Saturday, February 26, 2011

రేప్పొద్దున్నే మళ్లీ స్టోరేజికీ పరిగెత్తాలి! - ఈ చిన్నతపేలమ్మను దాచటానికి

ఉన్న ఇంట్లోనే ఏ డబ్బాలోనుంచి ఏ డబ్బాలోకి గోడ దూకినట్టు చలనం కలిగించుకుంటున్నాయో తెలియదు కానీ, ఈ వేళ చిన్న తపేలమ్మ దర్శనమిచ్చింది. దేనికోసమో వెతుకుతుంటే ఈవిడ దర్శనమిచ్చింది.

అసలు దేనికోసం వెతికావు?

లండన్ టి.వి.లో "డాక్టర్ హూ" ప్రోగ్రాములో సార్జంట్ బెంటన్ వేషం వేసి ఎంతో మంది అభిమానులను పొందిన జాన్ ఆంథోనీ బ్లేక్ / జాన్ లెవీన్ - ఓ తొమ్మిదేళ్ల క్రితం నాకు ఓ మొదటి ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరం కోసం వెతుకుతుంటే, అది దొరకలా కానీ ఈవిడ దర్శనమిచ్చింది. ఆయన గురించి, ఆ ప్రోగ్రాము గురించి తెలియాలంటే గూగులమ్మను కెలకండి...

నీకు ఆయన ఉత్తరం రాయటమేమిటి? 

నేను టల్సా, ఓక్లహోమాలో పనిచేస్తున్నప్పుడు, ఏదో టాక్ షో కోసం ఆయన టల్సా రావటం, విధి విచిత్రం వల్ల ఆయనకు నా బట్టలు ఓ రెండు జతలు ఇవ్వాల్సి వచ్చింది. కొత్తవే లెండి. రాల్ఫ్ లారెన్ పోలో షర్ట్లు ఓ రెండు, వాటితో పాటు ఓ రెండు పాంట్లు సాయం చేసి కొద్దిగా పుణ్యం మూట గట్టుకున్నా. ఆ పుణ్యమూ, సాయమూ - మొత్తం కథ అంతా చెప్పాలంటే నాలుగు వేదాలు చదివినంత అవుతుంది కాబట్టి  You are here by spared.

ఐతే ఆయన ఆ సంగతి, సాయం మర్చిపోకుండా సంవత్సరానికో ఉత్తరం రాసేవాడు. అలా ఓ ఐదేళ్లు రాసాక మానేశాడు. ఎందుకు? ఏమో? ఆ ఉత్తరాలు, ఆయన పంపిన ఫోటోలు మళ్లీ తర్వాత ఎప్పుడైనా! ఈవేళ ఆ ఉత్తరాల పని చూద్దాం అనుకుని మొదలుపెట్టిన పని ఈ బ్లాగు పోష్టుకు తేలిందండీ...

సరే చిన్న తపేలమ్మ ఉన్న బాక్సుని కదిలించా!

ఇవీ బయటపడ్డవి. - ఆనందోబ్రహ్మ!

యునైటెడ్ నేషన్స్ వారి ఫర్స్ట్ డే కవర్లు



సిగారు బాక్సులో ఒదిగిపోయిన మెక్సికో తపేలమ్మలు (ఈ డబ్బాలు ఎనిమిది కామోసు ఉన్నాయి!) ఐతే ఈ ఒక్క డబ్బా మీద బొమ్మే కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. మిగిలిన వాటి పరిస్థితి బాగోలా! 



చిన్న చిన్న కవర్లలో ఎప్పుడు పెట్టానో కూడా తెలీదు, లెక్కేస్తే ఓ మూడొందల చిన్న కవర్లు తేలాయి..అందులో కొన్ని మీకోసం :)





60, 70 వ దశకాల్లో అమెరికా వారి పోష్టు కార్డులు 



 ఈ ఫెడ్-ఎక్స్ కింకోస్ బాక్సు ఏమిటి నాయనా? స్టాంపులే బాబూ.....ఈ బాక్సు వల్ల క్రితం సారి ఇచ్చిన స్టాంపుల లెఖ్ఖ తప్పింది....అనగా నంబరు తప్పినది....ఈ బాక్సులో ఎన్నుంటాయో మీ ఊహకే!



 ఇహ ఇంతటితో శలవు నాయనా....రేప్పొద్దున్నే మళ్లీ స్టోరేజికీ పరిగెత్తాలి...ఈ చిన్న తపేలమ్మను దాచటానికి

భవదీయ

వంశీ 






5 comments:

  1. బాబుగారూ, మీరు టల్సా లో పని చేశారా? అది మా వూరండీ!మీరక్కడ ఎప్పుడు పని చేశారో?

    మెమోరియల్ రొడ్లో కొన్నాళ్ళుండి ఆణ్ణుంచి వింబుల్డన్ ప్లేసులోకెళ్ళి పడ్డాం!

    అది సరే మీకు రోజువారీ ఖర్చుల కంటే ఈ స్టోరేజీ అద్దెలకెక్కువ డబ్బులయ్యేట్టున్నాయేం?

    మీతో నాకు చా....లా పనుంది

    ReplyDelete
  2. వంశీగారు, మీమీద మనోభావ నష్టం దావా వేస్తాం..మీ నిధినంతా ఇలా చూపించడమేంటో? వివరాలు చెప్తూ ఊరించి ఆశలు కల్పించడమేంటో?మళ్లీ ఎవ్వరికి చూపించను అని అనడమేంటో?దాచుకుంటే దాచుకోండి ఎవరొద్దన్నారు? మాకు ఇవ్వడం సంగతి తర్వాత ఇంటికొస్తే చూపించను అంటో ఇలా బొమ్మలు పెట్టి మా మనోభావాలను గాయపరుస్తున్నారు. మాకు మీ నిధినుండి కొంచెమైనా పంచుకునే ఇష్టముంటేనే చూపించండి లేకుంటే భద్రంగా పెద్ద ఇనుప తాళంవేసుకుని మీరే చూసుకుంటూ మురిసిపోండి.. హన్నా!!! :))

    ReplyDelete
  3. @జ్యోతి = :)

    @సుజాత - పనుందా? గళ్ల లుంగీ కట్టుకుని, ఒంటికి బాగా నూనె రాస్కుని వస్తా....మీరు పట్టుకోగలరో లేదో చూద్దాం... :)

    మా ఊరు = చల్లపల్లి = బందరు!!
    మీ ఊరు = టల్సా?? = ??

    మీరు ఇంకా భారతీయులో, తెలుగువారో అనుకుంటున్నానే! అమెరికనులా! సంతోషం.. :)

    స్టోరేజి ఖర్చులేవీ లేవు.....అన్నిటికీ మా తిండిపోతు రామారావు ఉన్నాడుగా...వాడు చూసుకుంటాడు...అలాంటోడు స్నేహితుడిగా ఉండటానికి ఎంతో అదృష్టం ఉండాలి...

    ReplyDelete
  4. మరికనేం, చిన్న తపాలమ్మ తరలి వెళ్ళాక, బుల్లి "తపేళా" బుట్ట రావచ్చునిక. అతి త్వరలో తపాలా బిళ్ళల మిలియనీరు అవుతారని ఆకాంక్షిస్తూ.

    నేను రెండు సార్లు మొదలెట్టి ఆపిన వ్యాపకమిది. ఒకమారు బయటకి ఇచ్చేసా. రెండవ విడతవి జాలిగా ఓ మారు, విలాసంగా ఓ మారు చూస్తూ ఉంటాయి.

    ప్రతి టపాలో ఏదో ఒక స్ఫూర్తిని, ప్రయత్నాన్ని పట్టి చూపే మీకు అభినందనలలు.

    అన్నట్టు బ్బాబ్బాబు ఆ రామారావు గారి చిరునామా ఇచ్చి పుణ్యం కట్టుకుందురూ... :) లేదూ వైష్ణవిని నా దోస్తుని చెయ్యండి.

    ReplyDelete
  5. @ఉష - మరిహనేం! మీరు కూడా స్టాంపుల బ్యాచి అయితే మీ దగ్గరున్న స్టాంపులు మాకు పరిచయం చెయ్యండి. వైష్ణవి దోస్తానీ ఐతే వాకే కానీ.....రామారావు పరిచయం!! హ్మ్మ్....ఆలోచించాల్సిన విషయమే!

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.