Monday, December 20, 2010

ఎందుకు చెపుతాను వెఱ్ఱికుంకా! - (Part 2)

పురజనుల కోరిక మీద, ఈమెయిళ్ల దాడివల్ల రెండో భాగం ఈవేళే విడుదల.

మొదటి భాగం ఇక్కడ...

ఇహ చదువుకోండి...మూడో భాగానికి మటుకు కొద్దిగా సమయమివ్వుడి మహానుభావులారా! ఏలయనగా ఈవారము పనివత్తిడి  వలన ప్రతి భాగానికి అవసరమైన ముప్ఫది  నిముషములు సమయము వెచ్చించలేను. అర్థము చేస్కోగలరని భావిస్తూ....మళ్లీ వచ్చే వారం .....


**************************************************************************

బోలు మాటలచే తెఱచాఁపగుడ్డ పాఠకుల చక్షువులకు బిగించుట గాదు. వ్యాకరణసహిత కవితలచే పాఠకుల మనస్సును బిగింపవలెను. కల్లుపాకలనుండి వెలువడిన వదరుబోతు కవులెందరున్నారో యెరుఁగుదురా? నూటికి తొంభది శాఁతము వారేనన్న మాఁట నిశ్చల స్థంభము. అట్టివారిని జూచుటతోనే, వారిఁ గవితలు చదువుటతోనే పాఠకుని దేహము చచ్చినది. కవితల యందు ఆసక్తి చచ్చిన దనవలయునిగాదా? కవిత కవిత యని తెగసాగెద రెందులకు? ఓ సుద్దముక్క సమ్రాట్టులారా!  తాడిచెట్టునెక్కి తాటికాయలాగఁ జూచుచున్న మీకు కవితలెందులకు?

తనకుఁ పాఠకునకుఁ దత్త్వమున భేదము లేదనియు, భేదము మిథ్య, యేకత్వము సత్యమనియు నెఱిఁగి యనుభవములోకిఁ దెచ్చుకొనని నీవు వ్రాయు కవితలన్నియు డాంబికములు, కాలహరణములు, శ్మశానమందున్న కాష్ఠములు.చెప్పవలెననిన కాష్ఠములు ఆరిపోకముందు వెలుగునుఁ బ్రాసాదించునేమో గానీ, మీ వల్ల యా యుపయోగముఁ గూడ లేఁదు

ప్రపంచము కవితామయ మైయున్న దని సభాపీఠముల బోధించు నిన్నూ, నీతోటి సుద్దముక్కల నే మనవలయును? మోసగాఁడనినఁ జాలునా? కటికవాడన్నఁ జాలునా? లొడలొడమని యుపన్యసించువాఁడవు కదా? ఏదీ? నీ తరమగునా? అసలు సిసలు కవి చేయు, వ్రాయు సక్రమకవిత, నీవు నీ శబ్దజాలమునఁ జూపఁ గలవా? పెద్దనో రున్నవారికిఁ బెద్దమాట. పెద్దచేయి యున్నవానికిఁ బెద్దచేష్ట. పెద్దబుద్ధి యున్నవానికిఁ బెద్దయాశ. పెద్దకడుపున్న వానికిఁ బెద్దతిండి. పెద్దబల మున్నవానిది పెద్దపెట్టు. మఱి సుద్దముక్కలున్నవానిది?  అదియే భేదము.

యీ సుద్దముక్కలలోఁ ఎంతసేపు ఒకనికవితకంటెఁ దనకవిత పైనున్నదను సంతోషము మిగులవలెను. పాఠకుని బాధించుటకుఁ దగిన శక్తి తన కున్నదను సంతోషము తనకు మిగులవలయును. ఎవరికి భట్రాజులెక్కువున్న, వారికి అంతటి భజన మిగులవలయును.

అకాలగాఢాంధకారభయంకర కవితలచేఁ బట్టపగలు కీచుకీచు మనుచు గీరుగారు మనుచుఁ బక్షుల రొదతో, ఆవు లంభాలతో, పందులు నెలుకలు గాడిదలు మొదలిగునవి ఘుర్ఝరించుచుఁ గిచకిచలాడుచు నోండ్రపెట్టుచున్నటుల నటునుండి యిటు నిటునుండి యటు నొడలు తెలియని యవస్థతోఁ బరుగులిడుచుంటివి కవితలతో. అయ్యవిఁ గవితలుఁ జదువలేక ఎవరిమట్టునకువారు మహాభయోద్రిక్తహృదయములతో స్వప్రాణము లెట్టులయినఁ గాపాడు కొను నాత్రముతోఁ గటిక చీఁకటిలో కనఁబడనియాదుర్దశలోనే యెక్కడికో యెఱుఁగకుండఁ బారిపోవఁ జూచుటకు కారణము నీవుగాదా? నీఁ గవితలుఁ గావా?

పిచ్చియాసుపత్రి యనఁగా, పిచ్చివారి రోగమును కుదుర్చు నాసుపత్రి యని యర్థము కాదు, పిచ్చిడాక్టర్లు గలయాసుపత్రి యని యర్థము చెప్పినట్లు మీకు మీరే సన్మానపత్రాలిచ్చుకొనుచున్నారు. నీకుఁ బిచ్చిలేదన్నమాట పాఠకమూలమున సిద్ధాంతపడవలె గానీ, నీకు నీవే నిశ్చయించుకొనిన యెట్లు? 

గానుగ యెద్దుల లాగున సుద్దముక్కలందరు తిరిగిన దారులలోనే యల్లాడుచున్నారు. ముందునకుఁ బోయినవారేరి? తెన్నా? కన్నా? ఏమున్నది? పటలములు పటలములుగఁ బైకెగయుచున్న ధూమరాశిలో నుండి చిన్నచిన్న విస్ఫులింగములు చిటచిటాయమాధ్వనులతో మించి నక్షత్రములవలె రాత్రి తమాలవృక్షమునఁజేరిన మిడుఁగుఱులకోటులవలెఁ, సాలీళ్లవలెఁ బాఠకుని మస్తిష్కము బూజు చేయుచుంటివి.

పాఠకు లాకాఁకాకు నిలువలేక, చర్మములు బొబ్బలెక్క, దాహముచే జిహ్వలీడ్చుకొనిపోవ, నతికాంతిచేఁ గన్నులు చీఁకటులు గ్రమ్మ, దయ్యములు పట్టినవారివలెఁ బిచ్చివారివలె జుట్లు పీఁకికొనుచు గుండెలు కొట్టుకొనుచు నట్లిట్లు పోవుచు నాకసము పగులునట్లాక్రోశ మొనర్చుచున్నారు. ఈయేడ్పులు విన్నవారెవరు? దయ యెవరికి? దాక్షిణ్య మెవరికి ?ఆహారనిద్రావ్యత్త్యస్తపరిస్థితులచేఁ గలిగిన వాతపిత్తశ్లేష్మదోషములకు చికిత్సలున్నవిఁ గానీ మీఁ గవితలుఁ జదివినఁ బాఠకుల వేదనకు చికిత్స లేదు.

కృతి పాడఁదగినది. కథ యూఁ కొట్టఁదగినది. నాటక మాడఁ దగినది. ఉపన్యాసము వినఁదగినది. కవిత ఉత్సాహోల్లాసాలుఁ గలిగించునది. మఱి నీవు వ్రాసే కవితల స్వరూపమిది - నోరార్చుకొనిపోయినప్పు డక్కలకఱ్ఱ, ముక్కులార్చుకొనిపోయినప్పుడు పొడుము వేసుగొనినట్లు రూపము సంతరించుకుని యున్నవి.ఈ దౌష్ట్యానికి శిక్ష అతిత్వరితముగా నిర్ణయించవలెనని మనసు ఉద్రేకపడుచున్నది.

కడవలంత బానలంత ద్రోణములంత చుట్టు గుడిసెలంత యెఱ్ఱగఁ గ్రాగినఱాలు, సలసల తెల్లగ మరిఁగిన గంధక ధారలతో ధారాపాతముగా శతకోటి శతకోటి అభిషేకములుఁ గావించవలెనన్న కోరిక తీవ్రమగుచున్నది. చెదలున్నపుట్టలోఁ దాటియాకు మంట పెట్టినయెడల నేమగునో యదియే యంతకంటె భయంకరముగ బీభత్సముగ మిమ్ములని తగులవెట్టవలెనని హృదయముఁ గుతకుతలాడుచున్నది.  వాంతులతో భేదులతో మూత్రబంధములతో, నెక్కుపట్టిన నరములతోఁ, గంటిగుంటలతో, నొడలిచలువతో, నాసన్న మరణలాంఛనమగు నాభీలశిరోవేదనతో, భరింపరాని బాధలు పెడుచున్న ఈ సుద్దముక్కలనూడ్చి పెట్టుటకుఁ దోఁకచుక్క యంతచీఁపురు చేతఁబట్టుకొని, మురికికాలు వలప్రక్కలను గోడిరెట్టగుట్టలనడుమను పారవేయవలెనన్న ఆశ నటరాజనర్తనవలె తాండవించుచున్నది.

నీబుద్ధికందని విషయములు, నీశక్తికి మించిన సన్నివేశములుఁ బట్టుకొని సుద్దముక్కలు పేర్చి అవియే అత్యద్భుతములని ఢక్క కొట్టుకొనుచు, ఓ చెలరేఁగి అఖిలైకకార్యమిదియే యని కవితావీథులవెంట నోండ్రపెట్టుచు పరగడలు ద్రొక్కుచున్న నీనాలుకఁ గోయింపవలదా?  నీ కలము విఱగఁ గొట్టవలదా?

*************************************************************************


(సశేషం!!)

5 comments:

  1. బళ్ళో తెలుగు వాచకంలో ఒక పాఠం చదివినట్టు గుర్తు. "మెమ్మె పెప్పలుయును కారే, నంగి నంగి మాటలవారు కాదే" అని సాగుతుంది. చిలకమర్తిగారేమో. అది గుర్తుకు వస్తోంది :)

    ReplyDelete
  2. హమ్మయ్య, చివరి పేరా చదివాక మనసు శాంతించింది...అలవోగ్గా కవిత్వం విసర్జించే కవులకు కోపం వస్తే వచ్చింది కానీ!

    ReplyDelete
  3. @ఆర్.కె , సుజాత - ధన్యవాద్

    ReplyDelete
  4. మిమ్మల్నెవరో వాళ్ళ కవిత్వంతో బాగా ఇబ్బందిపెట్టినట్లున్నారే :)

    ReplyDelete
  5. @సూర్యుడు - ఇబ్బందీ లేదు. బాసుందీ లేదు... :) భలేవారే!

    అయితేనేం రగిలిపోతోంది ఈ "కవిత" దాని "ఆత్మ" తెలియని కవులను చూస్తూంటే! ఒహాయన పచ్చని పొదను చూస్తే ఉచ్చ పోయాలనిపిస్తోంది అంటాడు. ఇంకొహడు ఇంకొహటి, ఇంకొహడు ఇంకోటి, ఇంకొహడు నోటికొచ్చినవి వ్రాస్తాడు....కవితేమిటీ? దానికి ఉండాల్సిన లక్షణాలేమిటీ? తెలుసుకోవాలి, ఆ తర్వాత వ్రాయాలి అన్న జ్ఞానం ఉండనఖ్ఖరలా? కవితనొదిలెయ్యి - అసలు భావుకత అనేదానికి అర్థం తెలుసా ఈ "కౌ"లకు? గవిడి గేదెలకు? ఎవడు బడితే వాడు కవి. ఆపైన ఓ భజన గుంపు. దరిద్రమానీ దరిద్రం.

    ఏదైతేనేం - కామెంటుకు ధన్యవాద్!

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.