట్స్ పేరొద్దులే) స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఒక పదిహేనుమంది మన లేడీసు వచ్చి కాళ్ళు పూల్లో వేలాడేసి నీళ్ళు చిందిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఈతేమో రాదు. స్విమ్మింగ్ కోసం వచ్చిన వాళ్ళకి ఎంత ఇబ్బందో కదా! అదేమిటంటే స్విమ్మింగ్ చేస్తే మాత్రం నీళ్ళలో కాళ్ళు పెట్టమా అని వెకిలి ప్రశ్నలు


    ఇలాంటి సందర్భాలు చాలా సిగ్గుపడేలా చేస్తాయి నిజంగా!

    చెరుకుతోట--ఏనుగులు...ఏమని చెప్పను ఇక్కడ నవ్వులు?

    ReplyDelete
  12. #నేను గత మూడున్నరేళ్ళుగా వెడుతున్నా జిమ్ముకు..గజధ్వన్సిణులు, తోటలు ..స్వాగతం

    హ్మ్.. అవునా వంశీగారు, అయితే ఎక్కడో ఏదో ప్రయత్నలోపం :)). ఏవంటారు పద్మగారు? ;)

    #జిమ్ములో వాటరు కూలరు..పర్వతాలు బయల్దేరతాయి

    పర్లేదండీ! ఆ పర్వతాలని సైతం చిద్ర౦గా చదును చేసి మరీ పంటలుపండించగల సర్వసత్తాక'రాజు'ని నేను. ఆనక అలసినప్పుడు అదే జిమ్ము వాటరు కూలరును వాడగలవాడను ;))


    చక్కని హాస్యాన్ని పంచిన మీకు మరొక్కసారి కృతజ్ఞతలు.

    ReplyDelete
  13. <>
    అదేనండి. మన వాళ్ళు చేసే పనులు. ఎక్కడ ఉన్నావాళ్ళు చేసే పనులు చూసి యెంత సిగ్గుపడేలా ఉంటుందో. మీరు చెప్పిన లాంటి జిమ్ముల దగ్గర, పిల్ల గేముల దగ్గర,ఆఖరికి ఆఫీసు జిమ్ములో కూడాను ఇంతే. ఇంకా ముఖ్యంగా, తెలుగేతరులు, దేశేతరులు (దేశీలు కాని వారు అని కవయత్రి భావం) ఉన్నప్పుడు ఎన్ని హింట్స్ ఇచ్చి మనం ఇంగ్లీష్లోనే మాట్లాడిన (ముఖ్యంగ వర్క్లో ) తెలుగ్లోనే పురాణాలు పురాణాలు చెప్పేవాళ్ళు. మీ మైక్ జాన్సన్ లాంటి వాళ్ళు మనవేపు చూసే చూపులు ..ఇంకా ఎన్నో.. ఈమధ్య చుట్టూ నాకు దేశీలు లేక కొంచెం అనుభవం తగ్గింది.

    అర్ధమైన్దేమి అంటే... అయినదేమో అయినది..
    రాజేష్ , మీరన్నాక నేనేమంటాను .. అంతే అంతే అంటాను.

    ReplyDelete
  14. @ సుజాత - చెయ్యగలిగేది ఏమీ లేదండి. కష్టం కూడానూ. అసలుగా ఇబ్బంది ఏమంటే - ఈ దేశానికి రాగానే మనం మనంగానే ఉంటే మంచిదేమో అన్న ఆలోచన సగంలో వదిలి, అమెరికనులు అయిపోదామని మిగతా సగం ఆలోచనను ఆచరణలో పెట్టటంతో వచ్చే తిప్పలు ఇవి...మనం మనంగానే ఉంటే మంచిది. అక్కడ లేని అవకాశం ఇక్కడ దొరికింది కదాని అనవసర ప్రయోగాలు చేసి అభాసు పాలవ్వటం బాధ కలిగించే విషయం. అందరూ అలా ఉంటారని కాదు కానీ 70 శాతం అలానే ఉంటారని మటుకు ఖచ్చితంగా చెప్పొచ్చునేమో!...

    @ జ్యోతి - అవును భేషు "గుండు" - గొరుక్కోటమే!

    @ తృష్ణ - :)

    @ ఇండియన్ మినర్వా - మీ పేరు చూడగానే హైదరాబాదులోని మినర్వా హోటలు గుర్తుకొచ్చింది....మీకు వారికి సంబంధమేమన్నా ఉన్నదా?

    ReplyDelete
  15. @Sujata,
    "ఇర్వింగ్ లో ఉన్నపుడు (అపార్ట్ మెంట్స్ పేరొద్దులే)"
    -----
    "గాంధీ" పార్క్ గురించి తెలియంది ఎవరికి చెప్పండి :)

    ReplyDelete
  16. "మనవాళ్ళు" గురించి కలిసినప్పుడు చెపుతాను లెండి :)

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.