నేనూ వైష్ణవి కలిసి ఓ చోటికి వెళ్ళాం. అక్కడో తటాకం ఉన్నది. వైష్ణవి ఈత నేర్చుకుంది కాబట్టి ఆ తటాకంలో "ఈత" కొట్టటానికి దిగింది. స్వదేభ్యమునకు నీళ్లలో తేలటం మటుకే వచ్చు కాబట్టిన్నూ, ఈత కొట్టటం రాదు కాబట్టిన్నూ ఒడ్డున నిలబడి చూస్తున్నా.
ఇంతలో "పడిపోయారు, పడిపోయారు పట్టుకోండి పట్టుకోండి" అని పెద్దగా అరుపులు వినపడ్డాయి. అటేపు పరిగెత్తా. పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఓ సొరంగం. వేరే దారేదీ లేదు. సొరంగంలో చొరబడ్డా. పరిగెత్తుతున్నా. ఒక్కమాటున సొరంగం చివరకొచ్చేసా. అక్కడ ఒకే ఒక కిటికీ ఉన్నది. దవారం ఎందుకు లేదో అర్థం కాలా.. :) ...
వేగంగా పరిగెత్తుతూండటం వల్ల ఒక్కసారిగా ఆగలేక ఆ కిటికీలోనుంచి పడిపోయా....ఆ పడిపోటం పడిపోటం ఎలాగనుకున్నారు? కిటికీ కిందనే కొండ, ఆ కొండనుంచి కిందకు జారుతున్న జలపాతం లాటి దానిలో కళ్లు మూతలు పడిపోయి దేకుతూ, జారిపోతున్నా.....కళ్లు మూసుకుని దేకుతూ జారిపోటం ఏమిటో?
అలా జారిపోతూ జారిపోతూ కళ్లు తెరుచుకున్నాయి. కిందకు చూద్దును కదా - పొలాలు, పొలాల మధ్యలో రైలు పట్టాలు, ఆ పట్టాల మీద రెండు రైళ్లు. మొదటి రైల్లో మనుషులెవరూ లేరు. రెండో రైలు నిండా జనాలు. అలా జారిపోతూన్నవాణ్ణి ఒక్క ఉదుటున ఒక రెండో ట్రెయిను మీద పడ్డా...చిరంజీవిలానో, విజయకాంత్ లానో ఆ నడుస్తున్న రైలు మీద నుంచి కిందకు దిగుదామని చూస్తే అదో డబల్ డెక్కర్ రైలు. ఎలారా బాబూ దిగేది అని చూస్తూంటే, ఇంతలో స్టేషనొచ్చింది.
ఆ స్టేషన్ అదో రకంగా విచిత్రంగా ఉంది. జనాలు దిగటానికి కన్వేయర్ బెల్టు లాటిది ఉన్నది. గేట్ల మీద నంబర్లున్నాయి. నాలుగో నంబరు మిస్సయ్యింది. ఎక్కడికి పోయిందో తెలియదు. కన్వేయర్ బెల్టు మీద పోతూ ఉంటే అవతలివైపున రెండో నంబరు గేటు వద్ద అమ్మా నాన్నా. హలో అంటూ చేతులు ఊపుతూ నవ్వుకుంటూ, నేనరుస్తున్నా పట్టించుకోకుండా ఆ గేటులో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదేమిటిరా అలా వెళ్లిపోయారు అని ఆలోచిస్తూ గేటు నంబరు 5 నుంచి నేను బయటకొచ్చి పడ్డా.
బోల్డంత మంది జనాలు. తప్పించుకుంటూ పక్కనుంచి వెళుతూ ఉంటే ఓ తాగుబోతు ఎదురొచ్చి - "బాగయ్యింది బాగయ్యింది, పర్సు పోగుట్టుకున్నావా, డబ్బులు పోగొట్టుకున్నావా? ఇప్పుడెలా వెళ్తావు అక్కడికి" అని వాడు తాగే బాటిల్లో నుంచి కొన్ని చుక్కలు చేతిలో వేసుకుని నా జబ్బ పట్టుకుని నా నెత్తి మీద ఆ మందు చుక్కలు చల్లాడు. యెహ్హ అని జబ్బ విడిపించుకుని పోతూ ఉంటే ఒక జంట, అదిగో ఆ రైలెక్కు ఆ రైలెక్కు అని అటువైపు వెళ్తున్న రైలు నంబరు 3 వైపు చూపించి, గేటు నంబరు 2 లోకి తోసారు.
ఆ డబల్ డెక్కర్ రైల్లో ఒకే ఒక్క మనిషి ఉన్నాడు. సరే అని ఆ రైలెక్కి కూర్చుని పోతూ ఉంటే, అందులో ఉన్న ఒకే ఒక్క మనిషి ఓ తాపు తన్ని నన్ను బయటకు విసిరేసాడు.
బోల్డు దెబ్బలు తగిలి కుయ్యో మొర్రో అనుకుంటూ లేచి అటూ ఇటూ చూస్తే దూరంగా ఓ ఆకుపచ్చ బస్సు కనపడింది. కొద్ది దూరం నడవగానే ఆ పక్కనే ఉన్న బస్సు స్టాండు కూడా కనపడింది. ఆ బస్సు స్టాండులోకి వెళ్లి కుడివైపు తిరిగి చూద్దును కదా, ఓ రెండు మంచు కొండలమధ్య అప్పుడే పైకొస్తున్న సూర్య భగవానుడు.
అలా తలపైకెత్తా. ఆ ఎత్తులో ఓ అస్పష్టమైన రూపు. తల మీద అట్టలు కట్టేసిన జుట్టు. చుట్టలు చుట్టలుగా చుట్టేసి ఉన్నది. అందులోనే నేను జారిపడ్డ కిటికీ. ఆ కిటికీలో నవ్వుతూ వైష్ణవి. నమస్కారం ఆ ఇద్దరిలో ఎవరికి చేసానో తెలియదు కానీ, చెయ్యి హెడ్డు బోర్డుకు తగలటంతో మెలకువ.
మెలకువొచ్చాక గుర్తుండిపోయిన కలల్లో మరోటి ఇది....
చదివారుగా - ఇహ ఇప్పుడు ఉపోద్ఘాతం.
ఇప్పుడు ఉపోద్ఘాతం ఏమిటయ్యా? ఎవడన్నా ముందు చెపుతాడు.
అదే మరి
- నిన్న మా గుళ్లో మహారుద్రం మొదలు.
- జీవితంలో మొట్టమొదటిసారి సంకల్పం చెప్పుకోటంలో తడబాటు.
- లఘున్యాస పూర్వక శతరుద్రాభిషేక సమయంలో - అనువాకాలు 7 సార్లు పారాయణ అయిపోయింది. ఎనిమిదో పారాయణలో - అందులోనూ నమకం అష్టమ అనువాకంలో అనివార్య పరిస్థితుల వల్ల బయటకు వచ్చెయ్యాల్సి వచ్చింది....
ఇహ ఇప్పుడు ఈ ఉపోద్ఘాతానికి, పైనున్న కలకు లంకె కుదిర్చి వివరణ ఇవ్వండయ్యా!
ivanni kaadu kaani, ratri 2 peggulekkuvainattunnay mastaru
ReplyDeleteబాబూ లిఖితం - ధూమమూ, మద్యమూ నాకు చాలా దూరంలో ఉంటాయి, మీకు అర్థం కాకుంటే వాటికి నేనే దూరం. తవరి కామెంటు చూసి ఖర్మ ఇలా కూడా కాలొచ్చన్నమాట సంగతి నాకర్థమయ్యింది. ఆ శరత్తు అనే పేరు చూసి ఒక్క నిముషం ఆలోచించా! పక్కన, ఆ పైన ఉన్న డబ్బాలో పేర్కొన్న నిర్దాక్షిణ్యం అనే ఆయుధం ఉపయోగిద్దామనుకున్నా కానీ పోనీ లే ఈసారికి అని వదిలేసా! ఇంకో సారి ఇటేపు, అనగా ఈ బ్లాగు వైపు రావద్దని ... :)
ReplyDeleteనేను కలలు కంటూ ఉలిక్కిపడి లేస్తూనే ఆ కలల సారాంశాన్ని నా mobileలో recording చేసేస్తాను. అంత మంచి, విచిత్రాతివిచిత్రమైన కథలు మలకువగా ఉన్నప్పుడు ఎంత ఆలోచించినా తట్టవు.
ReplyDeleteమీ కల గురించి నా విశ్లేషణ మీరు ఎలా తీస్కుంటారో నాకు తెలీదు
ReplyDeleteమొదట గా మీ వైష్ణవి (మీ కుటుంబ సభ్యురాలు ?) తో ఈత కెల్లటం
"ఎప్పటినుంచో మీరు వాయిదా వేసుకోస్తున్న కుటుంబ వ్యవహారాలూ భాద్యత కావచ్చు చిన్న చిన్న పనులే కావచ్చు, వారాంతపు సరదా కావచ్చు,
కుటుంబానికి మీరు కేటాయించాల్సిన సమయం విషయం లో మిమ్మల్ని మీరు కొంత ఆశక్తులు గా గ్రహించుకున్నారు.
మీరుఉంటున్నది మీ స్వస్థలానికి, మీ దూరం గా అయిఉండొచ్చు మీ తల్లితండ్రులను , మీ స్వస్థలాన్ని, మీ బంధు వర్గాన్ని ,మీరు కోల్పోతున్న లేక కోల్పోవుతున్న భావన మిమ్మల్ని వెంటాడుతోంది.
భవిష్యత్ లో ఎప్పుడో మీరు మీరు కోరుకుంటున్న జీవితానికి దగ్గరవాలనే ఆలోచన ఉంది. ఆ కోరికే గుహ. దోవ . ఆ గుహ చివర కిటికీ మీరు అలా వెళ్ళటానికి ఉన్న పరిమితులు. ద్వారం లేక పోవటం ఈ విష్యం లో మీకు లేని ఆత్మ స్థైర్యం .
కిటికీ లోంచి పడ్డా జల పాతం జాలు గా పడటం ఇప్పుడు మీకు ఉన్న అయిష్టత పరిస్థితి లోని సౌకర్యాలు.
పొలాలు మీరు వెనక్కి వెళ్లి పోవాలనుకుంటున్న మీ స్వేఛ్చా సంస్కృతీ జీవనం, రైలు పట్టాలు ఆ జీవనం లో మీరు వెళ్ళాలనుకున్న జీవన మార్గం.
మీరు ఇప్పుడున్న స్థిnతి లో మీకు అన్నీ బాగానే ఉన్న ఏదో అసంతృప్తి ఏదో కోల్పోతున్న భావన.
మీదు మిక్కిలి మీ తల్లితండ్రులు బాగా మిస్ అవుతున్నారు.
మీరు పుట్టి పెరిగిన సంస్కృతీ సంప్రదాయాలు మీరు బాగా మిస్ అవుతున్నారు. వాటిపై మీకు అపార గౌరవాభిమానం.
మీరు ఇప్పుడు ఉన్న ప్రదేశ సంస్కృతి మీకు ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు. పైగా మారని మీ స్వభావాన్ని నైజాన్ని ఎవరో వేరే వాళ్ళు హేళన చేస్తూ మిమ్మల్ని మార్చాలని చూస్తున్నారని మీరు భావిస్తున్నారు.
మంచి సంపాదన హోదా ఒదులు కొని మీరు వెనక్కు వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా అనే దోలామానం లో, కొంత కాలం అయ్యాక వెనక్కి వెళ్లాలని మీరే సర్ది చెప్పుకుంటున్నారు.
కానీ అప్పటికి మీరు వయసు అయి పోయి, మీ సహజ సంస్కారం లో కొంత తేడా తో వెనక్కి వెళ్తారేమో అని అనుమానం.
హెడ్ బోర్డ్ తగిలి మెలకువ రావటం " మీ ప్రస్తుత భాద్యత మిమ్మల్ని తట్టి లేపింది"
ఇవన్నీ మీలకు వివరణ
ఇక పోతే మహా రుద్రం లో అపశ్రుతి లేదా మధ్యంతర అవాంతరం మీ కల మీద ధ్యాస లేక వేరే ఎమన్నా తాత్కాలిక సమస్యే.
అన్నీ మర్చిపోయి మీ ఉద్యోగ భాద్యత కుటుంబ సహచరం, రెండూ ఆనందించండి.
మీ కున్న వ్యాపకాలైన సాంస్కృతిక సాహితీ సంగీత వ్యాసంగాని కొన సాగించండి
@ ahmisaran - సుదీర్ఘమైన కామెంటుకూ, మీరు విశ్లేషణకు వెచ్చించిన సమయానికీ ఉమ్మడిగా బోల్డు ధన్యవాదాలు.
ReplyDeleteఇంతకీ మీ కలను, నా విశ్లేషణ ను ఎలా అన్వయించుకున్నారు.. ఏమన్నా పొంతన ఉందా?
ReplyDeleteahmisaran@gmail.com
ReplyDeletethis is my mail ID
mail me if possible
మీ వ్యాఖ్యలో - కుటుంబానికి కేటాయించవలసిన సమయం, తలిదండ్రులు, పొలాలు - వీటిగురించి నేను మీరన్న విధంగానే పొద్దున్న లేచాక అనుకున్నది. మీరు మీ విశ్లేషణలో కుదిర్చిన అన్వయం అక్కడి వరకు, ఆ ముక్కల వరకూ సరిపోయింది. ద్వారం లేకపోటమన్న విషయంలో మీరన్న విషయంతో కూడా కొద్దిగా ఏకీభవిస్తాను.
ReplyDeleteఐతే నేననుకున్నది ఇదీ - ఈ మధ్య కలుగుతున్న చీకాకులు ఆ చుట్టలు చుట్టలుగా చుట్టేసిన శిఖలు. వాటిలోనుంచి బయటపడటానికి చివరలో కనపడ్డ ఆ అస్పష్ట రూపధారి - ఆ భోళా శంకరుడు - చూపించిన చిన్న వెలుగు ఆ కిటికీ.
పెద్దవెలుగునిస్తేనూ, రాజు గారి దవారమిస్తేనూ ఇహ పట్టపగ్గాలుండవు అని దవారం ఇవ్వకుండా కిటికీ ఇచ్చాడనిన్నీ - శిఖలూ నావే, చీకాకులూ నావే, బయటపడేసేదీ నేనే, సర్వస్వం నేనే - నా వంక చూసి నీ మనసు లగ్నం చేసుకో ఓ బుద్ధి హీనుడా అని చెప్పినట్టూ అనిపించిందనిన్నీ....
బస్స్టాండు సంఘమనీ, బస్సు ఆ సంఘపు జనాలను మోసుకెళ్లినట్టే నన్నూ మోసుకెళ్లటానికి తయారుగా ఉందనీ, ఐతే నేను ఆ బస్సు ఎక్కకను గాక ఎక్కననీ, తయారుగా ఉన్నా అటేపు వెళ్ళకుండా బస్స్టాండులోకొచ్చి కుయ్యో మొర్రో అనుకుంటూనే ఆయన మీద ఏమూలో ఉన్న నమ్మకంతో తల పైకెత్తితే , ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యక ఇక్కడే ఉన్నానంటూ కనపడ్డాడనీ...
జలపాత రూపంలో గంగమ్మ దర్శనం చేయించి, కొద్దిసేపు ఆ తల్లితో పునీతం చేయించాడనీ....
తాగుబోతు, మూడో రైల్లోకి తోసిన జంట, నన్ను ఆ మూడో రైల్లోనుంచి బయటకు తోసేసిన వీరుడు - విరుద్ధ వాహకాలు.....నాలోనే ఉన్న మంచికీ చెడుకీ సంకేతాలు....
సూర్యభగవానుడు, తళ తళ మెరిసిపోతున్న మంచుకొండల మధ్య వెలిగిపోతూ - ప్రకాశవంతమైన జీవితం ఇదిగో అని దారి చూపిస్తున్నాడు. ఆ దారి పట్టుకోవాలి ఇహ....
ఇహ మీ వివరం కోసం: వైష్ణవి - నాలుగేళ్ళ మా అమ్మాయి...
ఏదేమైనా - మీ వ్యాఖ్యకు మరోసారి ధన్యవాదాలతో!
I wish you go through that Bright Way of Life peacefully !!
ReplyDeleteవిచిత్రమైన పేరులా ఉందే అని ఓ నిముషం ఆలోచిస్తే - తిరగెయ్యి అని ఓ మొట్టికాయ మొట్టాడు ఆ శివయ్య - "నరసింహ" గారూ :)
ReplyDeleteYes, now I know a way...and will be on that path! Thanks for your comments... :)